ముఖాముఖం

సమాజాన్ని కవిత్వాన్ని వేరు చేసి చూడ్డం నాకిష్టం వుండదు. – డా. ప్రసాద మూర్తి

డిసెంబర్ 2015

లతి అలతి పదాలతో అనల్పమైన భావప్రకటన అతని సొత్తు. “మాట్లాడు కోవాలి”, “కలనేత”, “ నాన్నచెట్టు“ ఇప్పుడు అవార్డ్ తెచ్చిన “పూలండోయ్ పూలు” అతని కవిత్వానికి చిరునామాలు. వస్తువేదైనా అనుగుణమైన భావాన్ని అద్భుతంగా పొదగగల నైపుణ్యం, చదువరులకు హత్తుకునేలా సమకాలీన సమస్యలనూ కవితామయం చెయ్యగల నేర్పు ఉన్న డా. ప్రసాద మూర్తి గారు 2015 ఫ్రీవర్స్ ఫ్ర౦ట్ అవార్డు అందుకున్న సందర్భంగా కవిత్వం గురించి వాకిలి రెండు మాటలు మాట్లాడినప్పుడు, మనసు పరచి మనకి వినిపించిన అభిప్రాయాలు ఇవి.

Q: కవులకూ మిగతా వారికీ ఉన్న తేడా ఎలా అనిపిస్తుంది మీకు?

జ. అందరూ మనుషులే. కాకుంటే కవి చూపు మిగిలిన వారికంటే భిన్నంగా వుంటుంది. అవే కళ్ళూ అవే కాళ్ళు, అవే మాటలు, అవే చేతలు.. అంతా మామూలుగానే వుంటుంది. కాని కవి మనకు కనపడని లోకాల్లో సంచరిస్తాడు. మనకు కనపడకుండా తనలో తానే దగ్ధమవుతూ వుంటాడు. నా మొదటి కవితా సంపుటి కలనేతలో కవి శీర్షికతో ఓ కవిత వుంది.

“ఎన్నడూ ఓ ముద్దకూడా వెయ్యని ఇంటిముందు
రోజూ విధిగా నిలబడే బిచ్చగాడిలాగా
ఈ జీవన వాకిలిముందు నిలబడి
వాడు కవితాగానం చేస్తాడు
మనం తలుపులు మూసేసుకుంటాం

జీవితాన్ని ప్రేమించలేని వాడు
కవిత్వాన్నీ ప్రేమించలేడు
నాకు కవులంతా యుద్ధభూమిలో నెత్తురోడుతున్న
సైనికుల్లా కనడబతారు
మనం రాత్రుల్ని వెలిగించుకుని చలికాచుకుంటాం
వాడు రాత్రుల్లో మండిపోతాడు మాడిపోతాడు మసైపోతాడు

గుండెకి ఒక కొసన నిప్పంటించుకుని
ఒక అక్షరానికి ఓ కన్నీటిచుక్క
ఒక అక్షరానికి ఓ నెత్తుటిబొట్టు ఇచ్చి
అక్షరాల్లోకి అంతర్థానమైపోతాడు

తలుపులు మూసుకుని ఏడ్చినా
మన కన్నీటిని దోచుకుపోయేవాడు కవే
కన్నీటి కుండల్ని నెత్తిమీద ఒకదానిపైనొకటి పేర్చుకుని
ఎర్రటి మన గుండెల నిప్పుల మీంచి వాడు
పీరుసాయిబులా నడుచుకుంటూ పోతాడు”

అప్పటికీ ఇప్పటికీ కవి అంటే నా భావన అదే. నా తాజా కవితల సంపుటి పూలండోయ్ పూలు పుస్తకంలో కూడా కవితో పెట్టుకోకు అనే ఓ కవిత వుంది.

“కవి నిద్రపోతాడా? నిద్రను కలలకు కాపలా పెడతాడు..
దీర్ఘకాలం మౌనంటోకి జారిపోయినా అతని నిశ్శబ్దం నిష్క్రమణ కాదు.
తల వంచుకుపోతాడు కదా అని కవిని తక్కువగా చూడకు.
లక్షోపలక్షల సమూహాల శిరస్సుల మీద
సూర్యబింబాలను అతికించుకుంటూ తిరుగుతాడు.“ అంటాను.

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కవి అంటే నాకంతే. అంతే ఆరాధన. అంతే నిబద్ధత. అంతే నిజాయితి. అలా వుంటేనే కవి అనుకుంటాను. మనిషి పట్ల అంతటి గాఢమైన అనురాగం, ఆప్యాయత, తపన లేని వాడు ఎన్నటికీ కవి కాలేడు. అలా అయితే అదంతా నటనే. నటన ఎలా కవిత్వం అవుతుంది చెప్పండి?

Q: ఎంత సామాజిక దృక్పధం ఉన్నా కవిత్వం లక్షణాలు వేరే నని ఒప్పుకుంటారా?

జ. సమాజం వేరు కవిత్వం వేరు కాదు. కవితా దృష్టి, సామాజిక చైతన్యం రెండూ ఒకదానిలో ఒకటి అంతర్లీనమైన రసక్రియే కవిత్వం. అలాగని కేవలం సామాజిక అంశాలను తీసుకుని రసహీనంగా కవితలు అల్లుకుంటూ పోతే అది వస్తువుల జాబితా మాత్రమే అవుతుంది. ఎంతో తీవ్రమైన సామాజికి అంశాన్ని అయినా కవిత్వం చేయగల సత్తా దమ్ము వున్నవాడే నిజమైన కవి కాగలడు. హృదయాన్ని ద్రవీభూతం చేయలేనిది ఏదైనా అదెంత సామాజికమైనదైనా కవిత్వం కాలేదు. ఒక వ్యాసం కాగలదు. ప్రముఖ హిందీ కవి కేదార్ నాథ్ సింగ్ రాసిన ఈ చిన్ని కవిత చూడండి.

“మేఘం నిండుగా విప్పారింది. పొలం దున్నడానికి సిద్ధంగా వుంది.
గట్టు మీద విరిగిన నాగలి పడివుంది.
దాన్ని ఎత్తడానికి ఒక చిన్న పక్షి
తన ముక్కుతో మాటిమాటికీ ప్రయత్నిస్తోంది.
ఆ దృశ్యం చూసి తిరిగి వెళ్ళిపోయాను.
ఇక్కడేదో సామాజిక హిత కార్యం జరుగుతోంది. అందులో జోక్యం చేసుకోవడం నాకు తగదు.”

ఇందులో వున్న సామాజికాంశం ఎంత గంభీరమైందో మనకు తెలుసు. దాన్ని ఎంత నేర్పుగా వొడుపుగా కేదార్ జీ కవిత్వం చేశాడు. అదే కావాలి. ఏ కవి అయినా సమాజంలో వున్న, ప్రకృతిలో వున్న అంశాలనే తీసుకుంటాడు. అందుకు అతీతంగా ఎవరూ ఎటూ పోలేరు. కాబట్టి సమాజాన్ని కవిత్వాన్ని వేరు చేసి చూడ్డం నాకిష్టం వుండదు. అలా సాధ్యం కాదు కూడా. ఏది రాసినా త్రిపురనేని శ్రీనివాస్ అన్నట్టు కవిత్వం కావాలి కవిత్వం.

Q: ఏ చైతన్యం మిమ్ములను కవిగా మార్చింది?

జ. అమ్మ. అమ్మే నన్ను కవిని చేసిందేమో అనిపిస్తుంది. కలిగిన కుటుంబంలో అడుగుపెట్టినా అన్నీ బాధలే. నిత్యం రోదనే. చలం అంటాడు.. వాళ్ళ నాన్న, అమ్మను కొట్టీ కొట్టీ అలసిపోయే దాకా కొట్టే వాడని. అందుకే ఈ ప్రపంచంలో నాన్నలు అనేవారు వుండకుండా వుంటే ఎంత బావుండేది అని అన్నాడు. అలాంటి పరిస్థితి ఏ అమ్మకు వచ్చినా ఏ కొడుకైనా అలాగే అనుకుంటాడు కాబోలు. నాకు మాత్రం మా అమ్మ నా కోసం కన్నీటితో వెలిగే దీపంలా కనిపించేది. చిన్నప్పుడు అమ్మే నా ప్రపంచం. అమ్మ చుట్టూ వున్న ప్రపంచం మీద కసి, కోపం వుండేది. పెద్దయ్యాక అలాంటి లోకం మీద నా అవగాహన అంతా అమ్మ కేంద్రకంగానే సాగిందని ఇప్పుడనిపిస్తోంది. నా మొదటి కవితా సంపుటి కలనేతలో అమ్మ మీద రెండు కవితలున్నాయి. తర్వాత వచ్చిన సంపుటాల్లో కూడా అమ్మ మీద కవిత వుండి తీరుతుంది.

నాకు మగ జన్మనిచ్చి
ఒక దుఃఖిత హృదయాన్నిచ్చి
రెండు కన్నీటి చెలమలనిచ్చి
ఏరాత్రీ నిద్రరాని జీవితాన్నిచ్చి
అమ్మా ఈ మగజాతి మీదిలా కసితీర్చుకున్నావా?

లోకంలో దమనకాండను అనుభిస్తున్న దళితులో, కార్మికులో, నిరుపేదలో, అసహాయ స్త్రీమూర్తులో ఎవరైనా సరే అందరూ అమ్మ ప్రతిరూపాలే అనిపించేది. అందుకే లోకాన్ని వదిలి నేనెప్పుడూ కవిత్వం సాము చేయలేదు.

Q: ఒక సౌకుమార్యం, ఒక భావుకత మీ కవిత్వంలో తొ౦గి చూస్తూనే ఉంటాయి. విశ్వజనీన భావన వల్లేనా?

జ. విశ్వజనీనత లేనిది ఏదైనా కాలమెరుగు. ధారుణీ గర్భమెరుగు అన్నట్టు అదలా ఎటో కొట్టుకుపోతుంది. దేన్ని ముట్టకున్నా దాన్ని కవిత్వం చేయగలగడమే విశ్వజనీనతకు ముఖ్యమైన లక్షణం. ప్రసాదమూర్తి వస్తుత: కవి అని శివారెడ్డి గారు నాకు ఇచ్చిన అపురూపమైన కితాబు ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను. ఒక తాజాదనం, పొద్దుటిపూట పరిమళం ఏదో నాకవిత్వంలో వుందని నా రెండో కవితా సంపుటి మాట్లాడుకోవాలిలో ఆయనంటారు. ఆ లక్షణం సజీవంగా వుండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అది పూలండోయ్ పూలంటూ తిరిగినా.. రైల్వే స్టేషన్ మెట్ల మీద పరున్న బిచ్చగత్తెను దయామయిగా చూసినా కలుసుకోవడాలైనా..మాట్లాడుకోవడాలైనా ఏమైనా మీరన్న ఆ సౌకుమార్యం, ఆ భావుకత సంపూర్ణంగా వుండాలన్నదే నా తపన. ఒక్కోసారి ఆ శిల్పం నా వస్తువును మింగేస్తుందేమో అని నా మొదటి కావ్యానికి ముందుమాటలో లక్ష్మీనరసయ్య కొంచెం భయాన్ని వ్యక్తం చేశారు. అలా జరక్కుండా చూసుకుంటే చాలనిపిస్తుంది.

Q: ఎప్పుడు ఎలా రాయడం ఆరంభించారు ? ఎంత తరచుగా రాస్తారు?

జ. నాకు చాలా జ్ఞాపకం. పదో తరగతి తర్వాత నేను మా అమ్మమ్మగారి వూరు చిననిండ్రకొలను(పశ్చిమగోదావరి జిల్లా) ఓరియంటల్ కాలేజిలో చేరినప్పుడు అందరూ పద్యాలు రాస్తున్నారు. కొందరు శ్రీశ్రీని వల్లిస్తున్నారు. గుర్రం ధర్మోజీ రావు అనే ఒక సీనియర్ ని పద్యం ఎలా రాయాలని అడిగాను. అతను కంద పద్యం లక్షణాలు చెప్పాడు. అప్పటికప్పుడే ఒక కందం రాసి ఆయనకు వినిపించాను. మర్మము తెలియక అడిగితి, ధర్మములొక పద్దెమునకు ధర్మోజీనిన్. మర్మము లేకయె చెప్పిన ధర్మోజీ రావు నీవు ధన్యుడవయ్యా అని. అతనెంత సంబరపడ్డాడో. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత అతను కలిశాడు. ఆయనింకా పద్య కావ్యాలే రాస్తున్నాడు. మొన్న అంతర్వేది కవితోత్సవంలో కలిశాడు. నేనిచ్చిన పూలండోయ్ పూలు వచన కావ్యం చదివి మొత్తం కవితల శీర్షికలన్నీ వచ్చేలా సీస పద్యాలు రాసి పంపాడు. అప్పుడు నేర్చుకున్న పద్య రచన చాలా కాలం కొనసాగించలేకపోయాను.

నన్ను శ్రీశ్రీ లాక్కుపోయాడు. అతని కవిత్వంతో కమ్యూనిజం, దాంతో సోవియట్ రచనలు అన్నీ పరిచయమయ్యాయి. నా బాల్య స్నేహితుడు కుమార్ అప్పటికే హేతువాద భావాలతో ప్రగతిశీల సాహిత్యాన్ని అంతటినీ తన గదిలో సేకరించి పెట్టాడు. ఆ గదిలో అడుగుపెట్టాక నా శరీరం నిండా కొత్త కవాటాలు తెరుచుకున్నాయి. పద్యాల మీద మోజుతో నేను కూడా అవధానాలు చేయగలనని నిరూపించుకోవడం కోసం కొంత ప్రయత్నించాను. ప్రొద్దుటూరులో తెలుగు పండిట్ ట్రైనింగ్ అయినప్పుడు తొలిసారి నరాల రామిరెడ్డిగారి అధ్యక్షతన అష్టావధానం చేశాను. అదంతా సరదా కోసమే. చాలా త్వరలోనే సీరియస్ అయిపోయాను. నా కలనేతలో అవధానిగారూ అవధరించండి అని వెటకారం కూడా చేశాను.

ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా వున్న విద్యార్థి సంస్థలో చేరి వచన కవితలు, పాటలు రాస్తూ వచ్చాను. సోషలిస్టు భావాలతో ఎన్నో కవితలు రాసినా నా తొలి కవితా సంపుటి మాత్రం దళిత బహుజన కవితా నేపథ్యంలో వచ్చిందే. ఇప్పటికీ కలనేత పుస్తకం చేతుల్లోకి తీసుకుంటే నాకు ప్రకంపనలు పుట్టుకొస్తాయి. ఆ తర్వాత కొంచెం గుక్క తిప్పుకున్నాను. ప్రపంచీకరణ, మానవ సంబంధాలు, సామ్రాజ్యవాద దౌర్జన్యాలు, అభివృద్ది పేరు మీద పాలకులు చేస్తున్న విధ్వంసాలు, అసహాయుల వలసలు ఏవో ఏవేవో నా అక్షరాల్లోకి వచ్చి కూర్చున్నాయి. నా రెండో కవితా సంపుటి మాట్లాడుకోవాలి ఈ నేపథ్యంలో వచ్చిందే. మొదటి పుస్తకానికి దీనికి ఎనిమదేళ్ళు గ్యాప్ వచ్చింది. తర్వాత మూడో పుస్తకం నాన్నచెట్టు 2010లో తీసుకువచ్చాను. నాలుగో పుస్తకానికి నాలుగేళ్ళు పట్టింది. 2014 ఆగస్టు 1న నా నాలుగో కవితా సంపుటి పూలండోయ్ పూలు వచ్చింది. ఆ తర్వాత మరింత వేగం పెరిగింది. అయిదో పుస్తకం రెడీ అవుతోంది. కథలు కూడా రాస్తాను. పుస్తకం రూపంలో ఇంకా రాలేదు.

Q: కవిత్వానికి, కవులకు రావలసినంత గుర్తి౦పు మనదగ్గరలేదనే అనిపిస్తో౦ది కారణం ఏమిటంటారు?

జ. ఏమో తెలీదు. గుర్తింపు కోసం ఎప్పుడూ చూడలేదు. నా మొదటి పుస్తకానికే ఎన్నో అవార్డులు వచ్చేస్తాయని చాలా మంది కవి మిత్రులు ఊరించారు. అప్పుడు నేను ఉద్యోగ రీత్యా బీహార్ లో వున్నాను. రాష్ట్రానికి అవతల నేనుండిపోయినట్టే. నా పుస్తకమూ చాలా మంది కవిత్వ ప్రేమికులకు అందకుండా దూరంగా వుండిపోయింది. అయినా నారాయణరెడ్డి, గోపి,శివారెడ్డి వంటి చాలా మంది పెద్దలు నిండు మనసుతో అందించి ఆశీస్సులు..ఉత్సాహం నా కవిత్వం వెన్నంటే వున్నాయి. అవార్డుల కోసం అప్పుడూ ఎదురు చూడలేదు. ఇప్పుడూ చూడడం లేదు. రాయడమే హాయి. ఎవరైనా చదివి మెచ్చుకుంటే ఇంకా హాయి. కవిత్వానికి గుర్తింపు తెచ్చే బాధ్యత కవులదే. ఎవరి సొంత ప్రమోషన్ లో వారు మునిగిపోకుండా అచ్చమైన కవులను, కవిత్వాన్ని ప్రోత్సహిస్తూ జనంలోకి తీసుకుపోవాలి. ఒక సాధారణ ప్రొడక్ట్ ను వ్యాపారులు ఎంత బాగా మార్కెట్ చేసుకుంటారో అంతే మార్కెటింగ్ కవిత్వానికి కూడా జరగాలి. ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో కవిత్వోత్సవాలు..లిటరరీ ఫెస్టివల్స్ జరుగుతాయి. మనకు ఆ వాతావరణం లేదు. అందుకు సాహిత్యకారులు, యూనివర్సిటీలు, ప్రభుత్వాలు పూనుకోవాలి. గుర్తింపు లేదని బాధ వద్దు. గుర్తింపుకోసం నడుం కట్టాలి. సొంత లాభం కొంత మానుక అన్నట్టు సొంత ప్రమోషన్ కొంత తగ్గించుకుంటే అసలైన కవిత్వం అసలైన ప్రమోషన్ కి నోచుకుంటుంది. యూనివర్సిటీల్లో సాహిత్య పీఠాల్లో వున్న పెద్దలు ఈ దిశగా ఆలోచించి అడుగులు వేయాలి.

Q: కవిత్వం విషయంలో ప్రాంతీయ వాదన ఎంత వరకు సబబు?

జ. అస్తిత్వ వాదం అన్ని చోట్లా ముందుకొచ్చిన సందర్భంలో మనం వున్నాం. ప్రాంతీయ వాదన వేరు. అస్తిత్వ వేదన వేరు. ఒకరిని ఒకరు పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై చెల్లదనేది ఎప్పుడూ మనం అంగీకరించే నినాదమే. కాని ఏ ప్రాంతీయ అస్తిత్వ వాదన అయినా వేదనైనా మనుషుల, మనసుల మధ్య గోడలు కూల్చేదిగానే వుండాలి కాని లేని గోడల్ని కట్టేదిగా వుండకూడదు. తెలుగు రాష్ట్రం రెండుగా వేరైనప్పుడు అది భౌగోళికమైన విభజనే అనుకున్నాను. అది తెలుగువారి విభజనగా అనుకోలేదు. నాన్నచెట్టులో నా జెండా చిన్నదే అన్నప్పుడు కాని, పూలండోయ్ పూలులో ఇక ప్రేమించుకుందాం అన్నప్పుడు కాని అదే భావనతో వున్నాను. ప్రాంతాలను విడదీస్తారు సరే అంతరంగాల ఆత్మీయ తరంగాలను ఎలా వేరుచేస్తారని అడిగాను. ఏ వాదన అయినా కవిత్వంలో సేదతీర వచ్చు. కవిత్వంలో రెపరెపలాడొచ్చు. కవిత్వంలో కదను తొక్కొచ్చు. అయితే అంతిమంగా అది మానతావాదంతో పరిమళించాలి.

Q: కవులకు కవయిత్రులకు తేడా ఏదైనా మీకు అనిపిస్తుందా?

జ. ఏమీ లేదు అవయవాల్లో తప్ప. ఎవరికి ఏ నొప్పి తగులుతుందో వారే ఆ బాధను స్వాభావికంగా వ్యక్తం చేయగలరు. ఆ బాధ నుండి అగ్ని పుడుతుంది. అది అడవిని తగలబెడుతుంది. మన ఆధునిక కవిత్వంలో కవయిత్రులు అదే చేశారు. మనసున్న ప్రతి కవీ సమర్థించాడు. లింగ భేదం శరీరానికే కాని కవిత్వానికి లేదు.

Q: మీ కవిత్వాన్ని పాఠకులు ఎలా స్వీకరించాలని మీరు ఆశిస్తారు?

జ. ఇప్పుడు ఎవరిని వారు మార్కెట్ చేసుకునే కాలంలో వున్నాం. తప్పు లేదు. ఇది నా కవిత్వం దయచేసి చదవండి. మీ అభిప్రాయం చెప్పండి అని ఎవరి ముందైనా మెరిసే పోయే నిలువెత్తు కవిత్వ వాక్యమై నిల్చుంటే తప్పు లేదు. అందరూ నన్నుగా అర్థం చేసుకుంటున్నారు. తీసుకున్న వస్తువును కవిత్వం చేయడమంటే రోజూ ఓ కొత్త దేవుడికోసం సరికొత్తగా తపస్సు చేయడంలాంటిది. నా రెండో పుస్తకం ముందు మాటలో శివారెడ్డి గారంటారు. “ సమయాన్ని బట్టి సందర్బాన్ని బట్టీ, కాలాన్ని బట్టీ కవిత రూపురేఖలు మారుతూ వుంటాయి. మారుతున్న స్థితిని కవి గుర్తించలేకపోతే Outdatedఅయిపోతాడు. తనను తాను readjust చేసుకోవాలి reassessచేసుకోవాలి revitalise చేసుకోవాలి. ఆ క్రమం ప్రసాదమూర్తికి బాగా తెలుసు.” అదిగో ఆ క్రమంలో ఇంకా ఆరితేరానో లేదో తెలియదు. కాని ఆ క్రమం ఎప్పటికీ ముగిసేది కాదు. అదో నిరంతరం చింతనామయ యాతన. నేను తీసుకున్నవస్తవును కవిత్వం చేయడంలో సఫలమయ్యానని నా పాఠకలు అనుకోవాలి. అదే నా కోరిక. అలా అనుకోలేకపోతే అక్కడ నేను విఫలమైనట్టే.

Q: కవిత్వానికి గల భవిష్యత్తేమిటి?

జ. చెప్పాను కదా. కవిత్వాన్ని మార్కెట్ సరుకుగా మార్చడంలో మనం విఫలమవుతున్నాం. పత్రికల్లో రాను రాను కవిత్వానికి స్పేస్ తగ్గిపోతోంది. అదేం దారుణమంటే ఆ ఎవరు చదువుతారండీ అంటున్నారు. యాజమాన్యాలు ఉదాసీనంగా ఉన్నాయి. సినిమా బొమ్మలకు, సినిమా కబుర్లకు, ముగ్గులకు, పజిల్స్ కు పనికిరాని అంగడి సరుకులకు వున్న ఆదరణ పత్రికల్లో కాని మీడియాలో కాని కవిత్వానికి లేదు. దీన్ని బ్రేక్ చేయాలంటే అందరూ ఇదో ఉద్యమంగా పూనుకోవాలి. అసలు తెలుగే మాయమైపోతున్న నేపథ్యంలో ఇంక కవిత్వం ఎవరికి కావాలి అన్న నిరాసక్తత అనవసరం. కవిత్వం రూపం మార్చుకుంటుంది. భాష మారొచ్చు. కాని కవిత్వం మనిషి వున్నంత కాలం వుంటుంది. మనుషుల మాటల్లో, ఊహల్లో, భావాల్లో, సరసాల్లో, సమరాల్లో, సమస్త కళల్లో, ఉద్యమాల్లో, ఉపన్యాసాల్లో, నలుగురు కూర్చుని నవ్వే వేళల్లో.. అన్ని చోట్లా కవిత్వం వుంటుంది.

Q: మీకు కవిగా లభించిన ఆదరణ గురించి చెప్పండి?

జ. కవిగా ఆదరణ బాగానే లభించిందనుకుంటున్నాను. నో రిగ్రెట్స్. దేనికైనా టైమ్ రావాలి. నేను తెలుగు రాష్ట్రానికి దూరంగా వున్నంత కాలం నా కవిత్వమూ ఇక్కడ పాఠకులకు దూరంగానే వుండిపోయింది. దగ్గరగా వచ్చాను కదా వారికి రోజురోజుకూ దగ్గరవుతోంది. వస్తున్న ఆదరణ చూస్తే కేవలం కవిత్వం చదువుకుంటూ కవిత్వం రాసుకుంటూ కవిత్వమే తింటూ బతికేస్తే చాలనిపిస్తోంది. అవార్డులు కొలమానం కాదు. రాసిందాని కంటె రాసిన దానికి అవార్డులు రప్పించుకోడానికి కొందరు కాలాన్ని ఎక్కవగా వెచ్చిస్తున్నారని మిత్రులు ప్రయివేటు మీటింగుల్లో జోక్ చేస్తుంటారు. అలాంటి దౌర్భాగ్యానికి నేను నా కవిత్వం లోను కాకుండా వుంటే చాలనుకుంటాను. మనం ఏమీ ఆశించనప్పుడు ఏ చిన్న గాలి తరక వచ్చి తాకినా ఆ ఆనందం వేరు కదా.

నా నాన్న చెట్టుకు నూతలపాటి గంగాధరం కవితా పురస్కారం అలానే వచ్చింది. నేను తుమ్మల వేణుగోపాలరావు గారు అల్ జీమైర్స్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు రాసిన బతికిన జ్ఞాపకం అనే కవితను ఆంధ్రజ్యోతిలో చూసి ప్రముఖ రచయిత మునిసుందరంగారు నా నెంబరు పట్టుకుని నాకు ఫోన్ చేశారు. నా కవిత్వం తెప్పించుకుని చదివారు. ఆయన రికమెండ్ చేస్తే నాన్న చెట్టు కవితా సంపుటికి ఆ అవార్డు వచ్చింది. నా కవిత్వం అంటే పిచ్చి ప్రేమతో ఓ వ్యక్తి నేను ఎవరో తెలియకుండానే నన్ను అభిమానించి నా కవిత్వానికి 2012లో ఢిల్లీ తెలుగు అకాడెమీ సాహితీ పురస్కారం రావడానికి కారణమయ్యాడు.

నేను టీవీ9 లో పనిచేస్తున్నప్పుడు మూడు రోజులు కష్టపడి నిర్మించిన శ్రీశ్రీ డాక్యుమెంటరీకి రెండు నంది అవార్డులు రావడం నేనెప్పటికీ తట్టుకోలేని ఆనందం. ఇప్పుడు పూలండోయ్ పూలు కావ్యానికి అనుకోని ఆదరణ లభిస్తోంది. డిఫరెంట్ సెక్షన్స్ నుండి నా కవిత్వానికి వస్తున్న స్పందన అనూహ్యంగా వుంది. నన్నెంతో వెన్ను తట్టి ముందుకు నడిపిస్తోంది. తెలుగు నాట కవిత్వానికి ఇచ్చే ప్రయివేటు అవార్డుల్లో మూడింటిని అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా కవులు భావిస్తారు. అందులో మొదటిది ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు. రెండోది నూతలపాటి గంగాధరం అవార్డు. మూడోది సోమసుందర్ అవార్డు. పూలండోయ్ పూలు పుస్తకానికి సోమసుందర్ అవార్డు గత సంవత్సరం నవంబర్ లో అందుకున్నాను. అందుకోవడమే కాదు. సోమసుందర్ వంటి జ్ఞానవృద్ధుడు, పరిపూర్ణ సాహితీ మూర్తి స్వయంగా ఈ కావ్యం మీద వ్యాసం రాయడం నా అదృష్టంగా అదే అన్ని అవార్డుల కంటె గొప్పదిగా భావిస్తున్నాను. ఇప్పుడు ఇదే కావ్యనికి ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు ప్రకటించారు. సో. ఇంతకు మించిన ఆనందం ఇంకేముంది? అంతే కాదు ఇదే పుస్తకానికి విశ్వకళా పీఠం స్నేహనిధి పురస్కారం కూడా ప్రకటించారు. అది ప్రముఖ కవి కె.శివారెడ్డి గారి చేతుల మీదుగా అందుకోబోతున్నాను. అవార్డు చిన్న పెద్ద అంటూ ఏముంటుంది? దేనికదే ప్రతిష్టాత్మకమైంది. అసలు ఏ కవికి చిన్న పురస్కారం వచ్చినా అది నాకే వచ్చినంతగా సంబరపడతాను. ఆ ఘనత కవిత్వానిది. కవిత్వం కోసం అలమటిస్తాను అవార్డుల కోసం కాదు. నీకు ఈ అవార్డులు ఎప్పుడో రావాలని కొందరు..ఇంకా పెద్దవి రావాలని మరికొందరు మిత్రులు ఎంతో ప్రేమగా అంటారు. ఆ మాటలు మనసుకే కాదు, అసలు చెవికే సోకకుండా జాగ్రత్తపడతాను.

Q: మీరు ఎలాటి కవిత్వం ఇష్టపడతారు?

జ. నేను నా రెండో కవితా సంపుటి మాట్లాడుకోవాలి విడుదల చేసినప్పుడు ఆ కవితల్ని ఆడియో రికార్డింగ్ చేయించాడు మిత్రుడు కుమార్. దానికి ముందు మాటగా నేను చెప్పిన విషయమే ఇప్పటికీ చెప్తాను.

పువ్వైనా, వానైనా, పసిపాప నవ్వైనా, మాటైనా, పాటైనా, కలయికలైనా, బౌధ్ధ సంగీతమైనా, సామ్రాజ్యంపై సమరమరైనా, రాసిన ప్రతి అక్షరం మనిషి రక్తంతో జివజివలాడాలి. తల్లి పొత్తిళ్ళ నుండి, ప్రియురాలి చెక్కిళ్ళ దాకా ప్రణయమైనా, ప్రళయ రణమైనా మన రక్తం నుండి రాలే ప్రతి అక్షరంలో జీవితం తొణికిసలాడాలి.

కవిత్వం అమ్మనుకుంటాను. నాన్ననుకుంటాను. కూతురనుకుంటాను. కొడుకనుకుంటాను. స్నేహితుడనుకుంటాను. కవిత్వం నేననుకుంటాను. కవిత్వం నాకు తెలిసిన మనుషులనుకుంటాను. సోమసుందర్ గారు నా కవిత్వాన్ని గురించి ఒక వ్యాసంలో ఇలా అన్నారు. “ ప్రసాదమూర్తి కవిత్వంలో ప్రసాద గుణం స్పష్టంగా కనిపిస్తుంది. కవిత్వానికి ప్రసాదగుణం అత్యంత అవసరమని పూర్వ లాక్షణికులు చెప్పారు. కాళిదాసు మహాకవి కవితలను ప్రజాహితం చేసిన లక్షణాలలో ప్రసాద గుణం ముఖ్యమైనదే. ప్రసాదమూర్తి కవిత్వంలో ఆ లక్షణమే జీవగర్రగా నిలుస్తోంది.” నా కవిత్వంలో ఈ లక్షణం ఎంతగా వుందో నాకు తెలియదు కాని అలాంటి లక్షణాలున్న కవిత్వం ఏ అంశం మీద రాసిందైనా ఇష్టమే. అయితే మనిషి కేంద్రం కాని మనిషి మనసుకు అందని అతీతమైన అలౌకికమైనది అదెంతటి గొప్పదైనా నేను ఎంజాయ్ చేయలేను.

Q: కవిగా మీరు ఏం ఆశిస్తున్నారు?

జ. నథింగ్ . జస్ట్ పొయిట్రీ. పొయిట్రీ. పొయిట్రీ. స్పానిష్ కవి Jorge Luis Borges మాటలు గుర్తుకొస్తున్నాయి.

I have no need to speak
Nor claim false privilege
They know me well who surround me here.
Know well my afflictions and weakness.
This is to reach the highest thing,
That heaven perhaps will grant us :
Not admiration nor victory
But simply to be accepted
As part of an undeniable reality,
Like stones and trees.

**** (*) ****