కవిత్వం

ఆట-విడుపు

జనవరి 2013

ఎక్కడ చూడు…!
ఆ రెండే….!

భూతద్దం పెట్టి చూసినా,
కళ్ళద్దాలు పెట్టుకుని కదిపి చూసినా
అసలు ఏ అద్దాలు లేక పోయినా కూడా……

మామూలు కళ్ళకి, మసక కళ్ళకి, గుడ్డి కళ్ళకి కూడా
నానో నుండీ పర్వత పరిమాణం వరకూ
చిమ్మ చీకటి దేవులాటల్లో సైతం
కొట్టొచ్చినట్టు మరీ ఆ రెండే కనిపిస్తుంటాయి

‘ఒక పై చెయ్యి’,
‘ఒక కింద చెయ్యి ‘.

పై చెయ్యెప్పుడూ హుకుం జారీ చేస్తానంటుంది
మీసం మెలేస్తుంటుంది.
కిందది బానిసలా పడుండి
కిందనే,
కింద కిందనే అణిగిమణిగి ఉండాలంటుంది.

ఒకవేళ, ఎప్పుడైనా ఎప్పటికైనా
కింది చేయే పైకి పోయి
పై చేయిని కిందికి నెట్టేశాక కూడా
‘మారిందిలే’ అని సరదా పడటానికి లేదు.
మారిన చేతులతో కూడా

పాత ఆటే కొత్తగా
మళ్ళీ మొదలౌతుంది.

అందుకే,
చేతులు రెండూ కలిసి కరచాలనమయ్యే
అపురూప ప్రాంతాలకి
ఎన్ని వ్యయప్రయాసలకోర్చైనా
నేను తప్పక ప్రయాణం కడతాను.