పదేళ్ళ వయసున్న మా అబ్బాయిని తీసుకుని రామాపురం బస్టాండులో బస్సు దిగేసరికి నేను ఆశ్చర్యపోవాల్సివచ్చింది. ఇరవై ఏళ్ళ తర్వాత రామాపురం వస్తున్నాను. కొన్ని మార్పులుంటాయనుకున్నాను కాని ఈ స్థాయిలో ఉంటాయని మాత్రం ఊహించలేదు. నేను చివరిసారి చూసినప్పుడు ఈ బస్టాండు పొలాల మధ్య మట్టి రోడ్డుతో ఒకే ఒక షెల్టర్‌తో ఉండేది. ఇప్పుడు.. ఇటుకలు, సిమెంటుతో నిర్మించిన విశామైన భవనాల మధ్య ఠీవిగా ఉంది. బైకులు, కార్లు, జీపులు, బస్సుల వంటి వాహనాల రణగొణ ధ్వనులతో వాతావరణం గందరగోళంగా ఉంది. నా చిన్నతనంలో చదువుకునే రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అప్పట్లో రోడ్డు మీద చాలా తక్కువ వాహనాలు ఉండేవి. ప్రభుత్వం వారి పాత, దుర్బలమైన బస్సులు ఉండేవి. ప్రయాణీకుల కోసం నిస్సహాయంగా ఎదురుచూస్తూ ఆ బస్సులు రోడ్డు మీద పడిగాపులు కాసేవి. పొగ వదులుతూ బస్సులు బయల్దేరగానే బస్టాండు నిర్మానుష్యమైపోయేది.
“ఇది చిన్న ఊరని చెప్పావు?” అన్నాడు మా అబ్బాయి.
“మన నగరాలతోనూ, పట్టణాలతో పోలిస్తే ఇది ఇప్పటికి చిన్న ఊరే. ఇరవై ఏళ్ళ క్రితం నేను వచ్చేసిన తర్వాత బాగా పెరిగింది.”
“ఈ ఇరవై ఏళ్ళలో నువ్వు ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదా?”
“లేదు”
“ఎందుకు?”
“ఎందుకంటే….” నేను మాటలు తడుముకున్నాను.
“ఎందుకు నాన్నా, నువ్విక్కడికి రాలేదు?”
నేను జవాబు చెబితే గాని మావాడు ఊరుకునేలా లేడు.
“ఈ ఊర్లోనే పెరిగావనీ, ఇక్కడే చదువుకున్నావని, స్నేహితులున్నారనీ చెప్పావుగా నాన్నా! వాళ్ళని కలవాలని ఎప్పుడూ అనుకోలేదా?”
నిజమే. నేను రామాపురంలోనే పెరిగాను. నాకిక్కడ మిత్రులుండేవారు. నా కౌమార దశ ఇక్కడే గడిచింది. నగరానికి వచ్చిన కొత్తల్లో వాళ్ళని బాగా తలచుకునేవాడిని. కొందరి ముఖాలు నా మనసులో ముద్రపడిపోయాయి. కాని హైస్కూల్ చదువు పూర్తి చేసి ఇక్కడ్నించి వెళ్ళిపోయాకా నేను మళ్ళీ రామాపురం రాలేదు. చిన్న ఊర్లలో పెరిగి… ఊర్లు మరింత చిన్నవయ్యాకా లేదా తమ కలలు పెద్దవయ్యాకా… పెద్ద ఊర్లకి, ఉన్నత గమ్యాల వైపుకి పరిగెత్తేవాళ్ళలో నేనూ ఒకడిని. నేనో పెద్ద నగరంలో స్థిరపడ్డాను. నా కుటుంబం, నా ఉద్యోగం, కొత్త మిత్రులు, కొత్త పరిచయాలు… అన్నీ నగరంతోనే. ఇప్పుడు ఇక్కడ రామాపురంలో నా పాఠశాల మిత్రుడు ఎవరైనా ఎదురుపడినా… బహుశా మేము ఒకరినొకరం గుర్తు పట్టలేకపోవచ్చు. ఇరవై ఏళ్ళంటే సుదీర్ఘమయిన కాలం. అప్పటి మా అమాయకమైన ముఖాలని… జీవితపు కర్కశత్వం వయసనే పైపొర కింద దాచేసింది. ఒకవేళ మేము ఒకరినొకరం గుర్తు పట్టినా… చిన్ననాటి స్నేహం తాలుకు ఆనందం ఓ మెరుపులా మెరిసి క్షణంలో మాయమైపోతుంది, మా మధ్య ఎక్కువ మాటలేవీ ఉండవు. అపరిచితులమైపోతాం. పెద్దరికం వేషాల్లో మా సమక్షం కూడా ఒకరికొకరికి ఇబ్బందిగానే ఉంటుంది. చిన్ననాటి స్మృతులు గతం యొక్క వికారమైన ఉదంతాలుగా మిగిలిపోతాయి.
జ్ఞాపకాలు చాల అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే అవి మనల్ని వెంటాడుతాయి. అవి గత కాలపు నాటివనీ, ఎప్పుడో విడిచిపెట్టబడినవనీ బాగా తెలిసినా కూడా మనం వాటిని మన లోలోపల లోతుల్లో భద్రపరుచుకుంటాం. అవి అసౌకర్యం కలిగిస్తాయని తెలిసినా, తరచూ వచ్చే తలనొప్పిని భరించినట్లు… వాటి నసని తట్టుకుంటాం. ఆ నసే ఇప్పుడు రామాపురానికి లాక్కొచ్చింది. గత ఇరవై ఏళ్ళుగా ఈ ఊరినే మర్చిపోయాను. నా కొడుకు పెరిగి పెద్దవుతుంటే.. వాటి ఆటపాటల్లో, కుతూహలంలో నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది, నేను ఎదిగిన రోజులు జ్ఞాపకమొచ్చాయి. నాలోని చిన్న రామాపురం పెరగసాగింది. ఓ రోజు ఈ నస మరీ ఎక్కువై బాధగా మారింది. నా భార్యని, స్నేహితులని ఆశ్చర్యానికి గురిచేస్తూ, మా అబ్బాయిని తీసుకుని మా పూర్వీకుల గ్రామానికి… రామాపురానికి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి బయల్దేరాను.
నేనొక్కడినే వచ్చి ఉన్నా సరిపోయేది. కాని వాడి వయసులో ఉండగా నేను పెరిగిన ప్రాంతాలను నా కొడుక్కి చూపించాలనుకున్నాను. ఈ ప్రాంతాన్ని వాడి స్మృతులలో ఓ భాగంగా… కనీసం ఓ సూక్షమైన భాగంగానైనా చేయాలనుకున్నాను. అయితే రామాపురంలో చోటు చేసుకున్న మార్పులు చూసాకా నాకు నోట మాట రాలేదు, మతి కూడా పోయినట్లయింది. ఇక్కడ నేను ఏం వెతకాలి? నా కొడుకుకి ఏం చూపించాలి, దేని గురించి చెప్పాలి? ఇక్కడి మార్పుల గురించి నాకే ఏమీ తెలియదు, ఇవేవీ నా స్మృతులలో లేనే లేవు. ఇప్పుడు ఇక్కడ లేని వాటి గురించి మావాడికి చెప్పాల్సివస్తే… అదేదో నగరంలోనే… మా ఇంట్లోనే చెప్పేవాడిని కదా!
“నాన్నా, ఈ ఊరి గురించి చెప్పు. నాకు బోల్డు సంగతులు చెప్తానని అన్నావ్..”. తల్లిదండ్రులు చేసిన బాసలని బాగా గుర్తుంచుకునే నవతరం కుర్రాడు మా అబ్బాయి.
“కంగారు పడకు. బోలెడు విషయాలుంటాయి చెప్పుకోడానికి…” అని చెప్పి కదిలాను. రద్దీని దాటుకుంటూ వీధులలో నడవడానికి సన్నద్ధమయ్యాము.
మూడు వైపుల నుంచి మూసి ఉన్న బస్టాండు నుంచి అన్ని వైపులకి ఇరుకు సందులు ఉన్నాయి. ఈ సందులన్నీ రకరకాల వాహనాలతో రద్దీగా ఉన్నాయి. వాటి శబ్దాలతో అక్కడి వాతావరణం గోలగోలగా ఉంది. మావాడి ప్రశ్నలని కాసేపు అదుపులో ఉంచడానికి వాడికి స్థానికంగా ప్రఖ్యాతిగాంచిన మిఠాయిలు కొనిపెట్టాను. తాత్కాలికంగా వాడి దృష్టి మళ్ళించాను.
రామాపురం ఇంత త్వరగా, ఇంత అనూహ్యంగా మారిపోతుందని నేను అసలే మాత్రం అనుకోలేదు. అయితే బుద్ధ బజార్ మాత్రం అలాగే ఉండి ఉంటుందని భావించాను. గుండ్రని రాళ్ళు పరిచిన ఇరుకు సందులలో ఉండే బుద్ధ బజార్ రామాపురంలోకెల్లా అతి పురాతన బజారు. వీధికిరువైపులా ఉండే ఇళ్ళకి చెక్కలతో చేసిన బాల్కనీలు ఉండేవి. ఇళ్ళ క్రింది భాగాలలో కొట్లు ఉంటే, పై భాగాలలో వ్యాపారులు నివాసం ఉండేవారు. ఈ బజారు ఎన్నో ఉత్థానపతనాలను చూసింది, ఎన్నో దశాబ్దాలు గడిచిపోవడానికి సాక్షిగా నిలిచింది. దీని ప్రభ వెలిగిపోతున్న రోజులలో, రామాపురంలో తారు రోడ్లు రాని ఆ రోజుల్లో, ఊరవతల ఉన్న పర్వత ప్రాంతంలోని దేవాలయానికి వచ్చి పోయే యాత్రికులు రాత్రిళ్ళు బస చేయడానికి బుద్ధ బజారే తగిన స్థలంగా ఉందేది. అవెంతో గొప్ప రోజులు. నేల మీద పరిచిన గుండ్రని రాళ్ళ మీద గుర్రాల గిట్టల చప్పుడు; కఠినమైన పర్వత మార్గాల నుంచి క్షేమంగా తిరొగిచ్చిన యాత్రికుల కబుర్లు; లాభాలని ఆశించే వ్యాపారుల స్నేహపూర్వక స్వభావం – బుద్ధ బజారుని ఓ గొప్ప తేజస్సుతో నింపేసేవి.
నేను బడికి వెళ్ళడం ప్రారంభించేనాటికి బుద్ధ బజారు ప్రాభవం క్షీణించడం మొదలైంది. యాత్రాకేంద్రాన్ని ఇతర పట్టణాలతో నేరుగా కలిపేందుకు బస్సులను వేసారు. రామాపురం తన ప్రాధాన్యతని కోల్పోయింది, యాత్రికులు రాత్రి బస చేసే ముఖ్యమైన ఊరు స్థాయి నుంచి ఓ చిన్న వర్తకపు ఊరిగా మారిపోయింది. బస్సులు యాత్రికులను నేరుగా యాత్రాకేంద్రానికి చేరుస్తుండడాన్ని వర్తకులు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. బుద్ధ బజారు క్రమంగా తన వైభవాన్ని పోగొట్టుకుంది.
ఏమైనా, ఆ రోజుల్లో చుట్టు పక్కల గ్రామాలన్నింటికి అదే ముఖ్యమైన వాణిజ్య కూడలి. చిన్న ఊరి మార్కెట్లకి ఉండే అన్ని ఆకర్షణలను కలిగి ఉన్న ఊరు. ఇక్కడ నా చిన్నతనంలో కొన్ని రోజులు మిత్రులతో కలసి టీ కొట్లలో గడిపిన సంఘటనలు నాకింకా గుర్తున్నాయి. బుద్ధ బజారులో కొట్ల దగ్గర గంటల గంటలు కాలం గడపడంలో పెద్ద విశేషం ఏదీ లేదు గాని ఈ ప్రాంతంలో ఉబుసుపోని ఊసులతో సోమరిగా సమయం గడిపామన్న ఓ జ్ఞాపకం నా మదిలో నిలిచిపోయింది. ఈ వృథా కాలక్షేపమే నా స్మృతులలో బలంగా ఉండిపోయింది.
“అసలైన మార్కెట్‌కి వెడదాం పద, ఆ ప్రాంతమంతా నాకు బాగా తెలుసు” అంటూ బుద్ధ బజారు వైపు నడిచాను. బస్టాండుకు యాభై మీటర్ల దూరంలోనే ఉంది బుద్ధ బజారు. వీధి మొదట్లో కాపలా ఉంటునట్లుండే ఆ పురాతన మఱ్ఱి చెట్టు ఇప్పటికీ అలాగే ఉంది. అయితే, కొత్తగా వచ్చిన ఇళ్ళకి చోటు ఇవ్వడానికి, దాని విశాలమైన కొమ్మలని చాలా చోట్ల కొట్టేశారు. ఆ వీధిలోకి అడుగుపెట్టగానే, గుండ్రటి రాళ్ళు పరిచిన నేలపై నడుస్తున్నందున్న మా బూట్ల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పటి, పురాతన సోమరితనం నన్ను మళ్ళీ ఆవరించింది… ఈసారి బాధతో. రామాపురంలోని కొత్త ప్రాంతాల వలె కాకుండా ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. మార్కెట్లో అతి తక్కువమంది కనపడ్డారు. చాలా కొట్లు ఖాళీగా ఉన్నాయి లేదా అతి తక్కువ సామాన్లు కలిగి ఉన్నాయి. ఇళ్ళు కూడా పాతవై, శిధిలమైనాయి. వర్ణ శోభని కోల్పోయి బోసిగా కనబడుతున్నాయి.
నాలో పెరిగితున్న రామాపురం యొక్క బుద్ధ బజారు నన్నిక్కడికి లాక్కొచ్చింది… ఇరవై ఏళ్ళ తర్వాత. మరిప్పుడు.. మా అబ్బాయికి చెప్పడానికి ఇక్కడేముంది? నా స్మృతులలో వేటిని మా అబ్బాయితో పంచుకోవాలి?
“విసుగ్గా ఉంది నాన్నా… ఇక్కడ ఏదీ ఆసక్తిగా లేదు.” అని చెబుతూ, “మీ చిన్నప్పుడు ఇక్కడ మీరేం చేసేవారు?” అడిగాడు మావాడు – అక్కడి ఉదాసీనత, శిధిలాల పట్ల అనాకర్షణకి లోనవుతూ.
“బుద్ధ బజారులో ఏదో ఉండాలి… ఏదో విశేషం ఉండాలి…” చెప్పాను నేను వివరాల కోసం తడుముకుంటూ.
“ఇక్కడైతే ఏమీ లేవు. కూలడానికి సిద్ధంగా ఉన్న కొట్లు తప్ప! నాన్నా, మనం మొదట చూసిన ప్రాంతంలోని మార్కెట్టే బావుంది. అక్కడంతా సందడిగా ఉంది. ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళెవరూ ఉన్నట్లు లేరు…. తెలిసిన మొహం ఒక్కటీ కనబడడం లేదు…”
ఓ చోట మెట్లెక్కాము. నా చిన్ననాటి జ్ఞాపకాలను నా కొడుకుతో పంచుకోవాలనుకోవడం ఎంతటి మూర్ఖపు ఆలోచనో నాకర్థం అవుతోంది. ఇంతలో ఓ కొట్టు ముందున్న – “రామ్‌లాల్ టైలర్స్” బోర్డు నాకు హఠాత్తుగా కనపడింది. అంతే! ఒక్కసారిగా నేను మా బడి రోజులకి వెళ్ళిపోయాను.
ఆ రోజుల్లో రామాపురం మొత్తంలో రామ్‌లాల్ ఉత్తమమైన దర్జీ. ఫ్యాషన్ ప్రపంచంలోని కొత్త ఒరవడులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు రామ్‌లాల్. ఊర్లో ఇంకొంతమంది దర్జీలు ఉన్నా, రామ్‌లాల్ దగ్గర బట్టలు కుట్టించుకోడమంటే అదో గొప్ప హోదా! ఉత్తమమైన దర్జీ అని పేరు లభించడంతో, రామ్‌లాల్ కాస్త నియంతలా ఉండేవాడు… ముఖ్యంగా బడి పిల్లల విషయంలో. అప్పట్లో బెల్-బాటమ్ పాంట్లు చాలా ప్రసిద్ధం. మేము కూడా మా పాంట్లు కాలి చీలమండల దగ్గర విశాలంగా ఉండాలని కోరుకునేవాళ్ళం. అయితే రామ్‌లాల్ మాటే నెగ్గేది. “కుదరదు. నలభై అంగుళాల వెడల్పు ఆడపిల్లల గౌనులకి… మగపిల్లల పాంట్లకి కాదు” అని స్థిరంగా చెప్పేవాడు. చాలా సేపు బ్రతిమలాడి చివరికి కన్నీళ్ళు పెట్టుకునే సమయానికి 32 అంగుళాలు ఉంచడానికి ఒప్పుకునేవాడు. ఈ ధోరణి వల్ల మేము రామ్‌లాల్‌ని అసహ్యించుకునేవాళ్ళం. అయినా మా బట్టలు కుట్టించుకోడానికి అతని కొట్టుకే వెళ్ళేవాళ్ళం. చుట్టూ సహాయకులతో, రామ్‌లాల్ కొట్టు హడావుడిగా ఉండేది. “రామ్‌లాల్ టైలర్స్” అనే బోర్డు ఎప్పటికప్పుడు తాజాగా రంగులేసి ఉండేది.
కాని ఈ రోజు ఆ బోర్డు చూస్తే… రంగు వెలసిపోయి, తుప్పు పట్టి, అడ్డదిడ్డంగా వేలాడుతూ కనబడింది. కొట్టు కూడా ఖాళీగా కనపడింది. షో కేసులు బోసిగా ఉన్నాయి. అక్కడక్కడా అద్దాలు పగిలి ఉన్నాయి. ఓ పాత కుర్చీలో నల్లటి మెత్తపైన, ఓ పాత కుట్టు మిషన్ ముందు కూర్చుని ఉన్న ఓ ముసలి ఆకారం కనబడింది. చూడగానే అతనే రామ్‌లాల్ అని గ్రహించాను. ముసలాడయిపోయాడు, దుర్బలంగా ఉన్నాడు.
“అతను నాకు తెలుసు.. నాకు తెలుసు” అని మా అబ్బాయితో చెప్పాను. ఉన్నట్లుండి నాలో ఏదో ఉత్సాహం. నా చిన్ననాటి జ్ఞాపకాలేవో ఆ కొట్లోంచి నన్ను పిలుస్తున్నట్లనిపించింది. అయితే మా అబ్బాయికిదేం నచ్చలేదు. కాళ్ళీడ్చుకుంటూ లోపలికి వచ్చాడు.
మమ్మల్ని చూస్తునే, శక్తి కూడదీసుకుని పైకి లేచాడు రామ్‌లాల్. ఆయనలో పెద్ద ఉత్సాహమేమీ లేదు.
“రండి బాబుగారు… రండి” అని ఆహ్వానించాడు. ఆ గొంతు చాలా బలహీనంగా ఉంది. మునుపటి కాఠిన్యం లేదు.
“రామ్‌లాల్ గారూ.. నేను…” అంటూ నా గురించి చెప్పాను. ఆయన గుర్తు చేయడానికి ప్రయత్నించాడు కాని సాధ్యం కాలేదు. అయితే రామాపురంలో నన్ను గుర్తు పట్టేవాళ్ళెవరు లేరని మరోసారి వ్యాఖ్యానించడానికి మా అబ్బాయికి అవకాశం ఇవ్వదలచలేదు. అందుకే వెంటనే… “గుర్తొచ్చానా.. మీరు నాకో కోటు కుట్టారు…” అని చెబుతూ మా నాన్న పేరు, మా గ్రామం పేరు చెప్పాను. ఆయనకి గుర్తొచ్చినట్లుంది.
“అవునవును…” అన్నాడు. ఆయన మొహంలో వెలుగు. “కానీ మీరు చాలా ఏళ్ళ క్రితమే వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదుగా. ఈ మధ్య కాలంలో అన్నీ మారిపోయాయి…” అంటూ గట్టిగా నిట్టూర్చాడు.
***
బడిలో ఆఖరి సంవత్సరం చదువుతున్న రోజులవి. కోటు కుట్టించడం కోసం మా నాన్న ఓ చక్కని గుడ్డ ముక్క కొన్నాడు. అదెంతో మెత్తగా, వెచ్చగా ఉంది. నాకు కావలసిన సైజు కన్నా ఆ గుడ్డ ముక్క కొలతలు ఎక్కువగా ఉన్నాయి. మా అమ్మేమో కోటుని బాగా వదులుగా, వచ్చే ఏడాదికి కూడా సరిపోయేలా కుట్టుంచుకోమని గట్టిగా చెప్పింది. రామ్‌లాల్ కుట్టిన కొత్త కోటు వేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చాను. అమ్మ కోపం పట్టలేకపోయింది. “ఆ రామ్‌లాల్ మోసం చేశాడు. గుడ్డ ముక్క మిగుల్చుకున్నాడు” అంటూ మండిపడింది. మాములు గుడ్డ ముక్క అయితే అమ్మ అంతగా పట్టించుకోకపోయేదేమో… ఆ గుడ్డ ముక్క ఖరీదైనది కావడం వల్లా, కోటు ప్రస్తుతానికి నాకు సరిగ్గా సరిపోవడం వల్లా… అమ్మ ఆ గుడ్డ ముక్క సంగతి తేల్చాలని నిర్ణయించుకుంది.
మర్నాడు నాతో కలసి రామాపురం వచ్చింది. బుద్ధ బజార్ లోని గుండ్రటి రాళ్ళు పరిచిన నేల మీద విసురుగా నడుస్తూ రామ్‌లాల్ కొట్లోకి ప్రవేశించాం. అక్కడ రామ్‌లాల్ తన ఐదేళ్ళ కొడుకుతో కులాసాగా కబుర్లు చెబుతున్నాడు. ఆ పిల్లాడి వంటి మీద నా కోటు గుడ్డ ముక్కతో కుట్టిన కోటు ఉంది. అంతే.. అక్కడ కల్లోలం రేగింది. అమ్మకి ఇంతకంటే మరో సాక్ష్యం అక్కర్లేక పోయింది. వివరణ అవసరం లేకపోయింది. రామ్లాల్పై తిట్లు లంకించుకుంది. రామ్‌లాల్ కొడుక్కి ఏమీ అర్థం కాలేదు. అందరి మొహాల కేసి చూస్తూండిపోయాడు. తిట్టీ తిట్టీ అలసిపోయాక చివరికి శాంతించింది అమ్మ. రామ్‌లాల్ చేసిన మోసానికి శిక్షగా… ఈ కోటు కుట్టినందుకు ఇవ్వాల్సిన కుట్టుకూలీ ఇవ్వడం లేదని ప్రకటించింది. రామ్‌లాల్ అంగీకారంగా, మౌనంగా తలవంచుకుని నిలబడిపోయాడు. ఎవరి నియంతృత్వాన్ని మేము భరించలేకపోయేవాళ్ళమో ఆ రామ్‌లాల్… దయనీయంగా కనపడ్డాడప్పుడు.
***
అదే దయనీయత మళ్ళీ ఇప్పుడు రామ్‌లాల్ వదనంలో గోచరిస్తోంది. అయితే ఆ దౌర్బల్యానికి కారణం వృద్ధాప్యం మాత్రమే కాదు. ఏం మాట్లాడాలో తెలియక మేము కాసేపు మౌనంగా ఉండిపోయాం.
“రామ్‌లాల్ గారూ, మీ అబ్బాయి సంగతులేంటి? పెళ్ళయిందా?” అని అడిగాను.
నాకేసి కొన్ని క్షణాలు తేరిపార చూసాడాయన. తన కొడుకు రామాపురంలో ఉండడంలేదని చెప్పాడు.
“ఇప్పుడన్నీ మారిపోయాయి. జనాలు ఇప్పుడు మేము కుట్టిన బట్టలు వేసుకోవడం లేదు. రామాపురంలోని కొత్త ప్రాంతాలలోని పెద్ద పెద్ద కొట్లు… బట్టల ఫాక్టరీల నుంచి నేరుగా కొనేసి రెడీమేడ్ దుస్తులను అమ్ముతున్నారు. జనాలు వాటినే వేసుకుంటున్నారు…”
ఆయన కొడుకు ఈ కొట్టుని కొన్నాళ్ళపాటు నడిపించి చూసాడట. చివరికి విసిగి వేసారి ఉద్యోగం కోసం దగ్గర్లోని నగరానికి వలస పోయాడట. కొన్నేళ్ళ తర్వాత తిరిగొచ్చి అతని భార్యని, పిల్లల్నీ కూడా తీసుకువెళ్ళిపోయాడట. ఈమధ్య కాలంలో వాళ్ళ రాకపోకలు బాగా తగ్గిపోయాయట. ఏడాదికో రెండేళ్ళకో వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుపుతూ, నగరంలో పడుతున్న కష్టాలను ప్రస్తావిస్తూ ఓ ఉత్తరం వస్తుందట. తన కొడుకుతో ప్రస్తుతానికి రామ్‌లాల్‌కి ఉన్న సంబంధం ఉత్తరాల ద్వారానే.
మా మధ్య మళ్ళీ మౌనం. మా అబ్బాయి చిరాకు పడసాగాడు.
“మీరు ఇప్పటికీ బట్టలు కుట్టగలరా రామ్‌లాల్? మా అబ్బాయికి ఓ కోటు కుట్టిస్తారా?” ఉన్నట్టుండి అడిగాను.
నాకేసి ఆశ్చర్యంగా చూసాడాయన. బోసి నోటిపై చిన్న నవ్వు వెలసింది.
“బాబుకి కోటు కుట్టివ్వడమంటే నాకెంతో సంతోషం. కాని… నాకు వయసైపోయింది. మాలాంటి పాత తరం దర్జీలు కుట్టిన కోటు మీ వాడికి నచ్చుతుందో లేదో…” అన్నాడు సంశయంగా.
“అదేం లేదు రామ్‌లాల్ గారు. బావుంటుంది. నేను గుడ్డ ముక్క కొనుక్కుని వస్తాను. మీరెలా కుట్టినా మావాడు వేసుకుంటే బావుంటుంది..” అన్నాను బ్రతిమాలుతున్నట్లుగా.
మేము బయటకి నడిచాం. మా అబ్బాయి నాకేసి చూసి, “ఆయన కుట్టిన కోటు నేను వేసుకోను…” అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లుగా.
“నాకు తెలుసు.. నువ్వీ మాట అంటావని నాకు తెలుసు. నువ్వు వేసుకున్నా, వేసుకోక పోయినా… నీ కోసం ఆయన కోటు కుట్టాల్సిందే…” అంటూ మా అబ్బాయి చెయ్యి పట్టుకుని బుద్ధ బజారు నుంచి బయటకు వచ్చాను.
**** (*) ****
ఆంగ్ల మూలం: తులసి చరణ్ బిస్త్
తెలుగు: కొల్లూరి సోమ శంకర్
అంగ్లమూలం ‘Reminiscences’ అనే శీర్షికతో మ్యూజ్ ఇండియా.కామ్ అనే సాహిత్య వెబ్సైట్లో మే 2013 సంచికలో ప్రచురితం. మూల కథని ఈ లింక్ లో చదవవచ్చు:
http://www.museindia.com/regularcontent.asp?issid=49&id=4211
“”పల్లె కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల ….” గోరేటి ఎంకన్న గారు ఎంత బాధ అనుభవించి రాసారో ఆ పాటని !! పల్లెలు పల్లెలు గా లేవు . అవి నరక కూపలు గా మారుతున్నాయి. కలుషిత వాతావరణం తో నిండి పోతున్నాయి . ఆహ్లాద కరం గా వుండటం లేదు. ఈ కద ఒక ప్రతీక .
శేషుబాబు గారు,
ధన్యవాదాలు.