ముఖాముఖం

వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే!

జనవరి 2013

జగద్ధాత్రి : వేణుగోపాల్ గారు “నికషం ” రాయడానికి గల నేపధ్యం చెప్తారా ?

కాశీభట్ల వేణుగోపాల్ : నా నవలలలో రాతల్లోని పాత్రలందరూ ఎక్కడినుండో ఊహలనుండి  వచ్చిన వారు కాదు. వారందరూ ఎక్కడో ఎప్పుడో జీవితం లో తారస పడ్డవారే. నేను-చీకటి నవల లో భగవాన్లు నాకు ఒక ఆసుపత్రి ముందు పరిచయం అయిన వ్యక్తి. అందులో భగవాన్లు ని చంపేసాను. నికషం లోని అలెక్స్ భగవాన్లు పాత్రకి పొడిగింపుగా అక్షరీకరించాను.

(కాశీభట్ల వేణుగోపాల్ )

ధాత్రి  : భగవాన్లు స్ఫోటకం మచ్చలతో వికారంగా ,ఉంటాడు  అలాగే నికషం లో అలెక్స్ కి బొల్లి వ్యాధి, ఇలాంటి పాత్రలను చిత్రించడం లో మీ ఉద్దేశం ?

వేణు : సౌందర్యం అంటే కేవలం దేహ సౌందర్యం అనుకునే వారికీ ఏమి చెప్తాము. అసలు ఇలాంటి వ్యాధులు అంటుకోవని ,  స్పృశించి నా అంటూ వ్యాధులు కావని  అన్నది చాలా మందికి తెలియక ఎంత గా అటువంటి వారిని దూరం పెడతారో చూసినప్పుడు నా కడుపు మనసు చాలా బాధ పడుతుంది. దు:ఖం వస్తుంది. అందుకే అటువంటి  మనుషుల మనోగతం  ఎలా ఉంటుందో ఈ మనుషులకి చెప్పాలనే ఉద్దేశం తోనే ఈ పాత్రలను చిత్రించాను. ఒక సారి పాస్పోర్ట్ ఆఫీసులో ఒక గుమస్తా బొల్లి వ్యాధి ఉన్నవాడు , ఉన్న వికారం గాక అతను చేసుకున్న వికారం కొంత. తలకు రంగు పూసుకుని  మరీ వికృతంగా ఉన్నాడు. అందరూ అతన్ని అసహ్యంగా చూస్తున్నారు. నేను నా పనయ్యాక కాఫీకి రమ్మని పిలిచాను అతను  డ్యూటీ లో ఉన్నప్పుడు రాకూడదు సర్ అన్నాడు. అయితే ఒకసారి ఇలా బయటికి రండి అని పిలిచాను. వచ్చాడు అతన్ని కావలించుకున్నాను ఎంతో ప్రేమగా ఇష్టంగా కృతజ్ఞతగా సహానుభూతితో , అప్పుడు అతని కళ్ళలో చూసిన కన్నీరే ధాత్రీ ఈ అలెక్స్ పాత్రకి ప్రాణం. అప్పుడు ప్రాణం పోసుకున్నాడు అలెక్స్ నా మెదడు లో . అసలీ వ్యాధులు ఏమీ అంటూ వ్యాధులు  కావని , అటువంటి వారు కూడా ఆదరణ కోరుకుంటారని ప్రేమ కోరుకుంటారని తెలిసినా ఎందుకు ధాత్రీ ఈ మనుషులు  ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తారు. సమాజం లో వారూ భాగమే మన సాటి  వారె అని మరిచిపోతారు. కబుర్లకు మాత్రం చెప్తాము అందరం ఐ హేట్ దిస్ అందుకే రాసేను.

ధాత్రి  : భగవాన్లు పాత్ర కూడా నిజ జీవితం లోది  అన్నారు కొంచం వివరిస్తారా ?

వేణు : అమ్మని ఆసుపత్రికి శ్రీపాద పినాక పాణి గారి కారులో తీసుకెళ్ళాం. కానీ అమ్మ చనిపోయాక నాకు ఆయన కారులో తీసుకురావడానికి మనసు ఒప్పలేదు. అప్పుడు ఇలా విగత జీవులను తీసుకెళ్ళే ఒక టాక్సీ నడుపుతున్న వ్యక్తీ గా నాకు భగవాన్లు పరిచయమయ్యాడు. తను అమ్మను లోపలి తీసుకువచ్చి పడుకోపెట్టి వెళుతుంటే నేను డబ్బులివ్వ బోయాను.

అందుకు అతడు ” మా అమ్మని తీసుకొచ్చినందుకు నాకు డబ్బులిస్తారా బాబూ . అమ్మ ఎన్ని సార్లు నాకు అన్నం పెట్టిందో ఆదరించిందో అటువంటి అమ్మను తీసుకొస్తే డబ్బులిస్తారా “అని అడిగాడు నా హృదయం ద్రవించి పోయింది. అప్పటినుండి నాకు ఈ దైహిక వైకల్యాలు ఉన్న వ్యక్తులను సమాజం లో మనుషులు అని భావిస్తున్న వారు ఎంత నిరాదరణకి గురి చేస్తారో అని బాధేసింది అందుకే రాసాను. (ఇది  చెప్తూ కూడా అయన ఏడ్చారు )

ధాత్రి  : మీ రచనల్లో ఈ పెర్వర్షన్స్ మానసిక వికారాలు ఎక్కువగా ఉంటాయని కొందరి అభిప్రాయం. దానికి మీరు ఏమంటారు ?

వేణు : మానసిక వికారాలు పెర్వర్షన్స్ (నవ్వు ) ఎవరి లో లేవు అందరి లోనూ ఉంటాయ్. కానీ వాటిని రాయడం అంత సులువైన పని కాదు. నేను రాస్తాను. నిజాయితీగా రాస్తాను.

ధాత్రి :  మీ రచనల్లో కొన్ని అభ్యంతర కర మయిన  పద జాలం ఉందని కొందరి అభ్యంతరం

వేణు : (నవ్వు) అభ్యంతర కరమైన పదాలు హహ అవి నిజంగా అసభ్య పదాలా చెప్పు ధాత్రీ  సహజంగా వచ్చే మాటలు. ఆంగ్లం లో వాడితే అసభ్యం కావా ? అది పాత్ర మనస్తితిని బట్టీ సహజంగా రాసాను. నచ్చిన వారు చదువుతారు లేని  వారు లేదు.(నవ్వు)

ధాత్రి :  మీ శైలి లోని ఈ చైతన్య స్రవంతి పధ్ధతి కొంత ఇబ్బంది పెడుతుందని అంటుంటారు మీరు కావాలనే ఈ పద్ధతిని ఎన్నుకున్నారా మీ రచనకి ?

వేణు: అవును అవును. నేను కావాలనే ఎన్నుకున్నాను మనిషి ఎప్పుడూ ఒకే ఆలోచనతోనూ చైతన్య స్థాయి లోనే ఉండడు . మూడు చైత న్యావస్థలు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయ్. అందుకు ఆ పద్ధతిని ఎన్నుకున్నాను . నేను ఎలా ఆలోచిస్తానో అలా రాస్తాను.

ధాత్రి : దాని వల్ల  ప్రయోజనం ఏమి ఆశిస్తున్నారు ?

వేణు : ప్రయోజనం హహ ఒక రచన మనసును మేల్కొలపాలి , మెదడుకు పదును పెట్టాలి , మనసుని కరిగించాలి , హృదయాన్ని ద్రవింప చెయ్యాలి అదే ప్రయోజనం సాహిత్యానికైనా చిత్ర కళ  కైనా , సంగీతానికైనా అని నేను నమ్ముతాను ఆచరిస్తాను అక్షరాల్లోకి వంపుతాను.

ధాత్రి  : ధన్యవాదాలు వేణుగోపాల్ గారు మీ రచనల నేపధ్యం గూర్చి వివరించినందుకు నమస్తే.