గెస్ట్ ఎడిటోరియల్

విషాద బీభత్స వర్తమానంలో తాత్విక సత్యాల సౌందర్యం

ఫిబ్రవరి 2013

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథల్లో ఏ ఒక్కటి చదివినా నిస్సందేహంగా ఒక ప్రగాఢమైన అనుభవం కలుగుతుంది. ఆ కథ చదవక ముందరి మనఃస్థితికీ చదివిన తరవాత మనఃస్థితికీ తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఆ కథలు కాలక్షేపానికీ ఉబుసుపోకకీ అలవోకగా చదివేవి కావు. అవి వెంటాడే కథలు. మెల్లమెల్లగా ఆలోచనల్లో బలపడే కథలు. ఆ కథల్లో మామూలు జీవితమే ఉండవచ్చు, మనకు బాగా తెలిసిన పాత్రలూ, హావభావాలూ, వ్యక్తీకరణలూ ఉండవచ్చు. మనకు తెలిసిన కష్టాలూ క్లేశాలూ మాత్రమే ఉండవచ్చు. బహుశా మనం పక్కకు పెట్టదలచుకున్న నిరాశామయ పరిస్థితి మరింత నగ్నంగా, భయానకంగా కూడ ఉండవచ్చు. ఆ కథల్లో గొప్ప శైలీ శిల్ప విన్యాసాలు లేకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికీ అనుభవైకవేద్యమైన, విశ్వసనీయమైన జీవిత చిత్రణే ఉండవచ్చు. ఇది మాకు తెలియనిదా అనీ అనిపించవచ్చు. సుబ్బరామయ్య కథనంలోని విశిష్ట లక్షణం ఏమంటే, ఆ అతి సాధారణ విషాద, బీభత్స వర్తమానంలో నుంచే ఆయన అత్యద్భుతమైన తాత్విక, విశ్వజనీన, సార్వకాలిక జీవన తాత్విక సత్యాలను రాబట్టారు. లేదా, ఆ సత్యాల గురించి ఆలోచించడానికి పాఠకులను రెచ్చగొట్టారు. ప్రేరేపించారు.

సుబ్బరామయ్య కథలలోని ఈ ప్రధాన స్వభావాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ఉదాహరణ ప్రాయంగా అలజడి (? 1969 తర్వాత కావచ్చు), పూర్ణాహుతి (?), నీళ్లు (1965), ఇంగువ (1997) అనే నాలుగు కథల గురించి మాట్లాడుకోవాలి. అవి నాలుగూ భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి, భిన్నమైన ఇతివృత్తాలతో వ్యక్తీకరణ పొందిన కథలు. అయినా ఆ నాలుగు కథల ద్వారా సుబ్బరామయ్య వివరించినదీ, విశ్లేషించినదీ సమాజ జీవితంలో అడుగడుగునా విస్తరించిన విషాదమూ, ఆ విషాదం వెనుక దాగిన తాత్విక సత్యాలూ.

వలసానంతర తరపు నిరుద్యోగ నిరాశా నిస్పృహలకు, అలజడి నిండిన జీవితానికి అద్దం పడుతుంది అలజడి కథ. స్వాతంత్ర్య సమరయోధుడి కొడుకు, న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి నిరుద్యోగంలో, నిరాశతో ఆత్మహత్య చేసుకోబోయి, విఫలమై, కేసు పాలయి, కోర్టు హాలులో మతి చలించిన యువకుడి కథ ఇది. స్వాతంత్ర్యం తర్వాత స్వయం నిర్ణయాధికారంతో, స్వావలంబనతో భారతీయుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుందని కన్న కలలు కల్లలై, యథాస్థితి రాజ్యమేలుతున్నప్పుడు, స్వాతంత్ర్యానంతర యువతరపు ప్రతినిధి నిరుద్యోగానికీ, నిరాశకూ, ఆత్మహత్యా ప్రయత్నానికీ, రాజ్యవ్యవస్థ మొరటు విచారణా ప్రక్రియకూ, మతి భ్రమణానికీ బలి కావడం వంటి పరిణమాలకు ప్రతీకాత్మక చిత్రణ. నాయక పాత్ర పేరు గాంధీ కావడం మరింత లోతైన ప్రతీకాత్మక కవితాన్యాయం.

రాజకీయ, సామాజిక నేపథ్యం ఇలా దిగజారుతుండగా, దానికి సమాంతరంగా వ్యక్తిగత, సాంస్కృతిక పతనం ఎలా సాగుతున్నదో చూపడానికి పూర్ణాహుతి కథ ఒక ఉదాహరణ. కేవలం ఒక చిన్న భిన్నాభిప్రాయం ప్రకటించినందుకు తోటి బ్రాహ్మణుడ్ని, అది కూడ అతి హీనమైన శని దానాలు పట్టే నిస్సహాయ, నిర్భాగ్య సహచరుణ్ని దూరం కొట్టి, వెలివేసి, విదిలించి, కక్ష తీర్చుకునే ఆధిపత్య ధోరణి ఎలా ప్రవేశిస్తున్నదో, బలపడుతున్నదో పూర్ణాహుతి చూపుతుంది. ఒక పూట అన్నం మెతుకుల కోసం మనుషుల మధ్య కుత్తుకలు ఉత్తరించుకునే పోటీ తత్వం ఎలా బలిసిపోతున్నదో ఈ కథ చూపుతుంది.

ఒకవైపు రాజకీయ, సామాజిక, ఆర్థిక, నైసర్గిక నేపథ్యాన్నీ, మరొకవైపు వ్యక్తిగత, సాంస్కృతిక ధోరణులనూ కలగలిపి జీవితంలోని అన్ని రంగాలలోనూ విషాదం ఎంతగా వ్యాపిస్తున్నదో, అది “నాగరికత” (నీళ్లు అని చదువుకోవాలి) లేని ప్రాంతం నుంచి వచ్చిన అభాగ్యుడిని ఎంతగా గాయపరుస్తుందో, చివరికి ఆ అభాగ్యుడి అంతానికి ఎలా దారి తీస్తుందో చెప్పిన కథ నీళ్లు. “నాగరికత” అని మన సాధారణ భావజాలంలో బలపడిన భావనకు అనివార్య అంతం ఏమిటో బహుశా ఈ కథలో సూచన ఉందేమో.

ఇక ఇంగువ కథ చాల మామూలు ఇతివృత్తంలా కనిపిస్తూ నిగూఢమైన తాత్విక జీవిత సత్యాన్ని వెల్లడిస్తుంది. “మన జీవితంలో చాలా విషయాలు తెలుసుకోకుండానే వెళ్లిపోతాం… ఉదాహరణకు నువ్వు రోడ్డు మీద పోతూ ఉంటావు. అవతల దూరంగా ఎవరినో చూడాలనుకుంటావు…కాని ఏ లారీయో, ట్రక్కో అడ్డం వస్తుంది. అంతే… అవతలి మనిషిని ఎప్పటికీ చూడలేవు. అలాగే ఒకప్పుడు ఏదో అనుమానం వస్తుంది. అది తీరకుండానే ఉండిపోతుంది. ఆ అనుమానం తీర్చుకుందామనే అనుకుంటూ ఉంటాము. కాని వీలు పడదు. ఎప్పటికీ వీలు పడదు. ఏదో చూడాలని అనుకుంటాము. కాని చూడటం ఎప్పటికీ కుదరదు. అలానే కాలం అంతా గడిచిపోతుంది. చివరకు అట్లాగే చచ్చిపోతాము…” అని ఆలోచించిన వ్యక్తి కథ. అటువంటి తెలుసుకోలేకపోయిన అనేకానేక అతి స్వల్ప విషయాలలో ఒకటి ఇంగువ ఏమిటి అనేది. మృత్యువు అంచుల్లోనైనా అది తెలుసుకుందామని ప్రయత్నించి, తెలుసుకోకుండానే చనిపోయిన వ్యక్తి కథ ఇది.

స్వల్ప విషయాలు మాత్రమే కాదు, జీవితానికి అత్యవసరమైన, అతి కీలకమైన, ప్రధానమైన విషయాలు మాత్రం తెలుసుకుంటున్నామా? మనిషిని జంతుజాలం నుంచి వేరు చేసే కుతూహలం ఎక్కడ లుప్తమైపోతున్నది? కుతూహలాన్ని కొనసాగించే అన్వేషణ, సాధన ఎందుకు ఆగిపోతున్నాయి? విడివిడి మనుషులు సరే, అసలు సమాజానికి మొత్తంగానైనా తన గురించిన అతి ప్రధానమైన విషయాలు తెలుసునా? “లోకమందలి మంచి చెడ్డలు లోకులెరుగుదురా?”

మతిభ్రమణంతో, ప్రమాదంతో, మరణంతో అంతం కావడం ఈ కథల మరొక ప్రత్యేకత. దాదాపు
అన్ని కథలూ ఇలా విషాదాంతాలు కావడం ఒక అంశమైతే, అవి ఆ బీభత్సాన్నీ విషాదాన్నీ చిత్రించినప్పటికీ చదువరులలో నిస్పృహను కలిగిస్తాయని చెప్పలేం. ఆలోచనలు కలిగిస్తాయి. యథాస్థితి మీద కసి రగిలిస్తాయి. ఇది ఇంతేనా, ఏమీ చేయలేమా అనే విచికిత్సకు పురికొల్పుతాయి. దాదాపు ప్రతి కథలోనూ ఆశాసూచికలుగా నిలపదగిన స్వల్పరేఖలైనా ఉంటాయి. ఆ ఆశాసూచికలు వివరంగా ఉండకపోవచ్చు, రేఖామాత్రంగానే ఉండవచ్చు, కాని విషాదమే సర్వస్వం కాదని, స్వార్థానికీ, ఆధిపత్యానికీ, హేళనకూ, దౌర్జన్యానికీ, అసంతృప్తికీ, మరణానికీ ఆవల త్యాగం, సమానత్వం, ఆత్మగౌరవం, ప్రతిఘటన, సంతృప్తి, మరణం రద్దు చేయలేని జీవనగమనం కూడ ఉన్నాయనే సూచనలూ ఉంటాయి.

ఇంత లోతయిన విషయాలను నిరలంకారంగా, చాల మామూలుగా, పెద్ద శైలీ శిల్పాల ఆర్భాటం, పదాడంబర, వర్ణనా పటాటోపం లేకుండా చెప్పడం సుబ్బరామయ్య కథనపద్ధతిలో మరొక విశిష్టత. నిజానికి ఆయన కథన శైలి ప్రత్యేకత  నిరలంకార శైలి కావడమే కావచ్చు.

విషాదాన్ని చిత్రించిన కథలు అనే చిన్నచూపుతో సుబ్బరామయ్య కథలకు రావలసినంత గుర్తింపు, విశ్లేషణ, స్థానం రాలేదేమోననిపిస్తుంది. నిజానికి ఈ కథలు కథకులకు పాఠ్యగ్రంథాలు కావలసినంత లోతయిన కథలు. ఇతివృత్తంలో, కథా నిర్మాణంలో, తాత్విక గాఢతలో, పాత్ర చిత్రణలో వర్తమాన, భవిష్యత్ కథకులకు ఆయన కథలు నేర్పగల పాఠాలెన్నో ఉన్నాయి. సుబ్బరామయ్య కథలను పునరధ్యయనం చేయవలసిన, పునరన్వేషించవలసిన, పునర్విశ్లేషణ చేయవలసిన అవసరం ఉందేమో. అది మరింత పెరుగుతున్నదేమో. ఆ పునరధ్యయనానికి సమాజంలో జీవితంలో విషాదం పెరుగుతున్న వర్తమానమే తగిన సమయమేమో…

 

          ఎన్ వేణుగోపాల్

జనవరి 25, 2013