జిడ్డు కృష్ణముర్తి అంటాడు – ‘the moment you have in your heart this extraordinary thing called love and feel the depth, the delight, the ecstasy of it, you will discover that for you the world is transformed’
ఒకానొక కాలంలో అట్లా నలుపు తెలుపుల సాదా సీదా ప్రపంచంగా సాగిపోతూ వున్న నీ ప్రపంచాన్ని వర్ణమయం చేసిన ఆ జ్ఞాపకం చాలా కాలం తరువాత సజీవంగా ఏ బస్సు స్టాండ్ దగ్గరో ఎదురైతే చెలరేగే భావోద్వేగాలు ఎట్లా వుంటాయి? ఒక తీయని బాధకు గురి చేసే ఆ భావోద్వేగాలను అనుభవంలోకి తెచ్చుకునేందుకు కవి ‘రామా చంద్రమౌళి’ రాసిన ఈ కవిత చదవండి -
తరుముకొచ్చే జ్ఞాపకాలు
‘గాజుగోళీల్లా దొర్లుతూ వస్తున్నాయి జ్ఞాపకాలు బరువుగా
పూల తెప్పలై కొట్టుకుపోతున్నాయి అనుభవాలు
నడుమ నేను కడిగిన అద్దంలా మిగిలి
నాపై వర్షించబోయే ఓ
కాంతి బిందువు కోసం ఎదురు చూస్తున్నాను
బస్సు స్టాండులో నిన్న కలిసిన ఆమె
కళ్ళతో ఒక రస ప్రపంచాన్ని నాలోకి
సంధించి వెళ్ళిపోయింది సంధ్యలోకి
చూపులు నవ్వులై
నవ్వులు భాషణలై
భాషణలు బతుక్కు ఊపిరులై
స్మృతి ఇప్పుడీ జీవితాన్ని ఏలుతున్నది
నిరీక్షిస్తున్నాను సంధ్యలో నుండి
మరో ఉదయం కోసం
ఓడను ఒక చిన్న లంగరు జయించినట్టు
ఆమె ఒక్క స్మృతి హృదయాన్ని జయించి
నడిపించుకు పోతున్నది
కాంతి వనాల లోకి శాంతి వనాల లోకి
ఏండ్ల కాలాన్ని త్రాగుతూ నడిచి నడిచి
చూపులతో ముత్యపు చిప్పలా
హృదయ దళాలను చీల్చుకుంటే మిగిలిందేమిటి ?
మధురానుభూతిలో జ్వలిస్తూ తరుముకొచ్చే ఓ జ్ఞాపకం !’ (ఆంధ్రప్రభ – 1982)
కవితని ప్రారంభించిన తీరు చూడండి -
ఒక వైపు జ్ఞాపకాలను తరుముకొచ్చే బరువైన గాజుగొళీలతో పోలుస్తూ, అనుభవాలు మాత్రం పూల తెప్పల్లా కొట్టుకుపోతున్నాయి అంటున్నాడు. అంతటితో ఆగిపోకుండా, నడుమ కడిగిన అద్దంలా మిగిలి, మీద వర్షించబోయే కాంతి బిందువు కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నాడు.
ఈ కడిగిన అద్దంలా మిగలడం ఏమిటి ?
ప్రేమానుభవంలో మునిగి కొట్టుకు పోయిన స్థితిలో తప్ప ఇట్లా ‘కడిగిన అద్దం’ లా మిగలడం సాధ్యమేనా ?
ఓషో అంటాడు – ‘ When you love, love as if the person is a God, not less than that. Never love a Woman as a Woman and a man as a Man’. బహుశా, ప్రేమకు ఆత్మను శుద్ధి చేసే శక్తి ఏదో వుంటుంది … అందుకే, అది ప్రేమలో వున్న వారిని ‘కడిగిన అద్దం’ లా మిగుల్చుతుంది.
మరి, ఈ వర్షించే కాంతి బిందువు కోసం ఎదురు చూడడం ?
నెరూడా తన ప్రసిద్ధ ప్రేమ కవితలలో ఎక్కడో అంటాడు -
‘Tie your heart at night to me, love
And both will defeat the darkness’
‘పెనవేసుకున్న రెండు హృదయాలు చీకటిని జయిస్తాయి’
బహుశా, ప్రేమించిన మనిషి భౌతికంగా దూరమైనా, ఆ మనిషి జ్ఞాపకం కూడా ఒక కాంతి బిందువై వర్షించి, చీకటిని జయిస్తుంది!
‘చూపులు నవ్వులై
నవ్వులు భాషణలై
భాషణలు బతుక్కు ఊపిరులై
స్మృతి ఇప్పుడీ జీవితాన్ని ఏలుతున్నది’ అని చెప్పడంలో ఇద్దరి నడుమ ప్రేమ చూపులతో మొదలై ముందుకు సాగి, భౌతికంగా ఎక్కడో ఆగిపోయి, చివరికి ఒక స్మృతిగా హృదయంలో మిగిలిపోతుంది అన్న అర్థం వున్నది.
‘ఓడను ఒక చిన్న లంగరు జయించినట్టు
ఆమె ఒక్క స్మృతి హృదయాన్ని జయించి
నడిపించుకు పోతున్నది’ అనడంలో ఒక శ్లేష వుంది.
నిజానికి లంగరు ఓడను ఒక చోట కట్టివేసి పెడుతుంది. కానీ, ఆమె స్మృతిని ఓడ లంగరుతో పోల్చి ‘నడిపించుకు పోతున్నది’ అంటున్నాడు. ఆమె స్మృతి, ఓడను ఒడ్డున కట్టివేసి వుంచే ఒక లంగరులా హృదయాన్ని ఒకానొక కాలంలో బంధించి పెట్టినా ‘నడిచిపోతున్నాము’ అనుకోవడమే వైచిత్రి!
అట్లా అనుకున్నాడు కాబట్టే ఆ ప్రయాణం ‘కాంతి వనాల లోకి’, ‘శాంతి వనాల లోకి’ సాగింది.
అట్లా అందంగా ఊహించుకున్నాడు కాబట్టే, హృదయం ఒక పూవులా తోచింది.
ప్రేమలో వున్నపుడు అంతః చక్షువులు తెరుచుకుంటాయి కాబట్టే, ‘చూపులతో ముత్యపు చిప్పలా హృదయ దళాలను చీల్చి, మధురానుభూతిలో జ్వలిస్తూ తరుముకొచ్చే జ్ఞాపకాన్ని’ దర్శించుకున్నాడు!
అంతః చక్షువులతో హృదయం లోపల పదిలంగా వున్న స్మృతులను దర్శించుకోగలిగే గొప్ప శక్తిని ఇచ్చి మనల్ని మనుషులుగా మిగిల్చడమే కదా జీవితంలో ప్రేమ ఇచ్చే గొప్ప బహుమతి!
మరి, జీవితానికి ఇంత గొప్ప శక్తిని ఇచ్చే ప్రేమ కవితల పట్ల తెలుగు సాహిత్యంలో సరైన గౌరవం ఎందుకు దక్కలేదు?
ఇదంతా సరే గానీ, ఒక సారి మీ ‘హృదయ దళాలను చీల్చుకుని’ చూసుకున్నారా ?
**** (*) ****
విజయకుమార్,
చాలా విపులమైన చక్కని సమీక్ష రాశావు.
ధన్యవాదాలు.
– రామా చంద్రమౌళి
మంచి విశ్లేషణ చేశారు
విలాసాగారం రవీందర్ గారు …. మీ అభినందనకు కృతజ్ఞతలు !
చంద్రమౌళి సార్! నా వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం ! మీరు నాకు ‘ధన్యవాదాలు తెలపడం’ అంటే నాకు ఇబ్బందిగా వుంటుంది !
Gyaapakaalu chaala baleeyamainavi. GULZAAR tana oka geetam lo antaaru:
“Naam gum jaayeega… Chehra yeh badal jaayeega..
Meri aawaz hee pehchaan hai… Agar yaad rahee…”
Peeru, ee deham marachinaa naa vaani matrame oka baleemaina gurtu ani swechchaanuvadam cheya vachu.