మావూరి ముచ్చట

తాగుబోతు

మార్చి 2016

మా లచ్చుమత్త, కొండప్ప మామల కత ఇది. వీళ్ళకి బిడ్డలు లేరు. అయితే తినే దానికీ కట్టేదానికీ కొదవలేదు. ఏదో ఆ పూటకు ఈ పూటకు బాగనే జరిగిపోతాది ఇద్దరికీ. చుట్టాలు పక్కాలు ఎవరైనా వస్తారు పోతారంటే అది మామను చూసే. ఇరుగు పొరుగు కానీ అయిన పొయినోల్లు కానీ అత్తను మటుకు ‘మంచిది’ అనరు. అంత పిసినారిది మా యత్త. ఎంగిలి చేత్తో కాకికి కూడా వేయదు ,పీతిలో రూపాయి పడితే నాలికి తో అద్దుకుంటాది. అయితే కాపరాన్ని మటుకు బాగా దిద్దుకుంటాది.

మామకు తాగే అలవాటు ఉండాది. అయినా మా అత్త ఆయన్ని ఇష్టంగా చూసుకుంటాది. మామ కూడా ఆ యమ్మని అట్లే చూసుకుంటాడు. ఒకరంటే ఒకరికి బలే నెత్తవ వాళ్లి ద్దరికీ. కానీ బిడ్డలు లేరు అని ఎప్పుడూ వెతపడతా ఉంటాది అత్త.

ఆ పొద్దు మామ అడివంటి పొయి అడివిపందిని కాల్చుకొని వచ్చినాడు. వస్తా వస్తా సుగాలోళ్లు కాసిన నాటుసారాయి ఒక కాయిని ఇంటికి ఎత్తుకోని వచ్చినాడు. ఇప్పుడంటే ఫుల్లూ, ఆఫూ, కోట్రూ అంటుండారు కానీ అప్పుడంతా కాయీ అరకాయీ అనేవాళ్లు. కాయి అంటే పెద్దబీరుబాట్లు అంత. అత్త, పందితునకల్ని కూరచేసి పెట్టింది.

మామ, సారాయి తాగదామని కాయిసారాయిని తెచ్చి ముందర పెట్టుకున్నాడు. పంది తునకల కూరని గిన్ని నిండా వేసుకుని కుచ్చున్నాడు. అత్త మొగం కల్లా ఎగ చూసినాడు. అత్తకు మనసు బాగలేక మొగం నల్లంగా పెట్టుకుని ఉండింది

అది చూసిన మామ ‘‘ఏలనే అట్లుండావు?’’ అని అడిగినాడు.

‘‘ఏముండాది, ఎంత బతుకు బతికినా మనమిద్దరమే కదా. బిడ్డా పాపాలేని గొడ్డు బతుకు అయిపోయెనే’’ అనింది అత్త వెతపడతా.

‘‘సరే దేవుడు ఈయందే ఏమి చేసేకి అయితుంది. ఇట్ల రా, నీ వెత పొయ్యేకి నాకాడ ఉపాయం ఉండాది’’ అని అత్తను పిలిచి పక్కన కుచ్చనపెట్టుకున్నాడు మామ. ఒక లోటాలో సారాయి పోసిచ్చి “ఇది ఒక గుటక తాగి ఒక తునకను తిను, బాద తగ్గతాది’’ అంటా అత్తకు ఇచ్చినాడు.

‘‘నాకొద్దప్పా, నేనెప్పుడూ తాగిండ్లేదు. అయినా ఊర్లోవాళ్లకు తెలిస్తే ఏమనుకుంటారు, పెండ్లాము కూడా తాగుతుంది, అదేమి కొంప అంటారు, నేను తాగను’’ అనింది అత్త.

‘‘వానెక్క, ఒకరి జోలి మనకేల , నువ్వు తాగు, ఎవురేమంటారో అనెంక చూసుకోవచ్చు’’ అంటా బలవంతంగా అత్తచేత తాగిపిచ్చి, తినిపిచ్చినాడు మామ. ఆపొద్దు వాళ్లిద్దురూ తినీతాగీ కేళీవిలాసంగా ఉండిపోయిరి.

ఆపొద్దంటే ఏదో మందు ఎక్కువై పోసినాడు కానీ దినమ్మూ పోస్తాడా! అత్తేమో రుచి మరిగింది కదా, ఈయప్ప తాగినప్పుడల్లా ఆయమ్మకు నోరు పెరికేది. దాంతో మామకు తెలవకుండా సైగ్గా రెండుమూడు గుక్కలు తాగేసి, ఆ వెలితికి నీళ్లు పోసేసి మామకు ఇచ్చేది.

మాయత్త మెల్లిమెల్లింగ అరలోటా నింటి లోటా, లోటా నింటి రెండు లోటాలు ఇట్ల దినదినానికీ ముదరతా వచ్చింది. ఒకనాడు ఒళ్లు నొప్పుల నీ, ఒకనాడు తల నొప్పనీ తాగేది. ఇష్టంగానూ తాగేదే, కష్టంగానూ తాగేదే. నయానా తాగేదే బయానా తాగేదే. కడాకి, దినమ్మూ నిదరలేస్తానే కాయిసారాయి కావాల, లేదంటే రంపే. ఇంక చేసేది ఏముండాదని మామ, ఆయప్ప తాగేసి ఆయమ్మకు కూడా తెచ్చిచ్చేది. ఇట్లే ఏండ్లు గడిచినాయి.

వయసు ముదరంగా ముదరంగా మాయత్త పెద్ద తాగుబోతు అయింది. నిదర లేస్తానే ఒక కాయి తాగేసి అన్నంకూరా చేసేది. మళ్లా అన్నం తిన్నాక ఇంకొక కాయి తాగేది. ఇట్ల దినానికి మూడు కాయిల్ని లేపేసేది. అయితే అత్త దగ్గిర ఒక కిటుకుండాది, ఒక పీపాయి తాగినా కూడా ఈయమ్మ తాగిందా అని ఎవురూ తెలుసుకోలేరు. ఈ సమాచారంలో, పెపంచంలో ఉండే తాగుబోతుల్ని అందర్నీ పిలుసుకొచ్చి పోటీ పెడితే కూడా మాయత్తే గెలస్తాది. ఎంత తాగినా, ఎంత నిదరపోతుండినా, నడుములో ఉండే డబ్బుతిత్తిని అంటుకుంటే చాలు ఆయమ్మకు మెలుకువ వచ్చేస్తాది.

ఇప్పుడు ఆయమ్మకు అరవై ఏండ్లు వచ్చినాయి. ఈ నడమ మామకు ఒళ్లు బాగలేకుండా వచ్చింది. డాకటర్లు, మామని సారాయి తాగద్దు అనేసిరి. ఆయప్ప తాగేది మొగించేసినా కూడా, అత్తకోసం మందు తెచ్చి నిలవపెడతుంటాడు.

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాల, తాగాలంటే మా అత్తతో కుచ్చునే తాగాల.

**** (*) ****