కథ

లఘుచిత్రం

ఏప్రిల్ 2016

సీట్ బెల్ట్ పెట్టుకోబోతూండగా … కాల్ వచ్చిన వచ్చిన శబ్దం. ఎవరో అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. అభి నుండి కాల్. ఎంతో అవసరమైతే తప్ప కాల్ చేయడని తెలిసిన నేను .. ఆన్సర్ చేసాను.

“రాజా బాబూ! షార్ట్ ఫిల్మ్ షూటింగ్,ఎడిటింగ్ అన్నీ పూర్తై పోయాయి. యు ట్యూబ్ లో అప్లోడ్ చేసాను. మీరు చూసి ఎలా ఉందో చెప్పాలి ” అన్నాడు.

ఆఫీస్ కి వెళుతున్నాను అభీ. ఎలా ఉందో చూసి సాయంత్రానికల్లా చెపుతాను. అయినా నువ్వు చాలా బాగా తీసి ఉంటావ్ ! ” అన్నాను.

“ఎందుకో.. కొంచెం జంకుగా ఉందండీ ..ఎలా రిసీవ్ చేసుకుంటారోనని. నేనాశించిన ప్రయోజనం కొంచెమైనా దక్కితే చాలు. పడిన కష్టమంతా మర్చిపోతాను ”

“నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావ్! ధైర్యంగా ఉండు”

కాల్ కట్ అయినాక “అభి ” షార్ట్ ఫిల్మ్ గురించి ఆలోచిస్తూ …. అతనికిప్పటికి రియల్ స్టోరీల కోసం వెతుక్కునే అవసరం తీరినట్లుంది. ఇంతకీ అతడు తీసిన చిత్రంలో దేవసేన కథ ఉంటుందా ? ఉండే ఉంటుంది, అందులో నాకెలాంటి సందేహం లేదు. ఆమె పాత్ర లేకుండా అభి చిత్రం తీయడమే !? నెవ్వర్ ! అభి చెప్పిన ఆమె కథ విన్న నేనే ఆమెని మర్చిపోలేకపోతే అభి ఎట్లా మర్చిపోతాడు ? ఆమె ఇప్పుడెలా ఉందో … . వాళ్ళ గుడిసెలు ఉన్నాయో లేవో .. కాలువ కట్టల సుందరీకరణలో భాగంగా వాళ్లకి ఆ గూడు కూడా లేకుండా చేస్తారేమో! పైగా ఇప్పుడది రాజధాని ప్రాంతం కూడా, అనుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూనే ఒక ఏడాది క్రిందటి జ్ఞాపకంలోకి వెళ్ళిపోయాను.

నేను చదువు పూర్తి చేసుకుని ఇంటికొచ్చిన రోజులవి. ఉద్యోగాల వేటలో సఫలమవలేక విసుగొస్తున్న రోజులు కూడా. ఉబుసుపోక కోసం నాన్నతో పాటు పొలానికి వెళ్ళేవాడిని. మా పొలం ప్రక్కనే బ్రిటిష్ వాళ్ళ కాలంలో తవ్వబడిన కాలువ. అది సంవత్సరంలో ఆరు నెలలపాటు నిండుగా ప్రవహిస్తూనే ఉండేది. అందువల్లేనేమో, పేదరికం రైతుకు వుంటుంది కాని పొలానికెందుకుంటుంది అన్నట్టుగా మా చుట్టుపక్కల పొలాలన్నీ పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉండేవి. ఆ కాలువ ప్రక్కనే మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉండేది “అభి” వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్న గమలాళ్ళ కోటేశు. తాడి చెట్లెక్కి కల్లు గీయడం,అమ్మడం చేస్తుండేవాడు. అతనిదీ నా నాన్న వయసే. వాళ్లిద్దరూ ఒకే వూరివారవడం వల్ల ఎక్కువగానే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు.

చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్నప్పటికీ కూడా అభిని చూసినప్పుడు పలకరించడానికి కొన్ని సెకనుల పాటయినా జంకుతాను కానీ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయే శత్రుత్వమేమీ లేదు. రూపం చూస్తే రఫ్ గా ఉన్నట్టు కనబడతాడు. విశాలమైన కళ్ళు. ఆ కళ్ళల్లో ఎర్రటి జీరలు, కోటేరులాంటి ముక్కు, నిర్లక్ష్యంగా పెంచి వదిలేసిన జుట్టు. ఎప్పుడూ చుట్టూ పరిశీలిస్తున్నట్లు గిర గిర తిరుగుతుండే కళ్ళు . నాకున్న కొద్ది పాటి పరిచయంలో అతనిపై మంచి అభిప్రాయం కలగడానికి కారణం అతనొక మంచి ఆర్టిస్ట్ అవడమే. రోడ్డు ప్రక్కనే ఉన్న చిన్న రేకుల షెడ్ లో ఒక భాగంలో అతని స్టూడియో. కళాకారుడిగా ఎన్నో సూక్ష్మ చిత్రాలను రూపొందించడంతో పాటు కొన్ని సామాజిక రుగ్మతలకి బాణం గురిపెట్టి సందేశాన్నిచ్చే చిత్రాలు గీస్తూ ఉంటాడు. అన్ని పత్రికలూ, చానల్సూ అతణ్ని పరిచయం చేసాయి.

అభిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. పదవ తరగతి దాటని చదువు. అయినా ఎదురుగా ఉండే ఇంజినీరింగ్ కాలేజీలో చదివే ప్రతి విద్యార్థి అతనికి స్నేహితుడే! వయోభేదం లేకుండా చిన్నవాళ్ళూ పెద్దవాళ్ళూ అందరూ అతని స్నేహవర్షంలో తడిసిన వాళ్ళే! “అభి” అంటే తెలియని వారు ఉండరేమో! అతను మాత్రం కుటుంబం పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉంటాడని అర్థమవుతూ ఉండేది. భర్తతోపాటు తనూ పని చేస్తూ గుట్టుగా కాపురం నెట్టుకొస్తూ ఉంది తల్లి. పేదరికంలో మగ్గుతూ కూడా గౌరవంగా బ్రతికే కుటుంబం. అభికి పెళ్ళైంది కానీ భార్యెప్పుడూ పుట్టింట్లోనే ఉంటుంది. కాస్త సన్నగా సాధారణంగా ఉంటుందా అమ్మాయి . అతని పెళ్లి అతనిష్టంతో జరగకపోవడం వల్ల భార్య పట్ల అంత ప్రేమగా ఉండడని అతనింటి దరిదాపుల్లో ఉండే ఓ కుర్రాడు చెపితే తెలిసింది.

ఒకరోజు అభీ వాళ్ళ నాన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలిసింది. అప్పుడు నేనూ నాన్నా పొలంలో ఉన్నాం. అభి కోసం బంధువులందరూ ఎక్కడెక్కడో వెతుకుతున్నారని విని ఆ రోజు ఉదయాన్నేఅతను కాలువ కట్ట మీదున్న ఇళ్ళ వైపు వెళుతుండగా చూసిన సంగతి చెప్పాను. అతనిని వెతుక్కొచ్చి జరపవలసిన కార్యక్రమాలు చేస్తూనే కోటేశు లాంటి మంచి వాడికి ఇలాంటి పోరంబోకు కొడుకు ఎట్టా పుట్టాడోనని బంధువులు అనుకోవడమూ విన్నాను. రెండు రోజుల తర్వాత, తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న అభిని పలకరించి ఓదార్పు మాటలు చెప్పి రావాలని నాన్నతో పాటు అతనింటికి వెళ్లాను.

అభి అమ్మ తన భర్త గురించి చెపుతూ “ఆయనకి ఈ మగ పిల్లోడిపై నమ్మకం ఎక్కువ . ఏదో ఒకటి చేస్తున్నాడుగా, చేయనీ. గీతలు గీస్తే ఏంటీ , రాతలు రాస్తే ఏంటీ ? మంచి పేరు తెచ్చిపెడుతూ నాకు గర్వకారణంగా ఉంటున్నాడుగా, అనేవాడు. ఇప్పుడు ఆయన పోవడంతో నడివీధిలో నిలబడ్డాం. ఏం చెయ్యాలయ్యా”అంటూ ఏడుస్తుంది.

తల్లి మాటలతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడతను. “రాజా బాబూ! నేను ఏ పని చేసినా గర్వంగా రొమ్ము విరుచుకుని పదే పదే భుజం తట్టే నాన్నలేడు. ఒరేయ్ అభీ! ఈ కల్లు గీత, రోతా నీకెందుకుగానీ హాయిగా నీ పని నువ్వు చేసుకోరా , ఇంట్లో మంచి చెడు నేను చూస్తానుగా అని భరోసా ఇచ్చేవాడు. అలా నడిరోడ్డుపై నెత్తుటి ముద్దై మిగిలిన సాక్ష్యం నా మెదడులో చిత్రమై నిలిచి పోయింది. కుంచె పట్టుకుంటే ఆ దృశ్యమే మెదులుతుంది. దశదిన కర్మ నాటికి ఎంతో మందికి చిత్రం గీసిచ్చిన నేను మా నాన్న బొమ్మని గీయలేకపోతున్నాను” అంటూ ధారాపాతంగా ఏడుపు. ఇంటికొచ్చాక కూడా ఆ ఏడుపు తరుముతూనే ఉంది. గుండె బరువెక్కింది.

నాన్నలంటే అంతేనేమో! ఉన్నన్నాళ్ళు బరువంతా నెత్తికెత్తుకుంటారు. ఏదో ఒకరోజు చెప్పా పెట్టకుండా పోయి మోయలేని బరువులని మీదేసి పోతారు! మా నాన్నకి కూడా అలా ఏదన్నాజరిగితే ?… ఆ ఊహే భయంకరంగా అనిపించింది. ఉద్యోగం సంగతి ప్రక్కనపెట్టి కుటుంబ అప్పులూ, ఆదాయాలూ, బాధ్యతలూ తెలుసుకుంటూ కాలక్షేపంగా కాకుండా సీరియస్ గా మా నాన్నకి చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాన్నేను.

చేలోకి వెళ్ళేటప్పుడల్లా అభి వాళ్ళింటి వైపుగానే వెళుతూండటం వల్ల కాసేపు ఆగి అతనితో మాట్లాడటం అలవాటైపోయింది. మా మధ్య స్నేహం కూడా పెరిగింది. ఒక రోజు వాళ్ళమ్మ కష్టం సుఖం చెప్పుకుంటూ “ఇంటి భాద్యత మర్చి పోయి పనిపాట ఏమీ లేకుండా తిరుగుతున్నాడు! ఇప్పుడీ సంసారం గతేం కాను? ఆ తిరుగుళ్ళూ ,ఆ బొమ్మలు గీయడాలు మానేసి ఇల్లు గడిచే మార్గం ఆలోచించరా అని చెపుతున్నా వినడంలేదు. కాస్త నువ్వైనా చెప్పు బాబు” అంది .

“ఏదన్నా ఉద్యోగం చేయకూడదూ … నీ టాలెంట్ కి ఏ అడ్వర్టైజింగ్ కంపెనీ వాళ్లైనా పని ఇస్తారు కదా” అన్నాను.

“నాన్న అర్థం చేసుకున్నట్టు అమ్మ అర్థం చేసుకోవడం లేదు రాజా బాబూ! అస్తమాను సాని కొంపలెమ్మట తిరుగుతున్నావ్ అంటుంది” అన్నాడు కొంత నిష్టూరంగా.
“ఆమె అన్నమాటల్లో తప్పేముంది? మీ నాన్న చనిపోయినరోజున కూడా నువ్వు అటువైపు వెళుతుంటే చూసాన్నేను. నువ్వు అన్నం తినడానికి కూడా రాలేదని నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి రోడ్డుపైకి వస్తేనే మీ నాన్నకి అలా యాక్సిడెంట్ జరిగిందని మీ అమ్మ బాధ కూడా”

“అందరికి నేను అటువైపు వెళ్ళడమే తెలుసు ..కానీ నేను ఏం చేస్తున్నానో ఎవరికీ తెలియదు.తెలిస్తే అటువంటి అంచనావేయరు ”

“తాటి చెట్టు క్రింద నిలబడి పాలు త్రాగుతున్నా అంటే ఎవరూ నమ్మరు అభీ! అటువైపు వెళ్ళడం మానుకో!” హితవు పలికాననుకున్నానప్పుడు. మౌనం వహించాడు.

తల్లి పోరు ఎక్కువైంది. తండ్రి పోయిన దుఃఖంలో నుండి బయటపడి చిన్న ఉద్యోగం సంపాదించాడు. కాస్త దారిలో పడ్డాడనుకున్నాక తల్లి మళ్ళీ శాపనార్థాలను పెట్టసాగింది.
ఒకరోజు అక్కడ నేనుండగానే “నీకు పెళ్ళయ్యింది. పెళ్ళాం ఏళ్ళ తరబడి పుట్టింట్లోనే పడి ఉందని గుర్తుకు రాకపోతే ఎలారా? అందరూ చెవులు కొరుక్కుంటున్నారు, నీకు ఆ పిల్లంటే ఇష్టం లేదని. ఆ సంగతేంటో తేల్చి చెప్పేస్తే దానికి మారు మనువైనా చేస్తారు వాళ్లు “. అభికి తల్లి మాటలు చురుక్కుమనిపించాయి.

“మంచి రోజు చూసి నువ్వే కోడలిని ఇంటికి తీసుకురావచ్చుగా?” అంటూ విసుక్కున్నాడు.

“నేనెళ్ళి పిల్లని పంపమంటే పంపుతారు కానీ … నువ్వెళ్ళి అత్తగారింట్లో రెండు రోజులుండి ఆ పిల్లని తీసుకొచ్చుకుంటే బాగుంటుంది రా. వాళ్ళకున్న అనుమానాలు తీరి పోతాయి” అంది ఆమె.

ఇద్దరం కలిసి చేలో నడుస్తూ మాట్లాడుకుంటున్నాం. “అమ్మలు ఎంత మంచి వాళ్ళు! నాన్నఉన్నప్పుడు అమ్మ మాట పట్టించుకునేవాడినే కాదు. అమ్మలది ఎంత ముందు చూపో! ఒకపని చేస్తే నాలుగింతల మెప్పు రావాలనుకుంటారు” అన్నాడు సంతోషంగా నవ్వుకుంటూ.

“మీ ఆవిడని తీసుకొచ్చాక అటువైపు వెళ్ళడం మానేయ్” అన్నా.

“మానేయడం కాదు, నన్ను వెళ్ళనిచ్చేలా ఆమెని ఎలాగైనా ఒప్పించాలి”

“నీకేమన్నా పిచ్చా! అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా?”

“మీరిలా అంటారని నాకు తెలుసు. నేనెందుకు అటువైపు వెళతానో కథంతా చెప్పేయాలి మీకు” అంటూ పసుపు తోట మధ్యలో కూర్చోపెట్టాడు.

వినకతప్పదన్నట్లు కూర్చున్నాను.

“మంచి సబ్జెక్ట్ దొరికితే డాక్యుమెంటరీ చిత్రాలు తీయాలని నాకు ఎన్నాళ్ళుగానో ఒక కోరిక. సబ్జెక్ట్ కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడింట్లో కూడా చెప్పను. కొన్నాళ్ళు ఒక సినిమా డైరెక్టర్ కి అసిస్టెంట్ గా ఉన్నాను.

ఒకసారి అవుట్ సైడ్ బ్రాడ్కాస్టింగ్ కోసం భవానీపురంలో ఉన్న రిహేబిలిటేషన్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ ముంబాయికి అక్రమ ట్రాఫికింగ్ చేయబడే పిల్లలూ, యువతులూ, వ్యభిచారం కేసుల్లలో పట్టుబడి వెనక్కి తిరిగొచ్చినవారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడకపోతే అక్కడే ఉంచి ఏదో ఒక కోచింగ్ ఇప్పించే దశలో వసతి కల్పిస్తారట. మూడంతస్తుల భవనం అది. లోపల చాలా ఖాళీ స్థలం. చుట్టూ ఎత్తైన గోడలు. ఇనుప కంచె వేసి ఉంది. గట్టి బందోబస్తు. అందులోకి వెళ్ళినవాళ్ళు మంచి మనుషులుగా మారి బయటకి రావడానికి ఎన్నో అవకాశాలు. కౌన్సెలింగ్ తరగతులు, విద్యా కోర్సులు అన్ని సదుపాయాలూ ఉండేవి. కానీ అక్కడి నుండి తప్పించుకుని పారిపోదామని చూసేవాళ్ళూ, వాళ్ళ కోసం వచ్చే పాత యజమానులు, కొత్త విటులూ, ఎందరో ఉండేవారక్కడ.

పోగ్రాం రికార్డింగ్ చేయడం మొదలెట్టాను. వారు చెప్పుతున్న కథలు వింటుంటే ముందు భయం, తర్వాత గగుర్పాటు. అందరి కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీరు. మగవాడు ఏడవకూదన్నది కూడా మర్చిపోయాం. తర్వాత గడ్డ కట్టిన మౌనం. జీవం లేని వాళ్ళ కళ్ళూ , చిన్న చిరునవ్వు కూడా పూయని వాళ్ళ ముఖాలు, నిర్లక్ష్యం, కాఠిన్యం నిండిన మాటలూ, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వెకిలిగా నవ్వుకోవడాలూ. రెండు గంటల రికార్డింగ్ సమయంలో రెండొందల మంది పతితుల దీనావస్థ గుండెల్ని పిండేసింది. అన్నం కూడా తినాలనిపించలేదు. అసలెందుకు వాళ్ళు బ్రతికి ఉన్నారనిపించింది . రెండో రోజు వాళ్ళ కథలు వినడానికి ధైర్యం చాల్లేదు. నేనక్కడికి వెళ్ళలేక ఇంకొకరిని పంపించాను. దాదాపుగా అందరివి అవే కథలు. అదే స్వార్థం, అదే వ్యాపారం, అవే రోగాలు, దిక్కుమాలిన చావులు. నెల రోజులవరకు మనిషిని కాలేకపోయాను.శారీరక సంబంధమంటేనే అసహ్యమేసింది. ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది. మన భద్రవలయంలో నుండి కాలు బయటకి పెట్టి ఆ లోకంలోకి చూస్తే తెలుస్తుంది, లోకం ఎంత హీనమయ్యిందో! వాళ్ళని అర్థం చేసుకునే కాస్తంత హృదయం, చెమ్మగిల్లిన కన్నూ, అప్పుడప్పుడు వాళ్ళ ఆకలిని కనిపెట్టి అన్నం పొట్లం అందించే చేయి.. ఓ చిన్న పలకరింపూ. మనం వీటికి పెద్దగా ఏం ఖర్చు పెట్టవసరం లేదుగా రాజా బాబూ!”

“నువ్వొక్కడివే ఎంతని చేయగలవ్? వాళ్ళ ఖర్మ అనుకుని వదిలేయాలి. అనవసరంగా నీ పై చెడ్డ ముద్ర పడుతుందిగా?”

“ఆ గుడిసెలలో ఉండే వాళ్ళంతా మనవూరి వారు కానే కాదు. ఎక్కడె క్కడనుండి వచ్చారో తెలియదు కానీ .. సాయంత్రానికి రోడ్డుపైకి చేరిపోతారు. విటులు దొరికితే పండగే! వయసుమళ్ళిన కొంతమంది పనిలేక అడుక్కుంటారు. అలాంటి వాళ్ళకే కాస్త అన్నం పెడదామని ప్రయత్నం. నేను వాళ్లకి గొప్పగా చేసే సాయమేమీ లేదు. నా చేతిలోకి కాసిని డబ్బులు రాగానే హోటల్ కి వెళ్ళి ఆ డబ్బులకి సరి పడా రోటీ, కూర ప్యాక్ చేయించుకుని సైకిలెక్కి వాళ్లిళ్ళకి వెళ్ళి ఇచ్చేసి వస్తుంటాను. మనం చేసే మంచి పని లోకం దృష్టిలో చెడ్డగా కనబడితే దానికి మనమేం చేయలేం, లోకాన్ని చూసి జాలి పడటం తప్ప. వ్యక్తిగతంగా నేను చేసేదే కాకుండా నా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వాళ్ళు అనాథ శరణాలయానికి ఇచ్చే విరాళాలని కూడా వాళ్లకిచ్చేస్తాను. అనాథ పిల్లలంటే ఎవరో ఒకరు జాలి చూపుతారు కానీ.. వాళ్లకి సాయం చేయడానికి మాత్రం ఎవరూ రారు. అదే విషాదం”

“ఈ.. మనిషే దిగజార్చిన పతితలు.. ఎవరో తెలుసా.. వీరెవరో తెలుసా? మన రక్తం పంచుకున్న ఆడపడచులు.. మనం జారవిడుచుకున్న జాతి పరువులు.. మానవుడు దానవుడు సినిమాలోని పాట గుర్తుకొస్తుంది అభీ”

“తెర మీద కనబడే జీవితాలకన్నా విషాదకరమైన జీవితాలు వాళ్ళవి. రోజుకొకరి దగ్గరకెళ్ళి కూర్చుంటాను, వాళ్ళ కథలడిగి తెలుసుకుంటూ ఉంటాను. కొందరు ధనవంతుల కుటుంబాలలో పుట్టినవారూ, ప్రేమ పేరిట మోసపోయినవారూ ఉంటారు. వారి కథని చెపుతూ పొగిలి పొగిలి ఏడుస్తూ ఉంటారు” విచారంగా చెప్పాడు.
“ఇంకా ఎన్ని కథలు సేకరించాలి? షూటింగ్ ఎప్పుడు మొదలెడతావ్?” ఆసక్తిగా అడిగాను.

“మీరొక విషయం వింటే ఆశ్చర్యపోతారు. వాళ్ళు మానాభిమానాలులేనివాళ్ళని, ఉచ్చనీచాలు మరిచిన వాళ్ళని తేలిగ్గా చూస్తాం కానీ… వారిలోనూ ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ఒకామె తన కథ చెప్పింది. మీకు వినే ఆసక్తి ఉంటే ఆ కథ చెపుతాను. ఆ కథనే లఘుచిత్రంగా తీయాలని నిర్ణయించుకున్నాను కూడా”
“చెప్పు ..చెప్పు” ..అర్జంట్ పని మానుకుని ఆ కథ కూడా వినడానికి రెడీ అయిపోయాను.

“ఒకసారి దేవసేన అనే ఆమె వద్దకి వెళ్లాను. వయసు ముప్పై ఆయిదు నలబై యేళ్ళ మధ్య ఉంటుందేమో. అందంగానే ఉంటుంది. మందు కూడా తాగుతుంది. అసలే వాగుడెక్కువ. మందేసుకుంటే ఇంకా ఎక్కువ వాగుడు. భరించలేం. సమాజపు వికృత రూపాన్ని వికృతమైన భాషలో తిట్టిపోస్తుంది. ఆమె ఇంటికి వెళతానంటున్నావ్ జాగ్రత్త ! అదసలు ఆడదే కాదు అని హెచ్చరించాడు నా ఫ్రెండ్. ఏమైనాసరే వెళ్లి తీరాలనే అనుకున్నాను. వెళ్ళేటప్పుడు బిర్యానీ, ఐస్ క్రీమ్ తీసుకువెళ్ళాను. తృప్తిగా తినడం చూసాను. తర్వాత నా కోరికని తీర్చుకోమని ఆహ్వానం పలికింది. నేనేమి బదులు పలకలేదు. నన్ను రెచ్చగొడుతూ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా నేను చలించలేదని మగాడివి కాదా అని కూడా అవమానించింది. నేను సమాధానం చెప్పకుండా ఆమె ఇంటి నుండి బయటకి వచ్చేసాను.

తర్వాతెప్పుడో ఆమె తల్లి చనిపోయి మరీ కష్టాలలో ఉందని తెలిసి ఒక బస్తా బియ్యం వేసుకుని వెళ్లాను. నేను తీసుకెళ్ళిన బియ్యపు బస్తాని గుమ్మం లో నుండే వెనక్కి కొట్టింది . కూటికి మాడి చావాల్సి వస్తే కృష్ణలో దూకైనా చస్తాను కానీ పని జరక్కుండా డబ్బు, వస్తువులు ఉచితంగా తీసుకోనని బయటకి నెట్టేసింది. ఆమె ఇంటిముందు బట్టలు ఉతుక్కునే రాయి ఒకటి వుంది. దాని మీద మొండిగా కూర్చున్నాను. కటిక చీకటి, రక్తం తాగేస్తున్న దోమలు, కీచురాళ్ళ శబ్దాలు, వీధి కుక్కల అరుపులు. పన్నెండైనా అక్కడి నుండి కదలలేదు. జాలేసిందో ఏమో, “నాకేమవుతావని ఇట్టా కూర్చున్నావ్? నీ జాలి నాకు నచ్చలేదు” అంటూ దేవసేన వచ్చి చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆకలవుతుంది అన్నం పెట్టమని అడిగాను. వొండలేదని చెప్పింది. వొండి పెట్టు అని నేను తెచ్చిన బియ్యం చూపించాను. ఆ బియ్యం సంచీని ముట్టుకోకుండానే పొయ్యి వెలిగించి అన్నం వండి ఏదో పచ్చడేసి పెట్టింది. తనని తినమన్నాను. వద్దని తల అడ్డంగా ఊపింది.

నేను తింటూ ఉండగా తన కథ చెప్పింది. “మాది ఎరుకుల కులం. బుట్టలూ, తట్టలూ అల్లుకుని బతికేవాళ్ళం. ఉప్పరతట్టలు కొనడానికి వచ్చిన ఆసామి తోటకి నమ్మకమైన కాపలా మనిషి కావాలని అడిగితే సంసారమంతా చంకన పెట్టుకుని చక్కా వచ్చాడు మా నాయన. మా నాయనని వెదురు కర్రలు నరుక్కురమ్మని అడవికి పంపించి మా అమ్మతో కులికేవాడు. మా నాయనకది తెలిసేది కాదు. ధర్మాత్ముడు లాంటి ఆసామి దొరికాడు కష్టం సుఖం చూస్తున్నాడు అని కుశాల పడేవాడు. ఇప్పుడు తెల్ల బట్టలేసుకుని ఒంటినిండా బంగారం పెట్టుకుని రాజకీయ నాయకుడిగా తిరుగుతున్నాడు చూడు, ఆయన తండ్రే ఆ ఆసామి. పదమూడేళ్ళ పిల్లప్పుడు ఆ ఆసామి కొడుకు, వాడి స్నేహితుడి కామ దాహానికి బలై పోయిన ఆడపిల్లని నేను. ఒకసారి అడవికెళ్లిన మా నాయన తిరిగి రాలేదు. విషప్పురుగు కుట్టి చచ్చిపోయాడు. మా అమ్మ నయంకాని రోగమొచ్చి మంచమెక్కింది. నాకు ఏ పనీ చేతకాదు. అంత చిన్న వయసులో ఉన్న నాతో పని చేయించుకునేవారు కానీ ఎవరూ సరిగా డబ్బులిచ్చే వాళ్ళు కాదు. ఏ పని చేసినా మా ఇద్దరికీ రెండు పూటలా కడుపు నిండేది కాదు. కడుపు నిండకపోయినా లోకం కనీసం కంటి నిండా నిద్రనైనా పోనీయలేదు. అది చెయ్యేసి, కాలేసి రొచ్చులోకి లాగేస్తుంది. తర్వాత ఛీత్కరిస్తుంది. అట్టా ఈ వృత్తిలోకి వచ్చాను. నేనీ పని చేస్తున్నానని తెలిసినప్పుడు మా అమ్మ ఏడ్చింది. ఆ పని చేయకపోతే దేంట్లోనన్నా దూకి చావరాదు. ఒకేడుపు ఏడిసి ఊరుకుంటాను అని గోల పెట్టేది. తర్వాత నీకు ముద్దెవరు యేస్తారే అమ్మా అనేదాన్ని. ఎవరో ధర్మాత్ములు ఇంత ముద్ద పడేస్తారు అనేది నమ్మకంగా. ధర్మాత్ములు ఎవరూ ఉండరు అమ్మా! ఉండేదంతా పాపాత్ములే…. అనేదాన్ని.

ఇక్కడికొచ్చిన వాళ్ళు ఆకలి తీర్చుకుని రూపాయలని విసిరి కొట్టి వెళ్ళేవారే కానీ మా ఆకలి సంగతి ఆలోచించే వాళ్ళెవరు? మా చావులు ఎలా రాసి పెట్టి ఉంటాయో ఏంటో తెలియదు. పిల్లలు పుడితే వాళ్లకీ మా గతే పట్టుద్ది అని వద్దనుకున్నాను. ఇవ్వాళ తెల్ల కార్డ్ ఇప్పించమని ఆ తెల్ల బట్టలాయన ఇంటికెళితే ఆయన పెళ్ళాం నన్ను చూసి అసహ్యించుకుంది. వరండాలోకి ఎందుకొచ్చావ్? వెళ్ళు.. వెళ్ళూ అంటూ బయటకి గెంటేసింది. నువ్వు తీర్చలేని నీ మొగుడి వికృత కోర్కెలు తీర్చిన సానిదాన్ని తల్లీ! అని దణ్ణం పెట్టి వచ్చేసాను. ఈ పని మానేసి పొలం పనికి, పచ్చళ్ళ కంపెనీలో పనికి వెళ్ళాను. ఒళ్ళు విరగదీసుకునే చాకిరితో పాటు ఈ పనీ తప్పేది కాదు. ఎవడో ఒకడు చెయ్యేసేవాడు. ఇష్టం లేదంటే నీకిష్టం ఏమిటే … ముండా అని పచ్చి బూతులు కూసేవాళ్ళు. శరీరం మీద హక్కే కాదు మనసుకి కూడా మురిపెం ఉండాలి. ఎంత కడుపాకలి కోసం ఈ పని చేస్తుంటే మాత్రం మనసు చంపుకుని ఎవడితో పడితే వాడితో పొర్లాలంటే ఎట్టా కుదురుద్ది. ఎక్కడ చూసినా చెత్త నా కొడుకేలే! ఎక్కడికెళ్ళినా ఇదే పని చేసేటప్పుడు ఒళ్ళు ఇరగదీసుకునే కష్టమెందుకు చేయాలని పనిలో కెళ్ళడం మానేసా! ఈ వాడకట్టులో ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఒకొకరు సంపాదించి ఇళ్ళకి పంపుతారు. ఇంకొకళ్ళకి రోజూ గడవదు. హై క్లాస్ అపార్ట్మెంట్ల మధ్య ఈ గుడిసెలేంటీ అని ఒకో నాకొడుకు రచ్చ చేస్తాడు. చీకటి పడగానే వాడే మా గుడిసెలు వెతుక్కుంటూ వస్తాడు. ఓట్ల కోసం మమ్మల్ని ఇట్టాగైనా ఉండనీయడం! లేకపోతే ఎప్పుడో ఇక్కడినుండి లేపేసేవాళ్ళే! అంటూ భారంగా నిట్టూర్చింది. తినడం కూడా ఆపేసి ఆమె వైపే జాలిగా చూస్తున్నాను.
కాసిని నీళ్ళు త్రాగి మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. పొట్టకూటికోసం ఈ పని చేస్తున్నాం. ఈ మధ్య మొగుడు చాటు పెళ్ళాలు కూడా మాతో పోటీ పడిపోతున్నారు. రోజుకొక చీర కట్టుకు తిరగాలని, బంగారు నగలు కొనుక్కోవాలని దిగజారిపోతున్నారు. మా కళ్ళ ముందే జంటలు జంటలు తోటల్లో తిరుగుతూ ఉంటాయి.రెడ్ లైట్ ఏరియాలంటారు. అక్కడకన్నా ఎక్కువ వ్యాపారాలు ఇళ్ళ మధ్య ఎన్ని జరగడం లేదు? అంటూ కడిగిపారేసింది. సినిమాల వాళ్ళు వేషాల కోసం చేసేది వ్యభిచారం కాదు! ధనవంతుల ఇళ్ళల్లో సరదాల పేరిట జరిగేవి అది కాదు. శీలం విలువ ఆకలి ఒక్కటే కాదు. ప్రమోషన్, పదవి, చీరలు,నగలు, కారు ఏదైనా కావచ్చంటూ మేడి పండు సంఘం పొట్ట విప్పిపురుగుల్లాంటి పచ్చి నిజాలని మాట్లాడింది. దిమ్మెరపోయాను. నేనప్పటిదాకా అన్నమే తిన్నానా లేక ఆమె ఒండిన ప్రతి మెతుకులొ దాగిన వ్యధని తిన్నానా అనిపించింది.

ఇంకొందరి కథలు చెప్పు అని అడిగాను. వచ్చిన పని చూసుకుని వెళ్ళాలి కానీ ఈ కథలన్నీ నీకెందుకు? ఇక చెప్పను, అని మొండికేసింది. బతిమలాడినా వేరొకరి కథ చెప్పలేదు. నేనేమన్నా కథలు చెప్పే పేదరాసి పెద్దమ్మలా కనబడుతున్నానా? ఎవరి కథ వాళ్ళకే తెలుసు. వాళ్ళే చెప్పుకోవాలి. మధ్యలో నాకెందుకు అంది కానీ నోరిప్పలేదు. అప్పుడు నాకు ఒకటనిపించింది. నీతులు చెప్పే మారాజులందరినీ అన్ని వాడల వెంట త్రిప్పి వీళ్ళని చూపించాలి. యాక్ అంటూ వాంతి వచ్చినట్టు మొహం పెట్టే అమ్మలక్కలకి వీళ్ళ కథలు వినిపించాలి. వాళ్ళని చులకనగా చూసే మన చూపులు మారాలి . సమాజం విసిరి పారేసిన అభాగ్యులు వీళ్ళు. వికృత ఆలోచనల సమాజం తయారుచేసిన ఆకలి కేకలు వీళ్ళు. వీళ్ళలో పూట గడవని అతి పేదవాళ్ళు, వాళ్ళని పీక్కు తినే పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. రోగాలు రోష్టులతో, మల మూత్రాల మధ్య, మురుగు కాలవలు ప్రక్కన, ఈగలు ముసిరి, దోమకాటులకి బలి అయిపోతూ , కాట్ల కుక్కల మధ్య జీవచ్ఛవాలై బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి కోరికలతో కాదు మానవత్వం చూపడానికి వెళ్ళాలి ” అన్నాడు ఆవేశంగా.

ఆ క్షణంలో అభిని చూస్తుంటే అతని పట్ల, కొందరి జీవితాలపట్ల నాకున్న దురభిప్రాయాలన్నీ పటాపంచలై పోయాయి. ఆ గుడిసెలలో నివసిస్తున్నఅభాగినుల పట్ల మనసులో జాలి, సానుభూతి కలిగాయి. అభి వేశ్యలని ఉద్ధరించడానికి వెళుతున్న తథాగతుడిలా అనిపించాడు. పతితలందరినీ ఉద్ధరించే శక్తి అతనికి లేకపోవచ్చు గానీ వాళ్ళ గురించి సమాజానికి చెప్పే అవకాశం అతనికుంది కదా! గమళాళ్ళ కోటేశుకి కొడుకు మీద ఎంత నమ్మకం? “నా కొడుకు చెడ్డ పనులు చేయడయ్యా! ఏదో ఉద్దేశ్యం ఉంటేనే ఆడు అటువైపు వెళతాడు” అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

“తర్వాత ఏమైంది? దేవసేన నువ్విచ్చిన బియ్యం బస్తా తీసుకుందా?” అడిగాను.

“ఆ సంగతి చెప్పనే లేదు కదూ! అక్కడికే వస్తున్నా, వినండి సంగతి” అంటూ కొనసాగించాడు. “అన్నం తినమని దేవసేనని బ్రతిమలాడాను. పనయ్యాకే తిండి సంగతి. ఎవరికీ రుణపడి పోవడం నాకిష్టం లేదు” అంది.

అయితే ఒకసారి కాళ్ళు చాపుకో దేవసేనమ్మా! అన్నాను. చాపిన ఆ కాళ్ళ పై తల పెట్టుకుని పడుకున్నా. నేనలా పడుకోవడంలో నాకు ఏ వికారమూ లేదు. మా అమ్మ కాళ్ళపై పడుకున్నట్టే ఉంది. అప్రయత్నంగా ఆమె చేయి తల్లి చేయిలా మారింది. నా తలని నిమిరింది. కాసేపు అలా పడుకుని … లేచి వచ్చేస్తూ … “ఇదిగో ఇలా ఈ అమ్మ లాంటి వాత్సల్యం చాలు. నీదగ్గర తీసుకున్నదానికి నేనిచ్చిన ఖరీదు ఈ బియ్యం బస్తా ” అని చెప్పి బయటకి వచ్చేసాను.

మంచం మీద నుండి క్రిందికి ఉరికి పొయ్యిలో ఉన్న కట్టెపుల్లని తీసుకుని నా వెంట పడింది …” ఈసారి నా ఇంటికి వచ్చావంటే కాళ్ళు విరగ్గొడతా… ” అంటూ. నేను ఆమెకి దొరికితే కదా … అన్నాడు నవ్వుతూ అభి.

నాకూ ఒకటే నవ్వు పొరలు పొరలుగా, తెరలు తెరలుగా. నవ్వులాట నవ్వు కాదది. అంటువ్యాధి నవ్వూ కాదది. కళ్ళు తడుస్తూ పుట్టుకొచ్చిన నవ్వది.

ఆనాటి జ్ఞాపకం ఇంకా సజీవంగా ఉందేమో … మళ్ళీ కన్నీళ్లతో పాటు నవ్వొచింది అప్పటిలాగే!

**** (*) ****

Painting: B. Kiran Kumari53 Responses to లఘుచిత్రం

 1. వనజ తాతినేని
  April 1, 2016 at 8:30 am

  కథ ని ప్రచురించినందుకు వాకిలి సంపాదక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు .ఎంతో చక్కటి చిత్రాన్ని అందించిన B Kiran Kumari గార్కి మరీ మరీ ధన్యవాదాలు .

 2. Kumaraswamy reddy
  April 1, 2016 at 11:50 am

  చాల అద్భుతమైఎన కథ లఘు చిత్రము .రచయిత ఉన్నత సంస్కారం , ఆలోచన మరియు అభ్యుదయ స్ఫూర్తి ఈ కథ లో కనిపిస్తాయి .

  • వనజ తాతినేని
   April 1, 2016 at 11:46 pm

   కుమారస్వామి రెడ్డి గారు …. ధన్యవాదాలు సర్ .

 3. Krishna Veni Chari
  April 1, 2016 at 12:03 pm

  చాలా బాగా రాశారు వనజగారూ. దీనికి సంబంధం లేకపోయినా కానీ హిందీలో వచ్చిన ” మండీ” సినిమా గుర్తొచ్చింది ఎందుకో..

  • వనజ తాతినేని
   April 1, 2016 at 11:45 pm

   కృష్ణవేణి చారి గారు … ధన్యవాదాలు . కింద కామెంట్ లో రియల్ కేరెక్టర్ వచ్చారు గమనించండి . :)

 4. April 1, 2016 at 5:43 pm

  కొందరి వ్యధలంతే….చక్కగా చిత్రీకరించారు….కధ లో దేవసేన పాత్ర వ్యక్తిత్వాన్ని….బాగున్నది మీ కధ…

  • వనజ తాతినేని
   April 1, 2016 at 11:43 pm

   సరళ గారు … కథ నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు .

 5. సమీర్
  April 1, 2016 at 5:53 pm

  కథ చాలా బాగుంది. తోటిమనుషులని ఎలా చూస్తాం అనేదే మనిషి ఉత్తమ సంస్కారాన్ని తెలియజేస్తుంది. అభి కేరక్టర్ ని బాగా వ్రాసారు రచయిత్రి. అయిదుసార్లు కథ చదివినా ఫీల్ తగ్గలేదు. మంచి కథ వనజ గారు. అభినందనలు.

  • వనజ తాతినేని
   April 1, 2016 at 11:42 pm

   ధన్యవాదాలు సమీర్ గారు .

 6. April 1, 2016 at 9:25 pm

  హాయ్ ఫ్రెండ్స్ …..
  లఘుచిత్రం కథని నా మిత్రులు, ఆప్తులు – వనజ తాతినేని ( Vanaja Tatineni ) గారు రాసారు…

  లఘుచిత్రం కథని ( http://vaakili.com/patrika/?p=10660 )
  రాసినందుకు…..
  ” వనజ తాతినేని గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ”

  ఈ కథ లో ఉన్న హీరోని నేనే……
  ఈ కథలో ఉన్నది నా రియల్ లైఫ్ లో నేను చేసిన కొన్ని పనికిమాలిన పనులే

  నా రియల్ లైఫ్ లో నేను చేసిన వాటికి ఇంకొన్ని సంగటనలను జోడించి ఎంతో భావోద్వేగంతో రాసిన కథే లఘుచిత్రం
  వనజ గారు ఈ లఘుచిత్రం కథని చాలా బాగా రాసారు ……..

  నేను ఈ కథ చదివిన తరువాత కొంత సమయము అందులోనే ఉండిపోయాను
  కథని చదివినట్టు లేదు నాకు మరల వాళ్ళ జీవితాన్ని దగ్గరనుండి చూసినట్టు ఉంది

  ఫ్రెండ్స్…. మీరు కూడా ఈ లఘుచిత్రం కథని చదువుతారని ఆశిస్తున్నాను
  ఇది లఘుచిత్రం కథ లింక్ …….
  http://vaakili.com/patrika/?p=10660

  వనజ తాతినేని గారు నా రియల్ లైఫ్ లో నేను చేసిన వాటికి ఇంకొన్ని సంగటనలను జోడించి ఇంత బాగా రాసిన ” మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ”

  వనజ తాతినేని ( Vanaja Tatineni ) గారు ఇప్పటికి, ఎప్పటికి వారి పాదాలకి సగర్వంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తాను………@ శివ పామర్తి

  • వనజ తాతినేని
   April 1, 2016 at 11:41 pm

   శివ గారు … ఈ స్పందన ఇక్కడ నేనూహించనిది. ప్రతిస్పందన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.

   ఇంకొక విషయమేమిటంటే ..నేను వ్రాసే కథలన్నీ జీవిత శకలాలపై తలెత్తి గర్వంగా జీవించే వారి నిజ జీవిత కథలే ! యాదృచ్చికంగా అలా వ్రాసేస్తూ ఉంటాను . అలా ఈ కథ వచ్చింది. మీరు చేసిన పనికిమాలిన పనులేవీ లేవు ఇక్కడ . హృదయ సంస్కారం మాత్రమే ఉంది పైన ఒక పాఠకుడు తెలిపినట్లు అభ్యుదయం మాత్రమే ఉంది . తోటి మనుషులపట్ల కలిగే జాలి,సానుభూతి,చెమరించిన నయనం .. ఇవే మనిషి మనసుకి నిదర్శనం.

   మీ కామెంట్ లో ఆఖరి వాక్యం స్త్రీజాతి కంతటికీ చెందుతుంది. ధన్యవాదాలు శివ గారు .

   • April 4, 2016 at 9:27 am

    నా బాధ్యతను ఎక్కడ మర్చిపోతానో అని నా కథను కథ రూపంలో రాసి ఇంకా నా బాధ్యతను మరింత పెంచారు అందుకోసమే అసలు ఈ కథ రాసారని బావిస్తూ వనజ తాతినేని గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు @ శివ పామర్తి

 7. Suparna mahi
  April 2, 2016 at 5:52 am

  వనజమ్మా… ఎంత చక్కని కధ…? ప్రతి పాత్ర వ్యక్తిత్వం ఎంత బాగా ఎలివేట్ చేశారో, మీ ప్రతీ కధ లో ఉండే ఓ చక్కని కదిలించే మెసేజ్ ఈ కధలో కూడా అద్భుతంగా కుదిరింది… చాల చాలా చక్కని కధ కు ధన్యవాదాలు..

  • వనజ తాతినేని
   April 2, 2016 at 7:03 am

   థాంక్ యూ సో మచ్ .. మహీ !

 8. కె.కె. రామయ్య
  April 2, 2016 at 11:45 am

  పాక్‌లో బాలికల విద్యాహక్కుల కోసం ఉద్యమం సాగిస్తూ.. తాలిబాన్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి.. మరణాన్ని జయించి.. లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న పాకిస్తాన్ బాలిక మలాలాతో కలిసి 2014 నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త, గాంధేయవాది కైలాష్ సత్యార్థి … ఐక్యరాజ్యసమితి కంటే ముందుగా 1981లో బాలల హక్కుల కోసం గళం విప్పి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మూడు దశాబ్దాలుగా ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ పోరు సాగిస్తున్న కైలాష్ 80 వేల మంది బాలలను వెట్టి చాకిరీ, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించేందుకు విశేష కృషి చేసిన కైలాష్ సత్యార్థి గారి ప్రసంగం విన్నప్పుడు కలిగిన ఉద్వేగం మళ్లీ కలిగింది మీ కధను చదివి శివ పామర్తి గారు.

  పిల్లలు దేవుళ్లకు ప్రతిరూపాలని; వారి స్వేచ్ఛా, బాల్యాన్ని కాపాడడమే తన భక్తి మార్గమని; తాను గత 40 ఏళ్లుగా ఆలయాలకు లేదా మసీదులకు వెళ్లలేదని ప్రకటించిన కైలాష్ సత్యార్థి; నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను జాతికి అంకితంగా ఇచ్చివేసి, నోబెల్ బహుమతి నగదును బాలల సంక్షేమానికే వినియోగిస్తానని ప్రకటించిన కైలాష్ సత్యార్థి గారి లోని స్పూర్తిని కనబరిచిన శివ గారికి హృదయపూర్వక అభినందనలు.

  కధలో దేవసేన పాత్ర వ్యక్తిత్వాన్నిచక్కగా చిత్రీకరించారు వనజ తాతినేని గారు. ధన్యవాదాలు.

  • వనజ తాతినేని
   April 2, 2016 at 1:38 pm

   మీ స్పందన బాగుంది కె కె రామయ్య గారు .

   హృదయపూర్వక ధన్యవాదాలు .

  • April 4, 2016 at 9:20 am

   కె.కె. రామయ్య గారు ” మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ”

   మీకు అంత ఉద్వేగం కలిగించినందుకు నేను అదృష్టవంతుండిని అండి
   నేను చాలా చిన్న వాడిని…. పరిగెత్తవలిసిన దూరం చాలా ఉంది
   కాని మీరు నా పయణ మార్గానికి అంత గొప్పవారిని నా ముందు ఉంచి, మీ మాటలతో నేను పరుగెత్తవలిసిన దూరం ఇంకా చాలా ఉందని ఉద్వేగం కలిగించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు……

   అలాగే కె.కె. రామయ్య గారు ఇప్పటికి, ఎప్పటికి వారి పాదాలకి సగర్వంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తాను………

   నా బాధ్యతను ఎక్కడ మర్చిపోతానో అని నా కథను కథ రూపంలో రాసి ఇంకా నా బాధ్యతను మరింత పెంచారు అని బావిస్తూ వనజ తాతినేని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు @ శివ పామర్తి

 9. April 2, 2016 at 12:40 pm

  వనజవనమాలి గారూ .. ఎప్పటి లాగానే వైవిధ్యమైన ఒక జీవితం గురించి కధ చాలా బాగుందండీ.

  “ఈ మధ్య మొగుడు చాటు పెళ్ళాలు కూడా పోటీ పడిపోతున్నారు. రోజుకొక చీర కట్టుకు తిరగాలని, బంగారు నగలు కొనుక్కోవాలని దిగజారిపోతున్నారు.”

  ఇలాంటి వాస్తవాలను మీరుచెప్పినంత ధైర్యంగా ఇంకెవరూ చెప్పలేరేమో.. మంచి కధతో పాటు కొందరి వ్యక్తిత్వాలని, అంతరంగాల్ని తెలియచేశారు. లఘుచిత్రం చాలా బాగుంది.

  • వనజ తాతినేని
   April 3, 2016 at 3:34 pm

   రాజ్యలక్ష్మి గారు … ధన్యవాదాలు .

 10. సాయి.గోరంట్ల
  April 2, 2016 at 1:58 pm

  చక్కని కథ వనజ గారు.
  వ్యక్తిత్వాలు ఏ స్థాయిలోనైనా బతికే వుంటాయ్.
  మీ పాత్రల చిత్రణ అద్బుతుంగా వుంది

  • వనజ తాతినేని
   April 2, 2016 at 4:09 pm

   సాయి గారు … థాంక్ యూ సో మచ్ . ఎస్, వ్యక్తిత్వాలు ఏ స్థాయిలోనైనా బతికే వుంటాయ్. బాగా చెప్పారు .

 11. April 2, 2016 at 2:45 pm

  మీ ‘లఘుచిత్రం’… కాదుకాదు చాలా పెద్ద చిత్రం. చాలా బాగా స్టడీచేసి రాసినట్టున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక సమస్యని విశ్లేషించిన తీరు చాలా బాగుంది. ఇంకా అనేక మంచిమంచి రచనలు చేయాలని కోరుతున్నా…

  • వనజ తాతినేని
   April 2, 2016 at 10:36 pm

   ధన్యవాదాలు రాజాబాబు కంచర్ల గారు .

 12. Radha
  April 3, 2016 at 7:28 am

  వనజ గారూ, బావుంది. దేవసేన పాత్ర చిత్రీకరణ చాలా నచ్చింది. అభినందనలు.

  • వనజ తాతినేని
   April 3, 2016 at 3:35 pm

   రాధ గారు థాంక్ యూ సో మచ్.

 13. yalamarthy anuradha
  April 3, 2016 at 8:31 am

  kadha,kadhanam adbhutam.
  amsam exllent.
  vastavaaniki ati daggaraga nee payanam..good..good
  ala amma ga ame kaalllaku namaskaaram pettadam ..goppa mugimpu.
  congrats.

  • వనజ తాతినేని
   April 4, 2016 at 10:00 am

   అనూరాధ గారు ..ఒక కథకి రెండు ప్రశంసా వ్యాఖ్యలు . త అయినా వి అయినా రెండూ మీరే ! థాంక్ యూ సో మచ్ !

 14. అనూరాధ యలవర్తి
  April 3, 2016 at 3:15 pm

  కథ చాలా బాగుందండీ, దేవసేన పాత్ర బాగా తీర్చిదిద్దారు. జీవితం అందరికి తీర్చిదిద్దినట్లు ఉండదు. స్వాభిమానంతో బ్రతకడం ఎలాగో దేవసేనతో చెప్పించారు. రచయిత్రి కథలన్నీ నిజజీవిత కథలకి రూపాలని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తుంది. ఆ కథలన్నీ చదవాలి. వనజ గారు అభినందనలు మంచి కథ వ్రాసారు,మెప్పించారు.

 15. April 4, 2016 at 9:29 am

  ఈ కథ చదివిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు …………

 16. Ramani Rachapudi
  April 4, 2016 at 2:12 pm

  హ్మ్మ్ నిజానికి ఈ కథ నేను కథ లాగే చదివాను.. స్త్రీ వృత్తి ప్రవృత్తి ఏమయినా వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది అని అర్థం చేసుకునే మగవాడు లేడు ఇది నేను నాకు చెప్పుకుంటూ మననం చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మేము చాలా బాగా అర్థం చేసేసుకున్నాము అని అనుకునే ప్రతీ మగవాడు ఏదో ఒక సందర్భంలో తన ఇగో ని బయల్పరుస్తూ స్త్రీని కించపరిచినవాడే..

  ఇక వేశ్యల గురించి ఎన్నో సినిమాలు చూసాము, ఎన్నో కథలు వింటున్నాము వాళ్ళది సరదా వృత్తి కాదు ఆకలి తీర్చే వృత్తి ఏమి చేయాలో తెలీని పరిస్థితుల్లో ఎంత పని చేసిన చివరికి ఒక మగవాడి దాహానికి బలి అవడమే జరుగుతుండండంతో ఎందుకు కష్టపడాలి అనే ఆలోచన రావడం ఆ వృత్తిలో కల స్త్రీ హృదయానికి ఆమె ఆలోచనలకి కరెక్ట్‌గా సరిపోయిన అంశం.

  చివర కమెంట్స్ లో ఇదొక యదార్థ గాధ అని (నేను నిజజీవితంలో స్త్రీలని అర్థం చేసుకునే పురుషులని చూడలేదు… (తనకోసం బార్య, తనని సుఖపెట్టే బార్య, తనకోసం వండే బార్య, తన కోసం ఏడవాలి, తనకోసం నవ్వాలి తన కోసం సంపాదించాలి అని ఆలోచించే పురుషుడిని తప్ప) శివ పామర్తి గారు కుడోస్.. ఒక స్త్రీ ని (అది ఎవరయినా కావచ్చు, బార్య, తల్లి, సొదరి, వేశ్య అయినా సరే) అర్థం చేసుకునే పురుషుడిగా దేవసేన వ్యక్తిత్వాన్ని గౌరవించే అభి గా మీకు ప్రణామములు.

 17. Ramani Rachapudi
  April 4, 2016 at 2:16 pm

  వనజ గారు, దేవసేన వ్యక్తిత్వాన్ని తెలియజేసిన విధానం నాకు నచ్చింది, ముఖ్యంగా ఆమే నేను ఏది ఊరికే తీసుకోను అని తన వృత్తిని ఈసడించుకుంటూనే గౌరవించడం చెప్పుకోతగ్గ విషయం. మాములుగా బయట వేరే అబ్బాయితో కనిపిస్తే ఈసడించుకునే స్థితిలో ఉన్న ప్రస్తుత తరంలో ఒక వేశ్యని తన తల్లిగా భావించడం ఇది కథే అనుకునేవాళ్ళకి కథ కాదు సుమా నిజం అని తెలియజేయడం గొప్ప విశేషం వనజగారు మంచి కథని అందించిన మీకు జోహార్లు. శివ పామర్తి గారు/అభి గారు అభినందనలు.

  • వనజ తాతినేని
   April 4, 2016 at 7:02 pm

   రమణీ గారు … థాంక్ యూ సో మచ్ . దాదాపు ఈ కథ ఏడెనిమిది ఏళ్ళగా నా ఆలోచనల్లో ఉంది . అందుకే ఇలా వ్రాయ గల్గానేమో !

  • April 13, 2016 at 12:03 pm

   రమణీ గారు … ” మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ”

 18. K SHESYU BABU
  April 4, 2016 at 11:56 pm

  Ee kadha chadivaka pathabhi gaari ‘fidelu raagaala dazan’ Loni kavitalu gurtuku vachchayi. Chaala bagundi. Dhanyavaadalu.

  • వనజ తాతినేని
   April 5, 2016 at 11:16 am

   ధన్యవాదాలండీ !

 19. కె.కె. రామయ్య
  April 5, 2016 at 5:13 pm

  ప్రియమైన శ్రీ శివ గారు, నమస్కారములు.

  ఇటీవల కొద్దినెలల క్రితం బెంగుళూరులో జరిగిన ఓ సభలో కైలాష్ సత్యార్థి గారి ప్రసంగం విన్న సభికులందరి మానస్సులూ ఆర్ద్రతతో నిండిపోయాయి. సభికులందరూ నిలబడి కరతాళాలతో తమ అభినందనలను తెలియజేసారు ఈ గాంధేయ వాదికి. ఈ తళుకు బెళుకు మాయాజాల ప్రపంచాల మాయదారి పరుగుపందాల వేటలు, వెర్రితలలు వేస్తున్న అంతులేని స్వార్ధం చూసిన కళ్లతో మానవత్వము, దైవత్వమూలను ప్రతిబింబిస్తున్న ఓ మహా మనీషిని చూసిన అనుభూతి కలిగింది అక్కడి వారందరికీ కైలాష్ సత్యార్థి గారిని చూసి. రక్కసి కోరల్లో, ఉక్కు పాదలాల క్రింద నలిగిపోతున్ననిస్సహాయ చిన్నారులిని రక్షించి వారి కడు నిరుపేద తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగినప్పుడు, వారి కళ్లల్లో చిందిన ఆనంద భాష్పాల్లో తనకు దైవదర్శన దైవదర్శనమ్ కలిగిందని ఎంతో వినమ్రతతో చెప్పుకొచ్చారు కైలాష్ సత్యార్థి గారు.

  సమాజంలోని అట్టడుగు వర్గానికి కూడా పనికొచ్చే సురాజ్యం కోసం ఆత్మ బలిదానాలు చేసి మన పెద్దలు సాధించిన మాతృ దేశ స్వాతంత్రం ఇంకా అర్ధరాత్రి స్వతంత్రం గానే మిగిలిఉంది. దేశ అభివృద్ది ఫలాలు అందని అభాగ్యులు ఇంకా ఎందరెందరో.

  సాటి మనిషి పట్ల ప్రేమ, దయ … వారి కష్టాల పట్ల సానుభూతి … వాళ్లకు చేతనైనంతలో సాయం చెయ్యాలనే మంచి మనస్సూ ఈ దేశంలో పలుచోట్ల, పలువురిలో కనిపిస్తుంది … చిన్నా, పెద్దలందరిలో. అలాంటి వారిలాగే, సరైన మార్గంలో ప్రయాణిస్తున్న మీకు వినయపూర్వక వొందనాలు.

  అంతర్మధనంతో, ఓ సంవేదనతో మీ కధను అక్షరబద్ధం చేసి పదుగురికి స్పూర్తి కలిగేలా చేసిన తాతినేని వనజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • April 13, 2016 at 12:02 pm

   కె.కె. రామయ్య గారు ” మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ”

 20. Anuganti koti
  April 5, 2016 at 10:44 pm

  Hi medam gaaru nenu sivanna ku studentni cheppalante thammudu lantivaanni nijmga mi kadha chaala bhaagundhandi maa Sivanna meedha unna estam enka perigindhi e kadhanu ecchinandhuku chaala chaala thanks medam gaaru

  • వనజ తాతినేని
   April 6, 2016 at 12:34 pm

   ధన్యవాదాలు కోటి గారు .

 21. చందు తులసి
  April 11, 2016 at 7:00 pm

  కథ బాగుంది మేడమ్….
  మీరు రాసిన కథల్లో….టాప్ లిస్టులో ఉండే కథ.
  మేడిపండు సమాజం పొట్ట విప్పి చూపించారు.
  మీ నుంచి మరిన్ని మంచి కథలు రావాలని కోరుకుంటున్నాను.

  • వనజ తాతినేని
   April 11, 2016 at 9:11 pm

   థాంక్ యూ సో మచ్ చందూ !

 22. April 13, 2016 at 12:03 pm

  ఈ కథ చదివిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు …………

 23. Lakshmi raghava
  April 21, 2016 at 4:15 pm

  కథ బాగుంది అని సింపుల్ గ చెప్పి వదిలెయ్యడం అంటూ వుండదు మీ కథలు చదివినప్పుడు. వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంటాయంటే చదివేవాళ్ళు అందులో లీనమై జీవిచేస్తున్నమా అని అనుమానించాల్సి వస్తుంది. అభి పాత్ర, దేవసేన పాత్ర లతో సామాజిక సమస్య ఎంతో chakkagaa మలిచారు. రచయితలు ఎన్ని కోణాలలో రాయచ్చో అని చాలెంజ్ chesaru. అబినందనలు వనజగారూ

  • వనజ తాతినేని
   April 21, 2016 at 9:57 pm

   మీ వ్యాఖ్య నాకు చాలా సంతోషం కల్గించింది లక్ష్మీ రాఘవ గారూ. ధన్యవాదాలు.

 24. leelakay
  April 27, 2016 at 12:18 am

  చక్కగా కళ్ళకు కట్టినట్టు వర్ణించారు వనజగారూ ! బావుంది అన్న ప్రశంస చిన్నదవుతుందేమో . మోసాలకు బలి అయి చీకటి కూపాల్లో మగ్గుతూ చాలేక బతుకలేక మృగత్వానికి బలవుతూ వెలుగు చూడని జీవితాలు ఎన్నో ! తలచుకుంటే వొళ్ళు గగుర్పొడుస్తుంది ముంబై లాంటి మహానగరాల్లో ఇలాంటి దేవసేనలు ఎందరో ! జుగుప్సాకరమైన ఇతివృత్తం వెనుక దాగిన విషాదాన్ని ఎంతో చక్కగా మలిచారు

 25. వనజ తాతినేని
  April 28, 2016 at 9:04 am

  ధన్యవాదాలు లీల కే గారూ .

 26. Veera Reddy Kesari
  May 12, 2016 at 11:58 am

  వనజ గారూ, బావుంది. దేవసేన పాత్ర చిత్రీకరణ చాలా నచ్చింది. అభినందనలు.

 27. May 15, 2016 at 12:44 am

  ఈ కథ చదివిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు….. @ శివ పామర్తి

 28. విశాల అప్పిడి
  May 28, 2016 at 10:47 pm

  దేవసేన పాత్ర చాలా బాగుంది అండీ, మెడికల్ హిస్టరీ లో పూర్తిగా నయం కాని మందు లేని వ్యాధి ఒకటి ఉంది కాబట్టి దేవసేనల వైపు కన్నెత్తి చూడటానికి భయపడుతున్నారు తప్ప నైతిక విలువలు నశించిన నేటి సమాజంలో దేవసేనలు ఎంతోమంది ఉన్నారు. కథ చక్కగా వ్రాసారు. అవుట్ సైడ్ బ్రాడ్కాస్టింగ్ అనుభవాలు మనసుని కదిలించివేశాయి. చాలా బాగా వ్రాసారు. సమాజానికి అభి లాంటి వాళ్ళు కావాలి.

  • వనజ తాతినేని
   June 8, 2016 at 7:08 pm

   ఓహ్ ..థాంక్ యూ విశాల . కథ నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు .

 29. BHUVANACHANDRA
  June 7, 2016 at 8:58 pm

  ఎంత గొప్పగా రాశారండీ వనజగారూ ….చెప్పడానికేమీ లేదు …మౌనం నా మాటనే కాదు అక్షరాల్నీ మింగేసింది.

  • వనజ తాతినేని
   June 8, 2016 at 7:09 pm

   ధన్యవాదాలు భువనచంద్ర గారూ ..

 30. July 20, 2016 at 6:13 pm

  ఈ కథ చదివిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు….. @ శివ పామర్తి

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)