జీవితంలో నిజమైన సౌందర్యం ఎక్కడ దాగి వుంది? బహుశా, దాని సరళత్వంలోనే వుంది!
దేనినీ హెచ్చవేసి చూపించకుండా, దేనినీ తక్కువ చేసి చూపకుండా, ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, వున్నది ఉన్నట్లుగా చూడగలిగే హృదయం వుంటే జీవితంలోని అనేక మలుపుల్లో గొప్ప సౌందర్యం దాగి వుంది.
చూడగలిగే కన్ను ఒకటి జీవంతో వుండాలే గానీ, జీవితం లోని చిన్న చిన్న అంశాలలో దాగి వున్న ఆనందాన్ని మించినది మనిషికి ఇంకెక్కడ దొరుకుతుంది? ఇంద్రియాలు సంస్పందనలతో సజీవంగా వుండాలే గానీ, పచ్చని చెట్లతో నిండిన ప్రకృతి కన్నా గొప్ప సాంత్వన నిచ్చే లోగిలి మనిషికి ఇంకేముంటుంది?
ఈ రహస్యం తెలిసిన కవి కాబట్టే కవి ఇస్మాయిల్ గారు ‘చెట్టు నా ఆదర్శం’ అన్నారు.
కవిత్వం లో అనవసర శబ్దాల వినియోగం వలన ఒక అనుభవం కవితగా రూపు దిద్దుకోవడంలో విఫలమవుతున్న సంగతిని తెలుగు కవిత్వ లోకానికి తొలి సారి వివరించిన అపురూపమైన కవి ఇస్మాయిల్ గారు.
ఇస్మాయిల్ గారు తన ‘కవిత్వంలో నిశ్శబ్దం’ వ్యాసంలో ఏమంటున్నారో చూడండి -
“మన చుట్టూ ఉన్న అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించటమే కవిత్వ లక్ష్యం. దీనికై సాధనాలు శబ్దాలు లేక మాటలు. మాటలు మన మనస్సు సృష్టించినవి. అనుభవాలు పంచేంద్రియాలకు సంబంధించినవి. మాటలు అనుభవాన్ని యథాతధంగా అనుసరిస్తున్నాయని గ్యారంటీ ఏమిటి? సామాన్య భాష అనుభవాన్ని ఆవిష్కరించక పోగా, ఆచ్ఛాదించటం తరచూ చూస్తుంటాం. అనుభవాన్ని అనుభవంగానే ప్రత్యక్షం గా అందించటం కవిత్వం పని”
నిజమే, అచ్చమైన కవిత అనుభవించ వలసిందే తప్ప, అర్థం చేసుకోవలసింది కాదు. బహుశా, అందుకే టి ఎస్ ఇలియట్ అంటాడు … ‘genuine poetry can communicate before it is understood’
ఉదాహరణకు, ఇస్మాయిల్ గారు రాసిన ‘లాండ్రీ’ కవితను చదవండి -
మన వీధి మలుపులో, వీధి లోని కుటుంబాల వాళ్ళు ఇచ్చిన బట్టలను ఇస్త్రీ చేసి పెట్టి, పొట్ట పోసుకునే ఒక శ్రమజీవి పైన ఇస్మాయిల్ గారు రాసిన చిన్న కవిత ఈ ‘ఇస్త్రీ’ !
కవితలో ఎక్కడా అనవసర వర్ణనలు గానీ, కవి తన ఒకానొక అనుభవాన్ని మనకు తన కవిత ద్వారా పంచే క్రమంలో అడ్డంకులుగా ఎదురుపడే శుష్క శబ్దాల రొద గానీ ఈ కవితలో మీకు ఎక్కడా కనిపించవు. ఇస్మాయిల్ గారి మొత్తం కవిత్వ ప్రత్యేకత కూడా అదే!
లాండ్రీ
చల్లటి బల్బు కాంతిలో
తెల్లటి దుప్పట్లు పరిచిన
ఇస్త్రీ బల్లతో
మా వీధి చివర లాండ్రి
మాటి మాటికీ నన్ను ఆహ్వానిస్తోంది
పాలతరకల దుప్పటితో
పలకరించే ఇస్త్రీ బల్లపై
పరిగెత్తుకు పోయి
పవ్వళించాలని వుంటుందిఅప్పుడు లాండ్రీ అతను
చప్పున నను సరిదిద్ది
నడతలో నా వంకర్లనీ
ముడతలు పడ్డ నా ఆలోచనల్నీ
ఇస్త్రీ పెట్టెతో రుద్ది
శాస్త్రీయంగా సాఫు చేసి,
నీటుగా నన్ను మడత పెట్టి
దీటుగా హేంగరుకు తగిలించి
మోసుకుపోయి నన్ను
మా ఆవిడ కప్పగించి
ఇదుగోనమ్మా తీసుకో
ఇస్త్రీ చేసిన నీ భర్తనంటే
ఎంత సంతోషిస్తుందో ఏమో
ఇంతింతని చెప్పలేం
పైపైన చదివితే, ‘ఏముంది ఇందులో?’ అని పొరబడే ప్రమాదం వుంది. ఇప్పుడు ధ్యాన స్థితిలో, ప్రశాంత చిత్తంతో ఈ కవితను మళ్ళీ చదువుకోండి!
కవిత మొత్తాన్ని ఒక ప్రశాంత చిత్తంతో మళ్ళీ చదవండి!
కవి కేవలం తన ఇంటి వీధి చివరి లాండ్రీ షాపు గురించి మాత్రమే మనకు చెబుతున్నాడా?
లేదు కదూ?
కవిత మొదటి సగంలో వీధి చివరి లాండ్రీ షాపుని వర్ణిస్తూ, ఆ షాపు లోని ఇస్త్రీ బల్లపైని ‘పాల తరకల’ తెల్లని దుప్పటిని చూసినపుడు వెళ్లి పవ్వళించ మనసవుతుందని అంటున్నాడు కవి.
ఎందుకు ఈ మడతల్లేని పాల తరకల తెల్లని దుప్పటి పట్ల ఇంత ఇష్టం? బహుశా, మనం మరీ ముఖ్యంగా పురుషులు, అంత స్వచ్చంగా వుండాలని మనసులో ఏ మూలో బలంగా ఒక కోరిక వుండి కూడా అట్లా వుండలేక పోవడం వలన అనుకుంటాను.
కవిత రెండవ సగం లోకి వచ్చేసరికి
‘నడతలో నా వంకర్లనీ
ముడతలు పడ్డ నా ఆలోచనల్నీ
ఇస్త్రీ పెట్టెతో రుద్ది
శాస్త్రీయంగా సాఫు చేసి
నీటుగా నన్ను మడత పెట్టి’
తన స్త్రీకి అందివ్వాలి అంటున్నాడు.
ఉతికిన దుస్తుల లోని ముడతలని ఇస్త్రీ చేసి ఇచ్చే లాండ్రీ వాడు, దుస్తులతో పాటు, దుస్తుల్ని ధరించే మనిషి నడత లోని వంకర్లనీ, ముడతలు పడ్డ అతడి ఆలోచనలనీ కూడా ఇస్త్రీ పెట్టెతో రుద్ది పెట్టి సాపు చేస్తే ఎంత బాగుంటుంది అన్న ఊహ చేస్తున్నాడు కవి.
అక్కడితో ఆగి పోలేదు.
అట్లా సాపు చేసి ఇస్త్రీ చేసిన తరువాత, నీటుగా మడత పెట్టి, ‘ఇస్త్రీ చేయబడిన భర్త’ ని అతడి స్త్రీ కి అప్పగిస్తే ఆవిడెంత సంతోషిస్తుందో కదా అంటూ కవితను ముగించాడు.
నడతలో వంకర్లు లేని, ఆలోచనలలో ముడతలు లేని పురుషుడినే కదా ఏ స్త్రీ అయినా భర్తగా కోరుకునేది. అంత పెద్ద విషయాన్ని, మన దైనందిన జీవితంలో మన వీధి చివరన కనిపించే ఒక లాండ్రీ షాపు పైని కవితతో ఎంత హృద్యంగా చెప్పాడు కవి! ఇస్మాయిల్ గారి కవిత్వం లోని గొప్పదనం ఇదే!
పురుషుడి నుండి స్త్రీ కోరుకునేదేమిటో తన ‘నత్త ప్రణయ యాత్ర’ లో ఒక చోట ఇస్మాయిల్ గారే ఇట్లా చెబుతారు -
‘ఆమెకు కుక్కపిల్లంటే ఇష్టం
కుక్కపిల్ల స్థాయికి ఎదగాలని
ప్రస్తుతం నా ప్రయత్నం’
పైకి మామూలుగా చదివితే సరదాగా అనిపించినా ఎంత లోతైన కవితా పంక్తులివి!
అనుభవించి పలవరిస్తే తప్ప ఇంత సున్నిత కవితా వాక్యాలను రాయడం సాధ్యమవుతుందా?
తన అనుభవం లోకి వచ్చిన దానిని కవిత్వం చేయడం గురించి ఇస్మాయిల్ గారే తన ‘కవిత్వంలో నిశ్శబ్దం’ వ్యాసంలో మరొక చోట ఇట్లా చెబుతారు -
‘దీనికై కవిత్వం ఉపయోగించే సాధనాలు పదచిత్రాలు. వీటినే ప్రతీకలంటారు. వీటి వివిధ ప్రక్రియలే రూపకాది అలంకారాలు. పదచిత్రాలు అమూర్త ( abstract ) భావాలు కావు. మూర్త( concrete ) విషయాలు. ఇవి మన ఇంద్రియాల్ని తాకి, ఐంద్రియక అనుభూతుల్ని మేల్కొలుపుతాయి. మాటల కందని సంశ్లిష్టమైన అనుభవాలతో జటిలమైన అనుభవిక ప్రపంచం ఈ పద చిత్రాల మార్గం ద్వారా మన అనుభూతి ఆవరణలోకి ప్రవేశించ గలుగుతోంది. కవిత్వంలోకి విశాలమైన జీవితాన్ని ఆహ్వానించే కిటికీలన్నమాటి ఇవి. మన గది కిటికీలు ఆకాశాన్ని ఆహ్వానించినట్టు’
చివరిగా, కవిత్వం చేసే పని గురించి ఇస్మాయిల్ గారు అన్న మాటతో ముగిస్తాను-
‘కవిత్వం చేసే పని హృదయంలో ఒక దీపం వెలిగించడమే’
**** (*) ****
Photo Credit: సాహితీ-యానం blog.
“’చెట్టు నా ఆదర్శం” అన్న సౌందర్యారాధకుడు, ప్రకృతి ఉపాసకుడు కాకినాడ పెద్ద ఇస్మాయిల్ గారు ( వీరు, విశాఖ వీరుడు త్రిపుర గారూ మంచి దోస్తులండి ) పదచిత్రాలతో కవిత్వం అందించి ఎందఱో కవులకు మార్గదర్శకులయ్యారు. తెలుగు వారికి హైకూ కవితలను పరిచయం చేసిన వారిగానూ ఇస్మాయిల్ గారు ప్రసిద్దులు. ఇరువురూ ఆచార్యవర్యులైన ఇస్మాయిల్, త్రిపుర గార్ల కరుణ, తాత్వికతా ద్రష్టి వారి రచనల్లో ప్రతిబింబించటం మనం చూస్తాము.
” మాటల పొదుపు ఎంత అవసరమో చెలం గారు చెప్పారు.
ఇస్మాయిల్ గారు ఒక్కరే ఆ పొదుపులో ఉన్న ఆనందాన్నీ దానితో వచ్చే అనుభూతినీ అందరికీ పంచిపెట్టారు
గత శతాబ్దంలో తెలుగు కవులు పాండవుల్లా అయిదుగురే. విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్ , ఇస్మాయిల్ ” ~ వేలూరి వేంకటేశ్వర రావు
ధన్యవాదాలు విజయ్ కుమార్ గారూ, మా హృదయాలలో కవిత్వ దీపం వెలిగించటానికి మీరు చేస్తున్న అవిరళ కృషికి.
హృదయంలో ఒక దీపం వెలిగింది … విజయకుమార్ గారు . ధన్యవాదాలు .
Chettu ku pranam vundi.manonetralu vunnayi. Anduke Ismail gaariki chettu adarsham. Manchi vyasam. Dhanyavaadalu.
శేషు బాబు గారు, వనజ గారు … మీ సహృదయ అభినందనకు కృతజ్ఞతలు !
రామయ్య గారు …
త్రిపుర గారికి ఇస్మాయిల్ గారితో వున్న స్నేహ బంధం గురించి మీరు ఇక్కడ ప్రస్తావించడం సంతోషం !
ఇకపోతే, ‘గడచిన శతాబ్దం లో ఫలానా వాళ్ళు మాత్రమే కవులు ‘ అన్న వేలూరి వేంకటేశ్వర రావు గారి వ్యాఖ్య ఆయన వ్యక్తిగత అభిప్రాయం! మిక్కిలి అభిమానంతో కొందరు సాహితీ ప్రియులు చేసే అట్లాంటి వ్యాఖ్యలు సాహిత్య చరిత్రలో ప్రామాణిక వ్యాఖ్యలుగా తీసుకోనవసరం లేదు !
” గడచిన శతాబ్దంలో ఫలానా వాళ్ళు మాత్రమే కవులు ‘ అని మిక్కిలి అభిమానంతో కొందరు సాహితీ ప్రియులు చేసే వ్యాఖ్యలు సాహిత్య చరిత్రలో ప్రామాణిక వ్యాఖ్యలుగా తీసుకోనవసరం లేదు !” అని వివరణ ఇచ్చి, నా తొందరపాటు వ్యాఖ్యను సవరించినందుకు ధన్యవాదాలు విజయకుమార్.
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవివరేణ్యులు ఎందరెందరో, అందరికీ వొందనములు. వారందరిలోని కొందరినైనా పరిచయం చెయ్యాలనే మీ ప్రయత్నం శ్లాఘనీయం.
రామయ్య గారు … మీ సహృదయ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు !
wonderful analysis sir