కొత్త పుస్తకం కబుర్లు

ఏకాంతంలో సమూహ వేదనల గానం – రామా చంద్రమౌళి కవిత్వం

ఏప్రిల్ 2016

‘Writers don’t write from experience, although many are hesitant to admit that they don’t. If you wrote from experience, you’d get maybe one book, maybe three poems. Writers write from empathy’ — Nikki Giovanni

రామా చంద్రమౌళి గారు విస్తృతంగా రాస్తోన్న కవి, రచయిత. ఒక వైపు కవిత్వం, మరొక వైపు కథలు, నవలలు, పుస్తక సమీక్షలు – ఇట్లా సాహిత్యం లోని అన్ని ప్రధాన విభాగాలలోనూ రచనలు చేస్తున్నారు. ఇప్పటిదాకా, 300 పై చిలుకు కథలు, 9 కవితా సంపుటులు, 18 నవలలు వెలువరించారు. ‘ఒక ఏకాంత సమూహం లోకి’ అన్నది ఆయన తాజా కవితా సంపుటి. ఆయన కవితా సంపుటుల వరుసలో పదవది.

ఆశ్చర్యం ఏమిటంటే, దాదాపు 1970 లలో ఆయన రచనా వ్యాసంగం ప్రారంభించి మధ్యలో సుమారు రెండు దశాబ్దాలు సుదీర్ఘ విరామం తీసుకున్నప్పటికీ, ఇన్ని పుస్తకాలు వెలువరించడం! అంతేకాదు SAARC సాహిత్య శిఖరాగ్ర సభలలో తెలుగు నుండి వరుసగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కవి రామా చంద్రమౌళి గారు.

చంద్రమౌళి గారి తాజా కవితా సంపుటి ‘ఒక ఏకాంత సమూహం లోకి’ చదివితే మనకు మరొకసారి అర్థమయే సంగతి ఏమిటంటే, ఆయన తన చుట్టూ వున్న వాళ్ళ జీవితాలని బాగా పట్టించుకుంటారని, అందుకే, ఆయన ఇంత విస్తృతంగా కవిత్వం వెలువరించగలుగుతున్నారని!

తన తాజా కవితల సంపుటికి రాసుకున్న ముందు మాటలో తన కవితలు వెలుగు చూసే తీరుని గురించి చంద్రమౌళి గారు ఏమంటున్నారో చూడండి -
‘శ్రేష్టమైన శిల కనబడగానే, దాంట్లో నాక్కావలసిన శిల్పం దాక్కుని ఉందా అని ప్రశ్నించుకుని, శోధిస్తూ శోధిస్తూ, శిలా హృదయం లోకి యాత్రిస్తూ యాత్రిస్తూ ఎక్కడో గర్భంలో ఒక రహస్యాన్ని దర్శించి, అప్పటిదాకా నాలో నిశబ్దంగా ఒక కవితను కాగితం పైకి వర్షిస్తా. తగిన శిలను గుర్తించిన తరువాత, పైనున్న వ్యర్థ శిలా భాగాన్ని నేర్పుగా, నైపుణ్యంతో తొలగిస్తూ కొనసాగడమే శిల్పీకరణ అయితే, తర్వాత శిల్పం దానంతట అదే దేదీప్యమానమై ఆవిష్కృతమవుతుంది’

అందుకే, ఆయన కవితలలో పీడిత ప్రజలు, పీడించే పాలకులు, అధికారులు, సేక్రేటేరియట్లు, పైరవీ కారులు, ఒంటరి స్త్రీలు, సంసారాలలో బాధిత స్త్రీలు ఇలా ఒకరని కాదు, చాలా మంది అగుపిస్తారు. కొన్ని కవితలలో అందరూ ఒకేసారి కవిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ కూడా అగుపిస్తారు.

ఇంతాచేసి, ‘ఒంటరితనం కూడా కవిత్వానికి లొంగదు’ (కవిత్వానికి లొంగనిది) అని బాధపడి పోతాడు కవి.

‘ఒక ఏకాంత సమూహం లోకి’ లో మొత్తం 31 కవితలు వున్నాయి. ఇందులో 31 వ కవిత ఒకింత దీర్ఘ కవిత. కవి అండమాన్ యాత్రకు వెళ్ళినప్పటి అనుభవాల కవిత్వం.
చంద్రమౌళి గారి కవిత్వంలో సాధారణంగా కనిపించే అంశాలలో ఒకటి ‘ప్రశ్నించడం – ప్రశ్నించబడడం’! ఆయన కవితలు, సమాజానికి ఒక మేధావి వేసే ప్రశ్నలు. కొన్ని సార్లు తనకు తాను వేసుకునే ప్రశ్నలు.

‘మనిషి వంగి లొంగి ఒక ప్రశ్నగా మిగుల్తున్న క్షణాన తెలుస్తుంది
జీవిత చరమంలో … మనిషి జీవితాంతం ప్రశ్నించబడ్తూనే వుంటాడనీ
ప్రశ్నించడమంటే భయపెట్టడమనీ,
ప్రశించబడ్డమంటే భయపడడమనీ …. చాలా ఆలస్యంగా’
(‘ప్రశ్నించడం … ప్రశ్నించబడడం’)

ఒక్కోసారి చంద్రమౌళి గారి కవిత, అడవి దారులలో ముందుకు వెళుతూ దృష్టికి వచ్చిన అన్నింటినీ రికార్డు చేస్తూ పోయే మూవీ కెమెరా కన్ను లా వుంటుంది. ఈ తాజా కవితా సంపుటిలో అధిక భాగం కవితలు ఒక దృశ్యాన్ని వర్ణిస్తూ కథా కథన శైలిలో సాగడం గమనించ వచ్చును. పెన్సిల్వేనియా – వుడ్స్ ఎడ్జ్ దగ్గరలోని అడవిని వర్ణిస్తూ సాగిన ‘అరణ్య రహస్యం’ కవిత లోని ఈ ఖండిక చూడండి -

‘ చివరి రోజు …. చివరి నడక …. చివరి స్పర్శ
చూపులు తాబేలును వెదుకుతాయి … జింక కోసం తహ తహ
సెలయేటి పాటేది ….. నీటి బాతు చప్పుడేది
నన్ను ఒడిలో కూర్చోబెట్టుకున్న నా ఖాళీ కర్ర కుర్చీ ఏది
వెదుకులాట …. తడుములాట …. తండ్లాట
అడవిలోకి వెళ్ళిన నాలోకి అడవే ప్రవేశించి …. ఆక్రమించిన తర్వాత
అడవిని పిడికెడు గుండెల్లో ధరించి వస్తున్న …. దాచుకుని వస్తున్న నాలో
ఎంత దు:ఖమో …. ఎంత శూన్యమో … సముద్రమంత … ఆకాశమంత’

ఈ కవితా సంపుటిలో, ఫేస్బుక్ లాంటి అంతర్జాల సామాజిక మాధ్యమాలలో తరచుగా వుండే వాళ్ళను ఉద్దేశించి చంద్రమౌళి గారు రాసిన ‘పేస్ బుక్ గోకుడు’ అనే శీర్షికన ఒక వ్యంగ్య కవిత కూడా వుంది.

‘ఒకటి పేస్ బుక్ మరొకటి వాట్సప్ అని రెండు రోగాలతనికి
ఫ్రీగా వస్తే ఫినాల్ ఐనా తాగుతా … తత్వానికి బానిస

…. అతనొక ఇ- క్లాస్ కవి
ఎక్కడేక్కడివో పది వచన వాక్యాలను తుంచి … విరిచి … పేర్చి
ఒక వచన కవితను తయారు చేస్తాడు

పేస్ బుక్ లో … ఫలానా పత్రికలో నా ఫలానా కవిత అని
ఇక మరుక్షణం నుండి ‘లైక్’ ల కోసం నిరీక్షణ
బాత్రూం లోకి వెళ్లి వేన్నీళ్ళను పోసుకుంటూ ఒకటే గోక్కునుడు ఒళ్లంతా’

ముప్పయ్యొక్క విభిన్న కవితల సమాహారమైన ఈ ‘ఒక ఏకాంత సమూహం లోకి’ కవితా సంపుటి, రామా చంద్రమౌళి గారి అభిమానులందరూ తప్పక చదవ వలసిన పుస్తకం.

***

పుస్తకం వివరాలు:
‘ఒక ఏకాంత సమూహం లోకి’ – రామా చంద్రమౌళి కవితా సంపుటి
వెల: రూ 80/- ; $5
ప్రతులకు: రామా చంద్రమౌళి H.No 11-24-498, టెలిఫోన్ భవన్ లేన్, పోచమ్మ మైదాన్, వరంగల్ – 2

**** (*) ****