కవిత్వం

తడి గాలం

ఏప్రిల్ 2016

నిదురలోకి జారుకోవటం తెలియని
ప్రతి అస్తిత్వం లిఖించే
సంఘర్షణా ప్రతులలో
కొన్ని వాక్యాలుగా అలుముకోవడం
ప్రతి నాకూ ప్రతి నీకు కంఠో పాఠమే కదా

సంస్థాగత వ్యామోహాలని తప్పించుకోలేని
నాగరిక విన్యాసాలలో
ప్రతి జీవనం పొడిబారటం నిజమే కావచ్చు
అయితేనేం ఎక్కడో ప్రతి మనలో
తడిగాలమొకటి సిద్ధంగా ఉండే ఉంటుంది

కళ్ళల్లో మెరుపు లిఖించబడి ఉన్నన్నాళ్ళూ
శూన్యం దరి చేరని ఏకాంతాలు
జీవితం మీద పెంచే ఇచ్ఛని
అద్దుకున్న వాడికి శాపాలైనా వరాలైనా
బతుకులో పెద్ద తేడా ఉండదులే

స్వప్నాలు అమ్ముకోవడం వచ్చిన వాడికి
కష్టాన్ని నమ్ముకోవటం రాదనుకోవటం
ద్వేషాంకురానికి తొలిశ్వాస అన్నది
చరిత్రలో ఏ శాసనం మీదా
చెక్కబడని జీవన సత్యం

అందరి శ్రమకీ చెమట కారటమే నిదర్శనమైతే
మనిషి తిరిగినంత మేరా చిత్తడి నేలలు తప్ప
ఇంకేమీ ఉండేవి కాదు
ప్రతి తానూ ఒక శ్రమజీవేనన్న నిజం అతిశయోక్తిగా కనిపించినంత కాలం
కొన్ని నరాలు రగులుతూనే ఉంటాయి

అలకూ అలకూ మధ్య విరామాన్ని భరించలేనంత
అసహనం తీరానికి ఉండి ఉంటే
ఇక్కడ నీటికి తప్ప మనిషికి ఆరామాలు ఉండేవే కాదు
నలుపూ తెలుపులని రెండు పార్శ్వాలుగా
చూడగలిగే ప్రతి మనిషికీ జీవితం వడ్డించిన విస్తరే

మనసు చదవగలిగే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు
బాహ్యాంతరాల సరిహద్దు రేఖపై నువ్వు నిలబడ్డప్పుడూ
మలినాలకి మరణ శాసనం లిఖిస్తూ
ఒకానొక స్వచ్ఛతకి నిర్వచనంలా మారేలా
అలలు అలలుగా ఒక నవ్వు విరబూయాలి… ఒకే ఒక్క నవ్వు