1
చాలాసార్లు చిరాకనిపిస్తుంది,
తాళింపులోకి కూరలా,
ఒక్కో నిజానికి, కొన్ని అబద్దాలను
అలవోకగా కలుపుతున్నప్పుడు.
2
కొన్ని సార్లు మనసు తెల్లబోతుంది,
లోపలంతంత పెట్టుకొని,
ఎదుటోడే ప్రపంచమన్నట్లు
ముఖానికి ఓ ముసుగు తగిలించుకొని,
అదేపనిగా ముచ్చట్లాడుతున్నప్పుడు.
3
ఎప్పుడైన విచిత్రమనిపిస్తుంది
పిసురంత ఆపేక్షకు తట్టుకోలేక
దేన్నో పగలుగొట్టుకొని
మాటల ప్రవాహం దూకినప్పుడో,
కనుల కింద, ఓ పల్చటి కన్నీటి తెర
రెపరెపలాడుతున్నప్పుడో,.
4
అప్పుడప్పుడు అబ్బురమనిపిస్తుంది
మనసు లోతుల్లోకి వేసిన గాలానికి,
ఎప్పుడెప్పుడో జారిపోయిన భావాలు కొన్ని,
అనుకోకుండా గుత్తులుగా తగులుకున్నప్పుడో,
నా ప్రమేయం లేకుండానే,పేపరు తీరానికి,
ఏ మూలలనుంచో,అప్రయత్నంగా,
కొన్ని వాక్యాలు కొట్టుకొస్తున్నప్పుడో..
తొలిసారి నా కవితను ఒక పత్రికలో చూడటం,కొత్త అనుభూతి, ప్రచురించిన వాకిలి సంపాదక వర్గానికి, ప్రోత్సహించిన అఫ్సర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.,
భాస్కర్ గారు: ఏ ప్రమేయం ఏం చేస్తుందో తెలీదు. ఆ స్థితిని కవిత్వంలోకి మార్చాలని చాలా కాలంగా నా ప్రయత్నం. నేను విఫలమయ్యాను. మీరు సఫలమయ్యారు ఈ కవితలో!
పాఠకుని మనఃస్థితే కవిత సఫలతను,విఫలతను నిర్ణయిస్తుంది, బహుశా మీ సహృదయతే నా సఫలతయ్యుండచ్చు,ధన్యవాదాలు అఫ్సర్ గారు,…