ఆ పొద్దు రెయ్యి నేను ఈరవ్వ వాళ్ళింటికి పోయింటి పనుకునే దానికి. ఈరవ్వ నన్ను చానా బాగా చూసుకొంటాది. తల్లిలేని బిడ్డనని నన్ను చేరదీసేది. ఈరవ్వది అడ్డపు ఇల్లు. అంత అరువుగా ఉంటాది ఆ ఇల్లు. పగోల్లకైనా కొంచేపు కుచ్చుని పోవాల అనిపిస్తాది ఆ ఇంటిని చూస్తే.
నేతదూడలు పచ్చికసువు మేసి వేసేపేడ నున్నంగా, పచ్చంగా ఉంటాదని ఊరంతా తారాడి తారాడి ఆ పేడని ఏరుకోని వస్తాది. చెమ్ముతో నీళ్ళు తెచ్చుకొని, నట్టింట్లో అరచేత్తో కలిపి ఇల్లంతా అలికి, పైన సన్నని ఈన్లు తీస్తాది పట్లుపట్లుగా. ఎండినంక చూస్తే బండిబాట మారిగా ఉంటాది అలికిన తావున. అందరూ ఇల్లలికినపుడు మూడు పట్లు తీస్తే, ఈరవ్వ మటుకు ఐదు పట్లు తీస్తాది. పట్టు పట్టుకి నడాన అందరూ నిలువు గీట్లు తీస్తే అవ్వ మటుకు కులుకులు గీస్తాది. ఆరినంక ఆ కులుకులు అంతే అందంగా కనిపిస్తాయి.
అందరూ దగ్గరి చేనులో దొరికే ఎర్రమన్నును ఎత్తుకోనొచ్చి అరుగోడు ఎత్తుతారు. ఈరవ్వ మటుకు ముద్దలగుట్టకు పోతాది. ఆడ ఉన్నట్టు ఎర్రమన్ను చుట్టుపక్కల ఏడా ఉండదు. ఎర్రంగా నున్నంగా రంగున్నట్టుంటాది. బానలోకి తెచ్చిపెట్టుకొనుండే ఆ ఎర్రమట్టిని కావలసినంత దుత్తలోకి తీసుకొని నీళ్ళు కలుపుకొని ఇల్లంతా సుట్టకారం సన్నపట్టీ లాగా అరుగోడు తీస్తాది. అలికిన పొయ్యిగుండ్లకు అరుగోడు ఎత్తి రంగు పసుపుతో బొట్లు పెడతాది.
ఈరవ్వ ముగ్గేస్తే చూడాల. పిండిని అరచేతిలోకి ఎత్తుకొని, నాలుగేళ్ల సందుల్లో నింటి విడస్తా, నాలుగు గిర్రల్తో నేలకానించి పీట ముగ్గు వేస్తాది. అందరికీ రెండేళ్ళ సందుల్లోనే పిండిడస్తా ముగ్గేసేది వచ్చు. నాలుగేళ్ల సందుల్లో నింటి విడిచేది రాదు. మా ఊర్లో అయితే పీట ముగ్గేసేది ఈరవ్వకు తప్ప ఇంకెవరికీ సదరంగా రాదు. ఎవరింట్లో పెండ్లి జరిగినా పెండ్లిపీటల కింద వేసే పీటముగ్గుకి ఈరవ్వ పోవాల్సిందే.
ఇంట్లో ఏడ ఉరువులు ఆడ ఉంటాయి. దన్నెమ్మీద గుడ్డలు మడతలేసి మట్టసంగా వేలాడుతుంటాయి. దొంతుల్ని బాగా అలికి పెట్టుకోనుంటాది. దీగూట్లో దినమ్మూ దీపం పెడతాది.
అందుకే నాకు ఈరవ్వ వాళ్ళ ఇల్లంటే నాకు అంత ఇష్టం. ఆ యవ్వ కూడా పిల్లోల్లని బాగా చేరతీస్తాది. అది చెప్పచ్చా ఇదిచెప్పచ్చా అని లేదు, అన్ని కతలూ చెబతాది. పిల్లోల్లమంతా ఆ యవ్వ సుటకారమూ కుచ్చుని, అవ్వ వక్కాకులు నమలతా ఉంటే ఆయమ్మ నోటికల్ల ఎగజూస్తా, ఆయమ్మ చెప్పే మాటల్ని ఊ కొట్టుకుంటూ వింటా ఉంటాము.
నేను ఈరవ్వ పక్కలో పణుకొని “అవునవ్వా నిన్న రెయ్యి కత చెబుతానని నన్ను రమ్మంటివే, నీకోసం చూసి చూసి నిదర బోతిని ఏడకి బోయింటివవా? ” అంటి.
“అయ్యో పోయమ్మా, మీతాత చూసేదానికి అట్లుంటాడు కానీ బలేటోడు. పైకి పచ్చారు పాము ఇంట్లో ఉల్లేరుపాము. నిన్న పగలంతా ఎర్రటి ఎండలో కొండ్రెడ్డోల్లకి మడి కోసి, ఇంటి కొచ్చి సంగటి చారూ చేసేతలికి ఒళ్ళు ఉడుకై పోయింది. బొగ్గిలికి పేడ మెత్తిచ్చుకొని అలిసిపులిసి పనుకుంటి. చేసిపెట్టిన సంగటి తినేసి, అంచున పనుకుని రా రా అని పెరకతా ఉండె. ‘ ఏయ్ నేను కాదు పో ‘ అని గదురుకుంటి. ఆ మాటతో గుర్రున లేసి అలిగి నేరుగా అంకేనిపెంట దోవంటి పోతా ఉండాడు. నా మనసు ఉండలా. నేనూ వెనకాల్నే పోతి. బండి బాటంటి పోతా ఉండాడు. నేను ఆదరా బదరా పరిగెత్తి అడ్డంబడి ‘ ఏడకి బోతుండావు ‘ అని అడిగితి. ‘నిన్నెవరు రమ్మనింది, నువ్వింటికిపో, నేను రాను’ అన్నాడు. ‘మన బాదలేమన్నా ఉంటే ఇంటికాడ పడదామురా’ అంటే కూడా వినలా. ‘ఇప్పుడే కావాల, ఈడ్నేకావాల’ అని మొండికేసుకున్నాడు. ‘ఒరే వీడాకు చినగ, వీడు ఇనేటట్లు లేడే ‘ అనుకుని ఆడ్నే తినబెట్టుకుని ఇంటికి పిలుచుకొస్తిని. మేము ఇంటికొచ్చే తలికి నడి రెయ్యి దాటింది బిడ్డా” అని చెప్పింది ఈరవ్వ.
” ఆ అడివిలో ఏముండాదివా మీరు తినేదానికి ” అని నాకు తెలవక అడిగితిని.
” తినేది కాదే తిక్కదానా, అదేందో నీకిప్పుడు తెలీదులే ” అని ఏదో చెప్పి నన్ను నిదురబుచ్చింది ఈరవ్వ.
**** (*) ****
illustration: Kiran B.
కథలో రాయలసీమ యాస చాలా బాగుంది. సగటు రాయలసీమ పల్లెల్లో కనబడే చిత్రాలు కళ్ళకు కట్టినట్లుగా వివరించబడ్డాయి. ఒక సున్నితమైన విషయాన్ని ఎంత సున్నితంగా చెప్పొచ్చో దాన్ని ఒక పసి ప్రాణానికి చెప్పడంద్వారా సాధించారు.
ధన్యవాదాలు.
చంద్రశేఖర్.
కర్నూలు.
Ee rachana chadivaka ‘ Penna kadhalu’ gyapakam vachayyi. Rayala seema bhasha lo rachanalu chala arudu. Manchi galpikalu dhanyavaadalu …!