కథ

ఓరియో స్వగతం

మే 2016

ప్రపంచవ్యాప్తంగా
కుక్కలెన్ని లేవు
ఏ కుక్క ఎక్కడికి చేరుతుందో
ఎవరికి ఎరుక
నేనూ అంతే
ఎక్కడో చైనా సంతతి నాది
అమ్మను చూసిన జ్ఞాపకం తప్ప
నాన్నెవరో నాకు తెలియదు
చల్లటి పచ్చిక ప్రాంతంలో పెంచి
ఎవరో నన్ను పెంచుకుందా మంటే
వారికి ఎందుకిచ్చారో కూడా తెలియదు

అయితేనేం వారిది
గొప్ప ఇల్లు
నాకు ప్రత్యేకమైన తిండి వైద్యంతో
వారు నన్ను ప్రేమగా చూసుకున్నారు
బయట వాతావరణం ఎలా ఉన్నా
క్రమం తప్పకుండా నన్ను షికారుకు తీసుకుపోయేవారు
బయటకు పోతే
నన్ను, నా బొచ్చుని తాకాలని
చిన్న పిల్లలు సైతం ఉబలాట పడే వారు
భయపడుతూనే దగ్గర కొచ్చేవారు
వారిముందు మోకరిల్లి నేను చూపించే ఉత్సాహానికి
వారంతా ముచ్చట పడిపోయి
గంతులేసే వారు

యజమాని పిల్లలకు నేనొక ఆట బొమ్మని
ఏ మాత్రం సమయం దొరికినా
నాతోనే ఆడుకునేవారు
వారితో ఆడుకోవడం
నాకూ సరదాగానే ఉండేది

నా వైభోగం చూసి
తట్టుకోలేని రికామీ కుక్కలు
నన్ను తరమాలని కరవాలని
చాటుమాటుగా ఎదురుచూసేవి
నా ఆకారం చూసి భయపడేవో
నా యజమానిని చూసి దాక్కునేవో తెలియదు గానీ
ఆ కుక్కల ఆటలు ఎప్పుడూ సాగలేదు

పోలిక కాదు గానీ
అంతకు ముందు యజమానికి
నన్ను ప్రేమగా చూసుకునే తీరికే ఉండేదికాదు
అక్కడ ఇంటా బయటా రకరకాల కుక్కలుండేవి
అన్నింటికీ చిన్న చిన్న గదులుండేవి
అందులోనే తిండి అన్నీనూ
మా పోషణ ఎవరో ఒకరు చూసే వారు
ఉన్నట్టుండి కొన్ని కనిపించేవి కాదు
కొన్ని కొత్తవేవో అప్పుడప్పుడు వచ్చి చేరేవి

ఇక్కడలా కాదు
నా యజమానురాలు
ఆమె పిల్లల్లా నన్ను చూసుకునేది
నన్ను ఎత్తుకునేది
చేత్తో తినిపించేది
తానే స్నానం చేయించేది
బయటకు తీసుకుపోతే తప్ప -
ఇంట్లో నన్ను కట్టేసి ఉంచటం
అస్సలు నచ్చేది కాదు ఆమెకు
నేను తినకపోయినా తాగకపోయినా
ఉత్సాహంగా కనబడకపోయినా
నేను యధాప్రకారం కనిపించేవరకూ
ఆమె దిగాలుపడిపోయేది
నాకేవేవో షోకులు చేసేది
ఫోటోలు తీసేది
నన్ను అందరికీ చూపిస్తూ మురిసిపోయేది
నాకు ఇష్టమైన తిండికోసం
రకరకాల తిండ్లు మార్చేది
వైద్యుల దగ్గరకు తీసుకుపోయి
వారు చెప్పిందల్లా చేసేది

ఒకరోజు
నన్ను బయటకు తీసుకు పోయిన పిల్లలు
వారి ఆటల్లో వారు పడిపొయి
నన్ను వదిలేసి మరచిపోయారు
నేను కూడా స్వేచ్చ దొరికింది కదా అని
అటెటో ముందుకుపోయాను
ఎటు పోయానో ఏమో నాకూ తెలియలేదు
వెనక్కి తిరిగిరాలేక
ఎటెటో నక్కి నక్కి తిరిగాను
నన్ను పిలుస్తూ
నన్ను పట్టించుకోని
వారి పిల్లల్ని తిడుతూ
ఆ ఇంటిలోని వారంతా
నేను దొరికే వరకూ
ఎంత తిరిగారో -
నేను దొరికాక
వాళ్ల సంతోషం నిట్టూర్పులే చెప్పాయి

ఇంటిలో ఎవరినైనా పలకరించే పద్దతి
నాకొకటి అలవాటయి పోయింది
గెంతుకుంటూ దగ్గరకుపోవడం
పళ్లతో వారి బట్టలు లాగడం
వారు లాలించినపుడో కావల్సినపుడో
నెమ్మదిగా గోకడం లాంటివి
వాటికి వాళ్లూ అలవాటుపడ్డారు
కొత్తవాళ్లెవరైనా ఇంటికొస్తే
ఎవరైనా ఆశ్చర్యపోయేవారు
భయంతో దూరంగా జరిగిపోయేవారు
ఇంటిలోవారు ఏమీకాదని ఎంత అభయమిస్తున్నా

నేనంటే ఆ ఇంటి వారికంత నమ్మకం
ఏ ఇతర కుక్కల్నీ వారు భరించ లేకపోయేవారు
నేనూ అంతే
మరో కుక్కనే కాదు
ఇంకెవరి పిల్లలనైనా
ఇంటిలో వారు దగ్గరకు తీసుకున్నా
ముద్దుచేసినా నాకు నచ్చేది కాదు
అరిచి నానా యాగీ చేస్తే
వారికీ అర్ధం అయిపొయేది
అమ్మో
నాకు వాళ్ల భాష అర్ధం అయినట్టు
వాళ్లకు నా భాషా బాధా కూడా
చప్పున తెలిసి పొయేది
అదెలాగో ఏమో

అలా అని
నా మూలంగా వారికి గాని
వారి మూలంగా నాకు గాని
ఇబ్బందులు లేకుండా లేవని కాదు
అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా

నేను లేకుండా కాస్సేపటికైనా
బయటకు వెళ్లాలంటే
నాకు తెలియకుండా వెళ్లడానికి
వాళ్లు రకరకాల ప్రణాళికలు వేసుకునేవారు
ఒక్కోమారు అవి నాకు తెలిసిపోయి వెంటపడితే
విసుక్కునేవారు కసిరేవారు కూడా
ఎందుకో అందరి మధ్యా ఉండి ఉండి
ఎవరూలేకుండా ఉండటం నాకు ఇష్టముండేది కాదు
ఎలాగో నన్ను లోపలుంచి వెళ్లగలిగినా
ఇంటికి తిరిగొచ్చి
నేను ఎలా ఉన్నానో చూసేవరకూ
వారికీ మనసొప్పేది కాదనుకుంటాను
ఇంటికొచ్చిన వెంటనే
నన్ను ఎంత లాలించేవారో

ఒక్కోమారు
కొన్ని రోజులకోసం ఇంటందరూ
బయటకు పోవాల్సి వస్తే
వారికి నేనే ఒక పెద్ద సమస్య
నన్ను తీసుకుపోలేక
ఎవరి దగ్గరో వదిలి వెళ్లలేక
నానా యాతనా పడిపోయేవారు
వారితోబాటు నన్ను కూడా
ఎందుకు తీసుకుపోలేరో
నాకూ అర్ధం కాక
నాకు వాళ్లమీద బొలెడంత కోపమొచ్చేది

ఇంతలో
యజమానురాలికి జబ్బుచేసింది
పిల్లలు నన్ను చూసుకుంటూ గడపడంలో
వారి చదువులు నాశనమవుతున్నాయని
యజమాని గ్రహించి విసుక్కోవడం మొదలయింది
నామీద ఎంత సానుభూతి ప్రేమా ఉన్నా
రానురాను నేను
ఇంటిలో అందరికీ బరువయాను

నన్ను చూసుకుందుకు
ఎవరినో వారు తెచ్చుకున్నా
అదేదో పనిలా
వారు చూస్తున్నపుడు ఒకలా
లేనప్పుడు మరోలా చూసే అతను
వారికే కాదు
నాకూ నచ్చలేదది

ఉన్నట్టుండి ఒక రోజు
నా ఇల్లు మారింది
యజమాని మారాడు
అంతా తెలియని కొత్త ప్రదేశం
ఏమి చేయాలో నాకు తెలియలేదు
ఆ పాత ఇల్లు
ఆ ఇంటిలో అందరూ గుర్తొచ్చి
అరిచాను ఏడ్చాను తిండి మానేసాను
అవన్నీ ఎన్నాళ్లో చేయలేకపోయాను

నాకు తెలియకుండానే కొన్నాళ్లకు
ఏ యజమానికైనా ఎవరికైనా కుక్కనైన నేను -
నా పేరు పాతదైనా కొత్తదైనా
కొత్త వారితోనూ కలగలిసిపోయాను
ముందులా అంత బాగున్నా బాగులేకపోయినా

**** (*) ****

(1996లో సాహిత్యానికి నోబెల్ బహుమతి గ్రహీత – స్వర్గీయ విస్లావా సింబోర్స్కాకు కృతజ్ఞతలతో, మా ఓరియోకి ప్రేమతో)