3
డిసెంబర్ 2015లో హమీర్ వాళ్లమ్మగారి అమెరికా ప్రయాణం గూర్చి చెప్పుకోవాలంటే ముందు అదే సంవత్సరంలో చివరి మూణ్ణెల్లలో హమీర్ జీవితంలోని ప్రత్యేక సంఘటన లేవో తెలుసుకోవాలి -
***
హమీర్ డెన్వర్‌నించీ వచ్చిన తరువాత అమానితో తరచుగా కలుస్తాననే అనుకున్నాడు. అయితే, అమాని అతని ఫోన్ కాల్స్‌ని ఎప్పుడూ ఆన్సర్ చెయ్యలేదు. అతనికి విసుగొచ్చి ఆమె గూర్చి ఆలోచించడం మానేద్దా మనుకున్నంతలో అక్టోబర్లో ఆమెనుంచీ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది – “డూ యు వాంట్ టు డేట్?” అని.
“డేట్ హూ?” అని కోపంగా రిప్లై ఇద్దా మనుకున్నాడు గానీ, కొంచెం శాంతించి, “డోన్ట్ నో మచ్ అబవుట్ డేటింగ్!” అని జవాబిచ్చాడు.
“నాక్కూడా తెలియదు!” అని జవాబొచ్చింది. ఏమని రెస్పాండ్ అవ్వాలా అని అతను ఆలోచిస్తున్నంతలోనే, “నీకు లవ్ లైఫ్‌లో అనుభవం వుందన్నావు గదా, ఏం చేసేవాడివో గుర్తు చేసుకో!” అని ఆమే మళ్లీ మెసేజ్ పంపింది.
“అప్పుడే మొదలయ్యిందా, పాత ప్రేయసిల వివరాలని అడగడం?” అని అనుకుని, “అప్పుడు వేరు. పూర్ స్టూడెంట్‌ని. పిజ్జాలతోనూ, బర్గర్లతోనూ, చీప్ బీర్లతోనూ సరిపోయింది. ఇప్పుడు నేను వాటిని సజెస్ట్ చేస్తే, మరీ ఇంత చీపా? పోరా, పో! అంటావు,” అని జవాబిచ్చాడు.
“ఓకె. ఐస్ స్కేటింగ్ దెన్!” అన్నది.
“సరే, ఎక్కడ?”
“రెస్టన్లో సన్ రైజ్ వేలీ మీదున్న రింక్ తెలుసా?”
“నువ్వుండేది స్ప్రింగ్‌ఫీల్డ్‌లో. నేను బాల్టిమోర్‌కి దగ్గరగా. అక్కడో, ఇక్కడో, లేక మధ్యలో డిసిలోనో కలవచ్చుగా?”
“రెస్టన్లో కలుద్దాం! శనివారంనాడు!”
అంతే. మళ్లీ కాంటాక్ట్ లేదు శనివారందాకా.
***
బయట వంద డిగ్రీల (ఫారెన్‌హీట్) టెంపరేచర్ వున్నా గానీ లోపల ఐస్ సర్ఫేస్‌ని మెయిన్టెయిన్ చేసే రింక్ అది. ఏడాది పొడవునా అక్కడ ట్రైనింగ్ క్లాసులు నడుస్తూనే వుంటాయి. ఆ క్లాసులకి నిర్ణీత సమయా లున్నట్లే, ఎవరయినా సరదాగా వచ్చి స్కేటింగ్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక సమయాలుంటాయి.
ఇంకా అక్టోబర్ మొదటి వారమే గనుక అప్పుడే వాతావరణం కొద్దిగా చల్లబడినా, ఆహ్లాదకరంగా వుంది. ఇబ్బందికరమయిన స్వెట్టర్ల అవసరం చాలామందికి ఇంకా రాని సమయం.
హమీర్ కొద్దిగా ముందుగానే వెళ్లి బిల్డింగ్ ఎంట్రన్స్‌లో నిలబడ్డాడు. లూజుగా వుండే పాంటు, దానిమీద లాంగ్ స్లీవ్ చొక్కామీద వి-నెక్‌తో వున్న మాక్‌నెక్ స్వెటర్ వేసుకున్నాడు. పార్కింగ్ లాట్‌లో కారు దిగి, నడుచుకుంటూ వస్తున్న అమానిని చూడగానే అతని పెదాలమీద చిరునవ్వు రాబోయి ఆగిపోయింది. “నీలాగా స్వెట్ పాంటూ, స్వెట్ షర్టూ వేసుకుని డేటింగ్‌కి వచ్చేవాళ్లని ఎవరూ చూసుండరు!” అన్నాడు ఆమె దగ్గరగా వచ్చిన తరువాత.
“దిసీజ్ మోర్ దాన్ డేటింగ్,” అన్నది. హమీర్ ఆశ్చర్యాన్నుండీ తేరుకోకుండానే, “దిసీజ్ స్పెషల్!” అని జోడించింది.
ఈ ట్విస్ట్ హమీర్‌కి అర్థం కాలేదు. ఆశ్చర్యాన్నుండీ కొద్దిగా తేరుకుని, “ట్రాఫిక్ ఎలావుంది?” అనడిగాడు. “లైట్‌గానే వున్నది,” అని లోపలకి దారి తీసింది.
కౌంటర్లో టికెట్లు కొనుక్కుని, అద్దెకి స్కేటింగ్ షూస్ తీసుకుని ఇద్దరూ బెంచీమీద కూర్చున్నారు ఆ షూస్‌ని వేసుకోవడానికి – వేసుకోవడం అంటే తాళ్లతో కట్టుకోవాలి. ఆ షూస్ చీలమండని (ankle) ప్రొటెక్ట్ చెయ్యడానికి మడమలని దాటి కొన్ని అంగుళాల పొడవుంటాయి. హమీర్ తన షూస్‌ని కట్టుకుని, లేచి నిలబడబోతూ అమానీని చూస్తే ఆమెకు సాయం కావాలని అర్థమైంది. ఆ షూస్ లేసులని కట్టి, ఆమెకి చేయూత నిచ్చాడు.
ఆమె లేచి నిలబడి, షూస్ క్రింద సన్నగా వున్న బ్లేడ్స్‌ని చూపించి, “ఇంత సన్నగా వున్న బ్లేడ్స్ మీద ఎలా నిలబడతా రసలు? ఇక్కణ్ణించీ ఆ రింక్‌లోకి నడవాలంటేనే భయ మేస్తోంది. వీటితో ఆ ఐస్ మీద జారాలా?” అని ప్రశ్నించింది.
అతను ఆశ్చర్యంతో, “నీకు స్కేటింగ్ రాదా?” అనడిగాడు. అడ్డంగా తలాడించింది.
“మరి నాక్కూడా రాకపోయుంటే ఏం చేసేదానివి?”
“నీకు రాకపోయుంటే ముందే చెప్పేవాడివిగా? కాకపోతే ఇంకోదాన్ని సజెస్ట్ చేసేవాడివి!” అన్న ఆమె లాజిక్‌కి హమీర్ దగ్గర జవాబు లేదు.
“ఆర్యూ ష్యూర్ యు వాంట్ టు గో త్రూ విత్ దిస్?” ఆమెని భయపెట్టడానికని కాదుగానీ, అతనికి కన్ఫర్మ్ చేసుకోవాలని అనిపించి అడిగాడు.
“ఆబ్సొల్యూట్లీ!” ధీమాగా జవాబిచ్చింది.
సన్నగా వుండే బ్లేడ్లున్న ఆ షూస్‌తో, మడమలు బెణక్కుండా వుండేలా ఎలాగోలా నడిచి ఐస్ రింక్‌లోకి అడుగుపెడుతూనే అమాని జారి పడబోయింది. అతను గట్టిగా ఆమె చేతిని పట్టుకుని గోడవైపుకు తీసుకెళ్లాడు. అక్కడ మోచేతిని ఆనించే ఎత్తులో ఆరంగుళాల వెడల్పులో ఒక చెక్క ఆ రింక్ చుట్టూ గోడకి కొట్టి కనిపించింది. ఆ చెక్కకి కింద మూడడుగులు ఒపేక్‌గా వుండేలా మెటల్ షీట్లు, పైన రెండడుగులు బయటికి కనిపించేలా ప్లెక్సి గ్లాస్ కలిసి గోడ ఆకారాన్ని కల్పించాయి. అమాని హారిజాంటల్‌గా వున్న ఆ చెక్కని పట్టుకుని మెల్లగా నడుస్తానని చెప్పింది. మళ్లీ అంతలోనే, చుట్టూ చూసి, తలుపులున్న చోట ఆ సపోర్టు చెక్క లేకపోవడాన్ని గమనించి, “ఈ సపోర్ట్ రింక్ చుట్టూరా లేకుండా అక్కడక్కడా బ్రేకులున్నాయి గదా, అక్కడెట్లా?” అనడిగింది.
“ఆ చోట్ల నేను నిన్ను వాటిని దాటిస్తాన్లే! అయినా, ఒక రౌండ్ వేసేటప్పటికి నువ్వే ఆ గోడ నొదిలి ట్రై చేస్తానంటావ్!” అని ఆగి, “పోనీ, ఒక పనిచెయ్యి. నేను నీ చేతులు పట్టుకుని, ఒక రౌండ్ వేయిస్తాను. తరువాత నువ్ ట్రై చేద్దూగాని,” అని ఆమెకు ఎదురుగా నిలబడి, మోకాళ్లని వంచి, పాదాలను కొద్దిగా వెడంగా పెట్టమన్నాడు. తన రెండు చేతులతో ఆమె చేతులని పట్టుకుని, తను వెనక్కు స్కేట్ చేస్తూ, ఆమెను ముందుకు లాగాడు. అలా రింక్‌లో కదులుతున్నప్పుడు అమాని తలతిప్పి చుట్టూ చూసింది. దాదాపు నాలుగేళ్ల వయసునుంచీ యాభయ్యేళ్ల వయసుదాకా వున్నవాళ్లు అక్కడ కనిపించారు. మరీ చిన్నపిల్లలకి పిర్రల వెనక ఒక దిండు కట్టివుండడాన్ని చూసి ఆమెకు నవ్వొచ్చింది. బిగినర్స్ కూడా వాళ్లంతట వాళ్లే కదలడాన్ని చూసి, “ఐ వాంట్ టు ట్రై మైసెల్ఫ్!” అని అతని చేతులని వదిలింది. అలా రెండడుగులు వేయగానే బాలెన్స్ తప్పి, గాలిని చేతులతో పట్టుకుంటూ, హమీర్ ఆమెకు తన చేతినందించే లోపలే పిరుదులు ముందుగా నేలని తాకుతూ కిందపడింది.
హమీర్ తన పాదాలని స్టెబిలిటీకోసం బాగా దూరంగా పెట్టి, మోకాళ్లని వంచి, ముందుకి వంగి ఆమె చేతులని పట్టుకుని లేపబోయాడు. లేవడంకోసం అమాని ఒక కాలుమీద బరువు నానించగానే అది జారిపోయింది. మొదటిసారి ఐస్‌మీద జారిపడ్డవాళ్లని లేపడం అంత తేలికయిన పని కాదు – పైగా, దాదాపు ఒకే ఒడ్డూ, పొడుగూ వున్న అడల్ట్‌ని. ఎలాగోలా లేచి నిలబడ్డ తరువాత, “నేను కూడా ఒక పిల్లోని తెచ్చుకుని వుండాల్సింది, బట్ ప్రొటెక్టర్ లాగా!” అన్నది అమాని.
తరువాత తనంతట తానే గోడవారగా వున్న సపోర్ట్ చెక్కని పట్టుకుని, మెల్లగా అడుగులో అడుగేస్తూ కదిలింది. తలుపున్న చోట్ల బ్రేక్ వచ్చినప్పుడు హమీర్ ఆమెకు చేయూత నిచ్చాడు. అలా రెండు రౌండ్లయిన తరువాత గోడవారనే నిలబడుతూ సపోర్టుని వదిలేసి మెల్లగా కదిలింది. గోడని అసలు పట్టుకోకుండా పదడుగులు వెయ్యగలిగే స్థితికి వచ్చేసరికి అరగంట పట్టింది. ఇంకో రెండు మూడుసార్లు పడినా, హమీర్ చేతిని పట్టుకోకుండా, గోడ సపోర్టు లేకుండా ఒక రౌండ్ వేసేసరికి ఇంకొక అరగంట పట్టింది. “ఇంక చాలు!” అని అమాని అన్న తరువాత స్కేటింగ్ షూస్‌ని వెనక్కిచ్చేసి బయటి కొచ్చారు.
పార్కింగ్ లాట్లోకి వచ్చిన తరువాత, “థాంక్స్ ఫర్ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్!” అని క్షణం ఆగి, “నువ్వింకా నా వెనగ్గా వుండి, నడుంచుట్టూ చెయి వేసి పట్టుకుని నేర్పిస్తా వనుకున్నాను!” అన్నది అమాని.
“సినిమాల్లో గన్‌ని గురిపెట్టడమో, గోల్ఫ్ క్లబ్‌ని స్వింగ్ చెయ్యడమో అమ్మాయిలకి నేర్పించడాన్ని చూపెట్టినట్లుగానా? సారీ టు హావ్ డిజప్పాయింటెడ్ యు! ఐ కెన్ మేకిటప్!” అన్నాడు హమీర్ ఆమెకు దగ్గరగా వచ్చి పెదాలమీద ముద్దుపెట్టడానికి సన్నధ్ధమవుతూ.
“ఇప్పుడు కాదు!” అంటూ ఆమె చేతివేళ్లని అతని పెదాలమీద పెట్టి వెనక్కి తోసి, తన కారు వద్దకు నడిచింది.
“మళ్లీ ఎప్పుడు?” అనడిగాడు. “ఐ విల్ టెక్స్ట్ యు!” అని వెళ్లి కార్లో కూర్చుని దాన్ని స్టార్ట్ చేసింది.
హమీర్ వాచ్ చూసుకున్నాడు. ఎనిమిది గంటలు అప్పుడే దాటింది. “శనివారం సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్లడం – అన్‌ఫెయిర్!” అనుకున్నాడు వెడుతున్న ఆమె కారు వైపు చూస్తూ.
***
“థాంక్స్ ఫర్ ది హెల్!” అమాని నించీ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది.
“ఇరవై నాలుగ్గంటలు కూడా పట్టలేదే, అనుభవం కాస్తా వండర్‌ఫుల్ నించీ హెల్‌గా మారడానికి!” హమీర్ జవాబిచ్చాడు.
“హెల్ అంటే ఏమిటో తెలుసా? తుమ్మబోయినా, నవ్వబోయినా ఎబ్డామినల్ మజిల్స్ గట్టిగా పట్టుకుని వాటిని రానీయకుండా అడ్డంపడి ఆపడం!”
“వచ్చేసారి ఇంత సమస్య వుండదులే. ఇన్నాళ్లూ ఆ మజిల్స్‌ని పట్టించుకోకుండా వున్నావు గదా, ఇప్పుడు అవి తమ ఉనికిని నువ్వు గమనించినందుకు సంతోషాన్ని తెలియజేస్తున్నాయంతే!”
“ది హోల్ బాడీ ఈజ్ సోర్. గట్టిగా పట్టుకున్నందుకు చేతులూ, కిందపడ్డందుకు పిర్రలూ, బిగబట్టి కదిలినందుకు తొడల కండరాలూ!”
“మసాజ్ చెయ్యడానికి నేను రెడీ,” అని కన్ను గొడుతూ వుండే ఎమోటికాన్‌ని చివర చేర్చి మెసేజ్‌ని పంపించాడు.
“దానికి కొంచెం టైముంది,” అమాని జవాబిచ్చింది.
“నెక్స్ట్ వీకెండ్?”
“రాబోయే రెండు వీకెండ్లూ నేను బిజీ. నవంబర్ ఫస్ట్ వీకెండ్.”
పెద్ద పెద్ద కంపెనీల సీయీవోల్లాగా వుంది! ఈవిడతో అపాయిన్ట్‌మెన్ట్ తీసుకోవాలంటే ఇంత వేచివుండాలా? అని అనుకుని, “ఈసారి కూడా అదే స్కేటింగ్ రింకా?” అని మెసేజ్ పంపాడు.
“కాదు. స్విమ్మింగ్.”
ఆమెకి స్విమ్మింగ్‌లో కూడా అనుభవం లేదని అతనికి అనిపించడంతో, “నీళ్లల్లో ముణుగుతూ నీళ్లు తాగేవాళ్ల చేత నీళ్లని కక్కించడానికి ఏం చేస్తారో తెలుసా?” అడిగాడు.
“ఆ ఆపర్ట్యూనిటీ వేరెవరికో దొరికే బదులు నీకే చిక్కిందనుకో?” ప్రశ్నకి ప్రశ్న బదులొచ్చింది.
***
రెస్టన్లో హంటర్స్ వుడ్స్ స్విమ్మింగ్ పూల్లో అమానీని కలిశాడు హమీర్ నవంబర్ మొదటివారంలో. సింగిల్ పీస్ స్విమ్మింగ్ డ్రస్ వేసుకుని, తలకి కాప్ పెట్టుకుని గట్టుమీదే ఆమె కూర్చుండిపోతే ఆమెకు చేతినందించి పూల్లోకి దింపాడు.
“ఎంతకాలంబట్టీ స్విమ్ చేస్తున్నావ్? ” అమాని అడిగింది.
“దాదాపు మూడేళ్ల వయసునించీ. మై డాడ్ బ్రాట్ మి హియర్ వెన్ ఐ వజ్ ఎ టాడ్లర్. దెన్, ఐ వర్క్‌డ్ యాజ్ ఎ లైఫ్ గార్డ్ వెన్ ఐ వజ్ ఇన్ హైస్కూల్. హి టుక్ మి టు స్కేటింగ్ ఆల్సో,” హమీర్ జవాబిచ్చాడు.
“లక్కీ టు హావ్ హిమ్ యాజ్ యువర్ డాడ్!”
వాళ్లు నిలబడ్డ చోట మూడడుగుల లోతు మాత్రమే వుండడం వల్ల అతను నీళ్లల్లో నిలబడి నీటిమీద వెల్లకిలా పడుకుని ఎలా సులభంగా తేలవచ్చో ముందుగా ఆమెకు నేర్పిద్దా మనుకున్నాడు. ఆమె వెల్లకిలా పడుకున్న తరువాత ఆమె నడుము క్రింద నామమాత్రంగా చేత్తో సపోర్టు నిస్తూ, “ఆడవాళ్లకి స్విమ్మింగ్ నేర్చుకోవడం తేలిక!” అన్నాడు.
“ఎందుకనో?” అడిగింది అమాని. ఆమె అలా తేలుతున్నప్పుడు కళ్లు, ముక్కు, నోరు నీటి ఉపరితలానికి పైభాగానే వుంటాయి గనుక మాట్లాడడం తేలిక.
“బాలన్సింగ్ పాయింట్ నాభి. మీకయితే దానికి పైనా, క్రిందా మాస్‌లు వుంటాయి గనుక.”
“వెరీ డిలేడ్ రెస్పాన్స్!” అన్నది అమాని. అతనికి అర్థం కాలేదన్న భావాలని అతని మొహంలో చూసి, “గుర్తులేదా? ఒమాహా ఎయిర్‌పోర్టులో అడిగిన ప్రశ్న?” సహాయం చెయ్యడానికి ప్రయత్నించింది. అప్పటికీ భావాలు మారకపోవడాన్ని చూసి, “నా బ్రెస్ట్స్ మీద కామెంట్ చెయ్యలే దేమని అడిగాను?” అన్నది.
ఆమెకు అంత దగ్గరగా నిల్చున్నప్పుడు అవి అతని కళ్లల్లో పడకుండావుండవు కానీ, ఆమె ప్రశ్న అతణ్ణి చటుక్కున వాటివైపు పూర్తి దృష్టిపెట్టి చూసేలా చేసింది. ఆ చూపుతోనూ, ఆమె ప్రశ్నతోనూ వళ్లు వేడెక్కుతుండగా, అంత దగ్గరగా కనబడుతున్న ఆమె వంపులని హత్తుకోవడానికి ప్రయత్నిస్తున్న కళ్లని ఆమె కళ్లవైపు బలవంతంగా తిప్పి, “యు ఆర్ కమింగ్ ఆన్ టు మి!” అన్నాడు.
“ఇఫ్ ఐ వజ్, ఇలాంటి పబ్లిక్ ప్లేస్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను?”
“ఐ నీడ్ టు హైడ్,” అని తన చూపులని బలవంతంగా ఆమె బ్రెస్ట్స్ వైపునించీ మరల్చి, ఆమెని అక్కడే నిల్చోబెట్టి, ఫ్రీ స్టైల్లో రెండు లాప్‌లు స్విమ్ చేసి వచ్చాడు. అతను వెనక్కి రాగానే, ఎత్తుకొమ్మన్నట్టు చిన్నపిల్లలా చేతులు చాచింది. ఆ చేతులని అలానే చేతుల వెడంలో పట్టుకుని ఆమెని ఈసారి పొత్తికడుపుమీద చేతి సపోర్టుతో బోర్లా పడుకోబెట్టి చేతులనీ కాళ్లనీ ఎలా ఆడించాలో చెప్పాడు. ఆమె అలా ప్రయత్నిస్తున్నప్పుడు, “ఇది గన్ పట్టుకోవడంలో లాగా, గోల్ఫ్ క్లబ్‌ని స్వింగ్ చెయ్యడమెలాగో చూపించడంలోలాగా నీ చుట్టూ చేతులేసి హత్తుకుని చూపించగలిగేది కాదు, నిన్ను నా వీపుమీద మోసుకుంటూ స్విమ్ చెయ్యగలిగే శక్తి నాకులేదు గనుక,” అన్నాడు స్కేటింగ్ అయిన తరువాత ఆమె చేసిన కామెంట్ గుర్తుకొచ్చి.
“టూ బాడ్. యు మిస్‌డ్ ది ఆపర్ట్యూనిటీ,” అన్నది అలాగే రోల్ అయి వెల్లకిలా తేలే పొజిషన్లోకి మారుతూ.
“ఇంకా దగ్గరగా చూడాలనుంది,” అన్నాడు ఆమె నడుంక్రింద చెయి వేసి సపోర్టు నిస్తూ.
“వాటీజ్ స్టాపింగ్ యు? ఓ చుట్టుపక్కలవాళ్లు చూస్తారనా?” అన్నది కిలాకిలా నవ్వుతూ. తను నడుము దాకా నీళ్లల్లో ముణిగి వుండడం మంచిదయిం దనుకున్నాడు.
“యు ఆర్ మేకింగ్ ఇట్ హార్డ్ ఫర్ మి,” అన్నాడు.
“అయామ్ ఎంజాయింగిట్,” అన్నది. ఇంకొక అరగంట అయిన తరువాత అమాని ఇక చాలు అనగానే ఆమెని గట్టుమీది కెక్కించి, తను రెండే అంగల్లో గట్టు మీది కెక్కి, కుర్చీమీద వున్న తన టవల్‌తో తుడుచుకుంటూ గోడవైపు తిరిగి నిలుచున్నాడు – ఆ పరిస్థితిలో మెన్స్ షవర్ ఏరియా కెడితే, అక్కడ అందరూ పూర్తి నగ్నంగా తిరుగూ వుంటారు గనుక తనని అలా చూస్తే బావుండదు అనుకుని.
షవర్ క్రింద నుల్చుని శుభ్రంగా స్నానం చేసి తుడుచుకున్న తరువాత డ్రస్ చేసుకుని బయటకు వచ్చాడు. అమాని బయటకు రావడానికి ఇంకొక అరగంట పట్టింది. ఆమెతో కలిసి బయట పార్కింగ్ లాట్‌లోకి నడుస్తూ, “డిన్నర్?” అన్నాడు.
“ఇవాళ కాదు,” అని జవాబిచ్చింది.
“మై ప్లేస్ ఆర్ యువర్ ప్లేస్ దెన్?” అనడిగాడు.
“దానికీ సమయముంది. ఇవాళ మాత్రం కాదు,” అన్నది. హమీర్ అక్కడే ఆగిపోయాడు. “కమాన్. యు ఆరె బిగ్ బాయ్, యు కెన్ హాండిలిట్,” అన్నది వెనక్కు తిరిగి.
ఈసారి కూడా తనని వట్టిచేతులతోనే పంపుతోందని గ్రహించి, వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ, “ఎట్ లీస్ట్ ఎ కిస్?” అన్నాడు ఆమె మొహంలో మొహాన్ని పెట్టి. “నెక్స్ట్ టైం!” అని ముందుకి తిరిగి నడవడం మొదలుపెట్టింది.
అతనికి ఇంటర్నెట్లో ఆమె పేరుకి దొరికిన అర్థాలు గుర్తుకొచ్చాయి: విషెస్, ఏస్పిరేషన్స్, హోప్స్. “అన్నీ తనతో పట్టుకుపోతోంది! వై యామ్ ఐ హాంగింగ్ ఆన్ టు హర్ లిటిల్ ఫింగర్?” చిరాగ్గా అనుకున్నాడు.
***
“మూవీ అండ్ డిన్నర్? ఏడు గంటల షోకి,” అమాని టెక్స్ట్ చేసింది.
“వుయ్ ఆర్ గోయింగ్ సమ్‌వేర్!” హమీర్ జవాబిచ్చాడు, ఆనందంతో పిడికిలి బిగించి, “యస్!” అంటున్న ఎమోటికాన్‌ని జోడించి.
“యస్. రెస్టన్ టవున్‌సెంటర్,” అమాని జవాబిచ్చింది.
“సాధారణంగా ఇక్కడందరూ డిన్నర్ అండ్ మూవీ అంటారు. అలాగయితే, మూవీ చూసిన తరువాత cuddle కావచ్చని!” టెక్స్ట్ పంపించాడు హమీర్.
“నాకంత తొందరగా డిన్నర్ చెయ్యడం ఇష్టం లేదు. అయినా మూవీలో కూడా cuddle కావచ్చు!” అమాని జవాబిచ్చింది. ఎంతయినా సీట్లల్లో కూర్చొని చూడడం కదా! అందుకే, అతననుకున్నట్టుగానే మూవీ చూసేటప్పుడు ఆ cuddling కాస్తా హమీర్ ఆమె భుజంమీద చెయ్యివేసి దగ్గరకు తీసుకోవడానికీ, ఆమె అతని భుజంమీద తలవాల్చడానికీ మాత్రమే పరిమితమయ్యింది.
“నీకు రెస్టన్ దాకా రావడానికి ఇబ్బంది లేదు. అలాంటప్పుడు బాల్టిమోర్ దాకానే రావచ్చుగా?” మూవీ చూసిన తరువాత ఆ టవున్ సెంటర్లోనే వున్న రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్నప్పుడు అన్నాడు హమీర్.
“ఎందుకో?” తెలియనట్టే అడిగింది అమాని.
“పబ్లిక్ ప్లేసుల్నించీ ప్రైవేట్ ప్లేసుల్లోకి గ్రాడ్యుయేట్ అవడానికి ఆస్కార ముంటుంది గదా అని!”
“అందుకే గదా, స్లోగా తీసుకుంటోంది!”
“ఎంత స్లో అంటే – ఒక లెక్కల పజిల్ గుర్తుకొస్తోంది. ఒకళ్లు స్ప్రింగ్‌ఫీల్డ్‌నుంచీ బాల్టిమోర్ వెళ్లడానికి ఇలా ప్లాన్ వేశార్ట. ముందు సగం దూరమెడతాను. అక్కణ్ణించీ, మిగిలిన దూరంలో సగందూరం వెడతాను. ఆ పాయింట్ చేరిన తరువాత మిగిలిన దానిలో సగందూరం వెడతాను. ఇలా అంచెలంచెలుగా చేరుకుంటాను,” అని.
“ప్లాన్లో లోపమేమీ కనిపించడం లేదే? చేరుకోవడం తప్పనిసరి అని తెలుస్తోందిగా!”
“వాళ్లు బాల్టిమోర్ ఎప్పటికీ చేరుకోలేరు అని గణితశాస్త్రం నిర్ధారించిన విషయం. ఎందుకంటే, ఎంతదూరం వెళ్లినా ఎంతోకొంత దూరం మిగిలిపోతుంది. ఉదాహరణకి, ఒక గజందూరం మిగిలిందనుకో, నెక్స్ట్ స్టెప్‌లో అరగజం దూరం – అంటే అడుగున్నర – మాత్రమే వెడతారు. అప్పుడు మిగిలిన పధ్ధెనిమిది అంగుళాల్లోనూ సగం దూరం వెళ్లడమంటే తొమ్మిది అంగుళాలు వెళ్లడం. ఎంతోకొంత ఎప్పుడూ మిగిలిపోతూనే వుంటుందన్నమాట. అంటే, ఎప్పటికీ గమ్యాన్ని చేరలేరు!”
“ఆ వెళ్లేవాళ్లు కార్లో వెడుతున్నారా?”
“పోనీ, అలానే అనుకో!”
“కారుకి పొడవు అనేది – ఒక ఆరు గజాలో, ఏడు గజాలో వుంటుంది గనుక, వాళ్లు గమ్యస్థానాన్ని చేరుకోకుండా వుండలేరు! నడిచి వెళ్లినా గానీ, పాదపు పొడుగు దాదాపు ఒక అడుగు వుంటుంది గనుక, చేరుకోవడం తప్పనిసరి!!” – నీకింత చిన్నవిషయం తెలియదా అన్నట్టు చిన్న నవ్వు నవ్వుతూ చూసింది.
అమాని కళ్లల్లోకి సూటిగా చూస్తూ మౌనంగా వున్న తరువాత, “ఆర్యూ గివింగ్ మి హోప్?” అనడిగాడు హమీర్.
“ఆర్యూ సీయింగ్ హోప్?” అన్నది అమాని తన కళ్లవైపు వేలితో చూపిస్తూ. అతను బుజాల నెగురవేశాడు. “హూ యాం ఐ టు స్టాపిట్ దెన్?”
ఆమె కళ్లల్లో అతనికి హోప్ కనిపించిందా లేదా అన్నది అతని కర్థం కాని విషయమై కూర్చుంది. అందుకని మాట మార్చి, “నీకు రెస్టన్తో ఇంత కనెక్షనేమిటి? ” అని అడిగాడు.
“అమెరికా వచ్చిన మొదట్లో ఇక్కడుండేవాళ్లం, ఓ మూడేళ్లపాటు. అందుకే ఇది నాకు దాదాపు హోమ్‌టవునయ్యింది,” అని కాసేపాగి, “ఇంకో కారణం కూడా వుంది. తరువాత చెబుతాలే,” అని జతచేసింది.
అప్పటికి వాళ్లు ఆర్డర్ చేసిన డిషెస్ రావడంతో, రెండు బైట్స్‌ని తీసుకున్న తరువాత హమీర్ అడిగాడు – “గూగుల్ నీ గురించి చెప్పని ఒక విషయం చెప్పు!”
“సైతాన్ ఎంటర్డ్ అవర్ లైవ్స్ ఇన్ 2006. నౌ యువర్ టర్న్!” అన్నది అమాని.
“మై ఫాదర్ హాజ్ బీన్ మిస్సింగ్ సిన్స్ 2006!” జవాబిచ్చాడు హమీర్.
[ఇంకా ఉంది...]
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్