నుడి

నుడి-8 (జూన్ 2016) & నుడి-7 (మే 2016) ఫలితాలు

జూన్ 2016


నుడి-7 (మే, 2016) జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.

ఈ సారి నుడిని పూర్తి కరెక్టుగా పూరించి విజేతలుగా నిలిచినవారు:

1. నేత్ర చైతన్య
2. సుజాత
3. రవి శ్రీతన్
4. రామ్మోహన్ రావు తుమ్మూరి
5. పి. సి. రాములు
6. కామేశ్వర రావు.

ఇందులో పాల్గొన్న పాఠకులందరికీ ధన్యవాదాలు. విజేతలకు అభినందనలు. ఇక కొన్ని ఆధారాలకు జవాబులను, వివరణలను చూద్దామా?

3 అడ్డం ఆధారం: వారినే నేను దంచేస్తే నీరునిచ్చేది వస్తుంది. (3)
వివరణ: వారి = నీరు, ద(ము) = ఇచ్చునది. కాబట్టి వారిదం (మేఘం) సరైన జవాబు. ఈ సమాధానాన్ని ఇట్లా కనుక్కోవచ్చును. కాని, అధారంలోని మొదటి పదాలను పరిశీలించకుంటే ఇందులోని అసలు చమత్కారాన్ని మిస్ అవుతాము. ఆ చమత్కారమేమిటో చూద్దాం.
వారినే లోని ‘నే’ను ‘దం’ చేస్తే (అంటే ‘నే’ అనే అక్షరాన్ని ‘దం’ అనే అక్షరంగా మార్చితే) వారినే వారిదంగా మారుతుంది. నుడి – 2 లోని 2 నిలువు ఆధారం ఇటువంటిదే.

10 అడ్డం ఆధారం: కొత్తదైన ఆ ప్రవాహం ఇక కలిసిపోవాలి. (4)
ఇక్కడ చాలా మంది తడబడ్డారు. పోవాలిక, ప్రవాహిక, నవలిక, కలయిక అని నింపారు. దీనికి జవాబు ఆధునిక. ఎలా అంటే, ప్రవాహము = ధుని. ఆ, ప్రవాహం, ఇక – ఈ మూడు పదాలు కలిసిపోవాలంటున్నాం కనుక, ఆ + ధుని + ఇక = ఆధునిక = కొత్తదైన.

12 అడ్డం ఆధారం: ఉత్కంఠలాంటి దీనికోసం రెండుసార్లు హతమార్చాలి (2,2).
దీనికి సమాధానం తహ తహ.
వివరణ: ఒకసారి ‘హత’ మార్చితే ‘తహ’ వస్తుంది. రెండుసార్లు మార్చితే ‘తహ తహ’ వస్తుంది!

15 అడ్డం: ఎడముకమే మరి పెడముకంగా ఉన్నప్పుడు లోపల కనిపించే ఐక్యము లాంటిది (4).
దీనికి జవాబు మమేకము.
వివరణ: పెడముకంగా అంటే రివర్స్ గా అన్నమాట. ఆధారంలోని మొదటి రెండు పదాలను రివర్స్ చేస్తే మధ్యన మమేకము దొరుకుతుంది.

16 అడ్డం: మిగతావి పోయాక తాజ పాలవి మితంగ సర్దితే వచ్చేది టూరిస్ట్ స్పాట్ కావచ్చు (4)
వివరణ: ‘తాజ పాలవి మితంగ’ మైనస్ ‘మిగతావి’ = జలపాతం. కనుక, అదే జవాబు.

23 అడ్డం ఆధారం: మూడు సూత్రాలున్నది హానే (అ)ట (3). కొందరు ముప్పట అని నింపారు.
దీనికి జవాబు ముప్పేట.
వివరణ: సూత్రము = పేట, దారము, తాడు. మూడు సూత్రాలున్నది = ముప్పేట. ముప్పు = హాని.

24 అడ్డం: గాసటబీసట గాజుపాత్రతో జ్ఞాని అయిన సూఫీ సన్యాసి (3). దీనికి జవాబు కబీరు.
వివరణ: గాజుపాత్ర = బీకరు. దాన్ని సరి చేస్తే కబీరు.

2 నిలువు ఆధారం: ఇంగ్లీషు వారు తెలుగులో పోరు (3). దీనికి సమాధానం యుద్ధము. ఎలా అంటే,
ఇంగ్లీషు వారు (ఇంగ్లిష్ భాషలో వారు – war) = యుద్ధము. ఇక తెలుగు భాషలో ‘పోరు’ = యుద్ధము!

4 నిలువు ఆధారం: నోరులో ఉండే ప్రారంభరహిత వృత్తాంతములు (4). దీనికి జవాబు దంతములు.
వివరణ: వృత్తాంతములు = ఉదంతములు. ప్రారంభం లేకుంటే దంతములు వస్తుంది.

5 నిలువు ఆధారం: పొట్టి కవితలు. ఆంగ్లోచ్చ ప్రారంభం వీటి ప్రత్యేకత (3)
వివరణ: ఉచ్చ(ము)కు ఆంగ్లభాషలో సమానార్థక పదం హై (High). కనుక సమాధానం హైకూలు.

10 నిలువు ఆధారం: ఆమె 10 అడ్డంకు విరుద్ధమైన ప్రయోగంలో (3).
పోకుము, ప్రతిమ, నవమ, కమోవి అని రకరకాలుగా నింపారు. 10 అడ్డంకు జవాబు రాకపోవడమే కష్టాన్ని తెచ్చిపెట్టిందిక్కడ! ఈ 10 నిలువు ఆధారానికి జవాబు ఆయమ ఎలా అవుతుందో చూద్దాం.
వివరణ: 10 అడ్డంకు జవాబు ఆధునిక. దానికి విరుద్ధమైన అంటే ప్రాచీన. ‘ఆమె’ను ప్రాచీన ప్రయోగంలో ‘ఆయమ’ అంటారు కదా.

11 నిలువు ఆధారం: రంధ్రం కోసం నడుమ సంకోచంతో చూశాము (3).
చాలా మంది కన్నాము అని పూరించారు. ఆధారంలోని చూశాము అనే ఒక్క పదాన్ని మాత్రమే పరిశీలించి, దానికి సమానార్థక పదమైన కన్నాము జవాబు అని ఊహించారే తప్ప, రంధ్రం అనే పదం ఎందుకు ఇవ్వబడింది అని ఆలోచించలేదు. దీనికి జవాబు కన్నము.
వివరణ: ‘చూశాము’కు సమానార్థకమైన ‘కన్నాము’ నడుమ సంకోచం చెందింది. ఇక్కడ సంకోచం అంటే వ్యాకోచం (Expansion)కు విరుద్ధం. అంటే contraction అన్న మాట. మధ్య అక్షరమైన ‘న్నా’ కుచించుకుపోయి ‘న్న’ గా మారటంతో వచ్చేది కన్నము = రంధ్రము.

19 నివులు ఆధారం: కడ లేని కడలి స్టాంపుతో కూడుకున్నదా? (3). దీనికి సమాధానం సముద్ర.
వివరణ: కడలి = సముద్రము. కడ (చివర) లేదు కనుక సముద్ర వస్తుంది. ముద్ర = స్టాంపు.

21 నిలువు ఆధారం: మార్దవంలో ఒక చివర పనివాడు (3). దీనికి జవాబు నౌకరు.
వివరణ: మార్దవం = నౌరు. ఒ‘క’ చివర = క. నౌరులో ‘క’ను చేర్చితే నౌకరు వస్తుంది.

పూరించిన గ్రిడ్ ను ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మరోసారి మనవి చేసుకుంటున్నాం.
‘నుడి’ Grid pattern ను ప్రతి మూడు నెలలకొకసారో, ఐదారు నెలలకొకసారో మార్చాలని ఎలాగూ ముందే అనుకున్నాం. అయితే ఏ రకంగా మార్చితే బాగుంటుంది అనే విషయం గురించి తమ అభిప్రాయాలను తెలుపాలని పాఠకులను కోరుతున్నాం.

సాంకేతిక కారణాల వల్ల కొందరు కొన్ని అక్షరాలను సరిగ్గా టైప్ చేయలేకపోతున్నారని అర్థమైంది కనుక, సందర్భాన్ని బట్టి వాటిని సరైన అక్షరాలుగా ఒప్పుకుంటున్నాం. ఉదాహరణకు బాసటకు బదులు బాసత అనీ, వాకీటాకీకి బదులు వాకీతాకీ అనీ నింపారు కొందరు. కాని ఒక పజిల్లో ఒక చోట ట అక్షరాన్ని సరిగ్గా టైప్ చేయగలిగినప్పుడు అదే పజిల్లో మరొక చోట కూడా ‘ట’ను కరెక్ట్ గా టైప్ చేయవచ్చును కదా? చేయకపోతే దాన్ని తప్పుగా పరిగణించాల్సివస్తుంది.
ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనించి తదనుగుణంగా వ్యవహరించాలనిగా పాఠకులను కోరుతున్నాం.

**** (*) ****