కిటికీలో ఆకాశం

ముక్కలైన గుండెలో వికసించిన ప్రేమ పద్యం పెన్నా శివరామకృష్ణ కవిత

జూన్ 2016

విఫల ప్రేమని వర్ణిస్తూ రాగయుక్త ద్విపదలలో సాగే గజల్ లో గొప్ప సౌందర్యం వుంటుంది. అది ఏక కాలంలో విఫల ప్రేమ లోని బాధనీ, జయాపజయాలతో సంబంధం లేని ప్రేమ లోని మాధుర్యాన్నీ మన అనుభవం లోకి తెస్తుంది. గజల్ శకలాలు శకలాలుగా కనిపించినా, రంగుల పూసలను కలిపే దారం వలె దాని అంతః సౌందర్యం వుంటుంది. స్త్రీ మెడ లోని హారం చివరన మెరిసే లాకెట్ వలె ప్రతిభావంతుడైన కవి వ్రాసిన గజల్ చిట్ట చివరి పంక్తులు మనల్ని కాసేపు దుఃఖం లాంటి ఒక అలౌకిక ఆనందం లోకి నెట్టి వేస్తాయి. ఇంతా చేసి, ఆ గొప్పదనం గజల్ ప్రక్రియదా, లేక ప్రేమదా?

ఉర్దూ గజల్ నడకనీ, శిల్పాన్నీ ఆధారం చేసుకుని తెలుగులో వెలువడిన ప్రేమ కవితలు తక్కువ.
బహుశా, అచ్చంగా భారతీయ భాష ఐన ఉర్దూ భాష పట్ల, గజల్ ప్రక్రియ పట్ల అవ్యాజమైన ప్రేమ వుంటే తప్ప తెలుగులో అట్లా వ్రాయగలిగే అవకాశం లేకపోవడం ఒక కారణం కావొచ్చు!

గజల్ చాయలతో తెలుగులో వెలువడిన అట్లాంటి కొన్ని అరుదైన కవితలలో ఒకటి కవి, పండితుడు పెన్నా శివరామ కృష్ణ వ్రాసిన ‘ ముక్కలైన పద్యం’ కవిత. నిజానికి, మెదడు కిటికీలను మూసివేసి, హృదయ ద్వారాలను బార్లా తెరిచి ఆస్వాదించ వలసిన కవిత యిది.
చదవండి !

ముక్కలైన పద్యం

నువ్వు దారి మరచిన చోటూ
నేను రోజూ వెళ్ళకుండా వుండలేని చోటూ ఒక్కటే
మనం విడిపోయిన చోటు

***

పరిచయాలన్నీ అపరిచయాలుగా
ముగియాలనుకుంటావు నువ్వు
అన్నీ తిరిగి అపరిచయత్వం నుండి
మొదలవ్వాలనుకుంటాను నేను

***

నా ఆలోచన ప్రతిక్షణం నీ గురించి
నీవు ఎదురుపడగానే నా గురించి
ఇంతకూ ఎవరు ఎవరిని అనుకరిస్తున్నాం

***

లోకాన్ని చూశాక
మెలకువలో నిద్రిస్తున్నాయి నా కళ్ళు
నీ కళ్ళు చూశాక
నిద్రలో మెలకువగా వుంటోంది నా జీవితం

***

మౌనం మనం నిర్మించుకున్న తొలి సమాధి
ఒకరి సమాధి మరొకరికి నిఘంటువు

***

నన్ను వేధించేవి జ్ఞాపకాలు మాత్రమె కావు
జీవితంలో ఇమడని అనుభూతుల్లా
వాక్యంలో ఒదగని పదాలు

***

తెలియక అడుగుతాను
అద్దం అణువణువునా
నువ్వే ఉన్నావో లేవో తేల్చుకోవడానికి
నిలువెత్తు పద్యాన్ని ఇన్ని ముక్కలు చేయాలా?

మొదట చిన్న పాయలుగా కనిపించిన జలపాతం చివరన ఉధృతంగా మారినట్లు, కవిత ముగింపు మనల్ని పూర్తిగా తడిపి వేస్తుంది.

కవిత లోని ఒక్కొక్క పాయనీ చదువుతూ రండి!

ఏ పాయకు ఆ పాయ ఒక స్వతంత్ర పద్యంగా కనిపించడమే దీని ప్రత్యేకత. ఉదాహరణకు ‘మౌనం మనం నిర్మించుకున్న తొలి సమాధి / ఒకరి సమాధి మరొకరికి నిఘంటువు’ అంటున్నాడు. చదివి అనుభవంలోకి తెచ్చుకోవడమే తప్ప, ప్రయాసపడి అర్థం చేసుకొనవలసింది ఏమీ లేదు ఈ చరణాలలో!

కవిత ప్రారంభంలోనే ‘ నువ్వు దారి మరచిన చోటూ / నేను రోజూ వెళ్ళకుండా వుండలేని చోటూ’ అంటూ ప్రేయసిని నిందించినట్టుగా ధ్వనిస్తుంది గానీ ఇదంతా ఒక అలక పూనిన వాడి దుఃఖ గీతం!

ఇక ఈ కవిత ముగింపు లోని అందం ఏమిటంటే, ప్రియురాలు విడిచి వెళ్ళిపోయాక అట్లా చరణాలు చరణాలుగా బాధని పద్యం చేస్తూ వెళ్ళిన కవి, చివరన ‘అద్దం అణువణువునా / నువ్వే ఉన్నావో లేవో తేల్చుకోవడానికి / నిలువెత్తు పద్యాన్ని ఇన్ని ముక్కలు చేయాలా?’ అని తనకు తానే ఒక పెద్ద ప్రశ్న వేసుకుని చకితుడయ్యాడు. ఇంకొక అందం, తనని తాను అద్దంతో పోల్చుకుంటూ, అందులో ప్రేయసి వుందో లేదో తెలుసుకోవడానికి నిలువెత్తు పద్యాన్ని ఇట్లా ముక్కలు చేయాలా అని విరక్తిగా అనుకుంటూ ఆ వ్రాసిన పద్యాన్ని తృనీకరించడం.

కవీ … మేము కూడా తెలియకే అడుగుతున్నాము – ముక్కలయింది పద్యమేనా?

అన్నీ తిరిగి అపరిచయత్వం నుండి మొదలవ్వాలని కోరుకుంటున్నది ఒక్క నువ్వు మాత్రమేనా?

**** (*) ****