ధారావాహిక నవల

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – నాలుగవ భాగం

జూలై 2016

4

“లెట్స్ గో ఫర్ ఎ బోట్‌రైడ్ ఆన్ ది పొటోమాక్ రివర్! దట్ వే యు డోంట్ హావ్ టు టీచ్ మి ఎనీథింగ్!” హమీర్‌కి టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అమాని నుంచి డిసెంబర్ మొదటివారంలో. ఆమెకి వీలయినప్పుడే, ఆమె సూచనలని పాటిస్తూనే వుండాలి ఆమెతో తిరగాలంటే అని అతనికి ఎప్పుడో అర్థమైంది. మనిషి కనిపించకపోయినా గానీ కనీసం ఆమె గొంతు వినాలని అతనికి ఎంతవున్నా గానీ ఆమె అనుగ్రహిస్తేగా!

“ఎండాకాలంలోనో, స్ప్రింగ్‌లోనో, లేక ఫాల్‌లోనో అంటే అర్థముంది గానీ, ఈ చలిలోనా? పైగా, నీళ్లమీద ఇంకా చలిగా వుంటుంది,” జవాబిచ్చాడు.

“వాళ్లు బోట్లు నడుపుతూనే వున్నారుగా! అన్లెస్ యు డోంట్ వాంట్ టు,” అని నిరాశపడే ఎమోజీని జతచేసి పంపింది.

“ఐ హావ్ బీన్ లుకింగ్ ఫర్ దిస్ మూమెంట్ మై ఎంటయిర్ లైఫ్!” అని కన్ను కొడుతున్న ఎమోజీని జత కలిపి పంపాడు.

***

డిసెంబర్ మొదటి వారంలో క్రితం సంవత్సరం మంచుకూడా కూడా కురిసేటంత చలి వేసినట్లు గుర్తున్నది గానీ, ఈ ఏడాది కొంచెం నయం అనుకున్నాడు హమీర్ కాపిటల్ క్రెసెంట్ ట్రెయిల్ మీద వాషింగ్టన్ హార్బర్ దగ్గర బోటు నెక్కే స్థలం వైపు నడుస్తూ.  జార్జ్ టవున్లో విస్కాన్సిన్ అవెన్యూ చివర, కె స్ట్రీట్ కార్నర్లో వున్న పార్కింగ్ గరాజ్‌లో కారుని పార్క్ చేశాడు. అతననుకున్నట్టుగానే విండీగా వున్నది. అందుకని ఎంత చలిగా వున్నా జాగింగ్ మానని హార్డీ సోల్స్ తప్ప అతను నడిచే దారిలో పెద్దగా జనాల్లేరు.

బోట్ డాకింగ్ ప్లేస్ దగ్గర ఆగి చుట్టూ చూశాడు. అతని వెనుకనే ఒక సీఫుడ్ రెస్టారెంట్ కనిపించింది. బయట వేసివున్న కుర్చీలని బట్టీ సమ్మర్లో అయితే ఈ సూర్యాస్తమయం సమయానికి వీటన్నింట్లోనూ మనుషు లుండేవారు అనుకున్నాడు. అంతలోపే అప్పటికింకా సమయం అయిదు కూడా కాలేదని గుర్తొచ్చి, డిన్నర్ కాకపోయినా డ్రింకుల్తో బిజీగా వుండేవాళ్లులే అని అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.

పావుగంట తరువాత వచ్చింది అమాని.

“గారంటీగా ఈ రైడ్ మిస్ అవుతాం అనుకుంటున్నా నిప్పుడే,” అన్నాడు.

“చలిగా వుంటుందని చెప్పావు గనుక లావు కోటు వేసుకొస్తా వనుకున్నాను,” అన్నది అమాని అతను వేసుకున్న లెదర్ జాకెట్‌ని చూసి.

“నాకంటే చలిగూర్చి నీకే భయ మెక్కువ అని నీ ఎస్కిమో కోటు చెబుతోంది,” అన్నాడు. ఆ కోటు బాగా మందంగా వుండి ఆమె మోకాళ్లదాకా వచ్చింది.

“ఏం చెయ్యమంటావ్? సౌతిండియా నించీ వచ్చిన బాడీ మరి!” అన్నది.

“మరీ చలి అనిపిస్తే నీ కోట్లో దూరతాలే,” అన్నాడు కొంటెగా.

“ఫర్ ఎ ప్రైస్!” అమాని జవాబిచ్చింది.

వాళ్లు ఎక్కగానే గట్టు మీంచి బోటెక్కడానికి వేసిన బల్లని తీసేసి బోటు బయల్దేరింది. హమీర్ అనుకున్నట్టుగానే బోట్లో ఎక్కువమంది జనాల్లేరు. ప్లెక్సి గ్లాస్ కిటికీలతో ఎన్‌క్లోజ్ చేసిన ఏరియాలో కూర్చోవడానికి కుర్చీ లున్నాయి. కిటికీ తలుపులన్నీ వేసివున్నాయి. చీకటి ఎప్పుడో పడ్డది గనుక ఎడమపక్క రోడ్లు, బ్రిడ్జీలతో సహా లైట్లతో మెరిసిపోతూ వాషింగ్టన్ నగరం దర్శనమిచ్చింది. రాక్ క్రీక్ పార్కుని ఆనుకుని కెనెడీ సెంటర్ తన హంగుని చూపిస్తోంది.

“దాదాపు పన్నెండేళ్ల క్రితం ఇలా ఎక్కిన గుర్తు. తెలిసిన వాళ్లబ్బాయి పెళ్లి రిసెప్షన్‌ని ఇందులో ఇచ్చారు,” అన్నాడు హమీర్.

“ఇంకా గుర్తుందే!” అన్నది అమాని.

“ఐ వజ్ బోర్‌డ్ దెన్. నేను ఈ అద్దానికి మొహాన్ని ఆనించి బయటే చూస్తూ గడిపాను ఒక్క తినేటప్పుడు తప్పించి. అప్పుడు మా నాన్న మొహం ఎలా వుండేదో, ఆయన ఏం చేశారో అని ఇప్పుడు తీరిగ్గా పాత జ్ఞాపకాలకోసం తవ్వుతూంటాను,” అన్నాడు.

“మిస్సింగ్!” అని ఆయన గూర్చి అతను చెప్పడం అమానీకి గుర్తుంది. అతని కుడిచేతిని తన ఎడంచేత్తో మోచేతిదగ్గర చుట్టి కాసేపు నిల్చొని, “చలి ఎంతుందో బయటి కెళ్లి చూద్దామేమిటి?” అనడిగింది.

ఆ ఎన్‌క్లోజ్‌డ్ ఏరియానించీ బోటు బౌ (ముందుభాగం) వైపు వెళ్లడానికి వున్న తలుపుని తీసి ఒక అడుగు ముందుకెయ్యగానే చల్లగాలి రివ్వున వచ్చి బలంగా వాళ్ల మొహాలని తాకింది.

కొన్ని క్షణాల తరువాత, అతణ్ణి గాలి వస్తున్న వైపుకు వీపు వుండేలా తిప్పి, అతని లెదర్ జాకెట్‌ని అన్‌జిప్ చేసింది. తన కోటు జిప్పర్‌ని కూడా పూర్తిగా కిందకు లాగి, కోటుని విప్పి, ఇద్దరి తలలనూ కప్పేసేలా ఆ కోటుని వేసి, లెదర్ జాకెట్లోంచి రెండు చేతులతోనూ అతని నడుముని చుట్టి నిలబడి, “కిస్ మీ!” అన్నది. అతను రెండు చేతులతోను ఆమె నడుముని చుట్టేసి తలని వంచి ఆమె పెదాల నందుకున్నాడు.

ఊపిరి పీల్చుకోవడానికి పెదాలని విడదీసినప్పుడు, “చలేస్తోందా? నిన్ను అడ్డం పెట్టుకున్నందుకు నాకేం లేదు. నువు కూడా పెద్ద కోటు తెచ్చుకునుంటే బావుండేది!” అన్నది. హమీర్ తన పెదాలతో ఆమె పెదాలను చుట్టేసి జవాబు చెప్పాడు.

“పోనీ, నా కోటుని నువ్వు కప్పుకో. నా కెలాగూ చలి తగలట్లేదు!” అన్నది అమాని.

“మాట్లాడ్డం అవసరమా?” అన్నాడు తన పెదాలతో ఆమె పెదాలకి ఆ అవసరమేమీ లేదని చెబుతూ.

***

బోటు దిగిన తరువాత ఆ హార్బర్ నించీ విస్కాన్సిన్ ఎవెన్యూ వైపు వాళ్లిద్దరూ చేతులు పట్టుకుని నడిచారు. ఆమె తినగలిగే పదార్ధాలున్న రెస్టారెంట్ కోసం వెదుకుతుంటే ఎంతో దూరం పోనక్ఖర్లేకుండానే ఫిలోమెనా రెస్టారెంట్ కనిపించింది. “ఇటాలియన్ ఓకె కదా?” అడిగాడు హమీర్. ఆమె సరేనన్న తరువాత లోపలకి నడిచారు.

“వైన్?” అని వెయిటర్ అడిగిన ప్రశ్నకి అమాని మొహంలో సంశయం కనిపిస్తుండడంతో, “గివజ్ ఎ కపులాఫ్ మినిట్స్,” అని హమీర్ అతణ్ణి పంపించాడు. “ఇలా అడగొచ్చో, లేదో తెలియదు. ఇప్పటిదాకా అనుభవం లేదా?” అనడిగాడు అమానీని. ఆమె సన్నగా నవ్వి, “నో,” అన్నది.

“పోనీ ట్రై చేస్తావా? బలవంత మేమీ లేదు. వైన్ ఈజ్ వెజిటేరియన్, యు నో,” అన్నాడు కన్నుగొడుతూ.

“చెయ్యాలనే వున్నది గానీ, తరువాత దాని వాసన చూసినందుకే పడిపోతానేమోనని భయం,” అని అమాని జవాబిచ్చింది.

“పడిపోతే వీపుమీదేసుకుని ఎత్తుకుపోతాన్లే, నువ్వు మెడచుట్టూ చేతులేసి, రెండు కాళ్లతో నా నడుముని చుట్టేస్తూ – దిస్ విల్ బి డిఫరెంట్ ఫ్రం ది హగ్ యు వాంటెడ్, బట్ దిస్ విల్ బి మోర్ ఫన్ ఫర్ మి!” అన్నాడు.

“అలవాటు లేదు గనుక ఆమాత్రం దానికే హిందీ సినిమాల్లో చూపినట్టు గోల చేస్తే?”

“దట్ విల్ బి ఈవెన్ బెటర్. మోర్ మెమొరబుల్!” అని చెప్పి, ఇద్దరికీ వైన్ ఆర్డరిచ్చాడు.

“ఇది మరీ పాష్ రెస్టారెంట్‌లా వున్నది,” అమాని అన్నది చుట్టూ చూస్తూ.

“ఇక్కడికి కాంగ్రెస్‌మెన్, సెనేటర్లు, లాబీయిస్ట్‌లూ తరచుగా వస్తూంటార్ట. మా అంకుల్ చెప్పారు వాళ్లతో వచ్చినప్పుడు. రిజర్వేషన్ లేకుండా ఇలా సీటింగ్ దొరకడం ఆల్మోస్ట్ ఇంపాజిబుల్. సమ్‌బడీ డెస్టిన్డ్ దిస్ ట్రిప్ టు బి మెమొరబుల్!” అని హమీర్ జవాబిచ్చాడు.

“నువ్వు డెస్టినీని, ఫేట్‌నీ నమ్ముతావా?” అమాని అడిగింది.

“సరయిన అభిప్రాయం లేదు. మా అమ్మే, ‘విధి రాత ఇలావుంటే మనమేం చెయ్యగల ‘ మంటుంది. నాక్కూడా అది కొంచెం అంటినట్లుంది,” అన్నాడు. “ఒమాహా ఎయిర్‌పోర్ట్‌లో విమానం అంతసే పాగడం, నువ్వు నాకు కలవడం, ఇలా ఇవాళ ఇక్కడ కూర్చోవడం – మా అమ్మకి చెబితే మాత్రం దీన్ని తప్పకుండా ఫేట్ అనే అంటుంది.”

“డేట్ చేస్తున్న అమ్మాయితో కాన్వర్సేషన్లోకి తల్లిని తీసుకురావడం – అదీ ఇంత తొందరగా – ఎవరూ చెయ్య రనుకుంటాను?” ప్రశ్నించింది.

“షి ఈజ్ మై రిమెయినింగ్ కనెక్షన్ టు ది వరల్డ్. ఆమె కాన్వర్సేషన్లోకి రాకుండా వుండడం కష్టం – అదికూడా, కావాల్సిన వాళ్లతో!” జవాబిచ్చి, తనవంతుగా, “వాటెబవుట్ యు?” అని అడిగాడు.

“మొన్నామధ్య దాకా ఫేట్‌ని తిట్టుకుంటూ కూర్చున్నాను. రెణ్ణెల్లనించీ దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను!”

“అది నాకు మంచి ఫలితాల నిస్తోంది!” అన్నాడు ఎదురుగా వున్న ఆమె కళ్లల్లోకి చూస్తూ, టేబుల్‌మీద వున్న ఆమె చెయ్యిమీద తన చేతిని వేసి, ఆమె వేళ్లని మృదువుగా నిమురుతూ.

“ఇటాలియన్ రెస్టారెంట్ అంటే ఎగ్‌ప్లాంట్ పర్మజాన్ వుంటుం దనుకున్నానే!” అమాని అన్నది మెన్యూలో అది కనిపించకపోవడాన్ని గ్రహించి.

“మెన్యూలో లేదుగానీ, ఐ కెన్ గెటిట్ ఫర్ యు,” అన్నాడు వెయిటర్. హమీర్ చికెన్ పర్మజాన్ ఆర్డర్ చేశాడు.

“మీ యింట్లో నువ్వొక్కదానివేనా వెజిటేరియన్?”

“మీ యింట్లో నువ్వొక్కడివేనా మీట్ తినేది?”

“మా యింట్లోకి మీట్ రాకూడదని ప్రొహిబిషన్ వున్నది గానీ, మీ అమ్మకి నీకోసం రోజూ వెజిటేరియన్ డిష్ చెయ్యాలంటే చికాకువెయ్యదా? అని!”

“అందుకే వేరేగా వుండడం మొదలుపెట్టింది. అయినా, మొహర్రం, బక్రీద్, రంజాన్ పండగలకి వెళ్లక తప్పదు. నాకోసమని మా అమ్మ ప్రత్యేకంగా ఏం చేసినా, నేను ఎంతగా చెడిపోతున్నానో మా అక్క మొగుడినుంచి వినడమే చిరాకు. అమెరికాలో వున్నా గనుక సరిపోయింది. అదే గనుక ఇండియాలోగానీ, వాడొచ్చిన దేశంలో గానీ అయివుంటే నన్నీపాటికి కాళ్లూ, చేతులూ కట్టేసి వాడికి నచ్చిన వాడికిచ్చి నికా చేసేవాడు. … వాడికి రెండో బీబీగా కూడా చేసుకునేవాడు.”

“నువ్విక్కడ పుట్టలేదు!”

“మా అమ్మా, నాన్నా ఇక్కడికి వచ్చేసరికి నాకు పదేళ్లు. ఇక్కడ పుట్టకుండానే ఇంత రిబెలియస్‌గా తయారయ్యావు, ఇక్కడ పుట్టుంటే ఇంకెలా తయారయి వుండేదానివో నంటుంది మా. బాబాకి పుట్టడం మేరా భాగ్య్ హై, సాలాలాంటి వాడికి పుట్టుంటే నీక్కావలసినట్లు పెరిగేదాన్ని అంటాన్నేను. జీజీ పిల్లల్ని చూడాలి – వాళ్లని స్కూలు మొహమే చూడనివ్వట్లేదు వో సాలా!” అన్నది వీలయినంతవరకూ ఎమోషన్ని నొక్కిపెట్టి మాటరాఫ్ ఫాక్ట్‌గా ఎవరిగురించో నన్నట్లు చెబుతూ.

“అయాం హాపీ దట్ యు ఆర్ వాట్ యు ఆర్!” అన్నాడు హమీర్ ఆమె మొహంలో విచారాన్ని చూసి, మాట మార్చడంకోస మయినా నిజాన్ని చెబుతూ.

***

“లెట్స్ గో డాన్సింగ్!” అన్నది అమాని రెస్టారెంట్ నించీ బయటికి వచ్చిన తరువాత.

“థాంక్ గాడ్!” అన్నాడు హమీర్ ఆకాశంవైపు చూస్తూ తన రెండు చేతివేళ్లనూ పెనవేసి.

“థాంక్స్ చెప్పాల్సింది నాకు. ఐ మేడిట్ పాజిబుల్,” అన్నది అమాని.

“థాంక్స్ గాడెస్!” అని హమీర్ ఆమెవైపుకు తిరిగి చటుక్కున ఆమె పెదాలమీద ముద్దుపెట్టే ముందర అన్నాడు.

“తమకు ముద్దులు పెట్టడాన్ని గాడెస్‌లు సహించరు!” అన్నది అమాని కోపంగా పెదాలను తుడుచుకుంటూ. “మళ్లీ ఇంకోసారలా చేస్తే డాన్స్ ప్రోగ్రాం కాన్సిల్ చేస్తారు కూడా!”

రోడ్లమీద నడుస్తూ ముద్దుపెట్టడం ఆమెకిష్టం లేదని అర్థమై, ఆమె చేతికి ముద్దు పెట్టాడు సారీనీ ఎఫెక్షన్‌నీ రంగరించి.

“మంచి డాన్సింగ్ ప్లేసులేవో తెలిసిన వాణ్ణడుగుదాం,” అని రోహిత్‌కి టెక్స్ట్ చేశాడు.

“యు ఆర్ గోయింగ్ డాన్సింగ్? షాకింగ్! నువ్వు డాన్స్ చేసి ఎన్నేళ్లయింది! విత్ హూ?” రోహిత్ టెక్స్ట్ పంపించాడు.

“with Amani. ఎవరికీ చెప్పకు! ఇప్పుడయినా చెబుతావా డాన్సింగ్ ప్లేసులేవో?”

రోహిత్ పంపించిన అడ్రసులని తన ఫోన్లో మాప్‌లో చూసి, “ఇద్దరం ఒకే కార్లో వచ్చివుంటే బావుండేది! నన్ను ఫాలో అవు. ఎందుకయినా మంచిది ఈ అడ్రస్‌ని నీదగ్గర వుంచుకో,” అని కబిన్ అడ్రస్‌ని ఆమెకు టెక్స్ట్ చేశాడు.

***

ఇద్దరూ కబిన్‌ని ఎంటరయి, జాకెట్లని వాలేకి ఇచ్చి బార్లోకి అడుగు పెట్టారు. అమాని చుట్టూ చూసింది.

“సమయం ఇంకా ఎనిమిది గంటలే గనుక డాన్స్ ఫ్లోర్లో ఎక్కువమంది లేరు. పది దాటిన తరువాత అసలు చోటుండదు!” అన్నాడు హమీర్. “పైగా, ఇప్పుడు మెల్లగా వచ్చే మ్యూజిక్ అప్పుడు వూపందుకుంటుంది!”

“కాసేపు కూచుందాం!” అన్నది అమాని.

“బార్ కౌంటర్ దగ్గర కూర్చుని బీర్ ట్రై చేస్తావా?”

“సిప్ చేస్తా. నచ్చకపోతే మానేస్తా. నచ్చితేనే ఇబ్బంది!”

“ఎందుకని?”

“అప్పుడు ఎక్కువ తాగితే కారు డ్రైవ్ చెయ్యలేను.”

“అంతగా అయితే నేను డ్రాప్ చేస్తాలే!”

“నడిచి మెట్లెక్కే పరిస్థితిలో లేవు, ఎత్తుకుని లోపలికి తీసుకెడతా నంటావు. తరువాత మంచంమీద పడుకోబెట్టి బట్టలు మారుస్తా నంటావు. ఆ తరువాత ఏం చేస్తావో నీకు మాత్రం తెలుసు!” అన్నది అమాని.

ఆమె మాటలని ఎలా అర్థంచేసుకోవాలో అతనికి తెలియలేదు. కవ్విస్తూ రమ్మంటోందో, ముందరి కాళ్లకి బంధా లేస్తోందో అతనికి అర్థం కాలేదు. తాగివున్నా గానీ, “నో” అంటే “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” అని “యస్”గా భావించి తరువాత కేసుల్లో ఇరుక్కుపోయిన వాళ్ల గూర్చి అతను చాలాసార్లు విన్నాడు. ఏమయినా సరే, తరువాత ఆలోచిద్దాంలే, అనుకుని కౌంటర్ దగ్గర కెళ్లి స్టూల్ మీద కూర్చుని ఇద్దరికీ బీర్లు ఆర్డరిచ్చాడు. ఆమెవైపు తిరిగి పరీక్షగా ఆమెని చూశాడు. బ్లాక్ స్కర్ట్‌మీద పర్పుల్ సిల్క్ టాప్ వేసుకున్నది. డిమ్ లైట్లల్లో కూడా మెరిసే ఆ అనాఛ్ఛాదిత మెడ ముద్దుపెట్టుకోవేమని గద్దిస్తున్నట్లనిపించిం దతనికి.

హమీర్ కళ్లెత్తి ఆమె కళ్లతో కలిపిన తరువాత, అమాని, ‘అటు – అతని వెనక్కి-’ చూడమని కళ్లతోనే సైగ చేసింది. అక్కడ ఒకామె మెడ భాగాన్నంతటినీ తన పెదవులతో కప్పెయ్యలేక మొత్తం మొహాన్ని వాడుకుంటూ ఒకతను కనిపించాడు.  అతని వీపు వీళ్ల వైపుండడంచేత అతనెవరో హమీర్‌కి తెలిసే అవకాశమే లేదు. కొద్దిగా మూల నిల్చోవడంచేత అతను నెక్‌చేస్తున్నామె మొహం స్పష్టంగా కనిపించట్లేదు.  వాళ్ల డిమాన్‌స్ట్రేషన్‌తో ఇన్‌స్పైరయి, అమానివైపు తిరిగి, మెడని చాచి, తలకాయని ముందుకు వంచి హమీర్ ముద్దు పెట్టబోయేటంతలో ఆమె అతని మొహానికి తన చేతి నడ్డం పెట్టింది.

“పెదాలకి వేడి తగ్గాలంటే బీర్‌తో తప్ప కుదరదా?” అనడిగాడు. అమాని, “అంతే మరి!” అన్నట్టు మొహంపెట్టి బీర్‌ని సిప్ చెయ్యడంలో నిమగ్నమైంది.

హమీర్ తన కుడిచేతిని పక్కనున్న ఆమె ఎడమచేతిమీద వేసి మెల్లిగానే ఒక బీర్‌ని పూర్తిచేస్తూ చూస్తే, అమాని గ్లాసులో ముప్పాతిక వంతు ఇంకా అలానే వున్నది. “ఇంకొకటి ఆర్డర్ చేసేదా లేక డాన్స్ చేద్దామా?” అమానిని అడిగాడు. ఆమె బార్ స్టూల్‌మీంచి లేచి నిలబడి, “పద!” అన్నది.

వాళ్లిద్దరూ దూరంగా వుంటూ మొదలుపెట్టిన డాన్స్, స్లో సాంగ్ వచ్చినప్పుడు నడుములమీదా లేక మెడచుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంటూనూ, స్పీడ్ పెరిగినప్పుడు దూరంగా వెడుతూ, దగ్గరగా వస్తూ, పిరుదులతో బంపింగ్ చేసేదాకా మారుతూనూ వచ్చింది.

కాసేపయిన తరువాత బార్ స్టూల్ దగ్గరకు వచ్చి కూర్చుంటూ, “యు ఆరె గుడ్ డాన్సర్!” అన్నాడు హమీర్. “యు టూ!” అన్నది అమాని.

అతని ఇన్‌ట్యూషన్ ఆమె అప్పటిదాకా ఎవరితోనూ డాన్స్ చేసివుండదని చెప్పింది కానీ, అడిగి నిర్ధారణ చేసుకోవడం అనవసర మనుకుని ఇంకో బీర్ ఆర్డర్ చేశాడు. ఆమె బీర్ ఫ్లాట్ అయిందని ఆమెకి కూడా ఆర్డర్ చేస్తానని అతనంటే ఆమె వద్దని, దాన్నే సిప్ చేస్తూ చుట్టూ చూసి, ఇందాక నెకింగ్ చేస్తున్నవాళ్లింకా బిజీగానే వున్నారని కళ్లతో చూపించింది. అప్పటికి వాళ్లు పొజిషన్ని కొద్దిగా మార్చివుండడంతో హమీర్ ఆ జంటలోని మగాణ్ణి రోహిత్‌గా గుర్తించాడు. ఆమె అతని గర్ల్‌ఫ్రెండో లేక అక్కడి పరిచయం మాత్రమేనో హమీర్‌కి తెలియలేదు. గర్ల్‌ఫ్రెండ్ అయివుంటే థాంక్స్‌గివింగ్‌కి ఇంటికి తీసుకువచ్చేవాడు గదా, అనుకున్నాడు. మళ్లీ, వాళ్ల రిలేషన్‌షిప్ ఇంటికి తీసుకువచ్చేటంత దూరం రాలేదేమోలే అనుకున్నాడు. కాకపోయినా, ఆ అమ్మాయి తనవాళ్లింటికి వెళ్లి వుండొచ్చుకూడా అని సమాధానపడ్డాడు.

“వుయ్ షుడ్ డు సమ్ నెకింగ్!” అన్నాడు అమానివైపు తిరిగి.

“లెట్స్ డాన్స్!” అని స్టూల్‌మీంచి లేచి అతని చెయ్యి పట్టుకుని డాన్స్ ఫ్లోర్‌వైపు నడిచిందామె. ఆమె బీర్ మగ్ ఖాళీగా వుండడం రోహిత్ గమనించాడు. అతనుకూడా ఒక పెద్ద గల్ప్ తీసుకుని ఆమె వెనకే వెళ్లాడు.

ఆమె మీద ఆ బీర్ ప్రభావం వల్ల, కాసేపట్లో, “హోల్డ్ మి!” అని అతని నడుంచుట్టూ చేతులేసి కావలించుకుని అతని మెడవంపులో తన తల నానించింది. అతను పాట బీట్‌తో పనిలేకుండా ఆమెని పట్టుకుని మెల్లగా స్టెప్పులేశాడు. పది నిముషాల్లో ఆమె అతని మొహంలోకి చూసి, “అయాం నాట్ డ్రంక్. ఐ జస్ట్ లైక్ దిస్!” అని మళ్లీ తలని అతని మెడవంపులోకి చేర్చింది. హమీర్ ఆమెను పట్టుకుని కదులుతున్నప్పుడు రోహిత్ కళ్లతో అతని కళ్లు కలిశాయి. గర్ల్‌ఫ్రెండ్‌తో అతనెప్పుడు డాన్స్‌ఫ్లోర్ చేరాడో గానీ, ఆమె కూడా రోహిత్ మెడని కావలించుకునుంది. రోహిత్, హమీర్ సెలక్షన్ బ్రహ్మాండంగా వున్నదని బొటనవేలినీ చూపుడువేలినీ కలిపి చూపిస్తూ చెప్పాడు. హమీర్ చిరునవ్వుతో “థాంక్స్!” అని శబ్దం రాకుండా పెదాలతో జవాబు చెప్పాడు. ఇంకాసేపయిన తరువాత హమీర్ చూసేటప్పటికి రోహిత్, అతనితో వున్నామె అక్కడ కనిపించలేదు. “లుక్స్ లైక్ హి ఈజ్ గోయింగ్ టు స్కోర్ టునైట్!” అన్న ఆలోచన హమీర్‌కి వచ్చింది.

ఇంకొక పదినిముషాలయిన తరువాత అమాని అతనికి దూరంగా జరిగి పాట స్పీడ్‌తో సమంగా డాన్స్ చేసింది. ఒక అరగంట అలా డాన్స్ చేసిన తరువాత బార్ కౌంటర్‌ని చేరగానే, “వన్ మోర్?” హమీర్ అడిగాడు ఆమె ముందున్న ఖాళీ బీర్ మగ్‌ని చూపించి, వద్దన్నది.

“ఐ వాంట్ టు గెట్ యు డ్రంక్ టునైట్. ఇందాక నువ్విచ్చిన ఐడియా బావున్నది – అదే, నిన్ను మీ యింటిదగ్గర దింపడం గూర్చి,” అన్నాడు హమీర్.

“నాట్ టునైట్!” అని లేచి బయల్దేరింది.

ఇద్దరూ బయటికి వచ్చిన తరువాత “బై” అన్నది అమాని. హమీర్ ముందుకు వంగి చటుక్కున ఆమె పెదాలమీద ముద్దుపెట్టాడు. “స్లోలీ!” అని ఆమె అనడం అంత డిసెంబర్ రాత్రి చలిలోనూ అతనిలో వేడిని పుట్టించి, పెనవేసుకున్నప్పుడు ఆ వేడిని ఆమె పెదాల్లోనూ గమనించేలా చేసింది. ఆమే పెదాలని విడదీసి అతణ్ణి ఛాతీమీద చెయ్యివేసి వెనక్కు తోసి, గిరుక్కున వెనక్కు తిరిగి గబగబా పార్కింగ్ గరాజ్‌వైపు నడిచింది.

హమీర్ కూడా ఆ గరాజ్‌లోనే కారుని పార్క్ చేశాడు గనుక ఆమె వెనకే వెళ్లబోయేటంతలో అతని బుజంమీద చెయ్యి పడితే చటుక్కున తిరిగి చూశాడు. రోహిత్!

“ఐ థాట్ యు గాట్ లక్కీ టునైట్!” హమీర్ అన్నాడు.

“కంప్లీట్లీ ది అదర్ వే. రియల్లీ ఎ బాడ్ నైట్!” జవాబిచ్చాడు రోహిత్. “ఏమయిందో చెప్పాలంటే ముందు నన్ను నా అపార్ట్‌మెంట్‌కి చేర్చాలి.”

“నీ కార్లో రాలేదా?” ఆశ్చర్యపోయాడు హమీర్. తన కార్లో రానివాడు గర్ల్‌ఫ్రెండ్‌తో ఎలా స్కోర్ చెయ్యగలడు?

“ఇట్స్ ఎ షార్ట్ స్టోరీ. నా వాలెట్ కొట్టేసి అటుగా వచ్చిన కార్లో పారిపోయింది. బయల్దేరే ముందర బాత్‌రూంకి వెళ్లొచ్చింది. అప్పుడు తోడుదొంగకి ఫోన్ చేసుంటుంది బయటికొస్తున్నానని. నడుస్తుండగానే కారు పక్కన ఆగడం, అది తలుపు తెరిచి ఎక్కడం, అది రయ్యిన వెళ్లడం జరిగాయి. అది మేం బయటి కొచ్చిన తరువాతే నా వాలెట్ కొట్టేసుంటుందని నా నమ్మకం.”

“ఈ బార్‌ల చుట్టుపక్కల సేఫ్‌గానే వుండాలే!” ఆశ్చర్యపోతూ అన్నాడు హమీర్.

“అందుకే అది నన్ను రెండు బ్లాకులు నడిపించింది రొమాంటిక్ వాక్ అంటూ! ”

“బార్‌ల వాళ్లకి యిట్లాంటివాళ్ల గూర్చి తెలుసు గనుక వాళ్లని లోపలకు రానీకుండా జాగ్రత్త పడుతూంటారు. నువ్వామెను ఈ బార్లో కలవలేదా?”

“వేరే చోట కలిసి ఇక్కడికొచ్చాం.”

“అయితే కొత్త కేసన్నమాట! … పోయింది వాలెటేగా! కార్ కీస్ నీదగ్గరే వున్నాయి. రైడ్ ఇవ్వకూడదని కాదు గానీ, నీ కారుని డ్రైవ్‌ చెయ్యకూడదా అని!”

“ఇప్పటికే డ్రైవర్ లైసెన్స్ మీద చాలా పాయింట్లున్నాయి వున్నాయి. సస్పెన్షన్‌కి బోర్డర్లో వున్నాను. నా బాడ్‌లక్ వల్ల, ఆ కారుని డ్రైవ్ చేస్తున్నప్పుడే నన్నో పోలీసు ఆపి, లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్నందుకు పెద్ద టిక్కెటిస్తాడు. పైగా, నా వాలెట్ కొట్టెయ్యడంవల్ల, అని చెబితే, కోర్టుకొచ్చి జడ్జీకి చెప్పుకొమ్మంటాడు. దానికోసం నేను వర్కింగ్ డేని ఎగ్గొట్టాలి. అందుకని!” అన్నాడు రోహిత్.

“పార్కింగ్ గరాజ్‌లోనేగా పార్క్ చేశావ్?”

“కాదు. రోడ్డు పక్క!”

“అంటే రేప్పొద్దున్న లోగా కారు తీసుకుపోవాలి. లేకపోతే పార్కింగ్ టికెట్టుకి ముడుపు చెల్లించుకోవాలి. ఎలా చేస్తావ్ మరి? నీకింకో డ్రైవర్ కావాలి! మీ అపార్ట్‌మెంట్ దగ్గర నా కారుని పార్క్ చేసి, అక్కణ్ణించీ టాక్సీలో వెనక్కొద్దాం. అప్పుడు నీ కారుని కూడా నేనే డ్రైవ్ చేస్తాను! సోమవారంనాడు డ్రైవర్స్ లైసెన్స్ తెచ్చుకుందువుగాని!”

“థాంక్స్ బ్రో! డబ్బుల్లేకపోవడంవల్ల టాక్సీకూడా ఎక్కలేనే, ఇల్లు చేరడ మెలాగా అని మైండ్ బ్లాకయ్యింది. ఫ్రెండ్స్ గర్ల్‌ఫ్రెండ్స్‌తోనో వైఫులతోనో బిజీగా వుండే వీకెండ్ ఈవినింగ్. ఎవరయినా దొరికే అవకాశం తక్కువ. విదూని గానీ ఆండ్రూని గానీ పిలవాలన్నా అదే ప్రాబ్లం. లాస్ట్ రిసార్ట్‌కింద డాడీ వున్నారు గానీ, ఆయన మెక్లీన్‌నించీ రావాలి. అంత దూరమేమీ కాదుగానీ, తరువాత ఆయన ఇచ్చే ఉపన్యాసాలని విని తట్టుకునే ఓపిక లేదు. అప్పుడు నువ్వు గుర్తొచ్చావు. పరుగెత్తు కొచ్చాను. ఒక్క క్షణం ఆలస్యమయితే నువ్వు దొరికేవాడివి కావు. మీ ఆనందానికి అడ్డు రాకూడదే, ఎలాగా అని ఆలోచిస్తుంటే ఆమె నీకు ముందు బై చెప్పడం, తరువాత నిన్ను తోసేసి వెళ్లిపోవడం కనిపించి, అమ్మయ్య అనుకున్నాను. అయాం సారీ షి డిడన్ట్ గో విత్ యు టునైట్ అండ్ యు ఆర్ స్టక్ విత్ మి!” అపాలజెటిక్‌గా అన్నాడు రోహిత్.

“నాటెటాల్. షి ఈజ్ ఫర్ ది లాంగ్ హాల్. షి ఈజ్ స్పెషల్! దిస్ ఈజె మెమొరబుల్ వీకెండ్!” అన్నాడు హమీర్.

“గుడ్ ఫర్ యు. గ్లాడ్ టు హియర్ – ఆఫ్టర్ ఆల్ దీజ్ యియర్స్, అండ్ మీనా, గ్లాడ్ యు ఫౌండ్ ది వన్ యు లైక్! మరి ఆమెను ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావ్?”

“దేరీజ్ టైం! అంత తొందరెందుకు?”

వాషింగ్టన్, డి.సి.,ని దాటి మేరీలాండ్‌లోకి ప్రవేశించి, సిల్వర్ స్ప్రింగ్‌లో జార్జియా ఎవెన్యూ మీదనుంచీ ఈస్ట్‌వెస్ట్ హైవే మీదకి లెఫ్ట్ టర్న్ తీసుకోవడానికి సిగ్నల్‌కోసం ఆగినప్పుడు, “కారు తెచ్చుకోవడానికి అంత తొందరేం లేదు గనుక, పార్క్ చేసిన తరువాత లోపలికి వెళ్లి ముందు క్రెడిట్ కార్డులన్నీ కాన్సిల్ చేయించు. ఇప్పటికే ఆ దొంగలు కొంత ఆన్‌లైన్ షాపింగ్ చేసివుంటారు!” హెచ్చరించాడు హమీర్. అలాగే నన్నాడు రోహిత్.

గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత లెఫ్ట్ టర్న్ తీసుకోబోతుండగా, ఎడమపక్కనున్న క్రాస్‌రోడ్డులోంచి ఒక కారు వచ్చి వాళ్ల కారుని హమీరున్న వైపు గుద్దింది. ఆ గుద్దినవాడు రెడ్‌లైట్‌ని బీట్ చేశా డనడానికి నిదర్శనంగా ఆ ఇంటర్సెక్షన్లో వున్న కెమేరా ఆటోమేటిగ్గా ఫోటో తీసివుంటేనేం, తరువాత వచ్చిన పోలీసులు ఆ డ్రైవర్ చట్టపరిమితిని మించి ఎక్కువగా తాగివున్నాడని బ్రెతలైజర్ టెస్ట్ చేసి కనుక్కుని రిపోర్టులో రాస్తేనేం? హమీర్‌కి తగిలిన దెబ్బలని అవేవీ మాయం చెయ్యలేవుగా!

[ఇంకా ఉంది...]