స్నానం చేసి బయల్దేరితే మనసొచ్చేది కాదు. హయ్ హయ్. తడిస్తె ఎంత బాగుంటుంది. మీ ఇంటికి తడిసిపోతూ రావడం ఎంత బాగుంటుంది. వేన్నీళ్ళ స్నానం, నువ్విచ్చే కాఫీ.. అబ్బా!
ఎప్పట్లాంటిది కాదీ వాన- నీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు వచ్చి ఉంటుంది. మళ్ళా ఇవ్వాళే. ఇంట్లో ఎవరు లేరని దానికీ చెప్పావూ?
నవ్వొద్దు. నిజంగా ఎప్పట్లాంటిది కాదీ వాన. వచ్చిన దారిలో ఒక్కడూ కనపడలేదు. ఒక్క తాబేలు, కొన్ని నీళ్ళూ.
***
చిన్నప్పుడంటే గుర్తొచ్చింది.
పొద్దుపొద్దునే మట్టి గోడ తవ్వి నీళ్ళాడిన కుందేటి పిల్లకి ఇది ఎన్నో కాన్పని అమ్మనడిగానా! అమ్మ నన్నేం కొట్టలేదు. అన్నిటిని చూపుడు వేలితో లెక్కపెట్టించింది. ఇంకా ఉడకబెట్టిన చిక్కుల్లు నోట్లో పెట్టించింది. కొంచెం పొద్దొచ్చాక -నమ్మవు నువ్వు. అవన్నీ నా చూపుడు వేలిని గుర్తుపట్టేవి.
అప్పటికి నాకు ఊహ తెలీదంట. నాకు తెలీదని అందరికీ తెలుసంట. పడవ చేసి వదిలేస్తాన.. కాగితమ్మీద గీసిన బొమ్మలేవో తడిసిపోతాయని అలక.
ఆరేళ్ళనుకుంటా… తుంపరే రానీ, తుఫానే రానీ… అమ్మ నా చుట్టూతా పాదులు వేసిందా. నమ్మవు నువ్వు.ఇళ్ళు ఉరిస్తే- హొయలుపోయే ఆకుల చివర ఒత్తుకు వేళ్ళాడే చినుకుపూల వణుకు నాకు.
నిద్ర సరిగా ఎప్పుడూ లేదులే. అర్జునా! ఫల్గునా! అందరు లేచేదాకా… గట్టిగట్టిగా… ప్చ్. నవ్వొద్దు. నా దుప్పటి నాకే ఉండేది. పువ్వుల్దికాదు కానీ కొంచెం అట్లాంటిదే. కొంచెమే చిరిగుండేది. బయటికి రావడానికి. అందులో ఎప్పుడున్నా గనక. అమ్మ చీరలో-
అన్నం ఎట్లా ఉడికేది చెప్తానుగానీ, నువ్వు ఇంకో కాఫీ..
ఆ తర్వాత నన్ను బళ్ళో ఉంచేసారు. రాత్రులంతా ఒక్కన్నె. చిమ్మట్ల ఏడుపులో. భయమవుతుందని నాన్నకి చెప్పే ధైర్యం ఉంటేగా. అక్కడెక్కడో పిడుగుపడితే అరికాళ్ళలో వేడి. కప్పలు చేత్తో పట్టుకుని బయటికి విసిరేయడం చాలా కష్టంగా అలవాటు చేసుకున్నా. ఎవరో ఒకరుండకపోతే దొంగలు పడి ఏదో ఒకటి ఎత్తుకుపోతారట. సరె. ఎవ్వరూ లేకపోతే నన్ను మాత్రం ఎత్తుకుపోరూ?
వయసొచ్చిందా! వచ్చిందో పోయిందో తెలీనట్టుండేది. వాన.
ఒకమ్మాయి క్లాస్‌కి చాక్లెట్స్ తీసుకొచ్చిందా పుట్టిన రోజని. హోరుమని వాన. అందరూ తీస్కున్నారు. నేన్ నిప్పు రాజేసి మొక్కజొన్న పొత్తులు కాల్చే చోటు దగ్గర పలక్కుండా కూర్చున్న. అకస్మాత్తుగా మెరిసింది ఆకాశం. బాగుండింది. నేను ముద్దు పెట్టమని అడగలే. పాపం పిచ్చి పిల్ల. ముందు నాకివ్వలేదని అలిగానంతే.
ముద్దంటే గుర్తొచ్చింది. ఆరుద్ర పురుగు గుర్తుందా నీకు? పోనీ… అగ్గిపెట్టలో రింగన్న పురుగు? భుజమ్మీద ఉడత కూర్చుంటే చెట్టంత ఎదిగిన ఫీలింగ్ అప్పుడు.
***
పదహారేళ్ళప్పుడు ఇంట్లోంచి పారిపోయాను. అదీ వానలోనె. భాష రాదు. బాధ పోదు. జుత్తు ఆరేలా తుడిచేందుకు నాతో వచ్చిన మనిషి లేదు.
“.. రైలొచ్చినపుడు టీ అమ్మితే డబ్బులిస్తా అన్నారు. అమ్ములు. ఇద్దరికీ పని ఇస్తారట. నీకైతే కొత్త బట్టలు కూడా…”
“..అమీనా! అమీనా! పద… లే త్వరగా… తెల్లారిందంటే మన పని…”
హ్మ్.చెట్ల మీది పూల కొమ్మలు, పూల రెమ్మలపై ఎగిరే తూనీగ రెక్కలు విరిగి… ఊహ తెలిసి… తలుపు సందులో వేళ్ళు నలిగి…
ఆపై యేళ్ళ తరబడి ముసురు. అన్నం కలుపుతుంటే వెక్కిళ్ళు. తెరల తెరల నిద్ర. కలలనిండా- అలుగు దుంకి తుళ్ళిపడితే రాళ్ళు తగిలిన చేపపిల్లలు.
నేనసలు బయటికి రాలేదు!
***
ఇప్పుడెందుకనేనా? ఇందాక- ఇరవయ్యారు నీలోంచి తీసేసాక-తలుపులన్నీ వేసి కిటికీ తెరిస్తే… ఓయ్. నవ్వొద్దు. మన ఆట గురించి కాదు.
ఇంటి బాల్కనీలోకి తడిసొచ్చిన పిట్ట- నా కళ్ళలోకి తేరిపార చూస్తూ… “మన గురించి ఎవ్వరికీ” …
అదేదో కధలోలాగ.. If you were a thrush and you showed me your nest, do you think I’d tell? Not me..” అనేసా.
దోనెలోంచి వాలుగ జారి అరుగుమీద పడే ఋతువు శబ్దం. పసిపిల్ల కేరింత. అమ్మ చేతులంత వెచ్చటి పాట. ఇంత నగ్నమై, ఇంకా దాచుకునేదేముందని?
నిజంగా ఎప్పట్లాంటిది కాదీ వాన. నీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు వచ్చి ఉంటుంది. వీధి చివర తాబేలు చూసా అన్న కదా. అదెప్పటికీ నన్ను దాటేసి పోదు. ఇక్కడే నీ ఒళ్ళో ఎంతసేపు నిద్రపోయినా..
**** (*) ****
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్