మౌలిక విశ్వాసం (The Ultimate Belief… A. CLUTTON-BROCK) – అధ్యాయం 3
ఆత్మ యొక్క మూడు కార్యాచరణలగురించి స్థూలంగా చెప్పుకున్నాక, ఇప్పుడు నేను ఒక్కొక్క దానిగురించీ ప్రత్యేకంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా నైతిక కార్యాచరణ గురించి. ఈ నైతిక కార్యాచరణ ప్రయోగాత్మకమైనది. అది ఆచరణతోనూ, ఆచరణకి దారితీసే మానసిక స్థితులతోనూ కూడుకున్నది. ఒక మానసిక స్థితిని, దాని వల్ల కార్యరూపం ధరించే పనిని బట్టి అంచనా వెయ్యడమూ, పరీక్షించడమూ జరుగుతుంటుంది. అది నిజానికి కార్యాచరణలో భాగంగా, దానికి ప్రేరణగా భావించబడుతుంది. ఏది యుక్తమైనదో ఆ పనిని దానికోసమే ఆచరించడం నైతిక కార్యాచరణ అనిపించుకుంటుంది; అది నీతినియమాలకు కట్టుబడి ఉన్నంతవరకు, అది ఆచరణలో భాగంగా ఊహించబడుతుంది.
ఆత్మకి ఏది యుక్తమైనదో అది చెయ్యాలని తీవ్రమైన ఆకాంక్ష ఉంటుంది, బహుశా, ఈ ఆకాంక్షే మనసు యొక్క అన్ని ప్రక్రియల్నీ నియంత్రిస్తుంది. అయితే, ఆ ఆకాంక్ష నెరవేరిన సంతృప్తి ఆచరణలో తప్ప కేవలం ఆలోచనవల్ల సిద్ధించదు. ఎంత యుక్తమైన ఆలోచన అయినప్పటికీ, అది నైతిక కార్యాచరణరూపందాల్చినపుడు తప్ప సంతృప్తినివ్వలేదు. ఒక మంచి ఆలోచన, ఆచరణలో తప్పుగా పరిణమించినపుడు “ఆత్మ” తీవ్రమైన అసంతృప్తికి గురవడమే కాకుండా, ఒకరకమైన నిర్వీర్యతకి లోనవుతుంది. ఎందుకంటే, అంత మంచి ఆలోచనా కార్యరూపంలోకి వచ్చేసరికి దానికి తగిన సత్ఫలితాన్నివ్వక నిష్ప్రయోజనమైపోయిందికదా అని. అంటే ఒక ప్రక్రియ సజావుగా ప్రారంభమై, తప్పుగా ముగిసింది; లేదా తగిన ముగింపుకి నోచుకోలేకపోయింది; ఎందుకంటే, తప్పుడు ముగింపు ప్రక్రియలో భాగం కాకపోవడమే కాదు, దానికి సరిగా వ్యతిరేకము.
ఇతర తత్త్వచింతనలలో మనుషులు ఎందుకు ఏది మంచో అదే చెయ్యాలి అన్న విషయమై వేరే కారణాలు చూపించవచ్చు. మనుషులు మంచిని ఎలా గుర్తిస్తారన్నదానిమీద చాలా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఒక్కోసారి ముందు మంచి అనుకున్నది తర్వాత మంచికాకుండాపోవడం సంభవించవచ్చు. ఉదాహరణకి, అది ఉదాత్తంగా ఊహించిన … స్వలాభాపేక్ష కావచ్చు లేదా మానవజాతికంతటికీ ఆశించిన ప్రయోజనం కావొచ్చు. ఈ తత్త్వచింతనలు మంచి అనుకున్నది మంచికాకుండా పోయినపుడు, మనుషులు తాము మంచిచేశామన్న అనుభూతి ఎందుకు పొందుతారంటే సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతాయి; దానిని అంత ఆవేశపూరితంగా మంచిగానే ఎందుకు పరిగణించాలి? వేరొక రీతిగా పరిగణించకూడదు? అంటే, సమాధానం దొరకదు. అదే రకమైన ఇబ్బంది సత్యం విషయంలోనూ సౌందర్యం విషయంలోనూ ఎదురౌతుంది. వ్యక్తులు ఈ మూడింటినీ వాటికవే ప్రయోజనంగా భావించి విలువ ఇవ్వడమూ, ఆ విలువ ప్రదర్శించినపుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి చెందడమూ జరుగుతుంది; దేనికీ దానికోసమే విలువ ఇవ్వని అంశాలపై అదే రకమైన అనుభూతి చెందరన్నది అనుభవైక సత్యం.
అదే మనం ఆత్మతత్త్వాన్ని అంగీకరించగలిగితే, ఈ అనుభూతుల్నీ, ఈ విలువల్నీ విశదీకరించడానికి ప్రయత్నం చెయ్యనక్కరలేదు. ఆత్మ కేవలం ఏది మంచో, ఏది సత్యమో, ఏది సౌందర్యమో వేరే ప్రయోజనం ఆశించకుండా విలువ ఇస్తుందని సమాధానం చెప్పొచ్చు. శరీరానికి ఆహారం పట్ల ఎటువంటి అపేక్ష ఉంటుందో, ఆత్మకి ఈ మూడిటి పట్లా అదే రకమైన అపేక్ష ఉంటుంది. ఆత్మని ఎలా అయితే ఇతరత్రా విశదీకరించలేమో, వాటిని కూడా వేరే విధాలుగా విశదీకరించలేము. కనుక ఏది మంచి అని మనల్ని అడిగితే, ఆత్మ దేనికి వేరే ప్రయోజనం ఆశించకుండా మంచి అన్న విలువ ఆపాదిస్తుందో అదే మంచి అని చెప్పవచ్చు. ఆత్మ ఒక పనిని వేరే ప్రయోజనం ఆశించకుండా చేసినపుడు, అది మంచి చెయ్యడానికే ప్రయత్నిస్తుంది; ఈ కోరికని ఆచరణలో ఆటంకపరిచినా, వ్యతిరేకించినా మనం చెడే చేస్తాము.
అయితే ఒకమాట ఒప్పుకోవాలి. మనం అనునిత్యం మన చర్యల్ని అవి ఇతరులపై చూపే ప్రభావం ఆధారంగా అంచనా వేస్తాము. అది ఎందుకంటే, ఆత్మప్రమాణంలో ఇతరులకి మంచి చెయ్యడమే మంచి, హాని చెయ్యడం కాదు. ఆత్మ ఇతరులకి మంచి చెయ్యడం… ఏదో ప్రయోజనాన్ని ఆశించడం కాకుండా కేవలం మంచి చెయ్యాలన్న తలపు వలననే. కనుక మన చర్యల్ని అవి కలిగించే ఫలితాలబట్టి అంచనా వెయ్యాలి; మనం ఇతరులకి హాని చెయ్యకుండా, మంచి చెయ్యాలంటే ఎలా నడుచుకోవాలన్నదానిగురించి ఆలోచించాలి. మన చర్యల్ని అంచనా వెయ్యడం, మంచి చెయ్యాలన్నఆలోచనా ఇవన్నీ నైతిక కార్యాచరణలో భాగమే; అన్ని ఆ లక్ష్యాన్ని అందుకోవడమే లక్ష్యంగా చేసే ప్రయత్నానికి ఉపకరణాలు అని గుర్తించాలి. ఆ ఒక్క విధంగా మాత్రమే మంచిచెయ్యాలన్న కోరికని కార్యరూపంలో పెట్టవచ్చు. ఒక రకంగా ఇది కళా కారుడి నైపుణ్యం లాంటిది; ఆ నైపుణ్యాన్నిబాగాచెయ్యాలన్న లక్ష్యంతో తప్ప వేరే విధంగా సాధన చెయ్యడం సాధ్యపడదు.
ఉదాహరణకి, ఒక వేళ నేను ఇతరులకి మంచిచేస్తూపోతున్నాననుకుందాం… ప్రతిగా వాళ్లు నాతో మంచిగా ఉంటారనో, లేదా నేను మంచి చేస్తున్నానన్న భావనని ఆనందించడానికో; అపుడు నేను మంచి ఆచరించే క్రమంలో వాళ్ళ క్షేమం ఆలోచించడం లేదు, నా క్షేమం గురించి ఆలోచిస్తున్నానన్నమాట. నేను వాళ్ళ యోగక్షేమం ఎప్పుడైతే ఆలోచించడం లేదో నేను వాళ్ళకి క్షేమం కలిగించేది ఎక్కడచేస్తున్నాను? వాళ్ళకి ఏది మంచో నాకెప్పుడు తెలుస్తుంది? వాళ్ళకి ఏది మంచో అది చెయ్యాలన్న కోరిక ఉన్నప్పుడు. నా కోరిక ఎప్పుడైతే వాళ్ళకి ఏది మంచో అది చెయ్యడం కాకుండా, నేను ఏది చేస్తే నాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభం కలుగుతుందో అది అయినపుడు, నాకు వాళ్ళకి ఏది మంచో తెలుసుకునే అవకాశం కోల్పోతున్నాను.
ఇది మార్మికత కాదు. ఇది లోకజ్ఞానం. ఎప్పుడైతే నాకు కలగబోయే లాభం నా పరమావధి అవుతుందో, నేను ఎంతసేపూ నా లాభం గురించే ఆలోచిస్తాను తప్ప ఇతరులకి ఏది మంచో అది ఆలోచించను. నా ఆనందం కోసం వాళ్ళకి ఏది మంచో అది చేస్తున్నానని నన్ను నేను నమ్మించుకో వచ్చు; మభ్యపెట్టుకోవచ్చు. నిజంగా నా లక్ష్యం ఎప్పుడైతే అది కాదో, నా పరిశ్రమని నా నిజమైన లక్ష్యం నియంత్రిస్తూ, డబ్బు సంపాదించడమే ధ్యేయమైన కళాకారుడు కళలో ఎలా విఫలమౌతాడో, ఇతరులకి నిజంగా ఏదిమంచో అది చెయ్యడంలో అలా విఫలమౌతాను.
ఇతరులకి మంచి చెయ్యడంలో కేవలం క్రియ ఒక్కటే చాలదు, అది ఎలా చేస్తున్నామన్నది కూడా ముఖ్యమే. మరోలా చెప్పాలంటే, మనం మంచి ఆచరించే విధానం కూడా కార్యాచరణలో ముఖ్యమైన భాగమే. మొరటు ఉదాహరణ ఇవ్వాలంటే, నేను మరొక వ్యక్తికి ధనసహాయం చేస్తున్నపుడు, సహాయం చేస్తున్నందుకు అతను నన్ను ప్రేమించడమూ, లేదా ద్వేషించడమూ నేను అతనికి ఇచ్చే విధానం బట్టి ఉంటుంది. నేను ధనసహాయం చేసిన తర్వాత కూడా నన్ను ద్వేషిస్తున్నాడంటే, నాలో నేను అతనికి మంచిచేసేనని గర్వపడవచ్చునేమో గాని, నేను అతనికి ఏమాత్రం మంచి చెయ్యలేదన్నమాట. కనుక డబ్బు ఇవ్వడం అన్నది ఒక్కటే మంచికార్యాచరణ కాదు. అది ఏ విధంగా ఇచ్చేమన్నది కూడా కార్యాచరణలో అంతర్భాగమే. కాని, ఆ “విధానం” ఇస్తున్నపుడు నా మనసులో పొందే భావనమీద ఆధారపడి ఉంటుంది. నేను అతనికి నేను ధనసహాయం చేస్తున్నపుడు నేను చాలా ఉదారుడనన్న చైతన్యంతో ఇస్తే, ఆ ఇచ్చే విధానం తప్పు; అప్పుడు ఆ వ్యక్తి నే చేసిన ఉపకారానికి నన్ను ప్రేమించడానికి బదులు నన్ను అసహ్యించుకుంటాడు. నేను అతనికి ఇస్తున్నపుడు అది నాకు మంచి జరగాలనీ, అతను నన్ను ప్రేమించాలనీ అనుకోకుండా, నిరపేక్షగా ఇవ్వాలి. అతను మానసికంగానూ, భౌతికంగానూ లాభపడాలని సంకల్పించి ఇవ్వాలి.
మనం సామాన్యంగా నైతికతగురించి చెప్పేటపుడు, ముఖ్యంగా యువతకి బోధించేటపుడు, దురదృష్టవశాత్తూ మంచి చెయ్యాలన్నది చెపుతూ అదెందుకు చెయ్యాలన్నది మాత్రం చెప్పడం విడిచిపెట్టెస్తాం. నిజానికి మనం లక్ష్యం సరియైనదయినపుడే మంచి చెయ్యగలం; ఆ లక్ష్యం ఎప్పుడూ వేరే ఏదీ ఆశించకుండా మంచిని నెరవేర్చడమొక్కటే. అలాగే, సరియైన కారణం ఒక్కటే ఏది మంచో మనకి చెప్పగలదు. అదొక్కటే, దానిని నెరవేర్చడానికి తగిన కార్యాచరణ మార్గాన్ని కూడా సూచిస్తుంది. ఆ మార్గమే అనుసరించకపోతే ఆ ఆచరణే మంచిదికాకుండా పోతుంది. యువతకు బోధించే నైతికతలో చాల భాగం మంచిచెయ్యడంలో కలిగే ఆనందం మీద, ముఖ్యంగా చేసే వ్యక్తికి కలిగే ఆనందం మీదే దృష్టి పెడుతుంది. యువత ఈ అంతరార్థాన్ని త్వరగానే గ్రహిస్తుంది. నైతికత పర్యవసానం అన్నిసార్లూ ఆనందం కానక్కరలేదనీ, అటువంటి ఆనందాన్నినొక్కిచెప్పే నైతికతపట్ల వాళ్ళకి అంత ఆత్మసంతృప్తి కలగదనీ వాళ్ళు అతి త్వరలోనే తెలుసుకుంటారు. కాబట్టి ఈ రకమైన లాభాపేక్షతో కూడిన నైతికతపట్ల వాళ్ళు ఎదురు తిరిగి అల్లరి పనులు చేస్తుంటారు. పాఠశాలలలో విద్యార్థులు చేసే అల్లరిలో చాలభాగం వాళ్ళకి ఏమాత్రమూ సంతృప్తి కలిగించని ఈ లాభాపేక్షతో కూడిన నైతికతకి వాళ్లు గుడ్డిగా ఎదురుతిరగడం వల్ల కలిగిన పరిణామమే.
మగపిల్లలు తప్పుచెయ్యడం తప్పుగా తీసుకోరు. వాళ్ళు ఒకర్నొకరు తప్పు చెయ్యడానికి ప్రేరేపించుకుంటారు. వాళ్ళకి గురువులపట్ల అవిధేయత, దురాలోచనచెయ్యడం ఒక రివాజుగా మారుతాయి. అలా తప్పుచెయ్యడంలో వాళ్లకి తప్పుతోవపట్టిన నిరపేక్షత కనిపిస్తుంది. వాళ్ళు అల్లరి చేసినా, కనీసం వాళ్ళు ఆ అల్లరి ఏ ప్రతిఫలాన్ని ఆశించో చెయ్యడం లేదు; అంటే, వాళ్ళు “ఒక పనిని చేస్తున్నపుడు దానివల్ల కలిగే లాభంగాని, దండనగాని దృష్టిలోపెట్టుకోవాలన్న” అభిప్రాయాన్ని త్రోసిరాజంటున్నారు. ఈ రకమైన లాభమూ – దండన అన్న పద్ధతే వాళ్ళకి నచ్చదు. దానికి కారణం వాళ్లలో ఉన్న తప్పుచేయాలన్న కోరిక కాదు; ఈ రకమైన బహుమానం- శిక్షా అన్న చట్రంలోంచి వాళ్లలో ఉండే ఆత్మ తనను తాను స్వతంత్రంగా ఉంచుకోవాలని కోరుకోవడమే. వాళ్ళకి మంచి మంచికోసమే చెయ్యాలని చెప్పకపోవడం వల్ల, వాళ్ళు తప్పును తప్పుకోసం చేసి ఆ చట్రంలోంచి తప్పించుకోజూస్తారు. వాళ్లకి ఆదర్శంగా నడిచే కుర్రాడంటే ఇష్టం ఉండదు. కారణం అతడు ఈ బహుమానమూ – దండన అన్న చట్రానికి బానిసగా ప్రవర్తిస్తాడు. అతనికి నిరపేక్షగా ఏ పనీ చెయ్యడం తెలీదు. వాళ్ళు అతని తంతే, అతనిమిద అసూయకొద్దీ కాదు, వాళ్ళు బహుమతితోపాటు దండనకికూడా అతను అర్హుడే అని భావించడం వలన.
ఆ కుర్రాళ్ళకి మంచిని మంచికోసమే చెయ్యాలనీ, మంచితనం అంటే అందులోనే ఉందనీ మరెందులోనూ లేదని వాళ్ళకి అర్థం అయేలా చెప్పగలిగితే, ఈ విపరీత ధోరణినంతటినీ, కనీసం చాలావరకు, అరికట్టవచ్చు. నిరపేక్షగా ఏ పనినైనాచేసే వాళ్ళ సహజసిద్ధమైన స్వభావానికి ఎన్నడూ అవకాశం ఇవ్వము. వాళ్ళకి మంచితనం యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్పరు, ఒక వేళ చెప్పినా, ఆ చెప్పినది తప్పుగా చెప్పడంతో, వాళ్ళ విధ్యార్థి జీవితం చాలభాగం మంచితనం అంటే ఏమిటో తెలుసుకోకుండానే గడిచిపోతుంది. ఉపాధ్యాయులు తమ సౌకర్యానికి ఏది మంచి అని చెప్పేరో అదే వాళ్ళకి లీలగా మిగులుతుంది. అందుకనే తెలివైన, చురుకైన పిల్లల్లో నైతికత అన్నది ఒక సంప్రదాయం అన్న నమ్మకం మిగిలిపోయింది; అది సంప్రదాయమే, కానీ అది ఆత్మానుగతంగా వచ్చే నైతిక ప్రవర్తన అయినప్పుడే. (ఇక్కడ మనం సమ్యక్+ ప్రదానం = సంప్రదాయం (యుక్తమైనది విరివిగా ఇచ్చేది) అని గుర్తుపెట్టుకోవాలి.)
దండన విషయానికి వస్తే, ఇంటిదగ్గర తల్లిదండ్రులూ, పాఠశాలలో ఉపాధ్యాయులూ సాధ్యమైనంత స్పష్టంగా పిల్లలకి అర్థమయేలా తొందరగా చెప్పాలి. వాళ్లు దుష్టులనో, లేదా వాళ్ళని బాగుచెయ్యడానికో దండించడం లేదనీ, వాళ్ళు మంచికోసం మంచిగా ఉండాలితప్ప శిక్షను తప్పించుకుందికి మంచిగా ఉండకూడదనీ విశదపరచాలి. వాళ్ళని దండించడానికి కారణం వాళ్ళు ఇతరులకి గాని, తమకు తాము గాని హాని చేసుకోకుండా నివారించడానికేనని స్పష్టం చెయ్యాలి. అయితే, అటువంటి నివారణ మార్గాల్లో దండన ఉత్తమమైనదా కాదా అన్నది తల్లిదండ్రులూ, ఉపాథ్యాయులూ ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలి. కానీ, దండించాలన్న నిర్ణయం తీసుకున్నపుడు తగిన కారణం ఉండాలి, ఆ కారణాన్ని తప్పుచేసిన వాడికి తెలియజెయ్యాలి. అన్నిటికన్నా మిన్నగా, ధర్మాగ్రహంతో ఎవరినీ శిక్షించకూడదు, లేదా, శిక్షిస్తున్నపుడు ధర్మాగ్రహాన్ని ప్రకటించకూడదు. దానికంటే, కేవలం కోపంతో శిక్షించడం మెరుగు, దానివల్ల ఆ కుర్రాడు తాను ఒక చికాకు తెప్పించే పని చేశాను గనుక శిక్షింపబడ్డానని తెలుసుకుంటాడు, అంతే కాదు, ఆ దండన, తను జీవితంలో ఇలా చికాకు పరిచే పనులు చేసుకుంటూ పోతుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో హెచ్చరిస్తుంది. ప్రపంచం చికాకుపనులు చేసే వాళ్ల పట్ల ఎలా ప్రవర్తిస్తుందన్నదానికి అది ఒక ఉదాహరణగా గుర్తిస్తాడు.
కానీ, దండన ముఖ్యంగా నియమాలను ఉల్లంఘించినందుకు విధించాలి. పిల్లలకి నిబంధనలు అందరి సౌకర్యానికీ ఏర్పచబడ్డాయనీ, నిబంధనల ఉల్లంఘన నైతిక ఉల్లంఘన కాదనీ, అది ఒక అసౌకర్యమనీ చెప్పాలి. పిల్లవాడు నిబంధనలకు కట్టుబడేలా ఉంచడానికి వేరే మార్గం లేకపోతే, తప్పనిసరి పరిస్థితిలో దండించాలి. దండన హేతుబద్ధం కాదనీ, కానీ అతను హేతుబద్ధంగా ప్రవర్తించని కారణంవలన, విధిలేనిపరిస్థితుల్లో అతన్ని శిక్షిస్తున్నామని తెలియజెప్పాలి. అతనికి అన్నిరకాలుగా నిబంధనలు ఉల్లంఘించడంవల్ల ప్రయోజనంచేకూరదని తెలియజెయ్యాలి. అయితే, ఈ ప్రయత్నంలో అతని నైతిక భావనకీ, స్వలాభానికీ మధ్య అవగాహనలో గందరగోళం సృష్టించకూడదు. అతను దాన్ని మాటల్లో చెప్పలేకపోయినా దాని గురించిన అవగాహన కలిగే ఉంటాడు. అతనికి అన్యాయం జరిగిపోతోందనీ, కొందరు అన్యాయంగా లబ్దిపొందుతున్నారనే భావనతో ఎవరూ పసిగట్టలేకుండా ప్రతి నియమాన్నీ ఉల్లంఘించడంద్వారా తన అసహనాన్ని ప్రకటించుకోవచ్చు. కానీ, నైతికతకోసమే నైతికంగా ప్రవర్తించాలని అభిలషించే అతనిలోని ఆత్మ, నిజమైన కారణం కాకుండా, ఏదో కారణం చూపి నైతికంగా ప్రవర్తించాలని చెప్పినపుడు, ముందు ఆశ్చర్యపడి, తర్వాత ఎదురుతిరుగుతుంది.
ఆ విధంగా ప్రతి పసివాడిలోనూ ఉన్న ఆత్మకి కొన్ని కోరికలుంటాయన్న ప్రతిపాదనమీద నైతిక బోధన ఆధారపడి ఉండాలి. ఆ బోధన ఈ కోరికని బలపరుస్తూ, అదేమిటో పిల్లవాడికి విశదమయేరీతిగా ఉంటే, కుర్రవాడికి అతను మంచే చెయ్యాలనీ, ఆ మంచిని మంచికోసమే తప్ప మరేదీ ఆశించి చెయ్యకూడదనీ తెలుసుకోగలుగుతాడు. అతను విధేయుడుగా ఉండడానికి వేరే మార్గాలు అనుసరించవచ్చు; కానీ, అపుడు అతను తన ఆత్మచెప్పినట్టు కాకుండా వేరెవరి ఆదేశాలనో అనుసరిస్తుండడంవల్ల, అటువంటి విధేయత కనపరచవలసిన అవసరం తప్పిపోగానే, విద్య అతనికి వికసనాన్ని కలిగించడానికి బదులు గందరగోళాన్ని సృష్టించడంతో, అతనికి మార్గదర్శన చెయ్యడానికి అతని అంతరాత్మ తప్ప వేరేదీ మిగలదు.
[ఇంకా ఉంది...]
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్