[ జూన్ నెల సంచిక తరువాయి ]
ఆ తర్వాత జరిగిన సంభాషణలలో గుర్తు పెట్టుకోవలసినవేవీ లేవు. లియో కి తనెవరో అప్పటికి తెలియకూడదని ఆయేషా అభిప్రాయం – తన స్వభావాన్ని ఏ మాత్రం బయటపడనీయలేదు. ఎప్పట్లాగా స్వేచ్ఛగా మాట్లాడేది కాదు. ఆ రోజు – మా వినోదం కోసం నాట్యాన్ని ఏర్పాటు చేశానని చెప్పింది.కాస్త ఆశ్చర్యమేసింది – ఈ అమహగ్గర్ మనుషులకీ సరదాకీ ఆమడ దూరం …మొహాలెప్పుడూ చిర చిరలాడుతూ ఉంటాయి కదా ! నాగరికులూ ఆటవికులూ – మనకి తెలిసి ఉన్న అన్ని జాతుల వినోదాలకీ , వీళ్ళు వినోదంగా భావించేదానికీ ఏ కోశానా సంబంధం లేదని తర్వాత తెలిసి వచ్చింది. మేము వచ్చేయబోతుండగా ఆయేషా అక్కడి గుహల్లో విశేషాలని లియో కి చూపిస్తానని అంది. జాబ్, బిలాలీ కూడా మాతో వచ్చారు. అవి పేరుకి వేరే గుహలు గానీ అందులోవి ఇదివరకు నేను చూసినవాటిలాగే ఉన్నాయి – ఏమీ తేడా లేదు. ఆ తర్వాత – బ్రహ్మాండమైన ఎముకల గుట్టలని కూడా దర్శించుకున్నాము – నా ఖర్మ కొద్దీ నాకది రెండోసారి. ఒక పొడవాటి నడవా చివరన మరిన్ని శవాగారాలు – వాటిలో కోర్ జాతి బీదవాళ్ళ శరీరాలని భద్రపరిచారు. సహజం గానే ఆ ప్రక్రియ అంత పద్ధతిగా జరిగి ఉన్నట్లు లేదు…
లియో అదంతా ఆసక్తిగా చూశాడు గాని , పాపం – జాబ్ కి ఆ వ్యవహారం ఏమీ ఆకర్షణీయం గా లేదు. ఆ దిక్కుమాలిన దేశం లోకి అడుగు పెట్టినప్పటినుంచీ అతని మనసేం బాగాలేదు- ఇప్పుడిలాగ, ఎప్పుడో పోయి ఉన్నవాళ్ళని చూస్తుంటే వాళ్ళ గొంతులన్నీ అతని బుర్రలో మోగనారంభించాయి. చచ్చిన వాళ్ళని చూసి దడుచుకోకూడదనీ తానూ ఇంకోనాటికి అలాగే అవబోతాడనీ – బిలాలీ అతనికి నచ్చజెప్పబోయాడు . నేను ఆ మాటలని అనువదించి చెబితే జాబ్ విని, – ” ఆహా , ఏం చెప్పాడయ్యా ! మనుషులని పీక్కు తినేవాడు చెప్పాల్సిన మాటలేలెండి – అయినా నిజమే అనుకోండి…” – దిగులుగా నిట్టూర్చాడు.
తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం నాలుగవుతోంది. లియో భోజనానికి ఆలస్యమైపోయింది – ఆదరా బాదరా అతనికి ఏదో తినిపించి పడుకోబెట్టాము , ఇంకా పూర్తి జవసత్వాలు ఎక్కడొచ్చాయి అతనికి ! సాయంత్రం ఆరు గంటలయాక , ఆయేషా – జాబ్ కి తన నీటి కూజా మహిమని చూపించే కార్యక్రమం మొదలెట్టింది. పదిహేడు మంది సంతానం లో జాబ్ ఒకడు అని తెలుసుకుని , ఆ అన్న దమ్ములూ అక్కచెల్లెళ్ళూ – అందరినీ ఆ నీటి పైన బొమ్మలు గా చూపించింది. ఎవరో కొద్ది మంది తప్ప స్పష్టం గా అగుపించలేదు – ఎందుకంటే జాబ్ కి వాళ్ళ మొహాలు సరిగ్గా గుర్తు లేవు, మర్చిపోయాడు. అతను మనసులో అనుకున్నదాన్ని మాత్రమే ఆయేషా అక్కడ చూపించగలదు. ఆ మనుషులో ప్రదేశాలో ఆయేషా కి కూడా తెలిసిఉంటేనే , ఎదటి వారి జ్ఞాపకాలను మించి అక్కడి దృశ్యాలు కనిపిస్తాయి . ఏనాడో వదిలేసి వచ్చిన తనవాళ్ళంతా ఆ నీటి మీదినుంచి పలకరిస్తుంటే జాబ్ తట్టుకోలేక కేకలు పెట్టాడు. ఆయేషా విరగబడి నవ్వింది. పైకి అనే ధైర్యం లేదు గానీ అదంతా చేతబడిలాంటి క్షుద్రమైన శక్తేనని జాబ్ గట్టిగా విశ్వసించాడు. లియో ఏమీ అనకుండా చూస్తూ ఊరుకున్నాడు గానీ అతనికీ ఇదేమీ నచ్చలేదని నాకు అర్థమైంది.
ఎట్టకేలకి- ఆ ముచ్చట ముగిశాక, బిలాలీ అక్కడికి [ యథా ప్రకారం నేల మీద పాకుతూ ] వచ్చి , నాట్యానికి ఏర్పాట్లన్నీ పూర్తయాయనీ మేము రావచ్చుననీ విన్నవించాడు. ఆయేషా తన దుస్తుల మీద నల్లటి పొడుగాటి కోట్ లాంటిది తొడుక్కుంది , బయల్దేరాము. గుహం ముందరి రాతి నేలమీద , ఆరుబయట జరుగుతుందట నాట్యం. మా కోసం కుర్చీ లు వేసి పెట్టారు. ప్రదర్శకులెవరూ అక్కడ ఉన్నట్లు లేరు. పొద్దు కుంకింది, చంద్రోదయం అవలేదు ఇంకా. కనుచీకటి గా ఉంది. ఆ ప్రదర్శన మాకు ఎలా కనిపిస్తుందో తెలియలేదు – అడిగితే ఆయేషా నవ్వి , ” చక్కగా కనిపిస్తుంది . ఏమీ సందేహం అక్కర్లేదు. ” అంది.
ఆ చీకట్లోంచి, అన్ని వైపుల నుంచి – దాదాపు యాభై మంది ప్రదర్శకులు ముందుకు వచ్చారు. పెద్ద పెద్ద దివిటీ లేవో వెలిగించి తెచ్చినట్లున్నారు – కాని అవి ముందుకి కాకుండా వెనక్కి వెలుగుతున్నాయి , రెండడుగుల మేర ఆ వెలుగు పడుతోంది. కాసేపటికి ఒక భయంకరమైన విషయం అర్థమైంది – మేము దివిటీ లని అనుకుంటున్నవి , శవాగారా ల నుంచి తెచ్చిన మమ్మీలు, నిప్పంటించి బుజాల మీద వేసుకొచ్చారు….తెలుస్తూనే కడుపులో తిప్పేసింది మాకు. వైన వైనాలుగా ఆ నికృష్టులు వాటి తో అతి జుగుప్సా కరమైన విన్యాసాలు చేశారు. ఆ వివరాలన్నిటిలోకీ నేను వెళ్ళను, నా వల్ల కాదు.
అదీ మా గౌరవార్థం ఏర్పాటైన వినోదం !!!
రోమన్ చక్రవర్తి నీరో – క్రైస్తవులని తారు లో ముంచి బతికి ఉండగానే నిప్పు పెట్టాడని విన్నాము, కనీసం ఇవి శవాలు- అంతవరకూ నయం.
మా మొహాలని పరికించి చూస్తూ ఆయేషా బోధించింది – ” కనీసం ఇందులోంచి ఒక పాఠం నేర్చుకోవచ్చు మనం. ఏం చేసినా సాధించినా బతికి ఉన్నప్పుడే – చచ్చాక ఏమవుతామో ఎవరికి తెలుసు ! ప్రతి నిమిషాన్నీ వీలైనంతగా అనుభవించటమే ”
ఆ బీభత్సం ఇరవై నిమిషాల సేపు సాగింది. అనంతరం అక్కడ దీపాలు వెలిగించారు. ఒక వందమంది అమహగ్గర్ లు ఆడా మగా రెండు వరల్లో నడుస్తూ వచ్చి ‘ నాట్యం ‘ చేశారు. ఆటవికమైన వేట, విచక్షణ లేని హత్య, రాక్షసమైన హింస …ఏదైనా అవుతుంది గాని అది నాట్యమయితే అవదు. మరీ కంపరం పుట్టించినదేమిటంటే ఆ నీచాతి నీచమైన అభినయాన్నంతా వాళ్ళు పూర్తి నిశ్శబ్దం గా చేయటం .
ఆ ఆహ్లాదానికి అప్పుడొక చిన్న ఆటంకం కలిగింది. నాట్యగత్తె లలో ఒక ఆడమనిషి – బాగా భారీ గా బలం గా ఉన్నామె , తూలుతూ మా వైపుకి ముందుకొచ్చింది. పూర్తిగా తాగేసి ఉన్నట్లుంది.
” నల్ల మేక కావాలి నాకు – తెచ్చి ఇవ్వండిరా ! తెచ్చి తీరాలి మీరు, కావాలి , నాకు నల్ల మేక – తెండి ! ” అరుస్తూ నేల మీద పడి చేతులూ కాళ్ళూ తన్నుకోసాగింది. మొహం అతి వికృతం గా మారింది .
వాళ్ళలో ఒక పెద్ద మనిషి వచ్చి ఆమె ని పరీక్షించాడు.
” సైతాన్ పూనింది దీనికి..సైతాన్ ! వెళ్ళి పట్టుకు రండి నల్ల మేక ని. సైతాన్- శాంతించు, వెళ్ళారు, తెస్తున్నారు నల్ల మేకని. శాంతించు ”
ఆమె నేల మీద పడి దొర్లుతూ కేక లు పెడుతూనే ఉంది.
నల్ల మేక నొకదాన్ని కొమ్ములు పట్టుకుని లాక్కొచ్చారు.
” ఇదిగో, సైతాన్- చూడు. పూర్తి నల్లగా ఉంది ” [ వాళ్ళలో వాళ్ళు - పొట్ట మీద తెల్ల మచ్చ ఉంది, చూపించకండి, దాచిపెట్టండి ]
ఆ తెల్ల మచ్చ ఏదో సైతాన్ దృష్టిలో పడనట్లే ఉంది. దాని రక్తం కావాలని ఆమె ప్రకటించింది.
మేక గట్టి గా అరిచింది. తర్వాత నిశ్శబ్దం. ఒక గిన్నె లో పట్టి ఇచ్చిన రక్తాన్ని సైతాన్ పట్టిన మనిషి తాగేసి వెంటనే మామూలయిపోయింది. వెళ్ళి మళ్ళీ నాట్యం చేయటానికి ఉపక్రమించింది. తక్కినవాళ్ళు ఆమెని ఆపారు. వచ్చినవాళ్ళు వచ్చినట్లే రెండు వరసల్లో నిష్క్రమించారు.
అంతా పూర్తయిందేమో, మేమిక పోవచ్చునేమో అనుకునే లోపు ఇంకొక అంశం మొదలైంది. చిరుత పులులూ, కొండ చిలువలూ , అడవి దున్నలూ, దుప్పులూ, పెద్ద పులులూ , సిం హాలూ – అన్నీ మా ముందుకి వచ్చి ఆయా కంఠాలతో అరుస్తూ అసహజమైన నృత్యం ప్రారంభించాయి. అంటే , అదే – వాటి చర్మాల వెనక ఉన్నది మనుషులే. ఆ నృత్యం ఎంతకీ తెమిలేలా లేదు. విసుగు పుట్టి , ఆయేషా ని అడిగి నేనూ లియో లేచి అక్కడే అటూ ఇటూ పచార్లు చేస్తున్నాము. అప్పుడు ఒక చిరుత పులి , గుంపు లోంచి వేరయి – చీకటి మూలల్లోకి నడుస్తూ ” రండి ” అంది. అది ఉస్తేన్ గొంతు . లియో తో బాటు నేనూ వెళ్ళాను , జాగ్రత్తగా అడుగులు వేస్తూ. ఇంకాస్త ముందుకి, యాభై అడుగుల దూరం చీకట్లోకి వెళ్ళాక -
” దొరా ! కనిపించావు నాకు చివరికి. రాణి నన్ను పంపేసింది, లేదంటే చంపేస్తానంది. నీ ప్రాణం రక్షించాను కదా, పెళ్ళాడాను కదా నిన్ను పద్ధతి ప్రకారం – వదిలిపెడతావా నన్ను ? ” – గుస గుస గా అడిగింది.
లియో వెంటనే – ” లేదు, ముమ్మాటికీ లేదు. నువ్వు ఎక్కడున్నావో ఏమైనావోననే ఆలోచిస్తున్నాను. వెళ్ళి రాణికి చెబుదాం పద ”
” లేదు దొరా, వద్దు. మనిద్దరినీ చంపేస్తుంది , ఆమె సంగతి నీకు తెలియదు. నాతో ఉండాలంటే, రా- పారిపోదాం-ఆ చిత్తడి నేలల్లోకి ”
” ఇంకా నయం- లియో !!! ” – నేను కంగారుగా అడ్డుకోబోయాను.
” అతని మాట వినకు. రా, త్వరగా వచ్చెయ్యి. మనం పీలుస్తున్న గాలి లోనే చావు ఎదురు చూస్తోంది , ఈ పాటికే రాణి వింటోందేమో మన మాటలు ” లియో చేతుల్లోకి వాలింది ఉస్తేన్. ఆమె ను కప్పిన చిరుతపులి చర్మం జారి, తల మీది మూడు పెద్ద తెల్ల చారలూ కనిపించాయి. అవి ఎలా వచ్చాయో గుర్తొచ్చి నాకు హడలు పుట్టింది . ఆ ప్రయత్నం కొనసాగేది కాదని తెలుసు గనుక లియో ని ఇవతలికి లాగబోయాను – ఉస్తేన్ అతన్ని పట్టుకునే ఉంది. కొద్ది క్షణాల లోపే నా వెనక నుంచి నవ్వు- వెండి గంటలు మోగే నవ్వు.
రాజ్ఞి నా వెనకే ఉంది. ఆమె వెంట బిలాలీ, ఇద్దరు మూగ భటులు. కొంపలంటుకుపోయాయి ! మొదటి చావు నాదే అవుతుందనిపించి నేల మీద కూలబడిపోయాను. ఉస్తేన్ లియో ని వదిలేసి రెండు చేతుల తో మొహం కప్పుకుంది. లియో చేష్టలు దక్కి చూస్తుండిపోయాడు.
ఒకటి రెండు క్షణాల భయంకర మౌనం తర్వాత రాజ్ఞి మాట్లాడింది-
లియో ని చూస్తూ – ” పర్వాలేదు , సిగ్గుపడకు. మీ ఇద్దరి జంట బాగానే ఉందిలే ”. గొంతు మెత్తగానే ఉంది గాని కత్తి లాగా కోస్తోంది.
లియో , కచ్చగా – ఇంగ్లీష్ లో తిట్టాడు, మొహం కవళిక ని మార్చకుండా.
” వూ, ఉస్తేన్ – నీ నెత్తి మీది చారలు చూడకపోతే గుర్తు పట్టకనే పోయి ఉందును. నాట్యం అయిపోయింది, దివిటీ లు బూడిదయాయి- మంచి సమయాన్నే ఎంచుకున్నావు నీ ప్రణయ కలాపానికి. దాసీ దానా – నా మాట మీరతావనుకోలేదు, ఏమి ధైర్యమే నీకు ! ”
” నాతో చెలగాటమాడద్దు రాణీ” ఉస్తేన్ ఆక్రోశం ” – చంపెయ్యి నన్ను, త్వరగా ”
” అలా ఎలా కుదురుతుంది చెప్పు ? నులి వెచ్చ-ని ప్రేమావేశం లోంచి చలి గడ్డకట్టే మృత్యువు కౌగిట్లోకి – అంత సులువుగా జారిపోవటం సాధ్యమా ? ”
మూగభటులకి సైగ చేసింది. వాళ్ళు ఉస్తేన్ ని చెరొక రెక్కా పట్టుకు లాక్కెళ్ళబోయారు. లియో వాళ్ళ పైకి లంఘించి ఒకడిని పడగొట్టి వాడి మీదికి ముష్టి బిగించాడు.
ఆయేషా మళ్ళీ నవ్వింది. ” గట్టి దెబ్బ, పరదేశీ, జబ్బు పడి లేచినా నీ చేతిలో సత్తువ బాగుంది. వాణ్ణి వదిలేయి, ఆ పిల్ల కేమీ హాని చేయడు లే. ఆమె ని మన నివాసం లోకి తీసుకుపోదాం- నీకు ప్రియమైన వారిని నేనూ గౌరవించద్దా మరి ! ”
నేను లియో ని భటుడి నుంచి విడదీశాను. అతను మెదలకుండా నా వైపుకి వచ్చాడు. అందరం కలిసి , ఆ శవాల దివిటీ లు బూడిదయిన కుప్పలని దాటుకుంటూ నడిచాము.
ఆయేషా తన నివాసానికి దారి తీసింది. నా మనసు కీడు ని శంకిస్తోంది…గుండె దడదడమంటోంది.
అక్కడి మెత్తటి ఆసనం మీద కూర్చుని బిలాలీ నీ జాబ్ నీ వెళ్ళిపొమ్మంది. మూగ భటులు కూడా ఆమె ఆజ్ఞ మేరకి దీపాలు వెలిగించి నిష్క్రమించారు. ఇష్టురాలైన సేవిక ఒకతె మాత్రం అక్కడుంది. ఉస్తేన్, లియో, నేను – ముగ్గురం నిలబడే ఉన్నాము.
” అయితే, హాలీ ? ఈమెని నేను పంపించివేసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా ? ఈమె ప్రాణాన్ని తీయవద్దని నాకు నచ్చజెప్పావు కదా ? ఇందాకటి ఆ కుట్ర లో నువ్వూ అక్కడే ఉన్నావేమిటి – ఇందులో నీకు భాగం ఉందా ? నిజం చెప్పు. ఈ విషయం లో అబద్ధాలని సహించను నేను ” – హుంకరించింది.
” నాకేమీ తెలియదు రాజ్ఞీ ! అక్కడ నేను ఉండటం కేవలం యాదృచ్ఛికం ”
” నమ్ముతున్నాను నిన్ను. మొత్తం అపరాధం దీనిదే, అయితే – కదా ? ”
” ఇందులో అపరాధమేముంది ? ఆమె మరింకెవరి భార్యా కాదు- ఈ ప్రాంతపు ఆచారం ప్రకారం నన్ను పెళ్ళాడానంటోంది- ఆమె ది తప్పైతే నాదీ తప్పే . ఇద్దరినీ శిక్షించండి. ఈ వెధవలు మళ్ళీ ఆమె మీద చేయి వేస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను ” – లియో గర్జించాడు.
ఆయేషా అతని మాటలని అతి ఉదాసీనం గా వింది – ఏమీ జవాబు చెప్పలేదు. ఉస్తేన్ వైపుకే తిరిగింది -
” నువ్వు చెప్పుకునేదేమైనా ఉందా ? నా శక్తి ముందు నువ్వొక గడ్డిపోచవి కూడా కావు – ఏ ధైర్యం తో ఈ పని తలపెట్టావు – చెప్పు, నాకేమైనా అర్థమవుతుందేమో ? ”
ఆ అభాగ్యురాలు- తన అల్పత్వమూ రాజ్ఞి అధికారమూ పూర్తిగా తెలిసి ఉండీ , గొప్ప స్థైర్యాన్నీ నిర్భయత్వాన్నీ ప్రదర్శించింది.
పొడుగాటి మనిషి ఉస్తేన్ . తల ఎత్తి నిలుచుని చెప్పింది – ” ఎందుకు చేశానంటే రాణీ, అతనంటే నాకు ప్రేమ గనుక. ప్రేమ కన్న చావు గొప్పది కాదు గనుక. అతను లేని జీవితం మరణం కన్న హీనం కనుక – నా బతుకును ఒడ్డాను, నీ చేతిలోంచి చావును స్వీకరిస్తాను. నేను చేసినదానికి ఏ మాత్రం పశ్చాత్తాప పడను – నన్ను మళ్ళీ ఒక సారి అతను కౌగలించుకున్నాడు కదా ? నన్నింకా ప్రేమిస్తూనే ఉన్నానని చెప్పాడు కదా – ఇంకేం కావాలి నాకు ? ”
ఆయేషా తన ఆసనం లోంచి లేవబోయి తిరిగి సర్దుకుని కూర్చుంది.
” నాకు మంత్రశక్తులు లేవు ” – ఖంగున మోగే గొంతు తో ఉస్తేన్ కొనసాగించింది . ” నేను రాణిని కాను. శాశ్వతం గా జీవించి ఉండగలదాన్నీ కాను. కాని రాణీ, నేను స్త్రీ ని. ఎంత లోతు నీటి అడుగునైనా ఏముందో తెలుసుకోగలను. నువ్వు కప్పుకున్న ముసుగు వెనక ఉన్నదేమిటో చూడగలను.
నువ్వూ ఇతన్ని ప్రేమిస్తున్నావు , నాకు తెలుసు. అడ్డుగా ఉన్న నన్ను నాశనం చేస్తావు – చచ్చిపోతాను నేను, అంధకారం లోకి వెళతానేమో – తెలియదు. నా గుండె లో ఒక వెలుగుంది – ఆ దీపం నాకు నిజాన్ని చూపిస్తోంది. నేనుండని భవిష్యత్తు కూడా నా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఈ నా దొరని చూసినప్పుడే నాకు తెలిసింది – ఇతని తో పెళ్ళి వెనకే నాకు చావు ఉంటుందని. కాని నేను వెనకాడలేదు, ఆ ధర చెల్లించేందుకే సిద్ధపడ్డాను. ఇప్పుడు , మృత్యుముఖం లో నిలుచున్న నాకు ఇంకొక విషయమూ స్ఫురిస్తోంది. నువ్వు చేసిన పనికి నీకు ఫలితం దక్కదు. నిన్ను తన దానిగా అతను ఎన్నటికీ చేసుకోడు. నీ సౌందర్యం సూర్యకాంతిలాగా ప్రకాశించినా అతను నా వాడే ఈ జన్మకి, నావాడు గానే మిగులుతాడు. నీకూ నాశనమే రానుంది- కనిపిస్తోంది నాకు..” పూనకం వచ్చిన దానిలాగా ఉస్తేన్ వణికింది . ” కనిపిస్తోంది నాకు…”
ఆగ్రహమూ భీతీ కలిసిన కేక అక్కడ మారుమోగింది. ఆయేషా లేచి నిలుచుని ఉస్తేన్ వైపు కి చెయ్యి సాచింది. ఉస్తేన్ మాటలు ఆగిపోయాయి. ఆయేషా ఏమీ మాట్లాడలేదు, కదల్లేదు. ఆమె మొహం లో స్థిరం గా ఘనీభవించి ఉన్న క్రోధం. ఉస్తేన్ వైపు కి చూపు సారించింది. తక్షణమే ఉస్తే పెద్దగా కేక పెట్టి గింగిరాలు తిరిగి దబ్బున కింద పడిపోయింది. నేనూ లియో గబ గబా పరిగెత్తి వెళ్ళాము. ఆమె చనిపోయింది. ఏ తీవ్రమైన విద్యుచ్ఛక్తి ప్రసారం వల్లనో లేక ఆయేషా సంకల్పబలం వల్ల మాత్రమేనో – తెలియదు.
ఒక్క క్షణం పాటు లియో కి ఏమీ అర్థం కాలేదు. తెలియగానే భీకరం గా ఆయేషా మీదికి దూకబోయాడు. ఆమె చూస్తూనే ఉంది, తిరిగి చెయ్యి సాచింది. అతను తూలి వెనక్కి పడబోయాడు. నేను పట్టుకుని ఆపి నిలబెట్టాను.
ఆయేషా మృదువు గా అంది – ” క్షమించు, పరదేశీ. నా న్యాయాన్ని అమలు చేసి నిన్ను కలవరపెట్టినందుకు ”
” క్షమించాలా , నిన్ను ? హంతకురాలా – ఛీ. చంపగలిగితే నిన్ను ఇక్కడే ఇప్పుడే చంపేసి ఉండేవాడిని ” – లియో ఆవేశం తో కంపించిపోతున్నాడు.
” లేదు, లేదు – నీకు అర్థం కావటం లేదు ” – ఆమె అదే మెత్తని గొంతు తో అంది. ” ఇప్పటికైనా నీకు చెప్పాలి నేను – నువ్వు కాలిక్రేటస్ వి- నా ప్రేమికుడివి. రెండు వేల ఏళ్ళు గా నీకోసం నిరీక్షిస్తూనే ఉన్నాను- ఇంతకాలానికి నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తే , ఈ ఆడది నిన్నూ నన్నూ వేరు చేయబోయింది- అందుకే , ఆమెను తొలగించవలసి వచ్చింది ”
” అంతా అబద్ధం. నా పేరు కాలిక్రేటస్ కాదు – లియో విన్సే. కాలిక్రేటస్ – నా పూర్వుడయి ఉండచ్చు, అదీ నమ్మకం లేని సంగతే ”
” అదే. అదే నేనూ అంటున్నది. కాలిక్రేటస్ నీకు పూర్వుడు – మళ్ళీ నీ లాగా జన్మ ఎత్తాడు, నా కోసం – నా స్వామీ ”
” నీ మీద అసహ్యం , ద్వేషం. నీ మొహం కూడా చూడలేను. నీ స్వామిని అవటం కంటే నరకం నుంచి దిగివచ్చిన భూతానికి భర్తను కావటం మేలు ”
” అలా అనకు …నన్ను చూసి ఎంతో కాలమై పోయింది కదా, మర్చిపోయి ఉంటావు. నే నెంత సౌందర్యరాశి నో ”
” పాపాత్మురాలా- నీ మొహమే చూడాలనిపించటం లేదు, ఎంత అందగత్తెవయి ఉంటేనేమిటి ”
” అతి కొద్ది సేపటిలోనే నాకు పాదాక్రాంతుడివయి బ్రతిమాలుకుంటావులే ” – అయేషా మధురం గా, హేళన గా నవ్వింది. ” రా , ఇదే మంచి తరుణం. ఆ చచ్చి పడి ఉన్నది కూడా ఇందుకు సాక్ష్యం ”
” చూడు ” – తన శరీరాన్ని కప్పి ఉంచిన తెల్లని పల్చని వస్త్రాలని కిందికి జార్చింది. అలల మీంచి పైకి లేస్తున్న వీనస్ లాగా, పాలరాతి లోంచి బయల్పడుతున్న గలటియె లాగా . దేదీప్యమానం గా ప్రకాశిస్తున్న నేత్రాలతో లియో కళ్ళలోకి చూస్తూ నిలుచుంది. బిగిసి ఉన్న అతని పిడికిళ్ళు సడలినాయి. కోపం తో ముడుచుకుని ఉన్న ముఖ రేఖలు విప్పారినాయి. విస్తుపోవటం, ఆశ్చర్యం, ప్రశంస, అద్భుతపడటం – ఒకదాని వెంట ఒకటి అతన్ని ఆవరించాయి. వదిలించుందుకు ఎంత ప్రయత్నం చేస్తే ఆ భయద సౌందర్యం అంతగా అతన్ని లోబరచుకుంటోంది, మతి పోగొడుతోంది. నాకెందుకు తెలియదు అదంతా – అతనికి రెట్టింపు వయసున్న నేను ఆ మోహం లో పడి పోయి కొట్టుకున్నవాడినే కదా. ఇప్పుడు మాత్రం- ఆ వీక్ష ణం నాకోసం కాదని తెలిసీ వ్యామోహానికి లోనయిపోతున్నాను కదా. ఎలాగో నిలవరించుకొని జరుగుతున్నదాన్ని గమనించాను.
” దేవుడా !!! ” అతను నిర్ఘాంత పోతూ అన్నాడు . ” నువ్వు – నువ్వు స్త్రీ వేనా ? ”
” స్త్రీనే, సత్య ప్రమాణంగా . నీ స్త్రీ ని. రా, ఇలాగ ” – అతి సుందరమైన , దంతం తో చెక్కినట్లున్న చేతులని అతని వైపుకి సాచింది.
అతను అలాగే చూస్తున్నాడు. మెల్లి మెల్లిగా ఆమె వైపుకి జరుగుతున్నాడు. ఉన్నట్లుండి అక్కడ పడి ఉన్న ఉస్తేన్ దేహం వైపుకి చూసి – ఆగిపోయాడు.
” ఎలా ? ఎలా ? ” – జీరబోతున్న గొంతుతో – ” నువ్వు హంతకురాలివి. ఆమె నన్ను ప్రేమించింది ”
తనూ ఉస్తేన్ ని ప్రేమించాననే విషయాన్ని అప్పుడే మర్చిపోతున్నాడు.
” కాదు ”- ఆమె గొణిగింది. రాత్రి వేళ చెట్ల లోంచి వీచే గాలి శబ్దమంత తీయగా ఉంది ఆమె గొంతు. ” కాదు. ఒకవేళ నేను పాపం చేసి ఉంటే నా సౌందర్యాన్ని నీకు సమాధానం చెప్పనీయి. నీ పైని ప్రేమ వల్లనే కదా చేశాను, క్షమించి వదిలేయి. రా. ” చేతులని మరింత ముందుకి సాచింది.
కొద్ది క్షణాలలో అంతా అయిపోయింది.
అతను ప్రతిఘటించబోవటం గమనిస్తూనే ఉన్నాను, పారిపోవాలనే ప్రయత్నం కూడా చేశాడు. కాని ఆ మహాద్భుత సౌందర్యమూ అతి బలవత్తరమైన సంకల్పమూ ఇనప సంకెళ్ళ కన్నా బలం గా అతన్ని లాగుతున్నాయి. తన కోసం చచ్చిపోయిన స్త్రీ శరీరం అక్కడ ఉండగానే అతను ఆయేషా కి లొంగిపోతున్నాడు- అందులో అతని తప్పు ఎంత ఉందని ! అక్కడ ఉన్నది పేరుకు మాత్రమే మానవస్త్రీ , ఆమె కీ మామూలు ఆడవాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు- రూపమూ స్వభావమూ రెండిట్లోనూ.
దించేసుకున్న నా తలని ఎత్తి చూసేసరికి ఆమె అతని కౌగిలి లో ఉంది. ఇద్దరి పెదవులూ కలుసుకున్నాయి. అలా – తన గౌరవాన్ని మరచి బాధ్యతను మరచి మానవ సహజమైన అన్నింటినీ మరచి లియో ఆ సౌందర్యపు భీషణత్వానికి అమ్ముడు పోయాడు. అలవిమాలిన మోహానికి దాసులై పతితులైన వారందరికి మల్లే ఇతనూ తనకి తగిన శిక్ష ను ఎప్పుడో అనుభవించబోతాడా ? ఏమో.
ఆమె అతని కౌగిట్లోంచి సర్పం లా జారి విడివడి హేళన గా నవ్వింది.
” నేను చెప్పలేదా ? ఎంతసేపో పట్టదని ? ”
లియో – లజ్జతో పశ్చాత్తాపం తో ఆక్రందించాడు. తాను పతితుడినైనానని తెలియనంత పతితుడు కాలేదు అతను. అలాగే కొనసాగనీయకుండా ఇవతలికి వచ్చి- లేనిపోని విజయగర్వం తో , తెలివి తక్కువగా ఆయేషా చేసిన హేళన అతని ఉత్తమత్వాన్ని నిద్రలేపింది.
ఆయేషా మళ్ళీ నవ్వి తన ముసుగు ధరించింది. జరుగుతున్నదాన్నంతా నోరు తెరుచుకుని చూస్తున్న సేవిక కి ఏదో సైగ చేసింది. ఆమె వెళ్ళి ముగ్గురు మూగభటులని పిలుచుకొచ్చింది. వాళ్ళు ఉస్తేన్ దేహాన్ని అక్కడినుంచి ఈడ్చుకువెళ్ళారు. లియో తన మొహాన్ని చేతులతో కప్పుకున్నాడు.
వాళ్ళు వెళ్ళిపోయాక తెరలని దగ్గరికి లాగి, తిరిగి ముసుగు తొలగించి ఆయేషా – పురాతనమైన అరేబియన్ ప్రేమ గీతాన్ని అందుకొని గానం చేయటం మొదలుపెట్టింది. దాన్ని మరొక భాష లోకి తర్జుమా చేయటం దాదాపు అసాధ్యం. వందల ఏళ్ళ వెనకటి ఆమె ప్రేమ, వైఫల్యం, అంతు తెలియని నిరీక్షణ, చివరికి లియో ఆగమనం – అన్నీ అందులో వినిపించాయి. పాట ముగిసిన తర్వాత అదొక కవిత్వ ధోరణి గా చెప్పుకుపోయింది. ” నేను ఇన్నేళ్ళూ జీవించి ఉన్నాననీ , నువ్వు నాకోసం మళ్ళీ పుట్టావనీ నమ్మటం లేదా, ప్రియా ! కాలిక్రేట స్ – మోసం చేస్తున్నాననుకుంటున్నావా ? సూర్యచంద్రులు గతులు తప్పవచ్చును గాని నేను అబద్ధం చెప్పను. నా రెండు కళ్ళ నీ పెరికేసినా- నా చుట్టూ వందల కొమ్ము బూరాలు రొద పెట్టినా – నీ గొంతు ని గుర్తు పడతాను. నన్ను పూర్తి చెవిటి దాన్ని చేసినా – వేయి ఇతర స్పర్శలలోంచి నీ స్పర్శని గుర్తిస్తాను. అన్ని జ్ఞానేంద్రియాలూ నన్ను ఎడబాసినా నా ఆత్మ ఒక్కటీ నిన్ను కనిపెట్టి నీవైపుకే దూకుతుంది. నా రాత్రి అంతమైంది, నీ వేకువ రాకతో”
ఆగి , తిరిగి – ” ఇంకా నీ హృదయం కరగకపోతే, విశ్వాసం కలగకపోతే , అర్థం కాకపోతే, ఇంకా బలమైన ఆధారం కావాలనిపిస్తే – రా. దాన్నీ చూపిస్తాను. హాలీ, నువ్వు కూడా. ఇద్దరూ చెరొక దివిటీ పట్టుకుని నా వెనకే రండి ”
ఇంకేమీ ఆలోచించకుండా – అసలు ఆలోచన అన్నది ఆమె సమక్షం లో అసాధ్యం …ఆమె చెప్పినట్లే ఇద్దరం బయల్దేరాము. ఆమె కూర్చునే గది లో కట్టి ఉన్న తెరను ఎత్తితే అక్కడ దిగువకి మెట్లు కనిపించాయి. జాగ్రత్త గా దిగుతూ వెళుతూంటే నాకొక విషయం ఉన్నట్లుండి అర్థమైంది. ఆ మెట్లన్నీ, మధ్యలో ఏదో ఒక చోట – అరిగి కుంగిపోయి ఉన్నాయి. దాదాపు ఏడున్నర అంగుళాల ఎత్తున్నవి, మూడున్నర అంగుళాల దిగువకి అరిగిపోయాయి. మేము దిగిన ఇంకే చోటా అలా లేదు – శవాన్ని లోపల పెట్టేప్పుడు తప్ప మరెవరూ వాటిని దిగివెళ్ళి ఉండరు – అందుకని. ఆయేషా మమ్మల్ని తీసుకువెళ్ళి వాటన్నిటినీ చూపించింది గానీ మాకు ముందు మరింకే సందర్శకులూ అక్కడికి రాలేదు కదా ! మరి ఈ మెట్లు – ఎందుకిలా ?
పూర్తిగా దిగిపోయాక , ఆ కిందని నిలుచుని మళ్ళీ చూస్తున్నాను కళ్ళతో. ఆయేషా వెనక్కి తిరిగి , గమనించి -
” నా పాదాల వల్లనే ఆ మెట్లు అరిగిపోయాయి హాలీ. అవి పూర్తిగా సమతలం గా ఉండిన రోజులు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. రెండు వేలేళ్ళ పాటు రోజూ పదే పదే దిగిన, ఎక్కిన నా పాదాలే వాటిని అరగదీశాయి. ”
నాకు నోట మాట రాలేదు. ఆమెకి తప్పించి ఇంకెవరికీ ప్రవేశం లేని చోటే అయితే, ఎన్ని లక్షల సార్లు ఆమె అక్కడికి వచ్చి ఉండాలి ? ఊహకి అందలేదు.
అక్కడ ఒక సొరంగం మొదలైంది. దాని ద్వారానికి కట్టి ఉన్న తెరని నేను గుర్తు పట్టాను. ఆ రోజు నడిరాత్రి వేళ , నేను నక్కి చూస్తూ ఉండగా – ఆయేషా తన శత్రువు ని నాశనం చేసేందుకు భయంకరమైన మంత్రాలు చదువుతూ హోమం చేసినది అక్కడే. అది ఒక సమాధి అని ఊహించాను – ఆమె వెనకాల మేమూ అందులో ప్రవేశించాము. ఏదో గొప్ప రహస్యం తెలిసిపోబోతున్నందుకు ఆనందం – దానితోబాటు అది ఏమిటో, మా జీవితాలని ఎలా మార్చబోతుందో అనే భయం …
[ ఇంకా ఉంది ]
నిజంగా … నోటమాట రాని స్థితి, చదువుతున్నది వాక్యాలని కాక చూస్తున్నది వ్యక్తులని, వింటున్నది సంభాషణలనీ .. తోస్తోంది! ఉస్తేన్ మాటలు ఎంత సత్యం … ఆ తీవ్రత మీ కలంలో మరీ అద్భుతం !! చాలా కష్టం మరో ముప్పై రోజులు ఎదురు చూడడం – ఆయేషాని – ఎలా చూడాలో ఇంకా తెలియట్లేదు – అంత ఆరాధనని అభినందించకుండా ఉండలేము … ఆ ఆధిపత్యాన్ని భరించనూ లేము TQQ Mam !!