కిటికీలో ఆకాశం

కనుపాప లోని కరుణ – శిఖామణి పద్యం

జూలై 2016

విత్వాన్ని ఎందుకు ఇష్టపడతాము?

బహుశా, మనలో అడుగంటి పోతున్న కొన్ని సున్నిత భావాలను తట్టి లేపే గుణమేదో కవిత్వంలో వుండడం వలన అనుకుంటాను.

బహుశా, మనిషిగా సాటి మనుషుల పట్ల ఇంత ప్రేమా, ఇంత దయా కలిగి వుండ వలసిన కనీస ధర్మాన్ని మనకు జ్ఞాపకం చేసే లక్షణమేదో కవిత్వంలో వుండడం వలన అనుకుంటాను.

మన రోజు వారీ యాంత్రిక జీవితంలో సరిగా చూడని, పట్టించుకోని కొన్ని దృశ్యాలను, కొందరు మనుషులను కవి దర్శిస్తాడు అనుకుంటాను.
పై పై చూపులతో, ఉపరితల స్పర్శలతో మనం సరి పెట్టిన అనేక దృశ్యాల, మానవుల, మనుషుల సంబంధాల, రాజకీయాల, ఇతరత్రా అనేక అంశాల లోలోపలికి వెళ్లి అందలి మానవీయ అంశని మనతో పంచుకునే ఒక ప్రయత్నమేదో కవిత్వం చేస్తుంది అనుకుంటాను.

లేకపోతే, విశాఖపట్నం వీధులలో మిగిలిన బాటసారులు ఎవరూ పట్టించుకోకుండా వెళ్లి పోతున్నపుడు, రోడ్డు పక్క చింపిరి జుత్తుతో వున్న ఒక భిక్షగత్తెని చూసి, ‘దారి పక్క చెట్టు కింద / ఆరిన కుంపటి విధాన / కూర్చున్నది ముసల్దొకతె’ అని శ్రీ శ్రీ ఎందుకు వాపోయి వుంటాడు? అక్కడితో ఆగక, ‘ఆ అవ్వే మరణిస్తే / ఆ పాపం ఎవ్వరిదని / వెర్రి గాలి ప్రశ్నిస్తూ వెళిపోయింది’ అని ఎందుకు ఆగ్రహిస్తాడు?

శ్రీ శ్రీ ఎప్పుడో 1934 లో వ్రాసిన పద్యం అది!

కాలమైతే గడిచింది గానీ, కూడళ్ళ దగ్గర భిక్షాటన చేసే స్త్రీ మూర్తులు అట్లానే వున్నారు. అందుకే, శ్రీ శ్రీ ‘భిక్షువర్షీయసి’ వెలువడిన డెబ్భై ఏళ్ళ తరువాత కూడలిలో తారస పడిన ఒక అంధురాలైన భిక్షగత్తెని చూసి కవి శిఖామణి తన ‘కనుపాప’ వచన పద్యంలో ఏమంటున్నాడో చదవండి!

సాదా సీదా వర్ణనలతో, ఒకింత కథన శైలితో పద్యం ఆవరణ లోనికి చదువరిని ప్రవేశ పెట్టడం శిఖామణి ప్రత్యేకత! ఈ ప్రయాణం ఒక్కోసారి ఎంత హాయిగా ఉంటుందంటే, పడవ నడిపే ఒడుపు తెలిసిన సరంగు ఎట్లాంటి కుదుపూ లేకుండా మిమ్మల్ని ఒడ్డు నుండి నది లోపలి అట్లా అలవోకగా తీసుకు వెళ్ళినట్లు వుంటుంది.

ఒక దృశ్యాన్ని గానీ, ఒక స్థలాన్ని గానీ లేక ఒక మనిషిని గానీ పద్యం ద్వారా చదువరి కళ్ళ ముందు శిఖామణి నిలిపే తీరు, ఒక నేర్పరి ఐన చాయాగ్రాహకుడు తీసిన జీవ చిత్రంలా వుంటుంది. ఎటువంటి నైరూప్యతకు, గందరగోళానికీ తావు ఇవ్వని కవిత్వం శిఖామణి కవిత్వం !
ఒక సారి, ఈ ‘కనుపాప’ చదవండి!

కనుపాప

ఎర్రటి నట్ట నడి ఎండలో
జన సమ్మర్ధపు రోడ్డు మూల మలుపులో
ఎప్పుడూ ఒకే భంగిమలో దోసిలి పట్టి
ఒక నడి వయసు ఆవిడ
నూనె పెట్టి నున్నగా దువ్విన తల
నుదుటి మీద బొట్టు స్థానంలో
చుట్టతో కాల్చిన చిన్న నాటి పెద్ద మచ్చ
ఎవరో ఒద్దికగా కట్టి, భుజాల చుట్టూ కప్పి
బొడ్లో దోపిన చీర కొంగు
చేతులకు పాతవే అయినా కాంతులీనుతున్న
ఎరుపూ నీలం ముదురు రంగు మట్టి గాజులు
పరీక్షగా చూస్తే తప్ప కాళ్ళనూ నేలనూ విడిగా గుర్తించలేని మట్టి పాదాలు
రోడ్డు పక్క చెట్టుని పాతినట్లు
ఎవరో ఆమెను అక్కడ నాటారు
మోడై వుంటే మొలకేత్తేదేమో …. మనిషై ఆమె మోడుగా మిగిలింది

ఆమె సజల నేత్రాల స్థానంలో
నీరింకి పోయిన పాడుబడ్డ రెండు బావులు
పలక లాంతరు దీపం పై కప్పులో పేరుకున్న వెలిగారంలా
ఆమె కళ్ళ స్థానంలో కమిలిన రెండు కరి మబ్బులు
అంతరిక్షంలో చోటులేని బ్లాకు హోల్స్ ఆమె ముఖ మండలాన్ని ఆశ్రయించినట్టు
మిలమిలల తారకలు మెరవాల్సిన ఆ నేత్రాకాశంలో పెంజీకట్ల మహాబిలాలు
అక్బర్ గీసిన కళ్ళు లేని అబ్ స్ట్రాక్ట్ చిత్రంలా
ఎందుకనో ఆమె మోహంలో
కళ్ళ ఆనవాలే తప్ప కనులు లేవు
జీవం లేని ఆ కంటి రెప్పలని ఊరకనే పైకీ కిందకీ అల్లాడిస్తుంటే
రెక్కలు తెగిన పక్షి నేల కూలుతున్న మౌన శబ్దమే వినిపిస్తుంది
కన్వేయర్ బెల్ట్ మీద ముడి ఖనిజం ప్రయానిస్తున్నంత యాంత్రికంగా
నగరం రోడ్డు మీద జనం ప్రవహిస్తున్నారు
రోడ్డు వార దోసిలి పట్టి నిల్చున్న ఆమె
పోటెత్తిన జనసముద్రం మధ్యన నిలబడి
కన్నీటిని అర్ఘ్యమిస్తున్నట్టే వుంది
ధూళి ధూసరమైన శిథిల జనాంతః పురంలో
కాళ్ళు విరిగి మూలన పడ్డ ధీర వనిత విగ్రహంలా వుంది
ఆకొన్న చేను దూడకు మేఘం పొదుగును చేపమని
ఆకాశ ధేనువును అభ్యర్తిస్తున్నట్టుంది
అనో బేడో ఆ దోసిలిలో పెట్టాల్సి వస్తుందని
మొహం తిప్పేసుకున్న మర్యాదస్తులకు
‘కాస్త కరుణ కలిగి బతకండ్రా’ అని
ఆ దోసిలి ఇంత దయను లోకంమీద వొంపుతుంది
లోకం చూడలేని ఆమెకంటే ఆమెని చూడలేని లోకమే
ఎంత గుడ్డిదో అర్థమైంది
కనులు లేకపోవడం కంటే హృదయం లేకపోవడం
ఎంత కటినమైన అందత్వమో తెలిసొచ్చింది
మళ్ళీ జన్మంటూ వుంటే
ఆమె కనుల్లో కనుపాపై పుట్టాలని వుంది.

నూనె పెట్టి దువ్విన జుత్తు, బొద్దు లోకి దోపిన చీర, ఎర్రటి నట్ట నడి ఎండ లాంటివి చదివినపుడు, ఒక వైపు అంధురాలైన ఆ భిక్షగత్తె భౌతిక రూపాన్ని వర్ణిస్తూ, మరొక వైపు ఆమె నిలబడిన రోడ్డు మలుపు వున్న స్థితికి సంబంధించిన వర్ణనను కూడా మనం ఈ కవితలో గమనించవచ్చును.

అయితే, శిఖామణి పద్యంలో ప్రత్యేకత ఏమిటంటే, పద్యం వాచ్యంగా వెళుతున్నది అని చదువరి భావించే లోపే, ఒక అద్భుతమైన పోలికతో పద్యానికి కట్టి పడేస్తాడు. మరొకసారి, ఈ పాదాలు చదవండి -

‘పరీక్షగా చూస్తే తప్ప కాళ్ళనూ నేలనూ విడిగా గుర్తించలేని మట్టి పాదాలు’
‘ఆమె సజల నేత్రాల స్థానంలో / నీరింకి పోయిన పాడుబడ్డ రెండు బావులు ‘
‘ఆకొన్న చేను దూడకు మేఘం పొదుగును చేపమని / ఆకాశ ధేనువును అభ్యర్తిస్తున్నట్టుంది’

అయితే, ‘మళ్ళీ జన్మంటూ వుంటే / ఆమె కనుల్లో కనుపాపై పుట్టాలని వుంది’ అంటూ పద్యం చివరలో కవి ఒక నాటకీయ ముగింపును యిచ్చినా, ‘కనులు లేకపోవడం కంటే హృదయం లేకపోవడం / ఎంత కటినమైన అందత్వమో తెలిసొచ్చింది ‘ అని చెప్పడమే ఈ పద్యం పరమార్థం!

1934 లో, రోడ్డు పక్క చేటు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్న భిక్షగత్తెని చూసి పద్యం చెప్పిన ఒక కవి ‘ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చి ఎంగిలాకు’ అని ముగిస్తే, 2006 లో రోడ్డు మలుపులో ఎదురైన అంధురాలైన భిక్షగత్తెని చూసి ‘మళ్ళీ జన్మంటూ వుంటే / ఆమె కనుల్లో కనుపాపై పుట్టాలని వుంది’ అని మరొక కవి ముగించాడు.

ఇంతకూ, ఈ 70 ఏళ్ళ కాలంలో మారిందేమిటి?

**** (*) ****