నుడి-9 (జూలై 2016) జవాబులు, వివరణలు
పాఠకులకు నమస్కారం.
ఈసారి నుడిని ఆల్ కరెక్ట్ గా నింపిన వారు
1. రవిచంద్ర ఇనగంటి.
విజేతకు అభినందనలు.
ఆధారాలలోంచి కొన్నింటికి జవాబులను, వివరణలను కింద ఇస్తున్నాను.
9 అడ్డం: పేపరు పరుపే ఎలా అయిందో చావిడి అలా అయింది (3). దీనికి జవాబు విడిచా.
వివరణ: పేపరు పరుపే ఎలా అయింది? మొదటి అక్షరమైన ‘పే’ను చివరకు జరిపితే అయింది. అదే విధంగా చావిడిలోని మొదటి అక్షరమైన ‘చా’ను చివరకు జరిపితే విడిచా అవుతుంది!
12 అడ్డం: వాపోయిన జవాను మధ్యలో తిరగేసిన వడ ఫలితంగా భయపడను (4)
వివరణ: ‘వా’పోయిన జవాను = జను. తిరగేసిన వడ = డవ. ‘జను’లో ‘డవ’ను చేర్చితే వచ్చేది జడవను = భయపడను.
14 అడ్డం: వేలల్లో ఒకటి (1). కొందరు ల అని నింపారు. కాని, జవాబు వే.
వివరణ: ఎన్నో ‘వే’లు ఉన్నాయి. వాటిలో ఒకటి = వే!
15 అడ్డం: మాల తర్వాత నననన శిక్షలు (4). కొందరు దండనాలు అని పూరించారు. దీనికి జవాబు దండనలు.
వివరణ: మాల = దండ. నననన = ‘న’లు. దండ + నలు = దండనలు = శిక్షలు!
16 అడ్డం: స్థిరత్వం కోసం వేరే విధంగా ఉన్నాడని మార్పునకు లోను చేయాలి (4) దీనికి జవాబు నిలకడ.
వివరణ: ఉన్నాడని = కలడని. దీన్ని తారుమారు చేస్తే వచ్చేది నిలకడ = స్థిరత్వం.
25 అడ్డం: అట్నుంచి పోరంబోకు రాము 246 త్యజించగా మిగిలిన దర్పణం (3)
వివరణ: ‘పోరంబోకు రాము’ను రివర్స్ చేసి 2, 4, 6 వ అక్షరాలను తీసివేస్తే వచ్చేది ముకురం = దర్పణం. కనుక అదే జవాబు.
3 నిలువు: కూపంలో తారుమారు చేసిన స్వప్నం ఫలితంగా చిన్నప్పుడే కవితలల్లేవాడు (2, 2). దీనికి సమాధానం బాల కవి.
వివరణ: కూపం = బావి. స్వప్నం = కల. తారుమారు చేసిన స్వప్నం = లక. ‘బావి’లో ‘లక’ను చేర్చితే వచ్చేది బాల కవి!
4 నిలువు: ఒక రకం ఆయుధం. కానీ, ఇది నాది కాదు (1, 3). నీ నారాచా అనీ, నీ బరిసా అనీ పూరించారు కొందరు పాఠకులు. దీనికి జవాబు నీ తపంచా.
వివరణ: తపంచా ఒక చిన్న తుపాకి పేరు.
10 నిలువు: తప్పు కానిదాని సౌందర్యమే అంగీకారం (3). చాలా మంది ఒప్పిదం అని రాసారు. దీనికి జవాబు ఒప్పందం.
వివరణ: తప్పు కానిది = ఒప్పు. సౌందర్యం = అందం. ఒప్పు + అందం = ఒప్పందం = అంగీకారం.
13 నిలువు: నీవు ఉన్నచో వచ్చే తినుబండారం (3). నువుండ అని నింపారు కొందరు. దీనికి జవాబు నువ్వుండ.
వివరణ: నీవు = నువ్వు. ఉన్న(చో) = ఉండ(గా). నువ్వు + ఉండ = నువ్వుండ = నువ్వులతో చేసిన ఉండ!
19 నిలువు: గిరుల ప్రారంభం చుట్టూ వల వేసి కుక్కను తేవాలి (3). దీనికి జవాబు జాగిలం.
వివరణ: ‘గి’రుల ప్రారంభం = గి. వల = జాలం. ‘జాలం’లో ‘గి’ని చేర్చితే వచ్చేది జాగిలం = కుక్క
ఈ నెల నుండి ‘నుడి’ Grid pattern ను మార్చుతున్నాం. లింక్ అక్షరాల సంఖ్యను పెంచుతూ మళ్లీ మునుపటిలాగా మార్చుతున్నాం కనుక, ఇకనుండి పూరణ సులభం అవుతుంది. ఈ మార్పు గురించి పాఠకుల స్పందనను కోరుతున్నాం.
**** (*) ****
శ్రీయుతులు Elanaga మరియు Editor గార్కి,
నమస్కారములు ..
ఈనెల నుడి 10 లో “ణ” గుణింతమును ఆ సంబంధిత గడి నాట్ ఏక్సిప్టెడ్ ….So ‘న’ గుణింతమునే ఎన్నుకోవాల్సి వచ్చిందని గమనించ మనవి….ఇది కంప్యూటర్ పరిమితి గానే భావించ వలయునా ?
రామారావు గారూ,
సాంకేతికంగా మీరు ఎదుర్కున్న ఇబ్బందిని స్పష్టంగా వివరించారు కనుక, మీరు ‘న’ గుణింతంలో రాసినా, దాన్ని ‘ణ’ గుణింతంలో రాసినట్టుగానే పరిగణిస్తాం. నిశ్చింతగా ఉండండి.