పుస్తక పరిచయం

వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నించిన “చాగంటి సోమయాజులు కథలు”

ఆగస్ట్ 2016

తెలుగు కథది దాదాపు నూట అయిదేళ్ళ వయస్సు. ఎంతోమంది గొప్ప కథకులు అద్భుతమైన కథల్ని రచించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు.

“కథానిక పాఠకుల హృదయానికి సన్నిహితమైన వర్తమాన సాహితీ ప్రక్రియ” అంటూ – అలనాటి మేటి కథకులను ప్రతి తరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో, వారి కథాకాంతులను ఎల్లవేళలా ప్రసరింపజేయడానికి పూనుకుంది గుంటూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం. ఈ క్రమంలో “ఈతరం కోసం కథాస్రవంతి” పేరిట సుప్రసిద్ధ కథకుల గొప్పకథలను పుస్తక రూపంలో తెచ్చారు అరసం వారు. అభినందనీయం వీరి కృషి.

ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్న పుస్తకం అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా వారు ప్రచురించిన “చాగంటి సోమయాజులు కథలు“. చాసోగా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు విశిష్ట కథకులు. రాశి కన్నా వాసి మీద దృష్టి నిలిపిన రచయిత. వస్తువు, సన్నివేశం, పాత్రల ప్రవర్తన, సంభాషణలు అన్నిటిలోనూ ఆయన చింతనా, దృక్పథం అంతర్లీనంగా వ్యక్తమవుతాయి. ధనస్వామ్యంలో ధనం ఏ విధంగా మనుషుల్ని అవినీతిపరుల్ని చేస్తుందో, మానవత్వాన్ని ఎలా నాశనం చేస్తుందో, బూర్జువా సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో సునిశితంగా పరిశీలించి పాత్రల సృష్టి చేశారు చాసో.

చాసో కథ ప్రారంభం నుంచి చివరిదాక ఒకే ఊపుతో నడుస్తుంది. ఎక్కడా బెసగదు, పట్టు సడలదు.” అంటారు ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన ఆయన కుమార్తె, ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు డా. చాగంటి తులసి. “చాసో కథలు ఎక్కువగా బుద్ధిని తాకుతాయి. హృదయంలోకి చొచ్చుకుపోవడం తక్కువే అయినా కొన్ని చోట్ల కథ హృదయదఘ్నంగానే ఉంటుంది.” అని అంటారావిడ.

ఈ పుస్తకంలో పదహారు కథలున్నాయి. వాటిని పరిచయం చేసుకుందాం.

***.

కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా విశ్వసించే పేరక్క తోటివారందిరికీ నీతులు చెబుతుంది. పురాణ ప్రవచనాల వైపు తోటి స్త్రీలని లాగడానికి ప్రయత్నిస్తుంటూంది. శాస్త్రం పేరు చెప్పి వారి అమాయకత్వం మీద భయప్రయోగం చేస్తుంది. తిన్న విస్తరి పారేయడానికి వెళ్ళి ఓ పంది పిల్ల చావుకు కారణమవుతుంది పుల్లమ్మ. ఆమె విపరీతంగా భయపడిపోయి నిద్రలో కలవరింతలు పెడుతుంది. తెలిసి చేసిన తెలియక జేసినా పాపకర్మం అనుభవించక తప్పదని కొడుకుతో అంటుంది. బదులుగా ఆ కొడుకు – “ఈ ప్రపంచంలో పాపం చేసినవాడికి భగవంతుడు శిక్ష వెయ్యడం లేదు. ఖూనీలు చేసిన వాళ్ళు, కొంపలు కూల్చిన వాళ్ళు బాగానే ఉన్నారు. దేముడు శిక్ష వేస్తున్నది, అమాయకత్వాన్ని, తెలివితక్కువతనాన్ని.” అని అంటాడు. ఎంతో నచ్చజెప్పిన మీదట పుల్లమ్మ తెరిపిన పడుతుంది. “కర్మ సిద్ధాంతం” అనే ఈ కథ 1942లో ప్రచురితమైంది.

పేదరికం చిన్నారుల బాల్యాన్ని ఎలా చిదిమేస్తుందో చెప్పిన కథ “కుంకుడాకు“. తల్లీ తండ్రీ పొయ్యిమీదకి తేగలిగినా, తేలేకపోయినా గవిరి పొయ్యి లోకి తెచ్చితీరాలి. పొయ్యి వెలగాలంటే చెత్త కావాలి. చెత్త ఏరుకొచ్చే బాధ్యత ఎనిమిదేళ్ళ గవిరిది. ఆ కుటుంబంలో కూతురు గవిరి తెచ్చి పెట్టే చెత్తకి ఆర్ధికంగా ఎంతయినా విలువ ఉంది. తోటి పిల్లలు బడిలో ఎక్కాలు వల్లె వేస్తుంటే, గవిరి మాత్రం కామందు చేతితో తన్నులు తింటూ చెత్త మోసుకుంటూ ఇంటికి నడుస్తుంది. ఈ కథ 1943లో ప్రచురితమైంది.

ఓ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని రాత్రి వేళలో చూడాలని బయల్దేరిన మిత్రబృందానికి ఏమయింది? భయం ఆవహించింది! ఎలా ఉంటుందా భయం? శరీరం నిండా వేలకొద్ది టన్నుల బరువుతో ఆవహించింది. “భయం శరీరాన్నంతా ఆవహించడం అందరి అనుభవంలోనూ ఉండదు. సాధారణంగా భయం గుండెల్లో ఒక భాగాన్ని మాత్రమే పట్టుకొట్టుంది. ఇంకో భాగం ధైర్యాన్ని ఉపాసన చేసి భయపిశాచిని గెంటేస్తుంది. పిచికని పట్టుకుని పావుగంట సేపు చేతుల్లో ఉంచి చూడండి. అది చచ్చి ఊరుకుంటుంది. దాని గుండెలు భయంచేత ఆగిపోతాయి. భయం అంటే అదీ. అదీ నన్ను ఆవహించింది.” అంటాడు గిరిరావు అనే పాత్ర. ఈ మిత్రబృందాన్ని అంతగా భయపెట్టినదేదో తెలుసుకోవాంటే “దుమ్ములగొండె” కథ చదవాలి. ఈ కథ జూలై 1943లో ‘భారతి’లో ప్రచురితమైంది.

లేమి ఎంతటివాళ్ళలోనైనా మానవత్వాన్ని చంపి, అమానుషత్వాన్ని పెంచుతుంది అంటుంది “బొండు మల్లెలు” కథ. మన సంబంధ బాంధవ్యాలు ఎంత చిత్రంగా ఉంటాయో ఈ కథ చెబుతుంది. “సారంవతమైన గంజిని కాలువపాలు చేసి, పిప్పిని ‘అన్నం’ అనుకొని నాగరీకులం తింటాం” అంటాడు ప్రధానపాత్ర. తాను చేసేది న్యాయమైన దోపిడీ అని మొదట భావించిన అతను – తాను కూడా ఓ అసహాయుడిని దోపీడీ చేశానని గ్రహిస్తాడు. ఈ కథ సెప్టెంబరు 1943లో ‘ప్రజాశక్తి’లో ప్రచురితమైంది.

పేదరికం కారణంగా చదువు మానేయాల్సిన పరిస్థితి కృష్ణుడిది. అటెండెన్స్ రిజిస్టర్‌లో తన పేరు కొట్టేసి ‘డిస్‌కంటిన్యూడ్’ అని వ్రాస్తారేమోనన్న భయం వాడిది. తండ్రి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చి పంపితే, బడిలో ఓ స్తంభాన్ని ఆనుకుని నిలబడి, దుఃఖంలోకి జారుకుంటాడు కృష్ణుడు. కొడుకు రాలేదని తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. బడి వరండాలో పిల్లాణ్ణి చూసి ఇంటికి వెడదాం రమ్మంటాడు. “బడి నాది, నే న్రాను” అంటూ గట్టిగా దుఃఖంతో కేకపెడతాడు కృష్ణుడు. కొడుకు బాధంతా తండ్రికి బోధపడుతుంది. ఓ నిశ్చయానికొస్తాడు. కనీసం ఒక్క పుస్తకమైనా కొనిపెట్టమన్న కొడుకుని “చుట్టలకిచ్చిన డబ్బులున్నాయా, పారేశావా?” అని అడుగుతాడు. “ఎందుకు పారేస్తాను నాన్నా?” అంటాడు కృష్ణుడు. చాసో కథల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ “ఎందుకు పారేస్తాను నాన్నా?” అనే కథ మే 1944లో ‘భారతి’లో ప్రచురితమైంది.

అనేక విషయాలలో సమాధానాలు పడుతూంటేనే జీవితం ఎవరికైనా గడుస్తుందని చెబుతుంది “లేడీ కరుణాకరం” కథ. ఈ కథ మార్చి 1945లో ‘ఢంకా’లో ప్రచురితమైంది. నిండా వ్యంగ్యం నిండిన కథ ఇది.

చిట్టికింకా పెళ్ళికాకపోవడం, జీర్ణించిపోయి, నాలో దురుద్దేశాలని రేపుతున్నది. చిట్టికింకా పెళ్ళికాకపోవడం తెనుగు యువకుల రసజ్ఞతా దారిద్ర్యాన్ని వెల్లడిస్తున్నాది.” అంటాడు ఊహా ఊర్వశి‘ కథలోని ప్రధానపాత్ర. “కోర్కెలు అణచివేస్తే మనోవికారాల కింద తేలుతాయి. కోర్కెలు సాఫల్యం చెయ్యడమో లేక జయించడమో మనం చేస్తూ వుండాలి.” అంటాడు. మనిషిలోని దిగజారుడుతనాన్ని కళ్ళకు కడుతుందీ కథ. ఈ కథ మార్చి 1945లో ‘భారతి’లో ప్రచురితమైంది.

భాషలో పదజాలానికి అతీతమైన ప్రతిభతో అనేక భావాలని సూక్ష్మంగా ఓ నవ్వు వ్యక్తపరుస్తుంది. అయితే ఆ నవ్వు అతనిలో పొరపాటు అభిప్రాయం కలిగించిది. ఆ నవ్వుకు కారణం ఏమిటో, అది ‘ఓ వర్గజీవితాన్ని దులపవలసిన రీతిగా దులిపిన’ కథకి ఎలా కారణమైందో “బూర్జువా కుక్క” కథ చెబుతుంది. సాహితీ భజనపరులపై విసిరిన వ్యంగ బాణం ఈ కథ. ఇది ఏప్రిల్ 1945లో ‘ఢంకా’లో ప్రచురితమైంది.

కుంటిబిచ్చగాడికి, గుడ్ది బిచ్చగాడికీ తేడాలు చెబుతూ ఓ తండ్రి తన కూతుర్ని గుడ్ది బిచ్చగాడినే పెళ్ళిచేసుకోమంటాడు. సమాజంలోని ఏ స్థాయి వ్యక్తులకయినా ముందు తమ అవసరాలే ముఖ్యమని “ఎంపు” కథ మరోసారి చాటుతుంది. ఈ కథ సెప్టెంబరు 1945లో ‘అరసం ప్రత్యేక సంచిక’లో ప్రచురితమైంది.

ధనం ఆశజూపి నిస్సహాయ స్త్రీలను కబళించడం అనాదిగా జరుగుతున్నదే. బ్రతుకుతెరువు కోసం రంగూన్ వెళ్ళిన అల్లుడు ఇక తిరిగిరాడని చెప్పి తన కూతురిని పరపురుషుడికి అప్పగిస్తోందో తల్లి. వాడిచ్చే డబ్బులతో అప్పులు తీరుస్తానంటూ కూతుర్ని బ్రతిమాలుతుంది. తప్పక, లొంగిపోతుంది కూతురు. ఉన్నట్టుండి ఓ రోజు రంగూన్ నుంచి తిరిగొస్తాడు అల్లుడు దాలిగోడు. ఏడుస్తున్న భార్యని ఓదారుస్తాడు. సమాజంలోని నైచ్యానికి అద్దం పట్టిన కథ “ఆఁవెఁత“. ఈ కథ రచనాకాలం 1951.

జీవితంలో సంగీతం ఎంత ప్రయోజనకరమో తెలిపే కథ “వాయులీనం“. పాడలేకపోయినా, అర్థం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచిని చేస్తుంది. వాతావరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడతాయంటుందీ కథ. “పిల్లల హృదయాలు నిష్కల్మషంగా ఉంటాయి. స్వభావసిద్ధంగా సంగీతం సమ్మోహనపరుస్తుంది. చిన్న వయస్సునుంచి కాస్తంత రాగతాళ జ్ఞానం కలిగిస్తే జీవితంలో సంగీతం ప్రవేశించి ఆజన్మాంతం ఆనందహేతువు అవుతుంది” అని చెబుతుంది. సంసార బాధ్యతలలో పడి, సంగీతానికి దూరమైనందుకు విలపిస్తోందో గృహిణి. ఈ కథ 1952లో ‘భారతి’లో ప్రచురితమైంది.

తన కొడుకు చెమటోడ్చి గడించుకున్న డబ్బుతో బియ్యం కొనుక్కుని రైల్లో వస్తున్న ఓ ముసలమ్మని రైల్వే ఉద్యోగి అటకాయిస్తాడు. బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్మడానికి తీసుకువెడుతోందని వాదిస్తాడు. రైలు అన్నవరం స్టేషనులోంచి పోతుంటే ముసలామే, ఉద్యోగి ఇద్దరూ సత్యనారాయణ స్వామిని చూడడానికి ప్రయత్నిస్తే, ఉద్యోగికి ఆలయం కనిపిస్తుంది, ముసలామెకి ముళ్ళచెట్లు మాత్రమే కనబడతాయి. చివరికి మరో స్టేషన్‌లో నలుగురు అధికారులు ఎక్కుతారు. ముసలామెని గుర్తు పట్టి తర్వాతి స్టేషన్‍లో దింపి కేసు పెట్టేందుకు తీసుకుపోతారు. గోదావరి మండలం సరిహద్దు దాటించి, ప్రభుత్వపు శాసనాన్ని ధిక్కరించి, హద్దు తప్పి, ఐదేసి కుంచాలు చొప్పున బియ్యం తరచు తరలించుకుపోతున్న ముద్దాయి పట్టుబడింది. “కుక్కుటేశ్వరము” కథ 1952లో ‘భారతి’లో ప్రచురితమైంది.

కొండని బ్లాస్ట్ చేసే పని చేస్తుండగా ఓ పెద్ద బండరాయి వచ్చి రామిగాడి తలమీద పడుతుంది. అక్కడికక్కడే చచ్చిపోతాడు. తోటి కూలీలందరూ కాంట్రాక్టర్ చేత నష్టపరిహారం ఇప్పించాల్సిందేనని పట్టుబడతారు. మేస్త్రీ సత్యం మూడు వందల రూపాయలు తెచ్చి రామిగాడి పెళ్ళాం పార్వతికి ఇస్తాడు. కోడలికి డబ్బు ముట్టిందని తెలియగానే రామిగాడి తల్లి వాటా కోసం వస్తుంది. మేస్త్రీని న్యాయమడుగుతుంది. అప్పుడు మేస్త్రీ సత్యం అసలయిన న్యాయమేమిటో చెబుతాడు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలనేనని ఆనాడే చెప్పిన కథ “బండపాటు“. ఈ కథ 1968లో ‘జ్యోతి – దీపావళి సంచిక’లో ప్రచురితమైంది.

పరమేశ్వరుడి నిర్ణయాలు పామరులకు బోధపడవని చెప్పే కథ “వజ్రహస్తం“. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఓ అధికారి తిరుమలకి వెళ్ళి భగవంతుని క్షమాపణ కోరుకుంటాడు. తనని కాకుండా తన మిత్రుడిని కాపాడమని కూరుకుంటాడు. ఈ కథ 1974లో ‘ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి సంచిక’లో ప్రచురితం.

అందమైన బతుకే అందరికీ కావాలని చెప్పే కథ “గుడిసె – దీర్ఘరోగి“. ఓ చిత్రకారుడు తను చిత్రించలచిన దీర్ఘరోగి చిత్రం కోసం ఓ ముసలమ్మని మోడల్‌గా ఉండమంటాడు. డబ్బిస్తానంటే ఒప్పుకుంటుందామె. నీడలు, ఎండ వెలుగులూ పడి ఆమె మొహంలో ఎనభై ఏళ్ళ జీవితపు బాధ, మరణ వేదన దేదీప్యమానంగా దివ్యజ్యోతులై వెలుగుతూ కనబడతాయి చిత్రకారుడికి. దివ్యత్వం అన్నిటా ఉంది, వేదనలోనే చూశా!‘ – అనుకుంటాడతను. ఈ కథ 1975లో ‘ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి సంచిక’లో ప్రచురితం.

వర్షాన్ని నమ్ముకుని వ్యవసాయం చేసే కుటుంబం కథ “వఱపు“. దిక్కుమాలిన ఆకాశాన్ని నమ్ముకుని తరతరాలు బతుక్కొస్తున్నాము‘ అంటుందో పాత్ర ఈ కథలో. సకాలంలో వానల కోసం రైతులు ఎంతగా ఎదురుచూస్తారో, ఎంతగా ఆశపడతారో; అకాలంలో కురిసే వానయినా కాస్తోకూస్తో మేలు చేస్తుందని వాపోతుందా పాత్ర. ఈ కథ 22.1.1988 నాటి ‘ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక’లో ప్రచురితం.

***

ఆయా కథలు ప్రచురితమైన కాలాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఉంది. ఈ కాలక్రమంలో తెలుగునేలలో వచ్చిన మార్పులు, సామాజిక సంబంధాలు చెదరడం, అవినీతి రాజ్యమేలడం, వ్యక్తి నైతికత పతనమవడం మొదలైనవాటినన్నీ ఈ కథలు రికార్డు చేశాయి.

ఇవి ఏ ఒక్క కాలానికో, ప్రాంతానికో మాత్రమే పరిమితం కాక, విశ్వజనీనమైన కథలు. వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నిస్తూ వ్యవస్థ మారాలి, మారడానికి వీలుగా వ్యక్తి ఆలోచన సాగాలి, వృద్ధి చెందాలని కళాత్మకంగా చెప్పిన కథలివి. మాండలీకాన్ని కథలలో చొప్పించిన రచయిత చాసో.

కాలాన్నీ, మనుషుల్నీ, సమాజాన్ని సన్నిహితంగా పరిశీలిస్తూ వ్రాసిన కథలివి. ఈ కథల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఏది రాయాలో ఏది రాయకూడదో అర్థమవుతుంది. కొత్త, ఔత్సాహిక రచయితలకు స్ఫూర్తినిచ్చే రచనావిధానం ఇది.

105 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 50/- విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ వారి అన్ని కేంద్రాలలోనూ ఈ పుస్తకం లభిస్తుంది. http://www.anandbooks.com నుంచి ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు.

**** (*) ****