వ్యాసాలు

ఏ వాదం లేని వారెవరు?

ఆగస్ట్ 2016


(గుర్తున్న మేరకు, గుర్తున్న రూపంలో…   2016 జులై 3న ‘ఆటా’ (ATA – American Telugu Association) సదస్సులో నా మాటలు ఇవి. శీర్షిక ఇప్పటికిప్పుడు పెట్టినది. ఆ సాయంత్రం నా ప్రసంగం శీర్షిక ‘తెలుగు సాహిత్యంలో వాదాలు’.)

వివాదంలో ఇద్దరుంటారు. దాన్ని పేచీ అనీ కొట్లాట అనీ అంటారు.

వాదంలో… అది జరిగే చోట… కేవలం ఒక్కరే వుండొచ్చు.

ఇప్పుడు నేనొక వాదం చేస్తున్నాను. మీరు వింటున్నారు. నేను మీతో వాదించడం లేదు. నా వాదాన్ని మీకు వినిపిస్తున్నాను. దీన్ని నేను రాస్తున్నట్టు వూహించుకోండి. రాసేప్పుడు నేను ఒక్కడినే కదా.

లేదు. అప్పుడు కూడా ఒక్కడినికాదు. నేను వాదం చేస్తున్నట్టయితే… నా ముందు మరొకరు వుంటారు. నా వూహల్లో. ఊహల్లోని మనిషి తిరిగి మాట్లాడడు. ఇప్పుడు మీలాగే. అయినా ఆ మనిషికీ, మీకూ జవాబుదారీగా వుండక తప్పదు నేను.

ఇంకొకరు వున్నట్ట్లు మస్తిష్కంలో వూహ లేకపోతే, చేతి వేళ్లు టైపు చెయ్యవు. సో, వాదంలో కూడా ఇద్దరు వుండక తప్పదు.

ఈ రెండు… ఈ ద్వైతం…  చాల ముఖ్యం, బండి నడవడానికి.

వాదం అనేది ఒక డయలెక్టికల్ చర్య. సత్య శోధనలో మంచి – చెడు, ప్రగతి – తిరోగతి … ఎక్కడికక్కడ మన నిర్ణయాలు మనం చేసుకోడానికి… అలోచించడానికి…. మనం ఆనుసరించే మార్గం వాదం. మనల్ని మనం ఇతర్లకు ప్రెజెంట్ చేసుకోడానికి వుపయోగపడే భూమిక వాదం. సో, వాదం లేని చోటు లేదు. తమ దైన వాదం లేకుండా ఎవరూ లేరు.

మరయితే, వాదాలు వద్దు, కవిత్వంలో వాదాలు వుండొద్దు అని కొందరు  ‘వాది’స్తారెందుకు? అదే నాకూ ప్రశ్న. ఔను, ఎందుకు వాదిస్తారు? ఈ ప్రశ్నే ఈ రోజు నా ప్రసంగానికి ఇరుసు.

ముందుగా ఒక విజ్ఞప్తి. ఇది నా వాదం. కొందరికిది నచ్చకపోవచ్చు. వారి వాదం వారు చెప్పవచ్చు. నిజానికి వారు చెబుతూనే వున్నారు. అది బాగా విని వుండడం వల్లనే, ఇప్పుడు, నేనీ టాపిక్ ఎంచుకున్నాను. ఏ నేపధ్యంలో ఈ టాపిక్ ఎంచుకున్నానో ఎందుకు చెబుతున్నానంటే, ఆ నేపధ్యపు నీడలు నా మాటల మీద వుంటయి. ఇవి వ్యక్తులుగా ఎవర్నో నొప్పించడానికి కాదు. నన్ను కోప్పడండి గాని, నొచ్చుకోకండి. :-)

‘నేతి నేతి వాదం’ అనే మాట మీరు విన్నారా?

ఇది పాత అలంకార శాస్త్రం గురించి సరదాగా అనే మాట. సరదా అని ఏమిట్లెండి?! దాన్ని సీరియస్ గానే తీసుకోవచ్చు. అలంకార శాస్త్ర చర్చ అలాగే సాగుతుంది. ఒకాయన ‘ఔచిత్యం’ కావ్యానికి ప్రాణం అంటాడు. మనం ఓహో అనుకుంటాం. మరొకాయన వస్తాడు అది ‘కాదు’ అంటాడు. కాదు అనేసి వూరుకోడు. తాను ఏది ఔననుకుంటున్నాడో అది చెబుతాడు. ఆయన ధ్వనిరాత్మా కావ్యస్య అంటాడు. కావ్యానికి ఆత్మ ధ్వని అంటాడు. ఇదీ బాగుంది కదా? ఇంకొకాయన ఇది కూడా కాదంటాడు. వక్రోక్తి కావ్య జీవితం అంటాడు. (ఇక్కడ వరుస క్రమాలు గాని, ఆ మాటల సంస్కత రూపాలు గాని ఎగ్జాక్ట్ కావు).

ఆలంకారికుడు తన కాలానికి వున్నదాన్ని ‘న ఇతి’ ‘న ఇతి’ (ఇది కాదు, ఇది కాదు) అని  ‘తిరస్కరించి’  కొత్తగా తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం వల్ల….  అలంకార శాస్త్రం మీద ‘నేతి నేతి వాదమ’ని ఒక రుచికరమైన చమత్కారం ప్రచారమయ్యింది.

కావ్యాత్మ  ధ్వని అనే ఆనంద వర్ధనుని మాటను అందరూ అంగీకరించడంతోనో, లేదా రమణీయార్ఠమిచ్చే వాక్యమే కావ్యమని జగన్నాధుడు చెప్పిన మాటతోనో ఆ చర్చ అగిపోయిందని అంటారు. ఏమీ ఆగిపోలేదు. ఆ నేతి నేతి వాదం ఇంకా కొనసాగుతూనే వుంది. కవిత్వం అంటే ఏమిటి అనే చర్చ ఆగిపోలేదు. కవిత్వం లాగే దాని చర్చ కూడా ఆగదు.

కాకపోతే, ఆ చర్చను జాగర్తగా గమనిస్తే, మొదటి నుంచి అలంకారికులలో ఒకరి కన్న మరొకరు ‘ఎక్కువ’ ‘సత్యం’ చెప్పారని అనిపిస్తుంది. మునుపటి ‘నిర్వచనం’ కన్న కొత్త నిర్వచనం మనకు ఎక్కువగా నచ్చుతుంది. అంటే వాదం వల్ల ఆలోచన ఒక రకం ‘వృద్ధి’కి లోనవుతుంది. ఈ వృద్ధి నిటారుగా కాకుండా స్పైరల్ గా వుంటుంది. పునరావృతమవుతున్నట్టు అనిపిస్తూనే, పై పొరకు వెళ్తుంది. పాత దాన్ని పూర్తిగా తీసేయకుండా, దాన్ని తనలో ఇముడ్చుకుని, పై పొరకు వెళ్తుంది.

వాదం అనే మాటను ‘ఇజం’ అనే అర్థంలోనే వాడుతున్నాం. ఈ అర్థం సరైనదని నేను అనుకుంటాను.

విషయాన్ని అర్థం చేసుకోడానికి, మన మెడ చుట్టు మనం చిక్కు ముడులు వేసుకుని వుమ్మ నీటిలోనే గుటుక్కుమనకుండా వుంటానికి, విషయాన్ని సులభంగా అధ్యయనం చేయడానికీ… అనుసరిస్తున్న మార్గాలనే వాదాలు అంటున్నాం.

సాహిత్యంలోనైనా వాదాలు ప్రధానంగా రెండు రకాలేనని నా అభిప్రాయం. ఔను ఇది నా అభిప్రాయమే. ఇంకొకరు చెప్పినది కాదు. దీనికి అలాంటి ప్రమాణాలేవీ లేవు. ఇది నా ప్రతి పాదన.

రెండు రకాలల్లో మొదటిది భావ వాదం, రెండవది భౌతిక వాదం.

కళ్ల ముందు వున్న జీవితం, అనుభవించిన జీవితం…ఇవి కాదు, భావాలే కవిత్వం అని భావ వాదుల వాదం సారాంశం. అందే నేల కాదు, అందని చుక్కలూ, చుక్కల మీద వూహలే వీరికి కవిత్వం.

అందుకే వీరు తరచు ఏ వాదం వద్దు అని అంటూ వుంటారు.

ఏ వాదం వద్దు అని పనిగట్టుకుని అనడం దానికదే ఒక వాదం.

కొమ్మూరి వేణూగోపాల రావు నవల ఒకటుంది. ‘వ్యక్తిత్వం లేని మనిషి’ అని. దానిలో ప్రధాన పాత్ర మృత్యుంజయ రావు (?). రావు నవల అంతా ఏ వ్యక్తిత్వం లేకుండా ప్రవర్తిస్తాడు. వ్యక్తిత్వం లేకపోవడం అతడి వ్యక్తిత్వం. ఇది కృత్రిమంగా వుంటుంది. అలాంటి పాత్రల్ని రచయిత కష్టపడి నడిపించాల్సి వుంటుంది. ఎందుకంటే, ఏ వ్యక్తిత్వం లేకుండా ఏ వ్యక్తి వుండడు.

ఏ వాదం లేకుండా ఎవరి ఆలోచనలూ వుండవు.

కవిత్వానికి ఏ వాదం వుండరాదనే వారు… తిరిగి…  రెండు రకాలు ఆని నా అబిప్రాయం. మొదటి రకం తాము ఏ వాదాన్ని అనుసరిస్తున్నారో అది తమకే తెలీని వారు. రెండో రకం…  తమ వాదాన్ని తాము దాచి పెట్టుకుంటున్న వారు.

అలా దాచి పెట్టుకోవలసిన అవసరం ఏం వుంటుంది కవికి?

ఉంటుంది. అదెలా అంటారా?

ఉదాహరణకి… దళిత వాదం, స్త్రీవాదం అనేవి వున్నాయి. దళిత వాదులు, స్త్రీ వాదులు తాము దళితవాదులం, స్త్రీవాదులమని చెప్పుకోడానికి సిగ్గు పడరు. కాని, వారి వ్యతిరేకులైన బ్రాహ్మణ వాదులు, మగదురహంకార వాదులు మాత్రం తమను బ్రాహ్మణ వాదులని, మగదురహంకార వాదులని ఎవరైనా అంటే కోప్పడతారు. అలాంటి వాదమేదీ లేదని, అసలు ఏ వాదమూ లేదని, ఏ వాదమూ వుండొద్దని.. ఇలా ఒక్కొక్క మెట్టుగా రెట్టిస్తూ వాదిస్తారు.

ఎందుకు కోపం? వర్ణాశ్రమ ధర్మం గొప్పదని, అందులో బ్రాహ్మణులు గొప్ప అనీ, వారికి మరియూ గోవులకు పూజలు చేయాలనే ధర్మాలను సమర్థించే వారు బ్రాహ్మణ వాదులు. ఆ మాటలున్న పుస్తకాలను  విమర్శించకుండా యధాతధంగా అనుసరించాలనే వారు బ్రాహ్మణ వాదులు. మరో మాటలో చెప్పాలంటే,  సమాజ సంక్షేమానికి బ్రాహ్మణ ఆరాధనను కేంద్రం చేసే వారు బ్రాహ్మణ వాదులు. మగవాడు ఎక్కువనీ, ‘అతడు’ ‘ఆమె’కు ప్రతినిధి అనీ ‘అతడి’ కోసమే ‘ఆమె’ బతుకు అనీ వాదించే వారు మగ దురహంకార వాదులు. రక రకాల రూపాల్లో ఆ వాదం చేసే వారు… అనువు గాని చోట కాసేపు నోరు మూసుకున్నప్పటికీ…  ఆ వాదానికి అనుగుణంగా జీవించే/రాసే/చదివే వారు…. మగ దురహంకార వాదులు. కాని ఈ రెండు వాదాల వాళ్ళు తాము ఆ ఫలానా వాదులమని చెప్పుకోరు, ఒప్పుకోరు.

భావ వాదులు కూడా అంతే. తమది ఒక వాదమని చెప్పుకోడం వీరికి ఇష్టం వుండదు. అందుకే కవిత్వానికి వాదాలే వొద్దు అని పనిగట్టుకుని మాట్లాడుతుంటారు. ఎంత పనిగట్టుకుని మట్లాడతారంటే, ఒక్కోసారి కొందరు మంచి కవులు కూడా చాల అసందర్భంగా మాట్లాడి మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఆశ్చర్యం ఏమీ లేదు. ‘వాదం లేద’నడం వారి వాదంలో ముఖ్య భాగం. తమకు ఒక వాదం వుందని వారు చెప్పుకోరు, ఒప్పుకోరు.

ఇవాళ కొందరు యువకవులకు, యువకవయిత్రులకు నీడ ఇస్తున్న గొడుగు ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఒక మంచి కవి. తనదైన గొంతు వున్న గొప్ప కవి. ఏది కవిత్వమో ఏది కాదో గుర్తించగల రస హృదయుడు. ఆయన చాల ఇష్టపడి ఎంపిక చేసుకుని అనువదించిన విభాషా కవితల చిరు పుస్తకం ‘రెండో ప్రతిపాదన’. పుస్తకంలోని కవుల్ని ఇష్టపడడంలో ఇస్మాయిల్ అతి పాక్షికత్వానికి (పార్తిజాన్షిప్ కి) లోనవకపోవడం ఆభినందనీయం.

వాస్తవ జీవితానుభవాలతో కవిత్వమయిన పలువురు కవులను ఈ చిన్న పుస్తకంలో పరిచయం చేశాడు ఇస్మాయిల్. పరిచయం చేసే కొద్ది మాటల్లో ఆయన ‘వాదం’ తెలిసిపోతుంది. ఉదాహరణకు; బెర్తోల్ బ్రెహ్ట్ కవిత్వం ‘స్టాలిన్ మీద మూడు పద్యాలు’ అనువదించి ప్రచురించాడు. స్టాలిన్ ని వ్యతిరేకించడంలో బ్రెహ్ట్ లేదా ఇస్మాయిల్ మొదటి వారు కాదు. చివరి వారు కారు. స్టాలిన్ మీద విమర్శ పెట్టినా, బెర్తోల్ బ్రెహ్ట్ కమ్యూనిజాన్ని విమర్శించ లేదు. (విమర్శించరాదని కాదు, విమర్శించ లేదు).  బ్రెహ్ట్ పద్యాల్ని అందిస్తూ “కమ్యూనిస్టు రచయితల్లో కూడా నిజాయితీపరులున్నారని నిరూపించడానికి మాత్రమే ఇవి ప్రచురిస్తున్నాను” అంటారు ఇస్మాయిల్. కమ్యూనిస్టు రచయితల్లో నిజాయితీ పరులున్నారని ఈ పెద్ద మనిషి నిరూపించాలా?

కమ్యూనిస్టు కావడానికి, నిజాయితీ లేకపోవడానికి సహజ సంబంధం ఏదో వుందని ఇక్కడ ఇస్మాయిల్ ధ్వని. ఈ దారుణమైన మాట అనడం… ఇస్మాయిల్  ఒక ‘వాది’ అయితే తప్ప సాధ్యం కాదు. ఇదే పుస్తకంలో పాబ్లో నేరూడా పద్యం ఇస్తూ… ‘కమ్యూనిస్టయినా కమ్మని కవిత్వం రాశాడు’ అని వ్యాఖ్యానించాడాయన. ఇవి అదాటుగా దొర్లిన చమత్కార చాపల్యాలు  కాదు. తన వైఖరిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ఇంకా చాల సార్లు ప్రయత్నించారు.

ఇంతకూ ఇస్మాయిల్ ‘వాదం’ ఏమిటి?

అసలు, మనం దేన్నైనా వాదం అని ఎప్పుడు అంటాం?

1. అది కొన్నిటిని పనిగట్టుకుని ఎక్స్ క్లూడ్ చేస్తున్నప్పుడు.

2. తను ఎక్స్ క్లూడ్ చేసే వాటితో తన వైరుధ్యాన్ని పదే పదే సమర్థించుకుంటున్నప్పుడు.

3. కొన్నిటిని ఇంక్లూడ్ చేసుకుని వాటిని సమర్థించుకోడానికి ప్రత్యేకించి ప్రయత్నిస్తున్నప్పుడు

4. తనలో ఇమడని వాటిని విరిచి, వంచి, క్షమించి…  కృత్రిమంగా ఇంక్లూడ్ చేసుకోజూసినప్పుడు, ఇమడకపోతే శత్రు వైఖరి అవలంబించినప్పుడు.

ఈ ఎక్స్ క్లూజన్, ఇంక్లూజన్ల వల్లనే ఒక వైఖరి ‘వాదం’ రూపం ధరిస్తుందని నేను భావిస్తున్నాను. ఏ సిద్ధాంతమయినా, ఏ వాదమైనా ‘ఇతర’ వాదాలతో ‘భేదం’ (డిఫరెన్సు) లేదా ‘వైరుధ్యం’(కాంట్రడిక్షన్) వల్లనే వునికిలో వుంటుంది. ఇస్మాయిల్ వాదమూ అంతే. వాదం వద్దు అనే మాట ఇస్మాయిల్ కు సంబంధించినంత వరకు ఒక స్వవచన వ్యాఘాతం.

పాదార్థికతకు, వాస్తవికతకు తిలోదకాలిస్తే తప్ప కేవలం భావాలలో ఓలలాడడం ఏ కవికీ (ఏ మనిషికీ) సాధ్యం కాదు. మనం భావ కవిత్వం అంటున్న దానికి కూడా పాదార్థికమైన అర్థం చెప్పుకోగలిగినంత వరకే ఆ కవిత్వం మనకు అర్థవంతమవుతున్నది. మిగిలిందంతా తిని కూర్చున్న వాడి మెట్ట వేదంతమే. ‘తీయ తేనియ బరువు మోయలేదీ బ్రతుకు’ అంటో అదొక ఆజీర్తి జబ్బు అవుతున్నది. మెట్ట వేదాంతమంటే కాసేపు కబుర్లు చెప్పుకోడానికి శిష్టులకు (తీరిక ఎక్కువైన వారికి) పనికొచ్చే స్పెక్యులేషన్ అని నా వుద్దేశం. అది దేనికీ ఎవరినీ కదిలించదు, తాను కదలదు.

కవిత్వం ఇలా మునుపు రాజుల అనుభవానికీ, ఇప్పుడు శిష్ట వర్గం అనుభవానికీ పరిమితం కావడం సరైనదేనా? ఎవరో ‘పోషించక’పోతే పాపం కవిత్వం ఎలా బతుకుతుంది… అంటారా?

ఈ తరహా కవిత్వం తనకు ఏ వాదం లేదని అనడం కుదరదు. దానికొక వాదం వుంది. దాని పేరు ‘వాదం వద్దనే వాదం’. ‘శుద్ధ ఆనంద వాదమ’ని దీనికి మరొక పేరు కూడా పెట్టుకోవచ్చు. బ్రాహ్మణ వాదం లాగే, మగదురహంకార వాదం లాగే ఇది కూడా తాను ఒక ‘వాదం’ అనే మాట చెప్పుకోదు, ఒప్పుకోదు. కవిత్వానికి ‘వాదం’ వద్దంటుంది. అమాయకంగా కనిపించే ఆ బ్యారికేడు వెనుక నుంచి ప్రజానుకూల వాదాల మీద దాడి చేస్తుంది.

ఉదాహరణకు ఇస్మాయిల్ కవిత్వం నేల వదలని సందర్భాలున్నాయి. అవి పాజిటివ్ గా వున్నాయి నెగటివ్ గా కూడా వున్నాయి. చెట్లు, చిలకలు రాను రాను కనుమరుగవుతున్న సంధి కాలంలో ఆ పెయిన్ ని ‘అందం’గా గుర్తు చేసి దాని కోసం మన ఈర్నింగ్ ని పెంచుతుంది ఇస్మాయిల్ కవిత్వం. పరిసరాల మీద మన ప్రేమను పెంచుతుంది.  ఇది పాజిటివ్.

స్వేచ్చకు వున్న కొన్ని సహజ పరిమితుల్ని మరి మరి గుర్తు చెయ్యడం ద్వారా, ఇది స్వేచ్ఛ లేని తనాన్ని ఆస్వాద యోగ్యం చేస్తుంది. తోలు కాయమిది తూట్లు తొమ్మిది తరహా ఆధ్యాత్మిక నిర్వేదానికీ ప్రోది చేస్తుంది. ఈ నిర్వేదం అన్ని మెట్ట వేదాంతాల లాగే, యథా తధ స్టితికి సాయపడుతుంది. ఇది నెగటివ్.

ప్రకృతి విధించే పరిమితుల సంగతి తరువాత చూద్దాం, ముందుగా మనిషి మనిషికి విధించే పరిమితులను అధిగమిద్దాం అనే సహజ స్పృహను ఈ వాద-రహిత-వాదం మొద్దు బారుస్తుంది.

స్తీవాద, దళిత వాద, శ్రామిక వాదాల రూపంలో స్త్రీలు, దళితులు, శ్రామికులు తమ తమ బంధనాల నుంచి విముక్తి కోసం పోరాడుతున్న కాలంలో ఇస్మాయిల్ జీవించారు. తను ఆ సంగతులేమీ మాట్లాడకపోగా…  స్వేచ్ఛకు వున్న పరిమితులను  రొమాటిసైజ్ చేయడం ద్వారా….  ఇస్మాయిల్ యొక్క ‘శుద్ధ ఆనందవాదం’ శిష్ట వర్గానికి (బ్రాహ్మణ వాద, పిత్రు స్వామిక వాదులతో సహా శిష్ట వర్గానికి) పసందుగా వుంటుంది. వారితో చాల త్వరగా ‘వహ్వా’ అనిపించుకుంటుంది. స్త్రీలు, దళితులు, శ్రామికులు విసురుతున్న సవాళ్లను… అవి పచ్చి బౌతిక వాంఛా (వల్గర్ మెటీరియలిస్టిక్) వాదాలుగా తిరస్కరించడానికి వుపయోగపడుతుంది. కొందరు కవులూ రచయితలు జీవితం విసిరే ప్రశ్నలను తప్పించుకుని తమ సుఖం తాము చూసుకోడానికి వీలు ఇస్తుంది.

వీరు తిరస్కరించేది కమ్యూనిజాన్ని మాత్రమే కాదు. భౌతిక జీవితాన్ని పట్టించుకునే వాదాలన్నిటినీ తిరస్కరిస్తారు. ‘జెన్’ అంటో కొత్త బట్టల కింద పాత ఆస్తిక భావాలను ఎంచక్కా ‘ఇంక్లూడ్’ చేసుకుంటారు.

ఈ తరహా ‘శుద్ధ ఆనంద వాదా’న్ని బహిరంగంగా ఓనప్ చేసుకోలేకనే, వీరు ఏ వాదం వద్దనే వాదం వెనుక దాక్కుంటున్నారని నా అభియోగం.

2

ఒకటి భావ వాదమనుకున్నప్పుడు ఇవాళ వున్న చాల వాదాలు బౌతిక వాదాలు అయ్యుండాలి. ఔను. అదే నా వుద్దేశం.

దైనందిన జీవితం (ఎవెరి డే లైఫ్)లో సుఖ దుఃఖాల్ని వ్యక్తం చేస్తూ, సుఖాల్ని పెంచుకుని, దుఃఖాల్ని తగ్గించుకునే దిశగా.. జరిగే మానవ ప్రయత్నాలకు ప్రోత్సాహమిచ్చే వాదాలేవైనా మంచివేననడానికి ఈ సదస్సులో ఎవరికీ అభ్యంతరం వుండదనుకుంటాను.

ఆధునిక జీవితంలో, అలాంటి వాదాలలో మొదటిది ప్రేమ్ చంద్ తదితరులు ప్రాతినిధ్యం వహించిన ప్రగతి శీల ఉద్యమ వాదం (ప్రోగ్రెసివిజం), దానిలో అవకాశవాదం పెచ్చు మీరే కొద్దీ ముందుకొచ్చినది… రాత్రి కవితా సంపుటి, ఆ తరువాత దిగంబర కవితోద్యమం రూపంలోని విధ్వంస వాదం (నిహిలిజం). అది నిర్దిష్ట రూపం ధరించడమే విప్లవ వాదం.

ఈ ప్రసంగంలో లోతుల్లోకి వెళ్ళడం నాకు కుదరదు గాని; ఎంత ప్రగతి శీలం అయినప్పటికీ, ఎంత నేల విడువని సిద్దాంతాలు ఆయినప్పటికీ ఈ ప్రగతి వాదాలలో భావ వాదం ఛాయలున్నాయి. రచయితలు ‘అంగీకరించిన’ లేదా తమకు తాము ‘ప్రకటించుకున్న’ అభిప్రాయాలే/భావాలే వీటికి ప్రాతిపదిక. వారి వాస్తవ జీవితాలు కాదు. వాస్తవమైన మనుషులు ప్రాతిపదిక కాకుండా పోయారు. వాస్తవిక మానవులు ప్రాతిపదిక అయి వుంటే… రాజకీయాల్లో, సాహిత్యంలో ‘శ్రామికత్వం’ అనే వాస్తవ వునికికి (బీయింగ్ కి) ప్రథమ ప్రాధాన్యం వుండాల్సింది. అలా జరగలేదు.

సాహిత్యంలో విప్లవ వాదం సిన్సియర్ గా ప్రయత్నించి విఫలమైన చోటనే నిజమైన భౌతిక వాదాలు మొదలయ్యాయని నేను భావిస్తున్నాను. దళిత వాదం, స్త్రీవాదాలకు ప్రాతిపదిక అయిన దళితులు, స్త్రీలు వాస్తవిక మానవులు. వారి అనుభవాలు కేవలం భావాలు కాదు. అవి వాస్తవికం, పాదార్థికం. అవి దైనందిన జీవితం (ఎవెరి డే లైఫ్)  నుంచి పుట్టిన భావోద్వేగాలూ, ఆలోచనలు. అవి భావాలకు పుట్టిన  భావాలు కావు. (పూలకు పూలు పూయవు, చెట్లకు పూస్తాయి).

‘బీయింగ్ డిటర్మిన్స్ సోషల్ కాన్షియస్ నెస్’ ( ఉనికి/అస్తిత్వమే సామాజిక చైత్న్యాన్ని నిర్ణయిస్తుంది) అనేది మార్క్సు ఆవిష్కరణల్లో అతి ముఖ్యం. అది ఆయన ఆలోచనలకు తల్లి వేరు. ‘బీయింగ్’ అనే మాటకు ఆయన ఏ ఆధ్యాత్మిక అర్థాన్నీ వుద్దేశించ లేదు. భౌతికమైన అర్థాన్నే ఉద్దేశించారు. శ్రామిక వర్గం (ప్రొలిటేరియట్) మాత్రమే దోపిడీ నుంచి విముక్తి సాధిస్తుంది అనడం అందుకే. శ్రామిక వర్గ వునికి నుంచే శ్రామిక వర్గ చైతన్యం వస్తుంది. అందరి కంటె ఎక్కువగా శ్రామికులకే ‘దోపిడి నుంచి విముక్తి’ అవసరం. ఆ వర్గ చైతన్యమే విముక్తికి దారి తీస్తుంది.

శ్రామిక వర్గేతర మనుషులలో సో కాల్డ్ శ్రామిక  వర్గ చేతన వున్న మంచి వాళ్ల వల్ల విముక్తి అని మార్క్స్ అనలేదు. అలా అనడమంటే, అలా అనే మేరకు…  భావ వాదానికి తల వంచడమే.

మరయితే, శ్రామికులు రాజ్యం ఏలడం సరైనది అని భావించే మంచి మనుషులు ఏం చేయాలి. వీళ్లు చేయవలసింది శ్రామికులకు బదులు తాము గద్దెలెక్కి ఏలడం కాదు. శ్రామికులను అధికారంలో కూర్చో బెట్టి, తాము కూడా శ్రామికులుగా మారడానికి ప్రయత్నించడమే వీళ్లు చేయాల్సిన పని. మానవులను ఆ దిశగా ప్రొత్సహించే సాహిత్యం వెలువడాలంటే…. కేవలం ప్రగతిశీల వాదం చాలదని తేలిపోయింది. ఈ తప్పు దిద్దుకోడానికి మానవ సమాజం చేసే భౌతిక వాద ప్రయత్నాలే దళిత వాద, స్త్రీవాద సాహిత్యాలు.

ఈ వాదాల గురించి ఇప్పటికే చాల చర్చ జరిగింది. ఈ వేదిక మీద, ఈ ప్యానల్ లో కూడా ఆలాంటి చర్చ జరిగింది.

ప్రస్తుతం ఈ వాదాలు కొన్ని ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రశ్నలను చాప కిందికి తోసి వెళ్లే ఏ ప్రయత్నమైనా మరోసారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. ఈ వాదాలు ప్రగతి శీల శక్తుల ఫ్రాగ్నెంటేషన్ కు, అనైక్యతకు దారితీశాయనేది వీటి మీద వున్న అతి ముఖ్య విమర్శ. అది నిజం కూడా. ఈ అనైక్యతని కొనసాగించి, బలపరచడమంటే…. దోపిడి, అణిచివేత దారులకు సేవ చేయడమే. ఈ   వాదాల లోని వుమ్మడి అంశాల మీద దృష్టి పెట్టాలి. అన్నిటి కన్న పెద్ద వుమ్మడి అంశం… ఎస్, అది తిరిగి శ్రమైక జీవనమే.

ఈ మధ్య ఫెమినిస్టు సాహిత్యం చూస్తుంటే ఈ ఆలోచన మీక్కూడా కలిగి వుంటుంది. ఫెమినిస్టు సాహిత్యం, ఫెమినిస్టు విమర్శ చాల వరకు సెక్సు సమస్యల చుట్టూ తిరుగుతున్నాయి. స్త్రీ-పురుష సంబంధాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆడవాళ్ళకు సెక్సు/ మాత్రుత్వం తప్ప మరే సమస్యలు లేవా అనిపిస్తున్నది. స్త్రీలు పని చేసే వారు కూడా. హౌస్ వైఫ్ కూడా శ్రామికురాలే. అంటే స్త్రీలు కేవలం ప్రియురాళ్ళు, భార్యలు, తల్లులు మాత్రమే కాదు, శ్రామికులు కూడా.

అలాగే దళితులు. దళితులకు కుల సమస్యలతో పాటు శ్రామిక సంబంధ సమస్యలున్నాయి. స్త్రీలకు, దళితులకు శ్రమ సమస్యలతో పాటు హిందూ, ఇస్లాం వంటి మతాలతో మరిన్ని సమస్యలున్నాయి.  ఇవి శ్రమతో ముడిపడివున్నవే. శ్రామికులుగా దళితులు, స్త్రీలు, మైనారిటీలు, ఫ్యాక్టరీలలోని, ఆఫీసుల్లోని ఉద్యోగులు కలిసి పని చేయడానికి ఇంత అవకాశం వుండి కూడా ఎందుకు కలవలేక పోతున్నామో ఆలోచించాలని ఈ వేదిక మీది నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను.

నేను విలీనం గురించి మాట్లాడడం లేదు. ఫెడరేషన్ గురించి మాట్లాడుతున్నాను. సాలిడారిటీ గురించి మాట్లాడుతున్నాను.

మనం కలవకపోవడం ఎవరికి మేలో ఎవరికి కీడో ఆలోచించాలని మిత్రులకు విజ్ఞప్తి.

**** (*) ****