పైవారమో, ఆ వచ్చే వారమో ‘ఈ వారం కవి’గా మన వాకిట్లో వుండాల్సిన కె,యెస్. రమణ ఇవాళ లేడు. యాభై ఆరేళ్ళ వయసులో అతని గుండె హటాత్తుగా ఆగిపోయింది మొన్న- 1980లలో తెలుగు కవిత్వంలో వొక తాత్విక చింతనని తీసుకు వచ్చిన ‘నిశి’కవులలో రమణ జెండా పట్టుకు తిరిగిన వాడు. ఒక వైపు రమణ మహర్షీ, ఇంకో వేపు చలం ఆవహించిన వ్యక్తిత్వం. చిన్న వుద్యోగం నించి మొదలై ప్రొఫెసర్ దాకా ఎదిగిన శ్రమజీవి. అనుదినజీవితాన్ని నిదానంగా మలచుకున్న సాధుజీవి. జీవితంలోని సున్నితత్వాన్ని చివరంటా కాపాడుకున్న చిరుదరహాసి….మంచి స్నేహితుడు…రమణ ఇక లేడు…చూస్తూండగానే అతనో జ్నాపకమయి ఎటో వెళ్లిపోయాడు. వినండి…ఇద్దరు రమణ ఆత్మీయ మిత్రుల గుండె జడి…
***
నువ్వూ నేనూ హెచ్చార్కే ఇంకొకరెవరో ఆ ఇరానీ హోటల్లో కూర్చొనే వున్నాం. మనకెంతో ఇష్టమయిన ఇరానీ చాయ్ ని అయిపోతుందేమో అయిపోతుందేమో అన్నట్టు చప్పరిస్తున్నాం. నువ్వు నవ్వుతున్నావు నీదయిన నవ్వుతో! నువ్వు మాట్లాడుతున్నావు నీదైన నెమ్మదితనంతో! నువ్వు కుర్చీలో కదులుతున్నావు నీదైన సున్నితమయిన కదలికతో కుర్చీకి నొప్పెడుతుందేమో అన్నట్టుగా! రమణా, ఇది కదా మనం మొదటి సారి కలుసుకున్న ఆ దృశ్యం!
నా ఇరవయ్యేళ్లు, నీ ఇరవై తొమ్మిదేళ్లు…మన మధ్య రవంత దూరాన్ని కూడా పెంచలేకపోయాయ్ అప్పటి నించీ! ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ తెలుగు పుస్తకంలో నా కవితని సిలబస్ లో పెట్టాక నన్ను చూడాలనుకుని, ఆ కవిత నా గొంతులో నీ విద్యార్థులకు వినిపించాలని నువ్వు హైదరాబాద్ దాకా నన్ను లాక్కు వెళ్లినప్పుడు నీ విద్యార్థుల ముందు నేను మౌనమే భాషగా కూర్చున్నప్పుడు ‘ఇతని గొంతు కాయితమ్మీద తప్ప పలకదు,” అంటూ నువ్వు చేసిన పరిచయాలు నిజానికి మనిద్దరికీ తొలి పరిచయాలే కదా! అప్పటికింకా నా తీరని కలల్లో వొకటి అని తెలియకుండానే ఆ రోజు నువ్వు నాకు కొనిచ్చిన ముదురాకు పచ్చ రంగు హీరో పెన్ను దాని బంగరు క్యాప్ నా కళ్ళల్లో ఇప్పటికీ మెరుస్తోంది!
ఆ తరవాత ప్రతి మూడు నెలలకో, నాలుగు నెలలకో వొక సారి ఏదో వొక వంక మీద హైదరబాద్ రావడం…ఆ ఖైరతాబాద్ సెంటర్లో అలాగే ఆ ఇరానీ కేఫ్ లోనే కలవడం..ఇంటికెళ్లడం …మంజుల గారు మనిద్దరి మీదా ఎడతెగకుండా జోకులేయడం, చిన్నారి ప్రణవ్ తో బాసింపట్లు వేసుకొని బోర్డ్ గేమ్స్ ఆడడం…ఓ మహర్షీ, ఓ మహాత్మా అని నిన్ను వొకటికి పది సార్లు వెక్కిరించడం…పొద్దుటినించీ సాయంత్రం దాకా చెరగని బట్టలతో, క్రాఫుతో, నవ్వుతో నువ్వొచ్చినప్పుడు నిన్ను ‘నువ్వు కనకసభా రమణ కాదు, కనక’శుభ్ర’ రమణ, అనో – మరీ ఆ మైసూర్ సాండల్ సబ్బు వాసనేస్తున్నప్పుడు కనక ‘సబ్బు’ రమణ అనో ఇప్పుడు ఏడ్పించలేను కదా! అసలు మృత్యువు అనే ఈగ, దోమ, నల్లి ఆ రోజుల్లో కనీసం మన వూహల్లో కూడా లేదు కదా! ఎంత పొగరుగా దాటేశాం యవ్వనాలు! వాటి నఖరాల తిల్లానాలు!
నువ్వు కవిత్వం రాసావో, కవిత్వంగా బతికావో, నువ్వు చలాన్ని చదివావో, చలంగా బతికావో, నీ నిశికవిత్వపు తమోనలంలో నిప్పు సెగవై తాకావో, నగరపు బతుకు తామరాకు మీద అంటీ ముట్టని మంచు బిందువై నెమ్మదిగా ఎటో జారిపోయావో, ఎవరు నేర్పారు నీకు ఈ అస్తిత్వ పాఠం?! ఎవరు వొంపారు నీలో ఈ నిబ్బరపు సెలయేరు? అసలు ఎవరు చెప్పారు నీకు –ఇంత సడీ చప్పుడు లేకుండా వస్తానని అయినా చెప్పకుండా వెళ్లిపోమని! వొక్క సారే వూపిరి తెంపుకునే నీ గుండెకి ఎందుకింత కాలంగా ఈ నిదానపు పాఠాలన్నీ నేర్పావ్?
యీ నిర్మాణాలూ ఈ ముళ్ళ కంచెలూ
యెట్లాగూ రక్షించలేవని తెలిసాక
నాలో భయం పోయింది
అని ఏణ్ణర్థం కింద ఎంత ధీమాగా ‘లంగరె’త్తావ్ బతుకు పడవకి!
గాలిపటం దారమింకా నా వేలికి చుట్టుకునే వుంది
అని అందంగా చెప్పావ్ సరే….
సుదూరపు తార చూపేదో నా ఆత్మకి గుచ్చుకుంటోంది…
అన్నావే, ఆ సుదూరపు తార యేదో అప్పుడే ఎందుకు చెప్పలేదు?
నా పాతికల్లో నీకు ఎన్ని వుత్తరాలు రాశానో గుర్తు లేదు. అవి సరిగ్గానే పోస్ట్ చేశానని గుర్తు. ఈ వొక్క వుత్తరం మాత్రం పోస్టు చేయలేనితనంతో వుక్కిరిబిక్కిరవుతోంది.
నా ముప్పయిల్లోనో, మూడు నెలలకిందనో యెన్ని సార్లు నీ మొబైల్లోకి మాటయి ప్రవహించానో గుర్తు లేదు, ఇప్పుడు నా గొంతులో నీ ఆ పది సంఖ్యలూ 9..8…4..9..6..0..0..5..4..7… అనుకుంటూ లుంగలు చుట్టుకుపోయి ఏడుస్తున్నాయ్!
వచ్చెయ్ రమణా, ఇంకెప్పుడూ నిన్ను వెక్కిరించనుగా!
వచ్చేయ్ రమణా, ఆ చావుని ఈగలాగా అవతలికి నెట్టేసి!
వచ్చేయ్ రమణా, “వచ్చే నెల మళ్ళీ ఫోన్ చేస్తాన్లే” అని ఈ సారి హడావుడిగా ఫోన్ పెట్టేయనుగా!
-అఫ్సర్
=================================================
అఫ్సర్,
మీరు వ్యక్తిగత అనుబంధాలగురించి ఎప్పుడు ఏ రూపంలో వ్రాసినా … అది మీ నాన్న గారైనా, నండూరి రామ్మోహనరావైనా, ఇప్పుడు రమణ గారైనా… మీ రచనలో ఒక ఆత్మీయ స్పర్శ కనిపిస్తుంది. అది మీ కవిత్వంలో అంతగా కనిపించదు. వస్తువు ఎంత దగ్గరగా అనుభూతి చెందినదైనా, అందులో కొంత Dispassionate Distancing కనిపిస్తుంది. Is it Conscious or Subconscious?
అభివాదములతో
మూర్తి గారు: బాగా గమనించారు మీరు! కవిత్వం రాసేటప్పుడు నేను ఎటో కొట్టుకుపోతాను…తట్టుకోలేను ఆ సునామీని! కానీ, వచనం నన్ను పట్టి నిలిపేస్తుంది ప్రతి వాక్యానికీ! ఎందుకిలా ఎందుకిలా అని నిలదీసి అడుగుతుంది. కవిత్వం ఇక రాయలేనేమో అన్న సందేహం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. బాధ పెడుతోంది. కాబట్టి, ఇప్పటికిప్పుడు కవిత్వం నా లోపల వొక దశ మాత్రమే!ఎప్పటికైనా నాకిష్టమయిన మజిలీ వచనమే!
తీరం చేరని ఉత్తరం దేక్కూ మొక్కూ లేకుండా నిన్ను చేరడం కోసం ఎక్కి ఎక్కి ఏడుస్తోంది
నిజమే ఒక్కోసారి ఈ వార్త అబద్దం అయితే బాగుండు అన్పిస్తది..కొన్నాళ్ళ కింద కొత్త గా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సారి ఎలాగయినా కవి శేషేంద్ర శర్మను చూడాలను కున్నా మరుసటి రోజు ఆయన లేడనే వార్త పేపర్ లో చూసా..ఒక నెల రోజులు కల్సి కాఫీలు తాగి బాబు నీ అడ్రెస్స్ ఇవ్వు నా కొత్త పుస్తకం పంపిస్తా అని ఉత్తరాన్ని జేబులు పెట్టుకొని నన్ను మర్చి పోయాడు కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ..అందుకే కవులని దగ్గరగా చూసి వారు పోయినప్పుడు బాధ పడకుండా వాళ్ళను పుస్తకం లో ఉన్న అక్షరాలుగా నే చూడడం అలవాటు చేసుకున్నా ఎందుకంటె ఆ పుస్తకానికి మరణం లేదు అలాగే రమణా..కు కూడా.. afsar నీ స్పర్శతో ఏడిపించావు పో ..రమణ పోలా ..ఇక్కడే ఉన్నాడు అభిమానుల ఊహల్లో ఎప్పటికీ
ఏమని చెప్పమంటారు ,మీరు ఏడుస్తూ అందర్నీ ఎదిపిస్తున్నరుగా. రమణ చనిపోలేదు .కవికి మరణం లేదు
రమణ మెత్తదనం, ఆత్మీయత, నెమలీక లాంటి స్పర్శాజ్ఞాపకం గుర్తుకొస్తే గొంతుకడ్డం పడుతోంది. అఫ్సర్ నీ దుఃఖం లో నేనూ భాగమౌతున్నా! రమణ కోసం కనిపించని కన్నీటి చుక్కల్ని రాలుస్తున్నా!
అఫ్సర్ గారూ, మనసంతా భారంగా అయిపోయిందండీ..! .
మూర్తిగారి మాటలతో నూటిశాతం ఏకీభవిస్తాను. ఒక్కో వాక్యమూ మమ్మల్నిక్కడ నిలిపి చదివించింది. మీ వచనానికే పదునెక్కువ.
ఇంకెప్పటికి చేరుకోలేని జ్ఞాపకాలు కొన్నుంటాయ్,.అవును అవి ఎప్పటికి జ్ఞాపకాలు మాత్రమే,.ఎంత దుఃఖిచినా అనుభవంలోకి రాలేవుకదా,..రాలేవని తెలిసినా దుఃఖాన్ని ఆపకోవటం కుదరదేమో,.. జ్ఞాపకాల్లో కొట్టుకుపోతున్నప్పడు మీ అక్షరాలెందుకో పదునుగా,ప్రత్యేకంగా మెరుస్తుంటాయ్,..రమణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ,…
మూర్తి గారూ, ఆలోచిస్తూనే వున్నా మీ వ్యాఖ్య గురించి! ఆత్మీయ స్పర్శ లేదనిపిస్తున్నదా? మరీ ఆత్మీయ సందర్భాల గురించి రాసినప్పుడు మాటలు పొడిగా వుంటాయి. కొన్ని కవితల్లో ఇలా కూడా జరుగుతున్నదేమో మరి?!
అఫ్సర్,
నా ఉద్దేశ్యంలో మీ సైద్ధాంతిక నిబద్ధత … పదాలవాడుక విషయంలో … ఏమైనా మీలోని కవి ఆవేశాన్ని నొక్కేస్తోందేమో నని. వచనానికి అలాంటివి అక్కరలేదుకదా. మనసులో ఉన్నది ఉన్నట్టు రాసుకోవచ్చు. ఎన్ని అనుకున్నా, అన్ని సందర్భాలలోనూ కొన్ని పదాలు భావాన్ని బట్వాడాచేస్తాయేమో గాని, భావోద్వేగపు తీవ్రతని బట్వాడా చెయ్యలేవు. నీళ్ళు అవే. కానీ ఎత్తునుండి పల్లానికి పడేటప్పుడు ఉన్న ఉద్వేగం మైదానక్షేత్రంలో ఉండదుగదా. అక్కడ మాటలుకూడా అలానే పడాలేమో! ఇది నేను అధిగమించలేని బలహీనత కావొచ్చు. కనుక నా పరిశీలన మీద దానిప్రభావం ఉంటుంది. దీన్ని మీరు పెద్దగా పట్టించుకోనక్కరలేదు.
పై అందరి అభిప్రాయలతోనూ ఏకిభవిస్తున్నాను. మీ వచనం మిమ్మల్ని మీరు గా నిలబెడితే మీ కవిత్వం మీనుండి మిమ్మల్ని విడదీస్తుంది. మీ “గోరీమా”, “ముస్తఫా మరణం” లోని ప్రతీవాక్యం కవితాత్మకంగా కలకాలం గుర్తుంటాయి. ఈ రమణ గారి గురించి విన్నాను కానీ ఒక్కసారైనా కలవాల్సింది అన్న భావన ఇప్పుడు మరీ బాధపెడుతోంది.
afsar garu intaku munde chadivanu kani malli chadavaalanipistundi. chanipoyina manishi manaku attyanta aatmeeyudainappudu aa badanu vaallatone panchukovaalanipistundi. naku meelage anipinchindi. malli okka saari tirigi vaste bagundu ani kaani rarani telisinappudu vaallake uttaram raasi mana manasuloni velitini panchukovaalanipistundi. meeru alaa rayadam baagundi.