ధారావాహిక నవల

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఐదవ భాగం

ఆగస్ట్ 2016

5

“యాక్సిడెంట్ ఇంపాక్ట్ డ్రైవర్ సైడ్ డోర్ ముందర అవడం చాలా అదృష్టం. అదే కొన్ని క్షణాల తరువాత అయ్యుంటే నిన్ను వంటినిండా గాయాల్తో చూడాల్సొచ్చేది!” అన్నారు మూర్తిగారు హాస్పిటల్లో హమీర్‌ని చూడ్డానికి వచ్చి.

రాత్రి పదకొండు గంటలప్పుడు జరిగిన ఆ యాక్సిడెంట్ స్థలానికి పోలీసులూ, ఆంబులెన్సూ, ఫైర్ ట్రక్కూ అయిదు నిముషాల్లోనే వచ్చినా, హమీర్‌ని బయటకు లాగడానికి గంటసేపు పట్టింది. ఆ ఇంపాక్ట్‌ని డోర్ హింజ్ వున్నచోట కారు ఫ్రేమే ఎక్కువ భరించినా, డోర్ కూడా వంకరపోయినందువల్ల అది తెరవడానికి సాధ్యమవలేదు. పైగా, అతని ఎడమ కాలు ఆ వంకర తిరిగిన కారు ఫ్రేములో ఇరుక్కుపోయింది. అందుకని చాలా జాగ్రత్తగా మెటల్ కట్టర్లని ఉపయోగించి అతణ్ణి బయటకు తియ్యాల్సొచ్చింది. పాసెంజర్ సైడ్ కూర్చున్న రోహిత్ మాత్రం వెంటనే తలుపు తెరిచి దిగిపోగలిగాడు. అతనికి దెబ్బలేం తగల్లేదు.

హమీర్‌ని వెంటనే స్ట్రెచర్‌మీద పడుకోబెట్టి ఆంబులెన్స్‌లో ఎమర్జెన్సీ రూంకి చేర్చారు. అక్కడ ఎక్స్-రే తీసి ఎడమ కాలు మడమ దగ్గర ఫ్రాక్చర్ అయిందని నిర్ధారించిన తరువాత రోహిత్ తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పాడు. వాళ్లు మెక్లీన్ నించీ అక్కడకు చేరుకునేసరికి ఒంటిగంట అయింది.

అతణ్ణి చూడగానే భవానిగారు దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. “నీకేమన్నా అయుంటే మీ అమ్మకి ఏం చెప్పుకోగలిగేవాళ్లం? నీకన్నా మీ అమ్మా, మేమూ ఎక్కువ అదృష్టవంతులం!” అన్నారావిడ.

***

మూర్తిగారు, భవానిగారు హమీర్‌ని తమతో పాటు ఇంటికి తీసుకెళ్లిన తరువాత ఇండియాలో వున్న సరోజ గారికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అని తర్జన భర్జనలు జరిగాయి. యాక్సిడెంట్ అని చెప్పగానే అతని కోసమే బ్రతుకుతున్న ఆవిడ గుండె తట్టుకోలే దేమో నని వాళ్ల భయం. చెప్పకపోతే, యాక్సిడెంటయిన తరువాత కోలుకునేదాకా గోప్యంగా వుంచారని తెలిస్తే ఆవిడకి కోపం రావడం ఖాయం. పైగా, ఈ పరిస్థితిలో అతనొక్కడూ ఎవరి సాయమూ లేకుండా ఒంటరిగా ఇదివరకులాగా అపార్ట్‌మెంట్‌లో వుండలేని పరిస్థితి. దానికి తోడు, ఇంకో రెండు వారాల్లో, క్రిస్‌మస్‌కల్లా హైదరాబాద్ వస్తానన్నవాడు అసలు రాకపోతే ఏ సాకు చూపించినా ఆవిడ తట్టుకోలేదు. ఆవిడని ఏదో ఒక మిషమీద రప్పిస్తే, మెల్లగా అర్థంచేసుకుంటారన్న నిర్ణయానికి వాళ్లొచ్చారు. అయితే, టిక్కెట్టుకూడా కొనుక్కున్న ప్రయాణాన్ని రద్దు చేసుకునేటంతటి బలమైన కారణాన్ని చూపించడ మెలా?

“రోహిత్ పెళ్లని చెబితే?” అన్నారు భవానిగారు. రోహిత్ అదిరిపడ్డాడు. అతను హమీర్‌కంటే ఏడాదే చిన్న.

“అబధ్ధం చెప్పినా అతికినట్లుండాలి! పెళ్లి విషయం ఇప్పటిదాకా చెప్పకుండా దాచినందుకు ఆవిడకి కోపమొస్తుంది. పైగా, ఇప్పుడేం ముహూర్తా లున్నయ్యని?” అన్నారు మూర్తిగారు.

“24న, 28న, దివ్యమైన ముహూర్తాలున్నాయి,” అన్నారావిడ. ఆ పెళ్లిళ్లకోసం ఇండియా వెడుతున్న తెలిసినవాళ్లని దృష్టిలో పెట్టుకుని.

“సరేలే! విదుషి పెళ్లికి క్రితం సంవత్సరం నాలుగు నెలలముందు చెప్పాం. ఆవిడ నెల ముందొచ్చి వున్నారు. ఆవిడకీ ఆలోచించే శక్తి వున్నదని మర్చిపోకు!” అన్నారాయన.

“జస్ట్ సర్ప్రైజ్ అని చెప్పండి!” అన్నది విదుషి. వాళ్లు వాషింగ్టన్ బెల్ట్‌వేకి అవతలపక్క అనాపోలిస్‌లో వుంటారు. హమీర్‌ని చూడడంకోసం ఆండ్రూతో కలిసి అక్కడికొచ్చింది. ఆ సలహా అందరికీ నచ్చింది. సరోజగారు ఎంత తరచి అడిగినా, క్రాస్ ఎగ్జామిన్ చేసినా అదేమిటో చెబితే అందులో సర్ప్రైజ్ ఏముంటుందని తిప్పికొట్టేలా కట్టడి చేసుకున్నారు.

“ముందు వాళ్లన్నయ్య శంకర్రావు గారితో మాట్లాడతాను! ఆయనకు చెబుతాను. అర్థం చేసుకోగలరు,” అన్నారు మూర్తిగారు.

***

“మూర్తిగారు నీతో ఏం చెప్పారు?” సరోజగారు శంకర్రావుగారిని అడిగారు క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా.

“నీతో చెప్పినదేనే,” అన్నారాయన ఇంక చెప్పడాని కేమీ లేనట్లు.

“నేను నీ పక్కనున్నప్పుడు సరే, నీ మొబైల్‌కి ఫోన్‌చేసి నాకు చెప్పద్దని ఏమైనా నీకు చెప్పారేమోనని!” ఆవిడకింకా జరగరాని దేదో జరిగే వుంటుందన్న అనుమానం పీకుతూనే వుంది. “సర్‌ప్రైజ్ అని నాకు చెప్పారు, సరే, అది ఎలాంటిదో నీ కేమైనా చెప్పారేమోనని!”

“హమీర్ గొంతు విన్నావు గదా, ఫోన్లో. మంచి సర్‌ప్రైజే అయ్యుంటుందిలే!”

“వాడి గొంతు విన్నాను, వాడి మొహాన్ని స్కైప్‌లో చూశాను గనుకనే మనసు కుదుటపడ్డది. కానీ, ఈ డిసెంబర్లో వాషింగ్టన్ వెళ్లాలంటేనే వణుకొస్తోంది. ఆ చలి అలవాటు పోయి పదేళ్లయింది. ఎలా తట్టుకుంటానో, ఏమిటో! పైగా, అప్పుడంటే స్వెట్టరూ, కోట్లూ వుండేవి. ఇప్పుడవి నా దగ్గరే మున్నాయి?”

“ఆ సంగతి వాడికి తెలియదుటే? వాడు అన్నీ రెడీగా పెడతాడులే!” అన్నారాయన ఈ శల్య పరీక్షని ఎంత త్వరగా పూర్తికానిద్దామా అని ఆత్రుత పడుతూ.

“పెళ్లి విషయమే అయ్యుంటుందంటావా, అన్నయ్యా?” ఆశగా అడిగారావిడ.

“అయ్యుంటుందిలే,” తటస్థంగా అన్నారాయన.

“ఇప్పటి కయినా చేసుకుంటానంటే సంతోషమే. నాక్కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది. సర్‌ప్రైజ్ అన్నారే గానీ ఎన్నాళ్లుండేలా పాక్ చేసుకోవాలో చెప్పలేదు.”

“ఒకవేళ పెళ్లే అనుకో, తాంబూలాలు పుచ్చుకోగానే వెంటనే వెనక్కి రావడమెందుకు? ఒక రెణ్ణెల్లయినా వుండేలా తయారుకా.  పెళ్లయిన తరువాత వాడితో గడపడానికి నీ కెక్కువ సమయం ఎలాగో వుండదు. అదేలే, అప్పుడు పెళ్లాంతో ఆ కొద్ది సమయాన్నీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది కదా అని, అంతే!”

“పెళ్లి అయితే మాత్రం, ఇక్కడే చెయ్యాలని చెబుతాను. నా కక్కడ ఎవరున్నారని? ఆయన చూసుకోవలసిన విషయం కాదూ, ఇది?” ఆవిడ కళ్లమ్మట నీళ్లు కారాయి. “పదేళ్లబట్టీ నన్ను చూసుకున్నవాడివి. నువ్వు పక్కన లేకుండా సంప్రదింపులు కూడా జరపడం నాకిష్టం లేదు. నువ్వేమో, నాతోబాటు రమ్మంటే రానంటావు!”

“నాకిప్పుడు అంత హఠాత్తుగా వీసా ఎక్కడ దొరుకుతుందే? ఎందుకయినా మంచిదని నీ మేనల్లుడు పాస్‌పోర్టొకటి రెడీగా వుంచబట్టి సరిపోయింది గానీ లేకపోతే అది వచ్చేదాకా ముందు ఆగాల్సొచ్చేది! అయినా, ఇప్పుడు స్కైప్ ఎలానూ వున్నది. నీ కొడుకుని తమ కొడుకులా చూసుకునే మూర్తిగారు, ఆయన భార్య వున్నారు. అంత అదృష్టం ఎందరికి దొరుకుతుంది చెప్పు? అయినా, ఈ కాలం పిల్లలు – నేను ఈ పిల్లనో, పిల్లాణ్ణో చేసుకుంటాను అంటూ ఒకళ్లని పట్టుకొచ్చి చెబుతుంటే తలూపడం తప్ప ఇక్కడే తల్లిదండ్రులకి ఇంకేం దిక్కూ వుండట్లేదు! అయినా, వాడు నీ మనసు నొప్పించే పని ఏమీ చెయ్యడులే!” చెల్లెలికి ఆయన భరోసా యిచ్చారు.

“రెండు వారాల్లో ఇక్కడ వుంటానన్నవాడు నన్నే అక్కడికి రమ్మంటున్నాడంటే పెళ్లి కోసమే అయ్యుంటుందిలే. వదినెని తీసుకెళ్లి మంచి పట్టుచీరెలు కొనుక్కొస్తాను పెళ్లికూతురుకి.”

“ఆ అమ్మాయి ఇండియనే అని ఎందు కనుకుంటున్నావు?”

“ఎలా రాసిపెట్టి వుందో ఎవరికి తెలుసు? అయినా, తెల్లపిల్లయినా ఇండియన్లని పెళ్లి చేసుకునేవాళ్లు పెళ్లిళ్లల్లో పట్టుచీరెలు కట్టుకుంటూనే వున్నారు – అమెరికా అమ్మాయి సినిమా కాలంనుంచీ!”

“మూర్తిగారి భార్యకి కూడా చీరె కొనాలి మర్చిపోకు!”

“ఎలా మర్చిపోతానురా? నువు ఆయనకి ఒక షేర్వాణీ కొని తీసుకురా. వాళ్ల రోహిత్‌ని విదుషి పెళ్లిలో క్రితం ఏడాది చూశాను గానీ సైజ్ చెప్పలేను. అవునూ, మర్చే పోయాను. రిటర్న్ టికెట్ ఏ తారీకుకి తీసుకున్నాడు? దానిబట్టయినా తెలుస్తుంది వాడి ఇంగిత మేమిటో!” ఆశగా అడిగా రావిడ.

“నీ టికెట్ చూడగానే వాణ్ణి నేనూ అదే అడిగాను. నువ్వు అమెరికన్ సిటిజెన్‌వి కాబట్టి అమెరికాలోకి అడుగుపెట్టాలంటే నువ్వు రిటర్న్ టికెట్ చూపించక్ఖర్లేదుట. తీరుబడిమీద కొంటా నన్నాడు. పైగా, ఇక్కడి కొచ్చినప్పుడు నీతో రెండు వారాలకంటే ఎక్కువ గడపలేక పోతున్నాట్ట. ఇలా చెప్పి నిన్ను తన దగ్గర వుంచుకోవడానికి ప్లాన్ వేస్తున్నాడు.”

“ఎండాకాల మయితే ఫర్లేదేమో గానీ, ఇది గట్టి చలికాలం. వాడా చిన్న ఎపార్ట్‌మెంట్లో వుంటాడు. నేనొక్కదాన్నీ బయటికి వెళ్లగలిగే ప్రసక్తి అస్సలు లేదు. వారంరోజులకన్నా ఎక్కువ అక్కడుంటే బోర్‌కొట్టి ఛస్తాను!”

“సరేలే, ముందు అక్కడకి చేరు. ఎన్నాళ్లుండడ మనేది అప్పుడు తెలుస్తుంది.”

ఆ క్షణం నించీ విమానం ఎక్కి వాషింగ్టన్ చేరేదాకా ఆమె మదిలో సుళ్లు తిరిగిన ఆలోచనలు ఆమె మొదటిసారి అమెరికా వెళ్లినప్పటివి కాదు. 2006లో ఆమె అమెరికానుండీ ఇండియా రావడాన్ని నిర్దేశించిన పరిస్థితులవి.

మూర్తిగారింట్లో మంచంమీద పడుకుని ఆమెకోసం నిరీక్షిస్తున్న హమీర్ మనసులోనూ ఏప్రిల్ 2006లో వాళ్ల జీవితాల్లో ఊహించని మలుపుని తిప్పిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్‌ని గూర్చిన ఆలోచనలే!

***

2006 ఏప్రిల్ నెలలో ఆ శుక్రవారం సాయంత్రం ఎప్పటిలాగానే హమీర్ స్నేహితుడింట్లో వున్నాడు. సరోజగారు అతనికి తొమ్మిది గంటలకి ఫోన్ చేసి తొందరగా రమ్మన్నారు. “డాడీ ఇంకా రాలేదేమిటో, శాన్ ఫ్రాన్సిస్కో నించీ ఎప్పుడో నాలుగ్గంటలకి రావలసిన ఫ్లయిట్. కొద్దిగా కనుక్కో,” అన్నారావిడ. ఉన్నది పక్క వీధిలోని స్నేహితుడి ఇంట్లోనే గనుక ఇంటికొచ్చి, ఆయన ఊరు వెళ్లేముందర ప్రింట్ చేసి ఇచ్చిన ఐటినరరీలో ఫ్లయిట్ వివరాలను పట్టుకుని ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లో చెక్ చేశాడు. అది రావలసిన సమయానికే వచ్చిందని తెలిసింది.

“ఫ్లయిట్ మిస్సయ్యారేమో!” అన్నాడు తేలిగ్గా.

“చేతిలో సెల్‌ఫోనుందిగా ఫోన్‌చేసి చెప్పడానికి!” అని ఆవిడ ఆయన సెల్ నంబర్ ట్రైచేశారు. నాట్ రీచబుల్ అని వచ్చింది. ఆవిడకి ఆదుర్దాతో చెమటలు పొయ్యడం ప్రారంభించాయి.

“మామ్, యు ఆర్ వర్రీయింగ్ అన్నెసెసరిలీ! అంకుల్‌కి కాల్‌చేస్తానుండు,” అని మూర్తి అంకుల్‌కి ఫోన్ చేసి చెప్పాడు.

మూర్తిగారి మనసులో సింపుల్ సినేరియో మెదిలింది. రామారావుగారు ఫ్లయిట్ మిస్సవడమే గాక వేరే ఫ్లయిట్లో వస్తున్నా కూడా ఫోన్ చేసి చెప్పడానికి సెల్‌లో బాటరీ అయిపోయి వుండొచ్చు. దానికి తోడు, ఆ క్షణాన ఆయన ఫ్లయిట్లో వుండివుండవచ్చు. “రెడ్ ఐ ఫ్లయిటున్నదిగా అక్కణ్ణించీ వచ్చేది, తెల్లవారిసరికల్లా మీ డాడీ ఇంట్లో వుంటారు చూడు!” అని పెట్టేశారు.

మరునాడు ప్రొద్దున్న ఏడుగంటలకే హమీర్ ఫోన్‌చేసి అప్పటికి కూడా ఆయన రాలేదని చెప్పిన తరువాత రకరకాల సినేరియోలను ఆలోచించాల్సిన అవసరం ఆయనకు కలిగింది.

రామారావుగారు స్పృహలోనే లేకపోవడంవల్ల ఆయన ఇల్లు చేరలేకపోయా రనుకుంటే, ఆయన్ని ఎమర్జెన్సీకింద హాస్పిటల్లో అడ్మిట్ చేసి, వాలెట్లో వివరాలనుబట్టీ ఇల్లు అడ్రస్ కనుక్కుని ఇంటికి ఫోన్‌చేసి చెబుతారు. రావలసిన ఫ్లయిట్లోనే వచ్చి, దిగిన తరువాత యాక్సిడెంట్ అవడంవల్ల ఇంటికి రాకపోయుంటే, లోకల్‌గా, ఎయిర్‌పోర్టునించీ వచ్చే దారిలోనే అది జరిగుండాలి. అలాగే జరిగుంటే, ఆయన్ ఫోన్ చెయ్యకపోవడంవల్ల ఆయన స్పృహలో లేరనుకోవాలి. అయితే, పోలీసులు అలాంటి యాక్సిడెంట్లకి నిముషాల్లో అటెండ్ అవుతారు గనుక అలాంటి దేమయినా అయ్యుంటే ఈ పాటికి ఫోన్ చేసితీరాలి. మరీ దురదృష్టకరమయిన వార్త అయితే ఇంటికొచ్చి చెబుతారు. ఇంటికొచ్చి తలుపెవరూ కొట్టలేదు గనుక కనీసం లోకల్‌గా అలాంటి దేదీ జరిగుండక పోవచ్చు. ఈ సినేరియో లన్నింటినీ ఫోన్లో చెప్పలేరు గనుక – అందులోనూ, కుర్రాడికీ, భయపడే అతని తల్లికీ – భవానిగారిని వెంట తీసుకుని మూర్తిగారు తొమ్మిదింటికల్లా రామారావు గారింటికి చేరారు. అక్కడికి చేరిన తరువాత సరోజగారి, హమీర్ల మొహాల్లో రామారావు గారొచ్చిన సూచనలు కనిపించకపోవడంతో ఆయన మనసులో అలజడి మొదలయింది.

“ఎయిర్‌లైన్‌కి కాల్‌చేసి కనుక్కోండి!” అని సలహా నిచ్చారు భవానిగారు. ఫలానా ఫ్లయిట్లో రామారావు అనే పాసెంజర్ వున్నారా అనడిగితే ఎయిర్‌లైన్ వాళ్లు చెప్పమన్నారు. ఆయన రాలేదని కుటుంబ సభ్యులు ఆదుర్దా పడుతున్నారని చెప్పినా ప్రయోజనమేమీ లేకపోయింది. పైగా, ముందు, పోలీసులకి మిస్సింగ్ పర్సన్ రిపోర్టిమ్మన్నారు.

పోలీసులకి ఫోన్ చేసేముందర, రామారావుగారు బిజినెస్ ట్రిప్‌మీద వెళ్లారు కాబట్టి ఆయన ఫ్లయిట్ ఎక్కేముందర చేసే పనులేమిటి అని మూర్తిగారు ఆలోచిస్తూ, ఐటినరరీని సరోజగారి దగ్గరినించీ తీసుకున్నారు. దాన్లో ఆయన వున్న హోటల్ వివరాలున్నాయి. వాళ్లకి కాల్ చేస్తే ఆయన అసలు చెకవుట్ చెయ్యలేదని తెలిసింది. ఆ రూమ్‌లో ఆయన వస్తువులు ఏవీ లేవనికూడా వాళ్లు చెప్పారు.  అయితే, అది అంత అనూజువల్ ఏమీ కాదని, మరీ ఎర్లీ ఫ్లయిట్ వున్నవాళ్లు అలా చెకవుట్ చెయ్యకుండా వెళ్లిపోతుంటారనీ కూడా చెప్పారు.

రెంటల్ కారు సంగతేమిటన్న అనుమానం ఆయన కొచ్చింది. వాళ్లకి ఫోన్ చేస్తే, దాన్నింకా రిటర్న్ చెయ్యలేదనీ, పైగా, చెప్పకుండా అద్దె కాలాన్ని పొడిగిస్తున్నారు గనుక పెనాల్టీలు పడతయ్యనీ వాళ్లు చెప్పారు.

“ఏదన్నా యాక్సిడెంట్లో ఇరుక్కుంటే ఈపాటికి ఫోన్ రావాలే!” అనుకుని, తను మిస్సింగ్ పర్సన్ రిపోర్టు నిస్తున్నాననీ, అందువల్ల భయపడాల్సింది ఏదీ లేదనీ, పోలీసులకయితే ఎయిర్‌లైన్ వాళ్లు తిన్నగా జవాబు చెబుతారనీ మూర్తిగారు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా సరోజగారి కళ్లవెంట నీళ్లు ధారగా కారాయి. హమీర్‌కి ఏంచెయ్యాలో తెలియక మైండ్ అంతా బ్లాంక్ అవగా శిలలాగా నిలబడిపోయాడు.

పోలీసులు ఇంటికొచ్చి వివరాలు – ఒడ్డూ, పొడుగూ, వయసు, ఫోటో – తీసుకెళ్లారు. అప్పటికి శనివారం రాత్రయింది. ఆ రాత్రి వాళ్లకి కాళరాత్రే!

మరునాడు ఆదివారం – మనిషి పతానూ లేదు, వివరాల్లోనూ మార్పూ లేదు. పోలీసుల ఎంక్వయిరీలో మూర్తిగారు అనుకున్నట్లుగానే రామారావుగారు రావలసిన ఫ్లయిట్లోనే గాక దానికి ముందు అటు గురువారంనాడు గానీ, తరువాత ఇటు శనివారంనాడు గానీ వాషింగ్టన్ వచ్చిన ఏ ఫ్లయిట్లల్లోనూ ప్రయాణించ లేదని తేలింది. ఆయన సెల్‌ఫోన్ “స్విచ్డ్ ఆఫ్” అన్న మెసేజ్ నిస్తూనేవుంది.

రెంటల్ కార్ లైసెన్స్ ప్లేట్ వివరాలని కూడా ఈ మిస్సింగ్ పర్సన్ రిపోర్టులో జేర్చారు. ఏ మారుమూలయినా ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యుంటే అది తప్పకుండా పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతుంది – ఎందుకంటే, ప్రతి కారుకీ వెహికిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VIN) వుంటుంది గనుక. అయితే, దేశవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ డేటాబేస్ లేకపోవడంవల్ల కొంచెం ఆలస్య మవచ్చేమో గానీ, ఇక్కడ రెంటల్ కార్ కంపెనీ, దానితో బాటు వాళ్ల ఇన్‌స్యూరెన్స్ కంపెనీ కూడా ఇన్వాల్వ్ అవడంవల్ల కనీసం దాని వివరాలన్నా తొందరగా దొరికే అవకాశ మున్నది.

శనివారంకన్నా ఆదివారం చాలా భారంగా గడిచింది. ఆయన భవానిగారిని అక్కడే వదిలి, మెక్లీన్లో తమ యింటికి వెళ్లి తనకీ, భవానిగారికీ బట్టలూ, వగైరాలు పట్టుకొచ్చారు. విదుషి కాలేజీలో వుండడంవల్ల రోహిత్ ఒక్కడినే ఇంట్లో వదిలి రావలసివచ్చింది. రోహిత్ హైస్కూల్లో జూనియర్. పై ఏడాది కాలేజీల్లో అడ్మిషన్లకి అప్లై చేసేటందుకు కావలసిన మంచి గ్రేడ్స్‌కోసం కష్టపడి చదవాల్సిన సంవత్సరం. అందుకని అతను స్కూలు మానకూడదు. రోహిత్ ఒంటరిగా వుండడానికి భయం లేదన్నాడు. రెండిళ్లవతల వున్న ఇంకో ఇండియన్ ఫామిలీకి తమ యింటిమీద ఒక కన్నేసి వుంచమని చెప్పి, ఆయనా, భవానిగారూ సరోజగారికీ, హమీర్‌కీ తోడుగా వుండడానికి వచ్చారు.

సోమవారం ఆయన సెలవుపెట్టారు. మంగళవారం ఇంటినుంచే పనిచెయ్యడానికి పర్మిషన్ తీసుకున్నారు. అది ఆ వారం చివరిదాకా సాగింది – రామారావుగారి గూర్చిన అప్‌డేట్స్ ఏవీ లేకపోవడంవల్ల.

మూర్తిగారు హమీర్ స్కూల్‌ ప్రిన్సిపల్‌ని కలిసి, పరిస్థితిని వివరించి, సహాయం చెయ్యమన్నారు. అతను స్కూల్‌కి వెళ్లినా చదువుమీద ఎలాగో శ్రధ్ధ చూపలేడు. దానికితోడు అందరూ అతణ్ణి, “అయ్యో పాపం!” అని ఒకపక్కనించీ అంటూనే వివరాలకోసం వేధిస్తారు. పైగా, అతను ఇంట్లో వుంటేనే సరోజగారికి కొంచెమయినా వూరట కల్గుతుంది.

అమెరికా వచ్చిన మొదటితరంలో చాలామందికిలాగే వాళ్లకి వర్జీనియాలోనే గాక అమెరికాలోనే చుట్టాలెవరూ లేరు. సరోజగారి అన్నయ్య హైదరాబాద్‌లో వున్నారు గానీ, ఆయనకి వీసా మాటటుంచి, పాస్‌పోర్టే వుండుండదు. అందుకని సరోజగారి, హమీర్ల భారాన్ని మూర్తిగారు, భవానిగారు తమ భుజాలమీద వేసుకున్నారు.

రోజులు వారాలయినట్లుగా వారాలు గడిచి నెలయ్యింది రామారావుగారి ఆచూకీ తెలియక. మొదటివారం గడవగానే, భవానిగారిని సరోజగారికి తోడుంచి, మూర్తిగారు అక్కణ్ణుంచే తన ఆఫీసుకి వెళ్లిరావడం మొదలుపెట్టారు. ఇంకో వారంకూడా గడిచిన తరువాత ఆయన హమీర్‌ని కూడా స్కూల్‌కి వెళ్లమని ప్రోత్సహించారు. ఆయన అనుకున్నట్లుగానే మొదటిరోజున స్కూల్లో కష్టపడ్డాడు గాని, ఒక వారం అయ్యేటప్పటికి స్కూల్‌కి వెళ్లడమే తెరిపి నిస్తోందని అతనికి అర్థమయింది.

మే నెల మధ్యలో మూర్తిగారు హమీర్‌ని ఒంటరిగా కూర్చోబెట్టి రాబోయే పరిస్థితులనీ, వాటి నెదుర్కొనే మార్గాలనీ వివరించి చెప్పారు.

“హమీర్! నీ వయసులో ఎవరూ ఇంత కష్టాన్ని ఎదుర్కొన గూడదు. కానీ, నువ్వు ఈ సుడిగుండలో ఇరుక్కున్నావు గనుక, దీన్నుంచీ బయటపడే మార్గాలని వెదక్క తప్పదు. మీ శ్రేయోభిలాషిగా నాకు తోచింది చెబుతున్నాను -

“దాదాపు నెల గడిచింది మీ నాన్నగారు మిస్ అయి. కారణం ఏమయినా గానీ, ఈ పరిస్థితి ఇంక మారదు అన్న నిరాశ నన్ను బలంగా చుట్టేస్తోంది. ఈ పరిస్థితిలో మీరేం చెయ్యగలరో ఆలోచించాలి.

“నీకు వర్జీనియాలోని యునివర్సిటీలోనే ఎలాగో అడ్మిషన్ వచ్చింది గనుక, నువ్వు జాయినవడం గూర్చే ఆలోచించాలి. అప్పుడు మీ అమ్మగారు ఎక్కడ వుంటారు, ఈ యిల్లు సంగతేమిటి, ఫైనాన్షియల్ ఇంపాక్ట్స్ ఏమిటి అన్న ప్రశ్నలకి జవాబులు వెదకాలి.

“ముందు ఫైనాన్సెస్ గూర్చి మొదలుపెడతాను. ఈ నెల యింటి మోర్ట్‌గేజ్ చెకింగ్ అక్కవుంట్లోంచి ఆటోమాటిక్ పేమెంట్లో వెళ్లిపోయుంటుంది. అలాగే, కారు పేమెంట్లూ, ఎలక్ట్రిసిటీ బిల్లూ, క్రెడిట్ కార్డు బిల్సూను. మీ నాన్న మార్చ్ నెలలో చేసిన పనికి శాలరీ ఏప్రిల్లో డిపాజిట్ అయ్యుంటుంది. ఏప్రిల్ నెలలో కొంతభాగం మాత్రమే పనిచేసినట్లు లెక్క కాబట్టి వాళ్ల కంపెనీ డిపాజిట్ చేసిన అమౌంట్ తక్కువే వుండుంటుంది – ఆయన వాడుకోని సెలవులని వాళ్లు అందులో జమకట్టివుంటే తప్ప. ఇన్‌కం లేకుండా ఇన్నిరకాల ఎక్స్‌పెన్సెస్ కడుతూ కూర్చోవడం కేవలం మీ నాన్నకున్న సేవింగ్స్‌తో ఎంతోకాలం జరిగే పని కాదు. అంటే, మీరు ఈ ఎక్స్‌పెన్సెస్ తగ్గించుకునే మార్గం చూడాలి.

“నువ్వు కాలేజీ కెళ్లిన తరువాత మీ అమ్మగారు అంత పెద్ద యింట్లో ఒక్కర్తీ ఎలానూ వుండలేరు. ఒకవేళ వుండగలిగినా కూడా ఆ ఎక్స్‌పెన్సెస్‌ని మీరు తట్టుకోలేరు! మీ నాన్న హైదరాబాద్‌లో ఒక ఎపార్ట్‌మెంట్ కొన్నారని నాకు చెప్పిన గుర్తు. పైగా, మీ మామయ్య అక్కడే వుంటారు కూడాను. అందుకని, మీ అమ్మగారు అక్కడుంటే, ఆవిడకీ, నీకూ కొంతయినా మనశ్శాంతి దొరుకుతుంది.

“ఇంక ఈ యింటి సంగతి. దీని ధర గత నాలుగేళ్లల్లోనే డబుల్ అయింది. మీ నాన్న ఈ యింటిని 1990లోనో ’91లోనో కొన్నారు. అప్పటినించీ ధరలు ఎలాగో పెరుగుతూనే వున్నాయి. అంటే, కొన్న ధరకి దాదాపు ట్రిపుల్ అయ్యుంటుంది. ఇంటిని అమ్మగా వచ్చే లాభంతో ఇటు నీ చదువూ పూర్తవుతుంది, ఆ సమయంలో మీ అమ్మగారి పోషణ భారం ఎవరిమీదా వుండాల్సిన అవసరమూ లేదు. దానికి తోడు ఆయన సేవింగ్స్ కొద్దో గొప్పో ఎలానూ వుంటాయి.

“మీ కాలేజీకి, నీ ఫైనాన్షియల్ స్టేటస్ మారిందనీ, ఇప్పుడు మీ కుటుంబానికి ఇన్‌కం ఏదీ లేదనీ, అందుకని నీకు అసిస్టెన్స్ కావాలనీ చెప్పాలి. గారంటీగా నీకు ఎంతో కొంత అసిస్టెన్స్ వాళ్లిస్తారు. దానికి కావాల్సిన సహాయాలని అన్నింటినీ నేను చేస్తాను – మొదటి సెమెస్టర్ ఫీజుతో కట్టడంతో సహా! వీలునిబట్టీ ఇద్దువుగానిలే. ఇవ్వకపోయినా నేనేం పట్టించుకోను. నువ్వు నాకు ఇంకో కొడుకు వనుకుంటాను.

“మొదటి సెమెస్టర్ తరువాత వింటర్ బ్రేక్‌లో వెళ్లి మీ అమ్మని చూడు. అలాగే సమ్మర్లో. థాంక్స్‌గివింగ్ బ్రేక్‌లకీ, స్ప్రింగ్ బ్రేకులకీ మా యింటికే వస్తావు.

“నువ్విప్పుడు చెయ్యాల్సిన పని – మీ యింటిని త్వరగా అమ్మకానికి పెట్టేలా తయారుచెయ్యడం – అంటే, ఎంతో ముఖ్యమైన వాటిని తప్ప మిగిలిన సామాన్లని వదుల్చుకోవడం.  బాగా ముఖ్యమైన వాటిల్లో నీతో తీసుకెళ్లలేని వాటినీ, మీ అమ్మగారితో పంపలేనివాటినీ మా యింట్లో పెట్టు. మహా అయితే ఒక నెల తీసుకో. జూన్ మధ్యలో అమ్మకానికి పెట్టినా ఈ హాట్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో వారంకూడా పట్టదు ఇల్లు అమ్ముడుపోవడానికి. అయినా, మీ డాడీ ఇంటిని బాగా మెయిన్‌టెయిన్ చేశారు గనుక దానికి ఇప్పుడు రిపేర్ల అవసరమేమీ లేదు. అది కూడా త్వరగా అమ్ముడుపోవడానికి ఒక ప్లస్ పాయింట్!

“మీ అమ్మకి తోడుగా వుండడంకోసం నువ్వు హైదరాబాద్ వెళ్లి చదువుకుందామని పొరబాటున అనుకుంటావేమో – అట్లాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలను దగ్గరకు రానివ్వకు. వర్జీనియా టెక్‌తో దీటు రాగల కాలేజీ ఏదీ అక్కడ లేదు. నీ భవిష్యత్తుకోసం మీ నాన్నా, నువ్వూ పడ్డ కష్టాలని వృధా కానివ్వకు. నువ్వు ఉద్యోగంలో చేరగానే మీ అమ్మగారిని నీ దగ్గరకు తెచ్చుకోవచ్చు.

“లాస్ట్ బట్ నాట్ లీస్ట్ – మీ నాన్నకి లైఫ్ ఇన్‌ష్యూరెన్స్ వుండేవుంటుంది. కానీ, మిస్సింగ్ పర్సన్స్ విషయంలో ఆ డబ్బుని మీరు కళ్లచూడడానికి ఏడేళ్లదాకా పట్టొచ్చు. ఈ లోపల లైఫ్ కొనసాగాలి కదా!”

మూర్తిగారు, రామారావుగారు పదిహేనేళ్లుగా మంచి స్నేహితులు. అభిప్రాయభేదాలు కూడా పెద్దగా చెప్పుకోదగినవి ఏవీ లేవు. ఈ దేశంలో జరగరానిది ఏమయినా జరిగితే అన్న విషయమై ఇద్దరూ చర్చించుకుని, ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. దాని పర్యవసానమే అన్ని అక్కవుంట్లనోనూ జాయింట్‌గా భార్య పేరుని రాయించడం, అలాగే, అన్ని హక్కులూ వుండేలా రెండో వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ నివ్వడం. ఆ చివరి కాగితమే రామారావుగారి ఇల్లు త్వరగా అమ్ముడు పోవడానికి సహాయం చేసింది. లేకపోతే, జాయింట్‌గా ఇంటి టైటిల్ వున్నా, ఆయన సంతకం లేకపోవడంవల్ల సరోజ గారొక్కరే ఆ యింటిని అమ్మడానికి చట్టం ఒప్పుకునేది కాదు.

ఇళ్లు ఎవరి సహాయమూ లేకుండా తమని తామే అమ్ముకుంటున్న కాలంలో ఇంటి నమ్మడానికి వారంకూడా పట్టలేదు. మూర్తిగారి స్నేహితుల్లో ఒక రియలెస్టేట్ ఏజెంట్ చాలా తక్కువ కమిషన్ తీసుకుని ఇంటి అమ్మకం పూర్తయ్యేలా చేశారు.

కాలేజీలో వున్నన్నాళ్లూ ప్రతి వింటర్ బ్రేక్‌కీ హమీర్ ఇండియా వెళ్లొచ్చాడు. ఒకసారి తప్ప ప్రతీ థాంక్స్‌గివింగూ మూర్తిగారింట్లో గడిపాడు. మూర్తిగారు ఫ్యామిలీ వెకేషన్‌కని ఎక్కడికి వెళ్లినా అతన్ని తమతోబాటు తీసుకునే వెళ్లారు. మొదటి సమ్మర్ బ్రేక్ మొత్తం హైదరాబాదులో గడిపినా, ఒక ఐటి కంపెనీలో తెలిసినవాళ్లవల్ల ఇంటర్న్‌షిప్ సహాయం లభించినా మూడునెలలు అక్కడ గడపడం నచ్చక, తరువాతనించీ రెండువారాలు మాత్రం అక్కడ గడిపాడు. మిగిలిన టైంలో మెక్లీన్లోనో, రెస్టన్లోనో, వాషింగ్టన్ డి.సి.లోనో ఇంటర్న్‌షిప్స్ చేస్తూ గడిపాడు.

అతని బాచెలర్స్ డిగ్రీ పూర్తయి ఉద్యోగంలో చేరగానే తల్లిని తీసుకొచ్చాడుగానీ, ఆవిడకి రోజంతా ఇంట్లోనే వుండడం బోర్‌కొట్టింది – ఎంతయినా రామారావుగారితో కలిసి అమెరికాలో జీవితాన్ని ప్రారంభించినప్పటి సంగతి వేరు, నాలుగేళ్ల గాప్ వచ్చిన తరువాత మళ్లీ కొడుకుతో మొదలుపెట్టడం వేరు. ఒకనెల అవగానే ఆవిడ ఇండియా వెళ్లిపోయారు – ప్రవచనాలు, ఆశ్రమాలు, తీర్థయాత్రలు, అంటూ.

తరువాత రెండేళ్లకి హమీర్‌కి మీనాతో పెళ్లి అన్న ఆశతో వచ్చారు గానీ, అది బెడిసికొట్టడంతో తిరిగివెళ్లిపోయారు. 2014లో విదుషి పెళ్లికోసం వచ్చివెళ్లారు. ఇప్పుడు ఇంత అర్జెంటుగా రమ్మనమనడం – అదీ సర్ప్రైజ్ అంటూ – కొద్దిగా గాభరా పెట్టించిన మాట నిజమే గానీ, హమీర్‌ని స్కైప్‌లో చూస్తూ మాట్లాడ్డం ఆమెకి కొంతయినా మనశ్శాంతిని కలిగించింది – అది, హమీర్‌ని వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో కాలికి కట్టుతో, వీల్‌ఛెయిర్లో చూసేదాకానే. పారిపోయాయనుకున్న దట్టమైన నల్లని మబ్బులు రివ్వున వచ్చి ఆమె కళ్లని చుట్టేసి వర్షింపజేశాయి.

[ఇంకా ఉంది...]