కిటికీలో ఆకాశం

దయనీయ వృద్ధాప్యాన్ని కళ్ళకు కట్టిన శివారెడ్డి పద్యం

ఆగస్ట్ 2016

నిషి జీవితానికి సంబంధించిన బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశలలో అత్యంత దయనీయమైన దశ ఏదంటే, అది నిస్సందేహంగా వృద్ధాప్యమే!

చూస్తూ వుండగానే, ఖడ్గ ఖచితంగా భ్రమింపజేసిన దేహం పటుత్వం తప్పి కదలికలను కట్టడి చేస్తుంది. విశాల లోకాన్ని చుట్టి వచ్చిన జ్ఞాపకాలు ఒక చిన్ని గదికి పరిమితమైన స్థితిని చూసి భోరున విలపిస్తాయి. చూస్తూ వుండగానే కనీస పలకరింపులు కూడా కరువయే అస్తిత్వం మరింతగా భయపెడుతుంది!

మ్యాథ్యూ ఆర్నాల్డ్ అంటాడు -

It is to spend long days
And not once feel that we were ever young;
It is to add, immured
In the hot prison of the present, month
To month with weary pain
(Growing Old)

చదువరీ! పై మాటలు చాలా నిస్తేజంగా, నిస్పృహతో నిండినవిగా అనిపిస్తున్నాయా?

అయితే, శివారెడ్డి రాసిన ‘వృద్ధాప్యం’ పద్యం చదవండి ఒకసారి.

మీరు ఇంకా మీ యవ్వనంలోనో, లేక నడి వయసులోనో ఉన్నట్లయితే, ఇది మీరు జీవితంలో తప్పకుండా చదవ వలసిన పద్యం. బహుశా, ఈ పద్యం మిమ్మల్ని భయపెట్టే పద్యం. మనమెవరమైనా, ఎంతటి ఆజానుబాహువులమైనా చివరాఖరున ఒకనాటికి దాటవలసిన ఈ భయానక అగాధ స్థితిని మనకు కరకు కరకుగా జ్ఞాపకం చేసే పద్యం ఇది. దయనీయ వృద్ధాప్య స్థితిని భౌతిక, సామాజిక, ఆర్ధిక, సకల మానవ సంబంధాల కోణాల నుండి దర్శించి వ్యాఖ్యానించిన అరుదైన శివారెడ్డి పద్యం ఇది. చదవండి!

వృద్ధాప్యం – కే శివారెడ్డి

వృద్ధాప్యం కుడితిలో ఈగ
వృద్ధాప్యం సంతానం సాలెగూట్లో పురుగు
వెచ్చదనం ఎటో ఎగిరిపోతే మంచుగడ్డ శరీరం
కళ్ళ ముందు పొంగి పొరలే కన్నీటి తెరలు
వృద్ధాప్యం మృత వృక్షం – కొడుకులూ కూతుళ్ళూ
చుట్టాలూ పక్కాలూ అందరూ నన్ను తెగ్గోసిన ప్రవాహం
అవతల గుడ్డి వెన్నెట్లో గుర్తు తెలియని మంచు తుంపరల నీడలు

వృద్ధాప్యం నరకకూపం మంచం
వృద్ధాప్యం సర్వ ప్రపంచం మంచం
ఇదొక బావి లోలోపలికి జారిపోయే కత్తుల ఊబి
పొలిమేరల్లేని నికృష్టపు ఏకాంతపు ఎడారి
క్షణ క్షణాత్మ హత్యా ఊహల
ఏవగింపుల విదిలింపుల చీదరింపుల బతుకు
పడి పోయిన నిస్సహాయ అవయవాలు
కదల్లేని శరీరాన్ని పట్టుకున్న చీమలు
మనుషులకి లోకువ చీమలకు లోకువ ఈగలకు లోకువ

మంచం దగ్గర నుండి మెల్లగా శరీరాన్ని
లాక్కొచ్చి గడప దగ్గరికి చేర్చితే
కూలిపోయిన శరీరాన్కి వాకిలి దివ్యనేత్రం
నా విశాల నేత్రం వాకిట్లోంచి చూస్తే
ఎదురుగ్గా చావిట్లో మేకుకు కట్టేసిన గేదె
ఉచ్చలో పేడలో రొచ్చులో అరుస్తూ మేకు చుట్టూ తిరుగుతూ
పెంటపోగు, పెంటపోగు పక్క మురిక్కాలవ- యింకాస్త జరిగితే దొడ్డి
మంచమూ – దొడ్డీ, ఈ రెండు ప్రపంచాల మధ్య
వేళ్ళాడే దండెం – ఎప్పుడో చచ్చిపోయిన ఈ ‘నేను’
తలెత్తితే – వాకిట్లోంచి కన్పించే బూరుజుముక్క – ఆకాశం
‘ఎవరదీ ఎవరదీ ‘ జవాబుల్లేవు
పశువుల మూగతనం కన్న రాళ్ళ మూగతనం కన్న
క్రూరాతిక్రూరమైన మనుషుల మూగతనం
ఎదుటివాడి సమాధానాన్ని బట్టి పోల్చుకోవాల్సిన స్థితిలో
సమాధానాల్లేవు – సమాధానాల్ రావు
ఒక రాక్షస నిర్లక్ష్యపు కదలికలే
నా చుట్టూ తగలబడుతున్న సంబంధాల కమురు కంపులే
కొడుకులంతా తండ్రులవగానే వాళ్ళ తలిదండ్రులు
సుఖంగా అకస్మాత్తుగా చనిపోవాలని మీరంతా ప్రార్థించండి
సంతానాలు నేరాలవుతున్నాయి
సంబంధాలు నేరాలవుతున్నాయి
వృద్ధాప్యం నేరమవుతుంది
జీవించడం నేరమవుతుంది
గోడ పక్కన విసిరేసిన పనికిరాని
తుప్పు పట్టిన చిల్లులు పడ్డ పాత డబ్బా ఈ వృద్ధాప్యం
దిక్కుమాలిన వృద్ధాప్యం – డబ్బులు లేని వృద్ధాప్యం!

కవి, పద్యం ప్రారంభంలోని మొదటి రెండు పంక్తులలో వృద్ధాప్యాన్ని ‘కుడితిలో ఈగ’, ‘సాలెగూట్లో పురుగు’ లతో పోల్చడంలోనే మనల్ని వృద్ధాప్య స్థితి ముందు నిలబెడుతాడు. వృద్ధులైన తలిదండ్రులను విదిలించ వలసిన పురుగులుగా చూసే సంతానాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘సంతానం సాలెగూట్లో పురుగు’ అంటున్నాడు. చెట్టంత ఎదిగిన మనిషిని, ఒక్కసారి వృద్ధాప్య స్థితిలోకి జారిపోయేక కొడుకులూ, కూతుళ్ళూ చుట్టపక్కాల నిర్లక్ష్యపు చూపులు అడ్డంగా తెగ్గోసి మృత వృక్షంగా మార్చివేస్తాయి అంటున్నాడు. మంచంలోని ముసలి దేహం చుట్టూ ముసురుకునే ఈగల్ని చూసి, ‘చీమలకు లోకువ ఈగలకు లోకువ‘ అని బాధపడుతున్నాడు. వృద్ధాప్యం కమ్ముకున్న దేహాన్ని ‘కూలిపోయిన శరీరం’ అనడం ఎంతగా గుండెని మెలిపెట్టే మాట.

స్వర్గమనీ, నరకమనీ ఏవేవో వర్ణిస్తారు గానీ, శక్తులన్నీ ఉడిగిపోయి, ఐదడుగుల మంచానికి పరిమితమయే జబ్బులు కమ్ముకున్న వృద్ధాప్య దేహాన్ని మించిన నరకం మరేం వుంటుంది? అందుకే కవి అంటున్నాడు – “వృద్ధాప్యం నరకకూపం మంచం / వృద్ధాప్యం సర్వ ప్రపంచం మంచం”.

బహుశా, వృద్ధాప్యం లోని రాత్రుళ్ళు మరింత నరకం. అందుకే, “ఇదొక బావి లోలోపలికి జారిపోయే కత్తుల ఊబి” అని వృద్ధాప్యాన్ని వర్ణిస్తున్నాడు!

కేవలం వృద్ధాప్యం లోని భౌతిక స్థితిని మాత్రమే వర్ణించి వదిలి వేయకుండా కాస్త ముందుకు వెళ్లి, “మంచం దగ్గర నుండి మెల్లగా శరీరాన్ని / లాక్కొచ్చి గడప దగ్గరికి చేర్చితే” అనుభవంలోకి వచ్చే దృశ్యాలను కూడా మన ముందు చిత్రిక కడతాడు కవి. “చావిట్లో మేకుకు కట్టేసిన గేదె / ఉచ్చలో పేడలో రొచ్చులో అరుస్తూ మేకు చుట్టూ తిరుగుతూ “ తన స్థితికీ, మంచానికి పరిమితమైన వృద్ధాప్యానికీ తేడా లేని చేదు నిజాన్ని చెబుతుంది.

కాదు – “పశువుల మూగతనం కన్న రాళ్ళ మూగతనం కన్న / క్రూరాతిక్రూరమైన మనుషుల మూగతనం” అవగతమై, చావిట్లో మేకుకు కట్టేసిన గేదె స్థితి కన్నా మంచానికి పరిమితమైన వృద్ధాప్యం మరీ దయనీయమైనదన్న సంగతి చెబుతుంది.

ఈ తెలిసి రావడం ఒక్కోసారి ఎంత నిస్పృహ లోకి నెట్టి వేస్తుంది అంటే – “కొడుకులంతా తండ్రులవగానే వాళ్ళ తలిదండ్రులు / సుఖంగా అకస్మాత్తుగా చనిపోవాలని మీరంతా ప్రార్థించండి” అనీ, “సంబంధాలు / సంతానాలు నేరాలవుతున్నాయి” అనీ లోకానికి బిగ్గరగా చెప్పాలని అనిపించేంతగా!

ఒక్కసారిగా మీదపడిన అలవలె చదువరిని విస్మయపరిచే ఎత్తుగడతో తీసుకువెళ్ళే ఈ పద్యం, ఒక భయానక సామాజిక వాస్తవాన్ని, సకల మానవ సంబంధాల లోని డొల్ల తనాలని కప్పి పెట్టి వుంచే, మనిషి వృద్ధాప్యాన్ని మరింత దయనీయం చేసే మాయతెర రహస్యాన్ని విప్పుతూ ముగుస్తుంది! బహుశా, అందుకే ఈ పద్యం ఆధునిక తెలుగు కవిత్వంలోని అపురూపమైన కవితలలో ఒకటి అయింది.

అవును -
మనిషికి ‘వృద్ధాప్యం దిక్కుమాలినదైతే’,
మరి, ‘డబ్బులు లేని వృద్ధాప్యం’?

(ఆగష్టు 6, కవి శివారెడ్డి 74 వ పుట్టిన రోజు )

***** (*) *****