నుడి

నుడి-11 (సెప్టెంబర్ 2016) & నుడి-10 (ఆగస్ట్ 2016) ఫలితాలు

సెప్టెంబర్ 2016


నుడి-10 (ఆగస్ట్ 2016) జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.

ఈసారి నుడిని ఆల్ కరెక్ట్ గా పూరించి విజేతలుగా నిలిచినవారు ఏడుగురు. వారు:
1. మాడిశెట్టి రామారావు
2. పి.వి.ఎస్. కార్తీక్ చంద్ర
3. జి.వి. శ్రీనివాసులు
4. నేత్ర చైతన్య
5. పి. రవిచంద్ర
6. పి.సి. రాములు
7. కె. రామేశ్వర్.

విజేతలకు అభినందనలు. కొన్ని ఆధారాలకు వివరణలను కింద యిస్తున్నాను.

1 అడ్డం: క్షీరభాండం కోసం పాకల పునర్నిర్మాణం చేసి, గారెను వెనక్కి తీసుకురావాలి (2, 3.) దీనికి జవాబు పాల కడవ.
వివరణ: ‘పాకల’ పునర్నిర్మాణం = ‘పాలక’. గారె (వడ)ను వెనక్కి తెస్తే ‘డవ’ వస్తుంది. పాలక + డవ = పాల కడవ

9 అడ్డం: తోట పరిసరాలుగా గల ముఠా అనంతంగా రుద్దుట (3). దీనికి జవాబు తోముట.
వివరణ: ముఠా అనంతంగా (చివర లేకుండా) = ము. దానికి ‘తోట’ను పరిసరాలుగా – అంటే ఇరువైపులా – అమర్చితే వచ్చేది తోముట!

11 అడ్డం: తర్వాత మళ్లీ కుళ్లిపో అనే చేతి ఆభరణం (2, 3)
వివరణ: తర్వాత = వెండి. మళ్లీ = వెండి. కుళ్లిపో = మురుగు. కాబట్టి, వెండి మురుగు అన్నది సమాధానం.

20 అడ్డం: ఉనికి స్థానం కోసం మాసానికి పక్కన సంవత్సరంలో రెండోది వచ్చి చేరింది (4)
వివరణ: మాసానికి = నెలకు. సంవత్సరంలో రెండోది (రెండో అక్షరం) = వ. నెలకు + వ = నెలకువ + ఉనికి స్థానం

21 అడ్డం: అందమైన కుక్కతోక చుట్టూ పోయి…. (3)
దీనికి సమాధానం చక్కని. చక్కన, చక్కగా, చుక్కతో అని నింపారు కొందరు.
వివరణ: కుక్కతోక = క్క. పోయి = చని. ‘క్క’కు చుట్టూ (అటూయిటూ) చని అమర్చితే వచ్చేది చక్కని = అందమైన!

23 అడ్డం: అవస్థలో సగం మరుగు (2). దీనికి జవాబు చాటు.
వివరణ: అవస్థ = అగచాటు. అందులో రెండవ సగం = చాటు = మరుగు

24 అడ్డం: గురువులు లేని బాలశిక్ష ఒకటి కాదు రెండు, కాదు చాలా ఎక్కువ (2)
వివరణ: బాలశిక్ష అన్న పదంలో బా,శి గురువులు (రెండు మాత్రలు కలవి). ల,క్ష లు లఘువులు. కనుక జవాబు లక్ష!

34 అడ్డం: కటిన కుండ అమర్చితే వచ్చే గమనం సాఫీగా ఉండదు (2, 3)
వివరణ: ఇక్కడ కటిన కుండ anagram. ఆ ఐదు అక్షరాలను జంబుల్ చేస్తే వచ్చే ‘కుంటి నడక’ సమాధానం.

36 అడ్డం: పూజ్యరహితమైన నికర సాయం సవరింపుతో చూపే కెమికల్ (4). దీనికి జవాబు రసాయనిక.
వివరణ: నికర సాయంలోంచి పూజ్యం (సున్న)ను తీసేసి సవరిస్తే వచ్చేది రసాయనిక. ఇక్కడ కెమికల్ నామవాచకం కాదు, విశేషణం.

5 నిలువు: పామిస్ట్రీ రెండవ భాగంలో ‘సగము’ (2)
వివరణ: పామిస్ట్రీ = హస్త సాముద్రికం. దీనిలోని రెండవ భాగమైన సాముద్రికంలో మొదటి సగం సాము. కనుక, అదే సమాధానం. ఇక్కడ చమత్కారమేమంటే, సాముకు సగము అనే అర్థం కూడా వుంది!

7 నిలువు: యుద్ధం లేకుండా పోతారు కానీ, దీనికి ఇరువైపులా అడ్డదిడ్డంగా తట్టు కల ఆర్థిక గడ్డుపరిస్థితికి పరిష్కారమా?
వివరణ: యుద్ధం = పోరు. యుద్ధం లేకుండా పోతారు అంటే, పోతారు మైనస్ పోరు = తా. దీనికి ఇరువైపులా తట్టు కలను తారుమారు చేసి అమర్చితే వచ్చేది తల తాకట్టు.

12 నిలువు: చిరుగుల చిన్న తీసివేత కారణంగా వచ్చే దురద (2)
వివరణ: చిన్న = చిరు. చిరుగుల మైనస్ చిరు = గుల = దురద

15 నిలువు: గ్రామం బయట పిసరు చుట్టూ ఊతల అమర్పు (5). దీనికి జవాబు ఊరవతల.
వివరణ: పిసరు = రవ లేక రవ్వ. రవకు అటూయిటూ ‘ఊతల’ను జంబుల్ చేసి అమర్చితే వచ్చేది ఊరవతల = గ్రామం బయట.

17 నిలువు: పహిల్వాను గారి వాహనం. ఆయన ఇందులో పోతారు. కాదు, వస్తారు సక్రమంగా (3, 2). దీనికి జవాబు వస్తాదు కారు.
వివరణ: ఇక్కడ ‘కాదు వస్తారు’ anagram. దీన్ని జంబుల్ చేస్తే వస్తాదు కారు వస్తుంది!

18 నిలువు: కరువు లేని చెరువుకట్ట పక్కన భూమిపత్రాలు ఎంజాయ్ చెయ్యడానికి పనికొస్తాయి (5). దీనికి జవాబు చెట్టపట్టాలు.
వివరణ: చెరువుకట్ట మైనస్ కరువు = చెట్ట. భూమిపత్రాలు = పట్టాలు. చెట్ట + పట్టాలు = చెట్టపట్టాలు.

19 నిలువు: ఇక్కడి చెట్టు చెడిపోతే ఇబ్బందే (3). దీనికి సమాధానం ఇక్కట్టు.
వివరణ: ‘ఇక్కడి చెట్టు’ మైనస్ ‘చెడి’ = ఇక్కట్టు = ఇబ్బంది!

23 నిలువు: చాచా! లాకుల ధర చాలా పడిపోయాక కత్తుల వెల నిలకడగా వుంది (3, 2)
వివరణ: ‘చాచా లాకుల ధర’ మైనస్ ‘చాలా’ = చాకుల ధర = కత్తుల వెల.

26 నిలువు: తాగునీటి బావిలో బాగునీటి జాడే లేకుంటే వచ్చే వాసన (2). దీనికి జవాబు తావి.
వివరణ: ‘తాగునీటి బావి’ మైనస్ ‘బాగునీటి’ = తావి

**** (*) ****