సాహిత్యమంటేనే సాహసం.
ఒకసారి సాహసాలు మొదలుపెట్టాక ఇక ఏదైనా ఒకటే అనుకోడానికి వీల్లేదని ఈ మధ్యనే తెలిసొచ్చింది. ముఖ్యంగా రేణుకా అయోలా లాంటి సీనియర్ కవుల కవితా సంకలనాలపై సమీక్ష రాయాలంటే చాలా ధైర్యం, పరిణతీ కావాలి. అది సాహసంకంటే ఎక్కువే అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
ఆమె “లోపలి స్వరం” వినడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా ఆ పుస్తకం హార్డ్ కాపీ దొరక్కపోయినా, సమయానికి కినిగె వారు ఆదుకోవటం శుభసూచకం. అయితే ఈ రోజుల్లో వస్తున్న మిగతా సాహిత్యంలా కాక మనసుపెట్టి చదవాల్సిన కవిత్వం కావటంతో ఈ సమీక్ష మీముందుకు రావటానికి అనుకున్నదానికంటే చాలా ఆలస్యమయింది.
(రేణుకా అయోలా)
సంపుటిలోని ఏభైఏడు కవితలూ దేనికదే. అన్నీ పట్టిపట్టి చదవాల్సినవె.
పుస్తకంలోని ఏభైఏడు కవితలూ ఏభైఏడు కథలు..ప్రతీ కవిత చివర్న ఆ కథ -అదె కవిత-నేపథ్యాన్నివ్వటంతో ఆ కథ పూర్తిగా చదివామన్న తృప్తి మిగులుతుంది. రెండో కవితనుంచే కథల్లో మన ప్రయాణం మొదలు…..
రంగులరాట్నం తిరగటం మొదలయింది.
సంపుటి ప్రారంభంలోని “ముఖం” కవిత పుస్తకానికి మంచి ముఖాన్నె ఇచ్చింది.
“జ్ఞాపకాలలో నలుగుతున్న ఆ ముఖం కనపడగానే
ప్రపంచం తెలిసిపోయినంత ఆనందం”
ఇంతవరకూ మనం కవిత్వాన్ని దేనికోసం చదివినా ఇప్పుడు మాత్రం ‘అందమైన కవితల’ కోసం చదవడం అంటే ఏంటో అవగతమవుతుంది. ప్రతీ కవిత అందంగా ఉండి మనకో అందమైన అనుభూతిని మిగిల్చిన సంకలనం లోపలి స్వరం.
‘నాపేరు కాలం’ కవితలో (పేజీ 25)
“ఆకుని చేతిలో వుంచుకుని నిమిరి చూడు
ఈనెల స్పర్శలతో జీవితాలు బయటపడతాయి” లాంటి వాక్యాలు మనల్ని ఈ కథా కవితల ప్రపంచానికి సాదరంగా ఆహ్వానిస్తాయి. జీవితంలోని రంగురంగుల కథలన్నీ ఇక్కడ అగుపడతాయి. కాలానికెప్పుడూ ఓ కథుంటుంది. కాలమెప్పుడూ కథల్ని చెప్తూనే ఉంటుంది. చాలా మంది ఇప్పటికే ఆ కథల్ని చెప్పినా మళ్ళీ ఈ కాలం కథ వెనక్కెళ్ళి (కాలంలో) మరీ చదవతగ్గది. కాలం ఆత్మకథ ఈ “నాపేరు కాలం”కవిత.
ముందుకెళ్తున్నకొద్దీ కవితలు మరింత చిక్కనై మనలో గాఢముద్రవేసుకుంటూనే కవిత్వహాయినింపుతుంటయి. “ఖాళీమాటలు” కవిత పేరుకి అలా ఉన్నా ఖాళీతనమే0 లేకపోగా కవయిత్రి కవిత్వాన్ని చెయ్యిపట్టుకుని నడిపించిన విధానం కొత్తతరం కవులకి ఓ పాఠ్యాంశంగా చెప్పదగిన కవిత.
“తెగిన మువ్వలొ కూడా/ నాట్యపు తిరస్కారం ఉంది”
“నిదానంగా నడుస్తున్న పొద్దు/మత్తుగా పడిఉన్న వెన్నెల రాత్రులు
ఇవన్నీ జ్ఞాపకాలె…” ఈ వాక్యాలు మనల్ని మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి.
జ్ఞాపకాలంటే గుర్తుకొచ్చింది. ఈ పదం చాలా సార్లు వినిపిస్తుంది ఈ లోపలిస్వరంలో.
స్వగతంలాంటి ఈ లోపలి స్వరంలో నోస్టాల్జియా జీర ఓ స్వరస్థాయి ఎక్కువగానె పలికింది. పుస్తకమంతా చదివాక మన మనసు మనల్ని వదిలి గతంలోకి నెమ్మదిగా జారిపోయె సెడటివ్స్ చాలానే ఉన్నాయి.
“గాయం”, “పాతఫోటో”, “ఒంటరినౌక”, “మతాతీతం”, “మరణం తర్వాత”, “చెట్టుకథ” ,”మూడుచక్రాల సైకిలు”, “హైదరాబాదీ!” “అమ్మ వెళ్ళిపోయింది” ఇలా ఈ లిస్ట్ లో చాలానే చెప్పాల్సివస్తుంది.
57 కవితల్లోనూ భావుకత ఏ ఒక్కకవితలోనూ మిస్సవ్వకపోవటం పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివించటంలొ తోడ్పడింది. “వెన్నెలదీపం” కవిత ఈ సంకలనానికే మణిహారం.
ఇందులోని
“రాత్రిని దాచి/పగలుని పరచి/ మళ్ళీ వివశత్వంలొ పడేసింది
తడిగడ్డిలొ/వెన్నెల మిగిల్చిన ఆనవాళ్ళు
అడవి జార్చిన పచ్చని కోక చెంగులో ఒదిగి
పిల్ల కాలువల్లొ ఈతలుకొట్టీ
అపూర్వమైన స్నేహమంత్రాలు జపిస్తూ
గుండెల్లొ నింపుకుని
తనువు నిండ అడవిని చుట్టుకుని…..వచ్చాను
సిమెంటు పంజరంలోకి మనసులేని చిలుకనై-”
కవిత్వంలోని గొప్పదనమిదె. ఒకసారి మనసుపొరల్లోకి చేరి అక్కడ సెటిలయితే ఆ చెమ్మ జీవితాంతం పర్చుకుంటుంది. ఈ వాక్యాలు ఇక మన సొంతమే.అవి మనవే. ఎందుకంటే ఆ భావనలన్నీ మనసుభాషలోకి అప్పుడే తర్జుమా అయిపోయాయి. మనసుపై కవయిత్రి ఆటోగ్రాఫ్‌గా నిలుస్తాయి.
“తడిగడ్డీ, వెన్నెల ఆనవాళ్ళు, అడవి జార్చిన కోక చెంగు, తనువు చుట్టుకున్న అడవీ, సిమెంటు పంజరం, మనసులేని చిలుక” ఇలాంటీవి మనఓపిక్కొద్దీ ఏరుకోవచ్చు ఈ సంకలనంలొ.
ఇంతకంటే కవిత్వం నుంచి ఆశించేదించేదెముంటుందని?
కవిత్వ మెకానిజం రెండుభాగాలుగా ఉంటుంది. ఒకటి కవి తనుచూసిన విషయాన్ని తనదైనశైలిలో భాషలో తనకే ఆనందమనిపించేంత రసాస్వాదనతో రాయటం (ఫలితంతో సంబంధంలెకుండా). రెండు– ఆ కవితని చదివిన పాఠకుడు ఆ సారాన్నంతా తనలోకి ఒంపుకుని అంతె లేదంటే ఇంకా ఎక్కువగాకానీ, రసస్వాదనతో ఆనందించగల్గటం తో ఆ కవిత పూర్తవుతుంది. రేణుకా అయోలా లోపలిస్వరానికి ఇది నూరుపాళ్ళు సరిపోతుంది. కవయిత్రిగా ఆమె రెండూ సాధించారు.
పాఠకులె కాదు తోటి కవులూ ఈ లోపలిస్వరంతో స్వరం కలపాల్సిందె.
“నాకలం ఆగిపోతుంది” ఇందుకు మంచి ఉదాహరణ—
“అక్షరాలు నాతో మాట్లాడటం
మొదలుపెట్టినప్పుడు/ నాలో యుధ్ధం మొదలవుతుంది”
అంటూ మొదలుపెట్టి
“అవి మాట్లాడటం మొదలుపెడితే నా కలం ఆగిపోతుంది” అని ముగుస్తుంది కవిత. మంచుముద్దని నోట్లో వేసుకున్నాక మాట్లాడమంటే ఎలా ఉంటుందో అలానె ఉంది ఈ వాక్యాలపై స్పందించాలంటే..ఆస్వాదించటం తప్ప!
పుస్తకానికి ముందుమాట రాసిన కవిమిత్రులు వాడ్రేవు చినవీరభద్రుడిగారి మాటల్లో ” ఇంద్రియ చైతన్యం బలంగా ఉండె కవి అన్నింతికన్నా ముందు తన దైనందిన జీవితాన్నే చిత్రించడానికి ఇష్టపడతాడు. మామూలు రోజువారీ జీవితాన్నే ముందు తానుకొత్తగా చూసి అప్పుడు మనకి కూడా కొత్తగా చూపిస్తారు. అటువంటి ప్రయత్నం చేసినవాళ్లనే ప్రపంచం కవులుగ గుర్తిస్తోంది” అక్షరసత్యమంటే ఏంటో తెలుస్తుంది. రేణుకా అయోలా కవిత్వం దీనికెమాత్రం దూరం జరగలేదు.
మాములు దైనందిన జీవితంలోని విషయాలనే కవితా వస్తువులుగా తీస్కున్నాక వాటిని అందంగా ప్రెజెంట్ చెయ్యగలగట కవికి కత్తిమీద సాము. పాఠకులకి ముందె తెల్సిన విషయాన్ని కవిత్వంలొ ఓకథగా చెప్పటం అదీ అందంగా చెప్పటం ఈ లోపలి స్వరం ప్రత్యేకత.
వర్షం ఎప్పుడు కురుసినా ఎలా కురిసినా వాన వానె. వర్షంపై ఎవరు రాసినా అది నాదృష్టి దాటిపోదు.
“వానస్పర్శ” కవితలో
“తడుస్తున్న పూలకొమ్మల్లో నేను
పువ్వునై తడుస్తుంటాను…
సందడి చేసి వెళ్ళిపోయిన వానకి గుర్తులు
ఇంటి చూరుల్లో రాలుతున్న నీటిబుడగలు” వాక్యాలు మనల్ని మళ్ళీ వానలో తడపకమానవు.
రంగులరాట్నం ఇంకా తిరుగుతూనె ఉంది…దాంతో పాటు నేనూ!
సంకలనంలో కవితల శ్రేణి విస్తారంగా ఉందనడానికి నిదర్శనంగ కొన్ని కవితలని చెప్పకతప్పదు.
“ప్రార్ధన”, “మతాతీతం”, “చెట్టుకథ” లాంటీవి కవయిత్రి సామాజిక స్పృహ విషయాలపై ఎలా అందంగా చెప్పాలో చూస్తాం.
“ప్రేమకట్టడం” కవిత తాజ్ మహల్లో మనంచూడని కొత్తకోణాన్ని భావుకత్వంగా చూపటం మనపై చెరగని ముద్ర వేస్తుందనటంలొ అతిశయెక్తిలేదు.
“శరీరం శిధిలమై చరిత్రలో భాగమైపోయింది
ప్రేమ సజీవమై పాలరాతి గుండెలో ఒదిగిపోయింది
***
కఠినశిలలు మోసిన కూలీల చెమటధారలు
చలువరాతి పలకల కింద నలిగిన బతుకుల ఆనవాళ్ళు”
ఇలా ఈ కవితలో ఏ ఒక్కవాక్యాన్నో ఉటంకించి వదిలేస్తే కవితకి అన్యాయం చేసినట్లే..కవితలో ప్రతి పదం తాజ్ మహల్ అంత అందంగా చెక్కబడింది. ఈ కవితని ఇప్పటికి నాలుగుసార్లు చదువుకున్నాను. ఇంకా చదువుకుంటూనె ఉన్నాను. నన్నడిగితే ఆంధ్రదేశంలొని ప్రతి పాఠకుడూ, కవీ తప్పనిసరిగా చదవాల్సిన కవిత ఇది. అది రేణుక గారికోసమె కాదు తాజ్ మహల్ కోసమూ, అందమైన కవితా వస్తువుని కవితలో ఎలా డీల్ చెయ్యాలొ తెల్సుకోవడం కోసమూ…
“జారుతున్న మంచుదుప్పటిలొ
ఉదయించే సూర్యకిరణాల వెచ్చదనంతో
ధ్యానంలొ నిమగ్నమైన యోగిలా…” ఆ ప్రేమకట్టడం ఉందన్న విషయం గగుర్పాటుకి గురిచేసింది.
ఈ కవిత చదవాగానే మనలొ మనమె “వావ్” అని అనుకోకుండా ఉండలేం.
తాజ్ మహల్ చూసినప్రతిసారీ విన్న ప్రతిసారి మనకీ వాక్యాలు గుర్తురాకమానవు. అలా రాలేదంటే అది కవయిత్రి తప్పుకాదు. పాఠకులదె. ఈ ఒక్క కవితకోసమైనా ఈ పుస్తకం మన ఇంట్ళో ఉండాల్సిందె.
ఇంకా ఈ సంపుటిలో చాలా కవితలు చెప్పుకోదగ్గవ్ ఉన్నా అన్నీ నేనే చెప్పెస్తే ఇక మీరు పుస్తకం కొనరేమోనని సంశయం. కాబట్టి వెంటనే మీరు దగ్గరలోని బుక్ షాప్‌కెళ్ళి “లోపలిస్వరా”న్ని మీ సొంతం చేసుకోండి.
రంగులరాట్నం ఆగింది, ఊపిరితీస్కోడానికన్నట్టు.
ఇక నేను చెప్పకూడదనుకున్న విషయాలు:
నేను ఇంతకుముందు రాసిన సమీక్షల్లో ప్రతిసారి అభ్యంతరం అని చెప్పే విషయం కవితల సంఖ్య. అది ఇప్పుడూ ప్రస్తావనకు వచ్చింది. నా ఉద్దేశ్యంలొ ఇన్ని కవితలు అవసరంలేదు.మనం చెప్పదల్చుకున్నది రాశిలో కంటే వాసిలోనే చెప్పగలగాలి కాబట్టి పాఠకులకి విసుగుపుట్టేన్ని కవితలని ఒక పుస్తకంలోనే చెప్పేయాలనుకోనఖ్ఖర్లేదెమో….ముఖ్యంగ ఒకే మూసలొ సాగుతున్న కవితలని ఏకబిగిన ఏ పాఠకుడూ చదవరు కాబట్టి కొన్ని కవితలని మినహాయించి ఉండాల్సింది.
అలాగే జ్ఞాపకాల్లాంటి పదాలు చాలా సార్లు విన్పడతాయి దాంతో ఇది నోస్టాల్జియా కవితల సంకలనంగా పాఠకులు అనుకునే అవకాశం ఉంది. అయితే పుస్తకం టైటిల్లోనె “లోపలి స్వరం” అని రాసాం కదా అని అనొచ్చు. కానీ ఒకే రాగంలొ ఎన్ని కీర్తనలు వినగలం చెప్పండీ?
అయితే ఇవన్నీ మనం పుస్తకాన్ని తెచ్చుకుని చదివి ఆస్వాదించటంలొ ఎటువంటీ ఇబ్బందీ పెట్టవు.
ప్రతులకు:
పాలపిట్ట బుక్స్ 16-1-20//1/1, 403,విజయశ్రీ రెసిడెన్సి , సలీం నగర్, మలక్ పెట్, హైదరాబాద్.-36
వెల: Rs. 60
వాసుదేవ్ గారు బాగా చదివారు అంతకన్నా బాగా విశదీకరించారు
అభినందన్లు… అభినందనలు… అభినందనలు
మీకు … వాకిలికి… రేణుకా అయోలాకు
రేణుకా గారి కవితలను మీ పలుకులలో చదువుతుంటే బాగుంది.మీ ఇద్దరికి అభినందనలు.
జాన్ గారూ మీ అభినందనలు అందాయి.మీరిస్తున్న ప్రోత్సాహమూ ఉత్తేజితుణ్ణి చేసింది.కృతజ్ఞతలు.
మనవిరామ గారూ కృతజ్ఞతలు.స్పందనలు మన బాధ్యతని పెంచినా సంతోషమె.
కవితలు ఎన్నైనా పాఠకులవి కూడా భిన్న స్వరాలు కదా! ఎవరికి ఏ కవిత నచ్చుతుందో ముందే ఎలా చెప్పగలం? ఎవరికి నచ్చిన కవితలు వారు చదివి ఆనందిస్తారు. లోకో భిన్న రుచి! అవును అన్ని కవితలు ఒకేసారి చదవటం కష్టమే. ఒక్కసారిగా చదవాల్సిన అవసరమూ లేదు.
మీ సమీక్ష చేయి పట్టుకుని పుస్తకపు పేజీల గుండా తిప్పి తీసుకెళ్లింది. చాల సరళమైన సమీక్ష. ఆసక్తికరంగా సాగింది. ఇంత చక్కటి కవితలందించిన రేణుక గారికి అభినందనలు.
రావుగారూ ధన్యోస్మి.పుస్తకంలో కవితల సంఖ్యకూడా మీరన్నట్టు లోకోభిన్నరుచే.అందుకే నా అభిప్రాయం మాత్రం అన్ని ఒకే పుస్తకంలో అనవసరమేమో అని.మీ అమ్యూల్యమైన అభిప్రాయానికి కృతజ్ఞతలు.
అంతకు ముందే ఆవిడ కథలూ, కవితలూ నేను అప్పుడప్పుడు చదివినా రేణుక గారితో వ్యక్తిగత పరిచయం రెండు, మూడేళ్ళ క్రితం ఆవిడ మా హ్యూస్టన్ వచ్చినప్పుడు కలిగింది. ఆవిడ ఊళ్ళో ఉన్నారని తెలియగానే, మా “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య కార్యక్రమానికి ఆవిడని ఆహ్వానించి స్వయానా ఆమె “స్వరం” లోనే ఆమె కవితలని విని ఆస్వాదించే అరుదైన అవకాశం మా అందరికీ అప్పుడు కలిగింది. ఆ రోజు ఆమె తన కవితలను చదివిన తీరూ, ఆ నాటి విశ్లేషణా కార్యక్రమంలో ఆవిడ పాల్గొన్న తీరూ వలన ఆమె ఎంతో విశిష్టత గల రచయిత్రి అని మాకు ప్రత్యక్షంగా తెలిసింది.
నేను ఇటీవల హైదరాబాదు వెళ్ళినప్పుడు, ఎంత ప్రత్నించినా ఆమెకి కలుసుకోవడం కుదర లేదు. కానీ, ఆమె నేను పాల్గొంటున్న ఒక సభకి స్వయంగా వచ్చి, తన “లోపలి స్వరం” కవితా సంకలాన్ని నాకు అందజేసి. నన్ను గౌరవింఛారు. అమెరికా వెనక్కి తిరిగి వచ్చాక రేణుక గారి “లోపలి స్వరం” కవితా సంకలాన్ని నేను ఇప్పటికి నాలుగు సార్లు చదివి అప్పుడప్పుడు ఊహా లోకంలో విహరించి (ఉదా: కవి లోకం, కొత్త ఉదయం పుట్టుక) , అప్పుడప్పుడు భావోద్వాగానికి గురి అయి (ఉదా: అచ్చం గాంధీ గారిలా, పాత ఇల్లు), అప్పుడప్పుడు ఆ కవితా ధారకి పరవశించి పోయి (ఉదా: వాడితో నా ప్రయాణం, రాయ వలసిన వాక్యం), అప్పుడప్పుడు ఆ కవితలలోని చిత్తశుధ్ధికి (ఉదా: వాన స్పర్శ, నా పేరు కాలం) మెచ్చుకుంటూ మొత్తానికి మహదానందపడ్డాను. నాకు బాగా నచ్చిన మరొక అంశం ఈ కవితా సంకలానికి పెట్టిన “లోపలి స్వరం: అనే పేరే! రేణుక గారి చిత్తశుధ్దికి అంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?
ఇప్పుడు ఆ కవితా సంకలనం వాసుదేవ్ గారు అతి చక్కటి శైలిలో వ్రాసిన సమీక్ష కూడా నాకు మహదానందాన్ని కలిగించింది. ఎందుకంటే, వాసు దేవ్ గారు ఈ కవితలని చాల మంది సాధారణ సమీక్షకుల లాగా కాకుండా, పదే, పదే చదివి, ఆస్వాదించి, ఆకళించుకుని వ్రాసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మంచి కవితలని వ్రాయడం ఒక ఎత్తు అయితే, ఆ ఎత్తుని అందుకోవడం మరొక ఎత్తు….
రేణుక గారికీ, వాసుదేవ్ గారికీ పత్రికా ముఖంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇట్లు,
వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్, టెక్సస్.
రాజుగారూ ధన్యవాదాలు. మీ ఆత్మీయక్షరం నా శ్రమకి తగ్గ ఫలితాన్నిచ్చింది.
మంచి లైన్స్ కోట్ చేసారు.”కాలానికెప్పుడూ ఓ కథుంటుంది. ఈ వాక్యాలు ఇక మన సొంతమే”
ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది మీ సమీక్ష.
ప్రవీణగారూ షుక్రియా..మంచి లైన్స్ రాసిన రేణుకగారిదే ఆ క్రెడిట్ అంతా
Wow…ఎన్నేసి అందమైన భావనలు….ఖచ్చితంగా ఈ పుస్తకం చదవాల్సిందే!
వాసుదేవ్ గారు, మీ సమీక్ష కూడా అంతే అందంగా వుంది….మంచి మంచి వాక్యాలెన్నుకున్నారు మా అందరి చేత చదివించేలా!
“ఒకసారి మనసుపొరల్లోకి చేరి అక్కడ సెటిలయితే ఆ చెమ్మ జీవితాంతం పర్చుకుంటుంది. ఈ వాక్యాలు ఇక మన సొంతమే.అవి మనవే. ఎందుకంటే ఆ భావనలన్నీ మనసుభాషలోకి అప్పుడే తర్జుమా అయిపోయాయి.” – Nice lines !
మోహనతులసిగారూ..కొంతగ్యాప్ తర్వాత మీ పునర్దర్శనం ఇలా రావ(య)టం భలేనచ్చింది.ఔనండీ తప్పనిసరిగా వినాల్సిన స్వరం.
సోదరా ….బాగా పరిచయం చేశావు ….జ్యూస్ మొత్తం రుచిచూపెట్టావు ..ధన్యవాదాలు