హమీర్‌కి పూర్తిగా నయమయ్యేదాకా వుండమని సరోజగారికి ఎవరికయినా చెప్పాల్సిన అవసరమేముంది? యాక్సిడెంట్‌కి ముందులాగా అతను తన పని తనే చేసుకోగలిగిన పరిస్థితిలో లేడు. తగిలిన దెబ్బ ఎంత ఎడమకాలికే అయినా, బ్రేకుమీద, యాక్సిలరేటర్‌మీదా ఆ కాలు వెయ్యవలసిన అవసరం లేకపోయినా, కనీసం కొంతవరకు నయమయితే గానీ డ్రైవింగ్ కూడా చెయ్యకూడని పరిస్థితి. అసలే చలికాలం. బయటకు వెళ్లి గ్రోసరీలు తెచ్చుకోవడం కూడా అంత తేలికయిన పరిస్థితి కాదు. అంగుళాల మందానో లేక 2015 జనవరిలోనో అంతకు ముందోలాగా అడుగులమందానో స్నో పడితే ఇంక చెప్పేదేముంది? క్రచెస్ పట్టుకుని స్నోమీదో, ఐసుమీదో అడుగెయ్యడమంటే కోరి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే!
అయినా గానీ, హమీర్‌తో బాటే అతని అపార్ట్‌మెంట్లోనే వుంటామని పట్టుబట్టారు సరోజగారు; అప్పటికే మూర్తిగారికీ, భవానిగారికీ తామెంతో ఋణపడి వున్నామని ఆవిడ బాధ. స్వంత అన్నయ్య దగ్గరో, అక్కయ్య దగ్గరో వుండడానికీ తమవద్ద వుండడానికీ తేడా ఏమీ లేదని చెప్పి, ఆవిడ అబ్జెక్షన్లని తేలిగ్గా కొట్టేశారు భవాని గారు.
సరోజగారు కూడా, తాను మొదటిసారి అమెరికా వచ్చినప్పటి పరిస్థితికీ, ఇప్పటికీ వున్న తేడాని ఇట్టే గ్రహించారు. ఆ మొదటిసారయితే భర్తకి తనూ, తనకి ఆయనా, అంతే. మహా అయితే ఆయనకి తెలిసిన రెండు, మూడు ఇండియన్ ఫ్యామిలీ లుండేవి. మెల్లమెల్లగా తమవంటి పరిస్థితుల్లోనే వున్న ఇతర ఇండియన్లు అక్కడక్కడా కలవడం మొదలుపెట్టారు. హమీర్ పుట్టడం, ఆ కాన్పుకి తోడుగా తన తల్లిదండ్రులు రావడం, వాడు ఎదిగేటప్పుడు వచ్చిన చిన్న చిన్న నలతలతో ఆదుర్దాలు కలగడం – వీటన్నిటితో ఎక్కువ ఖాళీ సమయ మున్నట్టే అనిపించేది కాదు. అదే ఇప్పుడు? హమీర్ ఆఫీసు కెడితే ఎవరితో మాట్లాడ గలదు ఒక్క భవానిగారితో తప్ప? పైగా, సరోజగారి పరిచయాలు పదేళ్ల క్రితంవి గనుక వాళ్లు తమ జీవితాల్లో ఎంతో ముందుకు వెళ్లిపోయారు. అడిగితే వాళ్ల ఫోన్ నంబర్లని భవానిగారు ఇవ్వగలరేమో గానీ, వాళ్లని పొరబాటున కదిలిస్తే ముందు ఉప్పెనలాగా తగిలేది పదేళ్ల సానుభూతి! “ఇంకా ఏమీ తెలియలేదా?” తో మొదలుపెట్టి, “దురదృష్ట”మనో, “మీలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడ”దనో ఏదో పుసుక్కున అనేసి వెళ్లిపోతారు. విదుషి పెళ్లిలో అలాంటి అనుభవాలు చాలా కలిగా యామెకి.
ఒక రెండ్రోజులు ఊరికేనే కూర్చుని విసుగనిపించిన తరువాత, హమీర్ ఇంటినుండే పనిచెయ్యడానికి పర్మిషన్ తీసుకున్నాడు. క్రిస్మస్ సెలవులు దగ్గర్లోనే వుండడం అందరికీ తెరిపినిచ్చింది. హమీర్ పనిచేసుకుంటున్నప్పుడు చేసేదేమీ లేదు గనుక సరోజగారు భవానిగారితో కలిసి షాపింగ్‌మాల్స్‌కి వెళ్లేవారు. అలా మొదటిసారి వెళ్లినప్పుడు తను కోల్పోయినదేదో ఆమెకు మొహంముందు నిలిపి విధి ఎద్దేవా చేస్తున్నట్లనిపించింది. ఈ పదేళ్లల్లో వచ్చిన మార్పులు – ముఖ్యంగా టైసన్స్ కార్నర్లో మెట్రో రావడం వల్ల రూట్ 7 రూపే మారిపోవడంతో సహా – ఆమెకు స్పష్టంగా కనిపించాయి.
***
క్రిస్మస్‌నాడు మూర్తిగారింట్లో డిన్నర్‌కి ప్రిపరేషన్లు జరుగుతున్నప్పుడు ఆండ్రూ మీనా ప్రసక్తి తేవడం అక్కడున్నవాళ్లల్లో ఒక్క విదుషికి తప్పించి అందరికీ ఆశ్చర్యన్ని కలగజేసింది. ఆరోజాయన పుట్టినరోజు. దాని సందర్భంగా బాగా దగ్గరివాళ్లు సెలబ్రేషన్‌కి ఆ రోజున అక్కడ కలవడం దాదాపు రెండు దశాబ్దాలుగా జరుగుతోంది. ఆ పార్టీ కొచ్చేవాళ్లల్లో కూడా ఎవరూ ఆయనకి చుట్టాల్లేరు. అన్నీ అమెరికా పరిచయాలే! ఈ కోలాహలంలో పాలు పంచుకోవడం ఆండ్రూకి మాత్రం ఇది రెండవసారి.
“నిన్న విదుషి ఫ్రెండుని కలిశాం,” అన్నాడు ఆండ్రూ.
“ఎవరే?” అని భవానిగారు అడగడం, “మీనా,” అని విదుషి చటుక్కున అనడం క్షణంలో జరిగిపోయిన ట్లనిపించింది. విదుషి గొంతులో ఆ ప్రసక్తి తేవాలన్న ఆత్రం మూర్తిగారి చెవికి సోకకపోలేదు. ఆండ్రూ ఇనిషియేట్ చెయ్యబట్టి సరిపోయింది గానీ, అదే విదుషి గనుక స్వయంగా తెచ్చివుంటే మాత్రం మూర్తిగారు, భవాని గారు ఇద్దరూ కూతుర్ని కేకలేసేవాళ్లు – “ఆ వార్తని సరోజగారు, హమీరూ వింటుండగా చెప్పడానికి బుధ్ధి లేదా?” అని.
అంతటితో ఆగకుండా, “వాళ్లమ్మ పోయి ఏడాది దాటిందట,” అన్నది విదుషి. విన్న అందరి మనసుల్లోనూ ఒక్కసారి కలుక్కుమంది ఆ తల్లిలేని పిల్లని తలుచుకుని. ఏ తల్లయితే కూతురి పెళ్లికి మొండిగా అడ్డుపడిందో, ఆమె ఇప్పుడు లేదు. అయితే, విరిగిన మనసులని కలపడం సాధ్యమేనా?
“పెళ్లయిందటనా?” అడిగారు భవానిగారు కొంచెం మెత్తబడి.
“లేదు,” జవాబిచ్చింది విదుషి.
“ఇటు వీడికీ పెళ్లికాలేదు, అటు ఆ పిల్లకూడా ఒంటరే. సైంధవుడిలా అడ్డంపడ్డ ఆవిడ పోయుండొచ్చుగానీ, ఆవిడ చూపిన ప్రతిబంధకాన్ని – నేను – ఇంకా రాయిలా వున్నాను!” అనుకున్నారు సరోజ గారు.
“డెన్వర్ ఎయిర్‌పోర్టులో కనిపించింది,” అన్నాడు హమీర్ యాథాలాపంగా.
“ఏమన్నది?” భవానిగారు అనాసక్తికరంగా అడిగినట్టున్నా, ఆవిడ మదిలో కుతూహలం ఉరకలేస్తోంది.
“నేను కూర్చున్న టేబుల్ దగ్గరకి వచ్చి కూర్చోవచ్చా అనడిగింది. దిసీజ్ ఎ ఫ్రీ కంట్రీ అని చెప్పాను.”
“నీకు చెప్పిందా వాళ్లమ్మ పోయిన సంగతి?” అడిగారు భవానిగారే మళ్లీ.
“లేదు. అయినా వై వుడ్ ఐ కేర్?” అన్నాడు హమీర్. ఎయిర్‌పోర్ట్‌లో మీనామీద కలిగిన కోపం స్థానంలో అతి చిన్న భాగంలో అయినా కొంచెం విషాదమూ, కొంచెం జాలీ ఇప్పుడు చోటుచేసుకున్నాయి.
అతని సమాధానం సరోజగారికి కొంచెం ఉపశమనాన్ని కలిగించింది. “ఎంతయినా ఆ తల్లి కూతురే గదా! అలాంటివాళ్లకి దూరంగా వుండడమే మంచిది!” అన్నారావిడ. ఆ మాటలకి మూర్తిగారూ వాళ్ల కుటుంబ సభ్యులూ కొంచెం నొచ్చుకున్నా గానీ ఆవిడ జీవితంలో దుఃఖాన్నీ, విషాదాన్నీ అతిదగ్గర నుంచీ చూశారు గనుక ఏమీ అనలేకపోయారు.
“పెళ్లయిన తరువాత కూడా మీరు ఇండియాలోనే వుంటారు గదా?” అని సమాధానం తెలుసుకోవడానికి వేసిన ప్రశ్నలాగా కాకుండా ఎక్కడ వుండాలో నిర్దేశించినట్లుగా మీనా తల్లి అడగడం హమీర్ చెవుల్లో మార్మ్రోగింది. అతనూ, మీనా తమ పెళ్లిగూర్చే అప్పటిదాకా ఆలోచించారు గానీ ఈ డీటెయిల్స్‌ని వర్కవుట్ చెయ్యడం మాటటుంచి, అసలు ఆలోచించనే లేదు. హమీర్, సరోజగారు తమతో కాక వేరెక్కడ వుంటారనే ఆలోచనకే తన మనసులో చోటివ్వలేదు. అది మీనాకి కూడా అంగీకారం ఎందుకు కాబోదని మాత్రం అతను అనుకున్నాడు.
“హౌ డిడ్ షి డై?” హమీర్ అడిగాడు. ఆ ప్రశ్నలో శాడిజానికి ఏమాత్రం ఆస్కారం లేదు గానీ, ఆ వివరాలు అనవసర మనిపించింది మూర్తిగారికి.
“అప్పరెంట్లీ ఇట్ వజ్ ఎ సడెన్ డెత్. మాసివ్ హార్ట్ ఎటాక్,” అన్నాడు ఆండ్రూ.
“మీనా వాళ్లమ్మగారిని తీసుకుని షాపింగ్‌కి కార్లో డ్రైవ్ చేస్తూ వెడుతోందట. తనేదో మాట్లాడుతుంటే ఆవిడ ఊఁకొడుతున్నదల్లా కాసేపు ఏమీ మాట్లాడకపోయేసరికి మీనా పక్క సీటువైపు చూస్తే ఆవిడ తల వాలిపోయున్నదట. తను డాక్టరే గనుక ఏం చెయ్యడాని కయినా సమయ మెప్పుడో దాటిపోయిందని గ్రహించిందట,” అన్నది విదుషి.
సడెన్ డెత్ కూడా సడెన్ డిజప్పియరింగ్ లాంటిదే అని అనుకున్నాడు హమీర్.
మీనా తల్లి ప్రసక్తిని తీసుకురావడం ఆండ్రూ, విదుషి బాగా ఆలోచించి చేసిన పనే గానీ, వాతావరణం బయటిలాగానే ఇంట్లోకూడా బాగా చల్లబడుతోందని గ్రహించి, విదుషి మాట మార్చింది. “ఆండ్రూ ది అవుట్‌డోర్స్ మాన్ హాజ్ ఎ ప్రపోజల్!” అన్నది.
“హౌ అబవుట్ గోయింగ్ టు యోసమిటి ఇన్ జూన్?” అడిగాడు ఆండ్రూ.
” ఎక్సెలెంట్ ఐడియా! ఎన్నేళ్లుగానో వెడదా మనుకుంటున్నా గానీ ఇప్పటిదాకా కుదర్లేదు. ఇప్పటినించే ప్లానింగ్ చేసుకోవడానికి కావలసినంత సమయముంది,” అన్నారు మూర్తి గారు.
“ఆ ప్లానింగ్ నాకు చాలా అవసరం. హాఫ్ డోమ్ ఎక్కడానికి ముందే రిజర్వ్ చేసుకోవాలి. అందుకని మహా అయితే ఒక వారం తీసుకోండి ఆలోచించుకోవడానికి,” అన్నాడు ఆండ్రూ.
“రాళ్లూ రప్పలూ ఎక్కాలా?” అడిగారు భవాని గారు.
“అవును మామ్! అది సముద్రమట్టానికి రెండువేల అడుగుల ఎత్తులో మొదలై పదమూడువేల అడుగుల ఎత్తుదాకా పోతుంది. భయపడకులే, నిన్ను ఆంత ఎత్తు ఎక్కమని అడగం. ఆండ్రూ హాఫ్ డోమ్ పైకి ఎక్కినప్పుడు మాత్రం ఆ ఎత్తుని చేరతాడు,” అన్నది విదుషి.
“మామ్, నువ్వెప్పుడూ యోసమిటి చూళ్లేదు కదా?” అడిగాడు హమీర్.
“మీ నాన్న వెళ్లాలి అనేవారు. నేనే రానన్నాను. ఈ చుట్టుపక్కల ఏదో పార్కుకి తీసుకెళ్లారొకసారి. అక్కడ నడిచినందుకే నా కాళ్లు పట్టేశాయి. తరువాత నేను నేను అలాంటి చోట్లకి రానన్నాను,” అన్నారు సరోజగారు.
“పెళ్లికి ముందు అలాంటివన్నీ ఎక్కేవారని చెప్పారు ఆయనా, నేనూ కలిసి గ్రేట్ ఫాల్స్‌లో బిల్లీ గోట్ ట్రెయిల్ మీద నడిచినప్పుడు,” అన్నాడు హమీర్.
“దట్స్ ఎ నైస్ ట్రెయిల్,” అన్నాడు ఆండ్రూ.
“ఆఁ. పెళ్లికి ముందు స్టూడెంట్‌గా వున్నప్పుడు బాక్‌పాక్ వేసుకుని దేశంలో చాలా నేషనల్ పార్కులకి తిరిగార్ట. పెళ్లయిన తరువాత నేను రానన్నాను. నన్నొక్కదాన్నీ ఇంట్లో వదిలేసి వెళ్లలేక తను మానేశారు గానీ, ఆ యోసమిటీకే, నువ్వు కాలేజీలో చేరిన తరువాత నీతో కలిసి వెడదామనుకున్నారు,” అన్నారు సరోజగారు. “అయినా, జూన్ దాకా ఆగడమెందుకు? ఇప్పుడే వెళ్లచ్చుగా?” అన్నారావిడే మళ్లీ.
“ఇలా కాదు గదా మామ్?” అన్నాడు హమీర్ క్రచెస్‌ని చూపిస్తూ.
“అవును కదా, మర్చే పోయాను,” అని ఆగి, “పోనీ ఫిబ్రవరిలో అయితే?” అని అడిగారావిడే.
“అది ఎత్తయిన ప్రదేశ మవడంవల్ల మంచుపడి దారులన్నీ మూసుకుపోతాయి. వాటిల్లో కొన్నింటి నయినా తెరవాలంటే ఏప్రిల్‌దాకా ఆగాలి. హాఫ్ డోమ్‌కి వెళ్లడాని కయితే జూన్ దాకా ఆగక తప్పదు,” అన్నాడు ఆండ్రూ.
“నే నప్పటికి ఇండియా వెళ్లిపోతాను. మీరేం చేసుకుంటే మీ యిష్టం,” అన్నారు సరోజ గారు.
“మీరు కూడా చూళ్లేదు కదా! కొంచెం ఆగి అది చూసేసి వెళ్లండి,” అన్నారు భవాని గారు.
“అలాగే వెడుదువుగాన్లే, యోసమిటి ట్రిప్ అయిన తరువాత! నువ్వు, నేను కలిసి ఎక్కడికీ వెళ్లింది లేదు ఈ తొమ్మిదేళ్లల్లో,” అన్నాడు హమీర్. సరోజగారికి జవాబు ఏమని చెప్పాలో తోచలేదు. అతని ఫ్రాక్చర్ ఎప్పటికి నయమవుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు కదా! అది పూర్తిగా నయ మయేటంతవరకూ ఆవిడ ఎలానూ వుండక తప్పదు. అందుకని ఆవిడ మౌనంగా వుండిపోయారు.
ఆ ట్రిప్‌కి కావలసిన అరేంజ్‌మెంట్లన్నీ ఆండ్రూనే చూసుకొమ్మనమని మూర్తిగారు చెప్పారు.
“అక్కడ కాబిన్లని తీసుకుని సెలబ్రేట్ చేసుకుందాం, ” అన్నాడు ఆండ్రూ విదుషిని నడుంచుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కుని ముద్దుపెడుతూ. ఎంత వద్దనుకున్నా తను మీనాని అలా దగ్గరకు లాక్కుని ముద్దుపెట్టడం హమీర్‌కి గుర్తొచ్చి మనసులో ముల్లు గుచ్చుకొన్నట్టనిపించింది.
“అమ్మో! అక్కడ black bears తిరుగుతూంటయ్యట! నాకు భయం బాబూ! ” అన్నారు భవాని గారు.
***
“అయామ్ గ్లాడ్ హమీర్ మెట్ మీనా ఇన్ ది డెన్వర్ ఎయిర్‌పోర్ట్,” అన్నది విదుషి, క్రిస్మస్ వీకెండ్ అయిన తరువాత ఆండ్రూ డ్రైవ్ చేస్తూండగా మూర్తిగారి ఇంటినుంచీ బయలుదేరి వాళ్లింటికి వెడుతున్నప్పుడు.
“ఐ డిడన్ట్ సీ హిమ్ ఆర్ దెమ్ టు బి రిసెప్టివ్ టు ది ఐడియా,” అన్నాడు ఆండ్రూ.
“పగులు అతుక్కోవడానికి కొంతకాలం పడుతుంది. రిలేషన్‌షిప్స్ అనేవి అంత తొందరగా కుదిరేవీ కాదు, అతికేవీ కాదు,” అన్నది విదుషి. “మీనాకి ఇటు హమీరూ లేక, అటు తల్లీలేక చాలా బాధపడుతోంది. హాస్పిటల్ పనిలో తల మునకలయ్యే పరిస్థితి కల్పించుకుంటోంది గానీ, ఎంతకాలం అలా వుండగలదు?”
“బౌల్డర్ వెళ్లిన తరువాత బాయ్‌ఫ్రెండ్సే లేరా?” అడిగాడు ఆండ్రూ.
“అక్కడ మెడికల్ కాలేజీలో చదువుతునప్పుడు మొదటి రెండేళ్లూ నెలకి కనీసం ఒకసారన్నా హమీరే అక్కడి కెళ్లొస్తూండేవాడు. వీడితో బ్రేక్ అయిన తరువాత వాళ్లమ్మ, చదువయేదాకా ఇంకేం బాయ్‌ఫ్రెండ్స్ అంటూ తిరక్కు, రెసిడెన్సీలోకి రాగానే నేనే సంబంధాలు చూస్తా నన్నదిట. ఆ చదువు పూర్తికాకుండానే ఆవిడ పోయింది. … హమీర్‌కి సంబంధాలని చూద్దామని మామ్ అండ్ డాడీ, అలాగే ఆంటీ కూడా ప్రయత్నించారు. హమీర్, రోహిత్ ఇద్దరూ కూడా పార్ట్‌నర్స్‌ని వాళ్లే వెతుక్కుంటామని చెప్పారు.”
“నాలాగా!” అన్నాడు ఆండ్రూ.
“నాలాగా కూడా! ఐ లవ్యూ,” అన్నది విదుషి పాసెంజర్ సీట్లోంచే అతని మెడమీద చెయివేసి నిమురుతూ. “మీనామీద ఇంటరెస్టే లేనట్టు మాట్లాడాడు గానీ, హమీర్ ఈజ్ కుకింగప్ సంథింగ్. అంత వద్దని వెళ్లిపోయిన ఆమెని అంత తొందరగా క్షమించేస్తావా అని అంటారేమోనని వాడి భయమనుకుంటా! ఇఫ్ మై సస్పిషన్ ఈజ్ కరక్ట్, డెన్వర్ ట్రిప్ తరువాత మీనా, హమీరూ పాచప్ అయ్యుండాలీపాటికి. అమ్మాయి తనంతట తానే వెదుక్కుంటూ వస్తే కాదనే మగాళ్లెవరుంటారు?”
***
“ఐ వాంట్ టు సీ యు!” హమీర్‌కి అమానినించీ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది జనవరి చివర్లో.
ఇప్పటిదాకా “ఆ పనిచేద్దాం, లేకపోతే అది నేర్పించు,”అన్న ఆమెలో ఈ మార్పు హమీర్‌కి సంతోషా న్నిచ్చింది గానీ, జవాబుగా తనకో ఫొటోని తీసుకుని టెక్స్ట్‌కి జతచేసి పంపాడు.
“ఫేస్ టు ఫేస్!” జవాబొచ్చింది.
“స్కిన్ టు స్కిన్” అని, దానివెంటనే “ఐ మీన్ – ముద్దుపెట్టుకునేలా!” అని క్లారిఫికేషన్ వచ్చింది. రోజ్ కలర్ బ్లష్ వుండే ఎమోజీని చూసిన గుర్తు అతనికి లేదుగానీ, ఊహించుకోవడం అంత కష్టం కాదనిపించింది.
“యు విల్ హావ్ టు కమోవర్!” హమీర్ జవాబిచ్చాడు.
“అయాం నాట్ దట్ ఈజీ!” జవాబొచ్చింది.
“ఐ డిడన్ట్ సే టు మై అపార్ట్‌మెంట్!”
“నువ్వు డిజప్పాయింట్ చేశావు. నా రిసాల్వ్‌ని టెస్ట్ చెయ్యడానికి – అదే, ఈజీనో కాదో తేల్చుకోవడానికి – మీ ఇంటి అడ్రస్ పంపుతా వనుకున్నాను!”
“ఇప్పుడేగా, నువ్వు అంత తేలిక కాదన్నావు?”
“అలా అనగానే అంత సీరియస్‌గా తీసేసుకోవడమే? ఏ మాత్రం టెస్ట్ చెయ్యకుండా! … ఐ నీడ్ ఎ షోల్డర్ టు లీన్ ఆన్!”
ఆ జవాబు హమీర్‌కి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. తనింకా డ్రైవ్ చెయ్యడం లేడు గనుక రోహిత్‌కి టెక్స్ట్ చేశాడు – రైడ్ ఇస్తావా అని.
***
రోహిత్ హమీర్‌ని క్రిస్టల్ సిటీ మేరియాట్ హోటల్ పార్కింగ్ లాట్లో డ్రాప్ చేశాడు. సైనెటిక్ థియేటర్ వైపు చూపిస్తున్న గుర్తులని ఫాలో అవుతూ హమీర్ ఎలివేటర్ ఎక్కి లాబీని చేరుకున్నాడు. ఆ థియేటర్ టికెట్ కౌంటరు ముందు అవతలి గోడవైపు వేసివున్న బెంచీమీద కూర్చుని వున్న అమాని అతణ్ణి ఆశ్చర్యంతో కళ్లు విప్పార్చి చూసి లేచి నిలబడింది.
“మారుమూల వున్నట్లే వుంది గానీ, ప్రైవసీ కల్పించే చోటేమీ కాదు!” కొద్దిగా నిరాశ ధ్వనించేలా కొంటెగా అన్నాడు.
“కాలికి ఫ్రాక్చర్ అయిందని చెప్పొచ్చుగా!”
“మనం ఫోన్లో మాట్లాడుకున్న దెప్పుడు?” బెంచీమీద కూర్చుంటూ అడిగాడు.
“రమ్మనమని అడిగినప్పుడన్నా – ”
“రాలేనని చెప్పడానికి పూర్తిగా అలాంటి పరిస్థితిలో లేనుగదా!”
“ఎలా జరిగింది?” అడిగిందామె అతనిపక్కన కూర్చుంటూ. చెప్పాడు.
“యాక్సిడెంట్ చేసిన ఆ కార్లో బాంబులుండి పేలితే నువ్వివాళ నన్ను కలవగలిగేవాడివి కాదు. అదే, బాంబులున్నా గానీ అవి పేలకపోయుండుంటే ఈ పాటికి నీ పేరు దేశమంతా మార్మ్రోగిపోతూ వుండేది. ఆ విధంగా కూడా నువ్వు నాకు దొరికేవాడివి కాదు!” అతని భుజంమీద తలని ఆనిస్తూ అన్నదామె.
ఆమె మాటల్లో అంత నిరాశ ఎందుకు నిండివున్నదో అతనికి అర్థం కాలేదు. పైగా మాటల్లో బాంబులు దొర్లాయి! శాన్ బెర్నార్డినోలో భార్యాభర్తలు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి పదకొండుమందిని చంపడమూ, ఇంకొంతమందిని గాయపరచడమూ, ఆ కాల్పులకి ఇస్లాం రాడికలిస్టుల ప్రోద్బలమో, లేక ప్రోత్సాహమో వున్నదంటూ అమెరికాయేగాక భార్య పాకిస్తాన్‌నించీ వచ్చిందని ఆ ప్రభుత్వం కూడా పరిశోధనలని మొదలుపెట్టడమూ అతనికి గుర్తొచ్చింది. కానీ, ఆమె ఈ ప్రసక్తి ఎందుకు తీసుకువచ్చిందన్నదే అతనికి అర్థంకాలేదు.
అమాని అతని భుజానికి తన తల నానించి ఆమె చేతిని అతని నడుంచుట్టూ వేసి అతని కెడమపక్కన మౌనంగా కూర్చుంది. అతను తన ఎడమ చేతిని ఆమె నడుంచుట్టూ వేశాడు. అలా కాసేపయిన తరువాత హమీర్ తన కుడిచేతిలోకి ఫోన్ తీసుకుని ఇద్దరికీ కలిపేలా సెల్ఫీని తీసి చూస్తే ఆమె నిద్రపోతోంది. ముందు ఆశ్చర్యమేసింది గానీ, ఆమెకు తను ప్రశాంతత నివ్వగలగడం అతనికి ఒకవిధమైన ఆనందాన్నిచ్చింది. అయితే, ఒమహా ఎయిర్‌పోర్టులో కలిసిన తరువాత ఈనాడు ఆమె ఇంత నిర్భయంగా తన భుజంమీద తలనానించి నిద్రపోయేటంత కాన్ఫిడెన్స్‌ని ఎలా ఇవ్వగలిగాడో అతనికి అర్థంకాలేదు.
అలా దాదాపు అరగంటసేపు కూర్చున్న తరువాత, ఇంక కూర్చోలేనంటూ చేసిన అతని శరీరపు మొరాయింపు ఆమె నిద్రకి భంగం కలిగించింది.
“నిద్రపోవాలనుకుంటే మా అపార్ట్‌మెంట్‌కి వెళ్లేవాళ్లం!” అన్నాడు.
“అక్కడ నన్ను నిద్రపోనిస్తావేమిటి?” అని ఆగి, “అయినా, అక్కడ నిద్రపోనిస్తే నేనెందుకు వూరుకుంటాను?” అన్నది అమాని. ఆ కవ్వింపు అతనికి స్పష్టంగానే అర్థమయింది.
“ఇంకో గంటలో ఈ థియేటర్లో ఒక షో వున్నది – చూద్దామా? రోమియో అండ్ జులియెట్,” అమాని అడిగింది.
“విషాద గాథ నెన్నుకున్నావెందుకు?”
“మన కేది రాసిపెట్టి వున్నదో మనకేం తెలుసు? ఏదయినా మన చేతుల్లో వుంటేగా! ఇక్కడ ఒక షో చూద్దా మనుకున్నాను. తమాషాగా ఇప్పుడిక్కడ ఆ విషాద గాథనే ప్రదర్శిస్తున్నారు. అసలు డైలాగులేమీ వుండవట ఈ ప్రదర్శనలో. మాటల్లేని విషాదాన్ని చూడా లనిపించింది.”
“ఇంకో రెండో, మూడో గంటల తరువాత పికప్ చేసుకోగలవా?” అని రోహిత్‌కి మెసేజ్ పంపిస్తే అతను సరేనన్నాడు.
థియేటర్లో షోమీద కళ్లతోబాటు మనసుని కూడా కేంద్రీకరించగలిగి నప్పుడు చాలా బావుంది అనుకున్నాడు. తనచెయ్యి అమాని చేతితో పెనవేసుకునున్నదని గుర్తు వచ్చినప్పుడు, దారీ తెన్నూ లేకుండా వున్నట్టున్న తన ఏకాకి జీవితానికి ఒక తోడు లభించబోతున్న దన్న నమ్మకం హమీర్‌కి కలిగింది. కానీ, అది రిలేషన్‌షిప్ అని పూర్తిగా అనుకోవడానికి ఆస్కారం లేకుండా, ఇప్పటిదాకా ఆమే అన్నీ నిర్దేశిస్తూ వున్నది.
“జూన్లో యోసమిటీ వస్తావా?” షో అయి, బయటకు వచ్చిన తరువాత అడిగాడు. అప్పటిదాకా తెరిపిగావున్న ఆమె మొహం మ్లానమవడం గమనించాడు. “ఇంకా చాలా కాలమున్నదిగా! ఎన్నో జరగవచ్చు ఈ అయిదునెలల కాలంలో!” అన్నది అమాని. ఆమె గొంతులో అంత నిరాశ ఎందుకు నిండుకున్నదో అతనికి అర్థంకాలేదు.
ఇంకా ఉంది…
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్