వ్యాసాలు

మధ్యమవ్యాయోగం

అక్టోబర్ 2016

ప్రస్తావన:

సాధారణంగా ఓ కథ అల్లడానికి కథకుడు కొన్ని మౌలికమైన పద్ధతులు పాటిస్తాడు. అవే పద్ధతులు నాటకరచన లోనూ ఉపకరిస్తాయని భావించవచ్చు. రేఖామాత్రమైన కథ (storyline) ను ఊహించి, దాన్ని పొడిగించి, కొన్ని అంకాలుగా తీర్చి, పాత్రలను, పాత్రధారులను, సన్నివేశాలనూ, సంభాషణలనూ జోడిస్తూ విస్తరించడం ఒక పద్ధతి. అలా కాక ఒక వృత్తాంతాన్ని (theme) ఎంచుకుని, థీమ్ కు సరిపడా కథను సాధ్యమైనంత విస్తృతంగా ఒక చిత్తుప్రతి ద్వారా కూర్చుకొని, ఆ కథను ట్రిమ్ చేసి, అనవసరమైన సంభాషణలనూ, పాత్రలనూ, సన్నివేశాలనూ కత్తిరించి, మెరుగుపెట్టటం రెండవ పద్ధతి. మొదటిది రాత. రెండవది కోత. మొదటిది ఎక్కువభాగం Writing. రెండవది ఎక్కువభాగం Editing.

భాసుని నాటకాలలో స్వప్నవాసవదత్తమ్ అన్న “ఆరు అంకాల” నాటకపు ఇతివృత్తాన్ని క్లుప్తంగా (Thin storyline) చెప్పవచ్చు. (ఆ Thin story line: ఉదయనుడు – వాసవదత్తకు భర్త. అతడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. అతనికి పద్మావతి అని ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి ద్వారా కోలుపోయిన రాజ్యాన్ని కట్టబెట్టడానికి – మంత్రి యౌగంధరాయణుడు పన్నిన యుక్తి స్వప్నవాసవదత్త నాటక ఇతివృత్తం). ఇది మొదటి పద్ధతిలో రచించిన రచన.

భాసకవి మరొక రచన మధ్యమవ్యాయోగమ్. ఇది ఒక ఏకాంకిక (Single Act Play). ఈ “ఒక్క” అంకంలోని కథను ఒక చిన్న storyline లో చెప్పడం కుదరదు. చెప్పగలిగినా ఒక theme గా మాత్రమే చెప్పవచ్చు. ఏ మాత్రం సంక్షిప్తీకరించినా సమగ్రత చెడుతుందన్నమాట. అంటే, రచయిత ఒక పెద్ద కథను కూర్చి దానిని క్రమంగా  మెరుగుపెట్టి ఉంటాడా అనిపిస్తూ, రెండవ పద్ధతిలో కూర్చిన రచన ఇది. అందుకు నిదర్శనంగా – అనవసరంగా ఒక్క పాత్ర, సంభాషణ, సన్నివేశమూ ఈ రచనలో కనబడదు. ఇలా ఒక్క చిన్న వ్యర్థమూ కనబడలేదంటే – రచయిత దీనిని బాగా edit చేసి చివరికి ఈ నాటకాన్ని తీర్చి ఉంటాడని మనం అంచనా కట్టవచ్చు. ఆ విధంగా ఒక్క అంకంలో ప్రేక్షకుణ్ణి కట్టిపారెయ్యగల అపూర్వసృష్టి మధ్యమవ్యాయోగమ్.

ఆయోగమంటే కలయిక. వ్యాయోగం అంటే విశేషమైన కలయిక. సంస్కృతరూపకాలు పది రకాలు. వ్యాయోగం-పది రూపకభేదాలలో ఒకటి. మధ్యమం అధికృత్య కృతః వ్యాయోగః – అని ఒక వ్యుత్పత్తి. అంటే పాండవ మధ్యముడైన భీముడు నాయకుడుగా రచించిన వ్యాయోగం అని అర్థం.  మధ్యమౌ అధికృత్య రచితః వ్యాయోగః – అంటే ఇద్దరు మధ్యములను గురించి రచించిన వ్యాయోగం అని మరొక వ్యుత్పత్తి. ఈ రెండవ వ్యుత్పత్తి ఔచిత్యవంతమైనది. ఒక బ్రాహ్మణుని ముగ్గురు కొడుకులలో మధ్యవాడూ, పాండవమధ్యముడైన భీముడూ వీరిద్దరి కలయికతో, ధర్మవీరం అనే రసం ప్రధానంగా అద్భుత, హాస్య, బీభత్స రసాలు గర్భితంగా కూర్చిన రచన ఈ మధ్యమవ్యాయోగమ్.

ఇక్కడ ఒక ప్రశ్న పుడుతుంది. (పాండవ) మధ్యముడు అంటే అర్జునుడు కదా? మరి భీముడెలా పాండవ మధ్యముడు అయ్యాడు? – ఇందుకు కావ్యజ్ఞులు సమాధానం చెప్పారు. మధ్యముడు అంటే – గరిష్ఠునికి, కనిష్ఠునికి  మధ్యనున్న వాడు. అంటే భీమార్జుననకులు మువ్వురూ పాండమధ్యములే. సందర్భాన్ని బట్టి ఈ నాటకంలో భీముని మధ్యమునిగా అన్వయించుకోవాలి.

ఈ వ్యాసంలో మధ్యమవ్యాయోగం గురించి సాధ్యమైనంత వివరంగా తెలుసుకుందాము.

కథాక్రమం:

అదొక అందమైన ఉదయం. అడవిలో కేశవదాసనే బ్రాహ్మణుడూ, అతని భార్య, ముగ్గురు పిల్లలూ కలిసి పొరుగూరు వెళుతున్నారు. అంతలో వాళ్ళను ఒక రాక్షసుడు అడ్డగించాడు. బ్రాహ్మణుని కుటుంబం ఆ రాక్షసుణ్ణి చూసి భయంతో బిక్కచచ్చిపోయేరు. ఎలాగో తమాయించుకుని ’ఏం కావాలి నీకు?’ అని అడిగేడు బ్రాహ్మణుడు. మీ కుటుంబంలో ఒక బాలుణ్ణి నాకప్పగించమన్నాడా రాక్షసుడు. ’లేకపోతేనో?’ – లేకపోతే మొత్తం కుటుంబం నాశనం అవుతుందన్నాడతను. ఆ రాక్షసుడి పేరు ఘటోత్కచుడు. పాండవమధ్యముడైన భీమునికి, హిడింబకూ పుట్టాడు. బ్రాహ్మణులను చంపటం తప్పని తెలిసినా భోజనం కోసం అమ్మ – లేత నరమాంసం తెమ్మంది కాబట్టి ఈ పనికి ఒడిగట్టాడతను.

’సరే నన్ను పట్టుకుపో – నీవెంట వస్తా’నన్నాడు బ్రాహ్మడు.

’వద్దు, నన్ను పట్టుకు పొ’మ్మంది బ్రాహ్మణి.

’కాదు నే’నని పెద్దవాడు.

’లేదు నేనంటే నే’నని మధ్యవాడూ, చివరిపిల్లవాడూ అందరూ పోటీపడ్డారు.

చివరికి పెద్దవాణ్ణి బ్రాహ్మడూ, కడపటివాణ్ణి బ్రాహ్మణి వదలనన్నారు. ఇక చేసేదిలేక మధ్యవాడు ఘటోత్కచుని వెంట వెళ్ళటానికి సిద్ధమయ్యాడు.ఆ అబ్బాయి చివరి సారి అమ్మానాన్నల దగ్గర వీడుకోలు తీసుకున్నాడు. “చిరం జీవ” అని దీవించిందా అమ్మ. చివరి సారి నిత్యకర్మలు చేసుకొస్తానని రాక్షసుని అనుమతి పొంది పక్కన ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళేడు.

అలా చెరువు దగ్గరికి వెళ్ళినవాడు ఎంతకూ రాలేదు.

ఇవతల రాక్షసబాలుడు ఘటోత్కచునికి అసహనం హెచ్చింది. వాణ్ణి పిలవాలి.

“వాడి పేరేంటి?”

‘….’ బ్రాహ్మడు మౌనం వహించేడు.

“తపస్వీ మధ్యముడు అని పిల్చుకో ఫో…” బ్రాహ్మడి పెద్దకొడుకన్నాడు.

“ఓ మధ్యమా, మధ్యముడా…” ఎలుగెత్తి పిలిచేడు ఘటోత్కచుడు.

అదే అడవిలో మరొకచోట ‘మార్నింగ్ ఎక్సర్ సైజులు’ చేసుకుంటున్న పాండవమధ్యముడైన భీమునికి ఈ కేక వినబడింది. ఆ గొంతు తన తమ్ముడైన అర్జునుని గొంతులా వున్నది. ఆ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దిశగా బయల్దేరి వచ్చి “ఇదిగో వచ్చా”నన్నాడు.

“నేనివతల మధ్యముణ్ణి పిలిస్తే నువ్వెవరయ్యా, మధ్యలో” అని రాక్షసబాలుడు.

“మధ్యమా” అన్నావుగా అందుకే వచ్చాను.

“నువ్వు మధ్యముడివా?”

“అవును. నేను ఈ విధంగా మధ్యముణ్ణి” – అని ఎనిమిది విధాలుగా చెప్పాడు భీముడు. ఘటోత్కచునికి అర్థం కాలేదు కానీ, కేశవదాసుకు మాత్రం “విషయం” అర్థమయ్యింది. మమ్మల్ని రక్షించమని వేడుకున్నాడు భీముణ్ణి. అభయం ఇచ్చాడు భీముడు. ఎదుటనున్న వ్యక్తి ఆనవాళ్ళు కనుక్కున్నాడు. అతడు తన పుత్రుడే.

బ్రాహ్మణ కుటుంబాన్ని విడిచి పెట్టమన్నాడు భీముడు రాక్షసునితో.

“నువ్వెవరవోయి?” – రాక్షసుడు.

“నీ బాబును”

“ఆ?”

“నేను రాజును. రాజుకు ప్రజలందరూ కన్నబిడ్డలేగా? వీళ్ళను వదులు. ”

“మా నాన్న చెప్పినా వదల్న”న్నాడు ఘటోత్కచుడు.

“మీ నాన్న ఎవడోయి? బ్రహ్మా, విష్ణువా, శివుడా, ఇంద్రుడా, కృష్ణుడా, యముడా?”

“అందరూ కలిపితే మానాన్న.”

నవ్వుకుని – ’వాళ్ళను వదిలి వీలైతే, నన్ను జయించి పట్టుకుపొ’మ్మన్నాడు భీముడు. రాక్షస బాలుని ప్రతాపం – ఆ వచ్చిన కొత్త ఆసామీ ముందు నిలబడలేదు. చివరకు అమ్మ నేర్పించిన మాయాపాశం తో కూసింతసేపు భీముని బంధించగలిగేడు. ఆ మాయాపాశం విడిపించుకోగలిగినప్పటికీ, కాసేపైనా తనను జయించేడు కాబట్టి రాక్షసుని వెంట బయల్దేరేడు భీముడు. వెనకనే కేశవదాసూ కుటుంబమూ వెళ్ళింది. ఇంటికి వచ్చి “అమ్మా, మనిషిని తీస్కొచ్చా”నన్నాడు. అమ్మ బయటికి వచ్చింది. “ఉన్మత్తక! ఆయన నీ తండ్రిరా” అన్నది. ‘నాన్నా నన్ను క్షమించమ’న్నాడు కొడుకు. నవ్వేడు తండ్రి. “ఏంటే ఇదంతా?” అడిగేడు భీముడు వాళ్ళవిడను. ఆమె మొగుని చెవిలో ఏదో చెప్పింది. నవ్వుకున్నాడాయన. జాతివలన మాత్రమే రాక్షసి. గుణం వల్ల కాదని ఆమెను మెచ్చుకున్నాడు.

అందరూ కలిసి బ్రాహ్మణకుటుంబాన్ని సాగనంపేరు.

కథ తెలిసిందిగా. ఇంకాస్త వివరంగా ఈ కథను 1960 జనవరి చందమామ సంచిక లో – అంటే ఈ లంకెలో 34 వ పేజీ నుంచి చదువుకోవచ్చు.  ఈ నాటకం యొక్క ఇతర విశేషాలు చూద్దాం.

వ్యాయోగం:

సంస్కృతంలో నాటకాలు ప్రధానంగా పది విధాలు. (ఉపనాటకాలు మరిన్ని) ఆ పదిరకాలలో వ్యాయోగం ఒకటి. వ్యాయోగం లక్షణాలు ఇవి.

  • ఒక్క అంకంలో ప్రదర్శించాలి. ఒక్క రోజులో జరిగిన కథ అయి ఉండాలి.
  • నాయకుడు ప్రముఖుడు అయి ఉండాలి. అలాగని దివ్యుడు కారాదు కానీ రాజర్షి కావడం యుక్తం. కథ ప్రఖ్యాతమైనది అయి ఉండాలి.
  • యుద్ధాభిముఖులైన నటులు ఉండాలి. స్త్రీపాత్రలు తక్కువగా ఉండాలి.
  • యుద్ధము/నియుద్ధము/సంఘర్షణతో కూడిన ఇతివృత్తం అయి ఉండాలి.
  • ఓజోగుణభరితంగా ఉండాలి.

ఈ లక్షణాలన్నీ ఇంచుమించుగా మధ్యమం లో అగుపిస్తున్నాయి. ఈ కథలో నాయకుడు ఘటోత్కచుడని కొందరూ, భీముడు, ఘటోత్కచుడు ఇద్దరున్నూ అని మరికొందరూ అంటారు.

మధ్యమం కథ మహాభారతంలో లేదు. భాసుడు ఈ కథను ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని కథనూ, మహాభారతంలో బకాసురుని ఉదంతాన్ని ప్రేరణగా తీసుకుని స్వీయకల్పనగా రచించాడు. ఇది రెండు కుటుంబాల కలయిక. ఇద్దరు మధ్యముల కలయిక. చిరకాలం తర్వాత భార్యాభర్తల కలయిక.

(కేరళ కూడియాట్టం ప్రదర్శనలో – ఘటోత్కచుడు, హిడింబ. Courtesy – keralaculture.org )

Dialogues and Dramatic irony :

యత్రార్థే చింతితే అన్యస్మిన్ తల్లింగో అన్యః ప్రయుజ్యతే |
ఆగంతుకేన భావేన పతాకాస్థానకం తు తత్ || (నాట్య శాస్త్రం – 19.30)

తాత్పర్యము: ఒక వాక్యము ఒక అర్థమునుద్దేశించి ప్రయోగింపబడినప్పటికినీ, దాని నుండి ఆగంతుక భావముచే  నిగూఢమగు ఇంకొక అర్థము సాధింపబడినచో అది ‘పతాకాస్థానక ‘ మనబడును. (ఈ నిగూఢార్థము మొదటి అర్థమునకు అనుగుణమై ఉండవలెను.) పతాకాస్థానకాన్ని డ్రమటిక్ ఐరనీ అంటారు. ‘ఉద్దేశించిన సమాధానం, ఎదుటివాడికి కాక మరొకరికి అర్థం అయ్యేలా అయ్యేలా చెప్పడం’ డ్రమటిక్ ఐరనీ. నాటకం రక్తి కట్టడానికి ఈ డ్రమటిక్ ఐరనీ ఓ ప్రధానమైన ఉపకరణం. కుంతకుడనే అలంకారికుడు చెప్పిన ‘వాక్యవక్రోక్తి’ కూడా ఈ కోవకే చెందుతుంది. పతాకాస్థానకం – జరుగబోయే సన్నివేశాన్ని సూచించాలని ధనంజయుడు అనే మరొక అలంకారికుడు చెబుతాడు. ఈ పతాకస్థానకాలు నాలుగు విధాలని భరతముని వింగడించాడు. భరతముని ఈ పతాకాస్థానకాలకు పేర్లు పెట్టలేదు కానీ,  వీటిని ప్రథమము, శ్లిష్టము, శ్లిష్టోత్తరము, తుల్యవిశేషణము అని తన వ్యాఖ్యానంలో సింగభూపాలుడు పేర్కొన్నాడు. ఈ నాలుగు పద్ధతుల్లో శ్లేష పాలు వరుసగా పెరుగుతూ పోతుంది.  ఇలాంటివి భాసుని నాటకాలలో చాలాచోట్ల కనిపిస్తాయి

రాక్షసుడు మధ్యముణ్ణి పిలువగానే అక్కడికి ఒక ఆసామీ వచ్చాడు. ’నేను మధ్యముణ్ణి పిలుస్తుంటే,  నువ్వెవరయ్యా ఇక్కడికొచ్చా’వని అడిగేడు రాక్షసుడు. ’నేనూ మధ్యముణ్ణి కాబట్టే వచ్చా’నన్నాడు ఆసామీ.

’నువ్వు మధ్యముడివా?’

’అవును’.

మధ్యమోऽహ మవధ్యానా ముత్సిక్తానాం చ మధ్యమః |
మధ్యమోऽహం క్షితౌ భద్ర! భ్రాతృణామపి మధ్యమః ||

అపి చ,

మధ్యమః పంచభూతానాం పార్థివానాం చ మధ్యమః |
భవే చ మధ్యమో లోకే సర్వ కార్యేషు మధ్యమః ||

1. నేను శత్రువులు సంహరించలేని వారిలో మధ్యముణ్ణి. (అవధ్యుడు – యుద్ధంలో ఎవరూ చంపలేని వాడు. పాండవులకు అవధ్యులని పేరు. అవధ్యులలో మధ్యముడంటే – పాండవమధ్యముడు అని సూచన)

2. పౌరుషవంతుల్లో మధ్యముణ్ణి. (జరాసంధుడు, కీచకుడు, భీముడు, బకాసురుడు, దుర్యోధనుడు – ఇలా ఐదుగురు పౌరుషవంతులు. వారిలో మధ్యముడు)

3. భూమ్మీద పుట్టిన వాళ్ళలో మధ్యముణ్ణి (మొదటి రెండు లక్షణాలతో భగవంతుడు/రాక్షసుడని అనుకోరాదని ఈ సూచన.)

4. అన్నదమ్ముల్లో మధ్యముణ్ణి. (కుంతీసుతమధ్యముడు)

5. పంచభూతాల్లో మధ్యముణ్ణి. (పృథివి, నీరు, అగ్ని, వాయువూ, ఆకాశమూ – ఈ ఐదింటిలో వాయు అంశనని భావం )

6. రాజులలో ఒకణ్ణి (చాతుర్వర్ణ్య వ్యవస్థలో మధ్యముడు)

7. పుట్టుకలో రెండవవాణ్ణి (కుంతీసుతమధ్యముడు)

8. లోకంలో జరిగే కార్యాలను (లావాదేవీలను) సంధానపర్చే వాణ్ణి. (settling the affairs between different parties, A middle man, సమర్థుడు.)

ఎనిమిది సార్లు మధ్యముడని చెప్పడం ద్వారా, తననెవరూ చంపలేరని, బలవీర్యసమన్వితుణ్ణని, మానవుడినని, తనకు అన్నదమ్ములున్నారని, పంచభూతాల అంశ కాబట్టి మహాప్రతాపవంతుడినని, రాజునని, మధ్యమపుత్రుణ్ణని,అన్ని కార్యాలను చక్కబెట్టగల సమర్థుడినని సూచించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే – ఇది ఘటోత్కచునికి చెబుతున్నట్టుగా చెబుతూ కేశవదాసుకు ఇస్తున్న అభయం. ఇది మొదటి పతాకస్థానకం. ఉద్దేశించిన ప్రయోజనం కంటే ఎక్కువ ఉపకారం జరిగే ఉత్కృష్టమైన మరో అర్థం బయటపడుతున్నది.

పైని సూచనల ద్వారా కేశవదాసు ఆ వచ్చిన ఆసామీని ’భీముడు’ అని గుర్తించేడు.  తనకు నమస్కరించిన అతణ్ణి బ్రాహ్మడు ఆశీర్వదిస్తూ ’వాయురివ దీర్ఘాయుర్భవ’ (‘వాయువు వలే దీర్ఘాయుష్షు గలవాడివగుము’) అని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చక్కటి చమత్కారాన్ని, ఔచిత్యాన్ని పండించాడు భాసుడు. ‘నిన్ను భీముడని నేను గుర్తించేను సుమా ‘ అని కూడా ఆశీర్వాదం సూచిస్తూంది.

- తన కొడుకును రాక్షసునికై ఆహారంగా పంపుతూ “చిరంజీవ” అని ఆశీర్వదిస్తుంది బ్రాహ్మణి. ఇక్కడ ప్రేక్షకునికి నవ్వూ, జాలి రెండూ వస్తాయి. ఇది కూడా ఒక పతాకస్థానకం (A kind of dramatic irony).

- అలాంటిదే నాటకం చివరన ఒక సన్నివేశం ఉంది. అడ్డంకులన్నీ తొలగిపోయిన తర్వాత – చివర్న ఘటోత్కచుడు కేశవదాసుకు నమస్కరిస్తాడు. అప్పుడు కేశవదాసు అతణ్ణి ఆశీర్వదిస్తూ అంటాడు ” పితృసదృశ గుణకీర్తిర్భవ!” (మీ తండ్రి వంటి గుణకీర్తి కలిగి ఉందువు గాక!). ఇక్కడ కూడా ప్రేక్షకుడు కాస్త నవ్వుకుంటాడు. “ఇలా దారిని పోయే వాళ్ళను వేధించక మీ నాన్నలా ప్రజలను కాపాడవోయ్” అనే ధ్వని ఆ ఆశీర్వాదంలో వినిపిస్తుంది. ప్రకృతార్థంలో ఆశీర్వాదమూ, పరోక్షార్థంలో మందలింపును సూచిస్తూంది. ఇది శ్లిష్టం అనే పతాకస్థానకం.

పాత్రౌచితి, పాత్రలస్వభావం:

మధ్యమం లో భాసుడు – అత్యంత సహజత్వంతో నిండిన పాత్రలను సృష్టించాడు. ఎక్కడా అతిశయోక్తులు కానీ, అనౌచిత్యం కానీ పాత్రలలో కనిపించదు. ఆరంభంలోనే బ్రాహ్మణకుటుంబానికి ఘటోత్కచుడు ఎదురైనప్పుడు ఆ కుటుంబసభ్యుల స్పందన ఎలా ఉంది. వారి స్పందన వెనుక వారి వారి స్వభావాలు ఎలా ప్రతిబింబించేయి అన్న విషయాలు వాకిలిలో ఇదివరకే ఒక వ్యాసం లో ప్రస్తావనకు వచ్చేయి.

తర్వాతి ఘట్టంలో భీముడు వస్తాడు. భీముడు – ఘటోత్కచుని ‘మధ్యమా’ అన్న పిలుపు విని ఇది తనకు ఆత్మీయమైన (అర్జునుని) కంఠంలా ఉన్నదని భావించాడు. అటుపై వచ్చి ఘటోత్కచుని చూచాడు. చూచి ఇలా అనుకుంటాడు.

సింహాస్యః సింహదంష్ట్రః మధునిభనయనః స్నిగ్ధగంభీరకంఠః
బభ్రుభ్రూః శ్యేననాసో ద్విరదపతిహను ర్దీర్ఘవిశ్లిష్టకేశః |
వ్యూఢోరా వజ్రమధ్యో గజవృషభగతి ర్లంబపీనాంసబాహుః
సువ్యక్తం రాక్షసీజో విపులబలయుతో లోకవీర్యస్యపుత్రః ||

తాత్పర్యం: సింహము వంటి ముఖము, సింహము వంటి కోరలు, తేనెకళ్ళు, గంభీరమైన గొంతు, పింగళ వర్ణపు కనుబొమలు, గద్దముక్కు, సింహపు దవడలు, శిథిలమైన కేశపాశం, విశాలమైన వక్షస్థలం, వజ్రంలా కఠినమైన నడుము, గజంలా, వృషభంలా నడక, ఇతడు రాక్షసికి పుత్రుడని, మిక్కిలిబలవంతుడని, లోకవీరుని పుత్రుడని స్పష్టంగా తెలుస్తూంది.   (ఈ శ్లోకం ‘శార్దూల విక్రీడితం’ కావడం గమనార్హం.)

- చివరిపాదం ద్వారా భీమునికి – లీలగా ఈతడు హిడింబకూ, తనకూ కలిగిన పుత్రుడని మనసులో ఏదో మూల అనుమానం ఉన్నట్టు భాసుడు అత్యంత ప్రతిభతో చిత్రించాడు. ఈ విధమైన భావాన్నే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో వాచ్యం చేసి అపూర్వమైన శ్లోకం చెప్పాడు.

రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్ద: పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జన్తు: |
తచ్చేతసా స్మరతి నూనం అబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని ||

తాత్పర్యం: అందమైన వస్తువును చూసినప్పుడు, మధురమైన శబ్దాన్ని విన్నప్పుడు ఎంత సుఖంగా ఉన్న ప్రాణికైనా ఏదో తెలియని భావావేశం కలుగుతుంది. బహుశా ఆ సమయంలో, ప్రాణి మనసులో మరచిపోయిన గతం తాలూకు అనుబంధాలు కలవరపెడుతుంటాయి.

భీమునికి కూడా ఘటోత్కచుని చూచి అలాంటి కలవరం కలిగింది. భాసుడు అందమైన దృశ్యంలోనే నిబద్ధం చేస్తే, కాళిదాసు శ్లోకంలో నిమంత్రించి అందమైనశ్లోకాన్ని కూర్చాడు. కాళిదాసు శ్లోకానికి భాసుడే ప్రేరణ యేమో!

ఆ పైన భీముడు బ్రాహ్మణుడైన కేశవదాసును – అక్కడ ఏం జరుగుతోంది? మీకొచ్చిన భయమేమిటి? అని అడుగుతాడు.

అప్పుడా బ్రాహ్మడు తన కథ చెప్పుకొచ్చాడు. ‘అయ్యా! నేను ధర్మరాజు పరిపాలించిన రాజ్యంలోని యూప గ్రామవాసిని. మాది కల్పశాఖ, మాఠరస గోత్రం. పక్కన ఉన్న ఉద్యాన గ్రామానికి, మా మాతులుని ఇంట ఉపనయనం జరుగుతుంటే వెళుతున్నాను. ఇంతలో -

సజలజలదగాత్రః పద్మపత్రాయతాక్షః మృగపతిగతిలీలః రాక్షసో ప్రోగ్రదంష్ట్రః |
జగతివిగతశంకస్త్వద్విదానాం సమక్షం ససుతపరిజనం భోః! హన్తుకామోభ్యుపైతి ||

తాత్పర్యం: కారుమేఘం లాంటి శరీరం, తామరరేకులవంటి కనులూ, సింహపు నడక, పైకి వచ్చిన కోరలతో ఆ రాక్షసుడు, ప్రపంచాన్ని పట్టించుకోక మీ వంటి గొప్పవారి సమక్షంలోనే అయ్యా! నా కుటుంబాన్ని చంపడానికి మీదకు వస్తున్నాడు.’

ఇక్కడ, ‘ధర్మరాజు పరిపాలించిన రాజ్యంలోని యూప గ్రామవాసిని’, ’మీవంటి గొప్పవారి సమక్షం లోనే మీదకొస్తున్నాడు చూడండి’ – అని బ్రాహ్మడు చెప్పిన మాటలు అత్యంత సహజంగా ఉన్నవి. ఇవి బ్రాహ్మణుని బుద్ధిని, భయాన్ని కూడా సూచిస్తున్నాయి. భీముణ్ణి పొగిడి తద్వారా తన కుటుంబానికి అభయం సంపాదించుకోవాలన్న తెలివి కూడా ఇందులో ఉంది.

ఇక్కడ భాసకవి కూర్చిన సూక్ష్మమైన చమత్కారం మరొకటి ఉంది. నాటకారంభంలోనే బ్రాహ్మడు ఘటోత్కచుని రూపాన్ని వర్ణించాడు. ఆపై తిరిగి భీముడు ఎదురయిన తర్వాత తిరిగి ఘటోత్కచుని రూపాన్ని గురించి చెప్పాడు.

ఆ రెండున్నూ వరుసగా చూడండి.

(1)

తరుణరవికరప్రకీర్ణకేశః భృకుటిపుటోజ్జ్వలపింగలాయతాక్షః|
సతడిదివ ఘనః సకంఠసూత్రః యుగనిధనే ప్రతిమాకృతిః హరస్య ||

(2)

సజలజలదగాత్రః పద్మపత్రాయతాక్షః మృగపతిగతిలీలః రాక్షసో ప్రోగ్రదంష్ట్రః |
జగతివిగతశంకస్త్వద్విదానాం సమక్షం ససుతపరిజనం భోః! హన్తుకామోభ్యుపైతి ||

మొదటిది పుష్పితాగ్రం. అది అర్ధసమవృత్తం. 50 మాత్రలు. రెండవది – మాలినీ వృత్తం. పరిమాణంలో పుష్పితాగ్రం కన్నా పెద్దది. భీముని ఎదురుగా ఘటోత్కచుని గురించి చెబుతున్నప్పుడు – కాస్త ’చిలవలు, పలవలు’ కల్పించి చెప్పినట్టుగా సూచించిన చమత్కారం ఇది. ఈ రెండు వృత్తాల గురించి మోహన గారి వ్యాసం లో వివరంగా చదువుకోవచ్చు

ఈ ఏకాంకిక లో ఎనిమిది మంది పాత్రలు. రెండు కుటుంబాలు. ఇద్దరు మధ్యములు. రెండు స్త్రీపాత్రలు.  స్త్రీపాత్రల నిడిచి చాలా తక్కువ. అయినప్పటికీ ఆ పాత్రలను మరిచిపోని విధంగా తీర్చిదిద్దాడు భాసుడు. సంస్కృతనాటకాల గురించి చెబుతూ తదజ్ఞులు ఓ మాట చెబుతారు.

కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకున్తలా |
తత్రాపి చతుర్ధోంక: తత్ర శ్లోక చతుష్టయమ్ ||

సంస్కృతకావ్యాలలో దృశ్యనాటకాలు గొప్పవి. అందులో అభిజ్ఞాన శాకుంతలం, ఆ నాటకంలో నాలుగవ ఆశ్వాసము, అందులోని నాలుగు శ్లోకాలు చాలా గొప్పవి. తన కూతురు కాకపోయినా ఎంతో ముద్దుగా పెంచుకున్న శకుంతలను అత్తవారింటికి పంపుతూ కణ్వుడనే మహర్షి చెప్పే శ్లోకాలు ఆ నాలుగున్నూ.

కాళిదాసు చెప్పిన ఆ శ్లోకాలకు గొప్ప కావ్యగౌరవం ఉంది. సన్నివేశంలో ఎంతో ఆర్తి, అభిమానం ఉన్నవి. మహర్షిసత్తముడే అధిగమించలేని మానవజీవితపు అనుకంప అందులో ఉన్నది. అవి ’చదువుకోవలసిన’ చక్కని నాలుగు శ్లోకాలు. అయితే శాకున్తలం దృశ్యనాటకం. శాకున్తలంలోని ఘట్టంలో కలిగే రసస్ఫూర్తి ప్రేక్షకుడిది కాదు, పాఠకుడిది.

జాగ్రత్తగా అనుశీలిస్తే, మధ్యమవ్యాయోగంలో – పుత్రుణ్ణి కోల్పోతున్న పిచ్చితల్లి “చిరంజీవ” అని అతణ్ణి ఆశీర్వదించటం మరింత ముగ్ధంగా, స్పష్టంగా, అందరికీ అర్థం అయ్యేలా, ఓ దృశ్యనాటకానికి అనుగుణంగా ఉందని తెలుస్తుంది. వ్యక్తిగతంగా ఈ వ్యాసకర్తకు సంస్కృతనాటకాలలో మధ్యమవ్యాయోగంలోని ఈ ఘట్టం దృశ్యనాటకసంవిధానరీత్యా శాకున్తలం కంటే ఉత్తమమైనదనిపిస్తుంది.

అలాగే నాటకం చివరలో “హిడింబ” పాత్ర వస్తుంది. ఆమె కొడుకు తన ’ఆహారా’నికై తోడుకొని వచ్చిన మానవుడిని చూస్తుంది. చూసి ఘటోత్కచుని మందలిస్తుంది. ఆపై, భీముడామెను “ఏమిటే ఇదంతా?” అని అడుగుతాడు అచ్చంగా తెలుగు కుటుంబీకుడిలా.  ఆమె చెవిలో మొగుడితో ఏదో చెబుతుంది. చిరకాలం తర్వాత ఇంటికి వచ్చిన భర్తతో భార్య చెవిలో గుసగుసలాడుతో ఏదో చెప్పటం – చాలా అందమైన, సుకుమారమైన ప్రణయఘట్టం. దీన్ని దృశ్యనిబద్ధం చేశాడు భాసుడు!

భరతవాక్యం :

రూపకం చివర ప్రజాక్షేమం, అభ్యుదయాన్ని కాంక్షిస్తూ ఓ శ్లోకం ఉండటం అన్ని విధాలయిన రూపకాలకు సంబంధించిన ఒక నియమం. దీనిని భరతవాక్యం అంటారు. దీనిని నటులు తెరపై నుంచుని వల్లిస్తారు. మధ్యమంలో భరతవాక్యం యిది.

యథా నదీనాం ప్రభవః సముద్రో యథాహుతీనాం ప్రభవో హుతాశనః |
యథేన్ద్రియాణాం ప్రభవం మనోऽపి తథా ప్రభుర్నో భగవానుపేంద్రః ||

తాత్పర్యం: ఎలాగైతే నదులకు సముద్రం మూలమో, ఎలా యజ్ఞానికి అగ్ని మూలమో, ఎలా ఇంద్రియాలకు మనస్సు మూలమో అదే విధంగా మనకు ప్రభువు భగవంతుడైన ఉపేంద్రుడే.

ఇదివరకు ఒకట్రెండు వ్యాసాలలో చెప్పుకున్నట్టు – భాసునిది నాటకకళ అయితే కాళిదాస మహాకవిది కావ్యకళ. అయితే భాసుడు కూడా అప్పుడప్పుడూ గొప్ప పాండిత్యస్పర్శ, వ్యుత్పత్తిసహితమైన శ్లోకాలు రచించకపోలేదు. అలాంటి రచనల్లో ఈ మధ్యమవ్యాయోగపు భరతవాక్యం ఒకటి. చాలా విస్తృతమైన వ్యాఖ్యానం చేయదగిన శ్లోకం ఇది.

(ప్రభవత్యస్మాదితి ప్రభవః) నదులకు మూలం సముద్రమని ప్రాచీనమైన విశ్వాసం. ఎలా అంటే సూర్యుడు సముద్రం నుంచి నీటిని పీల్చి మేఘాలకు ఇస్తాడు. ఆ మేఘాలు భూమిపై నీటిని వర్షిస్తాయి. ఆ నీటితో వాగులు పారి, ఆ వాగులద్వారా నదులు ఏర్పడతాయి. అలా నదులకు సముద్రం మూలం. ఈ భావననే కాళిదాసు రఘువంశంలో దిలీపవర్ణనలో చెబుతాడు. “సహస్రగుణముసృష్టుమాదత్తే హి రసం రవిః” – అంటే వేయి రెట్లు వర్షించడానికి రవి – సముద్రపు నీటిని కొంత తీసుకుంటాడు. (అలాగే దిలీపుడూ కొంత పన్ను ప్రజలపై మోపి ఎక్కువ మేలు చేస్తాడని ఆయన ఉపమ).

అదే విధంగా “హుతం అశ్నాతీతి హుతాశనః’ – (యజ్ఞమున) సమర్పించిన దానిని భుజించువాడు హుతాశనుడు (అగ్ని).

ఇంద్రియాలకు మూలము మనస్సు. (మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః – భగవద్గీత).

ఉపేంద్రుడు – ఇంద్రుని సహోదరుడు. విష్ణువు అవతారం. భగవాన్ – భగః అస్య అస్తీతి భగవాన్.

భగః అంటే -

ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః|
జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా ||

ఐశ్వర్యము,వీర్యము, యశస్సు, శ్రేయస్సు, జ్ఞానము, వైరాగ్యము – ఈ ఆరుగుణముల యొక్క సమగ్రత్వాన్ని ’భగః’ అంటారు. వీటిని కలిగిన వాడు భగవంతుడు అని వ్యుత్పత్తి.

అంతే కాదు. భగవాన్ అంటే -

ఉత్పత్తిం చ వినాశం చ భూతానామాగతిం గతిమ్ |
వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితి ||

ప్రాణుల పుట్టుకనూ, మరణాన్ని, భూఅభవిష్యత్కాల గతులను, వారి సంస్కారాలను తెలిసిన వాడు భగవంతుడు – అని ఒక నిర్వచనం. ఇప్పుడు ఆ శ్లోకార్థం మళ్ళీ ఒకసారి.

‘ఎలాగైతే నదులకు సముద్రం మూలమో, ఎలా యజ్ఞానికి అగ్ని మూలమో, ఎలా ఇంద్రియాలకు మనస్సు మూలమో అదే విధంగా మనకు ప్రభువు భగవంతుడైన ఉపేంద్రుడే.’

ఈ విధంగా చాలా విస్తృతమైన వ్యాఖ్య పై శ్లోకానికి చెప్పదగింది.

***

మధ్యమ వ్యాయోగం గురించిన కొన్ని అంశాలు ఇవి.  ఈ నాటకాన్ని గురించి చెప్పుకుంటూ వెళితే అంతూ పొంతూ తెలియదు. మధ్యమవ్యాయోగం పుస్తకం వివిధప్రచురణకర్తలు ప్రచురించారు. గణపతిశాస్త్రి గారి Trivendrum Sanskrit Series జాలంలో దొరుకుతుంది. ఈ నాటకాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహ గారూ, వేటూరి ప్రభాకరశాస్త్రి గారున్నూ తెనిగించారు. చిలకమర్తి వారి తెనిగింపు గ్రాంథిక ఛాయల్లో ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ తెనుగుసేత ను ప్రచురించారు.  వాద్యార్ అండ్ సన్స్ వారి ఒద్దికైన అందమైన ఆంగ్ల వ్యాఖ్యానం ఒకటి ఉన్నది.

ఆ మధ్య అంతర్జాలంలో వెతుకుతూ ఉంటే – ఈ ఏకాంకిక ను JNU వాగ్వర్ధినీపరిషత్తు వారు, థియేటర్ లో ఈ నాటకాన్ని ప్రదర్శించిన లంకె కనిపించింది. ఇది యథాతథంగా సంస్కృతంలో ఉంది. మొదటి నాంది పదినిముషాలబాటూ దీర్ఘంగా ఉంది. ఆ భాగాన్ని వదిలి మిగతా చూడవచ్చు. సంస్కృతానికి అలవాటు పడటం కాస్త కష్టమైనా, ఓ మారు అలవాటు పడితే చివరికంటా చూడవచ్చు. ఘటోత్కచ పాత్రధారి అదరగొట్టేడు. ఈ కాలంలోనూ ఈ నాటకప్రదర్శనకు కాస్త మంచి స్పందన ఉన్నట్టు వీడియోలో అగుపిస్తుంది.  వీలైతే తప్పక చూడండి.

***

న తజ్జ్ఞానం న తచ్ఛిల్పం న సా విద్యా న సా కలా|
న తత్ కర్మ న వా యోగో నాట్యేऽస్మిన్న దృశ్యతే || (నాట్యశాస్త్రం -19.143)

నాట్యశాస్త్రంలో కనిపించని జ్ఞానము, శిల్పము, విద్య, కర్మ, యోగము ఏదియునూ లేదు.

**** (*) ****