కిటికీలో ఆకాశం

తోడుని కోల్పోయిన మనిషి దుఃఖం – దేవరాజు మహారాజు పద్యం

అక్టోబర్ 2016

భూమినీ, సముద్రాన్నీ, చెట్లనూ, పశు పక్ష్యాదులను సృష్టించిన తరువాత, దేవుడు పురుషుడిని సృష్టించాడట! ఆ ఒంటరి పురుషుడు దిగాలుగా వుండడం చూసి, చలించిపోయిన దేవుడు, మాట్లాడుకోవదానికైనా, పోట్లాడుకోవదానికైనా అతడికి ఒక తోడు వుంటే బాగుంటుందని భావించి ఒక స్త్రీని సృష్టించాడట దేవుడు.

ఎంతో సానుభూతితో, కరుణతో అతడికి ఒక తోడుని ఇచ్చిన ఆ దేవుడే అర్థాంతరంగా అతడి నుండి ఆమెను వేరు చేసి, ఆమెను తన వద్దకు తిరిగి తీసుకు వెళ్ళిపోతే ఎంత దుఃఖం? సంక్లిష్ట నగర జీవన విధానంలో భారంగా రోజులు గడిపే, వయసు పైబడిన మగ వాడికి ఆ కష్టం ఎంత దుర్భరం?

ఎంతో భారమైన ఆ దుఃఖాన్ని కవిత్వం చేసి, పాటకుల గుండెల్ని బరువెక్కించిన కవి దేవరాజు మహారాజు.

ఒక్కొక్క సారి, భాషకు సంబంధించి, కవిత రూపానికీ, శైలికీ సంబంధించి ఆ కవిత చదువరులను అబ్బురపరచకపోయినా, ఆ కవిత లోని వస్తువు తాలూకు సార్వజనీనత, కవిత లోని ఆర్తి కట్టి పడవేస్తుంది. అట్లాంటి ఒక అరుదైన మంచి కవిత, దేవరాజు మహారాజు గారి ఈ కవిత.
అందమైన బంధం ఏదైనా లోకం ముందు అనవసర ఆర్భాటాలను ప్రదర్శించదు.

బహుశా, అందుకే ఎంతగానో సహచరిని ప్రేమించిన మనిషి సంవేదన కూడా చాలా సాదా సీదాగా అగుపిస్తూనే ఆర్తితో తొనికిసలాడుతున్నది. అక్కడక్కడా వాచ్యంగా తోచినా, కవిత చివరికి వచ్చేసరికి దిగులు నిండిన ఒంటరి శూన్యంలోకి నెట్టివేస్తుంది.

ఒంటరి గూటి పక్షి

నిశ్శబ్దం లోంచి శబ్దం లోకి రావడం – పుట్టుక
శబ్దం లోంచి నిశ్శబ్దం లోకి పోవడం – చావు
ఇవ సహజాలని అందరికీ తెలుసు
అయినా, ఒక్కోసారి అసహజాలని భ్రమిస్తాం!
కలలు ఊహలు భ్రమలు మనిషి ఔన్నత్యానికి కొలబద్దలు
అవి కాలంతో పెనవేసుకు పోయేవి

కాలానికి అల్లుకు పోయిన కలే – జీవితం
ఆ కల కరిగిపోవడమే – కాలం చేయడం

అనూహ్యంగా అకస్మాత్తుగా జీవిత భాగస్వామిని కోల్పోవడం
బతుకులో కరెంట్ పోవడం – శాశ్వత అందత్వమే!
మరీ వయసు పైబడినపుడు ఆ బాధ
మరింత లోతుగా మరింత గాడంగా మరింత చిక్కగా

ప్రేమ అనుబంధం అనురాగం ఉన్నఫళాన తెగిపోతే
తపించే ఏ హృదయమూ తట్టుకోలేదు
బిగుసుకునే పిడికిలి లోంచి, భాగస్వామి ఇసుకలా రాలిపోతే
ఒంటరితనం ఒంటిమేడై పెరిగిపోతుంది
భవిష్యత్తు భయపెడుతుంది

స్మృతిని ఊతకర్రగా చేసుకుని
ముందుకు నడిచిపోవడం చెప్పినంత తేలిక కాదు
మొక్కవోని ధైర్య సాహసాలు కావాలి, గుండె రాయి కావాలి

ఏళ్లకేల్ల దాంపత్య జీవితం తర్వాత
ఏర్పడ్డ వెలితిని ఎలా పూడ్చుకుంటారు ఎవరైనా?
జ్ఞాపకాల్ని అదిమిపెట్టి, తోడుని తనతోనే భావించుకుని
ఇద్దరిలా కనిపించడం మాటలా?
అలాంటి ద్విపాత్రాభినయం మృత్యు సమానమే కదా!
మేత కోసం దేశ విదేశాలకు ఎగిరిపోయిన పిట్టలు
కబురు పెడితే మాత్రం, తను ఎగిరేదెలా?
వారిలో ఇమిడేది ఎలా?

ఆ మాట, ఆ అలికిడి, ఆ స్పర్శ
ఆ చూసుకోవడం, ఆ పంచుకోవడం,
మనసున మనసై కొట్టుకోవడం
మారు మూల పల్లెలో, వేసవి మధ్యాహ్నంలో
ఇప్పుడిక జీవితపు ఆగాథాలు ఎవరితో పంచుకోవడం?
బతుకులో లేని తీపిని, ఆశని ఎవరి కళ్ళలో చూసుకోవడం?

పరిచితాలన్నీ అపరిచితాలై
తనింట్లో తానే అవసరం లేని అతిథి ఐపోవడం
ప్రతి ఊపిరిలో అభద్రత – ప్రతి చూపులో బెరుకు
బతుకు రథం కుంగిపోతున్న సంకేతం
కాలానికి నమస్కరించే నిబ్బరం తప్ప మరొకటి పనికి రాదు

చీకటిని మించిన చీకటి – ఒంటరితనం
మరణాన్ని మించిన మహా విషాదం – తోడు లేకపోవడం!

ఆమె సమక్షంలో జీవితం గొప్ప వెలుగుతో ప్రకాశించేది అన్న విషయాన్ని చెప్పడానికి, ‘జీవిత భాగస్వామిని పోగొట్టుకోవడం అంటే బతుకులో కరెంటు లేకపోవడం’ అంటున్నాడు కవి.

అప్పటిదాకా అతడికి అసహజాల భ్రమల రంగుల ఆకాశంలో కనిపించిన జీవితం, ఆమె నిష్క్రమణతో ఒక్కసారిగా నేల పైన పడిపోయి, ఒక తత్వ చింతన లోకీ, వేదాంతం లోకీ జారి పోవడం ఈ కవితలో మనకు కనిపిస్తుంది.

సంతోషాన్నైనా, దుఃఖాన్ని అయినా, తను బతికే ఇంట్లో కలిసి పంచుకోవడానికి ఒక మనిషి లేకపోతే అది ‘ మరణాన్ని మించిన మహా విషాదం ‘ అని వాపోతున్నాడు కవి.

అంతేనా?
విదేశాలకు ఎగిరెళ్లి పోయిన పిల్లల్ని ‘ మేత కోసం ఎగిరిపోయిన పిట్టలతో ‘ పోలుస్తూ, ‘ వాళ్ళు రమ్మని పిలిస్తే మాత్రం, వెళ్లి వాళ్ళతో ఇమిడేది ఎలా అని కూడా వాపోతున్నాడు.

ఈ కవితలో గమనించవలసిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, చాలా కొద్ది కాలమే కొనసాగి తెగిపోయిన భార్యా భర్తల బంధం గురించి కాదు ఇక్కడ ప్రస్తావించింది … ‘ఏళ్లకేల్ల దాంపత్య జీవితం తర్వాత ఏర్పడ్డ వెలితిని’ గురించి’ ఈ కవిత మాట్లాడింది.

అందుకే, దేవరాజు మహారాజు గారి ఈ కవిత, ఒక మంచి కవితగా మిగిలిపోయింది.

**** (*) ****