కిటికీలో ఆకాశం

మనిషి పతన కథను విప్పిన జింబో పద్యం

నవంబర్ 2016

Poetry is just the evidence of life. If your life is burning well, poetry is just the ash” -Leonard Cohen

నువ్వు జీవించి వున్నావనడానికి కవిత్వమే సాక్ష్యం. నీ జీవితం దగ్ధమవుతున్నపుడు, రాలిపడే బూడిదే కవిత్వం’ అంటాడు ‘లియోనార్డ్ కోహెన్’ అనే కవి.

కొందరు కవులు తమ జీవితం దుఃఖ పూరితమైనపుడు, తమ జీవితం దగ్ధమవుతున్నపుడు మాత్రమే కవిత్వంగా రాలి ఆగిపోరు. అటువంటి కవులకు చుట్టూ వున్న మనుషులూ, వాళ్ళు నివసించే సమాజం, ప్రకృతీ ఇవన్నీ వేర్వేరు అంశాలు కావు. ఒక అంశంలో పతనానికి మరొక అంశం పతనంతో కార్యకారణ సంబంధం వుంటుందనీ, అట్లాంటి విడి విడి పతనాలు మొత్తంగా మానవ సమాజాన్ని ధ్వంసం చేస్తాయనీ, దుఃఖభరితం చేస్తాయనీ భావిస్తారు.

అందుకే, వాళ్ళ కవిత్వం పైకి వ్యాఖ్యానంగా కనిపించినా, విశ్వ మానవునికి సంబంధించిన వేదన ఏదో ఆ కవిత్వంలో అంతర్లీనంగా వుంటుంది. బహుశా, అందుకే శతక కారుని పద్యాలలో కనిపించే క్లుప్తత, గాడత, మానవ సమాజం పట్ల ఆవేదన ఆ కవిత్వంలో గోచరిస్తాయి.

కవిత్వంలో ధ్వనించే ఈ సుకవుల వేదన ఇప్పటిదా?

మానిషాద ప్రతిష్టాం త్వమగమ: శాశ్వతీ: స్సమా:
యత్ క్రౌంచ మిధునాదేక మవధీ: కామ మోహితమ్” అన్న ఆదికవి కాలం నుండీ వున్న వేదనే కదా!

బహుశా, అందుకే కవి ‘జింబో’ అట్లాంటి మానవ విషాదాన్ని మనతో పంచుకోవడానికి రచించిన తన కవితకు ‘అనగనగా‘ అనే శీర్షిక పెట్టారు. ‘ జింబో’ గా తెలుగు కవిత్వ లోకానికి సుపరిచితుడైన మంగారి రాజేందర్ గారు న్యాయస్థానం తీర్పుని తెలుగు భాషలో వెలువరించిన న్యాయమూర్తి కూడా కావడం మరొక విశేషం.

అనగనగా

అనగనగా ఓ వాగుండేది
ఏ నగరం దాని మీద దాడి చేసిందో ఏమో
నీళ్ళే కాదు – ఇసుక కూడా లేకుండా పోయింది

అనగనగా ఓ చెరువుండేది
ఎవరి కాంక్షకి బలయ్యిందో ఏమో
దాన్నిండా సర్కారు తుమ్మల్లా ఇండ్లు మొలిచాయి

అనగనగా ఓ ఇల్లుండేది
ఎందరి స్పేస్ ప్రాబ్లమో ఏమో
దాని గుండె బరువుకి మించి ఫ్లాట్లు కట్టారు

అనగనగా ఓ ఊరుండేది
ఎవరి కండ్లు పడ్డాయో ఏమో
ఊరు మాయమై పోయింది

అనగనగా ఓ కోడి వుండేది
అది ఉదయాన్నే నిద్ర లేపడం
ఎవరికీ నచ్చలేదో ఏమో
దాని గొంతు నొక్కేసారు

అనగనగా ఓ సంస్కృతి వుండేది
ఏ పడమటి గాలి కాటేసిందో ఏమో
అది శిల్పారామంలో అవశేశమై పోయింది

అనగనగా ఓ మనిషి వుండేవాడు
అతని మీద అతనికే కోపం వచ్చి
తలని తీసి మానిటర్ని తగిలించుకున్నాడు

అనగనగా ఓ కథ వుండేది
వినే నాథుడే లేడు

ఇల్లు, ఊరు, వాగు, పక్షి వగైరాలన్నీ ఎట్లా అద్రుశ్యమైపోయాయో కవి ఒక కథ లాగా చెప్పడం ఈ కవితలో మనం గమనించవచ్చు. ఇందులో విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఈ బాధనంతా ఒక కథలాగా పంచుకున్న కవి, చివర్లో ‘ఈ కథ వినే నాథుడే లేడు’ అని వాపోతున్నాడు. అంటే, ఏ పాఠకులతో అయితే తన బాధను కవిత రూపంలో పంచుకుంటున్నాడో కనీసం వాళ్లైనా శ్రద్ధగా వింటున్నారా అన్న ఒక సందేహం కవికి వొచ్చి వుంటుంది.

అంతేకాదు – కవిత నడకలో ఒక వ్యంగ్యం, ఒక నిష్ఠూరం ద్యోతకమవుతాయి. మరి, అవి పైకి స్పురించే వ్యంగ్యం, నిష్ఠూరం మాత్రమేనా? కాదుగదా. పట్టరాని వేదనని వ్యక్తీకరించడానికి కవి ఎంచుకున్న వాహిక!

కొత్తగా చొచ్చుకు వచ్చిన నగరం వాగుని మాయం చేయడం, సర్కారు తుమ్మల్లాంటి ఇండ్లు చెరువుల్ని మాయం చేయడం, ఇల్లు మాయమై అపార్ట్ మెంట్లు రావడం, చివరికి ఊరే మాయమై పోవడం – ఇక్కడిదాకా మనిషి మనుగడ కోసం ప్రకృతి ఇచ్చిన విలువైన సంపదను, మనిషి అత్యాశ ఎట్లా ధ్వంసం చేసిందో చెబుతూ, తదుపరి పాదాలలో ఈ చర్యల పర్యవసానాన్ని ‘ఏ పడమటి గాలి కాటేయడం వల్లనో సంస్కృతి శిల్పారామంలో అవశేషమై మిగిలింది’ అని చెబుతున్నాడు. పర్యవసానంగా, ఆధునిక సాంకేతిక సాధనాలకు మనిషి ఎట్లా దాసోహమయ్యాడో చెప్పడానికి ‘తలని తీసి మానిటర్ని తగిలించుకున్నాడు’ అంటున్నాడు.

గంభీరమైన మాటలూ, క్లిష్టమైన పోలికలూ వగయిరా లేకుండా ఒక విశ్వజనీన పద్యం రచించవచ్చని నిరూపించిన పద్యం ఈ ‘అనగనగా’ !

**** (*) ****