అడుగెయ్యగానే కర్రలవంతెన ఊగుతుంది. వెనక్కి తగ్గి మురుగునీళ్ళలోంచే అవతలికి నడిచెళ్తావు. టార్చి వెలుతురు గుండ్రంగా కదుల్తూ ముందుకెళ్తుంది. పేరు తెలీని ఆ వూళ్ళో చేపల వాళ్ళెవరో భోజనానికి పిలుస్తారు. రేపు రాత్రికెలాగో ఉల్లిపాయలు, దుంపలూ కాల్చుకు తినాలి అనుకుంటూ వాళ్ళ వరండాలో ఆకు ముందేసుకుని కూర్చుంటావు. బారు లంగా, పూల గాజులు వేసుకున్న పిల్ల ఒక్కత్తే కంకర్రాళ్ళతో గిల్లాయిలాట ఆడుకుంటుంది. ఆ పిల్ల నాన్న వెర్రిబాగులోడు, అరుగు మీద బోర్లా పడుకుని ఆపకుండా గొణుగుతూనే ఉంటాడు. లావుపాటి అన్నం లోకి, పెద్ద పెద్ద కూరముక్కల పులుసు. నీకు ఇల్లు గుర్తొస్తుంది. ఓ మూలన సొట్ట పడ్డ ఇరవయ్యేళ్ళనాటి నీ అరిటాకు కంచం, ఈ మధ్యనే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిన నీ ఆఖరి కూతురు, విరిగిపోయిన గడియలో ఇనప శీల దూర్చి నెమ్మదిగా వెయ్యాల్సిన స్నానాలగది తలుపు- అన్నీ గుర్తొస్తాయి. “స్వల్ప రస బేకా?” చేపల వాళ్ల కోడలు కొసరి అడుగుతుంది. వద్దనీ, సాకనీ, లావు గింజల అన్నం తుంబ బాగుందనీ వచ్చీరాని వ్యాకరణంలో నువ్వు చెయ్యడ్డు పెడతావు. చీకట్లో మంచినీళ్ల గ్లాసుని కడుగు నీళ్లతో తొలిపేసిన సంగతి తెలీకుండానే అక్కడ బోర్లిస్తావు. బారులంగా పిల్ల వెర్రిబాగుల తండ్రిని అన్నానికి పిలుస్తుంది. మురుగు ఎండిపోయిన చెప్పుల్ని ఇసుకలో రుద్దుకుంటూ వెదురుబద్దల తడిక దాటుకుని నువ్వెళ్ళిపోతావు. చేపలోళ్ళ కోడలు అరుగుమీద కంచాలు పెడుతుంది. పూలగాజుల పిల్ల వెర్రిబాగుల తండ్రికి చొక్కా సరిచేసి పక్కన కూర్చుంటుంది.
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్