గెస్ట్ ఎడిటోరియల్

మలిన బాష్ప మౌక్తికమ్ము!

నవంబర్ 2016

“నేను కవిత్వాన్ని ఎందుకు ద్వేషిస్తాను” అంటూ పొడుగాటి వ్యాసం ఒకటి రాసాడు బెన్ లెర్నర్. బెన్ స్వయంగా కవి, ఆయన ప్రచురించిన కవిత్వ సంకలనాలకి ఎవార్డులు కూడా వచ్చాయి, కవిత్వాన్ని, కవిత్వ ధోరణులని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన విమర్శకుడు ఆయన. మరి అలాంటి ఒక కవే కవిత్వాన్ని ద్వేషించడం ఏమిటి? దీనికి సమాధానంగా కొన్ని ఆసక్తికరమైన కారణాలు చెప్పుకొస్తాడు బెన్.

ఆయన అభిప్రాయంలో, కవిత్వం రానివారంటూ ఎవరూ లేకపోవడమే కవిత్వంతో మొదటి ఇబ్బంది. ఎవరితోనైనా “నేను కవిత్వం రాస్తా” అని చెప్పారనుకోండి, లేదా ఏదో కవితని ప్రస్తావించారనుకోండి. సాధారణంగా, అవతల వ్యక్తి కూడా, “ఓ, నేను కూడా ఒకప్పుడు కవితలు రాసానండోయ్” అనో, లేదా “మా అక్క కూతురు కూడా మంచి కవితలు రాస్తుంది, మీలానే” అనో ఇలాంటి సమాధానాలేవో చెప్తారు. అదే, మీరు ‘నేనో ఇంజినీర్ని, డాక్టర్ని”, లేదా పోనీ, “నేను నవలలు రాస్తా”నని చెప్పారనుకోండి – అప్పుడు మాత్రం ఇటువంటి “నేను సైతం..” అనే సమాధానాలు రావు. ఎందుకో, అందరికీ కవిత్వం అంటే సొంత జాగీరు. అది రానివాడు ఏవడూ ఈ భూప్రపంచంలో లేడు. అలాగే, కవిత్వం అర్థం కావడం ఏ ప్రయత్నమూ, ఏ అధ్యయనమూ లేకుండా పట్టుపడాలనుకుంటారు చాలామంది. కవిత్వానికీ ఒక చరిత్ర ఉంది, ఒక భాష ఉంది, దానిలోనూ ఎన్నో ప్రయోగాలు, మార్పులు ఉన్నాయి, దానిలోనూ ఏదో సాంకేతికత ఉంది – అది కాస్త ప్రయత్నం చేస్తేగానీ వశంకాదు, అని అనుకోరు. అందుకని, మనకి అర్థంకాని కవిత్వం అంతా అర్థంలేనిదే!

ఇకపోతే, చాలా మంది కవులకి కవిత్వం అంటే అందమైన, భావుకమైన, ఉద్వేగమైన వచనం. వెన్నెల పుష్పాలనీ, వెలుగుపూలనీ, అందమైన సాయంత్రాలలో, శ్రావణమేఘాలుతో కురిపించని కవి ఎవడున్నాడు? కవిత్వం అంటే సున్నితంగానో, మధురంగానో, అందంగానో, మరోవిధంగానో “వాపోవడమే”! అది ప్రేయసికోసం కావొచ్చు, ప్రభువుకోసం కావొచ్చు, దేవుడికోసమో, కౌగిలికోసమో, కార్మికుల కష్టాలకోసమో కావచ్చు. వస్తువు ఏదైనా గానీ, “విరహమో మరి కాస్త వేదనో” కవిత్వ ఘోష.

చాలా కవితలు ఇక్కడే ప్రారంభం అవుతాయి, చాలా మంది కవులూ ఇక్కడే ఆగిపోతారు. “any lyrical expression is poetry” అనుకోవడంతో చాలా చెత్త కవిత్వంగా చలమణీ అయిపోతోంది అంటాడు బెన్. ఇది కవిత్వంతో మొదటి ఇబ్బంది.

అందుకే, “కాలేజీ రోజుల్లో అందరూ కవిత్వం రాస్తారు. తెలివైనవాళ్ళైతే పెద్దయ్యాక ఆపేస్తారు, అంతే తేడా” అంటాడు అంబర్టో ఇకో.

ఈ గీత దాటిన కవులు అసలైన కవులు. “You’re moved to write a poem because of some transcendent impulse to get beyond the human, the historical, the finite. But as soon as you move from that impulse to the actual poem, the song of the infinite is compromised by the finitude of its terms. So the poem is always a record of failure” అంటాడు అలాన్ గ్రాస్మాన్. అందుకే, ప్రెంచ్ కవి ఆర్థర్ రింబాడ్ అతి చిన్న వయసులోనే కవిత్వం రాయడం ఆపేసాడట. ఈ భాధనే శ్రీశ్రీ కవిత్వమొక తీరని దాహం అంటాడు.

రాబర్ట్ బ్రౌనింగ్‌ని ఎలిజబెత్ బారెట్ ఓ సారి మీ కవితలకి అర్థం ఏమిటీ అని నిలదీసిందట, కాస్సేపటికి విసిగిపోయిన బ్రౌనింగ్ – “At the time of writing, I and God know, after I finish, only God knows” అని చమత్కరించాడు. ఇదీ కవిత్వంతో అసలు గొడవ.

కృష్ణశాస్త్రి కవిత్వంలో ఈ రెండు ధోరణలూ స్పష్టంగా కనిపిస్తాయి. కృష్ణశాస్త్రి భావకవిత్వానికి ఒక కొత్త భాషని తయారు చేసాడు – అందులో వేదనని మధురంగా వ్యక్తీకరించవచ్చు. తీయతేనియ బరువులు, మరిగే వెన్నెలలూ, సౌఖ్యజ్వాలలు ఈ కవిత్వ భాషలో ఉంటాయి. ఓ రకంగా, కృష్ణశాస్త్రి కవిత చెప్పడానికి కొన్ని సులువైన మార్గాలు తయారు చేసాడు. కానీ, ఆయన అక్కడితో ఆగిపోలేదు, ”విశ్వమంతా ప్రాణవిభుని మందిరమైన ఇక వీధి వాకిలేది చెల్లెలా” అని రాధ చేత దమాయించి అడిగించాడు. గొప్ప కవులందరి కవిత్వం లానే, కృష్ణశాస్త్రి కవిత్వాన్ని కూడా అర్థం చేసుకుని అస్వాదించడానికి కొంత వ్యాఖ్యానం అవసరం.

***

రామసూరిగారి పరిచయం కాక పూర్వం, కృష్టశాస్త్రి కవిత్వం నాకు “pain poetry” లానే అనిపించేది. ఆయన రాసిన ప్రతి పాటా, ప్రతి కవితా కట్టిపడేసినా, అందులో కవిత్వం అంతా ఒక సున్నితమైన వేదనగానే అనిపించేది.

రామసూరిగారి పరిచయం నాకు కవిత్వాన్ని ఆస్వాదించడం అంటగట్టింది. విజయనగరంలో డిగ్రీ చదివే రోజుల్లో, ప్రతి సాయంత్రం ఆయన ఇంట్లోనే గడిచింది. ఆయనకి పద్యాన్ని పైకి చదవడం, పద్యం చదివి అందులో కవిత్వానికి దీపంపట్టి చూపించడం వచ్చు. శ్రీశీలో సింబలిస్టుని, టాగూర్లో ఒక లిరిసిస్టునీ, పట్టాభిలో సైటైరిస్టునీ మాస్టారే చూపించారు. కవిత్వం అంటే, కరుణగానీ, వేదనగానీ, అందమైన వచనంగానీ కాదనీ, అదంతా కవిత్వానికి సరంజామా అయితే కావొచ్చుగానీ, అసలు కవిత్వమంటే సౌందర్యానుభూతి అని ఆయన చెప్తూ ఉండేవారు. ప్రపంచం ఆంతా అర్థం కానక్కరర్లేదు, అందమంతా అనుభవంలోకి రానక్కరలేదు అంటుండేవారు.

మాస్టారు పిహెచ్. డి చెయ్యాలనుకున్నప్పుడు ముందుగా ముళ్లపూడి వెంకట రమణ సాహిత్యం మీద చేద్దాం అనుకున్నారు. ఆయన శిష్యులమూ, మిత్రులమూ కొంతమందిమి, “మీరు కృష్ణశాస్త్రి సౌందర్యతత్వం మీద చేస్తేకానీ వీల్లేదు” అని పట్టుబట్టాం. ఎందుకంటే, రామాసూరిగారు మంచి కవి, కవిత్వాన్ని ఆయన ఎంతో ఇష్టంగా అధ్యయనం చేసారు, పైగా ఆయన కృష్ణశాస్త్రిగారి దగ్గర కొన్నాళ్లు పనిచేసారు. దేవులపల్లే ఆయన్ని విజయనగరం కాలేజీలో ఉద్యోగానికి పురమాయించారట కూడా. ఆ విధంగా ఆయనకి కృష్ణశాస్త్రి జీవితం గురించీ, కవిత్వంగురించీ చాలా లోలైత అవగాహన ఉంది.

ఇదంతా ఒక ఎత్తైతే, ఆరోజుల్లో తెలుగు సాహిత్యం “సామాజిక స్పృహ”తో చెమటలుపట్టి ఉంది. అప్పట్లోనే ఈయన, “the purpose of poetry is to create an aesthetic experience – its subject can be as wide and diverse as the world, its expression as deep and subtle as the human heart, but its function nonetheless is only one” అనేవాడు.

కృష్ణశాస్త్రి సౌందర్యతత్వం అనే పరిశోధనా వ్యాసంలో ఈ విషయాన్ని రామసూరి అలవోకగా వ్యాఖ్యానించాడు. ఆయన థీసెస్ కేవలం శాస్త్రిగారి కవిత్వం మీద సమగ్రమైన, సాధికారమైన వ్యాఖ్యానం మాత్రమే కాదు, శాస్త్రిగారి కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, దాని అవసరం మనకెందుకో చెప్పిన కదళీపాకం.

రామసూరి తన పరిశోధనా వ్యాసంలో ఐదు ధారలని ఒడుపుగా అల్లుకుంటూ పోయారు. శాస్త్రిగారి కవిత్వ జీవితం – ఆయన్ని ప్రభావితం చేసిన వ్యక్తులూ, ఆయన కవిత్వం వెనకాల ఉన్న ప్రేరణలు, ముఖ్యంగా శాస్త్రిగారిపై అప్పటి రొమాంటిక్ కవులు, సూఫీకవుల ప్రభావం మొదలైనవి మొదటిది. రెండోది – తెలుగులో భావకవితా విప్లవం వెనక ఉన్న చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, మూడోది – శాస్త్రిగారి కవిత్వ శైలి, కవిత్వ వ్యాకరణం, నాలుగోది – శాస్త్రిగారి కవిత్వం మొత్తం – తొలినాటి పద్యాలు మొదలుకొని, సినిమాపాటల వరకూ ఉన్న ఆయన కవిత్వాన్నంతా ఒక విస్తృతమైన చట్రంలోకి తేవడం, ఐదోది – శాస్త్రిగారి కవిత్వంలోని సౌందర్య ప్రస్థానం. అక్కడ ఆగిపోకుండా, సుమారుగా ప్రపంచంలోని కవిత్వ ధోరణులన్నీ ఈ వ్యాసాలలో పరిచయం చేసారు రామసూరి. ఇదంతా సామాన్య పాఠకుడుకి అర్థమయ్యే రీతిలో సునాయాసంగా చెప్పడం ఉపాధ్యాయ వృత్తితో వచ్చిన ప్రతిభ.

ఇందులో కొన్ని ముఖ్యమైన భాగాలు గత కొన్ని నెలలుగా వాకిలిలో వచ్చాయి. త్వరలో, ఈ పరిశోధనావ్యాసం ఒక పుస్తకంగా కూడా వస్తుందని అశ.

***

ఇంతకీ, సౌందర్యం అంటే ఏమిటి? నాకు అర్థమయినంతలో అది బాహ్యమైన, అంతర్ముఖమైన “అందం” కాదు. అందం యొక్క అభివ్యక్తీ కాదు. అనాది అయిన, అనాదమైన మానవత్వాన్ని మనకి అనుభవంలోకి తెచ్చే ప్రతి క్షణమూ సౌందర్యమే.

వచనంతో, వ్యాఖ్యానంతో కన్నా, మన సాహిత్యంలో సౌందర్యానుభూతిని నిర్వచించే మూడు పద్యాలని ఉదాహరణగా తీసుకొని చెప్తాను.

సా తత్వతః సమంతా
త్సత్యస్య విభోసత్తా తపఃశక్తీ
లీలా మహిళా వపుషా
హైమవతీ తనుషు కుండలినీ

ఇందులో కవి – స్థాణువుగా, సంకల్పంగా మాత్రమే ఉన్న విభుని (శివుడు) చుట్టూ ఆవరించుకుని ఉన్న ఆయన తపఃశక్తినే ఉమగా వర్ణిస్తున్నాడు. వారిద్దరి మధ్య జరిగే “క్రీడే” మనం ఎన్నో విధాల దర్శిస్తాం అంటాడు. ఇందులో విభుడు, మహిళా అనేవి సింబల్స్. అంతర్ముఖమై, అతి శక్తివంతమై, జడంగా స్ఠాణువుగా ఉన్న వస్తువు ఒకటి, దాని అంతర్మధనంలోంచి ఉద్భవించిన చాలిత శక్తి మరొకటి. ఈ రెండిటి మధ్యా రాపిడి, కలయిక సృష్టిలో అన్నిచోట్లా ఉన్నాయంటాడు కవి – ఆకాశంలోనూ, మానవ దేహంలోనూ, కవిత్వంలోనూ ప్రధానమైన క్రీడ ఇదే అంటాడు. ఇది తత్వశాస్త్ర పరిభాషలో సౌందర్య క్షణం.

సౌందర్యలహరిలో, శంకరుడు మరికాస్త ముందుకి పోయి, కవిని, కవి అనుభూతిని, గానం పుట్టుకనీ, గేయం విస్తృతినీ ఒకే శ్లోకంలో ఇలా చెప్తాడు.

కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ .
విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ
గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాంరంజనమమీ

శంకరుడు మాత్రమే ఊహించగలిగిన చిత్రం ఇది. ముందుగా, ఒక నిశ్శబ్దమైన, నిశ్చలమైన తామరకొలను ఒకదాన్ని ఊహించండి. అందులో ఎన్నో తామరలు ఉదయ కాంతికి అప్పుడప్పుడే కాస్త సిగ్గుగా, భక్తిగా తలలెత్తి విచ్చుకుంటున్నాయి. ఉదయారుణకిరణాల స్పర్శలోని మాధుర్యంతో అవి తడిసిపోతున్నాయి. అవి పరమేశ్వరిని కొలిచే కవి హృదయాలు, ఆ హృదయం భజిస్తున్నది ఆమెనే (ఆమె అరుణిమనే, ఆమె కారుణ్యాన్నే). ఆ భజనే, సరస్వతి శృంగార హేలగా, వాటి చుట్టూ ఉన్న సరస్సనే కావ్య ధారలుగా ప్రవహిస్తూ రసజ్ఞులని రంజింపచేస్తోంది.

చాలా గొప్ప భావన ఇది. కవి పడే మధనని, కవిత్వం పుట్టే క్షణంలో ఉన్మత్తమైనపోయిన కవి మనస్సునీ, అక్కడనుండీ ఉప్పొంగే ఒక భావన భాషగా మారడంలోని శృంగారాన్నీ – ఇవన్నీ ఒక్క పద్యంలోనే చెప్పగలగడం ఒక్క శంకరుడికే సరి. ఇంతటితో ఆగలేదు అయన – సరస్సులోంచి తామరలు పుట్టడంలేదు, తామరలకి ఉదయకాంతితో నడుస్తున్న శృంగారంలోంచే సరస్సు ప్రవహిస్తోంది అనే ఊహకి కవిత్వానికి మించిన తాత్విక దృష్టికావాలి. ఈ భావననే, ఎన్నో శ్లోకాలలో సౌందర్యలహరిగా గానం చేసాడు శంకరుడు.

The function of poetry is the invocation of the Muse; its use is the experience of mixed exaltation and horror that her presence excites అన్న రాబర్ట్ గ్రేవ్స్, ఈ పద్యం చదివుంటే ఆనందతాండవం చేసేవాడేమో! అందుకే, కృష్ణశాస్త్రి “ ఒక మంగళానిలము కొనితెచ్చి అందిచ్చిపోయే అజరామరము నీ వాణి, నా గీతి అప్పుడే నగలన్నీ విడనాడి శిరము వంచెను ధూళివరకు నీ పదమాని”, “ ఏమేను లేని నీ వీ దృగాళి నెట్టు లిమిడినావు” అంటాడు.

“ఎలదేటినోయి స్వామీ, నేను సెలయేటి
అలలలో కదలేటి కలువ పూపడవలో
ఊయల నీ లీల నూగేను తూగేను
నీ యోలగము వేళనే యింత మరపేల?
తరపి తేనియసోన తొరిపి మంచుజలాన
కురిపించి రెవరు క్రొవ్విరిగుండె లోలోన
తగిలించి వలపు పుప్పొడి బూది నా మేన
బిగియించిరెవరు మోదుగుపూవు చాపాన?”

అన్న కృష్టశాస్త్రి తుమ్మెదపాట పై రెండు శ్లోకాల మధ్యా ఊయలలూగే భావుకమైన సౌందర్యక్షణం. ఇటువంటి క్షణాలలోనే, “ఎటుల సాగునో బ్రతుకు ఈ పాటయె లేకుంటే కడలి చేరువరకు” అనిపిస్తుంది.

***

మలిన బాష్ప మౌక్తికమ్ము
మిల మిల నీ కనుల నిలువ
తళ తళ మని తారలు నటయించునురా పాపీ

భరియింపగరాని లజ్జ
శిరము వంగి క్రుంగినంత
తెరల దాటి చందమామ నవ్వునురా పాపీ

ఇంతకాన్నా గొప్పగా, ఏ కాలంలోనూ, ఏ భాషలోనూ, ఏ కవీ “aesthetic encounter” ని నిర్వచించలేదు.

ఇంతగొప్ప కవిత్వాన్ని ఇచ్చినందుకు కృష్ణశాస్త్రికీ, దాన్ని నేర్పినందుకు రామసూరిగారికీ ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? ఎన్ని మలినబాష్ప మౌక్తికమాలలు కట్టినా, అవి కవి ఋణాన్ని, గురు ఋణాన్ని తీర్చగలవా?

***

సంస్కృత శ్లోకాలకి తాత్పర్యం:

సా తత్వతః సమంతా
త్సత్యస్య విభోసత్తా తపఃశక్తీ
లీలా మహిళా వపుషా
హైమవతీ తనుషు కుండలినీ (ఉమా సహస్రం, 1.3)

సా తత్వతః సత్యస్య విభోః సమంతాత్ తతా తపశ్శక్తిః లీలా మహిళా వపుషా హైమవతీ తనుషు కుండలినీ

ఆమె యథార్థముగా, విభుడను స్వద్వస్తువున కంతటా వ్యాపించియున్న తపఃశక్తి, ఆమెయే లీలామాత్రమైన స్త్రీ రూపముతో హైమవతిగానూ, శరీరధారులందు కుండలనీ రూపములోనూ ఉంది.

కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ .
విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ
గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాంరంజనమమీ (సౌందర్యలహరి, 16)

హే భగవతీ = తల్లీ, కవీంద్రాణాం = కవులయొక్క, చేతః = చిత్తమనే, కమలవన = తామరతోటకు, బాలాతప = లేయెండయొక్క, రుచిం = కాంతివంటిదైన, అరుణామేవ = అరుణ యను పేరుగల, భవతీం = నిన్ను, కత్ చిత్ = కొందరగు, యే సన్త = ఏ సజ్జనులు, భజన్తీ = సేవించెదరో, తే = ఆ, అమీ = వీరు, విరించి = బ్రహ్మయొక్క, ప్రేయస్యాః = ప్రేయసి అగు సరస్వతి యొక్క, తరుణతర = ఉద్రిక్తమైన, శృంగారలహరీ =శృంగారరస ప్రవాహమనే, గభీరాభిః = అగాధమైన, వాగ్భి = వాక్కులచేత, సతాం = సజ్జనులయొక, రంజనం = అహ్లాదమును, విధధతి = చేయుదురు.

**** (*) ****


Editors’ note:
నవంబర్ ఒకటిన ప్రముఖ తెలుగు కవి కృష్ణశాస్త్రి జయంతి సందర్భంగా ఈ నెల వాకిలి సంచికను కృష్ణశాస్త్రి ప్రత్యేక సంచికగా మీ ముందుకు తీసుకు వస్తున్నాం. గత కొన్ని నెలలుగా శాస్త్రి గారి సాహిత్యంపై ప్రచురిస్తున్న రామసూరి గారి సిద్ధాంత వ్యాసాలను ఈ నెలతో ముగిస్తున్నాం. ఈ వ్యాసాల ప్రచురణ వెనక ప్రేరణ, సహకారం అందించిన పప్పు నాగరాజు గారికి వాకిలి తరపున కృతజ్ఞతలు.