వ్యాసాలు

ప్రబంధరాగలహరి

జనవరి 2017

…అలా ప్రవరుడు వీణను మ్రోగిస్తున్న అపురూపసుందరిని చూచాడు. (ఇదే పత్రిక లో ఇదివరకు వినిపించిన ప్రబంధవిపంచిస్వరలహరి ని వీలైతే ఓ మారు ఆలకించి రాగలరు.)

రూధిని

అప్సరోభామిని

మృగమదము, ఘనసారము మేళవించిన తాంబూల చర్వణంతో ఆమె మోవి రాగ రంజితమైనది.
ఆ చిన్నదాని అంగదట్టపు (పావడా) కాంతిప్రసారము వలన చంద్రకాంతమణిపీఠము రాగ రంజితమైనది.
ఆమె తన గోళ్ళతో వీణపై రాగాలు పలికిస్తూ పాడుకుంటున్న జిలిబిలిపాటతో పరిసరాలు ’రాగ’ రంజితమైనవి.
సన్నగా ఆలాపం చేస్తూ అరమూసిన కనులతో రతిపారవశ్యవిభ్రమమమును తెలియజేస్తూ ఆమె మనసు రాగ రంజితమైనది.

(వరూధినీప్రవరాఖ్యోపాఖ్యానం వడ్డాది పాపయ్య గారి కుంచెలో)

రాగము – అంటే సరిగమలతో కూడిన గీతము, ఎరుపురంగు, ప్రేమాతిశయము అని రకరకాల అర్థాలు ఉన్నాయి. (ఇలా ఒక విషయాన్ని అనేక విషయాలతో వర్ణించి చెప్పడాన్ని, సాభిప్రాయప్రకటననూ, ప్రతిపాదనావైచిత్రిని లేదా ప్రౌఢిమను ఓజస్సు అనే అర్థగుణంగా ‘రసగంగాధరం’ లో జగన్నాథపండితరాయలు పేర్కొంటాడు.)

అన్ని అవ్యక్త రాగాలు పలికించే వరూధిని, ప్ర-వరుని చూచింది. చూచి ఆ ’పంకజ’ముఖి, ఆతని సౌందర్యానికి మోహవిభ్రాంతి చెంది, తన ’అరవిందము’ను పోలిన తన పాదముల అడుగులు తడబడుతుండగా దిగ్గున లేచి ఎదురేగింది. ప్రవరుడికి మాత్రం అవేవీ పట్టలేదు. తనను ఊరికి చేర్చమని ఆమెను ప్రార్థించాడు. ఆవిడ – ఇక లాభం లేదని, ఇదివరకు అవ్యక్తంగా చూపిన అనురాగాన్ని వ్యక్తం చేసింది. ఇన్ని వ్యక్త అవ్యక్త రాగాలు పలికించినా, ఆ ’అరుణాస్పదపురవాసి’ ప్ర-వరుడికి ఆమెను చూడగా ఎదలో అనురాగం ఉదయించలేదు. (ఆస్పదము అంటే – నెలకొను, ఊనిక base అని అర్థం. అరుణాస్పదము – అంటే కావ్యంలో ప్రకరణికార్థంగా ఏ ప్రత్యేకతా లేదు కానీ, వ్యావహారికంగా ’రాగ’బద్ధమైన అని అర్థం తీసుకోవచ్చు.) రాగానికి (ఎరుపు రంగుకు) నిలయమైన ’అరుణాస్పద’పురవాసి ప్రవరుడికి – అంత అతిలోకసౌందర్యవతిని చూచినా ’రాగం’ (ప్రీతి) ఉదయించలేదు. ఇక చేసేదేం లేక ఆ ’పాటల’ గంధి అనురాగాన్ని సువ్యక్తం చేసి ఆతణ్ణి కౌగిలించుకుంది. (పాటలమంటే ఎఱుపు రంగు కలిగొట్టుపువ్వు). ఆ భూసురుడు శ్రీహరి నామస్మరణతో మోము తిప్పుకుని ఆమెను పక్కకు త్రోసి – చివరకు అగ్నిని ప్రార్థించాడు. “స్వాహావధూవల్లభుని” ప్రత్యక్షం చేసుకుని. ఆ దేవుని అనుగ్రహంతో ’నవ్వరూధిని హృదయకంజమున రంజిల్లు నమందాను రాగ రస మకరందంబు నందంద పొంగంజేయుచుఁ’ నిజగృహానికి వెళ్ళేడు.

వలచిన ప్రియుడు కనుమరుగయినాడు. ఇక ఈ అప్సరకాంత తీవ్రవిరహశోకంలో పడ్డది. ఆమె ’దరుణ కమలదళ శోణంబులగు దృక్కోణంబులన్’ కన్నీరు దిగువాఱింది.

రాగం
పంకజముఖి
అరవిందము
అరుణాస్పద పురము
పాటలగంధి
స్వాహావధూవల్లభుడు
తరుణకమలదళ శోణంబు

స్వారోచిషమనుసంభవం/మనుచరిత్ర లో తడవ తడవకూ నాయికానాయకులకు, ప్రకృతి వర్ణనలకు సంబంధించిన కవిప్రయోగాలలో- ’అరుణం’/ఎఱుపు రంగు కనిపిస్తుంది. ఈ అరుణం వెనుక కవిహృదయం ఏమై ఉంటుంది?

***

వరూధిని ’రాగ’రంజిత. ప్రవరుడు – ’అరుణా’స్పదపురవాసి. ఈ కథను కృతికర్త పెద్దన, కృతిభర్త రాయలవారికి చెబుతున్నాడు. చెబుతూ కృష్ణరాయలను “హరనిటల నటత్పావక పరిభావి మహః ప్రావృతనిఖిలాశ” అని ప్రస్తుతిస్తాడు.అంటే – “ఈశ్వరుని చిచ్చరకన్నులో నర్తించే అగ్నిని ధిక్కరిస్తున్న ప్రచండ తేజః ప్రతాపాలతో దిశలను నింపినవాడా” అని అర్థం.

“శుక్లత్వం కీర్తిహాసాదౌ కార్ష్ణ్యం దుష్కీర్తఘాదిషు
ప్రతాపే రక్తతోషత్వే రక్తత్వం క్రోధరాగయోః” – కావ్యకల్పలత.

(ఇది ’హరనిటల నటత్పావక..’ పద్యానికి సంబంధించి, శేషాద్రి రమణ కవుల మనుచరిత్ర వ్యాఖ్యలో ఉటంకించిన శ్లోకం)

కీర్తిని వర్ణించే సందర్భంలో తెలుపు రంగునూ, ప్రతాపాన్ని ఎఱుపు రంగుతో ఉపమించాలి. ఉదయాన్ని, క్రోధాన్ని, రాగాన్ని అరుణవర్ణంగా చూపాలి. ఇవి కవిసమయాలు. కావ్యనాయకుడు, కావ్యనాయికలతో బాటు ‘అగ్నిని ధిక్కరించే తేజః ప్రతాపాలతో అలరారే శ్రీ కృష్ణదేవరాయలు’ అనగా కృతిభర్త కూడా ఎఱుపు రంగుకు ప్రతీకే. వీరందరూ కాక అంతట అక్కడకు కర్మసాక్షి ఏతెంచినాడు. ఆయన కూడా అరుణుడు. అంతవరకూ కావ్యారంభం నుంచీ అవకాశం చిక్కినప్పుడల్లా ’ఎఱుపు’ రంగుతో దోబూచులాడిన అల్లసాని పెద్దన సంధ్యా’రాగా’న్ని తొమ్మిది పద్యాలలో అపూర్వంగా వర్ణించాడు. అందులో తలమానికమైన పద్యం మొదటిది.

చం||
తరుణి ననన్యకాంత నతిదారుణ పుష్పశిలీముఖవ్యథా
భరవివశాంగి నంగభవు బారికి నగ్గముసేసి క్రూరుఁడై
యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని, రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చెఁ గషాయ దీధితిన్. (3-10)

తరుణిన్ = కన్యను,
అనన్యకాంతన్ = మరియొక ప్రియుడు లేనిదానను,
అతిదారుణ పుష్పశిలీముఖవ్యథాభరవివశాంగిన్
అతిదారుణ = మిక్కిలి క్రూరమైన
పుష్పశిలీముఖ = కుసుమశరునియొక్క
వ్యథాభర = బాధచేత
వివశాంగిన్ = పరవశయైన శరీరము గల దానిని,
అంగభవు = మన్మథుని
బారికిన్ = తావునకు,
అగ్గముసేసి = అర్పించి
క్రూరుఁడై = కఠినుడై
అహంకృతితోన్ = అహంకారముతో
మహీసురాధముడు = బ్రాహ్మణబ్రువుడు
అరిగెన్ = వెళ్ళినాడు
అని = అనుకొని
రోషభీషణస్ఫురణ = కోపముచే భయంకరమైన తేజమును,
వహించెనో అనన్ = దాల్చెనో అన్నట్టుల
నభోమణి = భానుడు
కషాయదీధితిన్ = ఎఱుపు రంగును
తాల్చెన్ = వహించెను.
కన్యను, పరపురుషుని ఎఱుగక తననే వలచిన వరూధినిని ప్రేమను అంగీకరించకుండా, ఆమెను మన్మథుని బారికి వదిలి, ఆ బ్రాహ్మడు అహంకారంతో క్రూరుడై వెళ్ళిపోయాడు – అన్నట్టుగా ఆకాశాన సూర్యుడు కషాయ వర్ణాన్ని సంతరించుకున్నాడు.
(ఇక్కడ కషాయమంటే ఎఱుపు).

(అల్లసాని పెద్దనకు ప్రేరణనిచ్చిన హంపి (నాటి విద్యానగరం) లో ఓ సంధ్య.)

చాలా గమ్మత్తైన పద్యం యిది. శిరీషకుసుమపేశలసుధామయోక్తులతో అల్లనల్లన సాగే ఈ పద్యంలో అల్లసాని పెద్దనామాత్యుని శైలి స్పష్టంగా కనిపిస్తున్నా – దీనిని పెద్దన వ్రాసి ఉండడని కొందరు పండితులు అన్నారు. ఈ పద్యభావంలో కవి నాయిక పెద్దన వరూధినిని సమర్థిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పైగా అదివరకు భాషాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు అని నాయకుని పొగిడి, ఈ ఘట్టంలో ప్రవరుని పట్టుకుని ’మహీసురాధముడు’ – అని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాడు. అంతేకాక అంతకు ముందరి ఘట్టం వరకున్నూ ప్రవరుని ద్వారా కర్మనైష్ఠిక వాదాన్ని సమర్థించిన పెద్దన అంతలోనే ప్రవరుని ఆక్షేపించి వాదంలో ప్రతికక్షి అయిన నాయికను పరోక్షంగా సమర్థిస్తూ ఎలా కవిత్వరచన చేస్తాడు? అందుచేత ఇది పెద్దన రచన అయి ఉండదని కొందరు పండితుల ఊహ. ఆలోచిస్తే ఈ ఊహ అసమంజసమేమో అని అనిపిస్తుంది. అల్లసాని పెద్దనకవి రసలుబ్ధుడు, రసావేశపరుడు. ఇదివరకటి వ్యాసంలో చెప్పుకున్నట్టు రసావేశానికి, ఔచిత్యానికి కొంత చుక్కెదురు. ఓ అద్భుతమైన దృశ్యాన్ని కానీ, నిరుపమానమైన సౌందర్యాన్ని కానీ చూచి మనస్సులో భావించినప్పుడు, ఆ భావనకనుగుణంగా కవిత్వం జాలువారినప్పుడు ఆ ఘట్టంలో ఒకింత ఔచిత్యం లోపం జరుగటం అంతపెద్ద ముప్పు కాదు. ఇటువంటి అనుద్దేశ్యపూర్వక ప్రమాదాలు (Unforced errors) అక్కడక్కడా పెద్దన కవిత్వంలో కనిపిస్తాయి.

అల్లసాని పెద్దన నివసించిన నాటి విద్యానగర (కిష్కింధ) ప్రాంతంలో మాల్యవంతం ప్రస్రవణగిరి సానువులపై సంధ్యాకాలపు ఆకాశాన్ని వాల్మీకి మహర్షి ’పుండు’ లా ఉందని వర్ణించాడు.

సంధ్యారాగోత్థితైస్తామ్రై రన్తేష్వధికపాణ్డరైః |
స్నిగ్ధైరభ్రపటచ్ఛేదైః బద్ధవ్రణమివాంబరమ్|| (వాల్మీకిరామాయణము, కిష్కింధాకాండ. 28.5)

వర్షము వెలసిన తర్వాత అల్పజలసంచయంతో తెల్లగా నున్న మేఘాలతో కూడిన యంబరము సంధ్యారాగాంచితమై – శరీరంపై ఏర్పడిన పుండుకు బట్టతో కట్టిన తెల్లటి కట్టులాగా, మధ్యభాగంలో ఎఱ్ఱగా. చివరల లేతరంగులోనూ ఉందట. తప్పిపోయిన సీత తిరిగి దొరికి, మాల్యవంతంపై నివసించే అవకాశం లభిస్తే, అయోధ్యను, ఇంద్రపదవిని కూడా ఆశించనని రామునిచేత అనిపిస్తాడు వాల్మీకి.( కిష్కింధాకాండ 1.95) తుంగభద్రా నదీసోయగాలతో, పర్వతసానువులతో, ప్రకృతిరామణీయతతో నిండిన విద్యానగర పరిసరాల యొక్క సంధ్యాసమయాలు పెద్దనకు కూడా పెద్దపెట్టున ప్రేరణగా నిలిచి ఉంటాయని ఊహించటం అత్యుక్తి కాదు.

తిరిగి మనుచరిత్ర తృతీయాశ్వాసానికి…

తరువాత ’ఉరుదరీకుహరసుప్తోత్థశార్దూలముల్…’ అన్న పద్యంలోనూ అరుణ రాగం నలుదిశలా నిండుతుంది. ఇది విద్యానగరం (హంపి) హేమకూటాద్రి, అంజనాద్రి, ఋష్యమూక పర్వతాదుల నడుమ తుంగభద్ర పై అస్తమిస్తున్న సంధ్యాఫలకం కాబోలు.

(సంధ్యారాగంతో రక్తవర్ణం సంతరించుకున్న తుంగభద్రా నది.)

ఆపై చీకటి పడింది. పిమ్మట చంద్రోదయమున్నూ ’రాగ’ బంధురమై ప్రకాశిస్తుంది.

మ||
స్ఫుటసౌగంధికరాగరక్తరుచి మైఁ బూనెన్ జపాసన్నిధి
స్ఫటికంబ ట్లుదయాద్రి గైరిక శిరస్స్థానస్థితిన్ జంద్రుఁడ
చ్చొటు వాయన్ శుచియయ్యెనౌఁ బ్రకృతి నచ్ఛుండైన సన్మార్గియె
న్నఁటికిం గూటమి వంకవచ్చు వికృతిన్ మగ్నుండుగానేర్చునే. (3-24)

తా: చంద్రోదయ సమయాన – తూర్పుకొండ దాపుల నున్న చంద్రుడు ఆ కొండ యొక్క ధాతు రాగం చేత ఎర్రబడ్డాడు. అది ఎలా ఉందంటే – మంకెన పువ్వు పక్కగా స్ఫటికాన్ని ఉంచితే ఆ స్ఫటికం మంకెన పువ్వు రంగు సంతరించుకున్నట్టుగా ఎర్రగా ఉంది. అలా ఎర్రటి రంగును పొందిన చంద్రుడు కాసేపటికి పైకి తేలి, (ధవళకాంతులతో) స్వభావసిద్ధమైన స్వచ్ఛతను సంతరించుకున్నాడు. స్వభావసిద్ధంగా నిర్మలుడైన వాడికి ఏదైనా సందర్భంలో సహవాసదోషం చేత ఒక వికారం అంటుకున్నప్పటికీ, దాని నుండి త్వరగా తప్పించుకుని బయటపడగలడు కానీ అదే వికారంలో ఎల్లవేళలా మునిగి యుండడు కదా!

అర్థాంతరన్యాసాలంకారంతో చంద్రుని ప్రవర్తనను దృష్టాంతీకరించిన ఈ పద్యం – ప్రవరుని నిష్కళంకప్రవృత్తిని ప్రతీయమానం చేసే వస్తుధ్వనికి ఉదాహరణ. మనుచరిత్ర ఆరంభంలో ప్రవరుని “చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక..” అని పూర్ణచంద్రునితో ఉపమించడమూ ఇక్కడ ప్రస్తావనార్హం. ఆ ’శశాంకుడే’ ఈ కళంకరహితుడైన ’రాతిరిఱేడు’.

ప్రవరుడు వరూధినిని నిరాకరించిన తర్వాత,ఆమెపై ఎంతోకాలం మరులు గొని ఉన్న మాయాప్రవరుడు అక్కడికి వస్తాడు. ఆతడు ప్రవరుని వేషం ధరిస్తాడు. ఇక్కడ గమనార్హమైన విషయం మాయా(వియచ్చర) ప్రవరుని ఆహార్యం.

సీ||
అర్ధచంద్రుని తేట నవఘళించు లలాట
పట్టి దీర్చిన గంగమట్టితోడఁ
జెక్కుటద్దములందు జిగివెల్లువలు చిందు
రమణీయ మణికుండలములతోడఁ
బసిఁడి వ్రాఁతచెఱంగు మిసిమి దోఁపఁ జెలంగు
నరుణాంశుకోత్తరీయంబుతోడ
సరిలేని రాకట్టు జాళువా మొలకట్టు
బెడఁగారు నీర్కావిపింజెతోడ
గీ||
ధవళధవళములగు జన్నిదములతోడఁ
గాశికాముద్ర యిడిన యుంగరము తోడ
శాంతరసమొల్కు బ్రహ్మతేజంబుతోడఁ
బ్రవరుఁ డయ్యె వియచ్చరప్రవరుఁడపుడు. (3.71)

తాత్పర్యము: (వరూధినిని సమీపించే) ఆ సమయంలో గంధర్వుడైన మాయాప్రవరుడు – (బోర్లించిన) నెలవంకను తిరస్కరించే ఫాలభాగంపై గంగమట్టిని తిలకంగా దిద్దాడు. తన అద్దాల చెక్కిళ్ళలో కాంతిరేఖలు ప్రతిఫలించే రత్నాల కర్ణభూషణాలను ధరించాడు. బంగరు అంచు మిసమిసలాడే ఎఱ్ఱని ఉత్తరీయాన్ని ధరించాడు. మెరుపు రంగు దోవతి తాలూకు కుచ్చెళ్ళు జారే రత్నాల మొలత్రాడు ధరించాడు. ఇంకా, తెల్లని యజ్ఞోపవీతాన్ని, కాశీముద్ర గల ఉంగరాన్ని ధరించి, మొఖాన శాంతరసం కనబడే లాగున బ్రహ్మతేజస్సు వెలయగా నిజప్రవరుని రూపాన్ని ధరించాడు.

అద్భుతావహమైన ఈ పద్యంలో వియచ్చర ప్రవరుడు రసపర్యవసాయి. ఇక్కడ – మాయాప్రవరుడు అరుణాంశుకోత్తరీయాన్ని ధరించడం గమనార్హం.

వచ్చిన వ్యక్తి మాయాప్రవరుడని ఎఱుగని వరూధిని అతణ్ణి మనసా తన ప్రియుడైన ప్రవరుడనే భావించి జతకడుతుంది. వారికి ’స్వరోచి’ జన్మిస్తాడు. మనుచరిత్రలో వరూధిని అప్సరకాంత, మహా భోగిని. ఆమె పుత్రుడు స్వరోచి కూడా బహుపత్నీకుడు. భోగి. మృగయావినోది.

వరూధిని, ఆమె కొమరుడు స్వరోచి ఇద్దరూ రజోగుణ బద్ధులు. “రజో ’రాగా’త్మకం విద్ధి” అని భగవద్గీత. రజోగుణం రాగాత్మకమైనది. ఆ ’రాగా’నికి ఎరుపు రంగు ప్రతీక. విష్ణుధర్మోత్తర పురాణం, శిల్పరత్నం ఇత్యాది గ్రంథాల ప్రకారం – రజోగుణ సంబంధమైన విషయాలను చిత్రకళలో ప్రదర్శించడానికి అరుణ వర్ణాన్ని ఉపయోగించాలి. నాట్యశాస్త్రం ప్రకారం – రౌద్ర రసానికి ఎరుపు రంగు చిహ్నం.

మనుచరిత్ర తృతీయధ్యాయంలో పరంపరగా వచ్చే సంధ్యావర్ణన, చంద్రాగమనం, చంద్రోపలంభం, మన్మథోపలంభం, ఆపై సూర్యోదయసంధ్య, సూర్యోదయాన వరూధిని చెలికత్తెల పుష్పాపచయ క్రీడలో ఎడనెడ రాగరంజితమై అరుణవర్ణం కానవస్తుంది. మనుచరిత్రలో కొన్ని తామ్రరాగ ప్రస్తావనలకు ఉదాహరణలు ఇవి.

’ఉరుసంధ్యాతపశోణమృత్కలితమై యొప్పారు బ్రహ్మాండమన్ గరిడిన్..’ 3.59 – ప్రాతస్సంధ్య, చంద్రాస్తమయ వర్ణన
‘వెలఁది యిచ్చటి సంపెంగవిరులు గగన దేవతల ఇండ్ల నెత్తిన దీపశిఖలు..’ 3.76
’అపరిమితానురాగ సుమనోలసయై చిగురాకుఁ జేతులన్…’3.77
‘మృగనాభినికరంపుబుగబుగల్ గలచోటఁ జదలేటి తుంపురుల్ చెదరుచోట..’3.111
’చెంగల్వపూదండ సేర్చి పెందుఱుముపై..’ – స్వరోచి భార్య మనోరమ తొలిసమాగమ వర్ణనలో ఆమూలాగ్రం ఎఱుపు దనం (6.5)
‘దట్టంబు నీ కట్టినట్టి చెంగావికి..’ 6.8
’సొన దేఱి పొటమరించి నెఱె వాసినయట్టి..’ – 6.27 (వసంత వర్ణనము)
’అలకని జీబులోఁ గుసుమమద్దిన పావడ దోఁపఁ గొప్పు చెంగలువలవల్పుఁ…’ (6.31) – పుంజికస్థల అనే అప్సరస వర్ణన. మళ్ళీ నిండుగా అరుణంపు ధగధగ
’అరవిందాక్షులుఁదాను ఇట్లభిమత..’ 6.63

ఇలా పెద్దన కవి, ఉద్దేశ్యపూర్వకంగానో లేదా అవివక్షితంగానో కావ్యాన్ని ’రాగ’ రంజితం చేశాడు.

కావ్యంలో అంతర్భాగంగా కవి – వివక్షితంగానో, అవివక్షితంగానో మనోభావాన్ని నిక్షిప్తం చేశాడని ఊహించటం విపరీతము, విడ్డూరమూ కాదు. సాధారణంగా తమకు ఇష్టమైన భావాన్ని ఒక పదంలో నిక్షిప్తం చేసి సర్గ చివరి శ్లోకంలో ఉపయోగించటాన్ని సంస్కృత, ప్రాకృతకవులు ఆరంభించారు. ఈ విధంగా వాకాటకప్రవరసేన కవి ’అనురాగ’ శబ్దాన్ని, సర్వసేనుడు ’ఉత్సాహ’ శబ్దాన్ని, భారవి ’లక్ష్మీ’ శబ్దాన్ని, మాఘుడు ’శ్రీ’ శబ్దాన్ని ఉపయోగించారు. ఇదే పోకడ తెలుగులో కొనసాగింది. ఇవి వివక్షితాభిప్రాయ ప్రకటనలు. అవివక్షితంగా కూడా కవి భావాలు కావ్యాలలో దొరలి కవుల మనోభావప్రకటనలుగా తెలియడం కావ్యాలలో ఉన్నది. భవభూతి ఉత్తర రామ చరితమ్ లో తెలుగు పలుకుబడులు సంస్కృత రూపంలో కవి వెలువరించడం స్పష్టంగా తెలుస్తుంది. నంది తిమ్మన పారిజాతాపహరణ కావ్యం రాయలకు ఆయన భార్య తిరుమల దేవికి మధ్య కలహాన్ని నివారించడానికి నంది తిమ్మన వ్రాశాడని విజ్ఞుల అభిప్రాయపడడం తెలిసిందే. రామరాజభూషణుని వసుచరిత్ర వెనుక కూడా ఏదో రాజకీయకలహప్రస్తావన ఉందని మాన్యులు చెబుతారు.

***

అల్లసాని వాని జీవితాదర్శం – చారిత్రక పరామర్శ:

కావ్యం – కవి యొక్క సంస్కారపు కుప్ప. కవి కూడా సాధారణ మానవుడే. అయితే ఆతని విశిష్టత్వం సాధారణత్వం నుండి అసాధారణత్వం వైపు చూచే దృష్టిలో, సాగించే అన్వేషణలో ప్రతిఫలిస్తుంది. ఆ అన్వేషణ కావ్యంలో వ్యక్తం అవుతుంది. మనుచరిత్రను చాలామంది పండితులు విమర్శకులు ఏళ్ళ తరబడి వివిధ రకాలుగా అనుశీలిస్తూ, పరామర్శిస్తూ, విమర్శిస్తూ కవి హృదయపు భిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు. తెలిసిన చారిత్రక వివరాల నేపథ్యం తో, అల్లసాని పెద్దిరాజు కవిని అనుశీలిస్తే ఆయన సంస్కారం తెలుస్తుంది.

రాయవాచకంలో చెప్పిన ప్రకారం – రాయలవారు ముక్కుతిమ్మనకూ, పెద్దన వారికీ ఒకేసారి కర్పూరతాంబూలం ఇచ్చి కావ్యరచనకై నిర్దేశించారు. తిమ్మన గారి పారిజాతాపహరణ కావ్యం తొందరగా పూర్తయితే పెద్దన కావ్యానికి మాత్రం కాస్త ఎక్కువకాలమే పట్టింది. ఈ విషయాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తమ మనుచరిత్ర పీఠికలో చెప్పారు. పరిమాణంలో తక్కువ ఉన్న మనుచరిత్రకు అంత సమయం ఎలా పట్టింది? కారణం ఊహిస్తే – పెద్దన కవిత్వానికి ప్రేరణ కావాలి. ‘ఊరక కృతులు రచింపు’ మన్న ఆయనకు కుదరదు. ఆ స్ఫూర్తి – రమణీప్రియదూతిక తెచ్చు కప్పురవిడెమో, తూగుటుయ్యాలో, అందమైన సాయంత్రమో, మనోహరమైన నదీప్రవాహప్రాంతమో, మత్తుగొలిపే సౌరభాన్వితమైన మలయమారుతమో, వీనులవిందైన వీణావాదమో, సంగీత మాధుర్యమో, నాటి విజయవిట్ఠల రంగమంటపంలో అచ్చరలను మించిన విద్యానగరభామినుల నృత్యకేళియో…ఏదో! ఏదైనా కావచ్చు. ఆ ప్రేరణ లేక కవిత్వం లేదు. అలా ఆ ప్రేరణకోసం తపించి వేచినాడు గనకనే కావ్యానికి అంతసమయం పట్టింది. ఈ ఊహలకు దృష్టాంతాలు కూడా మనుచరిత్రలో వెతికితే కనిపిస్తాయి. సూక్ష్మంగా గమనిస్తే మనుచరిత్రలో కొన్ని ఘట్టాలు సుదీర్ఘంగాను, కొన్ని త్వరత్వరగా ముగించినట్టూ సులభంగానే తెలుస్తుంది.

పెద్దన గారి ’నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు…’ అన్న చాటువు ద్వారానూ, అల్లసాని వారు చిత్రించిన వరూధిని, స్వరోచి పాత్రల మూలకంగాను తెలిసే విషయం ఏమంటే అల్లసాని పెద్దన కవి కవిగా రసలుబ్ధుడు, స్వాభావికంగా పరిపూర్ణజీవితాభిలాషి. కొంతవరకూ భోగి. రాయలవారి సాంగత్యాన గండపెండెర సత్కారం మొదలుకుని అగ్రహారాదులు అన్నీ అమరిన కవి. అల్లసాని పెద్దన కవికి గండికోట సీమలోని ’కోకట’ గ్రామాన్ని హక్కుభుక్తంగా, “ఉంబళి” (Tax free asset) గా కృష్ణరాయలవారు వ్రాసి ఇచ్చిన సంగతి సహృదయులకు తెలుసు.

అయితే తెలియవలసిన విషయం మరొకటి ఉన్నది.

క్రీ.శ. 1518, బహుధాన్య నామ సంవత్సరం రాయల వారికి ప్రముఖమైన సంవత్సరం. అప్పటికి రాయలు ఉదయగిరి దుర్గాన్ని జయించారు. పొట్నూరు విజయస్థంభాన్ని నాటించారు. తిరిగి వస్తూ విజయవాడ మల్లికార్జున స్వామి దేవళం వద్ద వైశాఖ పౌర్ణమి చంద్రగ్రహణం నాడు భూరి దానాలు చేశారు. నాడు ఆయనతో బాటు ఉన్న అల్లసాని చొక్కరాజు పుత్రుడైన అల్లసాని పెద్దనకవి గారు, తనకు హక్కుభుక్తంగా వచ్చిన కోకట గ్రామంలో చాలా భాగం చేనును కోకటం లోని సకలేశ్వరుని సన్నిధికి దానం చేశారు. (South India Inscriptions Vol 16)
అదే యేడు కార్తీకమాసం ఉత్థానద్వాదశి రోజున, కోకట గ్రామంలో నాలుగున్నర పుట్ల (~ 9 ఎకరాల) భూమిని, తిరిగి మరోమారు అల్లసాని పెద్దన కవి చెన్నకేశవ స్వామికి దానం చేసేశారు. రాయల వారు తిరిగి పెద్దనకు ఆర్కాటు జిల్లాలోని మరో గ్రామాన్ని దానం చేస్తే, ఆ గ్రామాన్ని కూడా పెద్దన తనకై ఉంచుకోకుండా వరదరాజపెరుమాళ్ళకు దానం చేశారు.(శాసన పాఠం వ్యాసం చివర)
అంటే – అల్లసానిపెద్దన భోగి. అయితే భోగ’లాలసుడు’ కాదు. స్వభావతః ఆయన ధార్మికుడు, కొంతమేరకు ’విరాగి’ కూడా.

సూక్ష్మంగా గమనిస్తే పై ఉదంతాలతో ఆ కవి మానసికప్రవృత్తి, మనుచరిత్ర కావ్య కథాపరిణామంలో ప్రతిఫలించిందా? అని అనిపిస్తుంది. వరూధిని అప్సరస. స్వేచ్ఛావర్తిని. మాయాప్రవరుడు ఓ గంధర్వుడు. వరూధిని యొక్క భోగప్రవృత్తి, స్వేచ్ఛావర్తనము – ఆమెకూ, మాయాప్రవరునికి జన్మించిన స్వరోచికి జన్మరీత్యా వచ్చినవి. స్వరోచి – ఒక మృగయావినోది. బహుపత్నీకుడు. రజో గుణ బద్ధుడు. అయితే స్వరోచికి, వనకన్యకు జన్మించిన స్వారోచిషుడు మాత్రం సత్వగుణసమన్వితుడైనాడు.

తే||
అట్లు జనియించి స్వారోచిషాఖ్య నతఁడు
శాంతి దాంతి దయా సత్య శౌచ నిరతుఁ
డై యకామతఁ జిరతపం బాచరించె
నచ్యుతునిఁ గూర్చి యంతఁ గృపార్ద్రుఁ డగుచు.

అట్లు రజోగుణాన్వితుడైన స్వరోచికి జన్మించిన స్వారోచిషుడు నిష్కామకర్ముడై బాహ్యాంతర ఇంద్రియ నిగ్రహము గలవాడై , సత్యమునందు, శుచియందు నిరతుడై విష్ణుమూర్తిని గురించి తపమాచరించాడు. అలా ఆ స్వారోచిషుడు, సత్వగుణప్రధానుడై, శ్రీ మహా విష్ణువును గురించి గొప్ప తపమాచరించి చివరికి ఆ మహాదేవుని ప్రత్యక్షం చేసుకొన్నాడు. శ్రీ మహావిష్ణువు ఆతని మనువుగా పట్టాభిషిక్తుని చేశాడు.

ఈ నేపథ్యంలో స్వారోచిష మనుసంభవ కావ్యం రాగము (రజోగుణం) నుండి విరాగము (సత్వగుణం) వైపు సాగిన పయనానికి ప్రతీక అని, ఆ పయనంలో అంతర్భాగంగా రజోగుణానికి ప్రతీక అయిన ఎఱుపు రంగు ఎడనెడా కావ్యంలో (కవి సాభిప్రాయప్రకటన మూలంగా కానీ, లేదా అలవోకగా జాలువారిన కవిత్వమనే భావప్రవాహంలో కానీ) పరుచుకున్నదని, వరూధిని తో మొదలైన రజోగుణం ఆమె పుత్రుడైన స్వరోచితో పెంపొంది, సత్వగుణంగా స్వారోచిషుని జన్మలోనూ, ఆతడు పొందిన శ్రీమహావిష్ణువు దర్శనంలోనూ పరిణమించి పరిపూర్ణమైనదని, ఆ సత్వగుణాన్వేషణ కవి మనోఫలకాన్ని, జీవితాదర్శాన్ని ప్రతిబింబిస్తోందని, దరిమిలా కవి మానసికజీవితాదర్శమే కావ్యరూపంలో తీర్చబడినదని ప్రతిపాదించడమే ఈ వ్యాస సారాంశం.



**** (*) ****

Credits:
1. Hampi Photoes courtesy: Sree Shiva Shankar Banagar’s facebook page