మొదటి భాగం
1
చెబితే నువ్వు నమ్మవుకానీ, ఎంత వెతికాననుకున్నావు! పుస్తకాల షాపులలో, లైబ్రరీలలో- రాత్రిం బగల్లూ వెతుకుతూనే ఉన్నాను. ఎంత వెతికినా దొరకదే- అస్సలు దొరకదు. అసలు మా ఊల్లో నేను వెతకని చోటంటూ ఉండదు. ఎవరు ఏ పుస్తకం చదువుతున్నా, ఆ పుస్తకమే చదువుతున్నానని మనసులో ఒకటే అలజడి. ఎక్కడైనా ఆ పుస్తకం ధ్యాసనే. సందేహాస్పదంగా ఎవరు కనిపించినా సరే- సందేహం తీరే దాక వాళ్ళను అనుసరిస్తాను. నేను ఎక్కడికెళ్ళినా సరే ఆ పుస్తకం జాడకోసం అన్వేషిస్తూనే ఉంటాను. ఆ పుస్తకంకోసం నేను వెతికే ప్రక్రియలో ఎన్ని పుస్తకాలు తారసపడ్డాయో- కానీ మొట్టమొదటి సారి ఆ పుస్తకాన్ని చూసినప్పుడు నాలో కలిగిన ఉద్వేగం మరెన్నడూ కలగలేదు. కళ్ళు మూసుకొని ఆ పుస్తకం ముఖచిత్రాన్ని తలచుకుంటే చాలు, నా ఒళ్ళు జలదరిస్తుంది. ఓ సముద్రం, దాని ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆల్చిప్ప, ఆ ఆల్చిప్పలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న సూర్యుడు. దానికి ఎడమ వైపు చేతివ్రాతతో రాసినట్టు పుస్తకం పేరు. “రహస్య లిపి” – ఇది ఆ పుస్తకం ముఖచిత్రం.
మొట్టమొదటి సారి ఆ పుస్తకాన్ని రైల్వే స్టేషన్లో చూసాను. అది రాత్రి పగలులోకి కరిగే సమయం. నేను ఉద్యోగావసరం రీత్యా వేరే పట్టాణానికి వెళ్ళవలసి వచ్చింది. ఇంకా చీకటిగానే ఉంది. అప్పుడే రైల్వేస్టేషన్ కి వచ్చాను. ఆ సమయానికి నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది రైల్వే స్టేషన్. ఓ బల్లపై కూర్చున్నాను. ఇంతలోనే, ఎక్కడినుండో, అక్కడికి ఓ గడ్డపాయన వచ్చాడు. ఆరడుగుల ఎత్తు, పల్చటి బట్టలు, చేతిలో ఒక పుస్తకం ఉన్న ఆయన నా పక్కన కూర్చున్నాడు. ఇంత ఖాళీగా ఉన్న రైల్వేస్టేషన్లో ఆయన నా పక్కనే ఎందుకు కూర్చోవాలి, అని సందేహం కలిగింది. ఆయన తన చేతిలోని పుస్తకాన్ని తెరిచి చదవటం మొదలుపెట్టాడు. పెదవులను కదుపుతూ, గొణుగుతూ ఒక్కొక్క పేజీనీ తిప్పుతూ చదివాడు. నేను ఆయన చదువుతున్న పుస్తకంపై కించిత్ ఆసక్తి కుడా చూపించకుండా, రైలు కోసం వేచిచూసాను. ఆయన పేజీలు తిప్పే క్రమంలో ఆ పుస్తకం తన చేయిజారి నా కాలి పక్కన పడింది. నేను ఆ పుస్తకాన్ని అందుకొని ఆయనకు ఇచ్చే క్రమంలో ఓ మూడు పంక్తులను చదివాను. అప్పటివరకూ ఎప్పుడూ కలగని భావన ఏదో నాలో మేల్కొంది.
ఇంతలోనే రైల్వే స్టేషన్ మైక్ లోంచి ఓ యాంత్రిక గొంతు ప్రకటించింది- నేను అప్పటిదాక ఎదురుచూస్తున్న రైలు వచ్చేస్తున్నదని. దూరంగా, తెల్లబడుతున్న రాత్రికి పుట్టిన బిడ్డలా కూత వేసుకుంటూ, పొగ చిమ్ముకుంటూ రైలు వస్తోంది. నా పక్కనే కూర్చున్న గడ్డపాయనను ఏ పుస్తకం చదువుతున్నాడని అడిగాను. అతను అభావంగా తన చేతిలోని పుస్తకాన్ని ఎత్తి పట్టుకుని, దాని ముఖ చిత్రాన్ని చూపించాడు. అదే రహస్య లిపి. సముద్రపొడ్డున ఆల్చిప్ప, ఆల్చిప్పలో దేదీప్యమానంగా రగులుతున్న సూర్యుడు. నా మెదడు గడ్డ కట్టింది. అప్పటిదాక నాలో కూరుకుంటున్న ఓ మంచుపర్వతం బద్దలయినట్టు అనిపించింది. ఇంతలోనే ఓ గాలి వీచింది. స్టేషన్లోని చిత్తు కాగితాలూ, దుమ్మూ సుడులు తిరిగాయి. గడ్డపాయన వదులుగా ఉన్న దుస్తులు రెపరెపలాడాయి. నేను ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అడగటానికి ప్రయత్నించాను. ఇంతలోనే ఆ గడ్డపాయన ఒక్కసారిగా పరిగెత్తటం మొదలుపెట్టాడు. ఆయన ఎందుకు పరిగెత్తుతున్నాడో అర్థంకాని స్థితిలో నేను ఆయన్ను చూస్తూ ఉండిపోయాను. చూస్తూచూస్తుండగానే ఆయన మాయమయ్యాడు. నిస్సహాయుడినై చూస్తుండిపోయాను.
అంతలోనే ట్రెయిన్ వచ్చింది. మా ఊరిలో రైలు ఎక్కువ సేపు ఆగదు. త్వరత్వరగా రైలు ఎక్కాను. రైలు కదలటం మొదలెట్టింది. వేగం పుంజుకుంది. నా లోపల్లోపల ఏదో తపన మొదలయ్యింది. రహస్యలిపి అనే పుస్తకం, దాని ముఖ చిత్రం, నాకు అకస్మికంగా కనిపించిన మూడు పంక్తులు, హటాత్తుగా పరిగెత్తిన ఆ గడ్డపాయన- ఇవి మరీ గుర్తొస్తున్నాయి. రైలు ముందుకు వెళ్ళే కొద్దీ నా మనసు వెనక్కి ప్రయాణించాలని అపేక్షించింది. ఆ రోజు నుండీ ఇప్పటిదాక ఆ గడ్డపాయననూ, రహస్యలిపిని తిరిగి చూడలేదు. అప్పటినుండి ఎలాగైనా ఆ పుస్తకం చదవాలన్న కోరిక రాజుకుంటూ ఇంత దాక వచ్చింది. ఇప్పటికీ నేను ఆ ట్రెయిన్లోనే ఉన్నాను. కిటికీ పక్కన కూర్చొని, మారుతున్న దృశ్యాలను చూస్తూ అక్కడే ఉండిపోయాను! అక్కడ కలిగిన తపన నుండి రెండు సంవత్సరాలుగా బయటపడలేకపోయాను. గంటలు తరబడి వెతికాను. ప్రతి రోజూ వెతికాను. ఎక్కడికి వెళ్ళినా దానినే వెతికాను. వెతికిన చోటునే మరీ మరీ వెతికాను. వెతుకుతూ వెతుకుతూ నన్ను నేను కోల్పోయాను. దొరకలేదు. ఆ పుస్తకం కోసం నా దాహం కుడా తీరలేదు. అసలు వెతకటమనే ఈ ప్రక్రియనే నా జీవితానికి నిర్వచనంగా మారిపోయినప్పటి నుండి నాలో ఎంత మార్పు వచ్చింది!
నిద్ర పట్టటం లేదు. నేను అద్దెకి ఉంటున్న గదిలో రాత్రంతా ఒక పక్క నుండి మరొక పక్కకు నడుస్తూ, ఏదో వెతుకుతూ,రహస్యలిపి పుస్తకాన్ని దొరకబుచ్చుకోటానికి వ్యూహాలు రచిస్తూ గడుపుతాను. ఈ రెండు సంవత్సరాల్లో నేను చదివిన పుస్తకం ఒకటే ఒకటి. ఫెర్నాండో పెస్సోవా రచించిన అశాంత గ్రంథం (ద బుక్ ఆఫ్ డిస్క్వయిట్) . బెర్నార్డో సోరేస్ అన్న మారుపేరుతో ఈ పుస్తకాన్ని రసాడు పెస్సోవా. పెస్సోవా కథనం ప్రకారం బెర్నార్డో సోరేస్ లిస్బన్ నగరంలో పనిచేసే ఓ అకౌంటెంటు.
లిస్బన్ నగరంలో ఏకరీతిగా సాగే తన రోజూవారి జీవితంలో నలిగిపోయే పెస్సోవా, సాయంత్రం ఏడు గంటలకు రోజూ ఒక రెస్టారెంటుకు వెళ్ళేవాడు. ఆ రెస్టారెంటులో పెస్సోవాకు కొంచం దూరంగా మరొక అతను కూర్చునేవాడు. అతను కూడా రోజూ పెస్సోవాలాగ రెస్టారెంటుకు వస్తాడు. అతడి మొఖం ఎప్పుడూ వేదనగా ఉండేదట. మొదట్లో అతనిని అంతగా పట్టించుకోని పెస్సోవాకి రాను రాను అతనిపై అసక్తి కలిగింది. ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తిని, ఒక సిగరెట్టు పీక నోట్లో పెట్టుకొని, అక్కడి జనాన్ని గమనిస్తూ ఉండేవాడట. ఆ గమనించటం కూడా, వాళ్ళనేదో అజమాయిషీ చేస్తున్నట్టుకాక, ఒక పుస్తకం చదువుతున్నట్టు గమనిస్తూ ఉండేవాడట. ఈ ప్రత్యేక వైఖరి పెస్సోవాని ఎంతో ఆలోచింపచేసింది. కొన్ని రోజుల తర్వాత ఒకర్ని చూసి ఒకరు చిరునవ్వుతో పలకరించుకోవటం మొదలెట్టారు. ఒకరోజు యాదృచ్ఛికంగా వాళ్లు ఒకే సమయానికి ఆ రెస్టారెంటుకు రావటంచేత కాబోలు, ఇద్దరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లడటం మొదలెట్టారు. అలా మాట్లాడుతున్నప్పుడు, ఇద్దరికీ ఒకే రకమైన ఆసక్తులూ, అభిరుచులూ ఉన్నాయని, ఇద్దరూ రచయితలని పరస్పరం గ్రహించారు. అలా కొన్ని రోజులు తమ స్నేహం కొనసాగింది. ఒక రోజు పెస్సోవాకు బెర్నాండో సోరేస్ తను జీవితాంతం రాసిన రచనలన్నీ తీసుకొని ఇచ్చేస్తాడు. అతని రచనలన్నీ పెస్సోవా తన ట్రంకు పెట్టలో భద్రపరుస్తాడు. ఎన్నో రోజుల తర్వాత, పెస్సోవా మరణాంతరం అతని ట్రంకు పెట్టలో దొరికిన అమోఘమైన సాహిత్యంలో ఒకటి బెర్నార్డో సొరేస్ రాసిన అశాంత పుస్తకం.
ఈ రకంగా నా రాత్రులు అశాంత గ్రంథాన్ని, పెస్సోవానూ, అతని మారుపేర్లను, లిస్బన్ నగర వీధులనూ, అక్కడి మనుషుల మొహాలలోని అగాథ ఛాయలను, అక్కడి నిశీధులలో సముద్రపు తేమపట్టిన గాలులనూ స్మరిస్తూ గడుపుతాను. అదే పుస్తకాన్ని అనేక సార్లు చదివిన నేను ఒకానొక సందర్భంలో ఓ నిర్ఘాంతమయిన స్థాయికి చేరుకున్నాను. ఆ స్థితిలో నేను పుస్తకం చదువుతున్నాను అన్న వాస్తవం నెమ్మదిగా కరిగి క్షీణిస్తుంది. పుస్తకం నన్ను చదువుతోంది అన్న అవాస్తవ స్థితికి జారుకుంటాను. పుస్తకంలోని వాక్యాలు ఒకొక్కటిగా నా జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రక్రియను నేను ఎంత ప్రతిఘటించినా లాభం లేకపోతుంది. అలాంటి రాత్రులలో నేను జీవించటానికి, చదవటానికి మధ్యనున్న బేధాన్ని మర్చిపోతుంటాను. చూపు ఒక వాక్యం నుండి మరొక వాక్యానికి ప్రయాణించినట్టు జీవితం ఒక సన్నివేశం నుండి మరొక సన్నివేశానికి, ఒక సందర్భం నుండి తరువాతి సందర్భానికి ప్రయాణించే ప్రక్రియగా మారుతుంది. ఒక సంఘటనలో మన చుట్టూ తిరిగే రంగులూ, చలనాలూ, అనుభూతులూ- మన చూపు ఎదుట కదిలే ఓ వాక్య పరిణామంలోని అక్షరాలు, వ్యాకరణం, ఖాళీలు లాంటివిగా తోస్తాయి. జీవితం ఓ అఖండమైన, అనంతమైన వాక్యం అనిపిస్తుంది.
2
అసలీ పుస్తకం కోసం ఎక్కడెక్కడ వెతికానో, ఏ దుస్సాహసాలు చేసానో విన్నవించుకోవాలి. మొదట్లో కొన్ని రోజులు ఆ గడ్డపాయన కనిపిస్తాడేమోనని ఉదయాన్నే రైల్వే స్టేషన్ కి వెళ్ళే వాడిని. సరిగ్గా రాత్రి పగలులోకి కరిగే అదే సమయానికి. మొట్టమొదటి సారి ఆ పుస్తకం చూసినప్పుడు ఏ బల్లపై కూర్చున్నానో అక్కడే కూర్చునే వాడిని. వస్తూ పోతూ ఉండే రైళ్లను చూసుకుంటూ- పుస్తకం గురించి, గడ్డపాయన గురించి, అకస్మికంగా వీచిన గాలి గురించి ఆలోచిస్తూ గడిపేవాడిని.
నేను రైల్వేస్టేషన్ లో అడుగుపెట్టే సమయానికి ప్లాట్ఫారం పై రైలు తప్పిన ప్రయాణీకులు, శరీరమంతా దుప్పటి కప్పుకొని చలికి ఒణుకుతూ పడుకొని ఉంటారు. ప్లాట్ఫారం సాంతం నారింజరంగు స్ట్రీట్ లైట్లతో వెలిగిపోతూ ఉంటుంది. చీకటి తెల్లబడే కొద్దీ, రైల్వేస్టేషన్ని సఫాయి చేసే సిబ్బంది ప్లాట్ ఫారం ని చీపురుకట్టతో ఊడ్వటం మొదలెడుతారు. అప్పుడే పుట్టిన కిరణాల వెలుగులో, వాళ్ళు చీపురుని ఊద్చిన ప్రతి సారి ఓ ప్రకాశవంతమైన దుమ్ము పొగ గాల్లోకి తేలుతుంది. ఆ పొగ తెరలుతెరలుగా విచ్చుకుంటూ ఆకాశంలో కలిసిపోతుంది. మరికొంచం సేపటికి గుమస్తాలు, ఉద్యోగులతో రైల్వేస్టేషన్ తన కలత నిద్రలోంచి మేలుకుంటుంది. ప్లాట్ ఫారం పై వివిధ దుకాణాలు నోరు తెరుస్తాయి. ప్రయాణికులు భుజాన బేగులు తగిలించుకుని రైల్ల కోసం వేచి ఉంటారు.
ఏదైనా రైలు స్టేషన్ దగ్గరకు రాబోతోంది అనగానే, ఓ యాంత్రికమైన గొంతు రైలు రాకను ప్రకటిస్తుంది. స్టేషన్ మాస్టారు ఆవలిస్తూ, కళ్ళు నులుపుకుంటూ తన గదినుండి బయటకొచ్చి ఎర్ర జండాను ఊపుతాడు. రైలు ఆగిన వెంటనే ఓ నది నుండి వేరుపడే పిల్లకాలువల్లా జనాలు స్టేషన్లోకి దిగుతారు. అప్పటిదాకా నిర్జనంగా ఉన్న ప్లాట్ ఫారం ఒక్క సారిగా మనుషులతో కలకలలాడుతుంది. స్టేషన్ మాస్టర్ తిరిగి పచ్చ జండా ఊపగానే రైలు కూత వేసుకుంటూ, నెమ్మదిగా కదులుతుంది. కొద్ది సమయంలోనే వేగాన్ని పుంజుకుని నిష్క్రమిస్తుంది. సాయంత్రం. పొద్దు గడిచే కొద్ది చీకటి పడుతుంది. మనుషుల మొహాలలో అలసట కనిపిస్తుంది. సూర్యుడు అస్తమిస్తాడు. నారింజ రంగు దీపాలు అంటుకుంటాయి.
ఇలా రోజూ, ఓ మూడు నెలల పాటు ఇవే దృశ్యాలను చూస్తూ, ఏకరీతిగా గడిపాను. రైల్వే స్టేషన్ అనే ఈ అపారమైన ప్రాణి పనితీరుని గమనిస్తూ, గడ్డపాయన కోసం వేచి చూస్తూ, రోజుల తరబడి గడిపాను. రైల్వే స్టేషన్ సిబ్బందినీ, అక్కడ పనిచేసే కార్మికులనీ గడ్డపాయన ఆచూకి గురించి మరీ మరీ అడిగి వేధించాను. వాళ్ళు ఎన్నడూ ఆ గడ్డపాయనను ఆ అవరణలో చూడలేదని మొర పెట్టుకున్నారు. కాని నేను మొండిగా రోజూ ఉదయాన్నే రైల్వేస్టేషన్ కి వచ్చి, రోజూ ఒకే విధంగా మారే దృశ్యాలను చూస్తూ, చీకటి పడే దాకా అక్కడే గడిపి, చివరికి నిరుత్సాహంగా నా గదికి తిరిగొచ్చే వాడిని. తరవాతి రోజు ఉదయాన్నే లేచి, తిరిగి రైల్వేస్టేషన్ కి వెళ్ళేవాడిని. ఇదే విధంగా మూడు నెలలు గడిపాను. ఎంత వేచి ఉన్నా గడ్డపాయన తిరిగి రాడు అని నిర్ధారించుకున్నాను.
3
ఎంత వేచి ఉన్నా ఆ గడ్డపాయన తిరిగి రాడు అని నిర్ధారించుకున్నాను. కాని రహస్యలిపిని చేతిన పట్టుకోవాలని, దాని పేజీలను నా మునివేళ్ళతో తిప్పాలని, దాని అక్షరాలను చదువుతూ నా మనో ఫలకంపై లిఖించుకోవాలన్న ఆశ మాత్రం తరగలేదు. రహస్యలిపి పాతపుస్తకాలు అమ్మే చోట దొరికే అవకాశముందని నా మతికి తట్టింది. తర్వాత కొన్ని రోజులు పాత పుస్తకాలు అమ్మే చోటు చుట్టూ తిరిగాను.
పాతపుస్తకాలు అమ్మే చోట, కొన్ని వేల పుస్తకాలు రోడ్డుకి ఒక పక్కన, నేలపై పరుస్తారు. ఆ పుస్తకాలకు అవతల పక్క, ఓ ముగ్గురు పుస్తకాలను అమ్మే వాళ్ళు ఉంటారు. ఆ పుస్తకాల చుట్టూ మనుషులు గుమికూడి, తమకు కావలసిన పుస్తకాలను శోధిస్తూ, వాటి ఖరీదు పై పుస్తకాలను అమ్మే వాళ్ళతో బేరం చేస్తూ, పుస్తకాలను కొనుగోలు చేస్తూ ఉంటారు.
నేను రహస్యలిపి కోసం మరొక మూడు నెలలు ఈ పాత పుస్తకాలలోనే వెతికాను. ఈ వెతకటం అన్న పద్ధతికి ఎన్నో సిద్ధాంతాలను సూత్రీకరించుకున్నాను. రోజూ ఉదయాన్నే సరిగ్గా పాత పుస్తకాలు అమ్మటం మొదలుపెట్టే సమయానికి అక్కడికి చేరుకునే నేను చీకటి పడే దాక, పాత పుస్తకాలు అమ్మే వాళ్ళు తమ పుస్తకాలన్నిటినీ సర్దుకొని తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళే దాక అక్కడే ఉండేవాడిని. కొన్ని రోజులలోనే అక్కడి పుస్తకాల గురించి కొన్ని విషయాలు బోధపడ్డాయి.
అక్కడ పుస్తకాలను ఎన్నో వరుసల్లో అమర్చుతారు. కొన్ని పుస్తకాలు నిలువు వరుసల్లో, మరికొన్ని అడ్డం వరుసల్లో ఉంటాయి.
మొదలు కొన్ని వరుసల్లో కొంచం కొత్తగా కనిపించే పుస్తకాలు ఉంటాయి. ముందుకు వెళ్ళే కొద్ది పుస్తకాలు పాతబడుతూ ఉంటాయి. చివరి వరుసల్లో పట్టుకుంటేముక్కలయ్యే పుస్తకాలు ఉంటాయి. ఎక్కువగా ఈ చివరి వరుసల్లో సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలను కొనుగోలు చేసే వారి ఆసక్తులను బట్టి పేర్చినట్టు అర్థమవుతుంది. కానీ ఈ పుస్తకాల వరుసలకు అంతకు మించిన అంతర్లీన నిబద్ధత ఉన్నట్టు, ఆ అమరికకు నిగూఢమైన తర్కం ఉన్నట్టు అనిపించింది. ఆ సూత్రాన్ని పసిగట్టినప్పుడు , రహస్యలిపి తనంతటతానే నా కళ్ళ ముందుకొస్తుందని ప్రగాఢ నమ్మకం ఏర్పడింది. ఎలాగైనా ఈ పుస్తకాల క్రమంలోని చిక్కు ముడిని బద్దలుకొట్టాలన్న మొండితనం నన్ను ఆవరించింది. గణితం లెక్క చేస్తున్నట్టు అక్కడి పుస్తకాలన్నిటిని మననం చేసుకుంటూ, వాటి క్రమాన్ని అంచనా వేసుకుంటూ, వాటి అంతర్లీన నిబద్ధతను అవగతం చేసుకోటానికి ప్రయత్నిస్తూ, వాటి అమరికతో మెదడులో ఓ చిత్రపటాన్ని నిర్మిస్తూ రోజులు తరబడి గడిపాను.
ఏ పుస్తకాన్ని కొనకుండా అక్కడే తిరుగుతున్న నన్ను ఎన్నో రోజులు భరించిన పుస్తకాలు అమ్మే వాళ్ళు చివరికి ఒక రోజున నా దగ్గరకు వచ్చి “అయ్యా! మీకు కావలసిన పుస్తకం ఇక్కడ ఉన్నట్టు లేదు. బహుశా అది బుక్ షాప్లో దొరుకుతుందే ఏమో, అక్కడ ప్రయత్నించండి. మీరు రోజూ ఇక్కడికి వచ్చి, ఏ పుస్తకం కొనకుండా పగటి నుండి రాత్రి దాక ఉండటం, ఇక్కడ పుస్తకాలు కొనే మిగిలిన వారికి ఇబ్బందిగా ఉంది” అన్నాడు. ఆయన మాటలలో నిజం ఉంది అనిపించింది. తర్వాతి రోజు నుండి బుక్ షాప్ లో వెతకాలని అనుకున్నాను.
4
పుస్తకం కోసం వెతకటమన్నది భలే గమ్మత్తైన పని. ఓ అనంతమైన మైదానంలో సీతాకోకచిలుకను పట్టుకోవటం లాంటిది. అది విడిచే జాడలను వెంబడిస్తూ అప్పటివరకూ ఎవరూ ప్రయాణించని చోటులను కనుగొనటం లాంటిది. రెప్పపాటుకాలంలో కనిపించి, అంతలోనే మాయమయ్యే ఆ సీతాకోకచిలుకను జీవితమంతా అనుసరించటం, తద్వారా అది తీసుకుపోయే రహస్య ప్రదేశాలను చూసి నివ్వెరపోవటం, ఆ సీతాకోకచిలుక కోసం వెతుకులాటలోనే జీవితపు నిర్వచనాన్ని నిర్మించుకోవటం, ఆ సీతాకోకచిలుక గురించి కలలు కనటం – నిజంగానే ఓ పుస్తకం వెతకటమనే కార్యం గమ్మత్తైనది.
ఇలా ఆలోచిస్తూ తర్వాతి రోజు ఉదయాన్నే బుక్ షాప్ కి వెళ్ళాను. బుక్ షాపు ద్వారం దగ్గర షాపు ఓనర్ రిసెప్షన్ బల్ల ముందు కూర్చొని ఉన్నాడు. షాపు లోపల ఎవరూ మనుషులు లేరు. షాపులో పని చేస్తున్న కుర్రాడు ఒకడు, నిచ్చన ఎక్కి, ఒకొక్క పుస్తకాన్ని అలమారలలో సర్దుతున్నాడు. నేను షాపు లోనికి ప్రవేశించి అక్కడి పుస్తకాలను తీరికగా గమనించాను. ఇంతలోనే పుస్తకాలు సర్దుతున్న అబ్బాయి నా వద్దకు వచ్చి-
“మీకు ఏ పుస్తకం కావాలండి?” అని అడిగాడు.
“రహస్య లిపీ అనే పుస్తకం కావాలి” అని అడిగాను.
ఆ కుర్రాడు గాల్లోకి చూస్తూ కొంచం ఆలోచించి “అలాంటి పుస్తకం షాపులో లేదు అనుకుంటా. ఒక సారి షాప్ ఓనర్ ని కుడా అడుగుదాం పదండి. ఆయనకు ఏమైనా తెలిసే అవకాశం ఉంది” అన్నాడు.
ఇద్దరం షాపు ఓనర్ వద్దకు వెళ్ళాము. ఆ కుర్రాడు ఓనర్ ని అడిగాడు “సార్, ఇతనికి రహస్యలిపి అనే పుస్తకం కావాలంట. మన షాపులో ఉందా?”
షాపు ఓనర్ ఒక అరమినిషం ఆలోచించి “ఆ పుస్తకం పేరు విన్నాను. కవిత్వ పుస్తకం. చాలా పాతది. కవి పేరు మరచిపోయాను. అప్పట్లో ఆ పుస్తకాన్ని అచ్చు వేసుకోటానికి ఆ కవి తన ఆస్తులు అమ్ముకున్నాడని ఒక మిత్రుడు చెప్పాడు. కాని, ఆ పుస్తకం బాగా అమ్ముడు పోకపోవటం చేత, ఆ కవి తిరిగి మరొక కవితా సంకలనాన్ని అచ్చు వేసే సాహసం చేయలేదు.”
ఆయన చెప్పిన మాటలు నాలో మరో ప్రపంచాన్ని విడుదల చేసాయి. ఆ పుస్తకానికి నేను దగ్గరవుతున్నాను అన్న భావనను కలగజేసాయి. నేను ఆత్రుతగా షాపు ఓనర్ని అడిగాను
“ఆ పుస్తకం మీ షాపులో ఉందా అండి?”
ఆయన అభావంగా “దాదాపూ ముప్పది సంవత్సరాల కిందటి పుస్తకం అది. అప్పట్లో అమ్ముడు కాకుండా మిగిలి పోయిన పుస్తకాలన్నిటినీ రచయితకే పంపించామని గుర్తు!” అన్నాడు ఆయన.
ఆ మాటలు విన్న నేను దిగులులోకి కూరుకుపోవటం చూసి నన్ను ఎలాగైనా తిరిగి ఉత్తేజితుడిని చేయాలని షాప్ ఓనర్ అన్నాడు:
“కానీ, వెతుకు. నీకు అదృష్టముంటే ఆ పుస్తకం దొరికే అవకాశం ఉంది” అన్నాడు. అదే ఆయన చేసిన తప్పు. అప్పటినుండి ఆ షాపులో వెతుకుతూనే ఉన్నాను. ఒక ఆరు నెలలు నిరంతరాయంగా ఆ షాపుకి వెళ్ళి రహస్యలిపి కోసం వెతికాను. వెతికిన చోటునే మరీ మరీ వెతికాను. ఒకొక్క అక్షరాన్నీ తీక్షణంగా చూస్తూ, ఒకొక్క పుస్తకాన్నీ తడుముతూ వెతికాను. అలా ఒకొక్క పుస్తకాన్ని బయటకు తీసి, దాని ఆకారాన్ని స్పృశించి, దాని పరిమాణాన్ని కొలిచి, తిరిగి అదే స్థానంలో పెట్టేస్తాను. ఇలా ఎన్నో రోజులు ఆ షాపులోనే గడిపాను.
మొదట్లో రోజూ షాప్ ఓనర్ నన్ను ఓపికగా భరించే వాడు. నవ్వుకుంటూ పలకరించేవాడు. ఎంతో మర్యాదగా మాట్లాడేవాడు. వెతకటంలో తనవంతు సాయం అందించాడు. నాకు చిన్న చిన్న సేవలు కుడా చేసేవాడు. “కవిత్వం అంతరించిపోతున్న ఈ కాలంలో నువ్వు కవిత్వంపై శ్రద్ధ చూపించటం చాలా ముచ్చటగా ఉంది” అని ఒకట్రెండు సార్లు పొగిడాడు కుడా. అప్పుడప్పుడు “ఎందుకు రహస్యలిపి కోసం ఇంత వెతుకుతున్నావు?” అని అడిగేవాడు. రైల్వే స్టేషన్, గడ్డపాయన, అకస్మికంగా కనిపించిన మూడు పంక్తులు, గాలి వీచటం, ఆ గాలితో పాటు గడ్డపాయన పరిగెత్తటం, ఇలా జరిగిన కథ అంతా చెప్పాను. ఆయన నేను చెప్పిన మాటలు నమ్మకపోగా, వెకిలిగా నవ్వాడు. ఎందుకో గప్పున దుఃఖం వచ్చింది. అప్పటి నుండి నేను ఆయనకు నిజం చెప్పటం మానుకున్నాను. ఎప్పుడు ఆ విషయం అడిగినా, ఏదో ఒక కథ చెప్పేవాడిని. ఏ కథా షాప్ ఓనర్ని సంతృప్తి పరచలేదు. చిన్నగా నన్ను అనుమానించటం మొదలుపెట్టాడు. మొదటి మూడు నెలలు ఆయన నన్ను ప్రేమగానే భరించాడు. కాని ఎంత ఓపిక గల మనిషికైనా ఒక సమయం వస్తుంది, చిరాకు వేస్తుంది. మెల్లగా షాప్ ఓనర్ నన్ను విసుక్కోవటం, కసురుకోవటం, కోప్పడటం మొదలు పెట్టాడు. చివరికి బెదిరించాడు కుడా. నేను మాత్రం అవే పుస్తకాలను మరీ మరీ వెతికాడు.
చివరికి ఒక రోజు ఆయనకు బాగా మండిపోయింది. “ఎన్ని సార్లు చెప్పాలి! నీకు కావలసిన పుస్తకం ఇక్కడ లేదు. ఒక సారి చెప్తే అర్థం కాదా నీకు? ఇన్ని రోజులుగా మా ప్రాణాలు తోడేస్తున్నావు. నీకు పనీపాటా లేదా? ఇంకొక్క నిమిషం ఇక్కడే ఉంటే మెడ పట్టి గెంటేస్తాను” అని గట్టిగా అరిచేశాడు. అప్పుడు కొంచం భయపడ్డాను కాని, ఇలాంటిదేదో ఎప్పుడో ఒకసారి జరుగుతుందని ముందే ఊహించాను. “సార్! ప్లీస్, నన్ను ఉండనివ్వండి. ఆ పుస్తకం నాకెంతో ముఖ్యం. నన్ను అర్థం చేసుకోండి. ఆ పుస్తకం కోసం నా వెతుకులాటలో అత్యంత చేరువగా వచ్చాను. ఇప్పుడు నాకు ఇంత అన్యాయం చేయకండి” అని వేడుకున్నాను. “నువ్వూ వద్దు, నీ పుస్తకమూ వద్దు! ఇంకెప్పుడైనా ఇటు వైపు వస్తే చంపేస్తాను. తక్షణం బయటకి నడు!” అని బయటకు వెళ్ళే ద్వారం వైపు వేలు చూయించాడు. నేను నిస్సహాయుడినై బయటకి నడిచాను.
5
నేను బుక్ షాపు బయటకు పదడుగులు నడిచానో లేనో, ఇంతలోనే షాపులో పనిచేసే కుర్రాడు “సార్! సార్!” అంటూ నన్ను పిలుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, నా ముందు నిలబడి, ఆయాసపడుతూ అన్నాడు “సార్! ఆ పుస్తకం మీకు చాల ముఖ్యమంటున్నారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. మన ఊర్లోని యూనివర్సిటీలో తెలుగు సాహిత్యం విభాగం ప్రొఫెసర్ని కలవండి. ఆయన పుస్తకాల సేకరణే జీవితంగా బ్రతికే మనిషి. ఆయన దగ్గర లేని పుస్తకం ఉండదంటే అతిశయోక్తి కాదేమో! ఆయనకు మీరు వెతుకుతున్న పుస్తకం గురించి తెలిసే అవకాశం ఉంది.” అని అన్నాడు.
ఉప్పొంగిన ఉత్సాహంతో ఆ అబ్బాయిని అడిగాను, “ఆయనను నేను ఎక్కడ కలవవచ్చు?”
“మీరు యూనివర్సిటీలోని తెలుగు సాహిత్య విభాగానికి వెళ్ళండి. అక్కడ ఆయన దొరికుతాడు” అని చెప్పాడు ఆ అబ్బాయి.
అక్కడినుండి యూనివర్సిటీకి బయల్దేరాను.
యూనివర్సిటీ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే నన్ను అయోమయం ఆవరించింది. ఓ విశాలమైన ప్రపంచమే యూనివర్సిటీగా నా ముందు విచ్చుకొని ఉంది. ఎన్నో దారులు, ఎన్నో భవనాలు. వీటన్నిటిలో తెలుగు సాహిత్యం విభాగాన్ని ఎలా కనుక్కోవాలో తెలియలేదు. సింహద్వారం వద్ద యూనివర్సిటీలోని ప్రదేశాలను, దారులను సూచిస్తూ ఓ రేఖా చిత్రం ఉంది. ఆ రేఖా చిత్రాన్ని అనుసరిస్తే తెలుగు సాహిత్య విభాగానికి చేరుకోవచ్చన్న ఆశ కలిగింది. ఆ రేఖాచిత్రాన్ని తీక్షణంగా గమనించాను:
అదొక సువిశాలమైన యూనివర్సిటీ. యూనివర్సిటీలో ఎక్కువ శాతం చెట్లూ,గుట్టలూ ఉండగా అక్కడక్కడ చరిత్రా, సామాజిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలగు విభాగాలకు సంబంధించిన భవంతులూ, తరగతి గదులూ ఉన్నాయి. యూనివర్సిటీలోని ప్రతీ భవనాన్ని కలిపే రక్తనాళంలా ఓ ముఖ్య రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు నుండి వేరవుతూ చిన్న చిన్న దారులు బయటపడుతుంటాయి. ఆ రేఖా చిత్రం కింద ఎర్రటి అక్షరాలలో ఇలా రాయబడి ఉన్నది -
” A note from the cartographer who drew this map: Herewith is a map, being an incomplete one, consisting only of the essential elements of the University. There be many routes diverging from the main artery, and there be many undiscovered places in the University, that it is mortally impossible to sketch a perfect map. Hence, I would beg a stranger to only follow those routes that are inscribed on the map, so that he does not miss the path. Else, he might land in a nether world, the returning from where could be insuperable”
“పై వాక్యాలు సంక్షిప్తంగా: ఈ యూనివర్సిటీ ముఖ్య రోడ్డు నుండి అసంఖ్యాకమైన దారులు చీలి ఉన్నాయి. ఒకవేళ తప్పు దారి ఎంచుకుంటే, తిరిగి బయటపడటం ఇంచుమించు అసంభవం.”
అది చదవగానే నాలో గుబులు మొదలయ్యింది. రేఖాచిత్రంపై తెలుగు సాహిత్యం విభాగాన్ని కనిపెట్టాను. నేను ప్రస్తుతమున్న ప్రదేశం నుండి అక్కడికి ఎలా చేరుకోవాలో గమనించి, రేఖాచిత్రంపై ఉన్న దారిని జ్ఞాపకం పెట్టుకోటానికి దాన్నే తీక్షణంగా పదిహేను నిమిషాలు చూస్తూ ఉండిపోయాను. ఆ దారి నాకు జ్ఞాపకముందని మనసులో నమ్మకం కుదిరాక, యూనివర్సిటీ లోపలికి నడిచాను.
6
ముఖ్య రోడ్డుపై యూనివర్సిటీ లోపలికి నడిచాను. రోడ్డుకి ఇరువైపులా చిక్కగా పెరిగిన చెట్లు ఉన్నాయి. అక్కడక్కడ రోడ్డు నుండి వేరుపడుతూ మట్టి దారులు ఉన్నాయి. నేను రేఖా చిత్రాన్ని మననం చేసుకుంటూ ఎన్ని పక్కదారులొచ్చినా తిరగకుండా ముందుకు నడిచాను. అలా కొంత దూరం నడిచాక, ఒక చోట ఎడమ వైపు మలుపు తిరగవలసినదిగా రేఖాచిత్రంలో ఉన్నట్టు గుర్తొచ్చింది. నేను ఎడమ వైపు తిరిగాను. మరి కొంత దూరం నడిచే సరికి, ఆ దారి రెండుగా చీలి ఉంది. సరిగ్గా ఈ ప్రాంతానికి వచ్చేసరికి రేఖాచిత్రంలో ఎటువైపు తిరగాలని ఉందో గుర్తుకురాని పరిస్థితి ఏర్పడింది. నేను సందేహాస్పదంగా కుడి వైపు నడిచాను. అక్కడి నుండి నేను వేసిన ప్రతీ అడుగు, భయపడుకుంటూ వేసినదే. మరొక రెండు మలుపులు తిరిగాను. నా ప్రాణంలోకి బెరుకు చొరబడిందో ఏమో, నా మోకాళ్ళు వణకటం మొదలెట్టాయి. అలాగే నడుచుకుంటూ ఇంకాస్త దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఒక భవనం కనిపించింది. ఆ భవనం పై “గ్రంథాలయం” అని రాయబడి ఉంది. దాన్ని చూడగానే నాకు ప్రాణం లేచొచ్చింది.
గ్రంథాలయం లోనికి వెళ్ళాను. ఒక ముసలి లైబ్రేరియన్ అక్కడ పుస్తకాలకు కాపు కాస్తూ ఉన్నాడు. గ్రంథాలయంలోకి అడుగు పెట్టగానే ఒక వైపు కూర్చీ మీద కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు. అతని ముందర ఒక విశాలమైన టేబుల్. ఆ టేబుల్ మీద రిల్కె అనే కవి కవిత్వ పుస్తకం, ఆ పుస్తకాన్ని రెండుగా చీలుస్తూ మధ్యలో ఒక పెన్ను ఉంది. ఇంకా ఏవేవో పత్రికలు, వాటిపై ఓ పేపర్ వెయిట్, ఒక వాటర్ బాటిల్- గజిబిజిగా ఆ బల్లపై ఉన్నాయి. లైబ్రేరియన్ మాత్రం నోరు తెరుచుకొని జొళ్ళు కారుస్తూ, గురక పెడుతూ నిద్రపోతున్నాడు. అతను గాలి పీల్చుకున్నప్పుడు అతని రొమ్ము ఉబ్బుతుంది, తన ఊపిరితిత్తులనుండీ ఏదో శబ్దం చేస్తూ గాలిని బయటకు వదులుతాడు, అప్పుడతని రొమ్ము మామూలుగా అయిపోతుంది.
నేను ఆ లైబ్రేరియన్ను నిద్రలేపే ప్రయత్నంగా ఒకసారి కుదిపాను. ఆయన కష్టపడి నిద్రలేచి, బద్దకంగా “ఎవరూ?” అన్నాడు. నేను వినయంగా “పుస్తకాలు చూడటానికి వచ్చాను. నాకు రహస్యలిపి అనే పుస్తకం…” కావాలి అని అనే లోపే, ఆ లైబ్రేరియన్ నా మాటలు ఆపి “నువ్వు పుస్తకాలు చూడటనికి వస్తే, చూడు! అంతేగాని నన్ను నిద్రలేపటం దేనికి?” అన్నాడు. నేను బదులు ఇచ్చే లోపలే ఆయన తన నిద్రలోకి జారుకున్నాడు. నేను లైబ్రరీ లోనికి ప్రవేశించాను.
లైబ్రరీ ఓ అపారమైన భవనం. నేల నుండి పైకప్పు దాక దీని ఎత్తు ఇరవై అడుగులు ఉంటుంది. గ్రంథాలయం ఎప్పుడూ ఖాళీగా నిశ్శబ్ధంగా ఉంటుంది. గ్రంథాలయాన్ని విభజిస్తూ అపారమైన అలమారలు ఉంటాయి. ఒక అలమారకి మరొక అలమారకి మధ్యనున్న స్థలంలో ఓ ఇద్దరు మనుషులు పట్టేటంత సందు ఉంటుంది. అలా అలమారల మధ్య వీధులు వీధులుగా ఏర్పడి ఉంటుంది. ప్రతొక్క వీధిలో అటూ ఇటూ అనేకానేక పుస్తకాలు. పుస్తకాలన్నీ చెక్కగా వర్గీకరింపబడి ఉంటాయి. పిల్లల పుస్తకాలు, క్లాసిక్ పుస్తకాలు, పాశ్చాత్య సాహిత్యం, తెలుగు సాహిత్యం, కవిత్వం, కథ, నవల, వ్యాసాలు – ఇలా వరుసల్లో, ఏదో మార్మికమైన క్రమంలో, తలబద్దలు కొట్టుకున్నా చిక్కు విడని పొడుపు కథలా ఉంది అక్కడి పుస్తకాల అమరిక. లైబ్రరీ లోనికి నడుస్తుంటే ఓ రూబిక్ క్యూబ్ లోకి నడుస్తున్నట్టు అనిపించింది.
లైబ్రరీలో వెలుగు కొంచం తక్కువ. కొన్ని మూలలు సంవత్సరాల తరబడి వెలుగుని చూసి ఎరుగవు. ప్రతి పుస్తకాల వీధి చివరా కరుడుగట్టిన చీకటి ఉంటుంది. ఇక్కడ మన అడుగుల శబ్ధం కుడా మనకు వినబడేంత నిశ్శబ్ధం కూడుకొని ఉంటుంది. ఎప్పటిలాగే నేను రహస్యలిపి కోసం శోధించటం మొదలెట్టాను. ప్రతీ అరలో వెతికాను, ప్రతీ పుస్తకాన్నీ తడిమాను. ఏదో తాపత్రయం, ఏదో తపన. ఆ రోజు రైల్లో కిటికీ పక్కన కూర్చొని మారుతున్న దృశ్యాలను చూస్తున్నప్పుడు కలిగిన తపననే. సరిగ్గా అదే అనుభూతి.
చీకటిపడేసరికి,యూనివర్సిటీ నుండీ బయటకి దారి వెతుక్కోవటం కష్టమవుతుంది అనుకుని, ఆ రోజుటి నా వెతుకులాటకు సెలవు పలికి, బయటకు వెళ్ళు దారికోసం వెతికాను. గ్రంథాలయంలో ఒక చోట “బయటకు దారి” అని రాసిఉంది. వింతగా ఆ దారి నన్ను ముఖ్య రోడ్డు వద్దకు చేర్చింది. అక్కడి నుండి నేను దారి కనుక్కోవటం చాలా తేలిక, ముక్కుసూటిగా వెళ్తే చాలు.
7
తరువాతి రోజు, మళ్ళీ యూనివర్సిటీ సింహద్వారం వద్ద నిలబడి రేఖా చిత్రాన్ని గమనిస్తూ ఉండిపోయాను. తెలుగు సాహిత్యం విభాగానికి చేరుకోటానికి దారిని గుర్తుపెట్టుకుంటూ, క్రితం సారి ఏ ప్రదేశంలో తప్పు చేసానో, ఆ ప్రదేశాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకున్నాను. యూనివర్సిటీ లోనికి నడిచాను. నేను గుర్తించుకున్న రేఖాచిత్రాన్ని అనుసరిస్తూ, మలుపులు తిరుగుతూ ముందుకు నడిచాను. కాని మళ్ళీ ఒక దగ్గర దారి మరచిపోయాను. నేను నడవటం కొనసాగించాను. ఈ సారి ఓ పార్కుకు చేరుకున్నాను.
అప్పటికే అలసిపోయిన నేను, ఈ రోజుటికి పార్కులో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. పార్కులో ఓ చెట్టు కింద బల్లపై కూర్చున్నాను. అదొక ప్రశాంతమైన మైదానం. కొందరు మనుషులు పార్కు చుట్టూ నడుస్తున్నారు. మరి కొంత మంది పచ్చ గడ్డి పై కూర్చొని కబుర్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ తల్లీ, కొడుకు నేను కూర్చున్న బల్లకి చేరువగా కూర్చోవటం గమనించాను. కొంత సేపు తన తల్లి ఓడిలో కూర్చున్న పిల్లవాడు ఓ సీతాకోకచిలుక కనబడగానే దాన్ని పట్టుకోటానికి ప్రయత్నించాడు. ఆ గరిక పచ్చ మైదానమంతా ఆ సీతాకోకచిలుకను తరుముకుంటూ, దాన్ని పట్టుకోటానికి ప్రయత్నించాడు. కానీ చివరికి ఆ సీతాకోకచిలుక దొరకకపోయే సరికి నిరాశగా తన తల్లి దగ్గరకు తిరిగొచ్చాడు. ఆ పిల్లవాని తల్లి నవ్వుతూ-
“సీతాకోకచిలుకలను పట్టుకోవాలని ప్రయత్నిస్తే అవి మనకు అందకుండా పారిపోతాయి. వాటి గురించి ఆలోచించకుండా, నీ పాటికి నువ్వు ఒక చోట స్థిరంగా కూర్చుంటే, అవే వచ్చి నీ పై వాలుతాయి” అని చెప్పింది. ఆ మాటలు వింటున్న పిల్లాడి భుజంపై ఓ సీతాకోకచిలుక వాలింది.
అదంతా గమనిస్తున్న నేను ఆలోచనలో పడిపోయాను. అలా దూరంగా చూస్తూ ఆలోచనలో మునిగిపోయాను. అప్పుడు కనబడింది రెండో సారి రహస్యలిపి. అస్తమిస్తున్న సూర్యుడినుండి తూర్పు వైపుగా వీస్తున్న గాలితో పాటు నడుస్తున్న ఓ అమ్మాయి చేతిలో.
ఆమె ఆకుపచ్చ రంగు సల్వార్ కమీజ్ వేసుకొని, చేతిలో రహస్యలిపిని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తోంది. రహస్యలిపిని చూడగానే మనసు ఉబ్బితబ్బిబయ్యింది. ఒక్కసారిగా నా అలసిన శరీరపు ప్రతీ నరం ఉత్సాహాన్ని ప్రసరించింది. చుట్టూ సమయం గడ్డకట్టినట్టు, నాకు ఎదురుగా రహస్యలిపిని చేతిన పట్టుకొని నడుస్తున్న అమ్మాయి మాత్రమే కదులుతున్నట్టు అనుభూతి కలిగింది. ఓ గాఢమైన నిద్రలోంచి లేచినట్టు ఆ బల్ల పై నుండి లేచి నిల్చున్నాను. ఆమెతో మాట్లాడటానికి ఒక్క నిమిషం కుడా సంకోచించలేదు. నేరుగా ఆ అమ్మాయి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా ప్రమేయం లేకుండానే అడిగేసాను “నాకు ఆ పుస్తకం ఇస్తారా అండి?” అని. కొద్ది సేపయ్యాకగాని అర్థం కాలేదు ఆ క్షణం నేనేం చేసానొ. ఆ అమ్మాయి నన్ను చూసి భయపడి, అసహ్యించుకున్నట్టు మొహం పెట్టి నాకు దూరంగా జరిగింది. నా దప్పికగొన్న ఆత్మలో కొంచం శాంతిని నింపుకొని తిరిగి మాట్లాడటం మొదలెట్టాను కొంచం ప్రశాంతంగా. “నాకు ఆ పుస్తకం కావాలండి. చాల అవసరం. నా పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ పుస్తకాన్ని చదవటం, తక్షణం నా జీవితపు లక్ష్యం. ఆ పుస్తకం కోసం నిద్రాహారాలు మానేసి వెతుకుతున్నాను”. అని అన్నాను. నా మాటల వల్ల కావచ్చు, ఇప్పుడు కొంచం ధైర్యం వచ్చినట్టు అనిపించింది ఆ అమ్మాయి మొఖంలొ. అదే ప్రోత్సాహంగా “నేను ఈ ఊరిలోనే ఉంటాను, నా పేరు…” అని చెప్తుండగా ఆమె హస్తం చూపి నన్ను ఆపింది. “నీ పేరు, ఎక్కడ ఉంటున్నావ్ చెప్పొద్దు, ఇలాంటి వివరాలన్నీ నాకు అనవసరం. నీకు కావలిసింది పుస్తకమే కదా” అంటూ కొనసాగించింది. “ఈ పుస్తకం వెలకట్టలేనిది. నాకు ఎంతో ఆత్మీయమైనది. ఎవ్వరికీ ఈ పుస్తకం ఇవ్వలేను” అన్నది. అలా ఆమె అనే సరికి నాలో ఏదో గందరగోళం మొదలయ్యింది. ఇంతలో ఆమె చెప్పింది “నీకు ఈ పుస్తకం అంత అవసరం అంటున్నావు కాబట్టి, చెప్తున్నాను. నాకు నీ పేరు కాని, నీ వివరాలు కాని చెప్పొద్దు. నువ్వు కుడా నా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు. అసలు ఈ పుస్తకం ఒక్కటే మన ఇద్దరి మధ్యా ఉన్నది. ఇంక ఎటువంటి సంబంధం ఉండకూడదు.
పలకరింపులు, వీడ్కోళ్లు- ఇవేవి వద్దు. రోజూ సాయంత్రం సరిగ్గా ఇదే సమయానికి, ఇప్పుడు ఎక్కడైతే నిల్చొని ఉన్నానో అక్కడికి వస్తాను. నువ్వూ నా దగ్గరకి రావాలి. రోజుకు సరిగ్గా వంద పదాలు చదువుతాను. ఖచ్చితంగా వంద పదాలు. దాని తర్వాత వెళ్ళిపోతాను. నేను చదువుతున్నంత సేపూ నువ్వు మౌనంగా వినాలి. నేను చదువుతున్నది అర్ధాంతరంగా ఆగిపోయిందనో, ఇంకొన్ని పదాలు ఎక్కువ చదవమనో నువ్వు అడిగినా, ప్రార్థించినా వెంటనే మన ఒప్పందం రద్దు అవుతుంది. తర్వాత ఎన్నడూ నేను నీకు కనబడను. అంతే. నీకు అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పు ” అని అభావంగా, ఎప్పటినుండో తనలో మెదులుతున్న మాటలకు ఇప్పుడు సందర్భం వచ్చినట్టు చెప్పింది. “నేను అన్నిటికీ ఒప్పుకుంటున్నాను” అన్నాను, ఆతృతగా. “సరే” అని తాను అంతకు ముందు నడుస్తున్న దారిన వెళ్ళిపోయింది. నేను తనను అనుసరించి తాను ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకునే ధైర్యం చేయలేదు. అలా చేస్తే నాకు రహస్యలిపి దొరకదేమోనని భయం. చిట్టచివరి కిరణాలు కొన్ని అస్తమించిన సూర్యుని సాక్షిగా ఆకాశంలో విసిరేయబడి ఉన్నాయి, ఆ రోజుతో తమ బంధనాలన్నీ తెంచుకోలేక కావచ్చు. ఇన్ని రోజుల్లో మొదటి సారి ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను.
రెండవ భాగం
1
ఎవరో ఛాతి పై కాలు పెట్టి అదిమేస్తున్నట్టు ఊపిరి ఆడటంలేదు. ఒళ్ళంతా చమటలతో ఉలిక్కిపడిలేచాను. వర్షం పడుతోంది. రూం సీలింగ్ పై వర్షపు చినుకుల శబ్ధం యుద్ధంలో తూటాల శబ్ధంలా వినిపిస్తున్నాయ్. నాకొచ్చిన కలను నెమరు వేసుకుంటూ కూర్చున్నాను. ఆ కలలోని కొన్ని అసంబద్ద సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. కోతి గర్భంలో పెరుగుతున్న శిశువు ఒకటి. వెచ్చటి రక్తంతో గీసిన పెయింటింగ్. సెక్స్ తారాస్థాయికి చేరినప్పుడు విడిచే నిట్టూర్పుల, మూలుగుల శబ్ధాలు. ఫోరెన్సిక్ డిపార్టుమెంటు వెనుక భాగంలో శవాలు కుళ్ళుతున్న వాసన- ఈ అసంబద్ద విషయాలన్నీ ఆ కలలో కనిపించాయి, అనిపించాయి. నా జేబులోంచి గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టు తీసి అలోచిస్తూ రూము బయటకి వచ్చాను. ఆకాశం వైపు చూసాను. చంద్రుడు, పచ్చికబయలు పై బద్దకంగా మేస్తూ కదిలే తెల్లటి ఆవులా,చీకటి ఆకాశంలో కదులుతున్నాడు.
రహస్యలిపికోసం వెతికే ప్రక్రియలో ప్రపంచాన్ని నేను అర్థం చేసుకునే పద్దతే మారి పోయింది. మొదట్లో, నా చుట్టు ఉన్న ప్రపంచాన్ని పెద్దగా పట్టించుకోకుండా బ్రతికే వాడిని. ఏ పెనుమార్పో సంభివిస్తే తప్ప, అది నా స్పృహకు వచ్చేది కాదు. కాని రహస్యలిపి కోసం నేను వెతకటం మొదలుపెట్టినప్పటి నుండి ప్రతి చిన్న అలికిడి నాలో ఆసక్తి కలిగిస్తుంది. సూక్ష్మమైన కదలికని కుడా గుర్తుపడుతున్నాను. ఈ మార్పు వల్ల నా ప్రమేయంలేకుండానే ఆలోచించటం, ఆలోచిస్తూ ఆలోచిస్తూ విచిత్రమైన భావాలూ, భ్రాంతులూ నన్ను కట్టడి చేయటం జరుగుతోంది. ఈ ఆలోచనల నిర్బంధం నుండి తప్పించుకోలేక పోతున్నాను.
మరొక ఆలోచన నన్ను శాసిస్తోంది. ఒక అనంతమైన పుస్తకాన్ని ఎలా రాయాలన్న ఆలోచన. ఎన్ని రోజులు చదివినా భౌతికంగా అంతం కాని పుస్తకాం. అలాంటి పుస్తకానికి మొదటి పేజీలో ఏముంటే చివరి పేజీలో కూడా అదే ఉండాలి. మొదలు, తుది ఒకటే అయ్యి ఉండాలి. మొదటి వాక్యం, చివరి వాక్యాన్ని పోలి ఉండాలి. గతం, వర్తమానం, భవిష్యత్ కాలాలలో పయనిస్తూ, ఒక చిక్కుముడిలా ఉండాలి ఆ పుస్తకం. అప్పుడే అది అనంతమవుతుంది. రహస్యలిపి కుడా అలాంటి పుస్తకమే అని నా భావన.
కాని అసలు రహస్యలిపి అనే ఈ కవిత్వ పుస్తకా దేని గురించి అయ్యుంటుంది?ఆ పుస్తకం లోని వస్తువు, శిల్పం మధ్య ఏ మార్మిక సంబంధం ఉంటుంది? అసలు ఆ పుస్తకం పేరు రహస్యలిపి అనటంలో కవి ఉద్దేశం ఏంటి? కవి తనకు మాత్రమే తెలిసిన రహస్యాన్ని పాఠకులతో సంవదించాలనుకుంటున్నాడా? ఈ కవితలన్నీ ఆ రహస్యాన్ని సంకేతపరిచే గుర్తులా? ఇలా ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి నన్ను ఓ ప్రవాహంలా లాక్కుపోతాయి.
ఇంతలోనే సాయంత్రం పార్కులో రహస్యలిపి ఉన్న అమ్మాయిని కలవబోతున్నాను అని గుర్తొచ్చింది. ఆ అమ్మాయి నాకు ఎందుకు అన్ని నియమాలు పెట్టిందో అంతు చిక్కటం లేదు. బహుశా ఆ అమ్మాయికుడా నాకు తెలియని శక్తుల నిర్భంధాలకు బానిస ఏమో. కాని రహస్యలిపిని నా చేతులలో పట్టుకొని, స్వేచ్ఛగా పేజీలు తిప్పుతూ, యథేచ్ఛగా చదివితేనే కద, అందులోని మర్మం తెలిసేది. ఈ నియమాల ఉచ్చులో రహస్యలిపి నాకు ఎంతమాత్రం బోధపడదు. అలా అని, నియమాలను అతిక్రమించి, రహస్యలిపి కలిగిన ఆ అమ్మాయిని కోల్పోలేను. బహుశా నేను రహస్యలిపి నా చేతికి దొరికే దాక వెతకటం కొనసాగించాలి. అంతవరకు ఆ అమ్మాయి పెట్టిన నియమాలకు బానిసగా, తాను చదువుతుంటే మౌనంగా వినాలి.
ఇప్పుడిప్పుడే ఆకాశంలో కొంచం వెలుతురు వ్యాపిస్తోంది. నేను తిరిగి నా గదిలోనికి వెళ్ళి పెస్సోవా అశాంత గ్రంథం బయటకు తీసి చదవటం మొదలెట్టాను.
2
ఊరు మెల్లిమెల్లిగా నిద్రలేస్తోంది. దారిలో టిఫిన్ చేసి సరాసరి యూనివర్సిటీకి వెళ్ళాను. సింహద్వారం వద్ద ఉన్న రేఖాచిత్రాన్ని ఈ సారి తదేకంగా చూసి, నా మెదడుపొరలపై దారులను నమోదు చేసుకున్నాను. రేఖాచిత్రాన్ని అనుసరిస్తూ మొదట లైబ్రరీకి చేరుకున్నాను. రేఖా చిత్రం ప్రకారం లైబ్రరీ నుండి రెండు మలుపుల దూరంలోనే తెలుగు సాహిత్యం విభాగం ఉంది. నాకు దారి ఖచ్చితంగా గుర్తుంది. పొద్దు ఇంకా గడవలేదు గనుక, మొదట కొంత సమయం లైబ్రరీలోనే గడపాలని నిశ్చయించుకున్నాను.
గ్రంథాలయంలోకి అడుగుపెట్టగానే, నిద్రపోతున్న లైబ్రేరియన్ కనిపించాడు. మరొక సారి నిద్రలేపటానికి ప్రయత్నంగా, ఆయనను కుదిపాను. ఆయన తన అమూల్యమైన నిద్రలోంచి లేచి, “ఏం కావాలి?” అని అడిగాడు. నేను “పుస్తకాలు చూడటానికి వచ్చాను. రహస్య…” అని చెప్తుండగానే, ఆయన కోపంగా “నువ్వు మొన్న కుడా వచ్చావు కద. ఒక సారి చెప్తే అర్థం కాదా నీకు. నువ్వు పుస్తకాలు చూడటానికి వచ్చావా, నన్ను నిద్రలేపటానికి వచ్చావా? నీకు కావలసిన పుస్తకం ఉందో లేదో లోపలికి వెళ్ళి వెతుక్కో. మధ్యలో నన్ను మాత్రం నిద్రలేపకు” అని, తిరిగి నిద్రలోకి జారుకున్నాడు.
నేను మారు మాట్లాడకుండా లోపలికి నడిచాను. గ్రంథాలయం చీకటిగా ఉంది. ఎవరూ లేరు. నేను రహస్యలిపి కోసం అన్ని పుస్తకాలనూ వెతికాను. వెతికిన చోటనే మరీ మరీ వెతికాను. వెతికి వెతికి అలసిపోయాను. స్పానిష్ రచయిత సెర్వాంటిస్ రాసిన డాన్ కిహోటే సాహసయాత్రల పుస్తకం దొరికింది. కొంత సేపు విశ్రాంతిగా, ఆ పుస్తకం చదవాలి అనుకున్నాను. గ్రంథాలయంలో ఒక మూల ఓ వెడల్పాటి బల్ల ఉంది. ఆ బల్లకి ఇరువైపులా కుర్చీలు ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే వెలుగు ఉండేలా ఓ నారింజ రంగు బల్బు ఉంది. నేను డాన్ కిహోటే సాహసయాత్రల పుస్తకాన్ని అక్కడి కూర్చీలపై కూర్చొని నారింజ రంగు వెలుతురులో చదవటం మొదలుపెట్టాను.
చదువుతూ సమయాన్ని మరచిపోయాను. అకస్మికంగా నేను ప్రొఫెసర్ని కలవటానికి తెలుగు సాహిత్య విభాగానికి వెళ్ళాలని గుర్తొచ్చింది. నేను త్వరత్వరగా లైబ్రరీ నుండి బయటకి వచ్చి రెఖాచిత్రాన్ని మననం చేసుకుంటూ తెలుగు సాహిత్యం విభాగానికి చేరుకున్నాను. తెలుగు సాహిత్య విభాగం మూడంతస్తుల భవనం. దాని లోపలికి వెళ్ళాను. అక్కడ ఎన్నో గదులు ఉన్నాయి. ఒకొక్క గది ద్వారం వద్ద, ఆ గది యొక్క వివరణ ఉంది. కొన్ని తరగతి గదులు, కొన్ని విశ్రాంతి గదులు, మరికొన్ని అక్కడ పనిచేసే ఉపాధ్యాయుల గదులు అలా వరుసగా ఉన్నాయి. ఆ భవనంలోనికి నడిచే కొద్దీ కొత్త గదులు కనిపిస్తూ ఉన్నాయి. అలా నడుస్తూ ఒక చివరికి వెళ్ళాక మెట్ల దారి వచ్చింది. ఆ మెట్లు ఎక్కాను. మళ్ళీ గదులు. గదులలో మనుషులు ఎవరూ లేరు. ఎవరైనా కనిపిస్తారేమోనని భవనం అంతా గాలించాను. చివరికి కాకీ చొక్క వేసుకున్న గుమస్తా కనిపించాడు. ఆయన ఓ పుస్తకాల బరువుని రెండు చేతులతో మోసుకొని పోతున్నాడు. ఆయన వద్దకు వెళ్ళి
“ఏమండీ!ప్రొఫెసర్ గది ఎక్కడ ఉంటుంది?” అని అడిగాను.
ఆయన నన్ను చూసి,”మూడవ అంతస్తులో, ఎడమ వైపు చివరది ప్రొఫెసర్ గది” అని చెప్పాడు.
నేను ఆ గుమాస్తా చెప్పిన సూచనలు పాటిస్తూ మూడవ అంతస్తులో, ఎడమ వైపు చివరకు నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ ఉన్న గదికి తాళం వేసి ఉంది. ఆ గది ద్వారం పైన బోర్డుపై గుండ్రంగా “ప్రొఫెసర్” అని రాసి ఉంది. బహుశా ప్రొఫెసర్ ఇక్కడ లేడేమో అనుకుని, తిరిగి గుమాస్తా దగ్గరకు వెళ్ళి, అడిగాను “ప్రొఫెసర్ గదికి తాళం వేసి ఉంది” అని అన్నాను.
ఆ గుమాస్తా నవ్వుతూ “అవును, క్లాస్ అయిపోయింది, ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళిపోయాడు” అని చెప్పాడు.
“క్లాస్ ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుందో చెప్పగలరా?” అని అడిగాను.
“క్లాస్ ఎప్పుడైనా ఉండచ్చు. దానికి సమయం సందర్భం ఉండదు” అంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి నిష్క్రమించాడు.
నేను నిరుత్సాహంగా పార్కుకు బయలుదేరాను.
3
పార్కు చేరుకున్నాను. రహస్యలిపితో ఆ అమ్మాయి మరి కొద్ది సేపటికి వస్తుంది. అంతవరకు నేను పార్కు ఆవరణను గమనిస్తూ ఉండిపోయాను. క్రితం సారి వచ్చినప్పుడు పార్కు మైదానంలో ఆడుకుంటున్న తల్లీ కొడుకులు ఈ రోజు కుడా ఉన్నారు. పిల్లాడిని ఒడిలో పడుకోబెట్టుకొని, తల్లి కథలు చెప్తోంది. నేను కూర్చున్న బెంచికి అయిదడుగుల దూరంలో ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. అతను దిగంతాలని చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇద్దరు లావాటివాళ్ళు పార్కు మైదానం చుట్టూ పరిభ్రమిస్తున్నారు. తూర్పుదిక్కున ఉన్న బేంచీ మీద ఇద్దరు ప్రేమికులు కూచుని కబుర్లాడుకుంటున్నారు. అలా పార్కులోని విషయాలన్నిటినీ గమనిస్తూ కూర్చున్నాను.
అశాంత పుస్తకానికి పరిచయం రాస్తూ పెసోవా బెర్నార్డో సొరేస్ గురించి చెప్పినట్టు నేను కుడా పార్కులో ప్రత్యక్షంగా కనిపిస్తున్న దృశ్యాలను బట్టి అవగతం చేసుకోటానికి ప్రయత్నించాను. పార్కు మొత్తంలో గణనీయమైన చలనం ఉన్నది. మైదానం చుట్టూ పరిభ్రమిస్తున్న లావాటివాళ్ళకు మాత్రమే. మిగిలిన అందరూ ఎవరి స్థానాల్లో వారు స్థిరంగా ఉన్నారు. దిగంతాలను చూస్తున్న ముసలాయన అందరికంటే స్థిరంగా ఉన్నాడు. పిల్లాడు మాత్రం తన తల్లి మాట వినకుండా, ఆమె చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతున్నాడు. తూర్పు దిక్కున కబుర్లాడుకుంటున్న ప్రేమికులు మరో ప్రపంచంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇన్ని విభిన్న చలనాలకు అంతర్లీనంగా ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నాను. ఈ చలనాలన్నిటినీ బంధించగల ఫార్ములాని కనిపెట్టటానికి ప్రయత్నిస్తున్నాను.
అంతలోనే ఆ అమ్మాయి పార్కుకు వచ్చింది. నేను ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి నిల్చున్నాను. ఒక పలకరింపు లేదు మా ఇద్దరి నడుమ. ఒక రెండు సెకన్లు వేచిఉన్నాను. ఆమె కవిత చదవటం మొదలెట్టింది. తాను చదువుతున్నంత సేపు నేను కళ్ళు మూసుకొని విన్నాను. ఆమె స్వరం, ఆమె చదువుతున్న కవితకు సరిగ్గా సరిపోయింది. ఆమె కవిత చదవటం ఎంతో ప్రాకృతికంగా, స్వాభావికంగా అనిపించింది. గాలి వీస్తున్నట్టు, నది సముద్రంలో కలుస్తున్నట్టు ఎండుటాకులు రాలిపడుతున్నట్టు సహజంగా అనిపించింది. ఆమె చదవటం వల్ల కవిత మెరుగ పడలేదు, కుంటు పడనూలేదు. సరిగ్గా ఎలా చదవాలో, ఎలా అర్థం కావాలో, కవి ఆ కవిత రాసినప్పుడు ఎలా ఊహించి ఉంటాడో అంత మోతాదునే వినిపించింది, అనిపించింది, అర్థమయ్యింది. ఆ అమ్మాయి కవిత చదువుతోంది అనటంకంటే, కవిత ఆ అమ్మాయి చేత చదవబడుతోంది అంటే యథార్థంగా ఉంటుంది. అలా కవితలు చదవటానికి ఎంతో నైపుణ్యం కావాలి. ఆ అమ్మాయి కవిత చదువుతున్న ఆద్యంతం తన ఇంద్రియాలన్నీ కవితపైనే కేంద్రీకరించి, నిద్రను మించిన మరేదో స్థితిలోకి వెళ్ళినట్టు చదివింది. సరిగ్గా వంద పదాలు చదివి, అర్ధాంతరంగా ఆపేసింది. నేను కళ్ళుతెరిచే లోపే అక్కడినుండి నిష్క్రమించింది. నేను, ఆ కవితా వలయం విసిరిన పారవశ్యంలోనే కొట్టుమిట్టాడాను.
అప్పటికే పొద్దు గడుస్తోంది. నేను తిరిగి నా గదికి చేరుకొని నిద్రపోయాను.
4
నిద్రలో ఏదో పీడకల నుండి ఉలిక్కిపడి లేచాను. నా మెదడులో ఆలొచనలు గడ్డకట్టాయి. ఆ కల ఇప్పుడు గుర్తులేదు, కానీ అదొక దారుణమైన కల. తిరిగి నిద్రపోయేంత ధైర్యం చేయలేదు. గది బయటకు నడిచాను. నిశీధి ఇంకా చిక్కగా ఉంది. ఎన్నో యుగాలుగా మనుషులు రాత్రిని నిర్మిస్తూ వచ్చారు. ఈ రోజు రాత్రి ఈ శిల్పాన్ని సంతరించుకోటానికి మానవత్వం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో! ఈ రాత్రిలో గడ్డకట్టిన నిశ్శబ్ధం కోసం ఎంతమంది తమ ప్రాణాలను త్యజించారో. ఈ రాత్రి పులుముకున్న చిక్కటి నలుపు రంగు ఎన్ని యుగాల తరబడి జరుగుతున్న యుద్ధాలు స్రవిస్తున్న రక్తమో. ఈ రాత్రి వీస్తున్న గాలి ఏ కాలంలో తీరని కోరికలతో మరణించిన ప్రేమికుని చివరి నిట్టూర్పో! ఒకొక్క తీగను అల్లుతూ, ఒకొక్క ఇటుకను పేర్చుతూ జాగ్రత్తగా మానవత్వం రాత్రిని నిర్మిస్తూ వచ్చింది.
ఇలా ఆలోచిస్తుండగానే తెల్లారింది. నేను తయారయ్యి, యూనివర్సిటీకి బయలుదేరాను. దారిలో టిఫిన్ చేసాను.
యూనివర్సిటీకి చేరుకున్నాను. మొదటే తెలుగు సాహిత్యం విభాగానికి వెళ్ళి ప్రొఫెసర్ని కలుసుకోవాలనుకున్నాను. తెలుగు సాహిత్యం విభాగంలో కింద అంతస్తులో దిక్కుతెలియక తిరుగుతూన్న నాకు గుమాస్తా కనిపించాడు. అతని దగ్గరకు వెళ్ళి “ప్రొఫెసర్ ఎక్కడుంటారు?” అని అడిగాను. “ప్రొఫెసర్ ఇప్పుడు క్లాస్ చెప్పటానికి వస్తున్నాడు. క్లాస్ అయిపోయాక కలవచ్చు” అని చెప్పాడు.
నేను తరగతిగదిలో చివరి బెంచిలో కూర్చుని ప్రొఫెసర్ క్లాస్ వినాలనుకున్నాను. విద్యార్థులు ఒకొక్కరుగా క్లాసులోకి వచ్చి తమతమ ప్రదేశాల్లో కూర్చున్నారు. కొంచం సేపటిలోనే తరగతి గది విద్యార్థులతో నిండిపోయింది. ఇంతలోనే క్లాస్లోకి ప్రొఫెసర్ వచ్చాడు. విద్యార్థులందరూ లేచి నిలబడ్డారు. నేను కూడా లేచి నిలబడ్డాను. ప్రొఫెసర్ పొడువాటి తాళ్ళు గల కళ్ళద్దాలు పెట్టుకుని, తెల్ల చొక్కాని నల్ల పాంటులోకి టక్ చేసుకొని ఉన్నాడు. అతని జుట్టు చింపిరిగా ఉంది. అతని ముఖంపై గరుకు గడ్డం ఉంది. క్లాస్ ఆద్యంతం ఆయన శుద్ధ తెలుగులో మాట్లాడాడు. ఆయన ప్రసంగం ప్రకారం బానిస, రాచరిక, భూస్వామ్య వ్యవస్థల్లో సాహిత్యం పారిపాలక వర్గాలకు మాత్రమే చెందినదిగా ఉండేదని చెప్పాడు. పారిశ్రామిక విప్లవం, అది తెచ్చిన అచ్చుయంత్రం సాహిత్యాన్ని ప్రజాస్వామికం చేసిందని చెప్పాడు. అలాంటి పరిస్థితులలో రచయితలు బూర్జువా, పాలక వర్గం వైపు నిలబడి రాయాలా, లేక అణగారిన, శ్రామిక వర్గాం వైపు నిలబడి రాయాలా అన్న ప్రశ్న ఎదుర్కున్నారని చెప్పాడు.
ఈ విధంగా ప్రొఫెసర్ నిరంతరాయంగా గంట సేపు ప్రసంగం చేసాడు. క్లాస్ ముగియగానే మొదట ప్రొఫెసర్ బయటకు నడిచాడు. తర్వాత విద్యార్థులందరూ ఒక్క సారిగా లేచి బయటకు నడిచారు. ఆ గుంపులో నేను వెనకబడ్డాను. విద్యార్థులందరినీ తోసుకుంటూ నేను బయటకొచ్చే సరికి ఐదు నిమిషాలు పట్టింది. నేను క్లాస్ బయట పడగానే ప్రొఫెసర్ కోసం గాలిస్తూ భవనమంతా వెతికాను. గుమాస్తా కనిపించాడు. గుమాస్తా వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆయాసపడుతూ అడిగాను “ప్రొఫెసర్ ఎక్కడ ఉన్నారు?” అని – “ప్రొఫెసర్ ఇప్పుడే వెళ్ళిపోయాడు” అని చెప్పాడు.
నాకు బాధ కలిగింది. కొంతలో చేజారాడు అనిపించింది.
నేను అక్కడి నుండి లైబ్రరీకి వెళ్ళాను.
5
అక్కడ లైబ్రేరియన్ నిద్రపోతున్నాడు. నేను ఆయన్ను నిద్రలేపే ప్రయత్నం చేయలేదు. లైబ్రరీలో రహస్యలిపి కోసం వెతకటం మొదలెట్టాను. పుస్తకాలు వరుస కుడా మారకుండా ఎక్కడ ఉన్న పుస్తకాలు అక్కడే ఉన్నాయి. లైబ్రరీలో కొన్ని చోట్ల పుస్తకాలు ధూళి పట్టి ఉన్నాయి. అలమారాల చివర్లలో బూజు పట్టి ఉంది. లైబ్రరీ గోడలపై కూడ చీలికలు ఉన్నాయి. ఇది ఎంతో పురాతనమైన లైబ్రరీ. పుస్తకం కోసం వెతికి వెతికి అలసిపోయిన నేను సెర్వాంటిస్ డాన్ కియోటెని తీసుకొని, కూర్చీలో కూర్చొని చదవటం మొదలెట్టాను.
నేను చదువుతుండగా ఏదో అలికిడి వినిపించింది. నేను పుస్తకం వైపు నుండి తల ఎత్తి అలికిడి వచ్చిన వైపు చూసాను. అక్కడ ఒక నల్ల పిల్లి ఉంది. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. ఆ పిల్లి సమయంలో గడ్డకట్టి నట్టు, కదలకుండా నన్నే తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది. ఈ లైబ్రరీ చీకట్లలో ఎవరికీ కనబడకుండా తిరిగే మార్మిక జీవి ఈ పిల్లి. ఈ పిల్లి ఉనికి గురించి ఎవరికీ తెలియదు. కొంతమంది లైబ్రరీలో ఏదో మృగం ఉందని చెప్తుంటారు. మరికొంత మంది అదొక కట్టుకథ అని చెప్తుంటారు. ఈ పిల్లిది నలుపు రంగు అవ్వటం చేత, లైబ్రరీ చీకట్లలో ఉచితంగా కలిసిపోయే స్వభావం కలిగినది. నేను అలా ఆలోచిస్తుండగానే ఆ పిల్లి చీకటిలోకి దుమికి అదృశ్యమయ్యింది.
నేను అక్కడి నుండి పార్కుకు వెళ్ళాను. ఎప్పుడూ కూర్చునే ప్రదేశంలోనే కూర్చున్నాను. నేను అక్కడికి వచ్చే సరికి అప్పటికే పార్కు మైదానంలో ఆడుకుంటున్న తల్లీ కొడుకులు ఉన్నారు. నేను కూర్చున్న బెంచికి ఐదు అడుగుల దూరంలో ఇద్దరు ముసలి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు నాకు వినిపిస్తున్నాయ్. వారిద్దరిలో ఒక ముసలాయన, మరొక ముసలాయనకు ఏదో కథ చెప్తున్నట్టు అనిపించింది. నేను కొంచం దగ్గరగా జరిగి ఆ కథ వినటానికి ప్రయత్నించాను. ఆ ముసలాయన ఇలా మాట్లాడుతున్నాడు-
“నువ్వు ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చావు కాబట్టి ఈ ఊరిలో ఎంత వింత మనుషులు ఉన్నారో నీకు తెలియదు. మచ్చుకి ఒక కథ చెప్తాను విను. మన ఊరిలో ఒకప్పుడు భైరవయ్య అనే అకౌంటెంటు ఉండేవాడు. ఆయనకు వచ్చే జీతం అంతంతమాత్రమే. కానీ ఆయనకు పుస్తకాలు కొనటం అంటే పిచ్చి. ఎక్కడ కొత్త పుస్తకం కనిపించినా వెంటనే కొనే వాడు. తన దగ్గర ఎంత తక్కువ డబ్బు ఉన్నా సంకోచించే వాడు కాడు. పెళ్ళి చేస్తే బాధ్యతలు తెలుస్తాయని, అతనికి పెళ్ళి చేస్తారు. కాని భైరవయ్యకి పుస్తకాల పిచ్చి మాత్రం తగ్గలేదు. కొన్ని రోజులలోనే పిల్లలు పుట్టారు. ఇంట్లో పరిస్థితి ఎంతో ఇబ్బందిగా ఉండేది. భైరవయ్య మాత్రం పుస్తకాలు కొనటం మానలేదు. పుస్తకాలను విపరీతంగా కొనటం చేత, ఒక సమయం తరువాత తన ఇంటిలో స్థలం సరిపోలేదు. మరొక గదిని బాడుగకు తీసుకొని అక్కడ పుస్తకాలను దాచటం మొదలుపెట్టాడు. పిల్లల స్కూలు ఫీసుకు కుడా డబ్బులేనంతగా పుస్తకాలు కొన్నాడు. అన్ని రోజులూ ఓపికగా భరించిన తన భార్య ఒకరోజు పిల్లలను వెంటపెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంత జరిగినా భైరవయ్య మాత్రం పుస్తకాలు కొనటం ఆపలేదు. తన జీవితాంతం పుస్తకాలు కొంటూనే ఉన్నాడు. చివరికి ఒక రోజు భైరవయ్య చనిపోయాడు. అది తెలిసిన వెంటనే తన భార్య ఒక్క నిట్టూర్పు విడిచి అతని పుస్తకాలన్నీ తక్కువ ధరకు యూనివర్సిటీకి అమ్మేసింది. ఇప్పుడు కుడా యూనివర్సిటీ లైబ్రరీలో అతని పుస్తకాలు ఉన్నాయి” అని చెప్పి ఇద్దరూ కడుపుబ్బ నవ్వుకున్నారు.
ఆ కథ విన్న నాకు కుడా నవ్వు వచ్చింది. ఇంతలోనే అక్కడికి రహస్యలిపి చేతిలో పట్టుకొని ఆ అమ్మాయి వచ్చింది. నేను నేరుగా ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి నిలబడ్డాను. ఆ అమ్మాయి కళ్ళు తేమగా ఉన్నాయి. ఆ అమ్మాయి మొహం పై ఏడ్చినట్టు రుజువులు కనిపించాయి. ఆ అమ్మాయి గొంతు ఏడ్చీ ఏడ్చీ లయతప్పింది. నా మనసులో ఎంతో బాధ కలిగింది. కాని నేను ఆ అమ్మాయిని ఏం జరిగిందని అడగలేదు. అడిగితే తరువాత కనబడకుండా పోతుందని భయం. సరిగ్గా వంద పదాలు చదివింది. ఒక్క పదం కుడా ఎక్కువ చదవలేదు. చదవటం ముగిసిన వెంటనే ఆ అమ్మాయి అక్కడి నుండి నిష్క్రమించింది.
నేను కుడా అక్కడి నుండి నా గదికి వచ్చాను. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆ అమ్మాయి ఎందుకు బాధగా ఉందని ఒకటే చింత కలిగింది.
6
రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎందుకో ఆ అమ్మాయి మరీ మరీ గుర్తొచ్చింది. నా కళ్ళు కూడా చమ్మగిల్లాయి. అలా ఆలోచిస్తుండగానే కిటికీ లోంచి తెల్లబడుతున్న ఆకాశం కనిపించింది. నేను నా కళ్ళు తుడుచుకుని, యూనివర్సిటీ వెళ్ళటానికి తయారయ్యాను. యూనివర్సిటీకి వెళ్ళే దారిలో టిఫిన్ చేసాను. ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంది. గాలిలో తేమ ఉంది.
నేను మొదట గ్రంథాలయానికి వెళ్ళి, క్లాస్ అయిపోయేదాక అక్కడే వేచి ఉండి, క్లాస్ అయ్యే సమయానికి తెలుగు సాహిత్యం విభాగానికి వెళ్ళాలి అనుకున్నాను. లైబ్రేరియన్ నిద్రపోతూ ఉన్నాడు. నేను గ్రంథాలయం లోనికి వెళ్ళాను. కొంచం సేపు రహస్యలిపి కోసం వెతికాను. దొరకలేదు. సెర్వాంటిస్ డాన్ కియోటే ని చదవటం మొదలుపెట్టాను. ఈ రోజు లైబ్రరీకి ఒక ఇద్దరు విద్యార్థులు వచ్చారు. వాళ్ళు తమకు కావలసిన పుస్తకం తీసుకొని నాకు ఎదురుగా, కొంచం దూరంలో కూర్చున్నారు. నేను వాళ్ళను పట్టించుకోకుండా చదవటం కొనసాగించాను. వాళ్ళు పుస్తకం ముందేసుకొని కబుర్లాడుకుంటున్నారు.
క్లాస్ ముగిసే సమయానికి నేను లైబ్రరీ నుండి తెలుగు సాహిత్య విభాగానికి బయలుదేరాను. అక్కడ గుమాస్తాను వెతికి పట్టుకున్నాను.
ఆయనను అడిగాను “ప్రొఫెసర్ క్లాస్ లో ఉన్నారా?” అని.
“లేదు. ఈ రోజు క్లాస్ త్వరగా అయిపోయింది.” అని చెప్పాడు.
“మరి ప్రొఫెసర్ తన గదిలో ఉన్నాడా?” అని అడిగాను.
“లేదు. ప్రొఫెసర్ క్లాస్ అయిపోగానే లైబ్రరీ వైపు వెళ్ళాడు” అని చెప్పాడు గుమాస్తా.
నేను ప్రొఫెసర్ కోసం తిరిగి లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీ లోపల ఇద్దరు విద్యార్థులు తప్ప ఇంకెవరూ లేరు. నేను ఆ ఇద్దరు విద్యార్థుల వద్దకు వెళ్ళి
“హలో! తెలుగు సాహిత్యం విభాగం ప్రొఫెసర్ ఇక్కడికి వచ్చారా?” అని అడిగాను వాళ్ళను.
“వచ్చారు. సరిగ్గా అక్కడ నిలబడి ఏదో పుస్తకం తీసి ఒక్క సెకను ఆ పుస్తకంలో ఏదో చదివి, వెళ్ళిపోయాడు.”
నేను ఆ విద్యా ర్థులకు “థాంక్స్” చెప్పి, లైబ్రరీ బయటకి వచ్చేసాను.
ఇంతలోనే కుండపోతగా వర్షం పడటం మొదలయ్యింది. ఒకొక్క చినుకూ కోడిగుడ్డు అంత పరిమాణంలో వుంది. నేను ఆ వర్షంలోనే పార్కుకు నడుచుకుంటూ వెళ్ళాను. వర్షం వల్ల ఈ రోజు పార్కులో ఎవరూ లేరు. నేను ఎప్పుడూ కూర్చునే చెట్టుకింద కూరున్నాను. ఆ చెట్టు కొమ్మపై ఓ కాకి వర్షానికి తడుస్తూ వణుకుతూ ఉంది. వర్షం తెరలు తెరలుగా పార్కు మైదానం పై పడుతోంది. మైదానంలో అక్కడక్కడ నీటి గుంతలు ఏర్పడ్డాయి.
కొంచం సేపటిలోనే వర్షంలో తడుచుకుంటూ ఆ అమ్మాయి వచ్చింది. ఈ రోజు తాను ఎంతో సంతోషంగా ఉన్నట్టు అనిపించింది. ఆమె కవిత చదవటం మొదలెట్టింది. కవిత చదువుతున్న ఆమె గొంతుకు వెనుక వర్షం శబ్ధం. నేను ఆ అమ్మాయి కళ్ళను చూసాను. ఆమె కళ్ళలో ఏ పద్మవ్యూహం దాగి ఉందో! ఎన్ని అణగారిన చరిత్రలు ఉన్నాయో! ఎన్ని వేదనలు ఉన్నాయో! ఏ సుదూర నిశీధి ఉందో ఆమె కళ్ళలో! అలా ఆలోచిస్తుండగానే ఆమె వంద పదాలు చదివేసింది. అక్కడి నుండి నిష్క్రమించింది.
నేను వర్షంలో తడుస్తూనే గదికి చేరుకున్నాను. గదికి చేరుకోగానే నిద్రపోయాను.
7
ఇలా ఒక మూడు నెలల పాటు కొనసాగింది. రాత్రి కలత నిద్రనుండి ఉదయాన్నే తెల్లవారకముందే నిద్రలేవటం. ఆకాశం తెల్లబడేదాకా పెసోవా అశాంత పుస్తకం చదవటం. సూర్యరశ్మి ఊరునంతా ఆక్రమించిన తరువాత యూనివర్సిటీకి బయలుదేరటం. దారిలో టిఫిన్ తినటం. ఒకే దారిలో రోజూ గతం నుండి వెలువడే తీవ్రమైన రాగంలా నడిచేవాదిని. వాతావరణం ప్రతిరోజూ ఒకొక్కలాగ ఉండేది. ఒక రోజు మేఘావృతమయ్యి ఉంటే, మరొక రోజు ఎండ కాసేది. ఒక రోజు చలిపెట్టేది. మరొక రోజు ఉక్కగా ఉండేది. వాతావరణం ఎలా ఉన్నా నేను మాత్రం యూనివర్సిటీ కి వెళ్ళే వాడిని.
యూనివర్సిటీలో మొదట తెలుగు సాహిత్యం విభాగానికి వెళ్ళేవాడిని. ఇన్ని రోజులలో ఎప్పుడూ ప్రొఫెసర్ని కలుసుకోలేదు. ప్రొఫెసర్ ఏదో ఒక కారణంగా నా నుండి తప్పించుకుంటున్నాడు అనిపించింది. ఒక రోజు ప్రొఫెసర్ గదిలో ఉన్నాడని బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎంత సేపటికి బయటకి రాకపోవటం చేత నేను గది తలుపు తీసాను. లోపల ప్రొఫెసర్ లేడు. గదిలో బల్బు వెలిగి ఉంది, ఫేను తిరుగుతూ ఉంది. మరొక రోజు నేను తెలుగు సాహిత్యం విభాగానికి వెళ్ళే సరికి ప్రొఫెసర్ గదికి తాళం వేసి ఉంది. దాని తరువాతి రోజు త్వరగా బయలుదేరి ప్రొఫెసర్ని పట్టుకుందాం అనుకుంటే ఆ రోజు కాలేజీకి సెలవు ఉంటుంది. ఒక రోజు ప్రొఫెసర్ సెలవు పెడ్తాడు. మరొక సారి ప్రొఫెసర్ ఎవరినీ కలిసే స్థితిలో లేడని కరాఖండిగా గుమాస్తా చెప్పేస్తాడు. మరొక సారి నేను వెళ్ళేసరికి ప్రొఫెసర్ ఇంకెవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. నేను వాళ్ళ సంభాషణ ముగియటానికి వెయిట్ చేస్తూ ఉంటాను. కానీ ఎంత సేపటికీ ఆ సంభాషణ ముగియదు. నేను పార్కుకు వెళ్ళవలసిన సమయం దగ్గర పడటంతో అక్కడినుండి నిష్క్రమిస్తాను. మరొక సారి ప్రొఫెసర్ ఇప్పుడే వెళ్ళిపోయాడని, ఇంకొకసారి ప్రొఫెసర్ ఇంకా రాలేదని- ఇలా మూడు నెలలుగా తెలుగు సాహిత్యం విభాగం చుట్టూ తిరిగాను. ప్రొఫెసర్ని మాత్రం పట్టుకోలేకపోయాను.
తెలుగు సాహిత్య విభాగం నుండి గ్రంథాలయానికి వెళ్తాను. అక్కడ ఇన్ని రోజులలో ఎప్పుడూ లైబ్రేరియన్ మేలుకొని ఉండటం నేను చూడలేదు. ఆయన ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు. నేను లైబ్రేరియన్ను నిద్రలేపకుండా లోపలికి ప్రవేశిస్తాను. పురాతనమైన లైబ్రరీ గోడలనుండి పాలిపోయిన దెయ్యాలు విడుదల అయ్యి నా మనసుని ఆవహిస్తాయో ఏమో! లైబ్రరీలో పూనకం వచ్చినట్టు రహస్యలిపి కోసం గాలిస్తాను. ఎప్పుడూ రహస్యలిపి దొరకలేదు. ఎన్ని సార్లు వెతికానంటే, ఏ అలమారలో ఏ పుస్తకం ఉందో ఇట్టే చెప్పేయగలను. ఆ లైబ్రరీలో రహస్యలిపి లేదు అన్న నిజం నాకంటే బాగ ఇంకెవరికీ తెలియదు. కాని లైబ్రరీలో వెతుకుతూనే ఉంటాను. పుస్తకాల వరుసలన్నిటినీ తడుముకుంటూ ఉంతాను- అంధులు బ్రెయిలీ లిపి ని తడిమినట్టూ. అలా వెతికి వెతికి అలసిపోయాక, సెర్వాంటిస్ డాన్ కియోటే తీసుకొని కూర్చీలో కూర్చొని చదివే వాడిని. అప్పుడప్పుడు నల్ల పిల్లి కనిపించేది. చీకటిలో ఆ పిల్లి కళ్ళు తప్ప దాని శరీర ఆకారమంతా నైరూప్యంగా కనిపించేది. కొన్ని సార్లు ఆ పిల్లి గురించి ఆలోచిస్తూ ఉండిపోతాను. ఆ లైబ్రరీ చీకట్లలో ఎవరికీ తెలియకుండా ఎన్ని ఎలుకలను వేటాడి ఉంటుందో ఆ పిల్లి!
అక్కడి నుండి పార్కుకు పోతాను. దాదాపూ అన్ని రోజులు అక్కడికి తల్లీకొడుకులు, ఇద్దరు ముసలివాళ్ళు, ప్రేమికులు, లావాటి ఆయన వచ్చి ఉంటారు. ఈ మనుషులనే ప్రతిరోజూ చూస్తున్న నాకు అక్కడ కనిపించే మొహాలన్నీ వర్షానంతరం మట్టి వాసనంత నైరూప్యంగా గుర్తు. నీడలలో, గుసగుసలలో జీవిస్తున్న ఈ పార్కులోని జనానికి నేను సమయంలో గడ్డకట్టిన ఆత్మలాగ కనిపిస్తాను.
కొంచం సేపటికి రహస్యలిపి చేతిన పట్టుకొని అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి రోజుకొక భావోద్వేగంతో చదువుతుంది. ఒక రోజు ఏడుస్తూ చదువుతుంది. ఒక రోజు నవ్వుతూ చదువుతుంది. ఒక రోజు మామూలుగా చదువుతుంది. ఒక రోజు కోపంగా చదువుతుంది. ఒక రోజు తన్మయంతో చదువుతుంది. ఒక రోజు విస్మృతితో చదువుతుంది. ఇలా రోజుకొక విధంగా సరిగ్గా వంద పదాలు చదివి అర్ధాంతరంగా వెళ్ళిపోతుంది. నేను మాత్రం ఎప్పుడూ ఆ అమ్మాయి పెట్టిన నిబంధనలను దాటకుండా నిశ్శబ్దంగా వింటాను. చాలా సార్లు ఎలాగైనా ఈ నిబంధనలను అతిక్రమించాలన్న ఆలొచన కలిగేది. కాని అంత ధైర్యం చేయలేకపోయేవాడిని.
నేను నా గదికి తిరిగొచ్చి నిద్రపోతాను.
ఇలా మూడు నెలలు ఒకే రీతిగా జరిగాయి. రాను రాను నాలో చింత పెరిగింది. నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను అదుపు చేస్తోందన్న భావన కలిగింది. ఎన్నో జవాబు దొరకని ప్రశ్నలు మిగిలిపోయాయి. నా చుట్టూ సంభవిస్తున్న పరిణామాల గురించి రాయాలి అనిపించేది. కాని పెన్ను పట్టుకొని అక్షరానికి రూపునిచ్చే లోపలే మెదడులో ఆలోచన మటుమాయమయ్యేది. నా చుట్టూ మారుతున్న ప్రపంచాన్ని దగ్గరగా గమనించే కొద్ది అశాంత పుస్తకంలోని పెసోవా మాట ఒకటి గుర్తొస్తోంది.
“ఈ ప్రపంచం గురించీ, చుట్టూ నిత్యం మారే పరిణామాల గురించి నేను ఎంత ఆలోచిస్తానో అంత ఎక్కువగా ఈ ప్రపంచం మొత్తం ఓ కట్టుకథ అని ఒప్పుకోవలసి వస్తోంది.
మూడవ భాగం
నిద్రలో ఓ కల వచ్చింది. ఆ కలలో నేను పార్కుమైదానంలో ఉన్నాను. నా ముందర ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పుస్తకంలోకి చూసుకుంటూ కాక నా కళ్ళలోకి సూటిగా చూసుకుంటూ మాట్లాడుతోంది.
“నేను నీ మెదడు గర్భం నుండి పుట్టుకొచ్చిన ఓ అసంపూర్ణ కట్టుకథని. నువ్వు నాలో తప్పిపోయినట్టూ నేనూ నీలో తప్పిపోయాను. నేను చీకటివెలుగుల మధ్య బ్రతికే శాపగ్రస్త జీవిని. నేనెప్పటికీ నిజం కాలేను” అన్నది.
అమాంతంగా నిద్రలేచాను. తిరిగి నిద్రపోయేంత ధైర్యం చేయలేదు. ఆకస్మికంగా ఏవేవో ఆలోచనలు మెదిలాయి. అవి నా చుట్టూ ఉన్న ప్రపంచం తనకు తానే ఒక ప్రశ్నను వేసుకుంది. ఆ ప్రశ్నలో నన్నూ భాగస్వామిని చేసింది. ఇన్ని రోజులూ నేను ఆ ప్రశ్నలోనే కొట్టుమిట్టాడాను. సమయం గడిచే కొద్దీ ఆ ప్రపంచానికి ఆ ప్రశ్నకి జవాబు దొరికింది. దానితో ఆ ప్రపంచం నా పై తన పట్టుని సడలించింది. నెమ్మదిగా నానుండి తాను దాచిపెట్టిన మర్మాలను విడుదల చేయటం మొదలెట్టింది.
ఈ ఆలోచనలను ఎలాగైనా అక్షరబద్ధం చేయాలని అనుకున్నాను. పెన్నూ పేపరు పట్టుకుని, మొదటి అక్షరం రాసేలోగా ఆలోచనలన్నీ చెల్లాచెదురు అయ్యాయి. ఇప్పుడు క్రమంలేని పదాల సమూహం మాత్రమే గుర్తొస్తోంది. ఈ పదాలను ఎలాగైనా బహిర్గతం చేయాలనీ, వెలుగులో నిలబెట్టాలని తీవ్రంగా ప్రయత్నించాను. నా చెయ్యి అర్ధాంతరమైన వాక్యాలు ఏవేవో రాస్తోంది. నిజానికి నా చెయ్యి రాస్తోంది అనే కాని అది రాస్తున్నది నేను కాదేమో! నేను రాయబడుతున్నానేమో! నేను రాయటానికి నోచుకుంటున్నానేమో! ఒక మూడు నెలలుగా ఏకరీతిగా సాగే జీవితానికి అలవాటు పడిన నేను, ఒక సూత్రానికి నిబద్ధుడిని ఏమో. ఇలా ప్రతీ సందేహమూ, ప్రతీ జవాబు దొరకని ప్రశ్న నన్ను ఒక నిర్దిష్ట పంథాలో నడిపిస్తున్నాయేమో! కిటికీ నుండి బయటకు చూస్తే తెల్లబడిన ఆకాశం కనిపించింది.
(The story is incomplete. But the end objective of the story is in the first draft. This story too ends more or less in the same line)
**** (*) ****
జవాబుల్లేని ప్రశ్నలతొ ఊహల తొ ఉత్కంట పుట్టించి వదిలిన కథ ,కథనం – బాగుంది మీ ‘రహస్యలిపి’కథ భైరవ్ గారు
ela vundo kuda spastam ga chepalenu..