సంపాదకీయం

ఐదో అడుగు

జనవరి 2017

నాలుగడుగులు వేసామంటే నమ్మబుద్ధి కావడం లేదు. నాలుగడుగులే మైలురాయి కాకపోవచ్చు కానీ, వెనక్కి చూసుకుంటే వెయ్యికిపైనే (1250) ప్రచురించిన రచనలు తలలూపుతూ కనిపిస్తున్నాయి. ఆ రచనల వెనకున్న మూడువందలకు పైగా రచయితలూ చేతులూపుతూ కనిపిస్తున్నారు. పత్రికమెడలో సగర్వంగా ఊగుతున్న సంపాదకహారం ఒక్కటేకాదు, పత్రిక వెనక నిలబడి పనిచేస్తున్న సాహితీమిత్రులు, రచయితల సహకారం వల్లనే వాకిలి ఈ నాలుగేళ్ళు ఇలా నిలదొక్కుకోగల్గింది.

సిగలో మెరిసే రచయిత పెద్ద పేరువల్లో, ఆ రచనను ప్రచురించే పత్రిక పేరువల్లో ఒక రచన గొప్పదవదు. ఆ రచనలో ఏదో ఒక గొప్పదనం ఉంటేనే అది నిలబడుతుందనేది అందరికీ తెలిసిందే. ఎడిటర్లుగా మాకు ఒక రచనను దిద్దే విషయంలో, సూచనలు ఇచ్చే విషయంలో కొన్ని లిమిట్స్ ఉంటాయి. కానీ, ఎడిట్ చేస్తే మెరుగవుతుందనుకున్న ప్రతీ రచనను, రచయితతో దెబ్బలాడైనా సరే ఎడిట్ చేయించి అందంగా ప్రచురిస్తాం. ఇదే మా మొదటి కర్తవ్యం. మాకు కాదుగాని, ఒక రచయితకు చెడ్డ పేరు తెప్పిస్తుందనుకునే ఎలాంటి నాసిరకం రచనలకైనా మేము మొదటి నుంచీ దూరంగానే ఉంటున్నాం. రచనలను తిప్పి పంపినా, ఎడిటింగ్ విషయంలో విసిగించి మార్పులు చేసి పంపమని అడిగి రచయితల మనసులు నొప్పించినా, అదే ప్రేమతో మాకు రచనలను పంపించే రచయితలకు వాకిలి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. అన్నిరకాలుగా రచనను సరిచూసి, సవరణలు చేసి, అందంగా ప్రచురించడమే మేము రచయితలకిచ్చే పెద్ద పారితోషికం. ప్రతీ సంచికకి మేము అడిగినా, అడక్కపోయినా వాకిలి అంటే ఇష్టంతో రచనలు పంపిన రచయిత(త్రు)లందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

ప్రతీ నెల వాకిలిని ఇష్టంగా తెరిచి, చదివి, రచనలపై స్పందన తెలియజేస్తూ, మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్న పాఠకులకి ధన్యవాదాలు. మనసు విప్పి మీ అభిప్రాయాలు రాస్తూ, చర్చల్లో పాల్గొంటూ, ముందు ముందు కూడా మీరు ఇలాంటి సహకారాన్నే అందిస్తారని ఆశిస్తున్నాం.

వాకిలిని తమ స్వంత పత్రికలా భావించి అడిగినప్పుడల్లా మాకు సహాయం చేస్తున్న నాగరాజు పప్పు, చంద్ర కన్నెగంటి గార్లకు-
వాకిలికి నెలనెలా కాలమ్స్ రాస్తున్న అరిపిరాల సత్యప్రసాద్, నందకిషోర్, మంజీర, శివకుమార శర్మ, మైథిలి, కర్లపాలెం హనుమంత రావు, ఎలనాగ, కోడూరి విజయ్, నౌడూరి మూర్తి గార్లకు- మా హృదయపూర్వక ధన్యవాదాలు.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో,

మీ
వాకిలి సంపాదకబృందం.

**** (*) ****

నాలుగేళ్ళు నిండిన సందర్భాంగా వాకిలి గురించి మీ అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. కొంతమంది రచయితల అభిప్రాయాలను ఇక్కడ ప్రచురిస్తున్నాం. మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా మనవి.

***
హెచ్చార్కె

‘వాకిలి’కి నాలుగేండ్లంటే భలే సంతోషంగా వుంది.

మొదటి సంచికలో నీ వ్యాసం వుండాలి, నీకు అజంతా అంటే ఇష్టం కదా, తన గురించి రాయి అన్నారు అప్పుడు ఎడిటర్లు. అది రాసి ‘అచ్చు’లో చూసుకుంటే నా వాక్యాలు నాకే ముద్దొచ్చాయి. జర్నలిజం గురించి నా ఫీలిగ్స్ ని ఈ పేజీల్లో పంచుకున్న సంతోషం కూడా వుంది. ‘వాకిలి’ పత్రికను రెగ్యులర్ గా ఫాలో అయ్యానని అబద్ధం చెప్పలేను. నాలో నేను నాతో నేను నా కోసం నేను వుండడం చాల ఎక్కువ నాకు. ఇది పరమ అవాంఛనీయం. ఏం చేయను మై ఐసా ఈ హూ. చూసిన మేరకు వాకిలి నాకెంతో నచ్చింది.

ఇందులో నాకు బాగా నచ్చినది పాత్రికేయ సమతూకం. ఒక స్థాయిని మించి.. పర్సానాలిటీస్ క్లాష్ కి అవకాశమివ్వకపోవడం. ఇద్దరు లేక ముగ్గురు వ్రాతగాళ్ళు తమలో తాము కొట్టుకు చస్తుంటే, చూసే వాళ్ళకి భలే వినోదం. సెన్సేషన్. దాని వల్ల పత్రిక చదువబిలిటీ పెరుగుతుంది. అందులో సత్యం వధకు చాల ఎక్కువ అవకాశం వుంది. వాదంలో గెలవడం కోసం పాల్పడే అబద్ధాలకు కూడా. చివరికి ఎవరు ఎక్కువ సిగ్గు లేని వారో వారు గెలుస్తారు. జరగాల్సిన చర్చ చంకనాకుతుంది. అబద్ధం బోర విరుచుకుని వూరేగుతుంది.
సమతూకం కోసం, సభ్యత కోసం కాస్త పాపులారిటీని త్యాగం చేసిన వాకిలి ఎడిటర్లకు వందనాలు. రెండేండ్ల కాలంలో ఎన్నో మంచి కథలు, కవిత్వాలు చదువుకున్నాం, రాసుకున్నాం, గుండె నుంచి గుండెకు పంచుకున్నాం ‘వాకిలి’ ద్వారా. థాంక్యూ వాకిలి! ఆల్ ది బెస్ట్ వాకిలి! పద ముందుకు వాకిలి!


విన్నకోట రవిశంకర్

వాకిలి తలుపులు అన్ని రకాల సాహిత్య ధోరణులకు తెరిచి ఉంచటం ఒక మంచి లక్షణం. ప్రాంతం, భావజాలం, రచయితల సీనియారిటీ వంటి కొలమానాలతో నిమిత్తం లేకుండా కేవలం సాహితీ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని రచనలు ప్రచురించటం ఏ పత్రికకైనా ఆరోగ్యప్రదం. పత్రికకు మంచి రచనలు సంపాదించే పనిమీద వాకిలి సంపాదకులు చూపే శ్రద్ధ ప్రమాణాలు నిలిపేందుకు దోహదపడింది. ఇదే ఒక నమ్మకమైన పాఠక బృందం పత్రికకు ఏర్పడటానికి కారణమై ఉంటుంది. రచనల్లో వైవిధ్యంతోబాటు ప్రయోగాత్మకతను కూడా ప్రోత్సహించే దిశగా మరికొంత ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కృష్ణశాస్త్రి గారిమీద ఇటీవల ప్రత్యేక సంచిక తీసుకురావటం నాకెంతో ఆనందం కలిగించింది. ఇటువంటి ప్రత్యేక సంచికలు మరిన్ని రూపొందించాలని, వాకిలి పత్రిక మరెన్నో వసంతాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, ఐదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.


ముకుంద రామారావు

అంతర్జాల పత్రికల మీద భారం ఇక ముందుముందు తప్పకుండా ఎక్కువవుతుంది. రాసినవి ఎన్నాళ్లైనా అందులో ఉండడం, ప్రపంచంలో ఎవరికైనా అది ఎప్పుడైనా పంపగలగడం అందులో ఉండే ఒక పెద్ద వెసులుబాటు. అది ముద్రణమాధ్యమంలో అంత సులువు కాదు. పైగా సమయం అతి తక్కువగా దొరికేవారికి, సమయం అతి ముఖ్యమనుకునే వారికి ఇది ఒక పెద్ద వరం. వారికున్న సమయంలో కావల్సినవేవో చూసుకుందుకు చదువుకుందుకు. అయితే ఇది నడిపే వారికి మాత్రం ఎవరికీ తెలియని శ్రమ. ఈ పని పట్ల ఇష్టం ప్రేమ అంకితభావం లేకపోతే ఇటువంటివి ఎన్నాళ్లో నడపడం కష్టం.

వాకిలి పత్రికకు నాలుగేళ్లు నిండాయి అంటేనే, బాలారిష్టాలన్నీ తీరిపోయి హాయిగా నడకసాగిస్తోందని అర్ధం కదా. ఉద్యోగాలు చేస్తూ తీరికలేకుండా గడిపే మీలాంటి వాళ్లు, సాహిత్యం మీద ఉన్న అనుబంధంతో, కోరికతో ఇటువంటి పత్రిక నడపడమే గొప్ప విషయం. నెలాఖరుకల్లా ఒక Project పూర్తీ చేయాలన్నంత ఒత్తిడిని తట్టుకుని ఇంత అద్భుతంగా పత్రిక నడుపుతున్నందుకు నా హార్దిక అభినందనలు. ఈ పత్రిక రానురాను మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.


మెహెర్

రాజకీయాల జోలికీ, రచ్చల జోలికీ పోకపోవటం వల్ల ‘వాకిలి’ కాస్త సానుకూలంగా అనిపిస్తుంది. బెదరగొట్టే పాండిత్య పటాటోపాలూ ఉండవు. పంపిన రచనని పంపినట్టు కుమ్మరించెయ్యకుండా, శుభ్రంగా కనిపించేట్టు ప్రెజెంట్ చేయటం నచ్చుతుంది. కవితల్ని కుడిపక్క మార్జిన్‌లోకి నెట్టేయకుండా ఇంకాస్త బాగా కన్పించేలా పెడితే బాగుంటుందని నాకనిపిస్తుంది. ఇంటర్వ్యూలు ఇంకా తరచూ వస్తే బాగుంటుంది. ప్రతీ ఇంటర్వ్యూ జీవిత సాఫల్య పురస్కారం లెవెల్లో ఉండనక్కర్లేదు. చిన్న చిన్న ఇంటర్వ్యూలు కొత్తవాళ్లవైనా బావుంటాయి.

వెబ్ పత్రిక నడపటం పైకి అనిపించినంత సులువు కాదు. ఏది పంపినా వేసే వెబ్ పత్రికలు వేరేవి ఉన్నప్పుడు, అలాకాకుండా ఒక ప్రమాణం పాటిద్దామని పట్టుబట్టికూర్చున్న వెబ్ పత్రికలకు కంటెంట్ లభ్యం కావటం కష్టం అవుతుంది. ఒకసారి రిజెక్ట్ చేసిన రచయితలు మళ్లీ రారు. ఎందుకంటే ఎలాగూ డబ్బులివ్వరు; ఒకదాని సర్క్యులేషన్ ఎక్కువా, ఒకదానికి తక్కువా అనేమీ ఉండదు; విజిటర్స్ సంఖ్యలో మరీ పెద్ద తేడాలుండవు. మరి ఎందుకు మీకే పంపాలీ అన్న ప్రశ్న వస్తుంది. చేయగలిగిందల్లా ప్రెజెంటేషన్‌లో శ్రద్ధ చూపించటం, కొత్తగా రాస్తున్న వాళ్లను వెతుక్కుని రాయించటం, అందిన ప్రతీ రచననీ దానిలోనే నిక్షిప్తమైన ఉన్న టెర్మ్స్‌ని బట్టీ అంచనా కట్టడం, “సాహిత్య పత్రిక” అని టాగ్ పెట్టుకున్నారు కాబట్టి సెన్సేషనలిజానికి పోకుండా కనీసం ఆమేరకు చిత్తశుద్ధిగా కట్టుబడి ఉండటం. కొత్త ఎప్పుడూ కవచాలు కట్టుకుని రాదు. సున్నితంగా సంకోచంతోటి వస్తుంది. దాన్ని కలుపుకోవటం కూడా ఒక కళే.


పూడూరి రాజిరెడ్డి

నిజమైన సాహిత్యం ఇప్పుడు ప్రధాన స్రవంతి పత్రికల్లో లేదనే చెప్పాలేమో! స్థల పరిమితి నుంచి భావ పరిమితి దాకా దానికి ఎన్నో కారణాలు! వాటి రీచ్‌ ఎంతైనా కావొచ్చుగానీ, కొంత సీరియస్‌ సాహిత్య పాఠకులు చదవగలిగే/ చదవాల్సిన మెటీరియల్‌ ఇస్తున్నవి వెబ్‌ పత్రికలే. అలా ‘వాకిలి’ కూడా నేను విధిగా ఫాలో అవుతున్న వెబ్‌ పత్రికల్లో ఒకటి.

వాకిలిని తలుచుకోగానే ఒక హడావుడిలేని నెమ్మదైనతనం ఏదో గుర్తొస్తుంది. కామ్‌గా పనిచేసుకు పోవడం కూడా దీర్ఘకాలంలో ఒక మంచి విలువ అవుతుందని నా నమ్మకం. నమ్మకమైన వేదిక అన్న భావాన్ని అది ఏర్పరచగలదు. ఈ నాలుగేళ్లుగా– నిజంగా నాలుగేళ్లయిందని అనుకోలేదు, మొన్న మొన్నేగా ప్రారంభమైంది!– అన్ని రకాల రాతలకూ ‘ఓపెన్‌’గా ఉంటూ పత్రికను నడుపుతున్న సంపాదకులకు నా అభినందనలు.


కోడూరి విజయ్ కుమార్

భిన్నమైన రచనలకు ప్రింట్ రూపంలో వచ్చే వార్తా పత్రికల సాహిత్య పేజీలు సరిపోవడం లేదనీ, అందుకు అంతర్జాలం లోని స్పేస్ ఉపయోగించుకోవడమే పరిష్కారమని రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు అనుకుంటున్న కాలంలో వాకిలి రంగ ప్రవేశం చేసింది. వాకిలి ఒక కొత్త సాహిత్య వేదికను సృష్టించింది. నాలుగేళ్ళుగా సాహిత్యాభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా ప్రయాణం సాగించడానికి ‘వాకిలి ‘ సారథులకు ఎంత సహనం, సాహిత్యం పట్ల ఎంత ప్రేమ వుండి వుండాలి! అందుకు ‘వాకిలి’ సంపాదక బృందానికీ అభినందనలు!


శివ సోమయాజులు (యాజి)

వాకిలి నాలుగేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వాకిలి తొలిసంచికలో నా తొలి కథ “చరిత్రహీనులు” ప్రచురించబడటం నేను ఎప్పటికీ మరచిపోలేని ఒక తియ్యని అనుభూతి. నేను రాసిన రెండో కథ “మైథిలి” కూడా వాకిలిలోనే రావటం, అప్పుడప్పుడే కలం పట్టిన నన్ను వెన్నుతట్టి మీరు ప్రోత్సహించిన తీరూ, నాలో ఏంతో ఉత్సాహాన్నీ, రచయితగా నా ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి. వాకిలి నిస్సందేహంగా నా అభిమాన వెబ్ మేగజీన్. ఈ సంవత్సరంలో నేను చదివిన కథలలో నాకు బాగా నచ్చిన రెండు కథలూ (ఒరాంగుటాన్ – మెహెర్, బౌండరీ దాటిన బాలు – మధు పెమ్మరాజు) వాకిలి లో వచ్చినవే. మీరు ఇలాగే సాహితీ ప్రేమికులని అలరిస్తూ మరిన్ని వసంతాలు పూర్తి చేసుకొంటారని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను.


నారాయణ స్వామి శంకగిరి

చక్కటి వైవిధ్య భరితమైన రచనలకి జాలంలో స్థిరమైన చిరునామాగా వాకిలి నిలదొక్కుకున్నది. ఎలనాగ, రామసూరి, కర్లపాలెం హనుమంతరావు గార్ల వంటి లబ్ధప్రతిష్ఠులు నిర్వహిస్తున్న ఫీచర్లతో బాటు కొత్తగా రచనావ్యాసంగం చేపట్టిన అనేక కవులనూ రచయితలనూ కూడా ఆహ్వానిస్తూ తెలుగు సాహిత్య లతకి సరికొత్త పూలు పూయిస్తున్నది. సాహిత్యం వృత్తి కాని వాళ్ళు నెలనెలా మంచి క్వాలిటీ రచనలతో నాలుగేళ్ళ పాటు క్రమం తప్పకుండా పత్రిక తీసుకు వస్తూ ఉన్నారంటే సామాన్యమైన విషయం కాదు. మంచి సాహిత్య అభిరుచి ఉంటే సరిపోదు, బోలెడు పట్టుదల, కొంచెం ఆత్మవిశ్వాసం, సడలని సంకల్ప బలమూ అవసరం. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా తమకు ఉన్నాయని ఋజువు చేసుకున్నది వాకిలి సంపాదక వర్గం. ఈ లక్షణాలను మరింత వృద్ధి చేసుకుంటూ మరిన్ని కొత్త కలాలకూ కొత్త పోకడలకూ వాకిలి తలుపు తీస్తుందని ఆశిస్తూ – సంపాదకులకూ పాఠకులకూ శుభాకాంక్షలు.


మైథిలి

‘వాకిలి’ అని పేరు పెట్టుకోవటం లో అందమైన గర్వం ఉంది. ఆ గర్వానికి అర్థం కూడా ఉంది. ఇందులోంచి చూడగలగటం రెండు వైపులకీ – ఇష్టమైతే నడిచి వెళ్ళవచ్చు , కావలిస్తే వెనక్కి వచ్చేయనూ వచ్చు. ఎల్లలు పాటించని వచనమూ హద్దులు గీసుకోని కవిత్వమూ – మృదువు గానూ కటువు గానూ ఏదీ కాకుండానూ , ఎలాగైనా సరే , చెల్లును… మర్యాద కొద్దీ. గొప్ప సంగతి.

నా మాతృ వేదిక లలో ఒకటైన వాకిలి కి కృతజ్ఞతలు – ఇచ్చిన అనంతమైన స్వేచ్ఛకూ దొరికిన ప్రోత్సాహానికీ ఉత్తేజానికీ. కొండొకచో -కొన్నేసి ముళ్ళ నుంచి కాచుకొచ్చిన దగ్గరి తనానికీ.

వేయబోవని తలుపుల ఈ బంగారు వాకిలికి , నావి – మాటలలోకి రాలేనన్ని శుభకామనలు.


నౌడూరి మూర్తి

వాకిలి 4 వసంతాలు పూర్తిచేసి 5వ వసంతంలోకి ప్రవేశిస్తున్న శుభసందర్భంలో, ఈ పత్రికను ఇన్నాళ్ళూ తీర్చిదిద్దిన సంపాదక వర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాను.

వాకిలితో నా అనుబంధం మరిచిపోలేనిది. దానికి మీ సహృదయతే ముఖ్య కారణం. ఇందులో లబ్ధప్రతిష్ఠులైన కవులూ, కథకులూ, నవలా రచయితలూ, అనువాదకులూ, తమ విలువైన రచనలు పంచుకోవడమే పత్రికకున్న ఆదరణను వ్యక్తం చేస్తుంది. ఆయా రంగాలకు చెందిన యువ గళాలూ వినిపించడం హర్షించదగిన పరిణామం. అతివేగంగా అభిరుచులు మారుతున్న ప్రపంచంలో, యువతరాన్ని ఆకట్టుకోవడం పత్రికలకి సవాలే.

నాకు ముఖ్యంగా నచ్చిన విషయం పత్రిక ఏ సాహిత్యప్రక్రియకో, వర్గానికో, భావధారకో పరిమితం కాకుండా తిలక్ చెప్పినట్టు “అన్ని కిటికీ తలుపులూ తీసి అన్ని గాలులు ఆహ్వానించే” అభిమతానికి కట్టుబడి ఉండడం.
తెలుగుకి ప్రాచీన భాషహోదా వచ్చినా, దానికి కారణభూతమైన సాహిత్య సంపదని వెలుగులోకి తీసుకురావడానికీ, భాషను వ్యాప్తిచెయ్యడానికి బాధ్యులైన వ్యక్తులూ, సంస్థలూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంలేదు. ఆ వెలితి కొంతమేరకు అంతర్జాల పత్రికలు తీర్చగలవు.

చరిత్రలో ఒక జాతి గర్వపడేవీ ఉంటాయి, ఒక జాతి సిగ్గుపడేవీ ఉంటాయి. సిగ్గుపడేవి మనపెద్దలు చేసిన తప్పులు మనకు గుర్తుచేసి మనం అటువంటిపొరపాట్లు చెయ్యకుండా ఉండడానికి పనికివస్తే, గర్వపడేవి, మన వారసత్వ సంపదను గుర్తించి, ఆదరించి, దాన్ని కాపాడుకోడానికీ, మరింత మెరుగులు దిద్ది భావి తరానికి అందించడానికీ పనికి వస్తాయి. వెయ్యి సంవత్సరాలు, అల్లకల్లోలమైన రాజకీయ వాతావరణంలో ఒక భాష ప్రజల, ప్రాంతీయ ప్రభుత్వాల ఆదరణకు నోచుకుని నిలదొక్కుకోగలగడం చిన్న విషయం కాదు. ఏది చేస్తే బాగుంటుందన్న ఒక చర్చ పత్రికలో లేవదీసి, పత్రిక చూడని చాలా మంది పెద్దలకి ప్రత్యేక ఉత్తరాలు రాసి వారిని ఇందులో భాగస్వాములు చేసి, భవిష్యత్ కార్యాచరణకి ఒక రూపకల్పన చేస్తే మీరు మరింత భాషా సేవ చేసినవారు కాగలుగుతారని నమ్ముతున్నాను.

మీకూ, మీ సంపాదకవర్గానికీ మరొక్క సారి అభినందనలతో పాటు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.


మానస చామర్తి

నాలుగేళ్ళంటే వచ్చిపోయిన నాలుగు వసంతాలు మాత్రమేనా? వెలిసిపోయిన కొన్ని రంగులేనా? ముమ్మాటికీ కాదు.

నాలుగేళ్ళంటే, ఈ వాకిలిలో, ఏటికి పన్నెండు చప్పున, నలగని పేజీలతో నిలిచిన నలభైఎనిమిది సంచికలు. ఏమున్నాయందులో? పూర్తి కాని కథలు కొన్ని, ఎవరికి చెప్పాలో తెలీక, ఎలా చెప్పాలో తెలీక దాచుకున్న కబుర్లు కొన్ని. ఎవ్వరికీ చెప్పకూడదని తెలిసీ, పారేయలేక పదిలపరుచుకున్న జ్ఞాపకాలు కొన్ని. నచ్చిన పుస్తకాల కబుర్లు ఉన్నాయి. నచ్చని రచనల మీద చర్చలూ ఉన్నాయి. మనకు తెలీని ప్రపంచంలో, మనం చూసిన ప్రపంచమే ఉందని చెప్పిన రచయితలున్నారు. మన భాషలోకి మరొకరి జీవితాన్ని అనువదించిన చదువరులున్నారు. మనం చదివిన పుస్తకాలే, మన కళ్ళద్దాలు తుడిచి చూపించిన పాఠకులున్నారు. మనకిష్టమైన కవులను, స్పష్టంగా చదివించిన నేర్పరులున్నారు. వెన్నెల్లో నడిచే కవితా కన్యను, మన మధ్యలోకి, నగరపు జీవితంలోకి భయపడకుండా తీసుకొచ్చిన కవులున్నారు. నీతి గురించి, భీతి గురించీ కాకుండా నిజాన్ని మాట్లాడిన కథకులున్నారు. కథ ముసుగులు విప్పితే ఏమవుతుందోనన్న మన కుతూహలన్ని తీర్చిన వారున్నారు. కథ లోపలి కథలన్నీ విప్పి చెప్పిన వారూ ఉన్నారు. తెలిసిన అక్షరలానే అటునిటు తిప్పి కలవరపెట్టిన ఆటలున్నాయిక్కడ, కడిమిచెట్టు నీడలో కూర్చుంటే, ఒళ్ళో వచ్చిపడ్డ నిక్కమైన నీలాలున్నాయి.

చిన్నప్పుడు వాకిట్లో “పేపర్ర్…” అన్న పిలుపు వినపడగానే, పిల్లలం పోటీలు పడి పరుగెత్తేవాళ్ళం, ఆ తడి నేల మీద జారకుండా, ఇంకా ఎవ్వరూ ముట్టుకోని, మాసిపోని, మడత నలగని పేజీలను ముందు అందుకోవాలని. ఈ వాకిలిలోకి ఎంత ఉరుకులుపరుగులతో వచ్చినా, గాయపడతామన్న భయముండదు. ఈ వాకిలి, విశాలమైనది. ఎంత మంది ఏ దిక్కునుండి వస్తోన్నా, ఇరుకవ్వకుండా ఉండేందుకు పరిథులు విస్తరించుకుంటూ పోతుంది. ఏ ఒక్కరికో సొంతమై, మిగిలిన వాళ్ళకి పరాయనిపించదు. పాతబడిందన్న భావాన్ని కలుగనివ్వదు. కొత్త భావాలకీ, కొత్త భాషలకీ, కొత్త మనుషులకీ వసివాడని సాహితీతోరణాలతో సాదర ఆహ్వానం పలుకుతూనే ఉంది.

అందుకే ఈ ముంగిట్లో నాలుగేళ్ళంటే కేవలం వచ్చిపోయిన నాలుగు వసంతాలు కాదు; నలుగురు కూర్చుని నిర్భయంగా, నిస్సంశయంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా సాహితీచర్చలు జరుపుకునేందుకు సాహితీమిత్రులు నిర్మించుకోదలచిన ఓ మహాసౌధానికి, వాకిలి బృందం శ్రద్ధగా పేరుస్తోన్న ఇటుకలు ఈ సంచికలు. అందుకు వారికి మనసారా అభినందనలు, మనందరి తరఫునా కృతజ్ఞతలు.


ఆర్.దమయంతి

వాకిలి సాహిత్య మాస పత్రిక అయిదో వసంతం లోకి అడుగిడుతున్న ఈ శుభ తరుణాన మీకూ, మన పత్రికకీ నా హార్ధిక శుభాభినందనలు!

ఇక పత్రిక మాటకొస్తే – నాకు నచ్చిన ఆన్లైన్ తెలుగు మాస పత్రికలలో వాకిలి కూడా ఒకటి. నేను మొదటినించీ గమనిస్తున్న విషయమేమిటంటే – వాకిలి తొందరపడదు. పరుగు పందేలలో అస్సలు పాల్గొనదు. :-) తన దారిలో తాను అనే ఒక ప్రత్యేకతని సంతరించుకునంటుంది. తందైన ఒక తీరులో, ఎంతో శ్రధ్ధగా తనని తాను తీర్చి దిద్దుకునే సంక్రాంతి ముగ్గులా వుంటుంది. అచ్చ తెలుగు సాంప్రదాయ లోగిలి లా అనిపిస్తుంది. ఈ ముంగిట కాసేపు ఆగుదాం. ఆలకిద్దం అనిపించే ఆకర్షణ – మన వాకిలి లో దాగున్న మాట వాస్తవం.

కొత్త పాత రచనల కలయికలతో, విభిన్నమైన శీర్షికలతో, వైవిధ్యాన్ని గుమ్మరిస్తున్న ఈ సాహితీ పత్రిక ఎన్నో.. ఎన్నెన్నో.. మరెన్నో వసంతోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, సంచలన విజయాలతో ముందుకు సాగిపోవాలని అభిలషిస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలతో…

**** (*) ****