ధారావాహిక నవల

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – చివరి భాగం

ఫిబ్రవరి 2017

11

రాక్‌స్లైడ్ కొంత భాగాన్ని కప్పివేయడంవల్ల కలిగించిన డీటూర్‌ని దాటి మళ్లీ హైవే 140మీదకు రాగానే ఆండ్రూ వాన్‌ని పక్కకు తీసి ఆపాడు. సరోజగారు కూర్చున్నవైపు డోర్ తీసి, ఆమె మొహంమీద నీళ్లు జల్లితే ఆమె మెల్లగా కళ్లు తెరిచారు. ఆ కళ్లు ధారగా వర్షించడం మొదలుపెట్టాయి. “ఈ ట్రిప్పులో ఆయన గూర్చి తెలుసుకుంటా ననుకోలేదు,” వెక్కిళ్ల మధ్య ఆవిడ నోట్లోంచి మాటలు వచ్చాయి.

“ఆంటీ, ఆ కుప్పకింద ఎవరూ వుండకపోయే అవకాశమున్నది. అయినా, శాన్ ఫ్రాన్సిస్కో కి బిజినెస్ ట్రిప్‌మీద వచ్చిన ఆయన ఇంతదూరం ఎందుకు వస్తారు?” అన్నాడు ఆండ్రూ.

“ఆయనకి ఈ పార్కులూ అవీ చూడ్డం అంటే ఇష్టం. ఎప్పుడు బిజినెస్ ట్రిప్‌కెళ్లినా టైముంటే ఆ చుట్టుపక్కల ఎక్కడికో అక్కడికి వెళ్లొచ్చేవారు. అలా ఆ బే ఏరియాలో చాలానే చూసొచ్చారు,” అన్నారు సరోజగారు గుర్తు తెచ్చుకుంటూ.

“ఇట్స్ ఓన్లీ ఎ ఫోర్ అవర్ డ్రైవ్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో! విత్ ఏన్ ఓవర్‌నైట్ స్టే, యు కుడ్ విజిటిట్,” అన్నాడు రోహిత్.

“అలా చూడ్డంకోసం ఎప్పుడయినా సెలవుపెట్టి ఒకరోజు ఎక్కువ వుండడం చేశారా?” అడిగారు మూర్తిగారు.

“తెలియ దన్నయ్యగారూ! ఆయన ఏరోజు వెడుతున్నారు, ఎప్పుడు తిరిగొస్తున్నారు, ఏ హోటల్లో వుంటున్నారు అన్న వివరాలని మాత్రమే నాకిచ్చేవారు.”

“అనుకున్న దానికంటే ఒకరోజు ముందరే మీటింగ్ పూర్తయితే, ఆ రోజు ఎలాగో మిగిలివున్నది గదా అని ఆ ముందు రోజు సాయంత్రమే బయలుదేరి యోసమిటీకి వచ్చి, ఎంత లేటయినా సరే, మరునాడు రాత్రికి మళ్లీ శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరి హోటల్‌కి వెడదామని ఆయన అనుకునివుంటే అలాంటి ట్రిప్ వీలవుతుంది. ఆయన ఫ్లయిట్ రిజర్వేషన్ మార్చుకోలేదు గనుక అది సాధ్యం. అయితే, ఆ రోజు రాత్రి ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఒక హోటల్లో బసచేసి వుండాలి. అంత హఠాత్తుగా వస్తే ఇక్కడ హోటళ్లల్లో రూములు దొరకద్దూ? దొరికినా, తెలుసుకోవడానికి పదేళ్ల క్రితం రికార్డులు ఎవరి దగ్గర వుంటాయి?” అనుకున్నారు మూర్తిగారు.

ఆండ్రూ తను వున్న చోటునించీ సిగ్నల్‌ని దాటి ఆ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వున్నవైపు చూశాడు. అక్కడ పనిచేసేవాళ్ల రాకపోకలకోసం మెష్ వున్న గేటు పెట్టివుంది. దానికి “డు నాట్ ఎంటర్” అన్న బోర్డు తగిలించి వున్నది. అప్పటికి సాయంత్రం ఆరు గంటలు దాటడంవల్ల అక్కడ పనివాళ్లు వెళ్లిపోయినట్టున్నారు. మనుషుల జాడ లేదు.

“రేపు డే టైంలో వస్తే ఎవరితో నయినా మాట్లాడగలిగే అవకాశ మున్నది,” అన్నాడు ఆండ్రూ మూర్తిగారితో.

అప్పటికింక ఎవరూ ఏమీ చెయ్యగలిగేది లేదు గనుక వాన్ ఎక్కి, భారీ మనసులతో హోటల్‌కి జేరారు. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన తరువాత వాళ్లకి తెలిసిన వివరాలివీ: ఆ రాక్‌స్లైడ్ మొదలయిన తరువాత ఒక నెలపాటు అది పడుతూనే వున్నది. అలా పడుతూండగా జియాలజిస్ట్‌లో లేక మీడియావాళ్లో పగటిపూట తీసిన విడియో కనిపించింది కానీ, ఆ రికార్డింగ్ మొదలయ్యేసరికే రోడ్ మీద డెబ్రీ చాలా పేరుకుని వున్నది. అది పడడం రాత్రిపూట మొదలయ్యుంటే ఆ విషయం పోలీసులకి తెలియడానికి కొంతసేపు పడుతుంది. తెలియగానే పోలీసులు ముందు రోడ్ బ్లాక్ చేస్తారు. తరువాత మీడియాకి ఆ వార్త చేరి వాళ్లు వచ్చేసరికి అది మొదలై ఎంతలేదన్నా కనీసం పన్నెండు గంటలు అయ్యుండచ్చు. గవర్నమెంట్ జియాలజిస్టులు రావడానికి ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది. కొన్ని రోజులో వారాలో అయిన తరువాత ఆ స్లైడ్‌ని కల్పించిన ఆ ఫార్మేషన్ ఇంకా అన్‌స్టేబుల్‌గా వుండడంవల్ల ప్రభుత్వం దాన్ని వెంటనే తొలగించే ప్రయత్నమేమీ చెయ్యలేదు. అందుకే టెంపరరీ బ్రిడ్జీలని కట్టి డీటూర్‌ని కల్పించారు. ఆ డెబ్రీని తొలగించి ఆ రోడ్డుని పునరుధ్ధరించడంకోసం బిలియన్ల డాలర్ల కేటాయింపు 2015లో జరిగి, 2016లో పని మొదలయింది. మళ్లీ డెబ్రీ వల్ల ఆ మార్గం మూతపడకుండా వుండేటందుకు అక్కడ రాక్ షెల్టర్‌ని కడతారు. ఈ ప్రాజెక్ట్ 2019కి పూర్తవుతుందని అంచనా.

“ఆ డెబ్రీని తొలగించడానికి హెవీ ఎక్విప్‌మెంట్‌ని వాడతారు. కొండల్లో సొరంగాలని తవ్వడానికి వాడినట్లుగా,” అన్నాడు ఆండ్రూ.

“ఎలా చేసినా దానికింద కారుంటే తెలియకపోయే అవకాశం వుంటుందా?” అడిగాడు రోహిత్.

ఎవరికీ మనసు బాగోలేదు. ఆకళ్లు లేవని తిండితిప్పలు వద్దన్నారు సరోజగారు, భవానిగారు. రూంలో ఒక టవల్‌తో మొహాన్ని కప్పుకుని మంచంమీద వాలిపోయారు సరోజగారు. అప్పుడప్పుడూ వచ్చే ఎక్కిళ్ల వల్ల ఆవిడ నిద్రపోవట్లేదని తెలుస్తూనే వున్నది. ఆ మంచంమీదే భవానిగారు ఒకపక్క తన రెండు చేతులతో ఆమె కుడిచేతిని పట్టుకుని కూర్చున్నారు. హమీర్ ఆమె పాదాల చెంత కూర్చుని తనక్కడే వున్నానని చెప్పడాని కన్నట్టు ఆ పాదాలను పట్టుకున్నాడు. తన బాధని పంచుకోవడానికీ, తన తలని మెడవంపులో ఆనించుకుని  జుట్టులో వేళ్లుపెట్టి దువ్వడానికీ ఎవరూ లేరన్న వెలితి అతనికి స్పష్టంగా తెలిసివచ్చింది.

విదుషిని కూడా వాళ్లతో వుంచి, ఆండ్రూ, మూర్తిగారు, రోహిత్ ఆ రూం బయట తమ రూములనించీ తెచ్చుకున్న కుర్చీలని వేసుకుని కూర్చున్నారు. కాసేపటికి విదుషి వచ్చి, ఆండ్రూతో మాట్లాడిన తరువాత అతను వెళ్లి మీనాకీ, రావుగారికీ పరిస్థితిని తెలియజేశాడు. వాళ్లిద్దరూ దాదాపు పరుగెత్తినట్లు అక్కడికి వచ్చారు. రావుగారు బయటే ఆగిపోయారు గానీ, మీనా తలుపు తీసి ఆ రూంలోకి అడుగుపెట్టింది.

తలుపు తీసిన శబ్దానికి తలెత్తి చూసిన హమీర్ కళ్లల్లో తనని చూడగానే నీళ్లు తిరగడం మీనాకి స్పష్టంగానే కంపించింది. ఆ నీళ్లు, “ఇంకా ఎంతసేపు అలా దూరంగా నిల్చుంటావ్?” అని తనని నిలదీస్తున్న ట్లనిపించి వడివడిగా నడిచి అతని పక్కన నిలుచుంది. హమీర్ వెంటనే ఆమె నడుంచుట్టూ చెయ్యివేసి దగ్గరకు లాక్కుని ఆమె పొట్టమీద తల నానించాడు. మీనా అతని జుట్టులో వేళ్లు పెట్టి దువ్వడం మొదలుపెట్టింది.

తల్లి పోయిన తరువాతి దుఃఖం ఆమెకు బాగానే గుర్తుంది. పదేళ్లపాటు తండ్రి కనిపించకపోతే, “బ్రతికివుండే అవకాశాలు తక్కువ,” అని అనుకోవడం వేరు, “బతికిలేడు” అని నిర్ధారణని తెచ్చే క్లోజర్ ఎఫెక్ట్ వేరు.

“మీరెందు కలా అంత నెగెటివ్‌గా ఆలోచిస్తున్నా రసలు?” హఠాత్తుగా అడిగింది మీనా. హమీరే గాక భవానిగారు, సరోజగారు కూడా ఆమెని ఆశ్చర్యంగా చూశారు.

“ఏదీ ప్రూవ్ అవలేదు ఇప్పటిదాకా. మీకు తెలిసిన తారీకుని బట్టీ, ఆ తారీకున ఇక్కడ జరిగిం దనుకుంటున్న సంఘటననిబట్టీ ఆ రెంటికీ ముడిపెట్టి మిమ్మల్ని మీరే దుఃఖసముద్రంలో ముంచేసుకుంటున్నారు. కరెలేషన్ ఈజ్ నాట్ కాజేషన్ అని ఒక సామెతుంది. మీరు ఇక్కడ చెయ్యి కదిపిన క్షణానే హోటల్ పార్కింగ్ లాట్లో యాక్సిడెంట్ అయితే, ఆ రెంటికీ ముడిపెట్టగలరా? అక్కడ రాళ్లనీ, మట్టినీ తొలగిస్తే కదా దానికిం దేమున్నదో తెలిసేది?” లాయర్‌లాగా ప్రశ్నించింది మీనా. అక్కడున్న ముగ్గురూ ఆమెను బ్లాంక్ ఫేసెస్‌తో చూశారు.

“ఆ కుప్పలో కూరుకుపోయి కారు ముందుకు పోక, సెల్‌ఫోన్ సిగ్నల్ లేక, ఊపిరాడక, డాడీ చివరి క్షణాలని ఎలా గడిపివుంటారోనని ఆలోచిస్తుంటేనే ఏడుపు తన్నుకొస్తోంది,” అన్నాడు హమీర్.

“అదే నేనంటోంది. దానిక్రింద ఆయన కారున్నట్టు మనకేమీ ప్రూఫ్ లేదు కదా!” ఆమె మాటలకు ఎవరూ జవాబు చెప్పలేదు.

“ఈ ప్రాజెక్టు 2019కి గానీ పూర్తికాదు. పోనీ, ఈ ఏడాది చివరికి ఆ కుప్పకిందే ఆ కారు వున్నది అని నిర్ధారణ జరిగిం దనుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు? ఇలాగే దిగులుగా ఇక్కడే కూర్చుంటారా?”

“రేపు ఆ ప్రాజెక్టు వాళ్లతో మాట్లాడితే గానీ వివరాలు తెలియవు,” అన్నారు భవానిగారు.

“అవునా? మరి అప్పటిదాకా ఇలా దిగులుగా వుండడం అవసర మంటారా? నిన్నటికీ, ఈ క్షణానికీ కూడా అంకుల్ గూర్చి నిర్ధారణగా తెలిసిన వివరాల్లో మార్పేమీ లేదుగదా! అందుకని, ఇవాళ యోసమిటీ నించీ వెనక్కు రావడానికి వాన్ ఎక్కి బయలుదేరిన క్షణాన ఎలా వున్నారో అలాగే వుండండి. అలా అయితే, మీకు అంకుల్ తిరిగి వస్తారనే ఆశ వుంటుంది. నాకు అలాంటి దేమీ వుండే అవకాశమే లేదు గదా మా అమ్మ గూర్చి?” అన్నది మీనా. ఆ చివరి వాక్యం ఆమె నోటినుంచీ రాగానే ఆమె కళ్లనుంచీ బొటబొటా నీళ్లు కారాయి.

భవానిగారు, “పిచ్చితల్లీ, ఇలారా!” అని పిలిచి మీనా తలని తన తల కానించుకుని కళ్లు తుడిచారు. సరోజగారు కూడా లేచి కూర్చుని మీనా తల నిమిరారు.

అక్కడికొచ్చిన మూర్తిగారు ఆకళ్లు వేస్తున్నాయని పిజ్జాని ఆర్డర్ చేస్తానంటే ఆ రూములో వున్నవాళ్లెవరూ వద్దనలేదు.

కాసేపయిన తరువాత హమీర్, మీనాలు చేతులు కలిపి నిశ్శబ్దంగా ఆ పార్కింగ్ లాట్లో నడవడం మొదలుపెట్టారు. తరువాత హమీర్ మీనా భుజంచుట్టూ చెయివేసి దగ్గరకు లాక్కుని నడిచాడు. మరికొంత సేపయిన తరువాత మీనా హమీర్ నడుంచుట్టు చేతులువేసి దగ్గరకు లాక్కుని అతని మెడవంపులో తన తలని దాచుకుంది. “యు నో హౌ మచ్ ఐ వాంటెడ్ దిస్ హగ్ సిన్స్ మై మామ్ పాస్డ్ ఎవే?” అన్నది మెల్లిగా గొణుగుతున్నట్లుగా. ఆమె మెడ వంపులో తన తలని ఆనించాలని అతనికి వున్నది గానీ, అది ఆ ట్రిప్పులో కుదరదని అతనికి తెలుసు.

***

మరునాడు తెల్లవారుఝామున అయిదు గంటలకల్లా ఆండ్రూ హాఫ్ డోమ్ ఎక్కడానికి వెళ్లిపోయాడు. అలా ఎక్కేవాళ్లలో కొంతమంది అదే హోటల్లో బసచేసి వుండడంతో అతనికి రైడ్ దొరకడం కష్టమేమీ కాలేదు. దానివల్ల మిగిలినవాళ్లు తీరిగ్గా లేచి, బ్రెక్‌ఫాస్ట్ చేసి యోసమిటీకి బయలుదేరడానికి వీలయ్యింది.

బ్రెక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఒకాయన సరోజగారి వద్దకు వచ్చి, “మీరు సరోజగారు కదా!” అని అడిగారు. సరోజగారు ఆయన్ని చూసి, గుర్తుపట్టనట్లుగా, “మీరు …” అంటూ మధ్యలో ఆగిపోయారు.

“నేను వీరారెడ్డి నండీ. హంట్స్‌విల్‌లో వున్నప్పుడు వారాని కొకసారన్నా కలిసేవాళ్లం,” అన్నారాయన.

“చాలా కాలమయింది కదా, అందుకని గుర్తుపట్టలేదు. మీకు గ్రోసరీ షాప్ వుండేది కదా,” అన్నారు సరోజగారు గుర్తుతెచ్చుకుంటూ.

“అందుకే కస్టమర్లందరూ నాకు గుర్తుంటారు. నాకు బాగా జుట్టున్నపుడు చూశారు గనుక ఈ పూర్తి బట్టతలతో నన్ను గుర్తుపట్టడం కష్టమే. కానీ, మీరేం మారలేదు. నిన్న మిమ్మల్నిక్కడ చూశాను, అవునా, కాదా అనుకుని, ఇవ్వాళ పలకరించి తెలుసుకుందా మనుకున్నాను. గ్లాడ్ ఐ ఆస్క్‌డ్,” అని, “రామారావు గారు రాలేదా?” అని అడిగారు.

మూర్తిగారు కల్పించుకుని, “రాలేదండీ. బై ది వే, అయాం మూర్తి. ఎ క్లోజ్ ఫ్రెండ్,” అన్నారు.

“నైస్ టు మీట్ యు,” అని, “క్రితంసారి రామారావు గారొక్కరూ వచ్చారు. ఇప్పుడు సరోజ గారొక్కరూ వచ్చారు,” అని వీరారెడ్డిగారు జతకలిపారు.

మూర్తిగారి మైండ్లో అలారం బెల్స్ మ్రోగాయ్. “ఎప్పుడు?” ఆత్రాన్ని సాధ్యమయినంతవరకూ కనపడనీకుండా క్యాజువల్‌గా అడిగారు.

“అప్పటికి నేనీ హోటల్‌ని కొని ఏడాది కూడా అవలేదు. అందుకే తెలిసిన మొహాలకోసం కలవారించేవాణ్ణి,” అన్నారాయన.

“అదే, ఏ సంవత్సరమో గుర్తుందా?”

“2006! రాత్రి బాగా లేట్‌గా వచ్చారు, రిజర్వేషన్ లేదు, రూం దొరుకుతుందా అంటూ. అప్పుడు ఆయన అదృష్టం బావుండి అది సీజన్ కాదు కాబట్టి ఖాళీగా బోల్డు రూములున్నయ్. ఇది సీజనల్ బిజినెస్. అందుకే ఇప్పుడు వింటర్లో హంట్స్‌విల్‌లోనూ సీజన్ మొదలయినప్పటినించీ ఇక్కడా గడుపుతుంటాను.”

“మీకంత బాగా ఎలా గుర్తుంది, ఆయన వచ్చినట్లు?”

“తెలిసినవాళ్లు రావడం అది మొదటిసారి. పైగా, లేట్‌గా వచ్చారు. అప్పుడు రిసెప్షనిస్టునీ, ఓనర్నీ అన్నీ నేనే గనుక నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు, వుండమన్నాను. ఆయన అప్పటికీ మొహమాట పడి, మా ఫామిలీతో వచ్చినప్పుడు మాత్రం డబ్బులు తీసుకోకపోతే వేరే హోటల్‌కి వెడతానన్నారు.”

సరోజగారు ఈ సంభాషణని నిశ్చేష్టులై విన్నారు. క్రితం రాత్రి మీనా మాటలవల్ల చిగురించిన ఆశలని ఆ క్షణాన మంటలో తగులబెట్టినట్టు ఆమెకి అనిపించింది. ఆవిడకి ఏడుపు మళ్లీ తన్నుకొచ్చింది. భవానిగారు ఆవిణ్ణి పట్టుకుని రూంకి తీసుకెళ్లారు.

సరోజగారు ఎందుకంత అప్‌సెట్ అయ్యారో వీరారెడ్డిగారికి అర్థంకాలేదు. “నేనే మన్నానని?” ఆశ్చర్యంతో మూర్తిగారిని ఆయన ప్రశ్నించారు.

ఆయనకి క్లుప్తంగా చెప్పి పంపించిన తరువాత హమీర్‌నీ, రోహిత్‌నీ, విదుషినీ చూస్తూ మూర్తిగారు అన్నారు – “శాన్ ఫ్రాన్సిస్కో చుట్టుపక్కల – అదే, పాలో ఆల్టోలో – రామారావుగారి పని అనుకున్న దానికంటే ఒకరోజు ముందే అయిపోయి వుంటుంది. ఫ్లయిట్‌ని ప్రిపోన్ చేసుకోవాలంటే ఎయిర్‌లైన్ బాగానే ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తుంది. ఆ డబ్బుని కట్టడానికి గవర్నమెంట్ కాంట్రాక్ట్ మీద పనిచేసే కంపెనీలు బాగా నసుగుతాయి. గవర్నమెంట్ రి-ఇంబర్స్‌మెంట్ ఇవ్వనంటే, అని వాళ్ల భయం. ఆ అనుభవంతో, ఎందుకొచ్చిన గోలలే అనుకుని, ఒకరోజు వెకేషన్ తీసుకుని యోసమిటికి వెళ్లొద్దామని రావుగారు అనుకుని వుంటారు. అయితే, అప్పటికే ఆ రోజుకి చెకవుట్ టైం దాటడంవల్ల ఆయన వుంటున్న హోటల్ ఆ రాత్రికి కూడా ఎలాగో ఛార్జ్ చేస్తుంది. పైగా, మరునాడు రాత్రి ఎలాగూ అక్కడే వుండాలి. ఎందుకంటే, ఆయన స్కెడ్యూల్డ్ ఫ్లయిట్‌ని శాన్ ఫ్రాన్సిస్కోలో పొద్దున్న ఎనిమిదింటికే కాచ్ చెయ్యాలంటే ఇక్కణ్ణించీ కనీసం తెల్లవారుఝామున రెండు గంటలకి బయలుదేరాలి. ఆ టైంలో డ్రైవ్ చేసుకుని వెళ్లడం సేఫ్ కాదు. అసలే కొండలప్రాంతం. దానికి తోడు నిద్ర వస్తూంటుంది. వెరీ డేంజరస్!  ఆ విషయం ఆయనకి తెలిసే, ఆ హోటల్లో చెకవుట్ చేసివుండరు.

“వర్క్‌డే అయిన తరువాత బయలుదేరి వుంటారనుకుంటే, ఇక్కడికొచ్చేసరికి రాత్రి కనీసం పదకొండు గంటలవుతుంది. అది లేటే కదా! ఇక్కడ ఓవర్‌నైట్ స్టే చెయ్యాలంటే ఎలాగూ తన బట్టలూ అవీ తెచ్చుకోవాలి కనుక మొత్తం కారీ-ఆన్‌తో వచ్చివుంటారు. అందుకనే అక్కడి హోటల్లో చెకవుట్ చెయ్యకపోయినా ఆయన బిలాంగింగ్స్ ఏవీ దొరకలేదు. మరునాడు పొద్దున్నే ఈ హోటల్‌నించీ చెకవుట్ చేసివుంటారు. తనివితీరా చూసేసి సాయంత్రం ఏడు గంటలప్రాంతంలో యోసమిటీనించీ బయలుదేరి వుంటారనుకుంటే ఆ రాక్‌స్లైడ్ ప్రాంతానికి వచ్చేసరికి ఏడున్నర అయివుండొచ్చు. ఆ  స్లైడ్ చిన్నచిన్న రాళ్లతోనూ మట్టిగడ్డలతోనూ మొదలయిందా లేక చాలా పెద్ద పెళ్ల ముందు పడి దానిమీద తరువాత ఆ కుప్ప సైజ్ పెరుగుతూ వచ్చిందా అన్నది మనకు తెలియదు కదా!  చిన్నచిన్న రాళ్లూ రప్పలూ పడుతుంటే చూసి కారుని ఆపగలిగే అవకాశ ముంటుంది. ఆయన అందులోనే ఇరుక్కుపోయివుంటే మాత్రం ఆ కారు ముందుకుపోలేని పరిస్థితి హఠాత్తుగా వచ్చిందని అర్థం. అఫ్ కోర్స్! ఇదంతా ఊహాగానమే, మన కిప్పటిదాకా తెలిసినదాన్ని బట్టీ.”

ఆయన ఎనాలిసిస్‌ని తప్పుపట్టడానికి ఎవరికీ తగినన్ని కారణాలు కనిపించలేదు.

హమీర్ సరోజగారి దగ్గరకు వెళ్లి, “మామ్, ఆండ్రూ వచ్చేదాకా మన మిక్కడ వెయిట్ చెయ్యడం తప్ప మరేమీ చెయ్యలేం. ఇక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే సెకండ్లు గంటల్లాగా భారంగా అనిపించి నాకు పిచ్చెత్తుతుంది. డాడీ యోసమిటీ చూడడానికే వచ్చివుంటే, ఆయన చూసినవే మనం చూస్తున్నా మనుకుని, ముందు అనుకున్నట్లుగానే వెడదాం, పద! దారిలో ఆ రాక్‌స్లైడ్ జరిగిన చోట ఆగి, అక్కడ వున్న కన్‌స్ట్రక్షన్ క్రూతో మాట్లాడడానికి కూడా అవకాశం దొరుకుతుంది,” అన్నాడు. సరోజగారు లేచి బయలుదేరారు.

***

విదుషి వాన్‌ని డ్రైవ్ చేస్తుంటే మీనాని వాళ్లతో పంపించి రావుగారు వెనక తన కారులో ఫాలో అయ్యారు. విదుషి పక్కసీట్లో మూర్తిగారు కూర్చోగా, వెనక హమీర్ పక్కన విదుషి ఖాళీచేసిన సీట్లో మీనా కూర్చుంది. ఎన్నాళ్లనించో మిస్ అయిన ఆ స్పర్శ తాలూకు అనుభవాన్ని ఇంక విడవకూడదన్నట్లు చేతులు పట్టుకుని, భుజాల నానించి కూర్చున్నారు హమీర్, మీనా. వాన్ ఆ రాక్‌స్లైడ్ ఏరియాకి జేరేసరికి దాదాపు తొమ్మిది గంటలయింది. మూర్తిగారు హమీర్‌ని తనతో తీసుకువెళ్లి అక్కడి సూపర్వైజర్‌తో మాట్లాడారు. అతను మూర్తిగారి బిజినెస్ కార్డ్ తీసుకుని, వాళ్ల భయమే నిజమయితే తప్పక తెలియజేస్తాననీ, ఒకవేళ తను మరచిపోయినా అది నేషనల్ న్యూస్‌లో వస్తుందనీ, తరువాతి ఆరు నెలల్లో ఆ డెబ్రీని పూర్తిగా తొలగించాలనేది ప్లాన్ అనీ వివరించాడు.

***

యోసమిటి పార్క్‌లోకి ప్రవేశించిన తరువాత రూట్ 41 తీసుకుని గ్లేసియర్ పాయింట్ వైపు ప్రయాణించారు. చివర పార్కింగ్ లాట్లో దిగి, అక్కణ్ణించీ కనిపించిన దృశ్యాన్ని చూసి అచ్చెరువందారు. 3-డి నమూనాని విజిటర్ సెంటర్లో చూడడం వేరు, ఫుల్ సైజ్‌ని కళ్లారా చూడడం వేరు. ఒక పక్కన ఎత్తుగా హాఫ్ డోమ్ కనిపిస్తోంది. దానికి ఎదురుగా వున్న లోయలో తాము ముందురోజు వెళ్లిన విలేజ్ వున్నదని తెలుస్తోంది. ఆ వ్యాలీకి అవతలపక్క మళ్లీ కొండల వరుసలు. అయితే, చుట్టుపక్కల అన్ని కొండలలోనూ అతి ఎత్తయినది హాఫ్ డోమ్ మాత్రమే.

“లయన్ కింగ్‌లో ముఫాసా నిలబడితే మిగిలిన జంతువులన్నీ తలలు వంచి వాడి కెదురుగా, దూరంగా నిలబడ్డట్లున్నది,” అన్నాడు రోహిత్.

“ఈ లోయ అంతా గ్లేసియర్ కరగడం వల్ల ప్రవహించిన నీరు కోసెయ్యడంవల్ల ఏర్పడినదే?” అన్నారు భవానిగారు ఆశ్చర్యపోతూ.

“ఆండ్రూ ఈపాటికి అక్కడికి చేరుతూ వుంటాడంటావా?” అన్నారు మూర్తిగారు. విదుషి వాచ్ చూసి, “అప్పుడే ఎక్కడ, టు థర్డ్స్ డిస్టెన్స్ కవర్ చేసివుంటే గొప్ప!” అన్నది.

“అంత స్టీప్‌గా, నున్నగా వున్నది కదే ఆ ఆఫ్ డోమ్! ఎలా ఎక్కుతాడో ఏమిటో,” అన్నారు భవానిగారు.

(మధ్యలో క్రింద యోసమిటీ వ్యాలీ. కుడివైపున హాఫ్ డోమ్)

“దానిమీద ఐరన్ పోల్స్‌ని పాతి వాటికి తాడు కట్టి రోప్ వే తయారు చేశార్ట. దాన్ని పట్టుకుని ఎక్కుతారు. అక్కడ కంజెషన్ అవుతోందనే పార్క్ అథారిటీ రోజుకి కొంతమందిని మాత్రమే దాన్నెక్కడానికి అనుమతిస్తోందట,” విదుషి వివరాలు తెలియజేసింది.

“డాడీ ఇక్కణ్ణించీ ఈ లోయని చూసివుంటా రంటావా?” అన్నాడు హమీర్ తల్లి భుజంమీద చెయ్యివేసి గట్టిగా పట్టుకుని. అతని రెండవ చేతిని విదుషి గట్టిగా పట్టుకుని, “ఐ విష్ మై మామ్ హాడ్ సీన్ దిస్,” అని సన్నగా గొణిగింది.

“గ్లేసియర్ కరిగితే వచ్చిన నీళ్లు కొయ్యగా మిగిలిన వ్యాలీ లాంటివే నీదీ, నాదీ గుండెలు. అక్కడ ఎత్తుగా హాఫ్ డోమ్‌లాగా ఆకాశా న్నంటుతూ ఆయన,” అన్నారు సరోజగారు.

మిర్రర్ లేక్‌కి వెళ్లేముందు యోసమిటి విలేజ్‌లో ఆగి లంచ్ చేశారు. ఆండ్రూ వచ్చేసరికి ఎలాగూ బాగా లేటవుతుంది గనుక తీరిగ్గా ఆ చుట్టుపక్కల అన్నింటినీ చూడాలనుకున్నారు.

(మిర్రర్ లేక్)

కర్రీ విలేజ్ దగ్గర మళ్లీ వాన్‌ని పార్క్ చేసి హాపీ ఐల్స్ బ్రిడ్జ్‌ని దాటి ఈసారి లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు. దాదాపు ఒక మైలు దూరం నడవాల్సొచ్చింది మిర్రర్ లేక్ దగ్గరకు వెళ్లడానికి. అయితే ఆ ప్రశాంతమైన వాతావరణంలో నడవడం అంత కష్ట మనిపించలేదు. “నడవలేకపోతే వెనక్కు వెళ్లేటప్పుడు పార్క్ బస్ తీసుకుందాంలే,” అన్నారు మూర్తిగారు.

మిర్రర్ లేక్ దగ్గరకు వెళ్లిన తరువాత దానికా పేరు ఎందుకొచ్చిందో అర్థమయింది. ఎంతో నిశ్చలంగా వున్నదది చుట్టూ వున్న కొండలని అందులో ప్రతిబింబిస్తూ.

“ఇక్కడెంత ప్రశాంతంగా వున్నదో! ఋషులు ఇట్లాంటి చోట్ల తపస్సులు చేస్తూంటారు గావును,” అన్నారు భవానిగారు.

“అలా చేస్తే ఎంతో కాలం పట్టివుండదు పూర్తి ప్రశాంతత దొరకడానికి. ఎందుకంటే కనీసం ఒక బేర్ అయినా మంచి ఆహారం దొరికిందని ఆనందపడుతుంది గనుక,” అన్నాడు రోహిత్.

“ప్రశాంతత కావాలంటే ముందు వీడి నోరు మూయించాలి,” అన్నది విదుషి. అక్కడేవున్న బండలమీద కూర్చున్నా రందరూ.

“ఈ మూమెంట్ విలువ ఎన్నో ఏళ్లకు గానీ తెలియదు. మళ్లీ ఎప్పుడొస్తామో! మనసుల నిండా నింపుకోండి,” అన్నారు మూర్తిగారు.

“నా ఐఫోన్లో నింపుతున్నాను,” అన్నాడు రోహిత్ చుట్టూ తిరుగుతూ విడియో రికార్డ్ చేస్తూ.

“నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఆండ్రూతో నయినా వెడతాను, లేకపోతే అతణ్ణి నాతో ఇక్కడికి పట్టుకొచ్చి అయినా తీరతాను,” అనుకున్నది విదుషి.

హమీర్ భుజంమీద తలపెట్టి అతని నడుము చుట్టూ చెయ్యివేసి మీనా కూర్చోవడాన్ని చూసిన రావుగారి మనసు ఆనందంతో నిండిపోయింది. సరోజగారు వాళ్లిద్దరి పక్కనే కూర్చోకపోయినా హమీర్ ఒంటరితనం తీరుతున్నందుకు ఆమె మనసు స్థిమితపడింది.

అక్కణ్ణించీ కదలాలని లేకపోయినా మరీ ఆలస్య మవుతుందేమోనని ఒక గంట తరువాత అక్కణ్ణించీ బయలుదేరారు. బస్ ఎక్కాలని ఎవరూ అనుకోలేదు.

***

మూర్తిగారి బృందం తిరిగి హోటల్‌కి చేరుకునేసరికి ఏడు కావస్తోంది. పెద్దవాళ్లకి పిజ్జా తెప్పించి, తాము తినడానికి ఆండ్రూ తిరిగివచ్చేదాకా ఆగుదా మనుకున్నారు కుర్రవాళ్లు. అయితే, బార్లో వెళ్లి కూర్చోవడానికి ఆ అడ్డేమీ లేదు గనుక అక్కడ రిలాక్స్ అయి వస్తామన్నారు. అక్కడ స్నాక్స్ ఆర్డరిచ్చి వాటిని తింటూ ఒక బీరు సగం తాగిన తరువాత ఫోన్‌ని టేబుల్‌మీద పెట్టి హమీర్ రెస్ట్‌రూంకి వెళ్లాడు. తిరిగి వచ్చిన తరువాత మీనా చెప్పింది – నీకు ఆమని నించీ ఫోన్ వచ్చింది అని. హమీర్ ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ, “అమాని?” అన్నాడు. రోహిత్ కనుబొమలు ఒక్కసారి ముడుచుకున్నాయి. అతను విదుషితో గ్లాన్సెస్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడాన్ని మీనా గానీ హమీర్ గానీ చూడలేదు. హమీర్ ఫోన్ తీసుకుని ఆ బార్ బయటికి వెళ్లాడు. అమాని ఫోన్ చెయ్యడం అతనికి చాలా ఆశ్చర్యంగా వున్నది. ఆమె ఫోన్ చెయ్యడం అదే మొదటిసారి! అయితే, రెండోపక్కనుంచీ భయం – ఆమె నుంచీ ఎలాంటి వార్త వినవలసి వస్తుందో నని! “ఐ వాంట్ టు మీట్ యు,” అనంటే మాత్రం ఇప్పుడది పెద్ద ప్రాబ్లమే అవుతుంది.

అతను అమాని నంబర్ డయల్ చేసినప్పుడు ఆమె అవతలి నించీ, “ఐ కాల్డ్ టు టెల్యు ఎ గుడ్ న్యూస్!” అన్నది అతను ఇంకా “హలో” అని అనకుండానే.

“ముదస్సర్ హార్ట్ ఎటాక్ వచ్చి చచ్చిపోయాడు,” అన్నాడు హమీర్ ఒక పక్కనుంచీ తన గుండెని గుప్పిట్లో పెట్టుకుంటూనే. అయితే, అది మాత్రం, అప్పటిదాకా అమాని అతన్నించీ కమిట్‌మెంట్‌ని కోరలేదని గుర్తులేక మాత్రం కాదు.

ఒక్కక్షణం పట్టింది అతనన్నది ఆమెకు అర్థం కావడానికి. పెద్దగా నవ్వి, “నో … నాట్ దట్ గుడ్. యాక్చువల్లీ దట్ వుడ్ బి వెరీ బాడ్ ఫర్ సురయా. … ఐ బ్రోక్ హిజ్ లెగ్స్. సో, హి విల్ నో లాంగర్ బి ఎ డేంజర్ టు ఎనీబడీ!” అన్నది.

“వాట్?” అన్నాడు నమ్మలేనట్టుగా.

“నువ్వింకా, హౌ అనడుగుతా వనుకున్నాను. సరే ఆ ప్రశ్నకు నేనే జవాబు చెబుతాను విను. వాడి ప్లాన్ ఎగ్జెక్యూషన్‌కి ఆర్డర్లు వచ్చాయిట అని ఫోన్‌చేసి చెప్పింది సురయా. దానికి ఫోన్ లేదు. తన ఫోన్ మీద దాని చెయ్యి పడితే చంపేస్తానని ఎప్పుడో బెదిరించాడు గనుక అది ఆ ఫోన్ వైపు చూడడానికే భయపడుతుంది. ఆ రోజు మాత్రం మా అందరి అదృష్టం బావుండి వాడు బాత్రూంలో వున్నప్పుడు తెగించి నాకు ఫోన్ చేసి వాడి ప్లాన్ చెప్పింది. వాడి ప్లాన్లో దాన్ని సూసయిడ్ బాంబర్‌ని చెయ్యడంకూడా వున్నది. బ్రస్సెల్స్ ఎటాక్‌తో వాడు ఎలాగూ ఇన్‌స్పైర్ అయేవున్నాట్ట. అప్పటికే డొనాల్డ్ ట్రంప్ ముస్లిము లందరినీ శతృవులుగా చూపిస్తూండేసరికి వాడికి బుధ్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుని వున్నాట్ట. న్యూయార్క్‌లో జరిగే ప్రైమరీకోసం రాలీలకి ఎలాగూ ట్రంప్ వస్తాడు గాబట్టి దాన్ని టార్గెట్‌గా పెట్టార్ట -  ఎక్కువమందికి హాని కలిగించే అవకాశ ముంటుందని. వాడు తన డొక్కు కార్లో బయలుదేరితే దాన్ని పొరబాటున ఏ పోలీసు ఆపడంవల్లనో లేక ఆ కారు దారి మధ్యలో ఆగిపోతే సహాయం చెయ్యడాని కొచ్చిన ఎవరివల్లనో వాడు చెయ్యబోయే ఘనకార్యం అందరికీ తెలిసి మేమందరం ఒకేసారి ముణిగిపోయే అవకాశం బాగా వున్నదని నాకు అర్థమైంది. అందుకని వాణ్ణి ఆపాలని నిర్ణయించుకుని వాడింటికి బయలుదేరాను.

“కారులో వెపన్స్‌ని పగటి పూట లోడ్ చెయ్యరు కదా! ఎంత సంచుల్లో వాటిని నింపినా అర్థరాత్రిపూటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి. మా అదృష్టం బావుండి వాళ్లది కార్ గరాజ్ లేని టవున్‌హవుస్. అందుకని కారుని బయటే కర్బ్ పక్కగా పార్క్ చేశాడు. నేను వెళ్లేసరికి వాడు లోపలినించీ తెచ్చిన సంచీని అప్పుడే ట్రంక్‌లో పెట్టడానికి వంగాడు. అప్పుడే టర్న్ తీసుకుంటున్న నా కారు హెడ్‌లైట్లు వెనకనించీ తనమీద పడేసరికి స్టన్ అయ్యాడు గానీ వెనక్కు తిరిగి చూసే ప్రయత్నం చెయ్యలేదు – వచ్చే వాళ్లెవరో తనకి తెలియదు గదా! అందుకని తన పని తను చేసుకుంటున్నట్లు నటించాడు. లేకపోతే కారు శబ్దం విని వెనక్కి తిరిగి చూడాలి. వాడి కారు వెనుకగానే నాకు పార్క్ చెయ్యడానికి చోటుంది. మామూలుగా కర్బ్ పక్కన వన్నీ పారలెల్ పార్క్ స్పాట్సే కదా! ఇన్షాల్లా! ఆ రోజు అల్లా దయదల్చినట్లే ఆ స్పాట్లన్నీ వేకెంట్‌గా వున్నాయి.

“ఒక్కక్షణంలో ఏంచెయ్యాలో డిసైడ్ అయ్యాను. వాడి కారు వెనకే పార్క్ చేస్తున్నట్లు మెల్లిగా వెళ్లి, యాక్సిలరేటర్ మీద కాలేశాను. వాడు రెండు కార్లకీ మధ్యలో ఇరుక్కుపోయాడు. రెండుకాళ్లూ మోకాళ్ల దగ్గర నుజ్జు నుజ్జయిపోయా యని నమ్మకం కలిగిన తరువాత కానీ కారుని రివర్స్ చేసి ఆపలేదు. నేనే 911కి కాల్ చేసి వెంటనే కారు దిగి వాడి ముందు కెళ్లాను. అప్పటికి వాడు నేలమీద కూలిపోయి వున్నాడు గానీ ఆ పని చేసింది నేనేనని తెలిసి మాత్రం షాకయ్యాడు. వాడు ట్రంక్‌లో పెట్టిన బాగ్‌ని తీసుకుని  పరుగెత్తి వాడింట్లోకి వెళ్లి సురయా చేతికిచ్చి లోపల పెట్టమని చెప్పి, వెనక్కి వచ్చి వాడి పక్కన నిల్చొని ‘అయ్యో, ఎంత ఘోరం చేశాను ‘ అని పెద్దగా ఏదవడం మొదలుపెట్టాను. కనీసం ఇరవై మైళ్ల స్పీడ్‌తో వాడి కాళ్లని క్రష్ చేసినా హాస్పిటల్‌కి తీసికెళ్లిన తరువాత డాక్టర్లు హీరోయిక్‌గా వాడి కాళ్లని మామూలుగా చేస్తారేమోనని భయపడ్డాను గానీ, వాళ్లు ఆ కాళ్లు తీసెయ్యాలని చెబితే లోపల ఎంత సంతోషించినా పైకి మాత్రం, నా వల్లే కదా అని పెద్దగా అరుస్తూ ఏడుపు నటించాను. మోకాళ్లనించీ కింద భాగాన్ని రెండు కాళ్లకీ పూర్తిగా తొలగించారు.

“బ్రేక్ నొక్కబోయి యాక్సిలరేటర్ నొక్కానని పోలీసులకి చెప్పాను. వచ్చిన పెరామెడిక్సూ, పోలీసులూ వాడి ఇంట్లోకి అడుగుపెట్టకపోవడం మంచిదయింది. లేకపోతే వాడు పోగుచేసిన రకరకాల గన్స్‌నీ, బాంబులనీ చూసేవాళ్లు! వాడు హాస్పిటల్లో వున్న రోజుల్లోనూ, వాణ్ణి ఇంటికి తీసుకువచ్చిన తరువాత కూడా పెయిన్ కిల్లర్స్ ఇవ్వడంవల్ల నిద్రపోతూ వున్నప్పుడూ, నేనూ, సురయా ఆ మారణాయుధాలని నల్ల ట్రాష్ బాగ్స్‌లో పెట్టి చీకటిగా వున్నప్పుడు దూరంగా వున్న ట్రాష్ బిన్లలో పడేసి వచ్చాం. అన్నింటినీ ఒకేసారి గానీ ఒకేచోట గానీ పడేయ్యలేదులే! అదికూడా రోజుకి కొన్నిమాత్రమే. … ఇప్పుడు సురయాకి కూడా కొంచెం స్వేఛ్ఛ దొరికిన ట్లనిపించి, అది ఇస్తున్న ఫీలింగ్ నచ్చుతోంది. పెళ్లయిన తరువాత తను పోగొట్టుకున్నదేమిటో తనకి అర్థమవుతోంది. పిల్లల్ని స్కూల్‌కి పంపుతానని కూడా అంటోంది,” అని ఆగింది.

హమీర్‌కి మొత్తం పరిస్థితి అర్థం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. “నీమీద ఛార్జెస్ ఏవీ పెట్టలేదా?” అడిగాడు.

“ఎంతయినా విక్టిమ్, సిస్టర్స్ హజ్బెండే గనుక పోలీసులు నా స్టోరీనే నమ్ముతున్నారు. వాడు మాత్రం నన్ను సైతాన్ అంటున్నాడనుకో! అలాగని వాడు పోలీసులకి నేను ఎందుకలా చేసివుంటానో చెప్పలేని పరిస్థితి. రెక్‌లెస్ డ్రైవింగ్ అని రాశాడు అక్కడికొచ్చిన పోలీసు. మా లాయర్‌తో చెప్పాను – నేను చాలా పశ్చాత్తాప పడుతున్నాను, వాడికి వచ్చిన మెకానిక్ పని చెయ్యడం ఇంకనుంచీ సాధ్యం కాదు, అలాగని వేరే ఉద్యోగం దొరకడమూ కష్టం గనుక, పెళ్లి చేసుకోకుండా ఆ నలుగురినీ నేను బతికున్నంత వరకూ పోషిస్తాను అని చెప్పు, అవసరమైతే, అని. మెడకాయ మీద తలకాయ వున్న ఏ జడ్జీ కయినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా నన్న నా ప్రపోజల్ యాక్సెప్టబుల్ అని అనిపించాలి.”

“యు డిడ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ది కంట్రీ – బట్, నో స్పెషల్ రివార్డ్స్ ఆర్ మెడల్స్ ఫర్ యు!” అన్నాడు హమీర్.

“ముదస్సర్ వల్ల ఎవరికీ ప్రమాదం రాకపోవడమే నాకు పెద్ద రివార్డ్. అంతకన్నా ఎవరే మివ్వగలరు? బై ది వే, నేను దేశంకోసం, సమాజంకోసం, ఏం చెయ్యలా. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మేమందరం ఒకేసారి ముణగకుండా వుండేలా చూసుకున్నానంతే! నాకు నవ్వొచ్చిన విషయం చెప్పమంటావా? ఇంత జరిగినా, ముదస్సర్ చెయ్యబోయిన హానివల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయేవో తెలిసినా, సురయా నా మీద జాలిపడి, వాడికి రెండో భార్యగా వుంటావా, షరియా ప్రకారం తప్పులేదుగా? అంటుంది – అక్కడేదో మగాడి పొందు మిస్సవకపోవడమే ఆడదానికి జీవిత లక్ష్యం అన్నట్టు! నీ పొందు జ్ఞాపకాలు పదిలంగా నాగుండెల్లో వున్నయ్యని తనకేం తెలుసు? ఆ యాక్సిడెంట్ తరువాత నీతో మాట్లాడాలని, నీ ఛాతీమీద తలవాల్చి సేదతీరాలనీ చాలాసార్లు అనిపించింది. నీ ఫోన్ నంబర్‌ని గుర్తు చేసుకుంటూ, ఈ నంబర్ మరిచిపోవాలి అని ఎన్నిసార్లు అనుకున్నా లాభం లేకపోతోంది,” అన్నది అమాని.

“ఐ వాంట్ టు సీ యు!” అన్నాడు హమీర్ కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా.

“నో, ఒమహా బాయ్! బై ది వే, ఆ పేరుతోనే నీ కాంటాక్ట్‌ని నేను మొదటినించీ గుర్తుంచుకుంది. లేకపోతే, పొరబాటున నీ పేరుని హమీద్ అనుకుంటానేమోనని భయం. ఈ మూణ్ణెల్లబట్టీ నువ్వు నాకు కాల్ చెయ్యడానికి గానీ, టెక్స్ట్ చెయ్యడానికి గానీ ప్రయత్నించకపోతే సెల్ఫ్ కంట్రోల్ నీకు బాగానే వున్నదే అనుకున్నా. ఐ వాంట్ టు ప్లే ఇట్ సేఫ్. రేపటినించీ నా నంబర్ మార్చుకుంటా.  యాక్చ్యువల్లీ, దిస్ విల్ బి ఎ ఫ్యామిలీ ప్లాన్, బట్ దిస్ టైం అండర్ మై కంట్రోల్. ముదస్సర్‌కి కూడా కొత్త నంబర్ వుంటుంది. అలా అయితే ముందుగా ఇక్బాల్‌కి ముదస్సర్ నంబర్ దొరకదు. ఇంకెవడయినా ముదస్సర్‌తో మాట్లాడినా నాకు తెలుస్తుంది. అయినా, రెండు కాళ్లూ విరిగిన వాడితో ఇక్బాల్‌కి అవసర మింకే ముంటుందిలే? సేఫ్‌గా వుంటుందని అడ్రస్ కూడా మార్చడానికి వాళ్లని ఆ యింటినుంచీ వాళ్ల అబ్బాజాన్ ఇంట్లోకి మారుస్తున్నాను కూడా,” అన్నది అమాని.

హఠాత్తుగా ఆమె మూణ్ణెల్లు అనడం అతని మదిలో రిజిస్టరయింది. “ఇది జరిగి మూణ్ణెల్లయితే, నా కిప్పుడు చెబుతున్నావా?” అడిగాడు.

“నేనన్నది మూణ్ణెల్లబట్టీ నువ్వు కాంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నించ లేదని. ఇది జరిగి రెణ్ణెల్లే ననుకో, అయినా, హౌ వుడ్ ఇట్ ఛేంజ్ ఎనీథింగ్?” అడిగింది అమాని.

“ఇట్ వుడ్ హావ్! అంటిల్ లాస్ట్ వీక్!” అన్నాడు బార్లో వున్న మీనా గుర్తొచ్చి. కాదు. ఈ యోసమిటీ ట్రిప్‌కి బయలుదేరే ముందు దాకా, అనుకున్నాడు.

“టుమారో ఈజ్ మై కోర్ట్ డేట్. నో క్రిమినల్ ఛార్జెస్. బట్, రెక్‌లెస్ డ్రైవింగ్ ఛార్జ్ హాజ్ ఎ రేంజ్ ఫర్ పనిష్మెంట్, ఇంక్లూడింగ్ జెయిల్ టర్మ్. సో, విష్ మి ది బెస్ట్!”

“ఫ్రమ్ ది బాటం ఆఫ్ మై హార్ట్! … ఐ విల్ మిస్ యు!” అన్నాడు.

“అహాఁ. జస్ట్ లైక్ ఐ మిస్ ఎ పింపుల్!” అని నవ్వింది.

“దిసీజ్ ది ఫస్ట్ టైం ఐ హర్డ్ యువర్ గిగిల్,” అన్నాడు హమీర్.

“గ్లాడ్ టు గివ్ యు దట్ స్పెషల్ మెమరీ! బెటర్ లేట్ దాన్ నెవర్, రైట్?” అన్నది అమాని.

“2016 ఈజ్ స్పెషల్ ఫర్ బోతాఫ్ అజ్. యు ఆర్ ఫరెవర్ అవుటాఫ్ డేంజర్ ఫ్రం ది పెస్ట్ దట్ హాజ్ బాదర్డ్ యు ఫర్ ఎ డికేడ్. అయాం 99 పర్సెంట్ ష్యూర్ అబవుట్ వాట్ హాపెన్డ్ టు మై ఫాదర్,” అన్నాడు హమీర్.

“స్పెషల్ యియర్ ఇండీడ్! ఐ హావ్ టు గో నౌ, సురయా పిల్లల్ని స్విమ్మింగ్ పూల్‌కి తీసుకుపోవాలి,” అని అమాని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.

బార్లోకి వచ్చినప్పుడు అతని మొహాన్ని చూసి ఎవరూ ఏమిటని అతణ్ణి అడగలేదు. అతను కూర్చున్న తరువాత, మీనా జరిగి అతని భుజానికి తలని ఆనించి కూర్చుంది.

***

బౌల్డర్లో వున్న గవర్నమెంట్ ఏజెన్సీలో ఒక వేకెన్సీ వస్తే హమీర్ ఆ ఉద్యోగానికి అప్లైచేసి ఆర్నెల్ల తరువాత అక్కడికి మారి మీనాని చేరాడు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో అప్పటికే పరిచయమున్న సైంటిస్ట్‌ని కలిసి, అక్కడ పార్ట్ టైం మాస్టర్స్ ప్రోగ్రాంలో జాయినయ్యాడు.

హమీర్, మీనా, రావుగారి, మూర్తిగారి కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మారేజీ చేసుకున్నారు. వాళ్లకి ప్రైవసీ నివ్వడం కోసం సరోజగారిని కొంతకాలం మూర్తిగారు వాళ్లు తమవద్దనే వుంచుకున్నారు.

సరోజగారు తన అన్నయ్యగారింట్లో జరిగే శుభకార్యాలకి వెళ్లినప్పుడు తప్ప మిగిలిన సమయమంతా అమెరికాలోనే గడిపారు.

తరువాత హమీర్, మీనా ఐదు బెడ్రూముల ఇల్లు కొన్నా, తను ఇంకా యాభయ్యోపడిలోనే వున్నాడు గనుక తన బతుకు కొంతకాలం తనే బతుకుతానని చెప్పి రావుగారు వున్నవూరు షికాగో నుంచీ కదల్లేదు. షికాగో నుంచీ డెన్వర్ గానీ, బౌల్డర్ గానీ ఎంతో దూరం లేదు గదా అని కూడా అన్నారు. ఆయన ఆలోచనల అంతరార్థం కొంతకాలానికి మిగిలినవాళ్లకి తెల్సిసింది – తన కంపానియన్‌ని ఆయన మూర్తిగారింటికి ఆయన బర్త్‌డే పార్టీకి – అదే, క్రిస్మస్ పార్టీకి – తీసుకువచ్చి పరిచయం చేసినప్పుడు.

**** (*) ****