ఎడిటర్స్ పిక్

సీరియల్ కిల్లర్లు – చదువరి

ఫిబ్రవరి 2017

రాజకీయ వ్యంగ్యానికీ సరదా సంభాషణలకీ మారుపేరుగా నిలిచిన చదువరి బ్లాగ్ ని చదవని తెలుగు బ్లాగర్లు చాలా అరుదుగా ఉంటారేమో. ఈ బ్లాగు సొంతదారు శిరీష్ కుమార్ తుమ్మల. ఈయన రాతల్లో తెలుగు భాషాభిమానం, ఆహ్లాదమైన వచనం, సామాజిక వాతావరణం పట్ల సునిశితమైన గమనింపు కనిపిస్తాయి. శిరీష్ గారు పొద్దు పత్రికలో రాసిన “సీరియల్ కిల్లర్లు” హాస్యకథ ఈ నెల ఎడిటర్స్ పిక్.

***

సీరియల్ కిల్లర్లు

సాయంకాలమైంది.

ఈసురోమంటూ, బండీడ్చుకుంటూ అంకులు షాపుకు చేరాను. నా కోసమే ఎదురుచూస్తున్నట్టు కూచ్చున్నాడు వాడు. అంకులంటే నిజంగా అంకులు కాదు.. అంకినీడు వాడి పేరు. ఎవరినీ పేరు పెట్టి పిలిచే అలవాటు లేని చదువుకునే రోజుల్లో వాడికా పేరు పెట్టాం. ప్రస్తుతం వాడీ కంప్యూటరు హార్డువేరు కొట్టు పెట్టుకుని బతుకెళ్ళదీస్తున్నాడు.

“ఏరా మందేద్దామా” అన్నాడు నేను వెళ్లగానే.

టీవీ సీరియళ్ళు చూసీ చూసీ చిరాకొచ్చేసిందో, మందేసి చానా రోజులైందోగానీ.. సరే, పద అన్నాన్నేను.

‘ఉండాగు తమ్ముడొస్తాడేమో చూద్దాం’ అన్నాడు. మేం ముగ్గురం దాదాపు రోజూ కలుస్తూనే ఉంటాం.

ఇలా అంకులు అంటూండగానే అలా తమ్ముడొచ్చాడు. తమ్ముడు ఎర్రగా, పొట్టిగా, సన్నగా ఉంటాడు. వీడి అసలు పేరు సుధాకరు. ఎరిగిన వాళ్ళందరూ తమ్ముడనే పిలుస్తారు. ఎరగని వాళ్ళక్కూడా వాణ్ణి చూస్తే తమ్ముడనే అనాలనిపిస్తుంది. అంటారు కూడాను. కానీ, వాడికి మాత్రం ఆ మాటంటేనే అసహ్యం. వాడు జీవితంలో అన్నిటికంటే ఎక్కువ అసహ్యించుకునేది “తమ్ముడు” అనే మాటనే -టీవీ సీరియళ్ళ కంటే కూడా. దానిక్కాస్త ఫ్లాష్‌బ్యాకుంది.

కాలేజీలో ఉండగా మా అందరి కామన్ కలల రాణి తనూజ వీణ్ణోరోజు “తమ్ముడూ, మా క్లాసురూములో నా మినీడ్రాఫ్టరు మర్చిపోయాను తెచ్చిపెడతావూ” అని అడిగింది. ఆ రాత్రి మొదటిసారి వాడు ఆత్మహత్య చేసుకోబోతే మేం అడ్డం పడ్డాం. ఇక ఆ రోజు నుండి వాణ్ణి మేం తమ్ముడనే పిలిచే వాళ్ళం. (కొందరు బామ్మర్ది అనీ పిలిచేవారులెండి.) సామ దాన భేద దండోపాయాలన్నీ వాడినా గానీ, వాడు మా చేత ఆ పిలుపు మానిపించలేక పోయాడు. చివరికి సంధి చేసుకున్నాడు.. మేం నలుగురమూ (వాడూ మరో ముగ్గురం కలిసి ఒక గదిలో ఉండేవాళ్ళం) ఉన్నప్పుడు తప్ప మరెప్పుడూ వాణ్ణి అలా పిలవకూడదు అని. పాపమని ఒప్పేసుకున్నాం. కానీ పాటించిన పాపాన పోలేదెప్పుడూ!

అయితే త్వరలోనే వాడు మరో రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాల్సి వచ్చింది.. ఓ ఆదివారం చుట్టుపక్కల జనాభాను పోగుచేసి క్రికెట్టు ఆడుతున్నాం. తమ్ముడు మాంఛి స్వింగులో ఉన్నాడు. స్వింగు బౌలింగుతో అల్లల్లాడిస్తున్నాడు.. బ్యాటింగు చేస్తున్న మా ఇంటి ఓనరు రెండో కొడుకు ‘తమ్ముడన్నయ్యా! కాస్త మెల్లగా బౌలింగు చెయ్యవా, ప్లీజ్!’ అని ప్రార్థించాడు. వాడి వేడుకోలుకు వీడు కరుణిస్తాడేమో అనుకున్నాం గానీ వీడు ఏకంగా నీరుగారి పోయాడు. అది మొదటిసారి. ఆ తరవాత నాల్రోజులకనుకుంటా.. మా పనిమనిషి “తమ్ముడుసారూ, రేపు పనికి రానండీ” అని చెప్పింది. అది రెండోసారి. ఆ రెండు సార్లూ వాడి ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపేసిన మేం, చిట్టచివరి హెచ్చరిక జారీ చేసాం.. ఈసారి అలా అడ్డంపడము అని. ఇక ఆ తరవాత వాడూ ఆ ప్రయత్నం చెయ్యలేదు. కాబట్టే.. ఇదుగో, ఇప్పుడిలా మా ఎదుట వగరుస్తూ నిలబడ్డాడు.

స్కూటరు స్టాండేసి, జేబుగుడ్దతో మొహం తుడుచుకుంటూ, “ఛిచ్ఛీ, ఎదవ బతుకైపోయిందిరా” అన్నాడు.

నిరంతరం ఎవడో ఒకణ్ణి తిట్టడమో, తన్నుతాను తిట్టుకోడమో వాడి అలవాటు. అంచేత, మేం పెద్దగా పట్టించుకోలేదు. చీమ కుట్టడమో, ఈదురుగాలికి జుట్టు రేగిపోవడమో లాంటి బీభత్సం జరిగుంటుంది లెమ్మని అనుకున్నాన్నేను. ఎలాగూ వాడే చెబుతాడుగదా అని మాట్లాడకుండా అలాగే చూస్తున్నాం. వాడు మాకు చెప్పిందిదీ.. ఎస్సార్ నగర్ లైట్ల దగ్గర ఆగినపుడు వెనకనున్న ఆటోవాడు తల బయటకు పెట్టి ‘తమ్ముడూ రెడ్ లైటు పడింది కదా.. మరి ఆగావేంటి? పోదాం పద, లేదా స్కూటరు కాస్త పక్కకు తియ్యి, నేను పోతా’ అని అన్నాడట. ఆటోవాడు కూడా ’తమ్ముడ’న్నాడని వాడి బాధ. అంకినీడుకీ ఆ సంగతి అర్థమైంది. కానీ అర్థం కానట్టు నటిస్తూ, తమ్ముడి బాధను ఇంకా ఎగదోస్తూ.. “ఇందులో కొత్తేముందిరా తమ్ముడూ? ఈ ఆటో వాళ్ళంతా అంతేగదా, కాస్త ఆగి, గ్రీను పడ్డాక ఎల్దామనుకోరు, రెడ్డున్నపుడే అడ్డంగా పోదామని చూస్తారు” అని అన్నాడు, నవ్వాపుకుంటూ.

“నువ్వు నోరుముయ్యి, నా ఏడుపు అది కాదని నీకు తెలుసు, అసలు మీ మూలానే కదూ ఇది జరిగింది. చూడు.. ఆటోవాళ్ళకు కూడా తెలిసిపోయింది నా పేరు.” అని పెద్దగా అరిచాడు. నేను వాడి భుజం మీద చెయ్యేసి, దగ్గరగా లాక్కుని, అనునయంగా నిమిరాను. వాడు మెత్తబడి మెల్లగా, డగ్గుత్తికతో “ఈ తమ్ముడు అనే మాట వింటేనే విరక్తి కలుగుతోందిరా. చివరికి మా ఆవిడ, బుడ్డాడు కూడా అలాగే పిలుస్తారేమోనని హడిలిపోతున్నాన్రా, సూరిగా” అని అన్నాడు. నేను వాణ్ణి మరింత పొదవుకోని, సాధ్యమైనంత మృదువైన గొంతుతో “పోనీలేరా తమ్ముడూ, కష్టాలు మనిషిగ్గాక మానుకొస్తాయా” అని సముదాయించబోయాను. వాడు నన్ను విదిలించుకోని, నావంక ఓ సారి వైరాగ్యపు చూపు చూసి, మళ్ళీ “ఛిచ్ఛీ ఎదవ బతుకు, నే బోతా” అని స్కూటరు స్టార్టు చెయ్యబోగా మేమిద్దరం వాడికడ్డం పడి, తీసుకుపోయి అంకినీడు కార్లో కూలేసి, నేరుగా తీసుకుపోయి బార్లో కూలేసాం.

బార్లో..

ఒక వారగా ఉన్న ఓ టేబులు దగ్గర కూర్చున్నాం. తాగడానికో రకం, తిండానికో రెండు రకాలు చెప్పాం.

పక్క టేబులు దగ్గర ఇద్దరు కూచ్చుని ఉన్నారు. చెయ్యి జాచితే అందేటంత దూరంలో ఉంది, ఆ టేబులు. వాళ్ళ మాటలు చక్కగా వినబడుతున్నాయి. ఇద్దరినీ పరీక్షగా చూసాను. అ గుడ్డెలుతురులో నాక్కనబడిందిదీ.. నేను కూచ్చున్న వరుసలోనే కూచ్చున్నవాడు ఏదో చెబుతున్నాడు. ఎదురుగా ఉన్నవాడు వింటున్నాడు. చెప్పేవాడి మొహం చాలా దయనీయంగా ఉంది. మొహం కంటే కూడా వాడి మాటను బట్టే అతడు దయనీయంగా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పుడో ఇంకాస్సేపటిలోనో ఏడ్చేటట్లే ఉన్నాడు. వినేవాడు ఏదో హారర్ సినిమా చూస్తున్నట్టుగా మొహం పెట్టాడు. కళ్ళు పెద్దవి చేసి, ముక్కులు పొంగించి దయనీయుడి వంకే చూస్తున్నాడు.

పొద్దు

పొద్దు

హారరుడు అంటున్నాడు.. “అలా అయితే ఆపేసెయ్యకపోయావా?”.

ఈలోగా మందొచ్చింది. మావాళ్ళు ఛీర్స్ చెప్పి మొదలెట్టేసారు. నేనూ అందుకుని కొద్దిగా చప్పరించాను. తమ్ముడేదో అంటున్నాడు. అది వినేలోగా దయనీయుడి మాట వినబడింది..

“అదీ అనుకున్నారా.., కానీ మా ఆవిడ ఊరుకోనంటోంది” అని అన్నాడు.
హారరుడు “ఊరుకోక ఏంచేస్తుందట?” అన్నాడు
“విడాకులిస్తానంటోంది.”
“ఈ మాత్రానికే విడాకులా?” అని ఆశ్చర్యపోయాడు హారరుడు.
“ఏం చెప్పమంటావురా, అలా తయారయింది నా పరిస్థితి” అని, తలపట్టుకున్నాడు దయనీయుడు.

ఆ సంభాషణకు తలా తోకా దొరకలేదు గానీ ఆసక్తికరంగా ఉంది. అయితే నాకివి అలవాటే. కుస్తీ పట్టైనా సరే.. పజిల్ను సాల్వు చెయ్యడమంటే సరదా నాకు. వాళ్ళ సంభాషణ కొనసాగింది..

“మరి, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు?”
“అది అర్థం కాకే కదా నీకు మందు పోయిస్తోంది.”
“పోనీ ఆపకు. ఆపాల్సిన అవసరం ఏంటసలు?”
“మళ్ళీ అదేమాట అంటావేంట్రా.. ఎంత వత్తిడి వస్తోందో చెబుతున్నా కదా!”

బారంతా సిగరెట్టు పొగతోటీ, జనం కబుర్లతోటీ నిండిపోయింది. ముందే వెలుతురు తక్కువ.. దానికి తోడు ఈ పొగ కూడా కలిసి ఆ హాలంతా అప్సష్టంగా ఉంది. వీళ్ళిద్దరూ మాట్టాడుకునే విషయం అంతకంటే అస్పష్టంగా ఉంది. అదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో పెరిగింది. దయనీయుడు ఇంకా అంటున్నాడు..

“ఇప్పటికే హెచ్చరిస్తూ 16 ఫోనులొచ్చాయి”
“ఎహె! ఎవరో బెదిరించి ఉంటారు లేరా, ఈ మాత్రానికే భయపడితే ఎలా”
“మొదట నేనూ బెదరలేదురా. కానీ మానవహక్కుల కమిషనుకు రాసి నాకు ఉరిశిక్ష వేయిస్తామంటున్నార్రా ”
“మానవ హక్కుల కమిషనా? అదేంటి? ఎక్కడుందది?”
“…”

“మనూళ్ళోనే ఉందండి, రిటైర్డు జడ్జి దానికి చైర్మను” అప్రయత్నంగా నేను వాళ్ళ సంభాషణలోకి జొరబడిపోయాను.
“థాంక్సండి, మరి వాళ్ళు నాకు ఉరేస్తారంటారా?” అని దయనీయుడు నన్నడిగాడు.
“అసలు మీరు చేసిన తప్పేంటి?” అని అడుగుతూ మరింతగా కలగజేసుకున్నాను.

అతడు అటూ ఇటూ చూసి, దగ్గర్లో వినేవారు ఎవరూ లేరని నిర్ధారించుకుని కొద్దిగా ఇసుంటా జరిగి, నా జబ్బ పట్టుకుని నన్ను కాస్త అసుంటా లాక్కోని, నా చెవిలో.. “మీరు రైలుపట్టాలు చూస్తారా?” అని అడిగాడు.
“పద్దాక చూడను గానీ, ఎప్పుడన్నా ఊరికెళ్ళేటపుడు స్టేషనులో చూస్తాను” అని చెప్పాను.
నన్నో పిచ్చి వెధవను చూసినట్టు చూసి, “ఆ పట్టాలు కాదు సార్, రైలుపట్టాలు.. రైలుపట్టాలు సీరియల్” అన్నాడు.

“ఓ అదా, వెగటు చానల్లో వచ్చే జిగట సీరియలా, నే జూణ్ణు” అన్నాను పళ్ళు కొరుకుతూ.

ఇప్పుడు ఈ దయనీయుడి సంగతంతా అర్థమై పోయింది నాకు. వీడు కూడా రైలుపట్టాల బాధితుడే, ఆ సీరియలంటే భయమేసి, ఇంటికెళ్ళకుండా ఈ బారులో దూరి కాలం గడిపేస్తున్నాడన్నమాట గురుడు! సీరియలు పెట్టొద్దంటే వాళ్ళావిడ ’రాజీనామా’ ఇస్తానంటోంది అని తెలుస్తూనే ఉంది. అతగాణ్ణి వెంటనే ఓదార్చాలని అనిపించింది.

“పర్లేదులెండి, మీరు కాస్త శాంతపడండి, ఏదో ఒకరోజున ఆ డైరెక్టరుకు గుండెపోటొచ్చి చావకపోడు. లేదా ఎవడో ఒకడు వాణ్ణి లేపెయ్యకపోడు. అప్పుడు మనందరం జాలీగా మందెయ్యొచ్చు.” అని అన్నాను.

అప్పటిదాకా నా జబ్బుచ్చుకు కూచ్చున్నవాడల్లా ఏదో పామును పట్టుకున్నవాడిలాగా ఒక్కసారిగా వదిలేసి, వెనక్కు జరిగిపోయాడు. అటుదిరిగి ఏదో గొణుక్కుంటున్నాడు.

ఇంతలో హారరుడు నాతో, “మీరనే ఆ డైరెక్టరు వీడే సార్” అని అన్నాడు.

నేను తేరుకునేలోగానే దయనీయుడు నావైపు దిరిగి, చేతులు జోడించి, “సార్, నేను సీరియలును ఆపేద్దామనే అనుకుంటున్నానండి, కాని ఆ సీరియల్లోని నటులు, చానెలు వాళ్ళూ ఒప్పుకోడం లేదండి. ఆపితే ప్రాణాలు తీస్తామంటున్నారు. చివరికి మా ఆవిడ కూడా ఒద్దంటోంది.. ఆపేస్తే నాకు విడాకులిచ్చేస్తానంటోంది.” అనేసి వలవలా ఏడవడం మొదలెట్టాడు.

సీరియల్ కిల్లర్లుమావాళ్ళిద్దరు కూడా ఈ సంభాషణలో లీనమైపోయారు ఎప్పుడో. ఆ టేబులుకు దగ్గరగా జరిగి కాస్త ముందుకు వంగి దయనీయుణ్ణే చూస్తున్నారు. ఇప్పుడో ఇంకాసేపట్లోనో ఎదటోడి మీద పడటానికి సిద్ధమౌతున్న వస్తాదుల లాగా చూస్తున్నారు. వాడెవడో తెలిసిపోయాక వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టయింది మాకు మరి.

దయనీయుడు మమ్మల్ని గమనించినట్టున్నాడు. మా ఉద్దేశాలు కూడా చూచాయగా గ్రహించినట్టు ఉన్నాడు. వెంటనే సంధి చేసుకుంటే మంచిదని రంగంలోక దిగాడు. ఏడుపాపి, అంకినీడు వైపు తిరిగి, “అదికాదు తమ్ముడూ, సీరియలు ఆపకపోతే నన్ను మానవ..”

తమ్ముడు అనేమాట అంకినీడును బైపాసు చేసి, సూటిగా పోయి ఒరిజినల్ తమ్ముడి గుండెలో నాటుకుంది. వాడు వెన్వెంటనే స్పందించాడు..

“ఎవడ్రా నీకు తమ్ముడు? నేను నీకు తమ్ముణ్ణంటరా? నా తాత వయసుంది నీకు, నేన్నీకు తమ్ముణ్ణా?” అంటూ లేచి ఊగిపోతూ వీరంగం మొదలెట్టాడు తమ్ముడు. అప్పటికే మూడు గుండ్రాలు అయినట్టున్నాయి, మావాడికి పట్టపగ్గాలు లేవు. పైగా ఈ దయనీయుడు టీవీ సీరియలు దర్శకుడని తెలిసాక, ఇక వాడికి ఇసుమంత గౌరవం కూడా ఇవ్వనక్కరలేదని తెలిసిపోయిందాయెను!

తమ్ముడి ధాటికి మేమే నిశ్చేష్టులమైపోయాం.. ఇహ దయనీయుడి సంగతి చెప్పేందుకేముంది!

మా వాడికి జీవితంలో అన్నిటికంటే అసహ్యకరమైనది తమ్ముడు అనే మాట అని చెప్పాను కదా.. రెండో అసహ్యకరమైన మాట డైలీ సీరియళ్ళు. పాపమీ దయనీయుడు మొదటి రెండు అసహ్యాలనూ కెలికాడు. ఇహ ఈ దర్శకుడి పని ఐపోయిందనే అనుకున్నాను. నేను తేరుకుని, వాణ్ణి సమాధానపరుస్తూ, ‘తమ్ముడని మాటవరసకే గదా అన్నాడు, పైగా ఆ అన్నది కూడా నిన్నుగాదు.. అంకినీణ్ణి’ అని చెప్పి ఊరుకోబెట్టి, దయనీయుడి దయనీయ పరిస్థితిని వాడికి వివరించాను.

నేను ఇలా అంటూండగానే తమ్ముడు -ఆ మధ్య సీరియళ్ళ గురించి మేం మాట్లాడుకున్న సంగతులను గుర్తు చేసుకున్నాడు.”అవునొరే అంకులూ, మన భాస్కరు గాడి చేత అరెస్టు చేయించి, ఎన్‌కౌంటరులో చంపించేద్దామనుకున్నామూ.., ఈణ్ణేగదూ!” అని అన్నాడు.

అదిరిపడ్డాడు దయనీయుడు.

అంకినీడుక్కూడా అది గుర్తొచ్చి మాంచి కిక్కిచ్చింది. “కాదు కాదురా.. నే జెబుతానుండు” అంటూ గొంతు సవరించుకుని, గ్లాసెత్తి ఓ గుక్క వేసుకుని సిగరెట్టు వెలిగించుకున్నాడు.

దయనీయుడు ఎంతో ఉత్కంఠతో అంకినీడు వంకే చూస్తున్నాడు. హత్యానేర విచారణలో వాదోపవాదాలన్నీ అయ్యాక, తీర్పు కోసం జడ్జి వంక చూసే ముద్దాయి చూపది.. వాణ్ణి చూస్తూంటే నాకూ భలే సర్దాగా ఉంది.

తృప్తిగా ఓ దమ్ము లాగి, తీరుబడిగా వెనక్కి జారగిలబడి, కాళ్ళు జాపుకుని అంకులిలా అన్నాడు “..అలా చేద్దామని అనుకున్నది ఆ కథ రాసినాణ్ణి, అందులోని లేడీ విలన్నీ! ఈణ్ణి కాదు.”

దయనీయుడి మొహంలో ఓ సాంత్వన, గొంతులో చిన్న నిట్టూర్పు.

అంకులు అక్కడితో ఆపలేదు. ఓ క్షణం ఆగి ఇలా అన్నాడు.. “ఈణ్ణి ఏం చేద్దామని అనుకున్నామంటే.. అరెస్టు చెయ్యకుండానే, స్టేషనులోనే పడేసి, అన్నం నీళ్ళు పెట్టకుండా, మొత్తం ఎన్ని ఎపిసోడ్లు తీసాడో అన్ని సార్లు లాఠీచార్జీ చేసి, ఈడు సచ్చాక, తుపాకీతో కాల్చేసి, అపైన ఉరేసి, ఆ తరవాత మురిక్కాలవలో పారేయిద్దామనుకున్నాం” అని అన్నాడు.

“ఔనౌను నిజమేరోయ్, ఇప్పుడు గుర్తొచ్చింది” తమ్ముడు ఊపులోకి వచ్చేసాడు. “నీకు భలే గుర్తురా అంకులూ” ఆరాధనా భావంతో అన్నాడు. దయనీయుడు ఇప్పుడో ఇంకాసేపుట్లోనో స్పృహ తప్పేవాడి లాగా కనబడ్డాడు.

“అదిసరే. సూరిగా! మానవ హక్కుల సంఘమంటాడేం దీడు? దానికీ సీరియళ్ళకీ సంబంధం ఏంటి?” అన్నాడు అంకులు. అంకులడిగిన ప్రశ్నతో దయనీయుడిపై నుంచి చూపు తిప్పుకోక తప్పింది కాదు నాకు.

“ఏంలేదురా, పోలీసులు జనమ్మీద కాల్పుల్లాంటివి జరిపినపుడు అవి మానవ హింస కిందకు వస్తాయి కదా, వాటిని నేరాలుగా భావించి ఈ కమిషను కేసులు పెట్టి విచారిస్తుందన్నమాట.” అన్నాను.

“ఓహో, ఆఫ్టరాల్ పోలీసు కాల్పులకే విచారణలు జరగ్గా లేంది, ఈ సీరియల్ కిల్లర్లను కోర్టులకీడవ లేకపోవడమేంటి! ఏరా తమ్ముడూ?” అన్నాడు అంకులు.

“ఎబ్బే.. లాభం లేదురా! ఈ కోర్టులు మరీ సున్నితంగా ఉంటాయి. మహా అయితే పదేళ్ళ జైలు శిక్షో, యావజ్జీవమో వేస్తాయి. ఇలాంటి ఘోరమైన సీరియల్ కిల్లర్లకు ఖచ్చితంగా ఉరి వేస్తారనుకో! కానీ, వీళ్ళకు ఉరి కూడా చిన్న శిక్షేరా. పైగా ఏ రాష్ట్రపతో మధ్యలో అడ్డం పడి శిక్ష తప్పించినా తప్పించొచ్చు. వీళ్ళకల్లా మనమనుకున్నదే రైటు!” అన్నాడు తమ్ముడు.

దయనీయుడు లేచి నుంచున్నాడు, మళ్ళీ కూచ్చున్నాడు. అటువైపు తిరిగాడు, మళ్ళీ ఇటు తిరిగాడు. హారరుడి చేతులు పట్టుకున్నాడు, వదిలేసాడు. నన్ను చూసి, లేచి నుంచున్నాడు, తిరిగి కూచ్చున్నాడు. ఏమనుకున్నాడో కుర్చీని నా వైపు జరుపుకున్నాడు. గొంతులోనుండి అదో రకమైన శబ్దం, గురకలాగా. పూడుకుపోతున్న గొంతును పెకలించుకుంటూ.. “సార్, సీరియలును ఆపేసే మార్గం లేకగానీ, లేదంటే ఎప్పుడో ఆపేసి ఉండేవాణ్ణి సార్! ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడా ఎవడైనా? మీరే ఆలోచించండి సార్” అని దీనంగా మొహం పెట్టాడు.

ఈసారి హారరుడు కూడా తన కుర్చీని మా టేబులుకు దగ్గరగా జరుపుకుని మా ముగ్గురినీ ఉద్దేశించి “అయ్యా మావాణ్ణి చూసారు కదా ఎలా వణికి పోతున్నాడో. వాడి మీద దయదలచండి. పోనీ, ఆ సీరియలును ఆపించే మార్గమేదో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి, వెంటనే ఆపేస్తాడు” అని అన్నాడు

ఓ ఘోరకలిని ఆపే అవకాశం వచ్చినందుకు దాన్ని సద్వినియోగ పరచుకోవాలనిపించింది మాకు. తమ్ముడు కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు..

“ఈ మధ్య జన్మ నక్షత్రాన్ని బట్టి రత్నాలు, వజ్రాలు పెట్టుకోమనే కార్యక్రమం ఒకటొస్తోంది, చూసావా?”
“అవును, చవట చానల్లో వస్తోంది కదా..చూస్తూంటాన్సార్”
“వాడి చేత.. ‘రైలుపట్టాలు సీరియల్లో నటిస్తే ఎవరైనా సరే మటాషై పోతారు. అలా పోకుండా ఉండాలంటే మా వద్ద మాత్రమే దొరికే కోటి రూపాయల విలువైన వజ్రపుటుంగరం పెట్టుకుంటే ఏం కాదు’, అని చెప్పించు. గాలి జనార్దనరెడ్డి తప్ప మరొకడు, కోట్లు పెట్టి ఉంగరం కొనుక్కో(లే)డు కాబట్టి, మీవాళ్ళు సీరియల్లో నటించడం మానేస్తారు” అని అన్నాడు.

ఇంకేముంది, ఆ డైరెక్టరు మావాడి కాళ్ళ మీద పడిపోయి “మంచి ఐడియా సార్. అలాగే చేస్తాను సార్. ఇది వర్కౌటయ్యేటట్టే ఉంది సార్. ఉంటాన్సార్. వస్తాన్సార్” అని అనుకుంటూ హారరుడితో కలిసి హడావుడిగా వెళ్ళిపోయాడు.

అంకులు ఏదో అంటున్నాడు. నాకదేం వినబడ్డం లేదు. త్వరలో ఈ సీరియల్ ఆగిపోద్ది గదా అనే ఆలోచన నాకు మత్తెక్కిస్తోంది.

**** (*) ****

First published in poddu.net on 2012, January 25. (Original URL)
శిరీష్ గారి బ్లాగ్: http://chaduvari.blogspot.in/