“మన రామారావు సంగతి విన్నావా?”
“ఏం చేశాడు?”
“వాడు చెయ్యలా. వాడికే – ”
“చేతబడా?”
“నా చిన్నప్పుడు ఒక కాంపౌండర్ ప్రాక్టీసు పెట్టి వచ్చిన రోగు లందరికీ ఒకే రంగు నీళ్లిచ్చేవాట్ట. అలాగే, కళ్లు తిరుగుతున్నాయన్నా, కాలు నెప్పి పుడుతోందన్నా చేతబడే అనేలా వున్నావు!”
“కాదు అని ఖచ్చితంగా నువ్వు అనలేదు గనుక, మిగతా వివరాలు చెప్పు.”
“ఏవో పిచ్చి చూపులు చూస్తూంటాడు లేకపోతే నవ్వుతుంటాడు. ఆఫీసు కెళ్లడం మానేశాడని వేరే చెప్పక్కర్లేదు గదా! వాణ్ణి చూసిన వాళ్లెవరూ గాలి సోకిందనో, విషప్పురుగు కుట్టిందనో ఏదో ఒకటి అనకుండా వుండట్లేదుట. ఇప్పుడు నువ్వు చేతబడిని కూడా ఆ లిస్టులో చేర్చావ్. వాడి అదృష్టమల్లా, పిల్లలందరికీ పెళ్లిళ్లవడం.”
“మనుషులని గుర్తుపడుతున్నాడా?”
“చెప్పడం కష్టం. నలభయ్యేళ్ల నించీ తెలిసినవాణ్ణి కదా, అయినా, గుర్తుపట్టినట్టేమీ కనిపించలా. నన్నే గాదు, ఒకవేళ వాడికి ట్విన్ వుండున్నా వాణ్ణి గుర్తుపట్టే స్థితిలో లేడు. వాళ్లావిడ గుడ్లనీరు కుక్కుకోవడం తప్ప ఏం చెయ్యలేకపోతోంది.”
“ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరివల్లో ఏమయినా తెలిసిందా? కనీసం ఐడియా అయినా వుందా?”
” ఆ ప్రశ్న లన్నింటికీ జవాబులు నా దగ్గర లేవు గానీ – చేతబడి అని ఎవరూ అనుకోవడంలే దింతవరకూ. తెలిసింది మాత్రం, వాడొక రోజున ఆఫీసులో ఒక ఉత్తరాన్ని మొహమ్మీద పులుముకుంటూ పెద్దగా నవ్వుతుంటే ఇదేదో మామూలుగా అప్పుడప్పుడూ వాళ్ల పత్రికకొచ్చే రచనలని చదివిన తరువాత కలిగే టెంపరరీ ఇన్‌శానిటీలే, కాసేపటికే పోతుంది అనుకున్నార్ట గానీ, వాడు మామూలు మనిషయ్యే అవకాశం కనపడకపోయేసరికి వీడి సబ్ ఎడిటర్‌కి భయమేసి వీణ్ణి ఇంటికి చేర్చాట్ట. అతనే అప్పటికే నలిగిపోయి వున్న ఆ ఉత్తరాన్ని కూడా ఆవిడ కిచ్చాట్ట, దాన్ని చూస్తే నన్నా కారణం తెలుస్తుందేమోనని. ఆవిడ కర్థం కాలేదు గానీ, రెండ్రోజుల తరువాత వాళ్లింటికి చూడడానికి వెళ్లినప్పుడు ఆవిడ నాకు ఆ కాగితాన్ని చూపించి, ఈ ఉత్తరం చదివి ఇలా అయిపోయుంటారా అన్నయ్య గారూ? అనడిగింది.”
“ఏమని వున్న దందులో?”
“ఫోన్లో ఫొటో ఎక్కించాను. నువ్వే చూడు.”
“… దీన్ని బట్టీ మాత్రమే వాడెందుకలా అయ్యాడో అర్థం కావడంలేదు. దీనికి ముందేం జరిగిందో ఏమయినా అయిడియా వున్నదా?”
“నాకూ ఆ విషయమే తెలుసుకోవా లనిపించి ఆ సబ్ ఎడిటర్‌కి ఫోన్ చేసి అడిగాను – ఇంతకు ముందు దీనికి సంబంధించిన విశేషా లేమిటి అని. ‘ఏమిటో నండీ! పాపం, ఆయన వచ్చిన ప్రతీ కథా, ప్రతీ ఉత్తరమూ ముందు తనే చదివి, చెత్తబుట్ట దాఖలా చెయ్యనివాటిని మాకిచ్చేవారు. ఇప్పుడు మాకు పనెక్కు వవడమే కాకుండా వాటిల్లో కొన్ని చదివిన తరువాత ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా పోతోంది. ఆయనకి ఎలాగయినా త్వరలో బాగయ్యేలా చూడండి సార్!,’ అని వాళ్ల పత్రిక సంచికలలోంచి కొన్ని పేజీలు కట్ చేసి ఇచ్చాడు. అవి కూడా ఫోన్లో వున్నాయ్. ఇదిగో, చూడు.”
***
“ఉత్తర రత్న,” ఆగస్ట్ 2
తెలుగు రత్న పత్రికకు -
మీ పాదసేవా చరణదాసి. కింద భవదీయుడు అని నాపేరు రాసిన తరువాత అంతా కథే. మీ పత్రిక దీన్ని వేసుకుంటే మీ స్థాయి పెరుగుతుందని మా బామ్మ. నేను మాత్రం నా పేరు అచ్చులో చూసుకుంటే చాలని నేను. అచ్చువెయ్యడానికి ఖర్చవుతుందంటాడు మా బామ్మ. దీనిలో ఒక వంద కాగితం వుంది చూడండి. కథపేరు కోడి కూయక ముందే ఇల్లలకడం మొదలవుతుంది మా బామ్మ.
భవదీయుడు.
***
“ఉత్తర రత్న,” ఆగస్ట్ 16 -
ఆగస్ట్ 2 “తెలుగు రత్న” సంచికలో అన్ని కథలూ, సీరియల్సూ, కార్టూన్లూ ఎప్పటిలాగే బావున్నాయి. “కోడి కూయకముందే ఇల్లలుకుతుంది మా బామ్మ” మమ్మల్ని ఆనందడోలికల్లో ఊగించింది.
కె.వి. సుబ్బారావు, సుజాత, పాలంకి
-
తెలుగు పత్రికల స్థాయి పడిపోతున్నా ఇన్నాళ్లూ కనీసం “తెలుగు రత్న” తెలుగుభాషకి చిన్నదయినా ఒక పీట వేస్తోందని అనుకున్నాను. ఆయనెవరో (లేక ఆవిడా?) మీకు నిజంగా వందరూపాయల కాగితాన్ని ఆ ఉత్తరంతో పంబించారని నమ్మమంటారా? క్రియ లేకపోవడంవల్ల మొదటి వాక్యం అసంపూర్ణం. కథ పేరులో “మొదలవుతుంది”కి బదులుగా “మొదలుపెడుతుంది” అని మారిస్తే తప్పితే ఆ వాక్యం అర్థవంత మవదు. మొదటి పేరాలో మూడవ పదాన్నిబట్టీ ఆ ఉత్తరాన్ని రాసింది స్త్రీ అయ్యుండాలనిపిస్తోంది. మరి, చివర్లోనేమో భవదీయుడు అని వుంది. మీ పాఠకలోకానికి బుర్ర లుంటా యనడానికి ఈ ఉత్తరమే తిరుగులేని ఋజువు. ధైర్య ముంటే ప్రచురించండి.
సి. రామారావు, వరంగల్లు.
-
ప్రియమైన “తెలుగు రత్న” సంపాదకులకు -
మా ప్రియమైన “తెలుగు రత్న” పత్రికలో నా ఉత్తరం అచ్చయినందుకు సంతోషించాలో లేక నా పేరుని అచ్చులో చూసుకోలేనందుకు విచారించాలో అర్థంకాని పరిస్థితి. నా స్నేహితుడికి అచ్చయిన నా ఉత్తరాన్ని చూపిస్తే నా కథ పేరులో “మొదలవుతుంది”కి బదులుగా “మొదలుపెడుతుంది” అని మారిస్తే సరిపోతుందన్నాడు. బహుశా కథపేరు సరిగ్గా లేనందువల్ల దాన్ని అచ్చువేసి వుండరు. ఈ సవరణతో ఆ అవరోధం తొలగిపోతుం దనుకుంటున్నాను. ఎందుకయినా మంచిదని వాడిచేత ఈ ఉత్తరాన్ని సవరించి పంపుతున్నాను.
భవదీయుడు.
ఏ.వి.వి.యస్.సి. రావు
(రావుగారు తన ఉత్తరాన్ని గుర్తుపట్టడం విశేషమే! ఆయన మొదట రాసిన ఉత్తరంలో ఆయన పేరు లేదు. కథ పేరు క్లుప్తంగా వుండాలని వారికి తెలిసినట్లు లేదు. ఇలాంటివి రాయడం సాధ్యమేనా అన్న మా సంపాదకవర్గపు సందేహం నివృత్తయింది. మా పాఠకులకి ఎప్పుడూ కనబడని ఒక లోకాన్ని పరిచయం చేద్దామని ఆగస్ట్ 2 సంచికలో చిన్న ప్రయత్నం చేశాం. అంతే. – సం.)
***
“ఉత్తర రత్న,” ఆగస్ట్ 30
ప్రియమైన సంపాదకులకు,
అచ్చులో నా పేరు చూసి మా బామ్మ ఆనందడోలికలలో తేలిపోయింది, మేఘాలమీద ఊగిపోయింది. కథకు పేరు క్లుప్తంగా వుండాలన్న మీ అభిప్రాయంతో నా స్నేహితుడు ఏకీభవించాడు గానీ, ఈ కథకు పేరు పెట్టడం మాత్రం తనకు వల్లమాలిన పని అని అన్నాడు. అందుకని మీరే ఒక పేరుని నిర్ణయించగలరు.
ఏ.వి.వి.యస్.సి. రావు
(అయ్యా, రావుగారూ! మీ పిల్లలకి మమ్మల్ని పేరు పెట్టమనడం భావ్యం కాదు. మీకు దగ్గర్లో వుండే గ్రంథాలయానికి వెళ్లి అక్కడ ప్రముఖ తెలుగు రచయితల కథలు చదవండి. పేరుకీ కథకీ ఎలాంటి సంబంధం వుండాలో తెలుసుకోండి. – సం.)
***
“ఉత్తర రత్న,” సెప్టెంబర్ 13
ప్రియమైన సంపాదకులకు -
మీ సూచనని పాటిద్దామని మా ఊళ్లో గ్రంథాలయంకోసం వెడితే వున్న ఒక్కటీ ఎప్పుడో మూతపడ్డదని తెలిసింది. ఏలూరుకి వెడితే గానీ తెలుగు పుస్తకాలమ్మే షాపుకూడా కనబడలేదు. అక్కడ వాళ్లు నన్ను ఒక్క పుస్తకాన్ని కూడా నిల్చొని చదవనివ్వలేదు. అందుకని కొన్ని పుస్తకాల టైటిల్స్‌ని మాత్రం ఒక కాగితంమీద ఎక్కించుకోగలిగాను. అక్కడ కూర్చొని బాతాఖానీ కొడుతున్న కొందరు తమకు తెలిసిన కథల పేర్లు చెప్పారు. వాటిని నా స్నేహితుడికి వినిపిస్తే, వాటిని కొంచెం మార్చుకోవచ్చన్నాడు. ఆ సలహాతో క్రింద కొన్ని పేర్లిస్తున్నాను. వాటిల్లో మీకు నచ్చినదాన్ని వాడుకోండి.
కాటేసిన మాలిన్యం, దిగజారిన కాఠిన్యం, ఆరంభం నాకే తెలియదు, ఏడుపుకి నవ్వొచ్చింది, నవ్వుకు ఏడుపొచ్చింది, మండే ఐసుగడ్డలు, మేకప్పు లేని పై కప్పు, వాస్తుల్లేని పస్తులు, పెనం కింది పేలాలు, దొడ్డిదారిన అడ్డ ఆశలు, అనుబంధాలు-ఆవలింతలు, బోణీ చెయ్యని బాణీ, ఆ కాళ్లకు పిక్కల్లేవు, పొడి లేని తడి, మేఘం లేని వర్షం, కంకాళంలో టెంకాయలు, కడ్డీల్లేని ఇడ్లీలు, ఇలాగే ఇంకా బోల్డు పేర్లున్నాయి. వీటిల్లో ఏదీ సరిపోదనుకుంటే చెప్పండి. పంపుతాను.
ఏ.వి.వి.యస్.సి. రావు
(తెలుగు పత్రికలకి పాఠకులే గాక రచయితలు కూడా కరువవుతున్న ఈ రోజుల్లో మా అనుభవాలని పాఠకులతో పంచుకోవడానికి పత్రికాముఖమే ఉత్తమ మార్గమని తలచి రావు గారి ఉత్తరాలని ప్రచురిస్తున్నాం. ఇలాంటి అవకాశం మా ముందు తరాల సంపాదకులని వరించకపోవడం, ఈ సత్కారం మాకే లభించడం మా అదృష్టమని ఏమాత్రం భావించడం లేదు. మా సహాయకవర్గం వచ్చిన కవర్లని తెరిచి వాటిల్లో వున్న రచనల్లోని మొదటి వాక్యాలని చదవడానికే జంకుతున్నారు. కొంతమంది రాబోయే విపత్కర పరిస్థితులని ఎలా ఎదుర్కొనాలో తెలియక పోస్ట్‌మేన్ వస్తున్నాడన్నా, ఈమెయిల్తో జతపరచిన ఎటాచ్‌మెంట్స్‌ని ఓపెన్ చెయ్యాలన్నా గజగజా వణుకుతున్నారు. ఇంకొందరు, వెన్నుకు గన్ను ఆనించడంవల్ల నయినా సరే, ఎవరూ తొక్కని బాటలో అడుగిడుతున్న ఘనత దక్కడం అదృష్టమా లేక దురదృష్టమా అన్న మీమాంస నుండీ బయటపడలేక గిజగిజా తన్నుకుంటున్నారు. ఎందుకంటే, రావుగారు కొత్త తరహా రచనలకి గట్టిగా బాట లేస్తున్నారని మాకొస్తున్న రచనలు నిర్ధారిస్తున్నాయి.
రావుగారూ, మీరు సూచించిన కథల పేర్లలో చాలా నవ్యత కనబరచారు. అయితే, వాటిల్లో మీ కథకు ఏ పేరు వాడాలో మీరే నిర్ణయించుకుని వేరే పత్రికలకు పంపండి. కాండిడేట్ పేర్లు ఇంకా వున్నయ్యన్నారు గనుక పేరుతో మొదలుపెట్టి కథ రాయడంమీద ఫోకస్ చెయ్యచ్చేమో ఆలోచించండి. ఒక్కో పేరుకీ ఒక్కో కథ అల్లడానికి కావలసిన అవకాశాలు పుష్కలంగా వున్నాయి. -సం.)
***
“ఉత్తర రత్న,” సెప్టెంబర్ 27
ప్రియమైన సంపాదకులకు -
నేను ఈ ఉత్తరంతో బాటు కొన్ని కథలని జతపరుస్తున్నాను. మీ సౌకర్యం కోసం ఆ కథలని క్లుప్తంగా ఇక్కడ చెబుతున్నాను.
“కాటేసిన మాలిన్యం” – స్వఛ్ఛభారత్ కోసం నా వంతుగా. మాలిన్యం మీద తిరిగే దోమ కాటుకు కలిగిన చికెన్ గున్యాకు బలైపోయిన ఒక అభాగ్యుని కథ. “కుట్టిన” అనలేదు చూశారా? ఆ అభాగ్యుడు ఆ కాటుకు పూర్తిగా లొంగిపోయేలోగా ఆ దోమమీద ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడో కథని చదివి తెలుసుకోవలసిందే. స్ఫూర్తి దాయకమయిన కథ.
“కాబేజీలూ-ఫ్లవర్‌వేజులూ” – ఇది చాలా వినూత్నమైన అంశం. కాబేజీని మనం వెజిటబుల్ అనుకుంటామా, అదసలు ఒక ఫ్లవర్‌ట – కాలీఫ్లవర్‌లాగానే! పెళ్లికాని ఒక నలభయ్యేళ్లావిడ ఏ ఫ్లవర్‌వేజ్‌లోనూ కాబేజీ పట్టనట్లుగానే తనకు పెళ్లికాదని తెలుసుకునే గుండెలు కరగించే కథ ఇది.
“పంచదార పంచన వంశధార వంచన” – పంచదార హిస్టరీ, దానితోబాటు అది ఈనాడు మనుషులకి బ్లడ్‌షుగర్‌ని వంశపారంపర్యంగా ఎలా పంచుతోందో చెప్పే విజ్ఞానదాయకమైన కథ ఇది.
“రోగానికి జబ్బొచ్చింది” – ఇది సైన్స్ ఫిక్షన్. డైమండ్‌ని కొయ్యడం డైమండ్‌తోనే సాధ్య మవుతుందని గ్రహించి ఆ విధంగానే ఒక రోగాన్ని తగ్గించాలంటే దానికి విరుగుడు ఇంకొక రోగమేనని తెలుసుకున్న సైంటిస్ట్ పరిశోధనల గూర్చిన వివరాలను తెలియజేసే కథ ఇది. కాన్సర్‌కి యాంటీ కాన్సర్, షుగర్‌కి యాంటీ షుగర్, మొదలైన రోగాలని అతను కనిపెడతాడు. “రోగం రోగేణ భక్షితః” అన్న వాక్యంతో ఈ కథ ముగుస్తుంది. (నాకు సంస్కృతం కూడా వచ్చునని పొరబాటుననయినా అనుకోకండి. నా స్నేహితుడి తెలివితేటలు ఇవి.)
“ఇడ్లీల్లో కడ్డీలు” – క్రైం + సైన్స్ ఫిక్షన్ కథ. ఇడ్లీల్లో పెట్టి జైల్లోకి నానో-కడ్డీలని సరఫరా చెయ్యడంవల్ల ఆ కడ్డీలతో చేసిన నిచ్చెననెక్కి పారిపోయిన ఖైదీల కథ ఇది.
“కళ్లాల్లేని పళ్లేలు” – ఫ్లయింగ్ సాసర్ల కథ. అవి ప్రజలని ఎలా భయభ్రాంతులని చేసెయ్యో చెప్పే కథ ఇది.
“అడ్డం పడిన మంచం” – మనం అడ్డం పడితే మంచంలో పడుకుంటాం. అదే మంచం అడ్డం పడితే? ఆలోచనాత్మక మయిన ఒక వినూత్న కథాంశం ఇది.
“అట్టకట్టిన అట్టహాసం” – ఊరిప్రజలని పీక్కు తినే ఒక కామందు కథ ఇది. అతని అట్టహాసం వింటే ప్రజలకు వణుకు – ఎందుకంటే దాని తరువాత ఎవడి ప్రాణానికో ముప్పన్నమాటే. అలాంటిది అతని చర్మం అతనిమీద తీసుకునే ప్రతీకారం వల్ల ఆ చెంపలు అట్టకట్టి అలాగే వుండిపోతాయి. అంటే ఆ దవడలు అలాగే బిగదీసుకుని వుండిపోత య్యన్నమాట. మంచి కమ్యూనిస్ట్ థీమ్ వున్న కథ యిది.
“విడిది చేసిన వేవిళ్లు” – అంటే, వేవిళ్లు వచ్చి కూర్చున్నాయా, లేక వేవిళ్లకి విడిది కారకురాలా అనేది కథని చదివి తెలుసుకోవలసిందే.
“కంకాళాల్లో టెంకాయలు” – పేరుబట్టీ డిటెక్టివ్ స్టోరీ అని తెలియట్లేదూ?
ఇంకొన్నింటిని తయారు జేస్తున్నాను. పూర్తికాగానే పంపిస్తాను.
ఏ.వి.వి.యస్.సి. రావు
పి.యస్.: కథలన్నింటి పేర్లూ సజెస్ట్ చేసింది నా స్నేహితుడు. కానీ, ఈ విషయాన్ని మీకూ నాకు మధ్య మాత్రమే వుండనివ్వండేం!
(చేదకు బావి తప్పనట్లే, బంతికి బాట్ తప్పనట్లే విషయపరమైన ప్రతీ చర్చకూ అంతం తప్పదు. ఏమిటో, రావుగారి ఒరవడి మాకూ వచ్చేస్తున్నట్లుంది!
ఏ.వి.వి.యస్.సి. రావుగారి కథలు మాబోటి సామాన్యులకు అందే పరిస్థితి కాదిది. వీరి రచనలు ప్రచురించే స్థాయిని తెలుగులో ఏ పత్రికలూ మా జీవిత కాలంలో చేరలేవని మా ప్రగాఢ విశ్వాసం. వీరి భాషా, శైలీ అనితర సాధ్యం. మామూలుగా అయితే, ఈ కుక్క తినే కుక్క – డాగ్ ఈట్స్ డాగ్ అంటారు గదా, అది! – పోటీ ప్రపంచంలో మిగిలిన పత్రికలకి ఈ కథలని పంపమని చెప్పి, ఆ సంపాదకులకి ఈ కథలని చదవడాన్ని తప్పనిసరి చేసి, ఈ కథలపట్ల మా నిర్ణయం సరయినదేనని ఋజువు చేయించేవాళ్లం. కానీ, మా మనసుల్లో ఏ మూలో దాగివున్న జీవకారుణ్యం మమ్మల్ని ఆ పనికి అడ్డగిస్తోంది. ఇంక ఏ.వి.వి.యస్.సి. రావుగారి రచనల గూర్చిన ఏ వివరాలూ “తెలుగు రత్న”లో వుండవ్. – సం.
పి.యస్.: రావుగారూ, మీ స్నేహితుణ్ణి అర్జెంటుగా వచ్చి మమ్మల్ని కలవమని చెప్పండి. భయపడాల్సిన అవసరమేమీ లేదు. మా దినపత్రికలో సబ్ ఎడిటర్ పోస్ట్ నొకదాన్ని వారి కోసమే క్రియేట్ చేశాం. ఆ విషయమై మాట్లాడడానికి, అంతే!)
***
“ఉత్తర రత్న” జనవరి 31 -
ప్రియమైన తెలుగు రత్న సంపాదకులకు -
నేను నా రచనలని పుస్తకరూపంలో వెలువరిస్తున్నా నని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీకొక కాపీని జతపరుస్తున్నాను, చూడండి. వెనుక కవర్ మీద నా కథలని గూర్చి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలని అచ్చువేశానని గమనించే వుంటారు. ముఖ్యంగా, “(రావుగారి) రచనలని ప్రచురించే స్థాయిని తెలుగులో ఏ పత్రికలూ మా జీవితకాలంలో చేరలేవని మా ప్రగాఢ విశ్వాసం. వీరి భాషా, శైలీ అనితర సాధ్యం,” అన్న వాక్యాలని చూశారా? నేను చేసినదల్లా “వీరి” ని “రావుగారి”గా మార్చడం మాత్రమే. మీ ఈ కితాబు ఈ పుస్తకం అత్యధిక సంఖ్యలో అమ్ముడవడానికి తోడ్పడుతుందని నా ప్రగాఢ నమ్మకం.
ఏ.వి.వి.యస్.సి. రావు
(క్రితం ఏడాది రావుగారి రచనల గూర్చిన ఎలాంటి వివరాలూ మా పత్రికలో వుండవు అని మేం రాయడం మితిమీరిన దురాశవల్ల! భవిష్యత్తుని గూర్చిన అవగాహన మా కే మాత్రం లేకపోవడం వల్ల!! కనిపించిన ఆ సంచికలోని ఆ పేజీని నమిలి మింగుతూ రాస్తున్న సంపాదకుని స్పందన ఇది.
మాకు తెలిసి, ప్రపంచ భాషల్లో “కథ రాయడ మెలా?” అన్న శీర్షికతో పుస్తకాలు వెలువడడం సర్వసాధారణం. ఒక్క తెలుగుభాషకే ప్రత్యేకతగా, “కథ ఎలా రాయకూడదు?” అన్న అంశంమీద వెలువడిన ఏకైక ప్రచురణగా “ఏ.వి.వి.యస్.సి. రావు కథలు” అన్న శీర్షికతో ప్రస్తుతం మార్కెట్లో వున్న పుస్తకాన్ని చెప్పుకోవచ్చు. ధైర్యమున్న యూనివర్సిటీలు కథలు ఎలా రాయకూడదన్న పాఠ్యాంశాన్ని సిలబస్‌లో చేర్చి ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోవచ్చు. అమెరికాలో “రాటెన్ ఎగ్” అవార్డులనీ, “లెమన్” అవార్డులనీ కొన్ని రకాల రచనలకి ఇస్తూంటారుట. ఇలాంటి పోటీని పెట్టి ఇంతకన్నా ఎంత చెత్తగా రాయవచ్చు అని విద్యార్థులని సవాలు చెయ్యవచ్చు. ఆ విధంగా ఈ ఎలక్టివ్ కోర్స్ సరదాగా బానే వుండే అవకాశమున్నది. చదవాల్సిన అవసరమే వుండదు గనుక విద్యార్థులు క్లాసు లెగ్గొడతారేమో ననుకోవడానికి ఆస్కారం లేదు. రావుగారి ప్రతిభ నెరిగి వున్నవాళ్లం గనుక ఈ విషయం మీద మేం మాట్లాడ్డం చివరిసారి అని చెప్పడానికి వెనుకాడుతున్నాం. – సం.)
***
“ఇదీ బాక్‌గ్రవుండ్.”
“రామారావు మొహానికి పులుముకున్న ఉత్తరం చదువొకసారి!”
ప్రియమైన “తెలుగు రత్న” సంపాదకులకు -
మీరు నాకు చేసిన హెల్ప్‌కి థాంక్స్. నా పుస్తకాన్ని లక్డీ కా పూల్ యూనివర్సిటీవాళ్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నకొత్త కోర్సుకి టెక్స్ట్‌బుక్‌గా వాడబోతున్నారని మీకు తెలియజెయ్యడానికి హాపీ. మీ బ్లెసింగ్స్‌తో త్వరలోనే ఉస్మానియా, ఆంధ్రా, నాగార్జున, అమరావతి యూనివర్సిటీలకు కూడా. పుస్తకానికి రీప్రింట్ తొందరలోనే అని ఇంకా హాపీ.
- ఏ.వి.వి.యస్.సి. రావు
” అదన్న మాట అసలు సంగతి! పాపం, రామారావ్! ఆ రచయితని ఉదాహరణగా పాఠకలోకానికి చూపించి అతణ్ణి గేలిచెయ్యా లనుకున్నాడు. తను రాతబడికి గురయ్యాడు.”
” ఇందాక చేతబడన్నావ్. ఇప్పుడు రాతబడంటున్నావ్! ఈ పేరే వినలే దిప్పటిదాకా.”
“ఇంకా అర్థం కాలేదా? ”
“… చేసిందెవరంటావ్?”
**** (*) *****
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్