మదన కామరాజు పుస్తకాలపై మోజుతో, తనకు చదువురాకపోయినా ఎవరి చేతైనా చదివించుకుందామని వాటిని గుట్టుగా దాచుకున్న ఒక ముసలావిడ ఉజ్జాయింపుగా ఓ వందేళ్ల క్రితం తెలుగు సాహిత్యానికి అనుకోకుండా ఓ మేలు చేసింది. చదువొచ్చిన ఒక కుర్రాడి చేత ఆ పుస్తకాలను చదివించుకుంది. కులవిద్య అయిన పంచాగంతో పాటు, సంస్కృతమూ చదువుకుంటూ పండితుల దోవలో పోవాల్సిన ఆ కుర్రాడికి తెలుగు మీద మోజు పెరగటానికి ఆమె కూడా అలా కారణమయ్యింది. ఆ కుర్రాడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. పాండిత్యం వద్దనుకున్నాడు, అవధానాలు వద్దనుకున్నాడు. కథలు చెప్పాలనుకున్నాడు. అలా ఇలా కాదు: “భాష పరసీమలు చూడాలి. గజం యెత్తు పుస్తకాలు రచించాలి”. ఇదీ లక్ష్యం. తెలుగు సాహిత్యంలో శ్రీపాద ఒక అపూర్వమైన సంభవం. ఆయన పండితుల దారిలో పోకుండా కథలు చెప్పాలని పూనుకోవటం తెలుగు సాహిత్యానికి గ్రహస్థితి బాగున్న కాలం. ఆయనకు ఇంగ్లీషు రాదు, పైపైచ్చు హిందీ అంటే పిచ్చి కోపం. దాంతో ఆ మేధస్సు ఈ నేలలో వేళ్లూనుకుని ఇక్కడి సారంతో చేవదేరింది. చుట్టూ ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లోని మనుషులపై ఎంతో ఇష్టంతో వాళ్ళ మాటల్లోనూ చేతల్లోనూ కవిత్వాన్ని చూసి ఉప్పొంగిపోయి, వాటిని కథల్లో పెట్టాలని ఉబలాటపడ్డాడాయన. ఆయన ఆత్మకథ “అనుభవాలూ జ్ఞాపకాలూను” లో కథలు రాయాలనే జ్వరం ఆయన్ని ఎలా పట్టుకుందో చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఇంత ప్రపంచంలో, ఇన్నిన్ని బృహత్ కార్యాలు దొర్లే లోకంలో కథలు చెప్పటం మీద ఆయన పెంచుకున్న మక్కువ చూస్తే, కథలు చెప్పేందుకు వీలుగా జీవితాన్ని దిద్దుకున్న మంకుపట్టును చూస్తే, ఇలా ఉండాల్రా రాసేవాడు అనిపిస్తుంది. ఆయన కథల్నీ, కథల కున్న శక్తినీ చిత్తశుద్ధితో నమ్మాడు. మార్పు తెస్తాయనీ, మంచి చేస్తాయనీ నమ్మకంతో రాశాడు. అందుకే కాలంలో కలిసిపోయినా, కథల్లో మిగిలాడు.
శ్రీపాదగారి గురించి నెట్లోనూ, ఇతర పాతపత్రికల్లోనూ వచ్చిన వ్యాసాల, ఆడియోల సమాహారమే ఈ నెల వాకిలి ఎడిటర్స్ పిక్.
***
1. ఆయన కథల్లో బాగా ప్రాచుర్యం పొందిన మార్గదర్శి కథ ఆడియో కొత్తపాళీ గారి గొంతులో:
Part 1:
Part 2:
Part 3:
Part 4:
Part 5:
Part 6:
Part 7:
Part 8:
Part 9:
Part 10:
Part 11:
మార్గదర్శి కథ పి. డి. ఎఫ్ (కథానిలయం)
***
2. “శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం” అనే శీర్షికతో ఈమాట పత్రికలో వచ్చిన వ్యాసం (ఆటా సభల ప్రసంగాల నుంచి):
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తన చిన్నతనంలో రాజమండ్రిలో వారాలు చేసుకుంటూ చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఒక విశేషాన్ని తన స్వీయచరిత్రలో ప్రస్తావించారు. ఓ వారం శాస్త్రిగారికి భోజనం పెట్టాల్సి వచ్చిన ఓ గృహిణి, వాళ్ళఇంట్లో ఏదో కాస్త ఖరీదయిన పిండివంట కాబోలు వండింది. మరి ఆ వంటకం తక్కువే అయిందో, లేక వారాలబ్బాయికి ఇంత ప్రియమైన పదార్థం పెట్టనొల్లకో “కారణం ఏమైతేనేమి` పంక్తిలో నలుగురి సమక్షంలో భోంచేస్తున్న శాస్త్రిగారిని ఉద్దేశించి, ‘ఎలాగూ ఈ పదార్థం నీకు ఇష్టం లేదుగా బాబూ,’ అంటూ గడుసుతనంగా ముందరికాళ్ళకు బంధం వెయ్యబోయింది…
***
3. “కవులు- ప్రచురణలు” – కిన్నెర పత్రికలో పుస్తకాల ప్రచురణ గురించి శ్రీపాద రాసిన వ్యాసం:
***
4. శ్రీపాద వీలునామా: (“అనుభవాలు, జ్ఞాపకాలు” పుస్తకంనుండి)
పురిపండా అప్పలస్వామి గారికి,
ఇవాళ తెల్లవారేటప్పటికి నాకివాళ పక్షవాతం సందేహం కలిగింది. మీరు హైదరాబాదు నుంచి ఎప్పుడు వస్తారు?
నాగేశ్వరరావుగారికి కథల పుస్తకాలు ఇచ్చెయ్యదలచుకున్నాను. వెనక ఒకమాటు వారు సేపీకి 3.00 మూడు రూపాయలు చొప్పున బేరం చేసి స్థిర పరచుకున్నారు. ఇప్పుడు ఆ రేటున పైసలు చెయ్యండి. కుదరకపోతే మీ ఇష్టం వచ్చినట్టు పైసలు చెయ్యండి. తక్కిన పుస్తకాలున్నూ యిప్పించెయ్యండి. వారికి నాలుగు వేల చిల్లర నేను బాకీ. నవలలూ, నాటకాలూ వగైరా కాపీరైట్లూ, స్టాకు అంతా యిప్పించండి. మీకు సాధ్యమైన ధరకు యిప్పించి రుణం లేదనిపించి అదనంగా యిస్తే అది నా భార్య చేతికి ఇవ్వండి. నా కుటుంబానికి మీరే సాయం చెయ్యగలరు.
పుస్తకాల వ్యవహారం పూర్తిగా పరిష్కరించి మరీ వెళ్ళాలి మీరు. ‘అనుభవాలు – 2′ విశాఖపట్టణం పంపాలి. పోషకులకూ తక్కినవారికీ, రాజమండ్రిలో మైలవరపూ, వింజమూరీ, రామచంద్రపురంలో దువ్వూరీ, చావలీ, వేపా వారికి మాత్రమే యిచ్చాను. వేపావారు 116 ఇస్తామన్నారు. ఇప్పుడే కొంత ఇవ్వవచ్చు. కాకినాడ సాహిత్యవేత్తగారంటే శ్రీ పార్థసారథిగారు. వారికి నా యెడ చాలా దయ. మీరు చెపితే నాకు గాని నా కుటుంబానికి గాని వారేమైనా సాయం చేసి చేయించవచ్చు.
నా కుటుంబం చెట్టుకింద వుంది. మీరు సాయం చెయ్యండి. విశాఖలో కూడా ఏమైనా వీలవుతుందేమో చూడండి. నాగేశ్వరరావుగారి వ్యవహారం మీరే పరిష్కరించడం నా ఆశ. మీరు మిక్కిలి ఘనంగా సన్మానించారు. మీకు శ్రమ మాత్రమే కలిగించాన్నేను. శ్రీ సింహాచలంగారి స్నేహం నాకు మహా మేరువు. వారికి నా కృత జ్ఞత సరిగా చూపించలేకపోయాను.
మీకు నేను బరువైనట్టే నిశ్చయం. మీలాగ మనసిచ్చిన వారు నాకు మరొకరు లేరు. మీ రుణం తీర్చుకోలేను. అది తీర్చుకోవడానికైనా మరో జన్మం బెత్తుతాను. ఒకటి కాదు, పది, వంద ఎత్తుతాను. ఒక సామాన్యుడికి మీరూ, సింహాచలం గారూ కనకాభిషేకం చేయించారు. ఇది నాకు పరమేశ్వరుడు చేయించలేనిది. ఇలాంటి స్థితిలో నేను భారం అయిపోతున్నాను. విచారించను. అది తీర్చుకోవడానికైనా మరో జన్మ యెత్తుతాను కనక.
నాకేమీ విచారం లేదు. నా భార్య నన్ననేక విధాల కాపాడింది. చిన్నప్పణ్ణుంచీ దాన్ని కష్టపెట్టాను గాని సుఖ పెట్టలేకపోయాను. ఇప్పుడు ఇక ఆ వూసే లేదు కదా?
నిరర్థక జన్మ అయిపోయింది నాది.
రచనలయినా సాపురాసి అన్నీ జాతికి సమర్పించుకోలేకపోయాను.
పరమేశ్వరుడు మీకు సకల సుఖాలూ కలిగించాలి. సారస్వత సేవలో మీకు సాఫల్యం పూర్తిగా కలిగించాలి. మీ కలం జాతిని ఉద్ధరిస్తుంది.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
**** (*) ****
మన జాతి రచయిత, కధక చక్రవర్తి, తెలుగు వెళ్లున్న ప్రపంచస్థాయి రచయిత
శ్రీపాద గారి రచనా సర్వస్వ సంకలనాలు తీసుకువచ్ఛే భగీరథ ప్రయత్నంలో ఉన్న
మనసు ఫాఉండేషన్ మన్నెం రాయుడు గారు, వారి శ్యామనారాయణ గార్ల కృషి
త్వరలో ఫలించాలని ఈ సందర్భంలో తలచుకుంటున్నాను.
బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రుల వారి దివ్య సన్నిధికి నమస్కరించి
విధేయుడు జలసూత్రం రుక్మిణినాధ శాస్త్రి వ్రాసుకునేది …
… అహంభో అభివాదయే, మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్న, మీ జ.రు.శా
అంటూ (1955 ప్రాంతంలో) వారి మధ్యన నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు ( భారతి పత్రికలో వచ్చినవి )
తప్పక చదవ తగ్గవి అని గుర్తు చేసిన పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు
చదవమని పంపిన శ్యామనారాయణ గార్లకు
శ్రీపాద ముద్రలను సాక్షాత్కరింపజేసిన వాకిలి సంపాదక వర్గానికి కృతజ్ఞతలు.
” దళిత, స్త్రీ వాదాలకు పాదు శ్రీపాద వారు.
స్త్రీల భాషలో ( తెనుగుభాషలో మాతృభిక్ష ప్రసాదించారు వారు అని చెప్పుకున్న స్త్రీల భాషలో ) మాధుర్యానికి ముగ్ధులై
జాను తెలుగులో, తన సహజ స్వాభావిక ధోరణిలో, అనితర సాధ్యం అనిపించేలా రచనలు చేశారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
వారి వాక్యాలలో సహజ శైలే తప్ప కృతక శైలి లేని ఉండదు.
ఆయన కధలకు సంభాషణలు ఆయువు పట్టు. పాత్రల స్వభావాల మధ్య సంఘర్షణ ప్రత్యేక ఆకర్షణ
తెలుగు భాష నుడికారాల్లోని చమత్కారం వారి రచనల్లోని మరో ప్రాధాన్యత.
శ్రీపాద వారిని స్మరణకు తీసుకొచ్చిన వాకిలి సంపాదక వర్గానికి అభినందనలు ” ~ డా. రామసూరి, నూజివీడు
” శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు … ఆధునిక తెలుగు భాషకు వెలుగునిచ్చిన ప్రతిభామూర్తి.
తెలుగు కధకు గులాబీ అత్తరు పరిమళాన్నిఅద్దిన కథాచక్రవర్తి.
తన “అనుభవాల్ని” లోకానికి చెప్పి, “జ్ఞాపకాలతో” రచయితలకు స్ఫూర్తినిచ్చిన సజీవ సాహితీవేత్త.
తెలుగు నుడికారానికి గుడికట్టి; ఆధునిక వచానానికి గోదావరిలా సరికొత్త నడకను, శైలిని ప్రసాదించిన మహా రచయిత.
శ్రీపాద వారి సంస్మరణ వ్యాస సమాహారం పాఠకులకు అందిస్తున్న వాకిలి సంపాదక వర్గానికి అభినందనలు ”
~ డా. బీరం సుందరరావు, చీరాల.( Retired Telugu Lecturer & Eminent Poet )
” శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కథలు కొన్నైనా చదివితే తెలుగు కుటుంబాల ఆపేక్ష, అంతఃఅకరణాలు ఎలాటివో,
ఆ మరియాదలు, మన్ననలు ఎట్టివో అర్థమౌతుంది! ఆశ్చర్యమేస్తుంది! ముచ్చటౌతుంది!
ఆయన రచనలు మరోభాషకు లొంగవు.
జాను తెలుగు నేర్చినవారికే, తెలుగువారైనవారికే శ్రీ శాస్త్రిగారి కథలు చదివి ఆనందించే అదృష్టము! ”
– మల్లాది రామకృష్ణ శాస్త్రి పుస్తక ప్రపంచం; మార్చి, 1961 ( http://pustakam.net/?p=11436 )
” శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇంగిలీషు చదువుకోకపోవటం ఒకరకంగా మన అదృష్టం.
వారు తమ రచనల్లో దేశీయమైన, ప్రాంతీయమైన నుడికారం, మాండలీకం వాడారు.
వారి వాక్య నిర్మాణం కానీ, ఆ సంభాషణలు కానీ అంత అందంగా రావటానికి కారణం
ఆయన కధలు చెప్పారు; పూర్వకాలం మౌఖిక సాంప్రదాయ ఒరవడిలో.
Sreepada garu was a great story teller. వారి కధలకు విస్తృతి ఎక్కువగా ఉంటుంది.
అవి అనువాదానికి లొంగవు.
ఎంత చక్కటి భాష! వాక్యాలలో ఆ ఒడుపు, ఎంత వ్యంగ్యం, ఎన్నెన్ని కొత్త కొత్త పదబంధాలు సృష్టించారు!!
వడ్లగింజలు కధలో అల్లిక ఎంత గొప్పగా ఉంటుంది, ఆయన తప్పితే ఇతరులెవరూ రాయలేరా కథను.
అనితర సాధ్యం అనేది చాలా తక్కువ మందికి వర్తిస్తుంది. అలాంటి వాళ్లలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకరు.
వాకిలి సంపాదక వర్గానికి అభినందనలతో . . . ~ తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారు, రాజమండ్రి.
ఎవరికైనా ఆసక్తి ఉంటే,
https://m.soundcloud.com/indrani-palaparthy/sripada
ధన్యవాదాలు.
” శ్రీపాద వారి కథలను వితంతు వివాహాలకు అనుకూలంగా, కొన్ని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకం గా రాసిన కథలుగా మాత్రమే అర్థం చేసుకున్నాను గానీ ఆ కథల నుంచి తెలుసుకోవలసింది మరెంతో ఉందనిపించింది. గృహిణీ జీవితం లేదా గృహస్థ జీవితంలోని అగ్రవర్ణ పితృస్వామ్య రాజకీయాలకు మూలమైన లైంగిక శ్రమ విభజన గురించిన అమూల్యమైన, ఇతరత్రా లభించని వివరాలు, సమాచారం ఈ కథలలో పోగుపడి ఉంది.
గురజాడ ‘కన్యాశుల్కం’లో వితంతువుల శ్రమ, దాని విలువ గురించి చాలా స్పష్టంగా వివరంగా చెప్పాడు. మిగిలిన స్త్రీల గురించి చెప్పటానికి ఆ నాటకంలో చోటు లేదు. ఆ చోటును శ్రీ పాద తన చిన్న కథలలో చూపించారు. శ్రీపాద ఆ విషయాల గురించి చెప్తున్నట్లు ఏ మాత్రం కనిపించకుండా కథలో ఇమిడిపోయేలా, విషయమే కథగా, కథే ఆ విషయంగా రాసిన తీరు అద్భుతమనిపించింది. ఎంత విలువైన సమాచారం దొరికిందా అని ఆనందం కలిగింది.
శ్రీపాద కథలు మార్పు వైపే మొగ్గు చూపుతాయి. ఐతే, ఆ మార్పు స్త్రీలు తమ జీవితాల్లో తాము తెచ్చుకునే మార్పు. స్త్రీల ఏజన్సీని ఆయన గుర్తించి గౌరవించి అక్షరబద్ధం చేశాడు. స్త్రీల నిర్ణయాధికారానికి పెద్దపీట వేశాడు. స్త్రీలు ఎవరి ఆసరా కోసమో చూడకుండా, అన్నలనో, భర్తలనో, తండ్రులనో ఆశ్రయించకుండా- వారిమీద ఆధారపడకుండా చాలా చతురతతో, తెలివితో పకడ్బందీ పథకాలతో తమ జీవితాలను తామే మార్చుకుంటారు. ‘తల్లిప్రాణం’ ‘కన్యాకాలే యిత్నాద్వరితం’ వంటి కథలలో ఈ స్త్రీల కర్తృత్వం మనకు కనిపించి ఆనందపెడుతుంది. ఆ విధంగా శ్రీపాద చాలా విషయాలలో గురజాడకు కొనసాగింపు. ” – ఓల్గా ( http://www.andhrajyothy.com/artical?SID=115324&SupID=౨౬ )
వాకిలి పత్రికలో శ్రీపాద సంస్మరణ సందర్భంగా ప్రముఖ అభ్యుదయ కవి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి స్పందన.
” శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు, మొదటి తరం తెలుగు రచయితల్లో చాలా విలక్షణమైన రచయిత.
1) భమిడిపాటి కామేశ్వరరావు గారు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఇద్దరూ తెలుగు వ్యావహారిక భాషను గొప్ప స్పూర్తితో, చాలా గొప్పగా వాడారు.
2) ఆయన పురుష పాత్రల్లో కంటే, స్త్రీ పాత్రల్లో ఆయన చాలా గొప్పగా కనిపిస్తారు. వారికి పిల్లలు లేరు. ముఖ్యంగా తండ్రి కూతురు మధ్య అనుబంధము ( అన్నంత పనీ జరిగింది కధ ) చాలా ఆర్ద్రంగా, చాలా ఎక్కువగా ఇష్టంగా రాశారు. కాక, వారు ఆడపిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళు చాలా వృద్ధిలోకి రావాలని, వాళ్లకు సొంతవైన ఆలోచనలు ఉండాలని కోరుకున్నటువంటి రచయిత.
3) సాంఘిక కధలను ఎంత శక్తివంతంగా రాసారో, చారిత్రిక ఇతివృత్తాలల్లో కూడా ( వడ్లగింజలు, శ్మశానవాటిక, గులాబీ అత్తరు ) వాక్య నిర్మాణ పద్దతి చాలా పవర్ఫుల్గా ఉంటుంది.
4) “రక్షా బంధనం” అనే ఒక అపురూపమైన అపరాధ పరిశోధక నవల రాశారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం అనే చిన్న పల్లెటూరు, పూర్తి తెలుగు వాతారణం, తెలుగు కుటుంబాలు నేపథ్యంలో ఆనాటి సోషల్ బాక్గ్రవుండ్ లో రాశారు.
5) ఆయన కధలు అవీ రాయడమే కాక, చాలా తక్కువ నవలలు రాశారు. నాలుగే నవలలు రాసారు … ఆత్మబలి, రక్షా బంధనం, నీలా సుందరి (పౌరాణిక నవల), క్షీరసాగర మధనం ( సాంఘిక నవల : ఒక జమీందారు తన కూతురికి వరుడ్ని వెతకటం లో ఎంత జాగ్రత్త తీసుకుంటాడో ఇతివృత్తం )
6) వారి అద్భుతమైన నాటకాల్లో “రాజరాజు” ( తూర్పు చాళుక్యుల నేపధ్యం ); “కలంపోటు” (కృష్ణదేవరాయలు నేపధ్యం), రాచపీనుగ తోడు లేకుండా వెళ్ళదు (నాటకం) .
ఆతరం గొప్ప రచయితల్లాగే ఒక ప్రక్రియకు పరిమితం అయిపోకుండా, అన్ని రకాల ప్రక్రియల్లో చాలా శక్తివంతమైన రచనలు చేశారు వారు.
అనేక కష్టాలకోర్చి తొమ్మిదేళ్ళ పాటు “ప్రబుద్ధాంధ్ర” అనే పత్రిక నడిపారు.
వారెప్పుడు ఎవ్వరివద్దా ఉద్యోగం చెయ్యలేదు. వారింట్లో వైద్యం ఉండేది. గంధర్వసార్వతి అనే ఆయుర్వేద మందుల షాపు నడిపారు రాజమండ్రిలో.
ఖద్దర్ కు వ్యతిరేకులైన వారి వేషధారణ గ్లాస్కో పంచె కట్టుకుని, షర్టు టేకప్ చేసి, కోటు తొడుక్కుని, మెడలో ఒక జరీ కండువా మడత వేసుకునేవారు. చాలా పెద్ద పర్సనాలిటీ. చాలా ఎత్తైన మనిషి, గిరజాల జుట్టు అదీ.
వీరేశలింగం పంతుల గారి వితంతు వివాహాల ఉద్యమానికి ప్రత్యక్షంగా ఇన్స్పైర్ అయి కధలు రాశారు. పాజిటివ్ గా వితంతువులను సమర్ధించటం, వాళ్లకు మళ్ళీ వివాహాలు జరగాలని ఎలా రచనలు చేశారో, వారిలోని నెగటివ్ కారెక్టర్స్ పిల్లలను ఎలా బాధిస్తుందో అనే విషయం గురించి ” ఇల్లుపట్టిన వెధవాడపడుచు ” అనే గొప్ప కధ రాశారు. అన్నింటికంటే చాలా రివాల్యూషనరీ కధ “అన్నంత పని జరిగింది”. తన తండ్రికి తన టీచర్ అయినటువంటి విడోని ఇచ్చి పెళ్లి చేస్తుంది కూతురు. ఆరోజుల్లో ఇది ఎవరూ ఊహించని విషయం.
వారి వ్యక్తిత్వానికి సంబందించినవి మూడు విషయాలు : 1) చాలా పట్టుదల కల మనిషి 2) వ్యావహారిక భాషను ఏంతో పవర్ఫుల్ గా, ఒడుపుగా వాడిన వారు. 3) గాంధీజీ, ఖద్దర్, హిందీలకు వ్యతిరేకి.
కలాభివర్ధనీ పరిషత్తు ఆయన సంస్థ అది. దాని తరఫున సభలు చేసి, రచయితలకు సన్మానాలు చేసేవారు. వన్ మాన్ షో అది. దాని తరఫునే ఆయన పుస్తకాలన్నీ అచ్చువేశారు.
మా నాన్న గారైన ఇంద్రగంటి హనుమచ్శాస్త్రి గారికి మంచి స్నేహితులు ( 1961 వరకూ జీవించి ఉన్నారు ).
నేను చిన్నతనం నుండి తెలుగు సాహిత్యంలో ఇష్టపడే కథకులు చలం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, బుచ్చిబాబు గారు. చిన్నప్పటి నుంచి శ్రీపాద వారి కధలు చదువుతూ పెరిగాను.
వాకిలి సంపాదక వర్గానికి అభినందనలతో ” ~ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
( పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారి ప్రోత్సాహంతో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారిని అభ్యర్దించగా, అభిమానంగా వారు చెప్పినవి )
Thanks for the links.
@రామయ్య గారు- మీ కామెంట్స్ అన్ని చాలా ఇన్ఫర్మేటివగా ఉంటాయి. నా లాంటి younger పాఠకులకి చాలా సహాయపడతాయి. ధన్యవాదాలు.
శిరీష్ ఆదిత్య గారు! కినిగె పత్రికలో మీ “అస్తిత్వం” కథ చదివినప్పటినుంచి మీరంటే నాకు చాలా అభిమానం.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కధలు, “అనుభవాలు, జ్ఞాపకాలు” వంటివి
నేటి తరం ప్రతిభావంతులైన మీరు, చౌరస్తా/జిందగీ వంశన్న (డా. వంశీధర రెడ్ది), ఆనంద్ గుర్రం, ఇండ్ల చంద్రశేఖర్,
సోల్ సర్కస్ వెంకట్ సిద్ధారెడ్డి ఇంకా అనేకానేకులు చదవాలని ఓ పాఠకుడిగా నా ఆకాంక్ష.
మీ సీనియర్ రచయితలూ మీకలాంటి సలహాలు ఇస్తారని నేననుకుంటున్నా.
ధన్యవాదాలు.
నీకు శ్రీపాద వారి అనుభవాలు జ్ఞాపకాలు న్నూ లో నచ్చినదేమిటి? అని మా అమ్మాయి జ్యోతిర్మయిని అడిగాను.
పానకం పుచ్చుకోవాలి అనాలి . మందు తాగాలి అనాలి అని గుర్తు చేసింది.
శ్రీపాద కి భాషలోని సహజ వ్యాకరణం తెలుసు. అలాగే సాంస్కృతిక మూలాలూ తెలుసు.మూలాల్ని విస్మరిస్తే ఏర్పడే శున్యాన్ని ఆయనలా పసిగట్టిన వాళ్ళు లేరు. మనం సంస్కృతులని ఆధిపత్యం గానో బానిసత్వం గానో మొత్తంగా తిరస్కరించే గడ్డు కాలంలో జీవిస్తున్నాం. యింగ్లీషు తగినంత రాకపోవడం వల్ల తెలుగులో రాస్తున్నాము కానీ భాష పైన కించిత్తు మమకారం లేదు. అందువల్ల మనసాహిత్యం ప్రభుత్వానికి సమర్పించుకునే డిమాండ్ల చిట్టాగా మారిపోయింది.
శ్రీపాద సామాజిక సమస్యలని హృదయం గమంగా చిత్రించినా, సకల సమస్యలకి మూలం సంస్కృతీ సంప్రదాయాలలో ఉందనే విధ్వంసకర దృక్పధాన్ని ఆశ్రయించలేదు. పద్యం నుంచి వచనంలోకి ప్రయాణించి నా, పాశ్చాత్యాన్ని అనుకరించలేదు. యింగ్లీషు రాకపోవడం కూడా వరంగా మారింది ఆయనకి. అందువల్లనే కోనసీమని అక్కడి అగ్రహారాలని ఆచార వ్యవహారాల్ని భాషలోని ప్రత్యేకతలని గొప్ప డాక్యుమెంటరీలా చితరించారు.
1 నిజానికి సంస్కృతిని పూర్తిగా ద్వేషించేవాళ్ళు ,2 సంస్కృతీ మతం పేరుతొ పునరుద్ధరణని కాంక్షించే వాళ్ళు వొకే కుదురుకి చెందినవాళ్లు. అదే పాశ్చాత్య ఆంగ్ల వలస సంస్కృతి. వారిలో మొదటివారిది ఆత్మన్యూనతా భావం. రెండోవాళ్ళది ఆధిక్యత భావం. యీరెండు శ్రీపాదలో లేవు. అయన సంస్కుతి సంప్రదాయాలని నిజంగా ప్రేమించడం వల్ల వాటిని సంస్కరించడానికి వెనుకాడలేదు. దానికి ఆంగ్లమానస పుత్రుడిగా మారలేదు. అనుభవాలు జ్ఞాపకాలలో తనకి వైదిక సంస్కృతి పట్ల గల అభిమానాన్ని అయన స్పష్టంగానే ప్రకటించారు.అదే సమయంలో హిందూమతం అనే దానిలోని అసంగతత్వాన్ని ఆయన కప్పిపుచ్చలేదు.
శ్రీపాద సంస్మరణ పై దాసరి అమరేంద్ర గారి స్పందన.
” నా దృష్టిలో శ్రీపాద గారికి అద్భుతమైన సామాజిక దృష్టి ఉంది, సామాజిక పరిశీలన ఉంది. తన కాలాన్నిమించి ముందుకు చూడగల శక్తి ఉంది.
అలాగే కధ మీద, కదా శిల్పం మీద, అతి గొప్పపట్టు ఉంది. అవన్నీ ఉండబట్టే ఆయన సంభాషణల్లో కధంతా నడిపించినా కూడా ఎక్కడా పట్టు సడలకుండా అందరినీ ఆకట్టుకునేలా చేయగలిగారు.
అప్పటికి ఇప్పటికి, మనం గుర్తుంచుకోవాల్సిన తెలుగు కధల్లో గొప్పవి ఒక ఇరవై ముప్పై కధలు ఎన్నుకుంటే వాటిల్లో కనీసం రెండు మూడు శ్రీపాద గారి కధలు ఉండి తీరతాయి అందులో.
కొత్తగా కధలు రాసే కథకులు కధా అధ్యనం మీద ఉన్నట్లయితే, వాళ్ళ అధ్యనం ముందు గురజాడతో మొదలెట్టినా, శ్రీపాద దగ్గర ఒక చక్కటి విరామం తీసుకుని చాలా శ్రద్దగా ఆయన్ని అధ్యనం చేస్తే అదే ఒక గొప్ప కధా గ్రంధం చదివినట్లు అవుతుంది. పెద్ద పెద్ద పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదు. ఆయన కధలు చాలు, కధ గురించి తెలుసుకోవటానికి. అంతకన్నా ముఖ్యంగా సమాజం గురించి తెలుసుకోవటానికి.
నా దృష్టిలో ఆయనవి ఎప్పటికీ వసివాడని చక్కటి కధలు.
మనలో చాలామంది ఆంగ్ల సాహిత్యం లేకుంటే మనకెవీ లేదు అనుకుంటారు. దాన్ని పూర్వ పక్షం చేసేసారు ఆయన.
వాకిలి సంపాదక వర్గానికి అభినందనలతో ” ~ దాసరి అమరేంద్ర
శ్రీపాద రచనల్లో గొప్పదనం ఆయన వాడిన సరళమైన భాష.
ఆయన కథల గురించి వ్యాఖ్యానిస్తూ, కితాబులు ఇచ్చేవారందరూ సొంత వాక్యాల మీద శ్రద్ధ పెడితే బావుంటుంది.
ఉదాహరణకి – కొత్తగా కధలు రాసే కథకులు కధా అధ్యనం మీద ఉన్నట్లయితే, వాళ్ళ అధ్యనం ముందు గురజాడతో మొదలెట్టినా, శ్రీపాద దగ్గర ఒక చక్కటి విరామం తీసుకుని చాలా శ్రద్దగా ఆయన్ని అధ్యనం చేస్తే అదే ఒక గొప్ప కధా గ్రంధం చదివినట్లు అవుతుంది.
ప్రియమైన శ్రీ నరేంద్ర గారు,
శ్రీపాద వారికి కితాబులు ఇచ్చే సాహసం చేస్తున్నట్లుగా కనిపిస్తే తెలియక చేసిన ఆ నేరం నాదే. పెద్దలది కాదు.
ఈ సందర్భంలో శ్రీపాద వారిని ఇష్టంగా స్మరించాలనేదే అందరి ఉద్దేశ్యంగా గమనించ ప్రార్ధన.
సరళమైన భాషలో శ్రీపాద వారిని స్మరించమని చెప్పిన మీ సూచన శిరోధార్యంగా భావిస్తున్నా ( అదంత సులభం కాకున్నా )
ధన్యవాదాలు
వాకిలి పత్రికలో శ్రీపాద వారిని తలచుకున్న సందర్భంలో శ్రీరమణ గారి స్పందన.
” తెలుగు కధకు రంగు, రుచి, వాసన అద్దిన వాడు.
తెలుగుతనంతో చదరంగం ఆడుకున్నవాడు
ఊరూవాడల్లో అమ్మలక్కలు ఊసులాడుకునే అచ్చమైన తెలుగులో కధలు రాసిన కవి శ్రీపాద.
1930-40 దశకంలో మన పల్లెటూళ్ళు, అక్కడి మనుషులు, ఆచార ఆహార వ్యవహారాలూ శ్రీపాద కధల్లో ప్రతిఫలిస్తాయి.
మన తెలుగు కధ శ్రీపాద వారితోనే వికసించించి పరిమళించింది. ”
~ శ్రీరమణ ( మిథునం కథ శ్రీరమణ )
వాకిలి పత్రికలో శ్రీపాద వారిని తలచుకున్న సందర్భంలో శ్రీరమణ గారి స్పందన.
” శ్రీపాద వారు నాకు చాలా ఇష్టం. నాకేంటి, కొన్ని లక్షల తెలుగు వాళ్లకు ఇష్టం.
శ్రీపాద వారి ‘వడ్ల గింజలు’ లాంటి కధ ప్రపంచ సాహిత్యంలో వచ్చిందా అని ఆశ్చర్యపోతుంటాను.
పూర్తిగా తెలుగు వాళ్ళ మీద అభిమానంతో, లాలసతో ఎంత నిజాయితీగా ఉంటాయి వారి రచనలు. ”
~ శ్రీరమణ ( మిథునం కథ శ్రీరమణ )
శ్రీపాద గురించి డా. చామర్తి అన్నపూర్ణ
శ్రీపాద వారికి అత్యంత సన్నిహితులైన వారిలో ఒకరైన ‘కనక్ ప్రవాసి ‘ ( డా. చామర్తి కనకయ్య ) గారి అమ్మాయి డా. చామర్తి అన్నపూర్ణ, రీడర్ & తెలుగు శాఖాధ్యక్షులు సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల, విశాఖపట్నం గారు తెలుగు తేజం 100వ ప్రత్యేక సంచిక ( మార్చి, 2017 ) కోసం రాసిన వ్యాసం ” శ్రీపాద వారి కధల్లో సంఘ సంస్కారం ” నుండి :
” తన తెలుగువారే తెలుగును చిన్నచూపు చూడడం గమనించి ఎంతో ఆవేదన చెంది తెలుగువారి సర్వతోముఖాభ్యుదయం కాంక్షించి చిన్న కధల ద్వారా జాతీయ భావ పరివర్తన సాధించదలచి తెలుగు వారి కధలే రాసి, తన తెలుగు జాతికి సమర్పించిన కధా రచయితా శ్రీపాద.
శ్రీపాద వారు రాసిన 75 కధల్లో సంఘ సంస్కరణ కధలు 26 వరకు కనిపిస్తున్నాయి.
మొదటిది “సుభద్రమ్మ” ( 1918 ) ఆడది రంగూన్ వెళ్ళకూడదనే కట్టుబాటును ధిక్కరించి ఇతరులకు ఆదర్శప్రాయుడైన ఒక రెడ్డి యువకుని గృహస్థ జీవిత గాథ ఇందులో కనిపిస్తుంది. 1920 సం లో వచ్చిన రెండో కథ “అన్నపూర్ణ” వైద్య విద్యనభ్యసించడానికి సముద్రయానం చేసి సీమకు వెళ్లిన భర్త కు ప్రాయశ్చిత్తామ్ గురించినది. 1923 లో వచ్చిన మరో కథ “రామలక్ష్మి” కుహనా సంస్కర్త పన్నిన కుటిల వలయాన్ని వివేకంతో ఛేదించి బయట పది తానూ కోరుకున్న యువకుణ్ణి వివాహం చేసుకున్న వితంతు కథ.
1925 లో వచ్చిన “బుచ్చి వెంకయ్యమ్మ” కథ పునర్వివాహాలకు సంబందించినది. సంఘ సంస్కర్త వీరేశలింగం గారిని కధా పాత్రచేసి చిత్రించిన శ్రీపాద గారి మరో కథ “తులసి మొక్కలు”. 1934 లో ప్రచురించబడిన “ఇలాంటి తవ్వాయివస్తే “కధలో అస్పృస్యులు క్రైస్తవ మతంలో చేరినా సాంఘికంగా వారి స్థితి మెరుగు పడలేదని నిరూపిస్తుంది.
1923 లో వచ్చిన “కలుపు మొక్కలు” కథ సమాజంలో అధికారం చెలాయిస్తూ లంచాలు తిని సుఖాలు మరిగి కలుపు మొక్కలుగా పెరిగే అవినీతిపరులను ఒకపక్కా; పతితలుగా సమానుజంలో నిందలు మోసే వేశ్యల్లో ఎలాంటి త్యాగానికైనా వెనుకాడని పరోపకార పారీణులను మరో పక్కా కళ్ళకు కట్టించే కథ ఇది.
పూర్వం కొన్ని కుటుంబాల్లో బాల వితంతువులను ఎన్నెన్ని బాధలు పడేవారో రక్త సంబంధమున్న అక్కాచెల్లెళ్లు సహితం వాళ్ళను ఎంత హీనంగా చూసేవారో ఎంత చాకిరీ చేయించుకునే వారో హ్రదయవిదారకంగా చిత్రించిన గొప్ప కథ 1935 లో వచ్చిన “అరికాళ్ళ కింద మంటలు “.
కధల్లో వారు సంస్కార వాదులుగా, ఆదర్శ వాదులుగా కనబడినా వారు చిత్రించిన జీవితం వాస్తివిక జీవితం. వారి కధలకి వాస్తవికత ప్రాణం. వారి కధా పాత్రలు అచ్చమైన తెలుగు వ్యక్తులు. వారి ఊహలు, ఊసులు, కలలు, కాంక్షలు, వారి సుఖ దుఃఖాలూ, రాగద్వేషాలు, అభిమాన దురభిమానాలు అన్నీ ఆ పాత్రల బాధలో పలికించారు. ఒకనాటి సాంప్రదాయ కుటుంబ జీవితంలోని మంచి చెడ్డలు, ఎగుడు దిగుళ్ళు, సొబగులు, సోయగాలు, తెలుసుకోవాలంటే శ్రీపాద గారి కధలే శరణ్యం.
తెలుగు కధా సారస్వత చరిత్రలోనే కాక, ఆంధ్రుల సామాజిక చరిత్రలో కూడా శాస్త్రి గారి కధలకు ఎంతో విలువైన స్థానం వుంది. ”
_____________________________________________________
( తమ వ్యాసంలోని భాగాలను ఇక్కడ ఉటంకించటానికి దయతో అనుమతి ఇచ్చిన డా. చామర్తి అన్నపూర్ణ గారికి కృతజ్ఞతలు )
రాజమండ్రిలో శ్రీపాద గారి విగ్రహం ప్రతిష్టించడం దగ్గర నుండి
శ్రీపాద గారి అనేక సాహితీ కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించిన,
శ్రీపాద గారి రచనా సంకలనాలకు ముందుమాటలు, పత్రికల్లో వ్యాసాలూ రాసిన శ్రీ వేదగిరి రాంబాబు గారు
శ్రీపాద వారిని మరోసారి ఆత్మీయంగా స్మరించడానికి అవకాశం కల్పించిన
వాకిలి పత్రిక సంపాదక వర్గానికి హార్దిక అభినందనలు తెలియజేస్తున్నారు.
రామయ్య గారు, శ్రీపాద వారి గురించి మీరు అందించిన సుప్రసిద్దుల వ్యాఖ్యలన్నీ బావున్నాయి. వారి మూడు కథలు సంకలనాలు, ఆత్మకథ చదివిన తర్వాత ఒక్కటే తెలుసుకున్నది. వంద సంవత్సరాల క్రితం భాష గురించి, తెలుగు జాతి గురించి తపించి తన రచనల రూపేణా ఆయన మన జాతికి చేసిన సేవ అనితరసాధ్యం. అవన్నీ చదివి ఎవరికి వారు ఆనందించవలసినవే కానీ, మరొకరు వివరించే విషయ వస్తువులు కావు.
అన్యగామి గారు, ఎంత చక్కగా చెప్పారు.
శ్రీపాద వారి రచనలను ( ముఖ్యంగా వారి ఆత్మకథ “అనుభవాలూ జ్ఞాపకాలూను” ) చదివి అనుభవైక్యం చేసుకుని
ఆనందించాలేగాని మరొకరు వివరించే విషయ వస్తువులు కావు.
శ్రీపాద గారిని బాగా ఎరిగున్న పెద్దలు, వయోవృద్దులు డా. పోరంకి దక్షిణామూర్తి గారు శ్రీపాద గారి
గురించి ఏవన్నారో తెలుసుకోవాలని చిన్న కుతూహలం.
ధన్యవాదాలు.
శ్రీ వేదగిరి రాంబాబు గారి సంపాదకత్వంలో వచ్చిన ” శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఉత్తమ కధలు ” సంపుటి ( నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణ )
లోని భూమిక నుండి :
శ్రీపాద వారి “మార్గదర్శి” కధలో ఓ పాత్రతో ఇలా చెప్పిస్తారు :
” అనేక కధలు వినడంవల్లా, చూడడంవల్లా, చిన్నతనంలోనే బుద్ధికి వికాసం కలుగుతుంది. అదే ప్రౌఢిమ.
అంచేతే చదువురాని ముసలివాడికంటే చదువు వచ్చిన కుర్రవాడు ఎక్కువ జ్ఞానవంతుడు కావడం.
కథలంటే పైపైకి వున్నాయనుకున్నారేమో? అవి కల్పించడానికి గొప్ప ప్రతిభ ఉండాలి. వాటి విలువ తెలుసుకోవడానికెంతో పరిజ్ఞానం ఉండాలి.
అవి చెప్పడానికెంతో నేర్పుండాలి. వినడానికెంతో రుచుండాలి. అవి బోధపరచడానికెంతో బుద్ధిసూక్ష్మత ఉండాలి.
కథలు కళ్ళకు వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి. మనసుకి ఉత్సాహమూ, ఉల్లసమూ కలిగిస్తాయి. జడునకున్నూ కల్పనాశక్తిని ప్రతిపాదిస్తాయి. నిజంగా ఒక్కొక్క కధ ఎల్లాంటి ఘట్టంలో కూడా ఒక్కక్కళ్ళని ఒడ్డెక్కిస్తుంది. కధలు చదవడం, అధమం వినడం ఎప్పుడూ దండగ అనుకోకేం? …