మీడియా కన్న సోషల్ మీడియానే బాగుంది.
డిసిప్లిన్ కన్న ఇండిసిప్లిన్ బాగుంది.
ఎవరు అదుపు చేస్తారు ఇక్కడ భావ వ్యక్తీకరణల్ని. ఎవరి మాటకు వారే ఎడిటర్లు. ఎవరి ఆటకు వారే డైరెక్టర్లు.
తన మాటను ముంచెత్తేలా మరెవరో పక్కకు వచ్చి వాగితే వూరుకోరెవరూ. జవాబిస్తారు. ఇంకా వాగితే డిలిట్ చేసేస్తారు. ఈ భయం అందరికీ వుంటుంది. అందుకని ఏదంటే అది వాగరు ఎవరూ. సెల్ఫ్ అకౌంటింగ్ వుంటుంది ప్రతి రచనలో. ఇప్పుడు ప్రతి వ్యక్తీ వార్తాహరుడే. ప్రతి వ్యక్తీ పాఠకుడే. మన జీవితంలో మనకు మనమే యాక్టర్లం, స్క్రిప్టు రైటర్లం కూడా.
అప్పుడెప్పడో గత శతాబ్ది పెనల్టిమేట్ దశాబ్దిలో ఒక కవి రాసేడు:
“అంతా బాగా చదువుకుని వచ్చారా
అయితే పూర్తిగా మరిచిపొండి
మావో మిలిటరీ రచనలు
చదవనందు వల్లనే
క్యూబాలో ఫిడేల్
బాగా మోగిందట
దెబ్బకు ఠా దొంగల ముఠా
ఇక ఎవ్వరూ వేషాలు వేయక్కర్లేదు
పాత్రల్లో జీవించక్కరలేదు
జీవితమే పాత్రిస్తుంది”
ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నది అదే. ఇది నటనను తోసి రాజని జీవితం వేదిక ఎక్కుతున్న దృశ్యం. వేదిక ఇంకా ఖాలీ కాలేదు. వేదిక మీద పాత నటులింకా వున్నారు. ఉంటారు. ‘వేషాలు’ మానేస్తారు. వేదిక దిగి పోరు. ప్రేక్షకులు వేదికలెక్కకుండా ఆపనూ లేరు. ప్రపంచ వేదిక మీద మనుషులు ఒకరిని అకామడేట్ చేసుకునేలా మరొకరు సర్దుకోక తప్పదిక.
అచ్చు పత్రికల్లో ఈ అందమైన అరాచకం కుదరదు. ఈ ఫలప్రద ఇండిసిప్లిన్ కుదరదు. పెయిడ్ ఎడిటర్లుంటారు. వాళ్లు తమకు జీతాలిచ్చే వాళ్లు చెప్పినట్లు వింటారు. చాల సార్లు ప్రజల్ని ప్రవేశ ద్వారం వద్దనే నియంత్రిస్తారు. లేదా నిర్గమన ద్వారాలు మూసేసి చాణక్య వ్యూహాలకు బలి చేస్తారు.
అచ్చు పత్రికల్లో వున్న వాళ్లంతా సర్వజ్జ్ఞ సింగ భూపాలురా ఏమి? ఏమీ కాదు. వాళ్లకు తెలీదని వాళ్లకు తెలీదు. తమకు తెలీదని తెలిసిన వొకరిద్దరు ఆ సంగతి బయటికి తెలీనివ్వరు.
ఎన్ని సంగతులు మాట్లాడుకుంటున్నాం మనం సోషల్ మీడియాలో. వావ్, అసలు ప్రింటు మీడియం అవసరం ఇంకా వుందా అని అనుమానం, వూరికే న్యూస్ ప్రింటు తినేయడానికి కాకపోతే, ఆ విధంగా కాగితం తయారీ కోసం మరిన్ని అడవుల్ని బలి చేయడానికి కాకపోతే.
ఇవాళ అచ్చు పత్రికలు ఎలా వున్నాయో ఒకసారి చూడరాదూ. తెలుగు నాట ఒక కులానికి, ఆ కులానుకూల రాజకీయాలకు సేవ చేసి తరించేవి కనీసం రెండు పత్రికలున్నాయి. ఇంకో కులానుకూల రాజకీయం కోసం ఒక పత్రిక. మరొకటీ వుంది గాని అది కేవలం న్యూస్ ప్రింటు వ్యాపారి. ఇవి కాకుండా తెలుగు నాట పత్రికలున్నాయా? ఆఁ ఇంకొకటుంది. ఒక కులం వాళ్ల వుద్యోగాల కోసం. ఒకాయన, ఫరినస్టెన్స జగన్ మాట్లాడిందేమిటో తెలుసుకోవాలంటే కనీసం రెండు పత్రికలు చదవాలి. ఒక పత్రికలో ఆయన మాటల్లోని తెలివి తక్కువతనం మాత్రమే వుంటుంది. ఒక పత్రికలో ఆయన మాటల్లోని తెలివితేటలు మాత్రమే వుంటాయి. దానికి తగినట్లు ఫోటోలు, కార్టూన్లు వుంటాయి.
అచ్చంగా ఆయన ఏం మాట్లాడాడో చూసి, మన నిర్ణయానికి మనం రావాలంటే రోజూ రెండు పత్రికలూ చదవాలి. ఒక మతం తన వ్యతిరేకత ద్వారా రెండో మతానికి వూతం అయినట్టు, ఈ పత్రికల్లో ఒకటి మరో దాని వునికిని సార్థకం చేస్తుంది. జనం రెండూ చదవాల్సిందే, మరింత న్యూస్ ప్రింటు తగలేస్తూ.
ఆ మధ్య తమిళ నాట, శశికళ ఎమ్మెల్యేలను మంద పెట్టిన వేళ- అలాంటివి గతంలో చాల చోట్ల జరిగాయని ఒక భారీ ‘రిసర్చ్ అండ్ అనాలిసిస్’ కథనం ప్రచురించిన ఘనత వహించిన ఈనాడు వారికి, మొన్నటికి మొన్న ఎన్టీయార్ వెన్నులో పొడిచిన చంద్రహాసం గుర్తుకు రాలేదు. ఆ నాడు వైస్రాయి హోటల్లో మంద కట్టిన గొర్రెలు గుర్తుకు రాలేదు. అలాంటి తెలుగు ఘటనలన్నీ నాదెండ్ల భాస్కర రావుతో ఆగిపోతాయి, ఆ పత్రికకు సంబంధించినంత వరకు.
మీకు ఈనాడులో దొరకని వార్తలు, నవ్వు గీతలు (కార్టూన్లు) కావాలా… అయితే దయచేసి సాక్షి చదవండి. ఒకసారి ఒక సభలో జయప్రకాష్ నారాయణ్… రాజకీయ పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ ను, తెలుగు దేశాన్ని పేర్లు పెట్టి తిట్టాడు. ఆయన కాంగ్రెస్ ను తిట్టింది ఈనాడు, ఆంధ్ర జ్యోతిల్లో వచ్చింది. అరె, ఏంటీయన అన్ని పార్టీల్లో అవినీతిని వ్యతిరేకిస్తానన్నాడే అని విసుగేసింది. అదే రోజు ప్రమాద వశాత్తు సాక్షి చదివాను. ఆయన తెలుగు దేశాన్ని తిట్టిన ప్రసంగ భాగం సాక్షిలో నివేదితం. అట్టాంటి సగం సగం వార్తలు ఐదారు చూశాక, ఇక చదివితే రెండు పత్రికలు చదవాలి, లేకుంటే అసలు పత్రికలు చూడొద్దు అని తేల్చేసుకున్నాను.
సోషల్ మీడియాలో అది కుదరదు. నువ్వు సగం వార్తనే రాస్తే, ఎవరో అందులో మిగతా సగం ఇదండీ, మీరు గమనించినట్లు లేరు అని దాని ముడ్డి కిందనే చురకలు పెడతారు. అలాగని అబద్దాలు, వట్టి అల్లరి మాటలు రాసినా కుదరదు. ఆ వెంటనే అవతలాయన అందుకుంటాడు. మీరు మీ వ్యాసాన్ని తెచ్చి తన వ్యాసం కింద ప్రచురిస్తే, పోవోయ్ నువ్వూ నీ పాండిత్యమూ అని దాన్ని డిలిట్ చేసి, మీ ‘స్థలా’నికి మిమ్మల్ని పంపిస్తాడు.
కార్గిల్ సమరంలో చనిపోయిన సైనికుని కూతురు ఒకమ్మాయి, పేరు కౌర్… ‘మా నాన్న చనిపోయింది పాకిస్తాన్ వల్ల కాదు, యుద్ధం వల్ల’ అని ప్లేకార్డు మీద విశ్వమానవ గీతం పాడితే, క్రికెట్ వీరుడు సెహ్వాగ్ తన ‘మూడొందల పరుగుల ఘనత తనది కాదు, తన బ్యాట్ ది’ అని ఆమెను ఎద్దేవా చేశాడు. రెండో దాన్ని చాల ఎక్కువ మంది చూసుంటారు, ఆయన ఒక క్రికెటర్ కాబట్టి, క్రికెట్ ఆట అనేది భారత రత్నకు అర్హమైన ఘన కార్యం కాబట్టి.
ఈ సంవాదం జరిగింది అచ్చు పత్రికలో అయితే ఈ కథనం క్రికెటర్ సెహ్వాగ్ గారి డో… ఎర్… జోకుతో ఆగిపోయేది. కౌర్ మొదటి పోస్టు, దానికి సెహ్వాగ్ వ్యంగ్యం రెండూ ట్విట్టర్ అనే ఒక సోషల్ మీడియం లో వెలువడ్డాయి కాబట్టి, సంవాదం ఆగిపోలేదు. సెహ్వాగ్ అన్యాయ వాక్కుల మీద సత్యాగ్రహ విమర్శ ట్విట్టర్ లో కార్చిచ్చులా వ్యాపించింది. చూడరాదూ, ఎలాగూ ఏడుస్తున్నారని సెహ్వాగు తరహా ప్రేలాపనల మీద ఇక్కడ నేనూ ఓటిచ్చుకోడంలా?! ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో సెహ్వాగ్ వీపు, ఆయన ఫ్రెండు వీపు విమానం మోత మోగాయి. అచ్చు పత్రికలు విధించే సో కాల్డ్ డిసిప్లిన్ కింద ఇది సాధ్యమయ్యేది కాదు. కౌర్ వ్యతిరేకులు మామూలు వాళ్లు కాదు. అధికారంలో వున్న వాళ్లు. ఆ అధికారం వెనుక ఇంకా బాగా వున్న వాళ్లున్నారు. పత్రికల్ని కొనడం వాళ్లకు బాగా తెలిసిన విద్య.
అచ్చు పత్రికలో మన మాట మనం పూర్తిగా చెప్పాలంటే ఆ పత్రిక సంపాదకుడు, ఉప సంపాదకుడు, పొద్దున్నే అక్కడ కసవు వూడ్చే మనిషి కూడా మనకు తెలిసి వుండాలి. మీరు మీ పేపర్ స్టేట్మెంటు తీసుకెళ్లే సమయానికి ఆఫీసులో వున్నది ఆయన ఒక్కడే అయితే ఆయన దాన్ని వూడ్చి పారేయకుండా మనమే చూసుకోవాలి మరి.
అచ్చు పత్రిక పర్సనల్ డిపార్ట్ మెంటులో క్లెర్క్ అయినా సరే, ఆయనకు లేక ఆమెకు భలే ప్రతిష్ఠ వుంటుంది. వాళ్ల వాహనాల మీద ప్రెస్ అని రాసి వుంటుంది. నాలుగు రోడ్ల కాడ నరలోకం యములు కూడా ఆ అక్షరాల వైపు ఓ చిర్నవ్వు విసిరి వెళ్లనిస్తారు, ఎర్ర లైటు దూకేసినా, లైసెన్సు లేకుండా బండి నడిపినా ఏమీ అడగరు. మరీ క్లర్కులు కాదు గాని… మునుపు స్ట్రింగర్లు అనబడే లోయెస్ట్ మెట్టు మీది జర్నలిస్టులు కూడా ‘వార్త’ల పేరిట బాగానే డబ్బులు చేసుకునే వారు.
ఇప్పుడు ఆ చిల్లర యాపారం పూర్తిగా ఆగిపోయిందనుకోను. కొత్త సెటప్ లో దానికి వీలైన సందులు అది చూసుకుని వుంటుంది. కాకపోతే ఇవాళ అదొక పెద్ద విశేషం కాదు. ఇన్నాళ్లు ఆ చిల్లర వ్యాపారానికి గొడుగు పట్టిన యజమానులు… తమ స్ట్రింగర్లు చూపిన మార్గంలో… టోకు వ్యాపారం మొదలెట్టారు. వస్తు వ్యాపారంలో చిన్న వ్యాపారులు పోయి కార్పొరేట్లు వచ్చినట్లే, మునుపు స్ట్రింగర్లు చిల్లరగా చేసిన పని ఇప్పుడు బడా యజమానులు కార్పరేట్ స్థాయిలో చేస్తున్నారు. వస్తు వ్యాపారం కన్న ముందే వార్తా వ్యాపారం బడా పెట్టుబడి కైవసమయిపోయింది. స్ట్రింగర్ల మాదిరి ఒకటి రెండు వార్తల్ని అమ్ముకోడం కాదు, పత్రికల్నే అమ్ముకోడం మొదలయ్యింది.
దీనిలో ఇమిడి వున్న భారీ లాభాల్ని.. మరిన్ని భారీ లాభాలకు బాట వేసే మార్గాల్ని బిలియనీర్లు ఎప్పుడో గుర్తించారు. పత్రికలకు పత్రికల్ని, ఛానెళ్లకు ఛానెళ్లను, మాజీ ప్రతిష్ఠలతో కాంతిల్లే కలాల్ని… తమ దగ్గరున్నవో, తమ చేతుల్లోని ప్రభుత్వాల దగ్గరున్నవో కాసులు గుమ్మరించి కొనేశారు.
తమ ఛెయిన్ పత్రికల్ని తాము మొదలెట్టడం, అప్పటికి ప్రాచుర్యంలో వున్న వాటిని కొనేసి కలిపేసుకోడం, మోనోపొలీ ఆధారంగా మరిన్ని లాభాలు గడించడం ఇప్పటికే స్థిర పడింది. క్రోనీ కేపిటలిజానికి (అనగా, ప్రభుత్వ ప్రాపకం వున్న కేపిటలిజానికి) ఇప్పటికే ఒక బేస్ తయారయిపోయింది.
ఇప్పుడు పేర్లూ అవీ ఎందుగ్గానీ, ఈ ప్రహసన ప్రాయ నాటకంలో ఉత్తర భారతీయులు, తెలుగు పాత్రధారులు అందరూ మనకు తెలుసు. అంత బతుకూ బతికి ఇంటెనక చచ్చామనే సంగతి వారిలో కొందరికి తెలీక పోవచ్చు గాని, జరిగింది అదే.
నిజానికి అసలు కథకు ఇది తుది కాదు. కేవలం మొదలు. అది ఎట్లన్నన్…
వాళ్లు ఎంత పకడ్బందీ వలయం తయారు చేసినా ఈ డెమాక్రటిక్ స్పిరిట్ అనేది ఏదుందో అది చావనంటోంది. అది ఎప్పటికీ చావదు. మునుపు లోకాన్ని కావిలించుకోబోయిన భూకబంధులను ఎదిరించి జనమూ, పెట్టుబడిదారులూ కలిసి సంపాదించిన వజ్రాయుధం ప్రజా స్వామ్యమనే భావన. అది పోలేదు. దాన్ని జనాల చేతుల్లోంచి తీసెయ్యాలనే ప్రయత్నాలు ఫలించవు. అది వుంది. దాన్నెవరూ ఏమీ చేయలేరిక. ఒక ఆధారం పోతే మరో ఆధారాన్ని అల్లుకుంటుంది, పొలంలో ‘అముడుక’ మాదిరి ప్రజాస్వామ్య భావన..
ఓయ్, నా వార్తను మీరు అచ్చేయరా? పోదురూ, మీ బడాయి. అచ్చు వేదికలకు ఎలాగూ మునుపటి క్రెడిబిలిటీ లేదు. మీరు ఆ కుర్చీల్లోకి చేరినప్పుడే పోయింది. ప్రజలకు వార్తలు కావాలి. ఇక వాళ్లకు నిజమైన వార్తల్ని ఎవరో ఇవ్వరు. వాళ్లకు వాళ్లే వార్తాహరులు. ఈ సెటప్ పేరే సోషల్ మీడియా.
ఈ ‘కడలి తరగల నాపగలవా భడవా ఓ కాన్యూట్’ అంటారిక జనం, కవి శివసాగర్ స్వరం కాసేపు అరువు తీసుకుని. ఈ రకం ఇండిసిప్లిన్ తనను తాను క్రమబద్ధం చేసుకుంటుంది. చేసుకుంటోంది.
అప్పుడప్పుడు జనం తమలో తాము పేచీ పడుతారు. వైమస్యాల పాలవుతారు. నేర్చుకుంటున్నారు. ప్రతి వాక్యం ఒక అనుభవంగా నేర్చుకుంటున్నారు. ప్రజల మధ్య… మీరు కూడా వున్నారు. ఉంటారు. ఉండండి. ఎన్నాళ్లు వుండగలిగితే అన్నాళ్లు వుండండి. మీక్కూడా స్థలం వున్న అచ్చమైన ప్రజాస్వామ్యమిది. ఇది మీకు ఇష్టమయ్యేకొద్దీ మీరు కూడా ఇందులో.. ఈ ప్రజాతంత్ర స్ఫూర్తిలో… కలిసిపోతారు, కరిగిపోతారు.
ఓయ్యోవ్! గత శతాబ్ది పెనల్టిమేట్ దశాబ్దిలో ఓ కవి రాసిన మాట అని ఒక నురగ రాశాను పైన. ఆ పద్యంలోని చివరి నురగ చెప్పనా, ఈ వ్యాసానికిలా ‘భరత వాక్యం’గా?!.
“హమ్మయ్య, తెర లేస్తోంది
కోటి నిట్టూర్పుల వేడికి వేదిక రగుల్తోంది
చూడు చూడు కృష్ణుడు
కర్ణునితో కలసి మందు కొడుతున్నాడు
ఈ రాత్రికి తాగబోయించిన వాడే
రేపటి ధర్మజుడుప్రేక్షక మహాశయులారా లేవండి
వేదిక మీది, ఆక్రమించండి”
ఫ్రెండ్స్ ఇక వేదిక మనందరిదీ, అక్రమిద్దాం.
**** (*) ****
కడిగేశారుగా సుబ్భారంగా.. బోల్డ్ బోల్డ్.. థాంక్స్.. పొతే.. కడలి తరగల నాపగలవా భడవా ఓ కాన్యూట్.. అని అన్నది శ్రీశ్రీ అని అనుకుంట..
కడిగి వేశారు
ఉతికారు–
దోపిడీ. వ్యవస్థ లో జరుగుతున్న తీరును చక్కగా కెలికారు సర్
====================
బుచ్చిరెడ్డి గంగుల
చాల థాంక్స్ మోహన్. వెరిఫై చేద్దామంటే ఇక్కడి పుస్తకాల్లో శివసాగర్ బుక్కు వెంటనే దొరకలేదు. ఈ లైను శివ సాగర్. పుస్తకం దొరికితే చూసి తప్పయితే, ఇక్కడికి వచ్చి చెబవుతా.
ఎవరెలాంటి అర్ధం చెప్పుకున్నా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే! ఎవరూ ఎవర్నీ నిజంగా నియంత్రించలేరు. నన్ను నేను నియంత్రించుకోగలను. నేను సిగరెట్టు తాగడం మానేస్తా అది చెడ్డదని నమ్మి. మరొకణ్ణి నమ్మమని నేను చెప్పినా లాభం లేదు. థియేటర్లో సినిమా చూసి దశాబ్దం అయింది. వార్తా పత్రికలూ అంతే. ప్రింటు, విసువల్ మీడియా ఒకళ్ళ చేతుల్లోనే వున్నప్పుడు చదివినా చూసినా ఒకటే ఫలితం. అన్నీ మూసుకుని కూర్చోవాల్సిన ఆధునికోత్తర కాలంలో సోషల్ మీడియా రావడం, అది దాని ప్రభావాన్ని విస్తరిస్తుండడం, అదే మీడియా లో మంచి పత్రికలు రావడం, ప్రజాస్వామ్య వాదులకు ఆశారేఖ! నిఖార్సయిన నిజాయితీ ఉట్టిపడే ఇలాంటి వ్యాసాలే ప్రజాస్వామ్య సిద్ధాంతానికి ఊపిరి పొసేవి. హెచ్చార్కే గార్కి ధన్యవాదాలు.
అద్భుతం.
దేవరకొండ గారు, ఆలస్యంగా చూశాను. థాంక్యూ. “ఆధునికోత్తర కాలంలో సోషల్ మీడియా రావడం, అది దాని ప్రభావాన్ని విస్తరిస్తుండడం, అదే మీడియా లో మంచి పత్రికలు రావడం, ప్రజాస్వామ్య వాదులకు ఆశారేఖ!”. నిజం సర్. ఇటీవల పలు ఘటనల్లో సోషల్ మీడియా ప్రజలకు అండగా నిలబడింది.