నీరెండ మెరుపు

ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ ఇంద్రగంటి కవిత!

15-ఫిబ్రవరి-2013

జీవన ప్రస్థానంలో ఏదో ఒక మజిలీ దగ్గర ఆగి వెనక్కి తిరిగిచూసుకుంటే ఎన్నో సంతోషాలు.. ఆవేశాలు.. అవస్థలు.. ప్రేమలూ.. వేదనలూనూ!

అవి అనుభవించేప్పుడు మనఃస్థితి ఎలా ఉన్నా దాటేశాక మాత్రం ప్రతి జ్ఞాపకమో పరిమళాన్ని సంతరించుకుంటుంది. ఆ పరిమళాలే ప్రేరణగా మనల్ని స్పృశించే కవిత ఇది. “స్వప్నం నా ఊత కర్ర.. నిశ్శబ్దం నా గమ్యం..” అని చెప్పుకునే శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి అనుభూతి గీతాల సంపుటిలోదీ కవిత. చదువుతున్నంతసేపూ అనుభూతి నించి ఆలోచనకూ.. ఆలోచన నించి అనుభూతికీ సాగే అంతర్లోక భావనా సంద్రమొకటి అద్భుతమైన పదచిత్రాల ద్వారా సాకారమౌతుంది. అప్పట్లో కవిత్వం పేరిట కొందరు ప్రాధాన్యం ఇచ్చే విషయాలకు (ఛందస్సు, ప్రాస) భిన్నంగా 1976 లో ప్రచురింపబడిన ‘అనుభూతి గీతాలు ‘ సంపుటిలో ఏ గీతానికీ ఒక నిర్దుష్టమైన పేరు లేదు! కానీ ఈ గీతానికి ‘జ్ఞాపకాల హవేలీ’ అని నామకరణం చేశేయవచ్చు.

సాయంత్రం నించీ కురుస్తున్న వర్షం ఆగిపోయిన నిశ్శబ్దంలోనో.. అర్ధమయ్యీ అవనట్టుండే బెంగ ఒకటి మన చుట్టూనే మసలుతున్నప్పుడో.. ఒంటరితనపు తెరలు దించేసుకున్న వ్యక్తిగతసమయాలు కొన్ని ఉంటాయి. పరిశరాలు నీరవమయినా మనసులో మాత్రం ఆలోచనల రహస్య కోలాహలం మొదలవుతుంది. అచ్చు సందెవేళకి గూటికి తిరిగొచ్చిన గువ్వల కువకువలతో నిండిన చెట్టల్లే తుళ్ళిపడుతుంటుంది. మరిచిపోయినవో.. మరిచిపోవాలనుకున్నవో జ్ఞాపకాలు ఆ రాత్రప్పుడు సుదూరాలనించి సమీపానికొస్తాయి. ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ కవిత!

ఇందులో సంక్లిష్టమైన పదాలు, విడమర్చి చెప్పాల్సిన సమాసాలు, నిగూఢ ఆలోచనలు, రెండు మూడు సార్లు చదివితేగానీ తలకెక్కని తాత్వికత… ఇవేవీ ఉండవు! “స్పష్టమైన శబ్దం ఆధారంగా అపురూపానుభవాల నిశ్శబ్ద ప్రపంచంలో ప్రవేశించడం కవిత్వపరమావధి అనుకుంటున్నాను” అనే ఇంద్రగంటి గారి మాటలే ప్రమాణంగా కవిత ఆద్యంతం మేఘాలు కదులుతున్నంత మృదువుగా సాగిపోతుంది.

***

జ్ఞాపకాల హవేలీలో
అప్పుడప్పుడొక పరిమళాల దర్బారు జరుగుతుంది
సుతిమెత్తని వేళ్ళతో
కిటికీ తలుపు తట్టి
పూలకొమ్మకటి తల లోపలికి పెట్టి
కాస్తంత పరిమళం చల్లి చక్కాపోతుంది
ఎక్కడనించో ఒక అగరు మబ్బు
పల్చ పల్చగా జరిగివచ్చి
పడకింటి మంచానికి పందిరివేస్తుంది
గది గుమ్మానికీ
గది గుమ్మానికీ మధ్య
సుతారంగా కదిలే తెరల మీద
అత్తరు గుబాళింపుల సన్నివేశాన్ని
ముద్రించి ఒక వయస్సు వెళ్ళి పోతుంది…

దూరాకాశ తారావీధుల్లో
సంచరించే ఒంటరి మనస్సు దర్బారులో ప్రవేశిస్తుంది-
సావధానంగా విశ్రమించే మనస్సన్నిధిలో
ఒక్కొక్క జీవన పరిమళం చేతులు కట్టుకు
నిలబడి తన్ను తాను పరిచయం చేసుకుంటుంది.
హవేలీలో కోలాహలం అర్ధరాత్రయినా
కొనసాగుతుంది విరగబడే నవ్వులు…..
సంతోషపు కన్నీరు….
పరాచికాలు…..
ఇంత సందడి జరుగుతున్నా
మనసు మాత్రం ఏమీ చెప్పా పెట్టాకుండా
వెన్నెల రెక్కలు తొడుక్కుని
యౌవనవనాల వైపు వెళ్ళిపోతూంటుంది…
అప్పుడీ హవేలీ
శూన్యంగా మిగిలిపోదు
పరిమళాల సంగీతం వినిపిస్తూనే ఉంటుంది.

***

కవిత పూర్తవుతుంది.. కానీ మనం మాత్రం ఈసారి మనవైన జ్ఞాపకాలతో మళ్ళీ ఆ హవేలీలోకి ప్రవేశిస్తాం.. ఆ సందడిని కొనసాగిస్తాం! అంతేకాదు, దిగ్గున లేచి, దగ్గర్లో ఉన్నకిటికీ తెరిచి.. పరదాలు పక్కకు జరిపి.. రెండు చేతులూ బయటకు చాపి.. నిశ్శబ్దంగా తిరుగాడుతున్న గాలిని స్పర్శించాలనే ఉద్వేగం కలుగుతుంది. కొన్ని కవితలింతే! శ్రవ్యమో.. దృశ్యమో తేల్చి చెప్పడం బహుకష్టం!!

దైనందిన సంఘర్షణల ఊపిరాడనితనంలోనించి తాత్కాలిక విముక్తి అయినా ఇవ్వగలిగే సాహిత్యమేదైనా మనసుపై శాశ్వతముద్ర వేయగలుగుతుంది. మన మౌన సమక్షంలో చెంతనే నిలుస్తుంది.

“కవిత్వం సమూహాలను సంబోధించడంగా కాకుండా ఏకాంతంలో వ్యక్తిని విద్యుత్కరించేది అయి ఉండాలి” అనే ఇంద్రగంటిగారి నమ్మికకు ఈ కవిత ఒక మంచి ఉదాహరణ!

 

 

 

 

 

-నిషిగంధ