కవిత్వం

అత్యాచారం

15-ఫిబ్రవరి-2013

అత్యాచారానికి గురి కావడానికీ
ఎత్తయిన మెట్ల మీదినుంచి తోసేయబడడానికీ
తేడా ఏమీ లేదు,
కాకపోతే ఈ గాయాలు లోపల కూడ నెత్తురు స్రవిస్తాయి.
అత్యాచారానికి గురి కావడానికీ
ట్రక్కు గుద్దిపోవడానికీ తేడా ఏమీ లేదు
కాకపోతే ఆతర్వాత అది బాగుండిందా అని మగవాళ్లు వెటకరిస్తారు
అత్యాచారానికి గురి కావడానికీ
కట్లపాము కాటుకూ తేడా ఏమీ లేదు
కాకపోతే నువు కురచ గౌను తొడుక్కుని ఉన్నావా అనీ
అసలు బైట ఒక్కదానివే ఎందుకున్నావనీ జనం అడుగుతారు.

అత్యాచారానికి గురి కావడానికీ
ప్రమాదంలో కారు అద్దం పగిలి బైటికి విసిరేయబడడానికీ
ఏమీ తేడా లేదు
కాకపోతే ఆతర్వాత నువు కార్ల గురించి భయపడవు గాని
మానవజాతిలో సగం గురించి భయపడతావు
అత్యాచారం చేసినవాడు నీ స్నేహితుడి తమ్ముడే
సినిమాలో నీ పక్కన కూచుని పేలాలు నమిలేవాడే
అతి మామూలు మగవాడి ఊహలలో కూడ అత్యాచారం
చెత్తకుప్పలో క్రిమిలాగ బలిసిపోతుంది

తలవంచుకున్న స్త్రీ వీపు మీద
ఎల్లప్పుడూ తగిలే చల్లగాలి లాంటిది అత్యాచార భయం
బారు చెట్ల మధ్య ఇసుకదారిలో ఒంటరిగా ఎప్పుడూ నడవకు
నీ వైపే మగవాడొస్తున్నప్పుడు
బోడి కొండ మీద కాలిబాటలో
నిర్భయంగా పైకెక్కుతూ వెళ్లకు

గొంతు కింద అడ్డుపడుతున్న కత్తివాదర లేకుండా
తలుపు చప్పుడుకు స్పందించకు తలుపులు తెరవకు
దారిపక్కన పొదలవెనుక ఏముందో అని భయం
కారులో వెనక సీటంటే భయం
ఖాళీ ఇల్లంటే భయం
తాళపు చేతుల సవ్వడి పాము బుసతో సమానం
చిరునవ్వు నవ్వే మగవాడంటే భయం
వాడి జేబులో చురకత్తి
నా పక్కటెముకల్లో దిగిపోవడానికి ఎదురుచూస్తుంటుంది
ఆ చురకత్తి పట్టుకున్న పిడికిటి నిండా నా మీద ద్వేషం

వాణ్ని తోసేయాలంటే
నువ్వు నీ దేహాన్ని సుత్తెలా, కాగడాలా, మరతుపాకిలా మార్చుకోవాలి
వదులైపోయే, మెత్తబడే నీ సొంత శరీరాన్ని,
నీ అస్తిత్వాన్ని, నీ నరాలను నువు ద్వేషించాలి
నువు ద్వేషించే, నువు భయపడే ఆ దేహాన్ని
మరొకరి మెత్తని చర్మం మీదికి తోయాలి

స్పర్శ లేని లోహపాదాలు ధరించిన
అపరాజిత శతఘ్నిలాగ దూకాలి
ఒకేఒక్క చర్యలో కబళించాలి శిక్షించాలి
ఆనందాన్ని తుత్తునియలు చేయాలి
ప్రేమ కోసం తెరుచుకున్న లేత ఆకులాంటి చర్మంమీద
నివసించడానికి సాహసించేవాళ్లను హత్య చేయాలి

-మార్గె పియెర్సీ

మార్గె పియెర్సీ (1936) అమెరికన్ కవయిత్రి, నవలారచయిత్రి, సామాజిక కార్యకర్త. ఈ కవిత మొదట ఫెమినిస్ట్ అలయన్స్ అగెనెస్ట్ రేప్ న్యూస్ లెటర్ ‘రెడ్ వార్ స్టిక్స్’ ఏప్రిల్/మే 1975 సంచికలో వెలువడింది.
తెలుగు: ఎన్ వేణుగోపాల్