నుడి-18 ఫలితాలు, జవాబులు, వివరణలు
పాఠకులకు నమస్కారం.
ఈ సారి ‘నుడి’ని రవిచంద్ర ఇనగంటి ఒక్కరే ఒక్క తప్పు కూడా లేకుండా పూరించారు. ఒక తప్పుతో పూరించినవారు ఆరుగురు. వారు:
1. మాడిశెట్టి రామారావు
2. కార్తీక్ చంద్ర పి.వి.ఎస్.
3. రాంమోహన్ రావు తుమ్మూరి
4. రమాదేవి
5. పి.సి. రాములు
6. హేమనళిని
విజేతలకు అభినందనలు. ఎక్కువ మంది 32 నిలువు, 11 నిలువు, 5 అడ్డంల దగ్గర తడబడ్డారు.
ఇక కొన్ని ఆధారాలకు జవాబులను, వాటికి వివరణలను చూద్దాం.
1 అడ్డం: దీనికి జవాబు లోకానికి. ఇక్కడ ‘కాకిలోని’ అన్నది anagram.
3 అడ్డం: దీనికి జవాబు ప్రసాదితం. ప్రధానంగా అంటే మొదటి అక్షరాలు. ప్రతిష్ఠాత్మకమైన, సానుకూలమైన, దివ్యమైన, తంత్రభరితమైన – ఈ పదాల మొదటి అక్షరాలను కలిపితే ప్రసాదితం వస్తుంది.
5 అడ్డం: మెత్తనికి విశేషణం సుతి (సుతిమెత్తని అంటాం కదా). ప్రాథమికంగా అంటే మొదటి అక్షరమని అర్థం చేసుకోవాలి. అంటే దహించుకుపోయే లోని ద. సుతిలో ‘ద’ను చేర్చితే వచ్చే సుదతి జవాబు. కొందరు సుమతి అని పూరించారు.
6 అడ్డం: తిరగేసిన చిక్కులకు = కులక్కుచి. 38 అడ్డంకు జవాబు చికురాలు. అందులోని సగమైన ‘చికు’ను కులక్కుచిలోంచి తొలగిస్తే వచ్చే లక్కు ఈ ఆధారానికి సమాధానం.
7 అడ్డం: రాబోయే కాలం = భవిష్యత్తు. అందులో మొదటి సగమైన భవి = గృహస్థుడు. కనుక అదే జవాబు.
9 అడ్డం: ములాయం = మృదువు (హిందీ/ఉర్దూ భాషలో). ములాయం సింగ్ లో చాలావరకు (అంటే పూర్తిగా కాకుండా కొంత మాత్రమే) తీసుకోవాలి. అట్లా చేస్తే వచ్చే ములాయం దీనికి సమాధానం.
12 అడ్డం: ఉర్దూ భాష మాండలికంలో మామా = మామూ. ఈ పదం మూడుసార్లు వచ్చింది కనుక బహువచనమైన ‘మామూ’లు సమాధానం. మామూలు = సాధారణం.
15 అడ్డం: దీనికి జవాబైన సారాయి ఈ ఆధారంలో ఎట్లాంటి మార్పు లేకుండా కనిపిస్తుంది.
19 అడ్డం: మధ్యమధ్య అంటే అక్షరం విడిచి అక్షరం. ‘రాకు మాతో’లో 1, 3 వ అక్షరాలను కలుపగా వచ్చే రామా = సీతాపతీ కనుక, సమాధానం అదే.
22 అడ్డం: కొందరు దీనికి వుజి అనే జవాబును రాశారు. శివాజిలో మొదటి అక్షరం (తల)ను తీసివేస్తే వాజి వస్తుంది. వాజి = గుర్రం కాబట్టి, అదే జవాబు.
23 అడ్డం: పోరగాడులో నడుమ అక్షరాలైన ‘రగా’ను తొలగిస్తే వచ్చే పోడు సమాధానం.
24 అడ్డం: వచ్చెయ్ కు విరుద్ధం రాకు. కనుక, అదే సమాధానం. 38 అడ్డంకు జవాబు చికురాలు. చిచిచి = ‘చి’లు. చికురాలు మైనస్ చిలు = కురా. కురా వెనుతిరిగితే రాకు వస్తుంది.
26 అడ్డం: కాలరులోని మొదటి అక్షరమైన కా లోని దీర్ఘాన్ని కత్తిరిస్తే వచ్చే క వస్తుంది. అప్పుడు కాలరు కలరుగా మారుతుంది. అదే జవాబు.
28 అడ్డం: గానం = పాట. పాటవాలు మైనస్ పాట = వాలు. కనుక అదే జవాబు. ఇది ఏటతో కలిసి ఏటవాలు అని వస్తుంది కదా కొన్నిసార్లు.
29 అడ్డం: కేక వేసె = అరిచె. అందులోని చివరి అక్షరమైన ‘చె’ను ‘సె’గా మార్చితే అరిసె వస్తుంది. అదే సమాధానం.
31 అడ్డం: హిహిహి, వీటిలో ఒకటి = హి. అపస్మారం = కోమా. కోమాలో ‘హి’ని చేర్చగా వచ్చే కోహిమా ఈ ఆధారానికి జవాబు.
37 అడ్డం: ఇక్కడ జవాబైన పతనము ఆధారంలో చెక్కు చెదరకుండా అట్లాగే కనిపిస్తుంది, చూడండి.
38 అడ్డం: చికురాలు = వెంట్రుకలు. కనుక, చికురాలు సమాధానం. చిచిచి = ‘చి’లు. ఎదురుగా రాకు = కురా. కురాను చిలులో చేర్చితే చికురాలు వస్తుంది.
1 నిలువు: ‘మునకలో’ను కిందినుండి పైకి వరుసగా గడులలో నింపితే వచ్చే లోకనము = చూచుట. కనుక, అదే జవాబు. లోకనముకు ముందు ‘ఆ’ వుంటే ఆలోకనము వస్తుంది. అప్పుడు కూడా అర్థం మారదు. లోకనము అన్నా ఆలోకనము అన్నా చూచుట అనే అర్థం.
4 నిలువు: పోగులు = తంతువులు. కనుక అదే జవాబు. తంతువులుకు ముందు వి (‘వి’కారం) చేరితే వితంతువులు వస్తుంది.
6 నిలువు: కలిసిపోవడంకు సమానార్థకమైన లయం ఇక్కడ జవాబు. నీలకాయం మైనస్ కానీ = లయం.
10 నిలువు: చిన్న పాత్రలా = కప్పులా. దాన్ని మిశ్రమం చేస్తే వచ్చే లాకప్పు (lock up) జవాబు.
11 నిలువు: కొంత మంది దీనికి గాభరా అనే జవాబును రాశారు. కాని, జవాబు గాబరా. గాభరా, గాబరా – వీటి మధ్య అర్థపరమైన భేదం లేకపోయినా గాభరాను సరైన సమాధానంగా ఒప్పుకోలేము. ఎందుకంటే, వంటకపు విశేషణం = బగారా (బగారా రైస్ బగారా, బైంగన్ అనే వంటకాలుంటాయి కదా.) బగారాను తారుమారు చేస్తే గాబరా వస్తుంది తప్ప గాభరా రాదు. ఇక్కడ వర్డ్ ప్లే ఉంది కాబట్టి, బగారాలోని అక్షరాలను ఏ మార్పూ లేకుండా జంబుల్ చేస్తే వచ్చేదే సరైన జవాబు.
13 నిలువు: అస్థిసారం = మూలగ. దీనిలోని రెండవ, మూడవ అక్షరాలకు కొమ్ములను తగిలిస్తే వచ్చే మూలుగు ఇక్కడ జవాబు.
14 నిలువు: ఇక్కడ ‘రాసే మిస’ anagram.
15 నిలువు: ప్రాథమికంగా అంటే మొదటి అక్షరం అని అర్థం చేసుకోవాలి. జిల్లా, కలెక్టరు, సారు – ఈ మూడు పదాల్లోని మొదటి అక్షరాలను కలిపితే జికసా వస్తుంది. దీన్ని కలగాపులగం చేయగా వచ్చే సాజికలో ‘మా’ను చేర్చితే సామాజిక ఏర్పడుతుంది. అదే జవాబు.
16 నిలువు: ‘కారు పోక యిటు’ను కిందినుండి పైకి రాస్తే టుయికపోరుకా వస్తుంది. పాము వేసేది = కాటు. టుయికపోరుకా మైనస్ కాటు = యిక పోరు. పోరు = యుద్ధం కనుక, సమాధానం యిక పోరు.
18 నిలువు: ఇక్కడ ‘రావసలు’ anagram. అందులోని అక్షరాలను తారుమారు చేస్తే సవరాలు వస్తుంది.
19 నిలువు: భార్య = ఆలు. ఆవారాలు మైనస్ ఆలు = వారా. వారాను కిందినుండి పైకి రాస్తే వచ్చే రావా సమాధానం.
21 నిలువు: రవిగాడులో 1, 3 వ అక్షరాలు మాయమైతే వచ్చే విడు ఇక్కడ జవాబు.
25 నిలువు: దీనికి జవాబైన కుమారి ఏ మార్పూ లేకుండా ఆధారంలోనే ఉంది.
27 నిలువు: ఎంట్రీలను పంపిన దాదాపు అందరూ ఈ ఆధారానికి సరైన సమాధానాన్ని రాయటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. అంటే ‘నుడి’ పాఠకుల అవగాహన ‘స్థాయి’ పెరిగిందని అర్థం. నిజానికి ఈ ఆధారానికి గీత అనే ఒక్క పదం మాత్రమే సరిపోతుంది. అయితే అప్పుడది డైరెక్ట్ క్లూ, లేక సింపుల్ క్లూ అవుతుంది. దాన్ని నిగూఢ ఆధారం (cryptic clue) గా మార్చటం కోసం మిగతా పదాలను కలపటం. లెవెల్ = స్థాయి. తారుమారైన లెవెల్ = యిస్థా. లకీ యిస్థారు మైనస్ యిస్థా = లకీరు = గీత కనుక, లకీరు అన్నది సమాధానం.
32 నిలువు: ఇక్కడ చాలా మంది తడబడటం నేను ఊహించని విషయం. మాతంగాలు, మా జీవాలు, మా వేటలు, మార్జాలాలు, మానవులు – ఇన్ని రకాల సమాధానాలు వచ్చాయి పాఠకులనుండి. ఈ ఆధారానికి జవాబు మాయావులు. మా + ఆమ్మ = మామ్మ కాలేదు కనుక, అక్కడ యడాగమం వచ్చి మా యమ్మ ఏర్పడినట్టే, ఇక్కడ మా + ఆవులు = మావులు కాలేక యడాగమం కారణంగా మాయావులు వచ్చింది.
34 నిలువు: వంచకుడికి విశేషణం = నయ (నయవంచకుడు అంటాం కదా). ముసలాయన మైనస్ నయ = ముసలా. దీన్ని తారుమారు చేస్తే వచ్చే సలాము జవాబు.
**** (*) ****
ఈ సారి గడి మెదడుకి బాగా పదును పెట్టింది