క్రిస్టినా మూఢనమ్మకాలు జీవితంలోని సహజత్వాన్ని తన కి దూరం చేస్తున్నాయా అనిపిస్తోంది నాకు. బొమ్మ మసకేసిన ఒక అరిగి పోయిన నాణెం, ఒక నల్ల సిరా చుక్క, అదాటున రెండు గాజు తలుపుల మధ్య నుంచి కనపడ్డ చంద్రుడు వీటిలో ఏదో ఒకటి చాలు ఆమెను హడల గొట్టడానికి. లక్కీ డ్రెస్ కదాని ఆ ఆకుపచ్చ్ డ్రెస్ ని చీలికలు వాలికలయ్యే దాకా వేసుకుంటూనే ఉంది. ఆ డ్రెస్ కంటే చక్కగా అతికినట్టు సరిపోయే నీలం రంగు డ్రెస్ వేసుకుంటే, ఆ రోజు నుంచి ఇక మేము కలుసుకోమని తన నమ్మకం! ఇలాటివన్నీ మరీ పిచ్చి నమ్మకాలని క్రిస్టినాకి నచ్చ జెప్పడానికి నేను చాలానే ప్రయత్నించాను. కానీ క్రిస్టినా ఇంట్లో ఉన్న పగిలి పోయిన అద్దాన్ని వెన్నెల రాత్రి నీళ్లలో పారేస్తే దరిద్రం వదులుతుంది అని చెప్పి చూసాను.
ఇంట్లో దీపాలన్నీ హటాత్తుగా ఆరిపోవడం మృత్యువుని సూచిస్తుందని నమ్మినా, క్రిస్టినా ఎంచేతో భయపడేది కాదు. బోల్డన్ని కొవ్వొత్తులు మరో ఆలోచన లేకుండా వెలిగించేది. అసలు తన భయాలు నమ్మకాలన్నీ చాలా వరకూ వ్యక్తిగతమైనవే. తనకు తానే కల్పించుకున్న అసౌకర్యాలనొచ్చు . . వేసవి లో స్ట్రాబెర్రీలు తినక పోవడం, కొన్ని రకాల సంగీతం అసలు వినక పోవడమూ, గోల్డ్ ఫిష్ ని తెచ్చి ఇంట్లో పెట్టుకోడమూ ఇలా…. !
అంతేనా? కొన్ని వీధుల్లోంచి మేము నడవరాదు, కొంత మంది మనుషుల మొహాలు చూడ్డమే దరిద్రం, కొన్ని సినిమా థియేటర్ల జోలికే పోరాదు, వాటిలో సినిమాలు చూడనే కూడదు
మొదట్లో ఆమె మూఢనమ్మకాలు అమాయకత్వంగానూ, అంచేత అందంగానూ కనపడిన మాట నిజమే అయినా రాను రాను చిరాకు మొదలైంది. కంగారుగా కూడా అనిపించసాగింది.
మా ఇద్దరికీ నిశ్చితార్థం అయ్యాక సరి కొత్త అపార్ట్మెంట్ కోసం వెదకటం ప్రారంభించాం. ఇంతకు ముందు ఎవరైనా నివసించిన ఇంట్లో మేము చేరితే వాళ్ల దరిద్రాలన్నీ తనకు చుట్టుకుంటాయని క్రిస్టినా నమ్మకం. (మా జీవితాలు ప్రేమతో ముడిపడినా ఈ విషయంలో క్రిస్టినా తన గురించే ప్రస్తావించింది తప్ప నా పేరైనా ఎత్తలేదు)
వూర్లో ఎన్నో పేటలు తిరిగాము కొత్త అపార్టెమెంట్ కోసం. శివార్లు కూడా వదల్లేదు. కొత్త ఇళ్ళేవీ దొరకలేదు. చివరికి “మాంటెస్ దొ ఓకా” వీధిలో ఒక ముచ్చటైన చిన్న ఇల్లు దొరికింది. తెల్లగా అద్భుతంగా మెరిసి పోయే గోడలతో అచ్చం పంచదార తో కట్టినట్టు అనిపించింది. చూడగానే ఆకర్షించింది. ఇంటి ముందు చిన్న తోట, ఇంట్లో ఒక టెలిఫోన్ మాత్రం ఉన్నాయి.
అది కొత్త ఇల్లనుకున్నాను గానీ తర్వాత తెలిసిందేమిటంటే, ఇంతకు ముందే ఎవరో ఆ ఇంట్లో నివాసముండి ఖాళీ చేశాక ఇంటి ఓనర్ దాన్ని రీ మోడల్ చేయించాడు. అందుకే ఆ కొత్తదనం. ఆ ఇల్లు కలల కుటీరంలా అనిపించడంతో, అది కొత్త ఇల్లని క్రిస్టినా ని నమ్మించడం అనివార్యమైంది . ఆ ఇల్లు చూడగానే క్రిస్టినా ఆనందం పట్టలేక పోయింది.
“మనం చూసిన అపార్ట్మెంట్ లన్నిటికంటే ఇదెంత బావుందో! ఎంత శుభ్రంగా ఉందో. ఈ ఇంట్లో ఎవరి దిష్టీ మనకిక తగలదు” అంది మురిసిపోతూ
***
కొద్ది రోజుల తర్వాత పెళ్ళాడి ఆ ఇంట్లో కాపురం పెట్టాం. మా అత్తమామలు మాకొక పడగ్గది సెట్టూ, మా అమ్మా నాన్నలు డైనింగ్ సెట్టూ ఇచ్చారు. మిగతా సామాను నెమ్మది మీద మేమే కొనుక్కుంటాం.
ఇరుగూ పొరుగుల వల్ల క్రిస్టినాకి నా అబద్ధం తెలిసి పోతుందని సందేహించాను గానీ అసలు తను ఎవరితోనూ పెద్దగా పరిచయాలు పెంచుకోలేదు.
ఆ ఇంట్లో మా ఇద్దరి జీవితం ఎంతో సంతోషంగా గడుస్తోంది. ఎంత సంతోషంగా అంటే ఒక్కోసారి ఎందుకో నాకే భయం వేస్తుండేది.
ఆ రోజు ఇంట్లో ఉన్న ఫోన్ మోగక పోయుంటే మా ప్రశాంతతకి ఎలాటి భంగమూ కలిగేది కాదేమో. లక్కీగా ఫోన్ నేను తీయబట్టి సరి పోయింది. కానీ ఎప్పుడో ఒకప్పుడు క్రిస్టినా తీస్తుంది కద? ఫోన్ చేసిన వ్యక్తి వయొలెటా కావాలని అడిగింది. నిస్సందేహంగా వయొలెటా ఇంతకు ముందు ఈ ఇంట్లో అద్దెకున్నామే అయ్యుండాలి.
నేను అబద్ధం చెప్పి నమ్మించానని క్రిస్టినాకు తెల్సిందంటే ఇహ మా ఆనందానికి నీళ్ళొదలాల్సిందే! తను జీవితంలో ఇక నాతో మాట్లాడదు. విడాకులు కూడా ఇచ్చే అవకాశాన్ని కాదన్లేను. లేదా మేము ఈ ఇల్లు ఖాళీ చేసి విల్లా ఉర్కిజా కో, కిల్మెస్ కో వెళ్ళాల్సి వస్తుంది. ఆ కాలనీ వాళ్ళు ఇంతకు ముందు ఒక బెడ్ రూం, కిచెన్ కట్టుకోడానికి స్థలం ఇస్తామన్నారు. కానీ ఏం పెట్టీ? కట్టుబడి సామాను కొనడానికి డబ్బులేవీ?
రాత్రి పూట ఫోన్ రిసీవర్ తీసి పక్కన పెట్టడం ప్రారంభించాను. గేటుకు ఉత్తరాల డబ్బా ఒకటి కట్టి దాని తాళం చెవి నా దగ్గరే పెట్టుకున్నాను
ఆ రోజు పొద్దున్నే ఎవరో తలుపు కొట్టారు. బయటి నుంచి క్రిస్టినా గొంతు వినిపిస్తోంది వాదిస్తున్నట్టుగా! ఇంతలో సర్రున పేపర్ చింపిన చప్పుడు. దిగ్గున లేచి మెట్లు దిగి కిందకు వెళ్ళేసరికి చేతిలో ఒక వెల్వెట్ డ్రెస్ పట్టుకుని నిలబడుంది క్రిస్టినా
“ఈ డ్రెస్ తెచ్చి ఇచ్చాడు” అంది, మొహం సంభ్రమంతో వెలిగి పోతోంది
నేనింకా ఏమీ మాట్లాడకుండానే పైకి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చింది. డ్రెస్ బాగా బిగుతుగా కనిపిస్తోంది
“ఎప్పుడు ఆర్డర్ చేశావ్ దీన్ని?”
తడుముకోకుండా చెప్పాను “కొద్ది రోజులైంది, ఇంతకీ సరిగా సరిపోయిందా లేదా?”
“మనం ఏదైనా సినిమాకి వెళ్ళినపుడు వేసుకోవచ్చు నేను దీన్ని. ఇంతకీ డబ్బులెక్కడివి?”
“అమ్మ కొన్ని పెసో లు ఇచ్చిందా మధ్య”
ఇదంతా నాకు అసంబద్ధంగా, వింతగా అనిపించసాగింది కానీ, ఆమెను నొప్పించకూడదని ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాళ్ళేదు
నేను ఎందులోనో కూరుకు పోతున్నాను
***
మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ. అయినా ఏదో తెలియని కంగారు అశాంతి నన్ను పీడించసాగాయి. క్రిస్టినా లో ఏదో మార్పు గమనించాను. గల గలా మాట్లాడే మాటలు తగ్గిపోయాయి. విషాదం చోటు చేసుకుందామె లో. ప్రశాంతంగా ఉండే ఆమె లో భయం కనిపిస్తోంది. తిండి తగ్గించేసింది. చిక్కటి మీగడతో ఆమె చేసే స్వీట్లు, చాక్లెట్లూ అన్నీ మానేసింది. నైలాన్ కుచ్చులూ కర్టెన్లతో ఇల్లు అలంకరించడం, ఇష్టంగా వంటింట్లో అలమరలు నీటుగా సర్దటం, వంటివి పూర్తి గా ఆగిపోయాయి. అంతెందుకు, కనీసం ఫ్రీ టికెట్స్ దొరికినపుడు కూడా సినిమాకి, నాటకాలకు వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపట్లేదు
ఒక మధ్యాహ్నం ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చింది. ఇంటి ముందు లాన్ లో పడి దొర్లి, ఆడింది. క్రిస్టినా దాన్ని చూసి ముచ్చటపడి కొంచెం తిండి పెట్టి స్నానం చేయించి , దానికి “లవ్” అని పేరు పెట్టి తనే ఉంచుకుందామనుకుంటున్నా”నంది.సరే అన్నాను
ఇదయ్యాక మరో మధ్యాహ్నం నేను అనుకోకుండా ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు ఎవరిదో సైకిల్ ఉంది.లోపలి నుంచి క్రిస్టినా గొంతు వినిపిస్తోంది.
“ఏం కావాలి నీకు?”
“నా కుక్క కోసం వచ్చాను. దానికి ఈ ఇల్లంటే ఎంతో ఇష్టం. పంచదారతో కట్టినట్టు ఇంత తెల్లని పెయింట్ తో మిగతా ఇళ్లకంటే వేరుగా కనిపిస్తుంది ఈ ఇల్లు. నాకైతే ఇదివరకు ఉన్న గులాబి రంగే నచ్చేదనుకోండి. నాకు ఎనిమిదేళ్ళ వయసు నుంచీ చూస్తున్నా కూడా ఈ ఇల్లు మాత్రం మిస్టరీ లాగే తోస్తుంది ఎంచేతో! మీతో ఫోన్లో మాట్లాడినప్పటి నుంచీ మిమ్మల్ని చూడాలని అనుకుంటూనే ఉన్నా! గుర్తుందా, నాకో గాలిపటం ఇస్తానన్నారు మీరు?” అవతలి గొంతు ఒక యువతిది
“గాలి పటం అబ్బాయిలకి ”
“ఆటబొమ్మలకి లింగభేదం ఏముంది లెండి! మీరు గాలిపటం ఇస్తానని చెప్పిన రాత్రి నేనసలు నిద్రే పోలేదు. ఆ తర్వాత మిమ్మల్ని ఒక సారి బేకరీలో చూశాను గానీ మీరు అటుతిరిగి ఉండటంతో మొహం చూడలేదు. కానీ ఆ తర్వాత మీరెలా ఉంటారా అని మీ గురించే ఆలోచిస్తూ ఉండేదాన్ని. మొత్తానికి మీరు నాకు గాలి పటం ఇవ్వనే లేదుగా? తర్వాత మేము వేరే చోటికి వెళ్ళిపోయాం. రెండు వారాల క్రితమే మళ్ళీ ఇక్కడికొచ్చాం”
“నువ్వేదో పొరపడ్డట్టున్నావ్. నేనిక్కడికొచ్చి మూణ్ణెల్లే అయింది. అంతకు ముందెన్నడూ ఈ కాలనీ మొహమే ఎరగను”
“అచ్చం నేనూహించుకున్నట్టే ఉన్నారు మీరు. భలే వింతైన విషయం ఏంటంటే మా ఆయనతో మీకు నిశ్చితార్థం కాబోయిందటగా?”
“చాల్లే! నాకు నా భర్తతో తప్ప ఇంకెవరితోనూ నిశ్చితార్థం కాలేదు. ఇంతకీ ఈ కుక్క పేరేంటన్నావ్?”
“బ్రుతో”
“సరే, దీని మీద నేను ప్రేమ పెంచుకోక ముందే తీసుకుపో దీన్ని”
“లేదు వయొలెటా, నేను మా ఆయన ఇద్దరం ఉజ్జోగాలకు పోతాం. చాలా చిన్న అపార్ట్మెంట్ లో ఉంటున్నాం. దీన్ని చూసుకోడం కష్టం. ”
“నా పేరు వయొలెటా కాదు , ఇంతకీ ఈ కుక్క ఎన్నేళ్ళది?”
“రెండేళ్ళు. దీన్ని మీరే ఉంచుకోలేరా? నేను అప్పుడప్పుడు వచ్చి చూసి పోతుంటా”
“పరిచయం లేని మనుషులు మా ఇంటికి వస్తూ పోతూ ఉండటం మా ఆయనకు నచ్చదు. అదీ గాక ఇలా కుక్కలవీ బహుమతులుగా పుచ్చుకోడం కూడా ఆయనకు నచ్చదు”
“అయితే మీ ఆయనకు చెప్పకండి ఇదంతా! ప్రతి సోమవారం సాయంత్రం ఏడింటికి శాంటా ఫెలిసితా చర్చ్ దగ్గరున్న కొలంబియా స్క్వేర్ దగ్గర నీ కోసం చూస్తాను. లేదా బ్రిడ్జి వెనక కాన్స్టిట్యూషన్ స్టేషన్ ఉంది కదా, అక్కడైనా సరే, బ్రుతో కోసం తప్పక వస్తాను. ఈ చిన్న సాయం చేయొచ్చుగా ?”
” హ్మ్ .. సరే ఈ కుక్కను నా దగ్గరే ఉంచుకుంటాన్లే”
“థాంక్యూ వయొలెటా”
“చెప్పానా? నా పేరు వయొలెటా కాదు”
“పేరు మార్చుకున్నారా ఏంటి? నాకైతే మీరెప్పుడూ వయొలెటానే..సేం ఓల్డ్ మిస్టీరియస్ వయొలెటా”
తలుపు బలహీనంగా మూసుకున్న శబ్దం, మెట్లెక్కి క్రిస్టినా మేడ మీదికి వెళ్ళిన శబ్దం వినిపించింది. కొద్ది సేపు నేనున్న చోటే ఆగి, అప్పుడే ఇంటికి వచ్చినట్టు నటిస్తూ లోపలికి అడుగు పెట్టాను. జరిగినదంతా ఏదో డ్రామా రిహార్సల్ అయినట్టూ, అసలు వాస్తవం ఇంకేదో ఉన్నట్టూ మొత్తం వింత గా అనిపించింది. జరిగినదంతా నేను చూశానని క్రిస్టినాకి చెప్పదల్చుకోలేదు. అసలు ఇక్కడికి మారడానికి నేను చెప్పిన అబద్ధం తను ఎక్కడ పసిగట్టేస్తుందో అనే భయం పెద్దదై వెంటాడ్డం మొదలెట్టింది.
రోజూ కొలంబియా స్క్వేర్ మీద నుంచి పోతూ క్రిస్టినా ఆ అమ్మాయిని కలవడానికి వచ్చిందా అని చూడటం నా దిన చర్యలో భాగంగా మారింది . అసలు ఒక్కోసారి ఇదంతా కలైతే బాగుండనుకునేవాడిని.
***
కుక్కని ముద్దు చేస్తూ “నా పేరు వయొలెటా అయితే ఎలా ఉంటుందంటావు?” అంది క్రిస్టినా
ఉలిక్కి పడ్డాను.
“పూల పేర్లు నాకు నచ్చవు”
“కానీ, వయొలెటా పేరు బానే ఉందిగా! అదొక మంచి రంగు పేరు కూడా”
“అయినా సరే, నీ పేరే బాగుంది”
అంతటితో ఆ సంభషణ ముగిసింది
ఒకాదివారం కాన్స్టిట్యూషన్ స్టేషన్ మీదుగా వస్తూ బ్రిడ్జి మీద రెయిలంగ్ ని ఆనుకుని కిందకు చూస్తున్న క్రిస్టినా ని చూసి పరిగెత్తుకు వెళ్ళాను. క్రిస్టినా నన్ను చూసి పెద్దగా ఆశ్చర్యపడలేదు
“ఏం చేస్తున్నావిక్కడ?”
ఊరికే, ఇక్కడ నిలబడి కింద రైల్వే ట్రాక్స్ చూడ్డం బాగుంటుంది”
“అసలీ ప్రాంతం చూడు, ఏదోగా ఉంది.అదీ కాక నువ్వు ఇలా ఒంటరిగా తిరగడం నాకిష్టం లేదు”
“నాకు బాగానే ఉందే ? ఇంతకీ ఒక్కదాన్ని ఎందుకు తిరక్కూడదట నేను?”
“ఆ రైళ్ళ పొగ చూశావా అసలు? బావుందా అది?”
” ఏమో… ప్రయాణాలంటే ఇష్టం నాకు. వాటి గురించి కలలు కనడం . ఎక్కడికీ వెళ్ళకుండానే ఎక్కడెక్కడికో వెళ్ళినట్టు స్వప్నించడం, ఉన్నచోటే ఉండి, సుదూర తీరాలకు ప్రయాణించి రావడం ఊహల్లో”
ఇంటికొచ్చాక , ఈర్ష్యతోనో మరో కారణం చేతో నేనసలు ఆమెతో మాట్లాడలేదు ఆ రోజంతా
మరో రోజు..
“అసలు మనం శాన్ ఇసిద్రో లో గానీ, ఒలివోస్ లో గానీ ఒక చిన్న ఇల్లు కొంటే బాగుండేమో?” నా దగ్గరేదో డబ్బు మూలుగుతున్నట్టు అన్నాను
“వాటి కంటే మనకు లెజెమా పార్క్ దగ్గరవుతుంది” క్రిస్టినా
“అది దాదాపు ఎడారి లాంటిది. చెట్లన్నీ చచ్చి, ఫౌంటన్లన్నీ ఎండి పోయి, విగ్రహాలన్నీ శిథిలమైపోయి, చెత్తలో తిండి ఏరుకునే అడుక్కునే వాళ్లతో… ఏం బాగుంటుంది ఆ కాలనీ?”
“నాకవేం కనపళ్ళేదే?”
“ఇదివరకు నువ్వు ఎవరైనా బెంచీ మీద కూచుని ఏ నారింజ పళ్ళో తింటే, ఆ బెంచ్ మీద కూచోడానికి కూడా ఇష్టపడేదానివి కాదు”
“ఇప్పుడు నేను చాలా మారాను”
“నువ్వెంతైనా మారు గానీ లెజెమా పార్క్ ని ఇష్టపడటమేంటి? ఆ పాలరాతి సింహం బొమ్మలున్న మ్యూజియం గురించేగా? అక్కడ నువ్వు చిన్న పిల్లగా ఉన్నపుడు ఆడుకుని ఉండొచ్చు కాదన్ను గానీ.. ”
“నువ్వు నాకసలు అర్థం కావు” అనేసింది. ఆ మాట అంత చేదుగా అనుండక పోతే నాక్కూడా ద్వేషం సోకేది కాదు
నా ఆత్రుత, అశాంతి దాచుకుంటూ నాలుగు రోజులు నాలుగేళ్ళలా గడిపాను. కాన్స్టిట్యూషన్ బ్రిడ్జి దగ్గరికి, కొలంబియా స్క్వేర్ దగ్గరికి పిచ్చి కుక్కలా ప్రతి రోజూ తిరిగాను.
ఇక తట్టుకోలేక ఒకరోజు అనేశాను “ఈ ఇంట్లో ఇంతకు ముందు ఎవరైనా నివసించారని మనకి తెలిసిందనుకో క్రిస్టినా. నువ్వేం చేస్తావు?ఇక్కడి నుంచి వేరే చోటికి మారి పోదామంటావా?”
“ఈ ఇంట్లో ఇంతకు ముందే ఎవరైనా నివసించి ఉంటే వాళ్ళు ఎంతో మంచి తీయని మనసున్న మనుషులై ఉంటారు. ఎందుకో ఈ ఇల్లు చాలా భద్రంగా అనిపిస్తుంది నాకు. ప్రపంచంలో డబ్బంతా నా ముందు గుమ్మరించినా సరే, నేను ఎక్కడికీ వెళ్ళను.”
ఇహ నేను రెట్టించలేదు.
***
షేవ్ చేసుకుంటుండగా డోర్ బెల్ మోగింది. క్రిస్టినా ఎవరితోనో మాట్లాడ్డం వినబడుతోంది. తలుపుకున్న పగులు లోంచి చూశాను. ఆ వచ్చిన వ్యక్తి లోతైన గొంతుతో పదునుగా మాట్లాడుతోంది
“నువ్వు ఇంకో సారి డానియల్ జోలికి వచ్చావంటే మూల్యం భారీగా చెల్లిస్తావ్ వయొలెటా”
“నాకసలు డానియల్ ఎవరో తెలీదూ, నా పేరు వయొలెటా కాదూ”
“అబద్ధం”
“లేదు, నాకు డానియల్ ఎవరో తెలీదు”
“చూడూ, అసలు విషయమేంటంటే…..”
“నీ మాటలు నేను వినదల్చుకోలేదు…” క్రిస్టినా రెండు చేతులతోనూ చెవులు మూసుకుంది
గబ గబా బయటికి వెళ్ళాను. ఆ వచ్చినామె మెరుపులా పరిగెత్తి మాయమైంది. కానీ ఆ క్షణంలోనే ఆ వచ్చింది స్త్రీ వేషంలో ఉన్న పురుషుడని గ్రహించాను
ఈ విషయం గురించి ఆ తర్వాత మేమేమీ మాట్లాడుకోలేదు. మేము మరీ అవసరమైతే తప్ప మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది
ఈ మధ్య క్రిస్టినా పాడటం మొదలు పెట్టింది. గొంతు బాగానే ఉంది గానీ, నేను దాచిన రహస్యం వల్లనేమో, ఆమె ఎందుకు పాడుతోందో ఏమిటో అనే సందేహం మొదలైంది. కొత్తగా ఏది జరిగినా నా ఆలోచనలు అక్కడికే దారి తీస్తున్నాయి. ఇదివరకెప్పుడూ పాడేది కాదు.మరి ఇప్పుడేంటి? వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా… ఈ పాటలేంటి హటాత్తుగా ?
దానికి తోడు క్రిస్టినా ఒకరోజు తనలో తను మాట్లాడుకోవడం విని ఠారెత్తి పోయాను “ఎవరిదో మరొక స్త్రీ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నట్టు అనిపిస్తోదేంటి నాకు? ఆమె సంతోషాలు బాధలు, పొరపాట్లూ, నావైనట్టుగా? నాకు దెయ్యం గానీ పట్టిందా ?”
తన మాటలు విననట్టు నటించాను గానీ, ఆ క్షణం నుంచీ అసలు ఇంతకు ముందు ఆ ఇంట్లో ఉన్న వయొలెటా ఎవరో తెలుసుకోవాలని తొందర పుట్టి ఆ ప్రయత్నాలు అర్జెంట్ గా మొదలు పెట్టేశాను
వీధి చివర్లో ఉన్న స్టేషనరీ షాపుకు పెన్సిల్ కొనే వంకతో పోయి, నన్ను నేను పరిచయం చేసుకుని షాపులో ఉన్నావిడ అందాన్ని కాసేపు మెచ్చుకుని, నెమ్మదిగా వాకబు చేశాను మేముంటున్న ఇంట్లో ఇంతకు ముందున్న వయొలెటా ఎవరని . ఆవిడ ఏమీ తేల్చకుండా జవాబివ్వడంతో నా ఉత్సుకత మరింత పెరిగి పోయింది. మర్నాడు దగ్గర్లోని కిరాణా దుకాణంలో అడిగాను. ఆ షాపు వాళ్ళు వయొలెటా మెంటల్ హాస్పటల్లో ఉండేదని చెప్పి అడ్రస్ కూడా ఇచ్చారు
ఇంటికొచ్చేసరికి క్రిస్టినా పాడుకుంటూ కనపడింది “అసలీ గొంతు నాది కాదు. ఇంకెవరిదో గొంతుతో పాడుతున్నాన్నేను. మొత్తానికి ఎవరో నా కంటే ఆనందంగా ఉన్న మనిషే అయుండాలి”
నిజం చెప్పొద్దూ నేను వయొలెటా గురించి కనుక్కునే పనిలో పడి క్రిస్టినా మాటల్ని పట్టించుకోడం మానేశాను.
మెంటల్ హాస్పటల్ కి వెళ్తే అక్కడ వయొలెటా సంగీతం టీచర్ అర్సీనీయా లోపెజ్ అడ్రస్ దొరికింది. అది తీసుకుని ట్రైనెక్కి వాళ్ళిల్లు వెదుక్కుంటూ వెళ్ళాను
ఆవిడొచ్చి తలుపు తీసింది. చేతిలో పెన్సిల్ ఉంది . మ్యూజిక్ నోట్స్ రాస్తున్నట్టుంది. ఎక్కువ ఆలస్యం చేయకుండా పలకరించి వయొలెటా గురించి అడిగాను
“మీరెవరు? ఆమె భర్తా?”
“కాదు, బంధువు అవుతుంది నాకు” కళ్ళలో పడ్డ దుమ్ముని కర్చీఫ్ తో తుడుచుకుంటూ చెప్పాను. ఏడుస్తున్నాననుకుంది
“ఓ..ఆమెకున్న ఎంతోమంది అభిమానుల్లో మీరూ ఉన్నారన్నమాట. ఆమె చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసుకోవాలని వచ్చుంటారు. పోయిన వాళ్లంతా మంచివాళ్లనీ, పవిత్రమైన వాళ్ళనీ అనుకోవడానికి కారణాలక్కర్లేదు” అంది నా చేయి పట్టుకుని ఓదార్పుగా
“వయొలెటా నా స్టూడెంటే కాదు, మంచి స్నేహితురాలు కూడా! చివరి రోజుల్లో చాలా బాధ పడింది. ఎవరి మీదో తెలీని అసూయ తో మానసిక వ్యధతో తీసుకుంది. తరచూ ‘నా జీవితాన్ని ఎవరో నా నుంచి లాగేసుకున్నారు. ఇహ నా వెల్వెట్ డ్రెస్ నేను వేసుకోను. అది ఆమె కే చేరుతుంది. నా కుక్క బ్రుతో కూడా ఆమెకే చేరువవుతుంది. కాన్స్టిట్యూషన్ స్టేషన్ దగ్గర నేనూ డానియెల్ కలుసుకుని కౌగిలించుకోలేమిక. ఆ ఇనప రైలింగ్ మీదకు వాలి, కింద పోయే రైళ్ళను నేనిక అతనితో కలిసి చూడను. నా స్వరం నా నుంచి జారిపోయి ఏ మాత్రం పాడే అర్హత లేని గొంతులోకి చేరుతుంది చూస్తుండు.’ అనేది పాపం.”
భయంతో నిశ్చేష్టుడినై పోయాను,నిర్విణ్ణం గా చూస్తుండి పోయాను
అర్సీనియా నా వైపు చూసి “బాధ పడకండి ! మీకింకా మంచి వాళ్ళే దొరుకుతారు. ఆమె అందమైందే.. కాక పోతే లోకంలో అందమొక్కటే గొప్ప విషయమా ఏంటి?” అంది
హడలి పోయి, నోట మాటన్నది లేకుండా, అక్కడి నుంచి పరుగున బయట పడ్డాను. ఆమె గుడ్ బై హగ్ ఇవ్వబోతున్నా, నేను పట్టించుకోనే లేదు
ఆ రోజు నుంచి క్రిస్టినా పూర్తిగా వయొలెటా గా మారి పోయింది. కనీసం నా వరకూ. నేను పగలూ రాత్రి ఆమె ప్రేమికులెవరో కనుక్కోవడం లో పడి పోయాను. ఆమె పూర్తిగా నాకు అపరిచితురాలిగా మారి పోయింది. నేను ఆమెకి కూడా
ఒక చలి రాత్రి క్రిస్టినా మాయమైంది. తెల్లారుజాము వరకూ వెదికాను గానీ ఫలితం లేక పోయింది
ఇప్పుడు పూర్తిగా ఖాళిగా మిగిలిన ఆ ఇంట్లో, పంచదార తో కట్టినట్టున తెల్లని ఆ ఇంట్లో ఎవరి వల్ల ఎవరు నష్టపోయారో మాత్రం నాకింత వరకూ అంతుపట్టలేదు
**** (*) ****
Original: “The house made of sugar” by Silvina Ocampo (Aregentina Writer)
Translation: Sujatha Velpuri
ఈ కథ ‘New York Review books (NYRB) Classics’ వాళ్ళు వేసిన సిల్వినా కథా సంకలనం ‘Thus were their faces’ లో ఉంది. Website: https://www.nyrb.com/
వెంటాడే కధనం. మీ అనువాదం బావుంది. మంచి కథకి కృతజ్ఞతలు.
చాలా బాగుంది. మంచి కథ చెప్పినందుకు మీకు జేజేలు.
ఉత్కంఠ కలిగించిన వింత కథ.. అనువాదం సహజంగా, చదివించేలా ఉంది.
మూఢ నమ్మకాలు– మనకొచ్చే భావనలు అన్ని— చాలమందికి పిచ్చిగ అనిపించవచ్చు– కాని– ఏమైన మనకు తెలియని అతీత శక్తి — మనజీవితాలను మనమనుకున్నట్లుగా– కాక మరోవైపుకు తీసుకపోయేది ఏదో వుంది– దాన్నే నేను సిక్త్-సెన్స్ అంటా–
Very nice స్టోరీ Sujatha! Your translation added ఫలవౌర్ తో ది స్టోరీ. మే బె శే వస్ వీక్ మైండెడ్ అండ్ సూపెర్స్తితియోస్, శే వస్ మరి వుల్నెరబ్లె ఫర్ ది ఒథెర్ స్పిరిట్ తో రెసిడె ఇన్ హర్ అంఫ్ ఫైనల్లీ చేంజ్ థెయ్ర్ lives
సుజాతగారూ చాలా బాగుంది. చక్కటి తెలుగుసేత
సుజాతగారూ,
మీ అనువాదం, చాలా బాగుంది. కుతూహలం తగ్గించకుండా సాగింది కథనం.
అభినందనలు
సుజాత గారూ, మంచి కథని ఎన్నుకుని అనువదించారు. అనువాదపు ఛాయలు ఎక్కడా కనిపించనంత సహజంగా ఉంది. అభినందలు.
మీ కలం నుండి మరిన్ని ఇలాంటి మంచి మంచి అనువాద కతలు, మీరు స్వయంగా రాసిన కతలు కూడా ఆశిస్తూ..
-భాస్కర్ కూరపాటి.