కరచాలనం

గతవర్తమానాలే గుండెచప్పుళ్ళేమో కవిత్వానికి!

జనవరి 2013

మనసుతో మొదలైన నా సాహిత్య యాత్రగురించి నేనెంత వరకు మాటల్లో న్యాయంచేకూర్చగలనో నాకూ సవాలుగానే వుంది.కవిత్వం పైన ఆసక్తి ఎందుకుఅనేదానికి సమాధానం నా దగ్గర లేదు.

కానీ డిగ్రీ చదివేరోజులనుండి మొదలయింది అన్నట్టుగా గుర్తు. ఆంధ్రజ్యోతి,ఆంధ్ర భూమి ఇతరత్రా వారపత్రికలు తీసుకొచ్చేవారు మా నాన్నగారు. అందులోకవిత / కలం / ఓ కోయిలా(పేర్లు ఖచ్చితంగా గుర్తులేవు) అని ఒక పేజీవుండేది కవితలతో. పత్రికలు ఇంటికి రాగానే, మొట్టమొదటిగా కవితలు చదివాక గాని, మిగతా పేజీలకువెళ్ళేదాన్ని కాదు.

చదువుతున్నప్పుడు ఒక మంచి అనుభూతి మిగిలేదినాకు అర్ధమైనంత వరకు. అసలు కవిత్వమెలారాస్తారో అనేది నాకు అప్పట్లోఅతి పెద్ద ప్రశ్న.అలాకవిత్వంతో పరిచయం మొదలయింది. వేరే కవిత్వ పుస్తకాలేమీ చదవలేదు, తెచ్చుకుని చదవాలి అనే ఆలోచన లేదు. బెజవాడ అంటేనే సాహిత్యకేంద్రం, కానీ రచయితల్ని కలిసే అవకాశం, అంత ఆసక్తి అప్పుడే ఏర్పడలేదు నాకు. స్నేహితులతో ఎప్పుడూ సరదాగా వుండటమే గానీ, కవిత్వం పైన చర్చలు జరిపేంత విషయజ్ఞానం మాలో ఎవ్వరికీ  లేదు. ఇప్పటికీ నేనెవ్వరితోను కవిత్వం గురించి చర్చల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. కవిత్వమన్నది మనలో మనకే తెలీని ఒక కోణం. నామీద నాకో అపనమ్మకం అనుకోవచ్చు. కవిత్వం రాయగలను, కానీ దాని పూర్వాపరాలు చర్చించలేను. ఎందుకో ఒక్కోసారి ఆ చర్చలో ఆ కవిత అందాన్ని కోల్పోతుంది అనే భావన కావొచ్చు.

ఇక అన్నిటికంటే కవిత్వం వ్రాయడానికి బాగా అనుకూలించిన అంశం’అమెరికా లో జీవనం’. కావల్సినంతనిశ్శబ్ధం, కోరుకున్న దాన్ని మించి ఏకాంతం. నామొట్టమొదటి కవిత 2001 లో ‘H4′ (dependent VISA) మీద రాసాను.

ఇక తర్వాత అన్నీప్రేమ – ప్రకృతి మీద రాసినవే. అప్పట్లోకవిత్వమంటే ఆ రెండు అంశాలేఅనుకునేదాన్ని. 2004లో నాకు తెలుగుపీపుల్.కాం అనే వెబ్సైటు పరిచయమయింది. అది నిజంగా నాకవిత్వపయనంలో ఒక మైలు రాయి అని చెప్పుకుంటాను. నిజంగా మంచి ఆసక్తి వున్నఎంతోమంది కవులు అక్కడ ‘కవిత్వమంటే ఏంటి ‘ అనే విషయం మీద పలురకాలుగా చర్చలు జరిపేవారు. నాలాంటి ఎంతోమంది కి పండగే, ఎంతో నేర్చుకునేవాళ్ళం. ఇక అప్పటి నుండి,జీవితంలో జరిగే అనుభవాలకు, అనుభూతులకు మాటలు కట్టి, ప్రకృతి పరమైన ఊహలు జోడించితే పెల్లుబికిన పదాల కనికట్టు – మనసులోనిభావానికి సమానంగా సరితూగగల్గితే, అది ఖచ్చితంగా కవితవుతుంది అని తెల్సుకోగలిగాను.అప్పుడు కలిగే ఎనలేని తృప్తినిమాత్రం తిరిగి కవితలోకెక్కించలేనిదని, ఇది స్వానుభవంలో నేర్చుకున్నదే. కవిత్వమంటే నిజం. కవిత్వంలోకి అబద్ధాన్నిఏకోశానా జొప్పించలేము, ఎందుకంటే అది అక్కడ అతకదు. అందుకే ఇక్కడ కేవలం ఊహాశక్తిఒక్కటే సరిపోదు. స్పందనతో కూడిన సృజనాశక్తితోనే కవిత్వంఫలిస్తుంది. కవిత్వం గురించి ఎంత తెలుసుకున్నా, మునుపెన్నిసార్లురాసినా, కవిత రాసిన ప్రతిసారీ ఒకే భావన ‘ప్రతి కవితామొదటి కవితే. అదే బాధ, అదే ఒత్తిడి.’

నేను రాసిన “వానకు తడిసిన రాత్రి” అనే కవితకు తెలుగుపీపుల్.కాం లో (2006) అవార్డు ప్రకటించారు. ఆ అవార్డులో భాగంగా నాకు కొన్ని మంచి పుస్తకాలు పంపించారు. అవే మొట్టమొదటిసారిగా నా దగ్గర కవిత్వ పుస్తకాలు చేరడం. అందులో నేను ఇష్టంగా మళ్ళీ మళ్ళీ పుస్తకరూపంలో చదివినవి మహెజబీన్ గారి “ఆకురాలు కాలం” , విన్నకోట రవిశంకర్ గారి “వేసవి వాన”. అద్భుతమైన కవితలు – జీవితానికి దగ్గరగా తీసుకెళ్తూనే, మనల్ని ప్రపంచానికి దూరంగా తీసుకెళ్ళే కవితలు. మనసుని నొక్కిపెట్టి, నిజమనిపించే భావదృశ్యాలు. పేజీ తిప్పాలంటే కాస్త భయం – మళ్ళీ ఏమి చదవాలో, ఆ అనుభూతిని ఎలా పట్టి ఆపాలో అని. నిజమైన కవిత రాయడమే కాదు, చదివి తట్టుకోవడం కూడా ఒక కళ – ఒక అనుభవం.

ఇవి నా మొట్టమొదటి హైకూలు:

ఎన్నివేలమైళ్ళ పయనమో

పూరేకుపై మత్తుగా పడుకుంది

మంచుబిందువు

***

ఆకాశానికి,నా గదికి

రాత్రికి రాత్రే  రోడ్డు

తలుపుసందులోంచి సూర్యరశ్మి

***

సూర్యుడు మా ఇంటి గుమ్మం నుండి

పెరట్లోకెళ్ళడానికి

పగలంతా ప్రయాసపడతాడు

 

” ఒక్కోసారి కళ్ళ ముందు కాస్తున్న ఎండను, గాలి మోసుకొచ్చే పరిమళాలను ఇదివరకెప్పుడో అనుభవించినట్టుగా అనిపిస్తుంది. వెంటనే మనసు ఒంటరిదవుతుంది.” , ” ఒక్క మబ్బు పట్టిన క్షణం చాలు గతంలోను, వర్తమానంలోను నిశ్శబ్ధాన్ని నింపడానికి. అయినా నిర్లిప్తత దూసుకెళ్ళినంత లోతుకి, సందడి తోసుకెళ్ళలేదెందుకో.” ఇవి నేను రాసుకున్న మరికొన్ని లైనులు – నిజమే మరి. బాధలోంచి వచ్చిన కవిత్వం నిజంగాను, స్వచ్చమైన ప్రవాహంలాను వుంటుంది. ఆ క్షణాల్లో ఆ పదాలే ఓదార్పు కూడాను. నాకెప్పుడూ అనిపిస్తుంది కవిత్వమెప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించదని, అంత గొప్పగా పలికించలేదనిను. గతవర్తమానాలే గుండెచప్పుళ్ళేమో కవిత్వానికి.

నన్నెప్పుడూ ఆకట్టుకునే పదం’జీవితం’. నావరకు అదొక సంభ్రమం, అదొక ఆశ. ఎందుకంటే నేనకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడూ జరగలేదు – అందుకే నాకు జీవితమంటే ఆసక్తి, ఏంటిది అనే ఒక ఉత్సుకత. అందుకే నేను రాసిన కవితల్లో ఎక్కువ భాగం ఈ అంశం చుట్టూరానే అల్లుకున్నాయి.  నే రాసుకున్న వాటిలో, నాకు తృప్తినిచ్చిన కొన్ని లైనులు…

ఒంటరిగా వున్నప్పుడు

వర్షం చప్పుడు విన్నావా!?

వర్తమానం అదుపు తప్పుతుంది

విరహమో! వైరాగ్యమో!

ఓ వైవిధ్యమైన భావమో!

బాల్యం గుర్తొస్తుంది

బంధం గుర్తొస్తుంది

బాధ గుర్తొస్తుంది

 

ప్రతి చినుకూ

వంద ఆలోచన్లగా చిందుతుంది.

ఒక సంఘటనకి ఎన్ని సంఘర్షణలు!

సందేహాలు…సమాధానాలు

వృత్తాకారంలో తిరుగుతూనే వుంటాయి

సంతృప్తి నీడల్లోనూ

ఏదోక అలజడి శబ్ధం

మిగిలిపోతూనే వుంటుంది

బహుశా అదేగాబోలు

పగటికీ, రాత్రికీ తేడా చూపేది.

ఇక ఈ యాత్రలో తీపి/చేదు అనుభవాలుఅంటే, రెండిటి సమాధానం కవిత్వం రాయడమే. రాసిన కవిత మనసుకినచ్చితే తీపి అనుభవం, నచ్చక ఇంకా ఏదో అందకుండా మిగిలిపోయింది అని చతికిలపడినప్పుడు చేదు అనుభవం. చక్కనిప్రవాహంతో ముస్తాబయిన కవితని చూస్తే తీపి అనుభవం, రాసేటప్పుడుమాత్రం ప్రాణం తీస్తుందే…అప్పుడు ఖచ్చితంగా చేదు అనుభవం. కొన్నిసమయాలుంటాయి మొత్తం కవిత్వమయమనిపించేలా. తరువాత కాలాలు మారుతాయి, అసలు మనమేనా ఇన్ని కవితలు రాసింది అనిపించేలా.

నాకు 2012 సంవత్సరానికిగాను ఉత్తమకవిత్వానికి గుర్తింపుగా ఇస్మాయిల్ అవార్డు రావడం చాలా సంతోషంగావుంది. కాకపోతే అవార్డెప్పుడు కవిత్వానికి (ఏ కళకైనా) కొలమానంకాదు కాబట్టి సంతోషానికన్నాను, నా కవిత్వంపైన నాకునమ్మకాన్ని పెంచడానికి దోహదపడిందని అనుకుంటాను.