కథ

బోరచెక్కు

జూలై 2017

స్టర్పండగని అప్పుసొప్పుజేసి కొన్నకొత్త గుడ్డలేసుకొని, పొద్దున్నే కొండ దగ్గరున్న దేవుడి సిలువ దగ్గరకు నడిచెల్లి, మద్యాన్నమయ్యాక అన్నాలు కూరలు తిని, తరువాతప్రార్దనకెళ్ళి, రాత్రి పల్లెలో కుర్రోళ్లు వేస్తున్న దేవుడి నాటకాలు చూసి అలసిపోయిన ఆ వూరి ప్రజలు ఒంటి మీద సోయలేకుండా నిద్రపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈస్టర్ పండగరోజు సమాధి నుంచి లేచిన దేవుడు కూడా నిద్రపోతున్న సమయమది. రేపొదున్నే కత్తేసు కోయ్యబోయే దున్న కుర్ర మాంసాన్ని ఊహించుకుంటూ, పనికిరాని దొబ్బల్ని పడేసే దిబ్బ దగ్గర కూసోని దొరకబోయేదొబ్బల్ని ఎలా దొబ్బి తినాలో ఆలోచించుకుంటూ, నిద్రను చెడగొట్టుకొని మరి ఊరంతా కలియ తిరుగుతున్న కుక్కల అరుపులచప్పుళ్ళు తప్ప ఇంకే శబ్దము వినపడడం లేదు మావూళ్ళో ఆ టైంలో.

హటాత్తుగా మాఇంటి ముందు పొయ్యిలో పొనుకుని వున్న ఒక కుక్క ఇరవైఏడు దెయ్యాలనిఒకేసారి చూసినట్లుగా అరవడం మొదలుపెట్టింది. ఎవురో “ఏందమ్మ నీ అరుపులో కొత్తోల్ల్ని చూసినట్లుగ” అని కర్రతో కుక్కనొక్క బాదుబాదినట్లున్నారు అది ఆరున్నర శ్రుతిలో అమ్మలక్కలను తిట్టుకుంటా బజార్లోకి పోయింది.

ఆ ఆరుపులకి మా ఇంట్లో వోల్లందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఒంటి మీద చెదిరిపోయిన గుడ్డల్ని సర్దుకొని మళ్ళి నిద్రలోకి జారుకోబోతున్న సమయంలో బయట నుంచి ఎవడో దబ దబ తలుపు బాదుతున్నశబ్దంవినపడి కళ్ళు తెరవలేక తెరిచారు.తలుపు కొట్టింది ఎవురో కాదు, నా స్వంత మేనమామ బాబురావు ఇంకా దున్నల్ని కోసే కత్తి ఏసు అని తెలిసింది.

తలుపు తెరిచిన తరువాత, “యాంది బాబా ఈ జామునొచ్చారో?“ అనింది మా యమ్మ కళ్ళు నలుపుకుంటా.

“ఏం లేదప్పా… ఇదిగో దున్న కుర్రని తెచ్చేలికే ఈ యాలయ్యింది, రేపుటికిమోంసానికి ఎవురికన్నా సెప్పేరా సెప్పలేదా?” అన్నాడుఅనుమానంగా ఆవులిస్తా కత్తి ఏసు.

“ఏది ఎవురికి సెప్పలా ఇంకా“ అనింది మా యమ్మ.

కత్తేసు కళ్ళల్లో నిద్రపోతున్న ఆనందం ఒక్కసారి నిద్రలేచి మా యమ్మకి జై కొట్టి అయన నవ్వులో చేరిపోయింది.

“పిల్లోల్లొచ్చారంటగా పండక్కి హైదరాబాద్ నుంచి, బాగున్నారా … ” అనడిగాడు మా బాబురావు మామ.

“వాళ్ళకేమి? ఎందుకు బాగుండ్రు? కమ్మగా ఉజ్జోగాలు చేసుకొనే పిల్లలయితే ఏమప్పా” అనడిగాడు మా యమ్మనికత్తి ఏసు.

“బాగానే వున్నారబ్బాయ్” అంది మా యమ్మ కూసోని దుప్పటి కప్పుకుంటా.“మరి మోంసానికి ఎవురికి సెప్పక పోతిరే. రేపెం చేస్తారో? పిల్లోల్లు కూడా రాక రాక వొస్తిరే “ అన్నాడు చాల బాధగా కత్తేసు.

“ఎవురొకరుఒక్క కువ్వన్నా ఇయ్యరంటబ్బాయ్” అంది మా యమ్మ.

“ఏంది మే ఇచ్చేదే ? అసలుమనమోంసం దొరుకుతుందటమ్మేరేపో….. ? పండగని చెప్పి యాడాడోల్లో అందరు వస్తిరే మనూరికే.

కోసిన దున్నలు పల్లెకి సాల్తన్నాయా?” అనిఒకరకమైన బాధలో అడిగాడు మా బాబురావు మామ.

“అయ్యో, దున్న మోంసం దొరక్క పోతే సికెన్ తెచ్చుకుంటాంలె గానే …. నువ్వు బో” అన్నాడు మా తమ్ముడు దుప్పటి కప్పుకుంటా.

“అసె తాల్రయ్యో. సికెన్ తెచ్చుకుంటా మన కూరకి వచ్చే రుసి సికెన్ లో వుండిద్దా ఏందే? ఎమంటావప్ప” అని మా యమ్మని అడిగేడు కత్తేసు.

“మన కూరకొచ్చే రుసి సికెన్ కెట్టా వచ్చిద్దబ్బాయ్. రాదు“ అని మాయమ్మకూడా దున్నకుర్ర మోంసాన్ని సపోర్ట్ చేసింది.

హైదరబాద్ లో మేముంటున్న ఏరియాలో ఎప్పుడైనా బీఫ్ తెచ్చుకోవాలనిపించినా చుట్టుపక్కల వాళ్లకు తెలిసి మమ్మల్ని తక్కువగా అనుకుంటారేమో అని ఒక భయం వుండేది. మా ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడైనా ఆ ప్రస్తావన వచ్చినా నేను మాత్రం బీఫ్ అంటే ఏంటి అని ప్రశ్నించి అందరిలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించేవాడిని. దొంగతనంగా కల్యాణి బిర్యాని తిని సోంపు నోట్లో పోసుకొని ఇంటికొస్తాను కాని ఎవ్వరికీ నేను బీఫ్ అతి ఇష్టంగా తింటానని తెలియదు. అట్టాంటిది ఈ రోజు మా వాళ్ళు భయం లేకుండా దున్న మాంసం గురించి మాట్లాడుతుంటేఆశ్చర్యంగాను చాల ఆనందంగాను వుంది నాకు. అసలయిన మాదిగోడిగా మారిపోయినంత ఆనందంగా అనిపించింది.

“అప్పో, అదంతా కాదుగాని మేము మంచి దున్నకుర్రని తెచ్చేమప్పా. ఈ కువ్వలు గివ్వలు లేకుండా మన అయిదుగురు ముటావోల్లమే వాటాలేసుకొని కుర్రని కోద్దాం. పిల్లోల్లు కూడా వస్తిరే. ఏమంటావ్?” అన్నాడు కత్తేసు.

“సరేనబ్బాయ్. ఆగు మా పెద్దబ్బాయి నడుగుతా” అంటా మా రూమ్ కొచ్చింది మా యమ్మ. ఆ యవ్వరమంతా ముందు నుంచే వింటున్న నేను మా యమ్మ తలుపు కొట్టి కొట్ట తలికే తలుపు తీశాను.

“కొంచెం బయటకురాయ్యా బాబురావుమామోచ్చాడు” అనింది మా యమ్మ.

“ఆవింటన్నాలే…. “ అని బయటకొచ్చే సరికి మా బాబు రావు మామా కత్తేసు నన్ను చూసి నవ్వారు. నేను కూడా పలకరింపుగా నవ్వాను.

“అబ్బాయ్, మీ వాటా అయిదొందలు” అని తేల్చేసాడు కత్తేసు.

“మాకంతెందుకురా, ఒకకువ్వే ఎక్కువైత? అందులో మా చిన్నోడు దున్న మోంసం తినడు” అంది మా యమ్మ.

“బాపోనోల్లో సేరిపోయడా ఏంది మీ పిల్లోడు ”అని నవ్వాడు కత్తేసు.

“మేయ్, అయినారేపు కువ్వ ఎంతనుకున్నా? రెండొందలు మే! ఇంత కూడా వుండదు” అని రెండు అరిచేతుల్ని దగ్గరికి పట్టి చూపించాడు మాబాబురావు మామ .

“ఒక్క కువ్వ తీసుకుంటే ఒక్క ఎత్తుకన్నా రావద్దంటప్పా? అడిగాడుకత్తేసు.

“అయినా అంత మేమేం చేసుకోవాలబ్బాయ్, అయిదొందల కూర” అంది మా యమ్మ.

“అప్పో ఒక్క కువ్వ ఇయ్యలేక కాదప్ప. వాటాలేసుకున్నామనుకో. కుర్ర మీద అందరికి సమానమైన అక్కు వుండిద్ది. నీక్కావలసింది నువ్వు తీసుకెల్తావ్, నాక్కావలసింది నేను తీసుకెల్తా. కాదు కూడదు అంటే నీకేం గావాలో చెప్పు, నువ్వడిగింది ఎవురికి తెలియకుండా నేను తెచ్చిస్తా” అన్నాడు కత్తేసు.

“అది నిజమే గాని అయిదొందలు కూరేంజేసుకోవాలా?” అని అంది మా యమ్మ గొనుగుతున్నట్టు.

“అయిదొందలకి బండెడు కూరేమన్నా వచ్చిద్డంటమ్మే. ఇందాకట్నుంచి అయిదొందలు అయిదొందలు అంటున్నావో. రెండెత్తులకి కూడా రాదు” అని నవ్వుతున్నట్టే యెగతాళి చేసేడు కత్తేసు.

“అదిగూడా నిజమేలే. ఎమంటావబ్బాయ్తీసుకుందామా?” అని నా వైపు తిరిగి అడిగింది మాయమ్మ.

“తీసుకుందాం లె కానియ్. అయిదొందలేగా?” అని పైకి అని “మౌ బోరచెక్కు దొరికిద్దేమో అడుగుమా” అన్న మా అమ్మ చెవిలో.

“ఒరేయ్ మా వాడికి బోరచెక్క కావాలంట్ర” అనేసింది పైకి.

“బోరచెక్క. బోర చేక్కేంది? దున్నమాంసం లో కూడా రకాలున్నయా?” అని అడిగాడు నిద్రపోతున్నట్టు నటిస్తున్న మా తమ్ముడు.

“నీకేం తెలుసురా మొఖమా? దున్నకుర్రలో ఒకొక ముక్క ఒకొక రుసి. అసలునీదెప్పుడైనా బోర చెక్కు తిన్న మొఖం అయితే కదా దాని రుచి తెలిసేది. దానికున్నంత రుసి ఇక దేనికైనా వుందంటే. దీనెమ్మ, నాయాల్ది నోట్లో పెట్టుకుంటే కరిగి పోద్ది, మైసూర్ పాకులు గియ్సూరి పాకులుకూడా దాని దెబ్బకు చాలవ్, అట్టుండ్డిద్ది” అని చెప్పాడు కత్తేసు.

“బోరచేక్కేందన్నా. కార్జెం ముక్కలు ఈరెగముక్కలెట్టుంటాయి? నాయాల్దిబాగా నూనెలో ఏపి ఇంత ఉప్పు కారం ఏసుకొని తింటంటే దాని రుసినికొట్టేదెవుడు? తిన్నోడికే తెలుసు” అన్నాడు మా బాబురావు మామ గుటకలు మింగుత.

“అందుకుకదంట్ర సామేఇప్పుడు ఊళ్ళో వొళ్ళు కూడా దున్న కూర తినమరిగేరు. వాళ్ళుతింటం మొదలు పెట్టినాకే కదంట్రా మనకు దున్న కుర్ర మాంసం దొరకట్లేదో” అన్నాడు కత్తేసు నవ్వుతా.

“అయ్యో మీరు ఆపండయ్యో. దెయ్యాలు తిరిగే టైం లో దున్న కుర్ర మాంసం గురించి మాట్లాడుతున్నారో” అన్నాడు కోపంగా మా తమ్ముడు.

“ఒరేయ్వాడిదేముంది కానిబోరచెక్కు దొరికిద్దా లేదా మా వాడికి“ అనిడిమాండింగు చెయ్యడం మొదలు పెట్టింది మా అమ్మ.

“మేయ్, మీ ఒక్కళ్ళకి బోర చెక్కు ఇస్తే ఎట్టేమే? దాని కూరలో కలపద్డా. అందులో దున్నని కోసేవోల్లు నల్ల లోకి బోర చెక్కు లేకపోతే ఒప్పుకుంటార ?” అని ఒకలాగా అడిగాడు.

“మల్లి ఈ నల్లెంది?” ఈ సారి పైకి లేచి కూర్చున్నాడు మా వోడు.

“మాంసం కూర తిననోడికి నీకెందుకే ఇయ్యన్న?మూసుకొని పడుకోలేవా?” అన్నాన్నేను.

“మౌ నల్లెంది? మా” అని అడిగాడు మా తమ్ముడు మల్లి మా అమ్మని.

“దున్నని కోసినాకా నెత్తురు వస్తుంది కదంట్రా. దాన్నిఒకబాండీలో అంత నూనేసి అన్ని ఉల్లిపాయలు అన్ని పచ్చి మిరగాబాయలు కొంచెం తిరగమోత ఏసి ఏపిఅది బాగా ఉడికినాకా ఏడి ఏడి గా తింటే బలే వుండిద్ది. దాన్ని నల్ల అంటారు” అంది మా అమ్మ. నేను అనుకోకుండా గోడ గడియారం వైపు చూసాను. టైం ఒకటి అయ్యింది. ఇంకా ఒకటేనా తొందరగా తెల్లారితే బాగుండు అని ఒక గుటక మింగి మా బాబురావు మామ వైపు చూసాను.

“కాని ఆ నల్ల మీకు దొరకదులే. అది దున్నని కోసే వాళ్లకి మాత్రమె” అన్నాడు కత్తేసు.

“ఛి, నెత్తురు తింటారా యాక్“ అన్నాడు మా తమ్ముడు.

“నువ్వగరా” అని మా తమ్మున్ని ఇదిలించుకొని “మామో నాకు బోర చెక్కు ఇస్తావా ఇయ్యవా” అని నేనే రంగం లోకి దిగాను.

“సరే పొ అడక్కడక్క అడిగావు కదా ఎవురికి తెలియకుండా ఇస్తాలే” అన్నాడు కత్తేసు.

“పోరారే మిమ్మల్ని నమ్మేదేవురు ముందు అంతే అంటారు తరువాత ఇయ్యరు” అంది అనుమానంగా మా యమ్మ.

“అప్పో, అంత నమ్మకం లేకపోతే రేపొద్దున్నే మామని పంపు దున్నని కోసినాక దగ్గరుండి బోరచెక్కు తెచ్చుకోమను” అన్నాడు నమ్మకంగా కత్తేసు.

“ఆయనొచ్చెది నిజమే గాని, బోరచెక్కు ఇస్తానంటే అయిదొందలు రాసుకో లేపోతే లేదు ”అంది మా అమ్మ.

“ఒక పని చెయ్మే పొద్దున్నే పిల్లోన్ని పంపు నేను దగ్గరుండి పిల్లోడికి బోరచెక్కు ఇచ్చి పంపుతా”అన్నాడు నా వైపు చూస్తా.

“నేను రాలేనులే కాని మా బాబురావు మామకి ఇయ్యి” అన్నాన్నేను.

“ఒరేయ్మర్చే పోయెను కదరా. దున్నని కోసేది మీ మేన మామే నయ్యే. ఇంకేవురో ఎందుకు?” అనికత్తేసు మా బాబురావు మామ వైపు తిరిగి “బాబురావా. దున్నని కోయ్యంగల్లోనే బోరచెక్కు తీసుకెళ్ళి మీ యప్పకి ఇచ్చే బాద్యత నీదబ్బాయ్” ఆన్నాడు నవ్వుత.

“సర్లే అప్ప. నేనిస్తాలే గానేఅయిదొందలు ఇయ్యండి” అన్నాడు లెక్క రాసుకుంటా.

“ఉత్త బోరచెక్కేనా మాంసం కూడా ఇస్తారా” అన్న అనుమానంగా అయిదొందలు ఇస్తూ.

ఉత్త బోరచెక్కు ఎట్టిత్తామబ్బాయ్. మాంసం కూడా వుండిద్దిలే“ అన్నాడు కత్తేసు.

ఇక లెక్క తెలిందంటబ్బాయ్ అన్నాడు బాబురావు మాం వైపు తిరిగి. “అయినట్టే పదా “ అనిపైకి లెగిచేడు మా బాబురావుమామ.

తలుపుతీయంగలోనే రెండు కుక్కలు ‘ఇంకెప్పుడు కోస్తార్రా సామే దున్నని’ అని అడుగుతున్నట్లు గుర్రున చూసినియి.

చిన్నగాబయటకొచ్చిన కత్తేసు “ బాబురావ, ఇంకొంచెం సేపు మేలుకొని ఉన్నావంటే దున్నని పడుకోబెట్టచ్చు ఆబ్బాయ్అన్నాడు.

“సర్లే పదా ఈ లోపల కొంచెం అట్టా తిరిగొద్దాం” అని గడప దాటారు.

“బాబురావో. బోరచెక్కు మరచిపోవద్దు” అని మల్లి మా అమ్మ ఇంకోసారి గుర్తుచేసింది.

“సర్లే మర్చిపొంలె “ అన్నాడు బయటకు నడుస్తా.

“అబ్బాయ్ కత్తెసో. నామాల మునుసు మర్చి పోవద్దు” అని ఇంకో సారి పెద్దగా అరచింది.

“ఇత్తంలేప్పా. మనుసులుకి ఆశ ఎక్కువురా నాయనా “ అంటా వీధిలోకి వెళ్లి పోయాడు కత్తేసు.

పొయ్యి మీద బోరచెక్క ఉడుకుతున్న చప్పుడు బాగా వినపడుతుంది నా చెవికి బుడబుడబుడమని. మా యమ్మ మసాలా నూరుతున్నశబ్దం ఒక సంగీత విద్వాంసుడు దున్నతొలుతో తయారు చేసిన డోలక్ పైఅద్బుతమైనతాళం వాయిస్తున్నట్టు వినిపిస్తుంది ఒక పక్క. మా అమ్మ కూర వండడం అయిపోయేలోపు తొందరగా లెగిచి పళ్ళు తోముకొని పళ్ళెం పట్టుకొని రెడీ గా వుండాలని పిస్తుంది. అలా అనుకుంటున్నానో లేదో మా అమ్మ పల్లె నిండా తళ తళ లాడే ఉప్పు కారం మసాలలో బాగా వుడికిన బోర చెక్కుల ముక్కలు తీసుకొని సరాసరి నా మంచం దగ్గరికే వచ్చింది.

కనీసం మా అమ్మ మొఖం కూడా చూడకుండా కళ్ళు తెరిచీ తెరవడం తోనే బోరచెక్కు మొఖం చూసి ఆ వాసన పీల్చి ఒక ముక్క తీసుకొని అలా నోట్లో పెట్టుకోబోయేలోపు అది జారి కింద పడిపోయింది. “ఛి దీనెమ్మ” అనుకోనిదాన్నొదిలేసి ఇంకో ముక్క తీసుకున్నా. అది కూడా జారిపోయింది.

ఇక లాభం లేదని రెండు చేతులతో రెండు ముక్కలు పట్టుకొని నోట్లో పెట్టుకొని నవల బోయే లోపల, “లోగుదోలండ్రోయ్ మగడ్లార వాల్లోచ్చారు. వాళ్ళు గాని మీ రొండుకున్న కూరలు సూసారంటే సంపెస్తారో. అప్పో, ఎవురన్నా వచ్చి మీ కూరఏందని అడిగితే దున్న మాంసం అని చెప్పబాకండి తల్లుల్లారా. సికేనో మటనో అని సెప్పండి” అని గస పెట్టుకొంటా అరుసుకుంటామా బాబురావు మామ ఆయన వొండుకున్న దున్న కుర్ర మాంసాన్ని తీసుకొని ఊరొదిలి పెట్టి పొలిమేర దిక్కు పరిగెడతా వున్నాడు.

మా ఇంటిపక్క సందున ఏవో ఏడుపులు వినపడ్డాయి. ఆ ఏడుస్తున్న వాల్లెవరో చూద్దామని నేను ఆ సందులోకి వచ్చాను. అక్కడ పది మంది మనుషులు మొండిమొలన రకరకాల ఆసనాల్లో కోసినదున్న కుర్ర మోమ్సం చుట్టూ నుంచొని స్వంత తల్లీతండ్రులు చచ్చి పోయినట్టుగా బోరుబోరున ఏడుస్తున్నారు. వాళ్ళ నెప్పుడు నేను మా వూరిలో చూడలేదు. వాళ్ళు మామూలు మనుషుల్లాగే వున్నారు కాని వాళ్ళ లింగాలు మాత్రం నిగిడినారింజకాయరంగులో వున్నాయి.

ఒక ఇరవై ముప్పైమంది కత్తెసుని పట్టుకొని ఒక చెట్టుకి కట్టేసి ముక్క ముక్కలు గా కోస్తూవుంటే కత్తేసు అరుస్తా “ఇది నల్లది సోముల్లారా. నేను కోసింది నల్లది సోముల్లరా. నన్నొదిలెయ్యండి పిల్లలు కల్లోన్ని” అని ఎడుస్తా వున్నాడు. వాళ్ళంతా ఉన్మాదం తో ఊగిపోతూ అతని కసి కసిగా కత్తులతో పొడుస్తూ ముక్కలని గోతాం సంచుల్లో కుక్కుతున్నారు.

ఊరంతా వాల్లోండుకున్న కూరలని కుడితితోట్టేల్లో పోసి ఇంకెప్పుడు ఈ కూరవండము సోముల్లారా అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. మా యమ్మ కూడా ఇందాకొండిన బోరచెక్కలు ఎక్కడ కుడితి తొట్టెలో పోస్తుందో అని ఇంటికి పరిగెడుతు “ఓ యమో ఈ ఒక్కసారికి నన్ను బోర చెక్కు తిన్నేయ్యే. నీకు దండం బెడతా అని అరుసుకుంటూ ఇంటికి పోతుంటే ఆ ఆసనాల్లో ఏడుస్తున్న అందరూ నా వైపు కి తిరిగి చేతికి దొరికిన ఆయుధాన్ని తీసుకొని నా మీదకు ఎగబడ్డారు. నేను నా బోరచెక్కును తీసుకొని వాళ్లకు దొరకనంత వేగంగా పరిగెత్తుతుంటే ఒకకోటు వేసుకున్న పెద్ద మనిషి విసిరిన తెల్లనిదారాలతో పేనిన తాడు నా కాలుగి తగిలి పడిపోయాను, మంచంమీది నుంచి కింద. కళ్ళు తెరిచి చూస్తేఅప్పుడే తెల్లారుతుంది. గుండెదడ బాగా కొట్టుకుంటుంది “అమ్మా ఇంకా బతికే వున్ననురా బాబు. అయినా ఇంత పిచ్చేంటి నాకు బోరచెక్కుల మీద. ఛి” అనుకోని బయటకు నడిచాను.

***

సూర్యుడు తెగిన దున్నకుర్ర నుంచి కారుతున్న నెత్తుటి రంగులో వున్నాడు పొద్దు పొద్దున్నే. మేఘాలుకత్తేసు అతి లాఘవంగా వొలిచి పరచిన దున్న కుర్రతోలు నేలపై పర్చుకున్నట్లు పరుచుకొని వున్నాయి ఆకాశంలో. చర్చి మైకు దున్న కుర్ర మాంసం కడుపునిండా తిని నిద్రపోతున్న మా నాన్నలాగా ఉలుకు పలుకు లేకుండా పడి వుంది ఈస్టర్ పండగ మరుసటి రోజు. పది కుక్కలు ఇచ్చుర్లు ఇద్లించే దిబ్బ దగ్గర పెద్ద పెద్ద గా అరుసుకుంటా శాసన సభా సమావేశాలు జరుపుకుంటున్నట్లున్నాయి.

కాకులు దండేలమీద ఆరేసిన తునకల్ని ఎలాగైనా కాజెయ్యాలని కర్ర పట్టుకొని కాపలా కూర్చొన్న ముసలోల్ల తోటి కబాడీ ఆడుతున్నాయి.
మొఖమ్మీద నీళ్ళు చల్లుకొని చెంబొకటి తీసుకొని బోరింగు కాడికి పోయాను. ఆరేళ్ళ పిల్లోడొకడురెండు చేతుల్లో రెండు మునుసులు పట్టుకొని కస్టపడి ఇష్టంగా చీకుతున్నాడు మార్చి మార్చి. వీడెప్పుడైనా ఆ మునుసు పడెయ్యకపోతాడా అది నాకు దొరక్క పోతుందా అని ఒక కుక్క దాని కోసం కాసుకొని కూర్చోనుంది వాడికి కొంచెం దూరంలో.

“అప్పుడే కూరయ్యిన్దంట్రా మీ ఇంట్లో” అని పిల్లోన్ని అడిగి చెంబు నింపుకొని దొడ్డిక్కి వెళుతుంటే ఎదురొచ్చేడు కత్తేసు.

“ఎందబ్బాయ్ బోరచెక్క తిన్నావా?” అని అడిగాడు.

“ఇంకా తినలా ఇప్పుడే నిద్ర లేచే “ అన్నాను నవ్వుతూ.

“ఇప్పుడు లేచావా? మాది అప్పుడే ఒకెత్తు కూడు తింటం కూడా అయిపోయిందిలె” అన్నాడు నవ్వుతూ. నేనూ నవ్వి అక్కడినుంచి బయలు దేరాను.

“అందుకే రాత్రే ఎవురికొకరికి చెప్పురా మొగడా అంటే రేపొద్దున్నే పోయి రెండు కువ్వలు తెస్తా నన్నాడు ఆ మొగోడు. ఇప్పుడు చూస్తేనెమో ఒక కువ్వన్న దొరక్క పోయే” అంటా ఉత్త గిన్నె నెత్తి మీద బోర్లించుకొని ఎదురొచ్చింది ధనమ్మ.

“అమ్మో నువ్వు ఊరంతా చాటింపు ఎయ్యకుండా నోర్మూసుకొని ఇంటికి రా. ఒక్క రోజు దున్న కుర్ర మోసం లేకపోతే సావవులే. నేను ఊళ్ళోకి బోయిసికెనన్నా తెస్తా” అన్నాడు పెద్దగా ధనమ్మ మొగుడు.

“సికేనేం నాకను. దున్న కుర్ర మోమ్సం దొరికితేనే నేను దోసీలు పోసేది. లేక పోతే లేదు, నీ ఇష్టం” అంటా ఇంట్లోకి పోయింది ధనమ్మ.

“దీనెమ్మ నాయాల్ది. ఎన్ని దున్న లు కోసిన చాలడం లేదే పల్లెకే” అంటాసైకిల్ ఎక్కి దున్న కుర్ర మాసం తేవడానికి బయలు దేరాడు యాకోబు.

పోయ్యిలన్నిబగ బగమండుతున్నాయి అందరిల్లల్లో. కూరతుక తుక ఉడుకుతుంది. దోసెలు సుయ్యి సుయ్యి మని పెనమ్మీదా పడుకుంటున్నాయి. పేమల కొండయ్య దిబ్బదగ్గర ఇచ్చుర్లు బాగు చేస్తున్నాడు. వాళ్ళబ్బాయి పక్కనే వున్న ఇంకో బోరింగుకాడ పొట్ట పేగులు కడుగుతున్నాడు. పక్కన ఇద్దరు పిల్లలు ఇచ్చురిని పగిలిపోయిన కుండ మూతి మీద కప్పి మంటమీద కాగ బెడతున్నారు తప్పెట తయ్యారు చెయ్యాలని. అదే మంటలో ఇంకో ఇద్దరు పిల్లలు ఒక పొడుగాటి పుల్లకి దొబ్బని గుచ్చి కాల్చుకొని తింటున్నారు. తినటానికి పనికిరాని ఎనికనొకదాన్ని కాళ్ళ మధ్యల్లో పెట్టుకొని కర కర కొరుకుతా వుంది ఒక కుక్క. ఊరంతా దున్న మాంసం కూర వాసనతో నిండిపోయి వుంది నేను మల్లి ఇంటికి వస్తున్నప్పుడు.

ఇంటికి పోయేసరికి మా యమ్మ నాన్న తిట్టుకుంటున్నట్టు అనిపించింది. ఇంట్లోకిపోయాను. నిజమే తిట్టుకుంటున్నారు.

“పొద్దున్నే ఇంట్లో కోడి పెట్టలాగా ముడుక్కొక పోతే ఆ దున్నని కోసే దగ్గరకి సావచ్చుగా” అంటుంది మా అమ్మ మానాన్ని.

“అంత నమ్మకంగా ఒట్టేసినట్టు చెప్పినే నాకేం తెలుసు వాడిట్ట చేస్తాడని పనికిమాలినోడు” అన్నాడుమా నాన్న. కొంప దీసి దున్న కుర్ర మాంసం దొరకలేదా ఏంటి అని గుండె గుభేల్న పీకింది. కొంచెం వేగంగా ఇంట్లో కెల్లా. మా యమ్మ మాంసాన్ని కత్తి పీటతో కోస్తా పొద్దున్న వండాల్సిన ముక్కల్ల్ని ఒక గిన్నెలో ఎండబెట్టాల్సిన ముక్కల్ని ఒక గిన్నెలో వేస్తుంది.

“ఆనా బట్టకి నేను మరీ మరీ చెప్పానామాల మునుసు వెయ్యరా అని ఉత్త కొంకి మునుస్లేసాడుఇయ్యెం చేసుకోను” అని నా వైపు చూసి,

“అడక్కడక్క పిల్లోడు నోరు తెరిచి బోరచెక్క అడిగితే అయిదొందలు దొబ్బి ఒక్క ముక్కన్నా ఏసాడా? ఆ కత్తేసుగోడు కనపడాలి, చెప్తా వాడి పని” అంది కోపంగా.

అప్పుడర్దమైంది మా అమ్మ నాన్న ఎందుకు తిట్టు కుంటున్నారో. బోరచెక్కు లేదనిబాధతోమంచమ్మీదకూర్చున్న నిట్టూరుస్తూ.

“మౌ, ఆ కత్తేసు మనకి బోరచెక్కు ఇచ్చాడంటమా. ఇందాక నేను దొడ్డిక్కి పోతుంటే కనపడి చెప్పడో” అన్న మా అమ్మతో బోరచెక్కు ఎక్కడ మిస్ అయ్యిందో ఆలోచించుకుంటూ.

“ఒరేయ్ అయితే ఆ బోరచెక్కు మీ బాబురావు మామ దగ్గరుండుడిద్దిరా. పోయి అడిగి తీసుకురాపో “ అంది మా అమ్మ కొంచెం సంతోషంగా. మా యమ్మ మాట విన్న నాకు బోరచెక్కులు తింటున్నంతసంతోషంగా అనిపించింది. మా బాబురావు మామ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు లో కొచ్చాను. రెండుచేతుల్లో రెండు మునుసుల్ని తింటున్న పిల్లోడు కనిపించాడు మల్లి. ఈ సారి వాడి చేతిలో ఇక మనుసులు తినలేని ఎనికలు తప్ప పీసంతైనా కండలేదు. వీడు ఆ ఎనికల్ని కూడా ఇచ్చేటట్టు లేడు అనుకుందో ఏమో అక్కడున్న కుక్క నీరసంగా పక్కనున్న నరసమ్మోల్లింట్లో దూరింది.

పక్కనే వున్నబాబురావు మాం ఇంటికొచ్చాను. మా పుష్పత్త అంట్లు కడుగుతా వుంది తొట్టి దగ్గర కూసోని.

“పుష్పత్తో, బాబురావు మామ ఏడి?” అన్నాను.

“ఇంట్లోనిద్రపోతున్నడబ్బాయ్” అందిఅంట్లు తోమడం ఆపి పుష్పత్త.

“ఇప్పుడు నిద్రపోవడం ఏంది?” అన్నానుఆశ్చర్యంగా.

“ఇంకేంపనుండిద్ది పొద్దున్నే మోసం కూరేసుకొని పదిహేను దోసెలు తిన్నాడు. అందులో ఈ రోజు ఎక్కడ్నుంచో బోరచెక్కు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడల్లా నిద్రలేస్తాడా. ఏంది సంగతి?” అంది అంట్లు తోమడం ప్రారంభించిన పుష్పత్త.

ఆ మాట వినంగలోనే నా గుండె పక్కన వున్న బోరచెక్కులుబగ బగ మండినియ్. ఆ పిల్లోడి చేతిలో రెండు మునుసులు లాక్కొని మా బాబురావు మాం ఇంటివైపు గట్టిగా ఇసిరేసెను కోపంగా. వాడి సొమ్ము మొత్తం నేను తిన్నట్టు సాకండాలు పెట్టుకుంటా ఇంటికి పోయాడు ఆ పిల్లోడు.

“ఎందుకబ్బాయ్అ ఎనికల్ని మా ఇంట్లో ఎసావో? అంది ఆశ్చర్యంగా మా పుష్పత్త.

“ఆ నిద్రలేచినాక బాబురావు మామకి ఆకలైయితే వాటిని కూడా తినమను“ అనిఅక్కడనుంచి గబా గబా ఇంటికి కదిలాను పట్టలేని కోపంతో. అసలు విషయం అర్ధం కాని మా పుష్పత్త అది జోకనుకొని నవ్విమళ్ళీ అంట్లు తోమడం మొదలు పెట్టింది.

కాని కొంచెం దూరమే వెల్లగలిగాను. అక్కడనుంచి ముందుకి కదల్లేకపోయాను. మల్లిబాబురావు మామ ఇంటికొచ్చి “సరేగాని పుష్పత్తో, కొంచెం కూరుంటే పెట్టకూదడా? అన్న ఒక్క బోరచెక్కముక్కైనా దొరక్కపోద్దా అని ఆశతో.

“ఇంకేం కూర మొత్తం ఒక ఎత్తుకె అయిపోయినే! అయినామీరు మోమ్సంతెచ్చుకోలా? అని అడిగింది అమాయకంగా. అప్పుడర్ధమైంది ఆ బోరచెక్కు మీద దేవుడు మా బాబురావు మామ పేరు రాసాడని.

చాలాబాధగా ఇంటికొస్తుంటే అరుగు మీద కూసోని పేపరు సదువుతున్న మా సిన్నాయన “నాయాల్దిమన పల్లెల్లో వాళ్ళకి మోసం కోసిన రోజే రాఅసలయిన పండగ. రేపొద్దున ఈ మోమ్సం తినకూడదని ఎవురయిన రూల్ పెడితే యేంచేస్తారో ఈల్లంతా” అన్నాడు పక్కేనే కూర్చొని వున్నా కత్తేసుతో.

“ఎవుడు మామ వోడు మన మోమ్సం తినకూడదని రూలు పెట్టేదే నాయల్ని రమ్మను ఈడికే,దున్నని కోసే కత్తితో కొయ్యక పోతే అప్పుడడుగు” అన్నాడు వీర కోపంగా.

“నీ దగ్గర దున్నని కోసే కత్తే వుందిరా నాయాల వొళ్ళ దగ్గర తుపాకులు వున్నాయ్” అంటా పైకి లేగిచి పేపరు తీసుకొని ఇంటికి వెళ్ళబోయాడుమా సిన్నాయన.

“మామో తుపాకులుంటే నా తప్పెగోడు బయపడతాడు! నేను డబ్బులు పెట్టుకొని కొనుక్కున్న దున్న కుర్రని నేను కోసుకొని తింటే వాడికేందట. రానియ్, నాయాల్ది ఎవుడొస్తాడో దున్న కుర్ర తినద్దని. ముడ్డి మీద తన్నకపోతే నా పేరు కత్తేసే కాదు” అంటా మీసం మెలేస్తా ఇంటికి వెళ్ళాడు కత్తేసు.

కొయ్యలాగా నిలబడి “నాయాల్ది, వీడి దైర్యమెంట్ర?” అన్నట్టుచూస్తూవుండిపోయాం నేను మా సిన్నాయన.

**** (*) ****